రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, July 28, 2017

489- రివ్యూ!




రచన- దర్శకత్వం: సంపత్నంది
తారాగణం: గోపీచంద్, హన్సిక, కేథరిన్, సచిన్ఖేడ్కర్, ముఖేష్రుషి, నికితన్ ధీర్, నికెళ్ళ ణి, చంద్రమోహన్, వెన్నెలకిషోర్ తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్, ఛాయాగ్రహణం: సౌందర రాజన్
బ్యానర్ :
శ్రీ బాలాజీ సినీ మీడియా
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు
విడుదల : జులై 28, 2018
***
      యా
క్షన్ హీరో గోపీచంద్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తూ, సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతం నందా’ గా తెరపైకొచ్చాడు చాలా కాలానికి. దీనికంటే ముందు బి. గోపాల్ దర్శకత్వంలో రావాల్సిన ‘ఆరడుగుల బుల్లెట్’  విడులవుతూ ఆగిపోయింది. రవితేజతో ‘బెంగాల్ టైగర్’  తీసిన సంపత్ నంది మళ్ళీ కూడదీసుకుని, భారీ సెంటిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ తో ఈ శుక్రవారం విచ్చేశాడు. ఇప్పుడు తెలుగులో కన్పించని హీరోయిన్ హన్సిక, ఎప్పుడో తెలుగులో కన్పించిన కేథరిన్ హీరోయిన్లుగా తమవంతు పాత్ర పోషించారు. మరోసారి తమన్ తన బాణీలు విన్పించి మెప్పించడానికి తయారయ్యాడు. ఐతే అత్యంత భారీ ఖర్చుతో అట్టహాసంగా తీసిన ఈ బిగ్ కమర్షియల్ లో  వున్న విషయమేమిటి, అదెంతవరకూ రాణించిందీ ఓసారి పరిశీలిద్దాం..

 కథ 
       అమెరికాలో మొదలవుతుంది. అక్కడ ఘట్టమనేని విష్ణు ప్రసాద్ (సచిన్ ఖెడేకర్) వ్యాపారంలో టాప్ 50 లిస్టులో ఫోర్బ్స్ పత్రిక కెక్కుతాడు. దీన్ని కొడుకు గౌతమ్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో సెలబ్రేట్ చేసుకుంటాడు. అత్యంత ధనికుడైన తను  డ్రగ్స్ మత్తులో మునిగితేలుతూ కష్టమంటే తెలియకుండా పెరిగాడు. పబ్ లో బేరర్ (తనికెళ్ళ భరణి) చేసిన చిన్న తప్పుకి పొగరుతో లెంపకాయ కొడతాడు. దీంతో  బేరర్ అనే ఒక మాట కళ్ళు తెరిపిస్తాయి- ఫోర్బ్స్ తో గుర్తింపు వచ్చింది మీనాన్నకి, నీకు కాదు. నువ్వెవరు? నేను బెరర్ని, వాడు క్లీనర్, నువ్వెవరు చెప్పుకోవడానికి?-   అని నిలదీస్తాడు బేరర్. దీంతో అంతర్మథనం మొదలవుతుంది గౌతమ్ కి. తానెవరో తెలుసుకోవడానికి కారెక్కి పిచ్చిగా ప్రయాణం కడతాడు. వద్దని గర్ల్ ఫ్రెండ్ ముగ్ధ (కేథరిన్) చెప్పినా వినకుండా వెళ్ళిపోతాడు. యాక్సిడెంట్ చేస్తాడు. కొద్దిలో చావు తప్పించుకుంటాడు నందా (గోపీచంద్ -2). ఇతనొచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికే. అచ్చం తనలాగే వున్న ఇతడి కథ తెలుసుకుంటాడు గౌతమ్. హైదరాబాద్ బోరబండలో తన బండబారిన జీవితం చెప్పుకుంటాడు మాస్ నందా క్లాస్ గౌతంకి. అయితే మనం  స్థానాలు మార్చుకుందామని అతడింటికి గౌతమ్ వెళ్తాడు, గౌతం ఇంటికి నందా వెళ్లి సెటిలవుతాడు. గౌతం అక్కడ జీవితంలో తను పొందని నిజమైన భావోద్వేగాలెలా వుంటాయో చవిచూస్తూంటే, అక్కడ నందా వేరే పథకం వేస్తూ బిజీగా వుంటాడు. ఏమిటా పథకం, దాంతో ఏం చేశాడు, ఇద్దరూ ఏమయ్యారు, జీవితం గురించీ ఏం తెలుసుకున్నారు...అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      చాలా పరిచయమున్న పాత కథే. కొత్తదనం లేదు. ఒకేలా వుండే ఇద్దరు పరస్పరం స్థానాలు మార్చుకోవడం గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. దీన్ని కొత్తబాట పట్టించింది హాలీవుడ్ ‘ఫేస్ ఆఫ్’ ... ‘గౌతంనందా’ లో స్థానాలు మార్చుకునే కథకి పాయింటు పక్కదారి పట్టినట్టు తేలుతుంది. దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడో, మనం కన్ఫ్యూజ్ అవుతున్నామో గానీ- చెప్పింది ఒకటైతే చేసింది  మరొకటిగా కథ నడుస్తుంది. నువ్వెవరు? అని తండ్రితో పోల్చి కొడుకుని ప్రశ్నించాడు బేరర్.  అప్పుడా కొడుకు తను ఎంజాయ్ చేస్తున్న తండ్రి సంపదని పౌరుషంతో త్యజించి,  సొంత కాళ్ళ మీద ఎదిగి తనకంటూ ఐడెంటిటీ సంపాదించుకోవడానికి సిద్ధమవుతాడని మనం ఆశిస్తాం. కానీ జరిగేది వేరు. తానెవరో తెలుసుకోవడానికి ప్రయాణం కడతాడు. నువ్వెవరు? అని ఇంకేదో అర్ధంలో అడగలేదు బేరర్. అలా అడిగితే నేను ఆత్మని అని తెలుసుకోవడానికి క్షణం పట్టదు. నీకేం ఐడెంటిటీ వుందని మాత్రమే  బేరర్ అడిగాడు. తనని చూపించుకుని బేరర్ని అని, ఇంకోడ్ని చూపించి వాడు క్లీనరనీ అన్నాడు. మరి గౌతం ఎవరు? అతడి పోర్టుఫోలియో ఏమిటి? ఇదీ పాయింటు. ఈ పాయింటు వేరే పాయింటుగా మారిపోయి పైన చెప్పినట్టు వేరే కథ నడుస్తుంది.  

ఎవరెలా చేశారు 
      ద్విపాత్రాభినయానికి వచ్చిన  ఈ అవకాశాన్ని గోపీచంద్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశాడు- మనకూ ఎంజాయ్ మెంటు నిచ్చాడు. రెండో కంత్రీ పాత్రతో నవ్విస్తూ కూడా పోయాడు. మొదటి పాత్రకి ఇచ్చిన రిచ్ బిల్డప్, స్టయిలిష్ ఇమేజి మొదటి అరగంట సేపు ఒక ఫాంటసీలోకి ప్రయాణంలాగా మార్చేస్తాయి. తానెవరు? అన్న ప్రశ్న వేధిస్తూంటే కనబరచిన హావభావాలు, కన్నీటి ధారా బాగా కనెక్ట్ అవుతాయి ప్రేక్షకులకి. ఈ ప్రశ్నకి తాను వెతుక్కుంటున్న జవాబు వేరే అన్నది  వేరే సంగతి. నీ తండ్రి సంపద అనుభవిస్తూ దౌర్జన్యం చేస్తున్నావ్ సిగ్గులేదా- అన్నట్టే వున్న బేరర్ గోడు కాస్తా,  తన సొంత గోడు అయిపోవడమే క్యారక్టర్ ని ఫాలో కాకుండా చేస్తుంది ఆలోచనాపరులకి. నీ ఐడెంటిటీ ఏమిటీ అని బేరర్ అడిగితే- డబ్బున్న నాన్న తనకి ప్రేమని పంచలేదని, ప్రేమంటే ఏమిటో తెలియకుండా పోయిందనీ, ఆకలి ఎరుగని జీవితంవల్ల కష్టాలంటే ఏమిటో తెలియకుండా పోయాయనీ, తనకి ఏ ఎమోషనూ లేకుండా పోయాయనీ, ఎమోషన్స్ తెలుసుకోవడానికే ప్రయాణం కడుతున్నాననీ, తండ్రి మీదికి తప్పు నెట్టేసి పలాయనం చిత్తగించినట్టుంది పాత్ర!

          రెండో పాత్ర ఇంట్లో మకాం వేసి చేసేదంతా స్లమ్ జీవితాన్ని చవి చూస్తూ, బాధలెలా వుంటాయో  స్వయంగా తెలుసుకుని, అమ్మ చేతి  వంట, వడ్డనా  ఎలా వుంటాయో రుచి చూసి, చెల్లెలితోనూ  నాన్నతోనూ  సెంటిమెంట్లు ఎలావుంటాయో అనుభవించి తరించడమే. ఇదంతా పూర్తయి అమెరికాలో తన తండ్రి కంపెనీ బాధ్యతలు స్వీకరించే సమావేశంలో,  ఆ తండ్రి తనకి కేటాయించిన లక్షల కోట్ల షేర్స్ ని పేదవాళ్ళకి దానమిచ్చేసి గొప్పవాడై పోతాడు! 

          అప్పుడు మనకి తనికెళ్ళ గారి బేరర్ ఓ మూల నిల్చుని మొత్తుకుంటున్నట్టు మైండ్ లో బొమ్మ తిరుగుతుంది – ‘ఓరి పిచ్చినాన్నా!  నే చెప్పింది నీ తండ్రి సొమ్ము నువ్వు దానం చేసి న్యూస్ కెక్కాలని కాదురా, ఆటోగ్రాఫులు ఇవ్వాలని కాదురా, నువ్వో రూపాయి సంపాయించి చూపించమనే!’ అని.

       ఇప్పుడా తండ్రి అనుకుంటాడు- ఫోర్బ్స్ కెక్కిన నేను గొప్పా, వీడు గొప్పా అని. ఇద్దరూ గొప్పే. డబ్బు గడించినవాడూ గొప్పే, దానమిచ్చేవాడూ గొప్పే, కాకపోతే దానమిచ్చేవాడు సొంత సొత్తు లోంచి ఇచ్చుకోవాలి. 

          సారీ సంపత్ నందీ, ఈసారి మీరు చాలా కన్ఫ్యూజ్ చేసేశారు.  వర్కౌట్ కాదు.
          హన్సిక, కేథరిన్ లు గ్లామర్ బొమ్మ పాత్రలకి సరిపోయారు. ముఖేష్ రిషీ విలనీ రొటీనే. ఇద్దరు కమెడియన్లున్నా ఆ కామెడీ సాదాగానే వుంది. ప్రొడక్షన్ విలువలుమాత్రం అత్యంత భారీతనంతో వున్నాయి. హీరో రిచ్ నెస్ గురించి తీసిన దృశ్యాలు ఫాంటసీ చూస్తున్నట్టున్నాయి. ఇది కరెక్ట్ గా వర్కౌట్ చేసిన డైనమిక్స్. ఈ అమెరికన్ లైఫ్  తర్వాత బొరబండ స్లమ్స్ కి కథ వచ్చినప్పుడు తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ఈ డైనమిక్సే ‘కాబిల్’ లో హీరోయిన్ పాత్రతో చేసి సక్సెస్ అయ్యాడు సంజయ్ గుప్తా. ఇక యాక్షన్ సీన్స్, పాటల చిత్రీకరణా వగైరా అంతా టాప్ క్లాస్. థమన్ నేపధ్య సంగీతం కూడా బాగా రాణించింది. డైలాగ్స్ బలంగానే వున్నాయి- పక్కదారి పట్టిన పాయింటుకి న్యాయం చేస్తూ. కానీ తండ్రి పాత్రలో చంద్రమోహన్ – నేను మూడు పూటలా మందులు ఎందుకు వేసుకోవడంలేదో తెలుసా?  వేసుకుంటే మీ ముగ్గిరికీ భోజనం వుండదని - అనడం మాత్రం అభ్యంతరకరంగా వుంటుంది. 

చివరికేమిటి 
      కథ రొటీనే అయినా ఇది టెంప్లెట్ లో లేకపోవడం చాలా పెద్ద రిలీఫ్. ఎలాటి ఓపెనింగ్ బ్యాంగులు లేకుండా కథకి పనికొచ్చే విషయంతో నేరుగా ప్రారంభమవుతుంది. గౌతం పాత్రనే పట్టుకుని పోతుంది. ఇరవై ఐదో నిమిషంలో నందా పాత్ర తగలడంతో మొదటి మలుపు వస్తుంది. అక్కడ్నించీ ఇరవై ఐదు నిమిషాలు నందా ఫ్లాష్ బ్యాక్. ముఖేష్ రిషీ విలనీ,  నందా మీద హత్యా ప్రయత్నం...ఇలా ఫస్టాఫ్ అంతా చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ సెంటిమెంట్ల బరుఫుకింద కుయ్యో మంటుంది  మొదటి అరగంటకి పైగా. చివరి అరగంట రెండు పాత్రల అమీతుమీతో యాక్షన్లో కొస్తుంది. 

          తనికెళ్ళ భరణి ఎందుకు పీకారోగానీ,  ఆ పీకిన క్లాసు యూత్ అప్పీల్ వుండే పాయింటుకి దారితీసేదే. డబ్బు సంపాదించడం ఎప్పుడూ యూత్ అప్పీల్ వుండే క్రేజీ పాయింటే. ఏడుస్తూ సెంటిమెంట్లు పొందడం యూత్ అప్పీల్ వున్న పాయింటు కాదు. ‘బ్రహ్మోత్సవం’ ఇది గమనించలేకే, ఏడుతరాల బంధువుల అన్వేషణ అనే ముసలి పాయింటు పట్టుకుని పోయింది. మార్కెట్ యాస్పెక్ట్ లో సరీగ్గా స్క్రిప్టుని  బైండింగ్ చేసుకోకపోతే గుదిబండవక తప్పదు.

          విషయం, పాత్ర ఎటెటో పోయినా గోపీచంద్ తన లోకంలో తాను  రెండు పాత్రల్నీ ఎంజాయ్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడనేది నిజం. తెలుగు ప్రేక్షకులందరూ ఈ మధ్య విషయమూ పాత్రా చూడ్డం లేదు కాబట్టి- ఇలా ఫటాఫట్ హీరోయిజాలు  చాలేమో  సినిమాలు తీయడానికి.

-సికిందర్