రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, డిసెంబర్ 2016, శనివారం

రివ్యూ!



దర్శకత్వం : ఇ. సత్తిబాబు
తారాగ‌ణం: పృథ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతిసోధి, సన, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, ధన్‌రాజ్‌ తదితరులు
కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: పి. బాల్‌రెడ్డి, బ్యానర్ : శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
విడుదల : 16-12-2016
***

         
క్యారెక్టర్ ఆర్టిస్టు పృథ్వీని హీరోగా చేస్తూ ఆయన శైలిలో కామెడీ తీశారు. పృథ్వీ అంటే పేరడీలకి ప్రసిద్ధి కాబట్టి మరోసారి ఆ కోణాన్ని చూపెడుతూ వెరైటీగా సినిమాలో సినిమా చూపించారు. ఈవీవీ శిష్యుడు, అరడజను సినిమాలు తీసిన దర్శకుడు ఇ. సత్తిబాబు దీని రూపకర్త. ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’ లవంటి ఐదు సినిమాలు తీసిన కేకే రాధా మోహన్ నిర్మాత. ‘మర్యాదరామన్న’ ఫేమ్ సలోని హీరోయిన్. టైటిల్ వచ్చేసి ‘మీలో ఎవరు కోటీశ్వ రుడు’. ఇలా అనేక ఆకర్షణలతో ప్యాకేజీ చేసిన ఈ తాజా కమర్షియల్లో తాజాదనమెంత? సినిమాలో సినిమా చూపించాలన్న  వెరైటీ ఆలోచన ఎంతవరకు ఫలించింది? హీరోని వేరియే షన్ స్టార్ అంటూ కామెడీ చేసిన ఈ పేరడీలో ఎంటర్ టైన్మెంట్ ఎంత? ఇవన్నీ ఈ కింద తెలుసుకుందాం.
 

కథ 

     రాత్రి పూట తాగి రోడ్డున పడ్డ తనని ఏమీ చేయకుండా ప్రశాంత్ (నవీన్ చంద్ర) అనే అతను క్షేమంగా ఇంటిదగ్గర దిగబెట్టాడని తెలుసున్న ప్రియ (శృతీ సోధి), తనని అతనేమీ చేయకపోవడం తన ఆడతనానికే అవమానంగా భావించుకుని అతడి వెంట పడుతూంటుంది – తనని ఏమైనా చెయ్యమని రెచ్చగొడుతూ. ఆమె డబ్బు గలది. అతను సామాన్యుడు. చదువుకుంటున్న అతను  ఆమెని దూరం పెడుతూంటాడు. ఒకానొక సందర్భంలో ఆమెని ప్రేమించడం మొదలెడతాడు. కానీ అంతస్తుల తేడాలు చూపించి సంపన్నుడైన ఆమె తండ్రి ఏబీఆర్ (మురళీ శర్మ) పెళ్ళికి తిరస్కరిస్తాడు. అప్పుడు డబ్బుతో శాశ్వత ఆనందం లభించదని, తాత్కాలిక సంతోషమే లభిస్తుందనీ - ఓడి గెలిచిన వాడికే ఆనందం అంటే ఏమిటో అర్ధమవుతుందనీ తన ఐడియాలజీ విన్పిస్తాడు ప్రశాంత్. విన్పించి, ఏదైనా వ్యాపారం చేసి నష్టపోతే మీకే తెలుస్తుందంటాడు. దీంతో ఆలోచనలో పడ్డ ఏబీఆర్, కొత్త వ్యాపారం పెట్టి నష్టపోవడానికి సిద్ధపడి- అలాటి నష్టపోయే ఐడియా ఇచ్చిన వాళ్లకి కోటి రూపాయలు బహుమతి ప్రకటిస్తాడు. తాతారావు (పోసాని) అనే సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత ఈ అవకాశాన్ని కొట్టేస్తాడు. ఒక దరిద్రగొట్టు  దర్శకుడు రోల్డ్ గోల్డ్ రమేష్ (రఘుబాబు) అనే వాడితో పది కోట్లతో సినిమా తీస్తే,  పూర్తిగా నష్టపోవడం ఖాయమన్న ఇతడి ఐడియా ఏబీఆర్ కి నచ్చి,  సినిమా తీయించడం మొదలెడతాడు. తాతారావు- రమేష్ లు కలిసి చిన్న చిన్న వేషాలేసుకునే వీర బాబు (పృథ్వీ) ని వేరియేషన్ స్టార్ గా పరిచయం చేస్తూ, సమంత (సలోని) ని హీరోయిన్ గా తీసుకుని సినిమా తీసి విడుదల చేస్తారు. ఆ సినిమా ఏమిటి? అది తీసి ఏబీఆర్ నష్టపోయడా? లాభాలార్జించాడా? ప్రశాంత్ చెప్పిన ఆనందం ఎలా పొందాడు? కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడా లేదా?...అన్నవి మిగతా కథలో తెలిసే  అంశాలు.  
ఎలావుంది కథ?
       డబ్బున్న వాడిదగ్గర ఆనందం ఉండదనీ, కేవలం తాత్కాలిక సంతోషమే వుంటుందనీ, డబ్బు లేనివాళ్ళు మాత్రమే ఆనందంతో హాయిగా జీవిస్తారన్న ఒక మూఢ విశ్వాసం హీరో చేసే సమర్ధింపుగా ఈ కథకి మూలం. కానీ మనం ఆలోచిస్తే ఇది తిరోగమన వాదమని ఇట్టే అర్ధమైపోతుంది. ఎలాగంటే, ఇలాటి  మూఢ విశ్వాసంతో పేదవాళ్ళు పేదవాళ్ళుగానే వుండి పోతారు. వాళ్ళ దృష్టిలో డబ్బు పాపిష్టిది గానే వుండిపోతుంది. డబ్బు (లక్ష్మి) పాపిష్టిది కాదు, కేవలం డబ్బుతో వ్యవహరించే కొందరు మనుషులే పాపిష్టి వాళ్ళు కావొచ్చు. అలాకూడా మనుషుల్ని జడ్జి చేయకూడదు. డబ్బుతో ముడి పెట్టి మనుషుల్ని నెగెటివ్ గా జడ్జి చేసినంత కాలం ఆ డబ్బు (లక్ష్మి) మన దగ్గరికి కూడా రాదు. ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని దేశం ఆర్ధికంగా కళకళ లాడుతున్న వేళ నోట్ల రద్దుని అడ్డుపెట్టుకుని, ఒక నంబర్ వన్ జాతీయ ఆంగ్ల ఛానెల్ ‘డర్టీ క్యాష్’ అంటూ డబ్బుని తిట్టడం మొదలెట్టింది. చాలా అధ్వాన్నంగా ఉంటోంది డబ్బుని అర్ధం జేసుకోవడం. సమస్య మనుష్యుల్లో వుంటే, డబ్బుని చూపించి ఇలాటి కథలు చేయడంవల్ల –చివరికి చెప్పాలనుకున్నది కూడా స్పష్టంగా చెప్పలేకపోతారు- ఈ కథలో లాగే. చివరికి డబ్బుగల ఏబీఆర్ పాత్రకి ఆనందం ఎలా లభించిందో మనకి అర్ధంకాని విధంగా చెప్పి ముగించారు. అతను హీరో చెప్పిన ఆనందాన్ని అర్ధంజేసుకోవడం పోయి, అతణ్ణి ప్రేమిస్తున్న కూతురి ప్రేమని అర్ధం జేసుకున్నట్టుగా  తయారయ్యింది కథ. 

ఎవరెలా చేశారు 
      పృథ్వీ తన ట్రేడ్ మార్క్ నటనే కనబర్చాడు. అయితే బయట వీరబాబుగా, సినిమాలో మహేష్ బాబు పాత్రగా వేరియేషన్ చూపించి వుంటే బావుండేది. స్టార్స్ ని అనుకరిస్తూ డైలాగులు కొట్టే ఫార్మాలిటీని ఇంకోసారి మొక్కుబడిగా పూర్తి చేశాడు. మహేష్ పాత్రగా తాను జ్యూనియర్ ఇంటర్ చదవడమన్నది- నాటి హీరోల మీద మంచి సెటైరే. ఆ వయసులో స్టూడెంట్ గా నటించడమన్నది తెలుగు హీరోలకి ఒకప్పుడు అలవాటే. కాకపోతే ఇక్కడ మైనం పాటి భాస్కర్ రాసిన సెటైర్ గుర్తొచ్చేలా వుంది పృథ్వీ మహేష్ బాబు పాత్ర ఎంట్రీ. ఇరవై ఏళ్ల క్రితం మైనంపాటి భాస్కర్ రాసిన సెటైర్లో,  యాభై ఏళ్ల తెలుగు హీరో ఇంట్లోకి పిల్ల మొగ్గేసి తల్లిని కావిలించుకుని- ‘అమ్మా నేను బియ్యే పాసయ్యా!’ అంటాడు. పృథ్వీ కూడా ఇంట్లోకి జంప్ చేసి-  ‘అమ్మా నేను టెన్త్ పాసయ్యా!’ అంటాడు!!

        పృథ్వీ టీనేజి హీరోగా నటించే సినిమా టైటిల్ ‘తమలపాకు’. తండ్రిగా తిట్టి కొట్టే పాత్రలో జయప్రకాష్ రెడ్డి  ఉంటాడు. వీళ్ళిద్దరూ పాత సినిమాల్లోని అతి డ్రామాని ప్రకటిస్తారు. పృథ్వీ సరిగ్గా చదువుకోడం లేదనో, హీరోయిన్ వెంట తిరుగుతున్నాడనో జయప్రకాష్  రెడ్డి చావగొట్టినప్పుడల్లా-  ‘ఒక్కగానొక్క  చిన్న కొడుకండీ’ అంటూ తల్లిపాత్ర చేసే ఓవరాక్షన్ కూడా మంచి సెటైరే పాత సినిమాల మీద (ఈ కాలంలో యూత్ సినిమాల పేరుతో  ఇంకా వస్తున్న ‘నాన్న- నేను- నా బాయ్ ఫ్రెండస్’ లాంటి పాత డ్రామెడీలకి కూడా సెటైర్లు ఈ చిత్రణలు).  

       
కానీ పృథ్వీ ఇటీవల ‘మనవూరి రామాయణం’ లో నటించినంత ప్రతిభావంతంగా నటించి ఇక్కడ ముద్ర వేయలేకపోయాడు. కారణం, ఒక విజన్ లేకుండా ‘తమలపాకు’ సినిమాకథా కథనాలు సాగడమే. పోతే చాలాకాలం తర్వాత సలోని కన్పించింది గానీ ఆమె పాత్రకూడా కృతకమే. ఇక పోసాని- రఘుబాబులది భరించడం కష్టమైపోయే కామెడీ. ఎందుకు వీళ్ళిద్దరు అంత  గొంతు చించుకుని అరుస్తూ మాట్లాడతారో అర్ధంగాదు. ప్రేక్షకులు చెవిటి వాళ్లనా? వీళ్ళ వాయిసులు నరాల మీద సుత్తి మోతలు. జయప్రకాష్  రెడ్డి గొంతు అయితే పక్కా శబ్దకాలుష్యమే. ఇలా శబ్ద సౌందర్యం లేకుండా డబ్బింగులు చేస్తే ఏదో చీప్ క్వాలిటీ  సినిమా చూస్తున్నట్టు వుంటుంది. నిర్మాత రాధామోహన్ ఇదివరకు కాస్త సాంకేతిక విలువలున్న సినిమాలు తీసిన వాడే. 

        మురళీ శర్మ  సీన్స్ ని రక్తి కట్టించగలడు గానీ, ఆ పాత్రకి దర్శకుడు న్యాయం చేయగలగాలి. అదిక్కడ జరగలేదు. చివరికి హీరో ఫిలాసఫీని ఏమర్ధం జేసుకున్నాడో తెలీదు. తను చెత్తగా తీసి నష్టపోవాలనుకున్న సినిమా తనకే  గొప్పగా ఏదో నేర్పిందనుకుంటాడు- ఏమిటది? మనకైతే అర్ధంగాలేదు. బిజినెస్ లో నష్టపోయి, ఆ నష్టంలోంచి బిజినెస్ ని లాభాల బాట పట్టిస్తే, ఆ విజయం ఇచ్చే ఆనందం అసలైన ఆనందమని, అది కలకాలం వుంటుందనీ హీరో ఫిలాసఫీ (?) గా మనం అర్ధం జేసుకోవాలి. దీని ప్రకారం మురళీశర్మ పాత్రకి ముగింపు లేదు. తను తీసిన ‘తమలపాకు’ సినిమాలో హీరోయిన్ కి హీరో కిడ్నీ దానమిచ్చి బతికించుకుంటే- అది ధనిక పేదా తేడాల్ని తుడిచి పెట్టేసిందని ఫీలైపోయి, కూతురి పెళ్ళికి ఎస్ అనేస్తాడు. దీనికీ హీరో ఎంకరేజి చేసిన ఫిలాసఫీకీ సంబంధమేమిటి?

        పైగా హీరో చివరికి- ఆ సినిమా కథ తానే రాసి ఇచ్చానని ట్విస్ట్ ఇస్తాడు. ఇది మరీ చోద్యంగా వుంది. మురళీ శర్మ ఏదో చెత్త సినిమా తీసి నష్టపోవాలనుకుంటే, అది హీరో ఫిలాసఫీ ప్రకారం కరెక్టే అనుకుంటే, హీరో గొప్ప కథ ఇచ్చి మురళీ శర్మ కళ్ళు తెరిపించాలనుకోవడ మేమిటి తన ప్రేమకోసం? చక్కగా ఏ టైటానిక్కో, లైలా మజ్నూనో, మరో చరిత్రనో చూపించి కళ్ళు తెరిపిస్తే సరిపోతుంది కదా? సంతోష ఆనందాల వేరియేషన్స్ చెప్పి మురళీ శర్మని అంత శ్రమ పెట్టడమెందుకు? మురళీ శర్మ నేర్చుకోవాల్సింది ఒకటైతే, సోషలిజం నేర్పడమేమిటి?

        హీరోగా నవీన్ చంద్రది నామమాత్రపు పాత్ర. నటన కూడా ఏమీ మార్పు లేకుండా అదే చాలా పూర్ నటన. అసలున్నాడో లేడో అన్నట్టుంటాడు ఈ సినిమాలో కూడా. ఇక హీరోయిన్ శృతీ సోధిలో అతిగా నార్త్ ఇండియన్ నెస్ నేటివిటీకి చెల్లుచీటీ రాసేసింది. సాంకేతిక విలువలూ సంగీత సాహిత్యాల గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. 

చివరికేమిటి?
        థ, స్క్రీన్ ప్లే, మాటలే కాకుండా, మళ్ళీ కథా విస్తరణ, డైలాగ్స్ డెవలప్ మెంట్ అంటూ రాత పనిని ఇంత విభజించుకుని కూడా,  ఇందరూ  కలిసి అసలు కాన్సెప్ట్ ని రీసెర్చి చేసినట్టు కన్పించడం లేదు. ఫలానా ఈ కాన్సెప్ట్ తో ఏఏ సినిమాలు వచ్చాయో పరిశీలించుకున్నట్టు లేదు. సినిమాలో ‘తమలపాకు’ అనే ఇంకో సినిమా చూపించాలనుకోవడం బాగానే వుంది. ఆ ‘తమలపాకు’ చెత్త సినిమాగా తీస్తున్నారు కాబట్టి హాస్యాస్పదంగా అవే పాత – కాలం చెల్లిన పాత్రలూ –కథా- సన్నివేశాలూ  కలిపికొట్టి ప్రేక్షకుల మీద రుద్దితే, కోరుకున్న అట్టర్ ఫ్లాపు వస్తుందనుకోవడం మంచి అయిడియాతో కూడిన కాన్సెప్టే.  పనిలోపనిగా సినిమాలమీద, సినిమా రంగం మీదా సెటైర్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. కారణం, అసలీ కాన్సెప్ట్ ని ఎలా ప్రెజెంట్ చేయాలో గ్రహించకపోవడం.

          విద్యా బాలన్- నసీరుద్దీన్ షా లతో ‘డర్టీ పిక్చర్’ తీశారు. అది ఏనభై లనాటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీశారు. ఆనాడు సినిమాలు ఎలా తీసేవాళ్ళో, వయసు మళ్ళిన హీరోలు హెవీ మేకప్పులేసుకుని, విచిత్ర కాస్ట్యూమ్స్ వేసుకుని,  ఎలా గెంతే వారో;  అప్పటి పాటలూ మ్యూజిక్ (బప్పీ లహరీ టైపులో) ఎలావుండేవో, హీరోయిన్ల కట్టుబొట్టు ఎలా ఉండేవో- నవ్విస్తూ అచ్చు గుద్దినట్టు తీసి అవతల పడేశారు. పెద్ద హిట్ చేశారు నేటి కాలపు ప్రేక్షకులు కూడా. అలాటి వయసుమళ్ళిన ఓవరాక్టింగ్ హీరోగా నసీరుద్దీన్ షా ఎలా ఉన్నాడో పృథ్వీ చూసివుంటే, లేదా అప్పటి హీరోయిన్ గా- డాన్సర్ గా - విద్యాబాలన్ ఎలా వుందో సలోని  చూసివుంటే- మొత్తంగా టీం అంతా ఈ సినిమా చూసి వుంటే,  ఈ కాలానికి ఆ కాలపు సినిమా చూపిస్తూ గతాన్ని గొప్పగా రీక్రియేట్ చేసి వుండేవాళ్ళు. క్రియేటివిటీ అనేది సినిమాలో సినిమా చూపిస్తున్నాం కాదా అనుకోవడం దగ్గరే ఆగిపోయిందిక్కడ. ఎలా క్రియేట్ చేయాలనే దాని  గురించి ఇన్నోవేషన్ లేదు- అదీ సమస్య. మొదటి అరగంట హీరో హీరోయిన్ల ప్రేమట్రాకు పసలేని పరమ బోరు. అరగంట తర్వాత మురళీ శర్మ  ఐడియా కోసం ప్రకటన  ఇచ్చే ప్లాట్ పాయింట్ వన్ తో మనకి కొత్త హుషారు వస్తుంది గానీ, అది పోనుపోనూ శిరోభారంగా పరిణమిస్తుంది...


-సికిందర్ 
cinemabazaar.in