రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, అక్టోబర్ 2017, గురువారం

534 : రివ్యూ


రచన – దర్శకత్వం : పి.  సునీల్ కుమార్ రెడ్డి
తారాగణం :
చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, పూజిత, పోసాని, నాగినీడు, జీవా, వేణు, ప్రభాస్ శ్రీను, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, సనా తదితరులు
మాటలు : పులగం చిననారాయణ, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఛాయాగ్రహణం : ఎస్ వి శివరాం
నిర్మాతలు : రవీంద్ర బాబు, రమణీ కుమార్

విడుదల : అక్టోబర్ 13, 2017
***
సామాజిక సినిమాల సునీల్ కుమార్ రెడ్డి గల్ఫ్ వలస కార్మికుల సమస్యతో తెలుగులో తొలి ప్రయత్నం చేశారు. గల్ఫ్ కి వలస వెళ్ళే తెలుగు కార్మికులు అక్కడ పడే బాధలు, చేసుకునే ఆత్మహత్యలు చూపిస్తూ సమస్యకి పరిష్కారం కోసం అన్వేషించారు. ప్రత్యక్షంగా అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి, సుదీర్ఘకాలం నిర్మాణం చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రేక్షకులు ఇలాటి సీరియస్ సినిమాకి సిద్ధంగా వున్నారా? సామాజిక సినిమాని ఇంకెలా తీస్తే ఈ కాలం ప్రేక్షకులు చూస్తారు? ఇందులో వున్నదేమిటి, లేనిదేమిటి, వుండీ లేనిదేమిటి, వుండకుండా పోయిందేమిటి...ఒకసారి  పరిశీలిద్దాం.

కథ 
        సిరిసిల్లలో చేనేత కార్మికుడి (నాగినీడు) కొడుకు శివ (చేతన్). ఇతడికి మగ్గం పని ఇష్టం వుండదు. రోజంతా కష్టపడినా రెండొందలు రావని మొండి కేస్తాడు. దుబాయి నుంచి అట్టహాసంగా మిత్రుడు వస్తాడు. అతడి సంపాదనా ఠీవీ చూసి శివ దుబాయ్ కెళ్ళిపోయి బాగా సంపాదించాలని తల్లిదండ్రుల్ని బలవంత పెట్టి  వెళ్ళిపోతాడు. ప్రయాణంలో గోదావరిజిల్లా అమ్మాయి లక్ష్మి (డింపుల్ ) పరిచయమవుతుంది. ఈమె తల్లికి క్యాన్సర్. వైద్యం కోసం మేనమామ దుబాయిలో ఒక షేక్ ఇంట్లో పనిమనిషి ఉద్యోగం ఇప్పించాడు. దుబాయిలో ఇద్దరూ దిగి తమతమ పనుల్లోకి వెళ్ళిపోతారు. 

          తీరా చూస్తే సిరిసిల్లా వచ్చి ఫోర్మన్ ఉద్యోగమని చెప్పుకున్న మిత్రుడు కూలీపని చేస్తూంటాడు. సరైన చదువులేని వాళ్ళంతా అక్కడ భవన నిర్మాణ కార్మికులే. శివ కూడా అదే పనిచేస్తాడు. తోటి పనివాళ్ళయిన ఇంకో నల్గురితో కలిసి  ఇరుకు గదిలో వుంటాడు. అటు షేక్ ఇంట్లో పనికి కుదిరిన లక్ష్మి మీద  మొదటి చూపులోనే కన్నేస్తాడు షేక్. ఆమెని లైంగికంగా వేధించడం, లొంగకపోతే కొట్టడం చేస్తూంటాడు.

          శివకి గల్ఫ్ జీవితమేమిటో అర్ధమవుతూంటుంది. జీతం డబ్బులు అంత తేలిగ్గా చేతికి రావు. అందరివీ ఈతి బాధలే. ఒంటరితనమే. మరో పక్క శివకి లక్ష్మి గురించి ఆందోళన. ఆమెని రహస్యంగా కలుసుకుంటూ వుంటాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ ఇంట్లో లక్ష్మికి చిత్ర హింసలు మాత్రం తప్పవు. ఇంతలో శివ మిత్రుడొకడు చెల్లెలి  పెళ్ళికి డబ్బు అడిగితే చిత్తుగా తంతాడు షేక్. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో  శివ ఇక తిరగబడాలని నిశ్చయించుకుంటాడు. మిత్రులతో కలిసి షేక్  ఇంట్లో డబ్బులూ పాస్ పోర్టులు దోపిడీ చేసి, లక్ష్మిని కూడా తీసుకుని పారిపోతాడు. షేక్ పోలీసుల్ని ఉసిగొల్పుతాడు. 
           ఇప్పుడు శివ బృందం ఏం చేసింది? తప్పించుకుని స్వదేశం వచ్చేశారా? అక్కడి అనుభవాలతో ఇంకేం  నేర్చుకున్నారు?... అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       ఇతివృత్తం కొత్తదే. ఇంతవరకూ తెలుగుతెరమీద రాలేదు. అయితే గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు చూపిస్తూ పాక్షిక ప్రయోజనాన్ని మాత్రమే  సాధించింది ఈ కథ. అక్కడి నరకకూప జీవితాలు చూస్తే ఇంకే తల్లిదండ్రులూ తమ పిల్లల్ని గల్ఫ్ కి వెళ్ళనివ్వరు బహుశా. ఆ మాత్రం కూలీ ఇక్కడే దొరుకుతుంది. ఎక్కువ సంపాదన విషయానికొస్తే,   అదంతా మళ్ళీ గల్ఫ్ కి వెళ్ళడానికి చేసిన అప్పులు తీర్చడానికే చాలదు. ఇంతవరకు మాత్రం ఓ హెచ్చరిక చేస్తూ ఈ కథకి ప్రయోజనం చేకూరింది.  ఆ తర్వాత అక్కడి సమస్యలకి పరిష్కారం మాత్రం చెప్పదు ఈ కథ. తిరిగి వెళ్ళలేక అక్కడే వుండిపోయే కార్మికులకి వాళ్ళ హక్కుల గురించిన అవగాహన కల్పించదు. హీరో దీని మీదే పోరాడతాడని మనమాశిస్తే అది జరగదు. ప్రభుత్వ పార్శ్వాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఒక్క ట్వీట్ చేస్తే ప్రభుత్వం మీముందు వుంటుందన్నసుష్మా స్వరాజ్ మాటలకి స్థానం లేదిక్కడ. 

          ఇలాగే సినిమాకోసం వాస్తవాల్ని బలిపెడుతూ అక్షయ్ కుమార్ తో చారిత్రక ఘట్టమైన గల్ఫ్ సంక్షోభం మీద ‘ఏర్ లిఫ్ట్’  తీస్తే బాగా విమర్శలు వచ్చాయి ప్రభుత్వ వర్గాల నుంచే. కువైట్ సంక్షోభంలో వేలాది మంది  కార్మికుల్ని విమానాల్లో ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తే, ఆ ప్రభుత్వ వూసే లేకుండా, అదంతా హీరోగారే చేసినట్టు చూపించడం చరిత్రని వక్రీకరించడమే అయ్యింది. ఒక ఛానెల్లో ఆ దర్శకుణ్ణి కూర్చోబెట్టి, అప్పటి గల్ఫ్ సంక్షోభంలో పనిచేసిన అధికారులు, పైలట్లూ నిలదీస్తే,  తన తప్పు ఒప్పుకున్నాడు కూడా  ఆ దర్శకుడు.

          ప్రస్తుత కథ అన్ని కోణాల నుంచీ సమగ్రం కాలేదు సరికదా, ముగింపు అసలు ఈ కథనే ప్రశ్నార్ధకం చేసింది. ఇదెలాగో కింద స్క్రీన్ ప్లే సంగతులులో చూద్దాం. ఇది నేరస్థుల కథా, బాధితులా కథా అన్న సందేహంతో బయటికొస్తాం. 

          గల్ఫ్ లో వలస కార్మికులొక్కరే లేరు. వైట్ కాలర్ ఉద్యోగులు కూడా లెక్కలేనంత మంది వున్నారు. వాళ్ళ ఉనికే ఈ కథలో కన్పించదు. తోటి స్వదేశీయులైన వలస కార్మికుల ఇక్కట్లు వాళ్ళేమీ పట్టించుకోరా? అక్కడ పని చేస్తున్న ఎన్జీఓ లేమయ్యాయి. అసలు వైట్ కాలర్ ఉద్యోగుల జీవితాలెలా వున్నాయి. ‘ఏర్ లిఫ్ట్’ లో అన్ని వర్గాలనీ చూపించారు. 

          గల్ఫ్ జీవితాల మీద మలయాళంలో ఎక్కువ సినిమాలొచ్చాయి. సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లు కలిసి నటించింది కూడా ఒకటి వుంది. వాటి క్వాలిటీ వేరు. తెలుగులో గల్ఫ్ కార్మికుల మీద తొలి సినిమా కథగా నమోదవుతున్న దీనికి ఆ స్థానానికి తగ్గ ఘనత మాత్రం లేకపోవడం విచారకరం.  పబ్లిసిటీ లో ‘ఎమోషనల్ స్టోరీస్ ఆఫ్ అన్ సంగ్ హీరోస్’ అనీ, ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’  అనీ అన్నారు. రెండూ తప్పుదోవ పట్టించేవే. జీవితాలకి సంబంధించిన ఒక క్లిష్ట సమస్య కి ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’  అంటూ ప్రేక్షకులని ఆకర్షించాలనుకోవడంలోనే  కాన్సెప్టు పట్ల నిబద్ధత తెలిసిపోతోంది. అన్ సంగ్ హీరోస్ అని ఎవర్ని అంటారు? ఒక సంస్థకో, రాజకీయ పార్టీకో, ఇంకేదో వ్యవస్థకో కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు పాటుపడి మంచి పేరు తెస్తారు. కానీ ఆ క్రెడిట్ మాత్రం పని చేయించుకున్న లీడర్ కే పోతుంది. అప్పుడు ఆ పాటుబడ్డ వాళ్ళని అన్ సంగ్ హీరోస్ అంటారు. ‘గల్ఫ్’ కథలో ఈ పరిస్థితి ఎక్కడుంది?  ఇలా కాన్సెప్ట్ పట్ల నిబద్ధత బాటు,  స్పష్టత కూడా కన్పించదు. ఏ అంశం తీసుకున్నా  పరస్పర విరుద్ధంగా కన్పిస్తాయి.

ఎవరెలా చేశారు

       ఒక సామాజిక సమస్య తీస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో గుర్తింపు లేని నటీనటులతో తీస్తే, ముందు ప్రేక్షకులు కరువవుతారు, తర్వాత ఆ కొత్త నటీనటులు ఆ సామాజిక సమస్య పట్టుకుని ఎంత మొత్తుకున్నా బాక్సాఫీసు అప్పీల్  జీరోనే అవుతుంది.  సామాజిక సమస్యల మీద ఒక ఇమేజి వున్న హీరో పోరాడినా, సందేశాలిచ్చినా వుండే ప్రభావం వేరు, కొత్త ముఖాలు చేస్తే వుండే పస వేరు. ఇలా ఇక్కడ చిన్నచిన్న నటులే ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యారు. మార్కెట్ యాస్పెక్ట్ గురించి ఆలోచించకుడా, గల్ఫ్ కార్మికుల సమస్య లాంటి బిగ్ ఇష్యూని,  లో- బడ్జెట్ లో చిన్నా కొత్తా  నటులతో ముగించేద్దామన్న ప్లానింగ్ పనిచెయ్యలేదు.


         
చేతన్, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, పూజితలు ఎంత కష్టపడి నటించినా వీళ్ళందరికీ కలిపి ఒక ఇమేజి వున్న హీరో సారధిగా వున్నప్పుడే  వీళ్ళ పాత్రలకి, నటనలకి గుర్తింపు వచ్చేది. సీనియర్లు పోసాని బ్రోకర్ గా నటిస్తే, తనికెళ్ళ ఒక ఖవ్వాలీ పాడి వెళ్ళిపోతారు. జీవా రెండు మూడు సీన్లలో ఒకడి మేనమామగా కన్పిస్తారు. సీనియర్ మాటల రచయిత తోటపల్లి మధుది కూడా ఒక చిన్న  సహాయ పాత్రే.  ఈయన చెప్పుకునే డైలాగు ఒకటి  : బయట కులాలనీ మతాలనీ చాలా  నాన్సెన్స్ వుంటుంది, ఈ గదిలోనే వసుధైక కుటుంబం కన్పిస్తుందని... వాస్తవిక కథా చిత్రంలో ఇలాటి డైలాగులు బావుండవేమో. రాజ్యాంగంలో వుండే విలువలు  ప్రజాజీవితంలో తొంగిచూడవు. భూమ్మీద మనుషులున్నంత  వరకూ కుల మత ప్రాంతీయ తత్త్వాలతో బాటు, బంధుప్రీతీ ఎక్కడికీ పోవు.  వసుధైక కుటుంబాలు చిన్న గదిలో కూడా సాధ్యమయ్యే  అవకాశం ఎక్కడుందో గానీ, సాధ్యమైంది రెండే– ప్రపంచం ఓ కుగ్రామవవడం ఇంటర్నెట్ తో, దాంతో  చేతికో సెల్ ఫోన్ వచ్చి తలా ఓ మూల కూర్చోవడం. 


          ఇక నాగినీడు పాత్ర తీరువల్ల మధ్య మధ్యలో వచ్చే ఆయన సీన్లు చాలా పాత సినిమాల ధోరణిలో వుంటాయి. దుబాయిలో వేశ్యా గృహం నిర్వాహకురాలిగా సనా సడెన్ గా మారిపోయి, వేశ్యలతో షేక్ మీద తిరుగుబాటు చేసేస్తుంది. షేక్స్ గా నటించిన నటులు నార్త్ కి చెందిన ఫిలిం ఇనిస్టిట్యూట్ నటులు. వీళ్ళున్న సీన్లే బలంగా వున్నాయి. 


          సాంకేతికంగా బడ్జెట్ కి తగ్గట్టే వుంది. పులగం చిన్నారాయణ రాసిన తెలుగు మాటలు బలహీన కథ వల్ల దెబ్బ తిన్నాయి. ‘హీరో’ చేతన్ పాత్ర తిరగబడ్డాక కూడా కొన్నిసార్లు నిరాశగా పలికే డైలాగులు సీన్లని దిగలాగాయి. తెలంగాణా భాష డబ్బింగ్ పలికిన తీరు అంతంత మాత్రమే.  తెలంగాణా ఆర్టిస్టులతో డబ్బింగ్ చేయించారో లేదో. హీరోయిన్ డింపుల్ ప్రారంభంలో పలికే తూర్పు గోదావరి యాస చాలా అతిగా వుంది. మళ్ళీ తర్వాత్తర్వాత అదే అతి యాస కన్పించదు.  షేక్ పాత్రలకి అరబిక్, హిందీ కలిపి వాడేశారు. వీటికి సబ్ టైటిల్స్ వేయకపోవడం వల్ల ఏం మాట్లాడుతున్నారో అర్ధం గాదు. హిందీ తెలిసిన వాళ్ళకి హిందీ ముక్కలు అర్ధమవుతాయి. దుబాయిలో నాల్గు మాండలికాల్లో అరబిక్ మాట్లాడతారు. హిందీ తీసేసి, ఒక మాండలికం అరబిక్ వాడుతూ తెలుగులో సబ్ టైటిల్స్ వేయాల్సింది. ఈ గల్ఫ్ సినిమా పట్ల ఆసక్తి వున్న రూరల్  ప్రేక్షకులైనా, అర్బన్ ప్రేక్షకులైనా - చూడాలనుకున్నా,  చూసి జాగ్రత్తపడాలనుకున్నా,  అక్కడి సమస్యలకి మూలకారకులైన  షేకులు అసలేం  మాట్లాడుతున్నారో అర్ధమవాలిగా. స్క్రీన్ ప్లే సంగతులు 

       కాన్సెప్ట్ పరమైన లోపాలు పైన చెప్పకున్నవైతే, ఇక దాని విస్తరణలో చోటుచేసుకున్న లోపాలు ప్రధానంగా రెండున్నాయి :

ఈ రెండూ బేసిక్స్ కి సంబంధించినవే. ఒకటి, ఈ కథకి కథానాయకుడు లేకపోవడం; రెండు, కథనం కలగాపులగమవడం.  బేసిక్సే సరిగా లేనప్పుడు ఇంకేం వుంటుంది. కథకి జీరో మార్కులు పడతాయి. 


          శివ అనే పాత్రని కథానాయకుడిగా పరిచయం చేస్తూ,  బిగినింగ్ లో ఇంట్లో మగ్గం పనంటే ఇష్టం లేని అతణ్ణి, తల్లిదండ్రులతో విభేదాల్ని, దుబాయినుంచి ఫ్రెండ్ రావడంతో శివకి తనూ దుబాయి వెళ్లి సంపాదించాలన్న కోరికని, అందుకోసం తల్లిదండ్రుల్ని బలవంతగా ఒప్పించడాన్నీ చూపించి విమానం ఎక్కించారు. ఇక్కడ దుబాయి నుంచి వచ్చిన ఫ్రెండ్ కూడా దుబాయిలో పరిస్థితులు తెలిసీ శివని ఆపకుండా, ప్రోత్సహిస్తాడు. ఇదేం ఫ్రెండ్ షిప్? ఇక దీంతో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇది అరగంటలోగా పూర్తయింది. చాలా బావుంది ఈ కాలావధి. 


          ప్లాట్ పాయింట్ వన్ అంటే ఏమిటి? అది మిడిల్ కి దారితీసే కీలక ఘట్టం, లేదా మొదటి మలుపు. అక్కడేం జరుగుతుంది? హీరోకి గోల్ ఏర్పడుతుంది. ఆ గోల్ లో ఏమేం వుంటాయి?  కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ వుంటాయి. ఈ హీరో గోల్ లో ఏమున్నాయి? ఒకటే వుంది- డబ్బు సంపాదించాలన్న కోరిక – కేవలం కోరిక ఒకటే వుండడం వల్ల వీగిపోయింది గోల్. కోరిక వుంటే  రెండోదైన పణం కూడా పెట్టాలి.
There's no such thing as a free lunch   – అవునా? కానీ మన వాడు కోరిక ఒకటి మాత్రమే పెట్టుకుని  ఫ్రీ లంచ్ వచ్చేస్తుందని విమాన మెక్కేశాడు. పూర్తిగా స్వార్ధపరుడు. పేరెంట్స్ ని వదిలేసి తనదారి తను చూసుకున్నాడు. బిగినింగ్ లో ఏనాడూ మీరింత  కష్ట పడకూడదనీ,  తనని దుబాయి పంపిస్తే కష్టాలన్నీ తీరిపోతాయనీ ఇంక్లూజివ్ గా మాట్లాడడు. ఎక్స్లూజివ్ గా తనొక్కడి సుఖమే అన్నట్టు గొడవపడి, పేరెంట్స్ ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి వెళ్లిపోతాడు. ఇది పాత్ర స్వభావం కాదు. పాపం పాత్ర మంచిదే. దీని చిత్రణే ఇలా బ్యాడ్ ఐపోయింది.  దుబాయి వెళ్లి సంపాదిస్తున్నాక,  నేస్తాలు ఇళ్ళకి డబ్బులు పంపిస్తూంటే మన వాడు ఒక్క దినార్ కూడా పంపిన పాపాన పోడు. ఇది కూడా పాత్ర స్వభావం కాదు. శివ మంచోడే. పాత్ర చిత్రణలో చిత్తయిపోయాడు. ఇతను ఇంటర్వెల్లో దుబాయి షేకు మీద తిరగబడ్డాడు గానీ, ముందే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథకుడి మీద తిరగబడి కరెక్షన్స్ చేయించుకోవాల్సింది.

          పేరంట్స్ పట్టకుండా వెళ్ళిపోతే గోల్ కోసం దేన్ని పణంగా పెడతాడు. నేత పనిలో అప్పులపాలై వున్నట్టు చూపించి వుంటే, దీన్నుంచి కుటుంబాన్ని బయట పడెయ్యడానికి దుబాయి ప్రయాణం కడితే, కుటుంబం కోసం తన జీవితాన్నే పణంగా పెడుతున్నట్టు వుండేది. చూసే  ప్రేక్షకులందరికీ తెలుసు- కార్మికులుగా గల్ఫ్ వెళ్ళడమంటే యూఎస్ వెళ్ళడం కాదని, సరాసరి నరకానికే వెళ్ళడమని. ఇలా జీవితాన్నే పణంగా పెడుతున్నప్పుడు ఇందులోంచి మూడో ఎలిమెంట్ అయిన పరిణామాల హెచ్చరికని ప్రేక్షకులు ఆటోమేటిగ్గా ఫీలవుతారు. ఏఏ పరిణామాలు ఇతణ్ణి చుట్టుముట్టి కాటేస్తాయో, కుటుంబాన్నెలా ఉద్ధరిస్తాడోనని. దీంతో ఎమోషన్స్ కి సరైన బీజం పడుతుంది.  అప్పుడు గోల్ సజీవంగా,  బలంగా వుంటుంది.  


          గోల్ కి కుటుంబం అనే పునాది లేకుండా, ఆవారాగా డబ్బు సంపాదించుకోవాలని ఎగిరిపోతే, అతనెలా పోయినా డోంట్ కేర్ ప్రేక్షకులకి. వాడిదొక గోలే కాదు, వాడొక మనిషే కాదని. ఇంత మృతప్రాయమైన ప్లాట్ పాయింట్ వన్ తో కథ  ఏం సాధిస్తుంది. కథ పుట్టేదే ఇక్కడ. పురిట్లోనే సంధికొట్టింది. సినిమా ఇక్కడే ప్లాపయ్యింది.


***
     ఇక  కథానాయకుడు కథానాయకుడే కాకుండా      పోయాడు. ప్లాట్ పాయింట్ వన్దగ్గర్నుంచి మిడిల్లో  కథానాయకుడిలా వుండడు. ఇతరపాత్రల మధ్య గుంపులో ఒకడిగా వుంటాడు. గోల్ సరిగా లేకపోతే ఇంతే. గోల్ సరిగా వుంటే ఈ మిడిల్లో గోల్ కోసం సంఘర్షించే వాడు. మిడిల్ అంటేనే గోల్ కోసం సంఘర్షణ. అడ్డంకుల్ని అధిగమించడం. ఇతను పక్కకెళ్ళి పోయి, ఇక నేస్తాల కష్టాలూ ఫ్లాష్ బ్యాకులూ మొదలవుతాయి. పక్కకెళ్ళిన తన పని హీరోయిన్ ని ప్రేమించడమే. ఒక నేస్తానికి చెల్లెలి పెళ్ళికి డబ్బు కావాలి. దీనికి నేస్తాలందరూ ఓటీ చేసి సంపాదించి ఇవ్వాలనుకుంటారు. మన శివకి తల్లిదండ్రులు గుర్తుకు రారుగానీ, నేస్తం కోసం కష్టపడాలనుకుంటాడు. ఇది ఇంటర్వెల్ కి దారి తీసే పించ్ – 1 సీను.  

          మధ్యలో ఇంకేదో జరిగి ఆ నేస్తం షేకుని డబ్బులు అడిగి, దెబ్బలు తిని ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో శివ  షేక్ ఇంట్లో దోపిడీ పథక మేస్తాడు- నేస్తం చెల్లెలి పెళ్లి డబ్బుకి!

          ఇది చాలా బ్యాడ్ ఇంటర్వెల్ మలుపు. ఇది ఇక పూర్తిగా కాన్సెప్ట్ ని చెడగొట్టింది. కాన్సెప్ట్ బాధితులుగా పోరాడి జయించమనే  కోరుతుంది గానీ, నేరస్థులుగా మారిపోయి చచ్చిపొమ్మని కాదు. అంటే గల్ఫ్ కి వెళ్ళేవాళ్ళు  డబ్బుకోసం నేరస్థులుగా మారాలని  కాన్సెప్ట్ చెప్పదు.  శివకి కుటుంబ పునాదిగా గోల్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి. ఠికానా లేని పాత్రకి  ఠికానా లేని ఆలోచనలు. ఇది కూడా శివ మౌలిక స్వభావం కాదు. అతను బుద్ధిమంతుడే. పాత్ర చిత్రణ అనే కోరలకి చిక్కి అడుగడుగునా స్వభావం కరాళ నృత్యం చేస్తోంది.

                                             ***
    ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో మిడిలే కొనసాగుతుందని సహజంగా అనుకుంటాం. కానీ కొనసాగదు. ఇక్కడ్నించే కథనం చెడిపోతుంది. ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ఇంటర్వెల్ వరకూ మిడిల్ వన్, ఇంటర్వెల్ తర్వాత నుంచీ ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్ టూ వుంటాయని కదా అనేక సార్లు చెప్పుకునీ చెప్పుకునీ అలసిపోయాం. అయినా ఇక్కడ మిడిల్ టూ ప్రారంభమే కాదు. మళ్ళీ బిగినింగ్ కే వస్తుంది కథ. జరగాల్సిన మిడిల్ టూ బిజినెస్ జరక్క, మళ్ళీ అయిపోయిన బిగినింగ్ బిజినెస్సే  మొదలవుతుంది. ఆ మధ్య  ‘బ్రదర్స్’ అనే హిందీ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఇలాగే  బిగినింగ్ బిజినెస్ వచ్చిపడి అయోమయం సృష్టించింది. అందుకే దీన్ని శాండ్ విచ్ స్క్రీన్ ప్లే అన్నాం. రెండు మిడిల్స్ మధ్య  బిగినింగ్ ని పెట్టి సర్వ్ చేయడం. ఐతే శాండ్ విచ్ లో తాజా వెజిటబుల్సేవో వుంటాయి. ఇక్కడ పాచిపోయిన బిగినింగ్ బిజినెస్. ఇది అత్యంత  స్వల్ప నిడివితో వుండడం వల్ల బ్రతికిపోయాం. 

          ‘గల్ఫ్’ లో స్వల్ప నిడివి కాదు,  ప్లాట్ పాయింట్ టూ వరకూ బిగినింగ్ బిజినెస్సే. ఎప్పుడో ఒకసారి  మిడిల్ టూ సీన్లు వచ్చిపోతూంటాయి. సెకండాఫ్ డాక్యుమెంటరీలా ఉందనీ,  బోరు కొట్టిందని రివ్యూలు రాశారు. కారణం ఇదే, మళ్ళీ బిగినింగ్ బిజినెస్ మొదలవడమే.  ఏమిటా బిగినింగ్ బిజినెస్?  మళ్ళీ కష్టాలు. ఈసారి వేశ్యాగృహాల్లో, గే సెక్స్ లో, సహజీవనాల్లో కష్టాలు కావవి, జల్సాలు – కామెడీలు. మరి అక్కడ ఇంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు గల్ఫ్ తో వచ్చిన సమస్యే మిటి? అంతా హేపీ హేపీయే కదా, ఇంకా కాన్సెప్ట్ ఎక్కడిది?

          దోపిడీ పథకమేసి, దోపిడీ చేశాక ఇంటర్వెల్ తర్వాత దీని కొనసాగింపు కథనం చేయకుండా- మళ్ళీ మొదటికొచ్చి, బిగినింగ్ లో వుండాల్సిన సీన్లు చొరబెట్టడంతో సెకండాఫ్ నాశనమైంది. ఇక ఎండ్ విభాగంలో పోలీసులు పట్టుకోబోతే పారిపోయి అక్రమమార్గంలో  ఏజెంట్ ద్వారా ఆ దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించి- దాక్కున్న సిమెంట్ మిక్సర్ మెషీన్ లో క్రషింగ్ అయిపోయి చచ్చిపోతారు, ఎర్రటి రక్తాలు పారిస్తూ.

                                                 ***
ఇంతే !
  ఈ ముగింపుతో ఏం చెప్పదల్చుకున్నారు? నేరగాళ్లుగా మారితే ఇలాటి శిక్ష తప్పదని చెప్పాలనుకుంటే కరెక్టే కావొచ్చు. కానీ వీళ్ళు నేరగాళ్లుగా  మారడమేమిటి? పైగా వాళ్ళు బుద్ధి తక్కువై గల్ఫ్ కొచ్చామనీ, తిరిగి వూళ్ళకి వెళ్ళిపోయి ఏదో  చేసుకుని బతుకుదామనీ అనుకుంటారు. ఇలా పరివర్తన చెందిన పాత్రల్ని చంపేస్తారా? చంపకపోతే ఏం చేయాలి? చట్టానికి అప్పగించి శిక్షించాలి, ఆ తర్వాత స్వదేశానికి పంపించెయ్యాలి. బతుకు జీవుడా అని వెళ్లి వేరే పనులు చేసుకుంటారు. అయితే ఈ కథ గల్ఫ్ లో  జరిగే తప్పుల్ని ప్రశించడానికి ఉద్దేశించిందా, లేక పాత్రల చేతే తప్పు చేయించి,  గల్ఫ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని సమర్దించడానికా?

          అసలేమిటీ కథ. సామాజిక కథా, లేక క్రైం థ్రిల్లరా?  దుబాయిలో ఒకప్పుడు సిమెంట్ మిక్సర్ లో నలిగి కార్మికులు భయంకర మరణం పొందిన సంఘటన బావుందని తెచ్చి ఇక్కడ ముగింపుగా అతికించేస్తే సరిపోయిందా? 

          చివరికి రోలింగ్ టైటిల్స్ లో సంవత్సరాలవారీగా మరణాల సంఖ్య చూపిస్తూ పోతే ఏమనుకోవాలి – ఈ కథ మరణాల గురించా?  చాలా గందరగోళంగా వుంది. చాలా  వృథా పోయింది ఈ సినిమాకోసం పడిన కష్టం – మార్కెట్ యాస్పెక్ట్ పరంగానూ, క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగానూ.సికిందర్