రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, July 13, 2020

956 : రివ్యూ



రచన, దర్శకత్వం : మహమ్మద్ ముస్తఫా
తారాగణం: అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యీవ్, జేమ్స్ ఎలియా, నిషా సరంగ్  తదితరులు
సంగీతం: సుశిన్ శ్యాం, ఛాయాగ్రహణం: జిమ్షి ఖాలిద్
నిర్మాత: విష్ణు వేణు

***
      లయాళం నుంచి కొత్త దర్శకుడు ఇంకో లాక్ డౌన్ బాధితుడయ్యాడు. తీసిన మొదటి సినిమా విడుదల కాగానే లాక్ డౌన్ తో థియేటర్లు మూతబడ్డాయి. అనేక సినిమాల్లో నటుడుగా అనుభవం గడించిన మహమ్మద్ ముస్తఫా, దర్శకుడుగా మలయాళ సినిమాలకి ప్రాణమైన నేటివిటీని ప్రధానంగా చేసుకుని తీసిన ‘కప్పెలా’ (చిన్నచర్చి), ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ రాబడుతోంది. సృజనాత్మక స్వేచ్ఛ లేని అవే ఫార్ములా టెంప్లెట్ సినిమాలకి దూరంగా, వాస్తవంగా జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో యూత్ సినిమాలు తీస్తున్న మలయాళ దర్శకుల కోవలో, ముస్తఫా కూడా ఒక రియలిస్టిక్ ఫిక్షన్ తీశాడు. అయితే అంతర్లీనంగా ఒక తిరోగమన భావజాలాన్ని షుగర్ కోటింగ్ వేసి తెలియకుండా అందించాడు. అదేమిటో చూద్దాం...

కథ
     రాహుల్  గాంధీ ఎంపీగా ప్రకాశిస్తున్న వాయనాడ్ నియోజక వర్గం పూవరన్మాల కొండ ప్రాంతం గ్రామంలో వర్ఘీస్ (జేమ్స్ ఎలియా) వ్యవసాయం చేస్తాడు. మేరీ (నిషా సరంగ్) బట్టలు కుడుతుంది. వీళ్ళ పెద్ద కూతురు జెస్సీ (అన్నా బెన్) ఇంటర్ తో చదువాపేసి ఇంటి పట్టున వుంటుంది. చిన్న కూతురు స్కూలుకి పోతూంటుంది. కూతుళ్ళ పట్ల వర్ఘీస్ చాలా కఠినంగా  వుంటాడు. చిన్న కూతురు ఒకబ్బాయి సైకిలెక్కి స్కూలు నుంచి రావడం చూసి వెంటాడి బాగా కొడతాడు. కూతుళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఓ కన్నేసి వుంచుతాడు. ఇలాటి పరిస్థితుల్లో తల్లి కోసం ఒక కాల్ చేస్తుంది జెస్సీ. అది రాంగ్ నెంబర్ వెళ్లి ఇంకో వూళ్ళో వుం టున్న విష్ణు (రోషన్ మాథ్యీవ్) అనే ఆటో డ్రైవర్ కి చేరుతుంది. సారీ చెప్పి కట్ చేస్తుంది. అతను వూరుకోకుండా కాల్స్ చేస్తూంటాడు. మొదట వ్యతిరేకించినా క్రమంగా అతడికి దగ్గరవుతుంది. ప్రేమిస్తుంది ఫోన్లోనే.

        గ్రామంలో బెన్నీ (సుధి కొప్పా) అనే ఫ్యాన్సీ డ్రెస్సుల షాపతను జెస్సీని ప్రేమిస్తూంటాడు. తల్లి దండ్రులకి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేయించుకుంటాడు. జెస్సీ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ ముందు నిలబెడతారు ఆమె తల్లిదండ్రులు. వాళ్లకి పెట్టిన ఫలహారం, టీలు చూసి - వీళ్ళకి బతకడమే చేతకావడం లేదని బెన్నీని తీసుకుని వెళ్ళిపోతుంది అతడి తల్లి.

        ఈ విషయం ఫోన్లో విష్ణుకి చెప్తుంది జెస్సీ. అతను స్పందించడు. అటు బెన్నీ డబ్బుకంటే గుణం చూడాలని తల్లి మీద చిందులేసి మొత్తానికి తల్లిని ఒప్పిస్తాడు. జెస్సీ తల్లిదండ్రులు సంతోషించి ఎంగేజి మెంటుకి బంధువుల్ని పిలిచేందుకు వూరెళ్తారు. ఈ అవకాశంతో జెస్సీ విష్ణుకి ఫోన్ చేసి, ఇక తాము పెళ్లి చేసుకోక తప్పదని అతనుంటున్న వూరు కోళికోడ్ కి వెళ్ళిపోతుంది. ఒకర్నొకరు గుర్తు పట్టే పరిస్థితి లేక బస్టాండ్ లో కలుసుకుందా మనుకుంటారు. బస్టాండ్ లో ఎవరో గొడవ పడుతూంటే ఆ గొడవలో ఫోన్ పోగొట్టుకుంటాడు విష్ణు. ఆ ఫోన్ రోయ్ ( శ్రీనాథ్ భాసి) అనే రౌడీలా వున్న అతడికి దొరుకుతుంది. ఫోన్ చేసి అతనే విష్ణు అనుకుని వెళ్లి కలుస్తుంది జెస్సీ.

        కలిస్తే ఏం జరిగింది? రోయ్ ఏం చేశాడు? తను విష్ణు కాదని చెప్పాడా? విష్ణు ఎక్కడున్నాడు? అతడికి జెస్సీ దొరికిందా? అసలు రోయ్ ఉద్దేశమేమిటి? ఈ ఇద్దరి మధ్య జెస్సీ ఏమైంది? ఇదీ మిగతా కథ. 

నటనలు -సాంకేతికాలు
      జెస్సీగా నటించిన అన్నా బెన్ కుంబళంగి నైట్స్, హెలెన్ అనే తొలి  రెండు విజయాలతో వుంది. ప్రస్తుత పాత్రలో సగటు అమ్మాయిగా ఒక పాసివ్ పాత్ర పోషించింది. ఇలాటి కోరికలు చంపుకుని జీవించే సగటు అమ్మాయిలు నిజ జీవితంలో వుండరని కాదు, బోలెడు మంది వుంటారు. ఆ పాసివ్ జీవితాల్ని యాక్టివ్ గా మార్చి చూపించక పోతే సినిమా అవదు. ఇలాటి అమ్మాయిలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ తీయవచ్చు, సినిమా కాదు. ఈ పాత్రలో అన్నా బెన్ విష్ణు దగ్గరికి వెళ్ళిపోయే తెగువ చూపించి ప్రోగ్రెసివ్ గా కన్పిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. తనకి లభించిన, ఈ ఉన్న సగటు అమ్మాయి పాత్ర ఎలా నటించిందంటే చక్కగా నటించింది. భావాలు విస్తారంగా పలికే మొహమామెది. 

      ఆటో డ్రైవర్ విష్ణుగా నటించిన రోషన్ మాథ్యీవ్ నాటక రంగంలో కూడా పేరున్న వాడు. సాఫ్ట్ గా కన్పించే తను నెగెటివ్ పాత్రగా రివీల్ అవడం, రఫ్ గా కన్పించే శ్రీనాథ్ భాసి పాజిటివ్ పాత్రగా రివీల్ అవడమనే డైనమిక్స్ కథా పరంగా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరితో పాటు జెస్సీ తండ్రి పాత్ర జేమ్స్ ఎలియా స్త్రీ పాత్రల్ని అణిచేసే మేల్ ఇగోతో వుండడం గమనించ వచ్చు. పెళ్లి చూపుల కొచ్చే బెన్నీ పాత్రది కూడా ఇదే ధోరణి. 

        కొండలూ లోయలతో లొకేషన్స్, ఆ లొకేషన్స్ మధ్య ఇళ్ళూ బావున్నాయి. మలయాళ సినిమాల్లో నేటివ్ లొకేషన్స్  హార్ష్ కలర్స్ కాకుండా కూల్ గా డీఐ చేయడం వల్ల ఆ ఫీల్ వస్తోంది. కోళికోడ్ టౌను సినిమాటోగ్రఫీ కూడా నేటివిటీ తప్పిపోలేదు. ఇంతే సాఫ్ట్ గా నేపథ్య సంగీతం, రెండు పాటలూ వున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ బడ్జెట్ ని కంట్రోలు చేస్తూ కూడా నాణ్యతతో వుంది. 

        తెలుగు సినిమాల్లో లాగా కామెడీ మలయాళం సినిమాల్లో తప్పనిసరి కాదు. కామెడీ అంటే నాటకీయత. నాటకీయతకి దూరంగా సహజత్వంతో తీస్తున్న ఇలాటి సినిమాలు మలయాళ ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఒకప్పుడు ప్రియదర్శన్ తీసిన కామెడీ సినిమాల్లాంటివి కూడా ఇప్పుడు రావడం లేదు. కొత్త దర్శకులతో మలయాళం సినిమా ఎదుగుతోంది. 

కథాకథనాలు
     దర్శకుడు కోళికోడ్ లో ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడొక అమ్మాయి ఎవరికోసమో వెతుక్కుంటూ కన్పించింది. అడిగితే  తనూ ఒకతనూ ఫేస్బుక్ లో  పరిచయమయ్యామని, తీరా కలుసుకుందామని వస్తే అతను రాలేదనీ వాపోయింది. దీన్ని కథగా చేసి ఈ సినిమా తీశానన్నాడు దర్శకుడు. కొత్త దర్శకుడు తీసినట్టుగా మాత్రం లేదు. నటనలు గానీ, టెక్నికల్ గా గానీ అనుభవమున్నవాడు తీసినట్టుంది. మంచి సమర్ధులైన టెక్నీషియన్స్ ని నియమించుకున్నానన్నాడు. 


        అయితే ఫేస్బుక్ ప్రియుడ్ని వెతుక్కుంటూ కన్పించిన అమ్మాయితో కలిగిన సానుభూతి, సినిమా తీసేసరికి అలాటి హీరోయిన్ పాత్రని అణిచేసే ధోరణిలోనే  తయారయ్యింది. జెస్సీకి ఇంట్లోగానీ బయటగానీ భావస్వాతంత్ర్యం లేదు. బెన్నీఅనే వాడు ఏక పక్షంగా ప్రేమించుకుని పెళ్లి చూపులు పెట్టుకుంటాడు. జెస్సీకి ఇష్టమా కాదా తెలుసుకోకుండా ఆమె పేరెంట్స్ సంబంధం ఒప్పేసుకుంటారు. ఆమె తండ్రి కూతుళ్ళ పట్ల ఎంత కఠినంగా వుంటాడో చిన్న కూతుర్ని చావబాదుతున్నప్పుడు చూస్తే చాలు. వాళ్ళ మీద నిఘా కూడా పైగా. తండ్రిగా కూతుళ్ళని సంరక్షించుకోవడం వేరు, సంరక్షణ పేరుతో పురుషాధిక్యం ప్రదర్శించడం వేరు. పెళ్లి విషయంలో బెన్నీది కూడా తల్లి మీద పురుషాధిక్యమే. ఇక విష్ణు అయితే జేస్సీని వల్లో వేసుకుని అమ్మేసే దుర్మార్గం. పరాయి అమ్మాయి జేస్సీని కాపాడుతూ రోయ్ మంచి మగాడే గానీ, తను ప్రేమిస్తున్న టీచర్ అమ్మాయితో పురుషాహంకారమే. ఈమె నా ఆస్తి అన్నట్టు ఇగోయే తప్ప, ఈమె నా సమస్తం అన్న ప్రేమే వుండదు. పాఠాలు చెప్పే ఆ టీచరమ్మ పాపం అణిగిమణిగి వుంటుంది. 

        నూట పది నిమిషాల నిడివిలో ఫస్టాఫ్ ఏమీ జరగదు- విష్ణుని కలుసుకోవడానికి  జెస్సీ బస్సెక్కి కోళికోడ్ వెళ్ళడం తప్ప. సెకండాఫ్ లో రోయ్ పాత్ర ప్రవేశంతోనే అసలు కథ మొదలవుతుంది. ఈ అసలు కథ చివరి పదిహేను నిమిషాలు తప్పించి ఒక సస్పెన్సుతో నడుస్తుంది. చివరి పదిహేను నిమిషాల్లో ముగింపు కొచ్చేసరికి రోమాంటిక్ డ్రామాగా చప్పగా ముగుస్తుంది. అంటే పెద్దలు చూసిన సంబంధమే తప్ప నీకంటూ నీ ఇష్టాలతో పనిలేదన్న పురుషాధిక్య భావజాలం ఉట్టి పడే సీన్లతో ముగుస్తుంది. చివరికి ఆమె ఫ్రెండ్ కూడా ఆమెకి  భావ స్వాతంత్ర్యమివ్వని మోరల్ పోలిసింగ్ తో మాట్లాడుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి నువ్వెందుకు ఇరుక్కుంటావ్, ఇంటికెళ్ళి పొమ్మంటుంది. 

        ఇది అమాయక అమ్మాయిల్ని మోటివేట్ చేసే సినిమాయే అయితే, అమ్మాయిల స్మగ్లర్ల గురించి తనే పోలీసులకి సమాచారమిచ్చి సాటి అమ్మాయిల్ని కాపాడాలి ఒక కథానాయిక పాత్రగా. ఇది చెయ్యక, ప్రేమించిన వాడితో మోసపోయి, ఇంకేం చేయాలన్పించక ఇంటి ముఖం పట్టి, అదే బెన్నీ కన్పించి ముసిముసి నవ్వులు నవ్వితే, పెళ్ళికి తలూపడం తిరోగమనమే తప్ప అభ్యుదయం కాదు.

సికిందర్
rev. at telugurajyam.com