రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, December 27, 2022

1277 : స్పెషల్ న్యూస్!

    ఫారెస్ట్ గంప్ స్టార్ టామ్ హాంక్స్ లేటెస్ట్ కామెడీ- డ్రామా ఏ మాన్ కాల్డ్ ఒట్టో ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇది దశల వారీ విడుదల. సోనీ పిక్చర్స్ కొత్త పంపిణీ వ్యూహానికి తెర తీసింది. సినిమాని ఒకేసారి గ్లోబల్ విడుదలకి కాదు కదా లోకల్ విడుదలకి కూడా పూనుకోవడం లేదు. లోకల్ గా రెండంచెల్లో, గ్లోబల్ గా మూడో అంచెలో దశల వారీ విడుదలకి ప్లాన్ చేసింది. ఇది మంచి ఫలితాలు అందిస్తే ఇతర స్టూడియోలకి, పంపిణీదారులకీ మార్గ దర్శకంగా వుంటుందని భావిస్తున్నారు.

         మాన్ కాల్డ్ ఒట్టో క్రిస్మస్ మూవీగా విడుదల చేయలేదు. దీని విడుదలని కొత్త సంవత్సరపు ఆనందోత్సాహాల్ని  క్యాష్ చేసుకునేదుకు ఉద్దేశించారు. ఎంత లేదన్నా కొత్త సంవత్సరం ఫీల్ ని ఓ 15 రోజులైనా అనుభవిస్తారు మనుషులనే వాళ్ళు. ఆ తర్వాత ఆ సంవత్సరానికి తీసుకున్న నిర్ణయాలు, చేసిన బాసలు అవతల పారేసి ముందుకెళ్ళి పోతారు. ఆ 15 రోజుల ఉత్సాహాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ మూవీని అందిస్తున్నారు. ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒకరోజు అన్ని ఏరియాల్లో విడుదల చేసేస్తే దాని శోభ అన్ని రోజులూ వుండకపోవచ్చు. దశల వారీగా అందిస్తూపోతే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఫ్రెష్ నెస్ తో వ్యాపిస్తూ పోతూంటుంది. అందుకని డిసెంబర్ 30, జనవరి 6, జనవరి 13 మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు.
        
ఈ మూడంచెల ప్లాట్ ఫామ్ విడుదల వ్యూహాన్ని మౌత్ టాక్ కి ముడిపెట్టి రచించారు. మొదటి విడుదల మౌత్ టాక్ రెండో విడుదలని విస్తృత పర్చడానికి, రెండో విడుదల మౌత్ టాక్ మూడో విడుదలని మరింత విస్తృత పర్చడానికీ దోహదం చేస్తాయి. డిసెంబర్ 30 న కేవలం న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ నగరాల్లో పరిమిత థియేట్రికల్ రిలీజ్ చేస్తారు. 2023 జనవరి 6అమెరికా వ్యాప్తంగా విడుదల చేసి, జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠని పెంచే ఈ వ్యూహం విజయవంతమైతే ఈ గ్లోబల్ యుగంలో తిరిగి వెనక్కి వెళ్ళినట్టే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ.
        
పాతరోజుల్లో ఇలాగే విడుదలయ్యేవి సినిమాలు. మన దగ్గర కూడా ముందు ఏ సెంటర్స్ లో, కొన్ని బి సెంటర్స్ లో విడుదలయ్యాక, మిగిలిన బి సెంటర్స్ కి వచ్చేవి. బి సెంటర్స్ నుంచి సి సెంటర్స్ కి వచ్చేవి. ఏ, బి సెంటర్స్ ని చూసి మిగిలిన బి సెంటర్స్ ప్రేక్రకులు మా వూరి కెప్పుడొస్తుందా అని చూసే వాళ్ళు, చిట్ట చివరికి బి సెంటర్స్ ని చూసి మా పల్లెటూరి కెప్పుడొస్తుందాని లొట్టలేసుకుంటూ ఎదురు చూసేవాళ్ళు పాపం సి సెంటర్స్ అభాగ్యులు. ఇదే ఇప్పుడు ఇంకో కోణంలో సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్.

నష్టనివారణ వ్యూహమే ఇది

    ప్లాట్‌ఫామ్ రిలీజ్ ప్లాన్ అనేది ఒక రకమైన పరిమిత విడుదల. అంటే  విస్తృత విడుదల కంటే తక్కువ థియేటర్‌లలో (సాధారణంగా 599 లేదా అంతకంటే తక్కువ) మొదట రిలీజ్ చేస్తారు. సానుకూల మౌత్ టాక్ అందుకుంటే, మార్కెటింగ్ ప్రచారాన్ని పెంచి మరిన్ని థియేటర్లకి విస్తరిస్తారు. ఈ వ్యూహంతో ప్రయోజనం ఏమిటంటే, మూవీ మార్కెట్ లో నిలబడే వరకు మార్కెటింగ్ ఖర్చులు అదుపులో వుంటాయి. మౌత్ టాక్ ని బట్టి ప్రచారం, థియేటర్లూ పెంచుకుంటూ పోతారు. మొదట్లోనే ఫ్లాప్ టాక్ వస్తే, పంపిణీదారు ప్రచారాన్ని విరమించుకోవచ్చు. తద్వారా ప్రకటనల, ప్రమోషన్ల ఖర్చులు తగ్గుతాయి. థియేటర్ల హైరింగ్ వ్యయం నుంచి కూడా తప్పించుకోవచ్చు.
        
మన దగ్గర ఒకేసారి వెయ్యి థియేటర్లలో విడుదల చేసి, ఒకేసారి పదుల కోట్లు ప్రమోషన్ల ఖర్చు భరించాక, తీరా ఫ్లాపయితే ఆ యెత్తున రిలీజ్ కైన వ్యయమంతా అదనపు నష్టంగా తేలుతుంది. బయ్యర్లు రోడ్డున పడతారు.

కోపిష్టి వర్సెస్ సరదా కుటుంబం

    ఫారెస్ట్ గంప్ లో లాంటి వినోదాత్మకమైన, హత్తుకునే కథలో టామ్ హాంక్స్ ని చూపించే ఏ మాన్ కాల్డ్ ఒట్టో 60 ఏళ్ళ వ్యక్తి కథ. ఇతడి పేరు ఒట్టో ఆండర్సన్. ఇతను కోపిష్టి. భార్య చనిపోవడం, ఉద్యోగంలోంచి రిటైర్ అవడం, అతడిలో విరక్తిని పెంచి చచ్చిపోవాలన్న కోరికని పుట్టిస్తాయి. ఇంతలో పక్కింట్లో ఒక కుటుంబం దిగుతుంది ఇద్దరు పి‌ల్లలు, పిల్లి సహా. ఉల్లాసంగా గడిపే ఈ కుటుంబం, ఒంటరి కోపిష్టి ఒట్టోని చూసి, అతడి జీవితాన్ని తలకిందులు చేసి చూపించాలని, అందర్నీ విమర్శించే, జడ్జి చేసే అతడి దృక్పథాన్ని సవాలు చేయాలనీ నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో కోపిష్టి వర్సెస్ సరదా కుటుంబం కథ వినోదభరితంగా సాగుతుంది.
        
ఏ మాన్ కాల్డ్ ఒట్టో స్వీడిష్ మూవీ ఏ మాన్ కాల్డ్ ఓవ్ కి రీమేక్. స్వీడిష్ రచయిత ఫ్రెడ్రిక్ బ్యాక్‌మన్ రాసిన నవల వీటికి ఆధారం. టామ్ హాంక్స్ తో బాటు మరియానా ట్రెవినో, రాచెల్ కెల్లర్, మాన్యువల్ గార్సియా-రుల్ఫో, కామెరూన్ బ్రిటన్ తదితరులు నటించారు. మార్క్ ఫార్స్టర్ దర్శకత్వం వహించాడు. 50 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ 60 మిలియన్ డాలర్లకి పంపిణీ హక్కులు పొందింది.
***