రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 11, 2019

871 : స్పెషల్ రివ్యూ!


రచన - దర్శకత్వం : రామ్
తారాగణం : వసంత్ రవి, ఆండ్రియా, అంజలి తదితరులు
సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : థేనీ ఈశ్వర్
బ్యానర్ :
డి.వి.సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్
నిర్మాతలు: ఉదయ్ హర్ష, డి.వి.వెంకటేష్
విడుదల : సెప్టెంబర్ 6, 2019
***
        మిళ సినిమాల్లో కొత్త కోణాలూ కొత్త ప్రయోగాలూ కొత్త కాదు. అందులోనూ ప్రేమ సినిమాల్లో ఏదోవొక కొత్తదనమో, ప్రయోజనకర విషయమో వుంటుంది. ఐటీ, కార్పొరేట్ రంగాల నేపధ్యంలోనూ చాలా ప్రేమ సినిమాలు వచ్చాయి. అయితే నేపథ్యాలు మారతాయే తప్ప ప్రేమలు అవే మూస ఫార్ములా ప్రేమలుగా వుంటాయి. నేపథ్యాల్లోంచి ఫార్ములా అనే పాతని తీసేస్తే మిగిలేది కాలానికి తగ్గట్టు రియలిస్టిక్కే. రియలిస్టిక్ లో క్రియేటివిటీతో చాలా పనుంటుంది, మూస ఫార్ములాల్లో రొడ్డకొట్టుడు వుంటుంది. రియలిస్టిక్ అసలు ప్రేమలెలా వున్నాయో చూపిస్తుంది. ఐతే తమిళ దర్శకుడు రామ్ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో వుండే ప్రేమ లెలా వుంటాయో 2013 లోనే కనిపెట్టేశాడు. ఆ చేదు మాత్రలు ప్రేక్షకులకి తినిపించేందుకు సంసిద్ధుడయ్యాడు. ప్రేమల చేదు తెలిస్తేనే ప్రేమల మత్తు వదిలి చట్టబద్ధమైన హెచ్చరిక కన్పిస్తుంది. దర్శకుడు ఎలాటి హెచ్చరిక చేశాడు, చేదుతో ఎలా ఎంటర్ టైన్ చేశాడు ఈ కింద చూద్దాం...

కథ
 ఆల్థియా జాన్సన్ (ఆండ్రియా) అనే ఆంగ్లో ఇండియన్ యువతి చెన్నైలో కార్పొరేట్ జాబ్ చేస్తూంటుంది. ఒక రోజు బస్టాప్ లో వర్షంలో చిక్కుకుంటుంది. అక్కడే బికారిలా ఒకడు నక్కి వుంటాడు. మాటా మాటా కలిసి ఫ్రెండ్స్ అవుతారు. అతను ప్రభురాజ్ (వసంత్ రవి) అనే వైజాగ్ నుంచి వచ్చి కాల్ సెంటర్లో పని చేస్తున్న ఉద్యోగి. ఎదురుగా ఇటీ కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ సౌమ్య (అంజలి) ని ప్రేమించాడు. ఆమె యూఎస్ లో జాబ్ చూసుకుని వెళ్ళిపోతోంది. అందుకు మూడు లక్షలు కావాలి. ప్రభురాజ్ రైల్లో నిద్రపోతున్న వ్యక్తి దగ్గర ఆ డబ్బు కొట్టేసి ఆమె కిచ్చాడు. ఆ డబ్బుతో ఆమె యూఎస్ వెళ్ళిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో షాక్ తిన్నాడు. పైగా తను రైల్లో డబ్బు కొట్టేసిన వ్యక్తి గుండె పోటుతో చనిపోయాడని తెలిసి ఆత్మహత్య చేసుకోబోయాడు. రైల్వే గార్డు కాపాడి ఆశ్రయమిచ్చాడు.

          ఇలా దెబ్బతిన్న ప్రభురాజ్ జీవితం గురించి తెలుసుకున్న ఆల్థియా, తన ఫ్లాట్ లో ఆశ్రయమిస్తుంది. ఆమెకి విడాకులై ఐదేళ్ళ కొడుకుతో వుంటోంది. పనీ పాటా లేక ఆమె సొమ్ము తిని తిరుగుతూంటాడు ప్రభురాజ్. తిని తిరగడమే గాక, వాడెవడు - వీడెవడు అని ఆమె మీద అధికారం చెలాయిస్తూంటాడు అనుమానాలు పెట్టుకుని. ఫ్లాట్లోంచి నెట్టి పారేస్తుంది. రోడ్డున పడ్డ ప్రభురాజ్ ఇలా రెండోసారి అమ్మాయిలతో మోసపోయానని, ఆడవాళ్ళతో గేమ్ ఆడుకోవడం మొదలెడతాడు...

          ఏమిటా గేమ్? ఈ గేమ్ లో డబుల్ గేమ్ ఆడుతున్న ఒక పోలీసు అధికారి తన భార్యని చంపెయ్యడానికెలా కారకుడయ్యాడు? యూఎస్ లో భర్తని వదిలేసి వచ్చిన సౌమ్యని తన డబ్బుల కోసం ఎలా బ్లాక్ మెయిల్ చేశాడు? గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి డబ్బు ఇచ్చేయడాని ఇంటికెళ్తే ఏం జరిగింది? అటు ఆల్థియా తనని లైంగికంగా వేధిస్తున్న బాస్ నెలా ఎదుర్కొంది? ప్రభురాజ్ రాకపోవడంతో ఆమె కొడుకు ఎలాటి సంఘర్షణ పడ్డాడు? ఈ మొత్తం అనుభవాల్లోంచి ప్రభురాజ్ ఏం నేర్చుకున్నాడు?... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

 ఇది టీనేజి ప్రేక్షకుల కోసం లేకి అపార్ధాలతో విడిపోయి, మళ్ళీ కలుసుకునే టైపు అచ్చిబుచ్చి ప్రేమల, కృత్రిమ లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీ కాదు, మెచ్యూరిటీ గల 25 -35 ఏజి గ్రూపు ప్రేక్షకుల కోసం రియలిస్టిక్ ప్రేమకథ. ఐటీ, కార్పొరేట్ కల్చర్లు నియంత్రిస్తున్న ప్రేమలెలా వుంటాయో చెప్పే కరకు వాస్తవాల చిత్రణ. సహజ ప్రేమల్ని సహజ ప్రేమలు నియంత్రించకుండా, ఇంకేవో కల్చర్ల ఆజమాయిషీలోకి వెళ్ళిపోతే ఆ జీవితాలెలా తయారవుతాయో చెప్పే నియో రియాలిజం కథ. వర్కింగ్ క్లాస్ జీవితాల్ని వున్నన్నదున్నట్టు వలువలు వొలిచి చూపించే నియో రియాలిజం జానర్ లో ఇది తమిళం నుంచి వచ్చిన ఒక కొత్త ప్రయోగం అనొచ్చు.

          తారామణి అంటే చెన్నైలో ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ - కార్పొరేట్ జోన్. ఈ ప్రాంతంలో యువతీ యువకుల గ్లోబల్ కల్చర్ ని తొలిసారిగా వాస్తవికంగా తెరకెక్కించాడు దర్శకుడు. తారామణి రైల్వే స్టేషన్లో హీరో నివాసం సహా. కెరీర్ పరంగా ఈ కల్చర్ ఎంత రిచ్ అయ్యేందుకు తోడ్పడుతుందో, ప్రేమల విషయంలో అంతే రోడ్డున పడేలా చేస్తుందనీ, నువ్వు రిచ్ గా వుండాలంటే ఇక్కడి ప్రేమల్ని టచ్ చెయ్యకు అనీ చెప్పే ‘తారామణి’ ని టీనేజర్లు చూడడానికి మెచ్యూరిటీ, అభిరుచీ సరిపోవు.
 
ఎవరెలా చేశారు
 వసంత్ రవి పాత్ర, నటన ఈ రియలిస్టిక్ కి హైలైట్. పాత్ర మానసిక సంఘర్షణని, భావోద్వేగాల్నీ, ప్రవర్తననీ, చర్యల్నీ, బాగా స్టడీ చేసినట్టు లీనమై సమర్ధవంతంగా పాత్ర పోషణ చేశాడు. అతడికి రోమాంటిక్ గా గడిపే అవకాశమే ఎక్కడా లేదు. జీవితమే అలా తయారయ్యింది. క్యారెక్టర్ ఆర్క్, గ్రోత్ నెగెటివ్ గా వుండడం అనుభవాల్లోంచే వచ్చింది. అమాయకంగా వున్నపుడు మొదటి అమ్మాయి మోసం చేసిందని సోమరిగా మారిపోవడం, రెండో అమ్మాయి మీద అదుపు కోసం మగ దురహంకారాన్ని పెంచుకోవడం, ఈమె కూడా మోసం చేసిందనుకుని కన్నింగ్ గా మారిపోయి ఇతర అమ్మాయిల్ని మోసం చేయడం, క్రిమినల్ గా మారడం...ఈ దశలన్నీ కథ నడపడానికి పాత్రకి తోడ్పడ్డాయి. 


          ఒకమ్మాయిని మోసం చేయాలనుకుని ఆమె ఉంగరం లాగేసుకున్నప్పుడు, ఆ ఉంగరం ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన ఒక పోలీస్ అధికారి గిఫ్ట్ గా ఇచ్చిందని తెలుసుకుని, అతడి భార్య దగ్గరి కెళ్ళి పోయి ఉంగరమిచ్చి విషయం చెప్తాడు. ఆమె ఆ ఉంగరంతో భర్తని నిలదీయకుండా, భర్త ద్రోహానికి తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడడం వసంత్ కి ఇంకో పాపభారంగా మారిపోతుంది. ఉంగరం కొట్టేసిన వాడు కొట్టేసినట్టు వుండక, ఇంకేదో ఉపకారం చేసి మంచి వాడు అన్పించుకోవాలన్న కన్ఫ్యూజ్డ్ మెంటాలిటీతో పాపిగా మారిపోయాడు. మొదటి పాపభారం రైల్లో నిద్రపోతున్న వ్యక్తి దగ్గర డబ్బు కొట్టేసినప్పుడు చుట్టుకుంది. చివరికీ పాత్ర ఎక్కడికి చేరింది? ఐటీ కల్చర్ నుంచి దర్గాకి చేరింది...ఖవ్వాలీ పాటతో కొత్త జీవితం దొరికింది. ఇలా కథానుగతమైన మెటఫర్స్ తో సాగే పాత్రలో వసంత్ కిది ‘బిచ్చగాడు’ లాంటి మూవీ. 

 హీరోయిన్ ఆండ్రియాది ఇంకో కల్చర్ బాధిత పాత్ర. కట్టుకున్న వాడు గే అని తెలిశాక, అతడి పరువు తీయకుండా, తనే బిచ్ అన్పించుకుని విడాకులతో బయటపడి, సింగిల్ మదర్ గా జీవించే, స్కర్ట్స్ లోకి మారిపోయి, స్మోక్ చేసే జీవన శైలిని తెచ్చి పెట్టుకుని, అర్ధంకాని అమ్మాయిగా - కన్న తల్లి చేత కూడా బిచ్ అన్పించుకుని - ఒక వైపు బికారీ హీరోతో, ఇంకోవైపు సెక్సాకలి బాస్ తో సతమతమవుతూ - అదే కల్చర్ తో వాళ్లిద్దరి తాట తీసే సంఘర్షణాత్మక పాత్రల్లో కదిలిస్తుంది. 

          ఇక అమెరికా వెళ్లి మోసపోయే అంజలిది ఇంకో కల్చర్ బాధిత పాత్ర. డబ్బు సాయం చేసిన బాయ్ ఫ్రెండ్ కే  మొండిచెయ్యి చూపించి, అమెరికాలో ఇంకొకడ్ని చూసుకుంటే ఏం జరగాలో అదే జరిగి, ఎక్కడికి రావాలో అక్కడికే తిరిగి వస్తుంది. తిరిగి వచ్చాక హీరోతో గమ్మత్తైన సన్నివేశంలో వుంటుంది. ఇలా రెండు మూడు సీన్స్ లో కన్పించే అంజలి ఆ సీన్స్ ని నిలబెట్టింది.  

          సీన్స్ తారామణి ఏరియాని దాటిపోవు. ఆ నేటివిటీని కథలో భాగం చేశాడు. ఎత్తైన అపార్ట్ మెంట్స్, ఫ్లై ఓవర్లు, రైల్వే ట్రాకులూ వీటిని ప్రధానంగా ఫోకస్ చేశాడు. థేనీ ఈశ్వర్ కెమెరా వర్క్ డీసెంట్ గా వుంది. యువన్ శంకర్ రాజా ఈ నియో రియలిజంకి తన స్వరాలతో సొబగులద్దాడు. ముఖ్యంగా ‘హేయ్ ఇక చాలు చాలు ఆటలే’ పాట కథకి బాగా కుదిరింది.

చివరికేమిటి
  ఐటీ - కార్పొరేట్ ప్రేమల్ని సూక్ష స్థాయిలో చూసి మైక్రో లెవెల్లో కథ చేయడం వల్లే ‘తారామణి’ లో ఇంత ఆకర్షణ కన్పిస్తుంది. చూడని, వున్నాకూడా సినిమాల్లో చూపెట్టని,  కొత్త ప్రేమ లోకాలని చూపించాడు. ఆలోచింపజేసే ప్రయత్నం చేశాడు. ప్రేమల్ని తీసికెళ్ళి కెరీర్ తో వుండే కల్చర్ కి తాకట్టు పెట్టొద్దని హెచ్చరికగా దీన్ని తీశాడు. ఐతే ఈ హెచ్చరిక ప్రేక్షకులు ఫీలయ్యేట్టుగా చేశాడు గానీ, చివరికి పాత్రలు ఫీలయ్యేట్టు చేయలేకపోయాడు. జడ వేసుకుంటే ఆఫీసు కల్చర్ ఒప్పుకోనప్పుడు భౌతిక రూపంలో ఆ కల్చర్లో వుండొచ్చు, మానసిక రూపంలో ఆ కల్చర్ వల్లే ప్రేమల్లో చిక్కులు వస్తున్నాయి. ఇది పాత్రలు గుర్తించినట్టు ముగింపు నిచ్చి వుండాల్సింది.

          ఎంత రియలిస్టిక్ అయినా, ఎంత సీరియస్ అయినా, దీంతో ఎక్కడా డార్క్ మూడ్ క్రియేట్ చేయడమో, డార్క్ మూవీగా తీయడమో చేయలేదు. ఒక తెలివైన పని చేశాడు. ఎంత సేపూ రెండు మూడు పాత్రల మధ్య సంఘర్షణతో బరువెక్కినప్పుడల్లా, వాయిసోవర్లు వేసి నవ్విస్తూ పోయాడు. వసంత్, ఆండ్రియాలు తిట్టుకుని, ఘర్షణ పడి, అతడ్ని ఆమె బయటికి తోసి పారేసి తలుపపేసుకున్నప్పుడు చాలా విషాదమావరిస్తుంది. దీన్ని తేలిక బరుస్తూ ఇలా ఫన్నీగా వాయిసోవర్ వేశాడు...

          ‘ఎత్తైన ఈ భవనాల్లోంచి విన్పించే అల్లర్లు, ఆర్తనాదాలూ కేవలం ఈ వొక్క సాఫ్ట్ వేర్ జీవితాల్లోనే కాదు, ఆయా బిల్డింగుల కోసం ఏంతో శ్రమించే సామాన్య కార్మిక కుటుంబాల్లోనూ, వీళ్ళందరికీ వినోదాన్నందించే సినిమా వాళ్ళ జీవితాల్లోనూ, ఏంతో  కష్టపడి తీసిన సినిమాని రెండు గంటల్లో రివ్యూలు రాసేసే రివ్యూ రైటర్ల జీవితాల్లోనూ, ఆ రివ్యూలతో ఏ సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల జీవితాల్లోనూ నిత్యం జరుగుతూంటాయి. అలాటి ఓ చిన్న సంఘర్షణ మన తారామణిలో జరిగింది...’

          ఇలాగే రిలీఫ్ అవసరమైనప్పుడల్లా మరికొన్ని వాయిసోవర్లతో నవ్వించాడు... పెద్ద నోట్ల రద్దు మీద, చెన్నైలో చెరువుల్ని కబ్జాలు చేసి కడుతున్న బిల్డింగుల మీద, తరిగిపోతున్న వ్యవసాయం మీద, ఎలాటి మగాడైనా ఆడదాన్ని ఒకేలా పురుగులా చూసే దుర్బుద్ధి పైనా...సెటైర్లు వేశాడు. ఇది నియో రియాలిజం టెక్నిక్కే.  

          2013 లో ప్రారంభించి 2017 లో విడుదల చేశాడు. ఇంకా ఆలస్యం చేస్తూ తెలుగులో డబ్బింగ్ అయింది. ఎప్పుడో హిందీలో రాజ్ కుమార్ సంతోషీ, తమిళంలో బాలూ మహేంద్రల దగ్గర పనిచేసిన దర్శకుడు రామ్, కాలం చెల్లిన ఓల్డ్ ఫ్యాషన్ దర్శ కత్వం చేయకుండా, కొత్త దర్శకుల్ని తలదన్నే కంటెంట్ తో, టెక్నిక్ తో రంగంలో వుండడం ప్రత్యేకత. తమిళంలో ప్రశంసలతో బాటు బాక్సాఫీసు విజయం కూడా సాధించింది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచుల రీత్యా దీని కమర్షియల్ విజయమెలా వున్నా, కథా ప్రయోజనం దృష్ట్యా దీనికి 3/5 రేటింగ్ ఇవ్వాల్సి వుంటుంది.

సికిందర్