రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, July 25, 2017

సాంకేతికం : republishing the article to clear some misconceptions among the new comers in di



          డీఐ విధానంలో కలరిస్టు  పని చిత్ర లేఖనమే. చిత్రకారుడు కుంచెతో రంగు లద్దినట్టు కలరిస్టు సాఫ్ట్ వేర్ తో మెరుగులు దిద్దుతాడు. వెలుగు నీడల్ని సరిచేస్తాడు. ఆలోచన మెరిస్తే, తెలుపు నలుపు దృశ్యాల్లో చొక్కా గుండీలకి రంగు లేసి చమత్కారం కూడా చేస్తాడు. కెమెరామాన్ దృశ్యమానం చేస్తే,  కలరిస్టు కలంకారీ తనం ప్రదర్శిస్తాడు. ఉపయోగించే సాఫ్ట్ వేర్ బేస్ లైట్ కావొచ్చు, లస్టర్ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు  -వర్క్ స్టేషన్ ఏదైనా విన్యాసాలోకటే.

          కాకపోతే డీటీఎస్ నిపుణుల్లాగే  డిఐ కలరిస్టులు  ఫీల్డు మొత్తం మీద అతికొద్ది మందే వుంటారు. ఫీల్డు అవసరాలకి వీళ్లి సరిపోతారు. టాలీవుడ్ లో వున్న అలాటి అతికొద్ది మంది కలరిస్టుల్లో  సి.వి. రావు ఒకరు. కలరిస్టుకి పని ఒత్తిడి చాలా ఎక్కువ. అలాంటప్పుడు డీఐ సూట్లు పెంచుకుని, ఎక్కువ మంది కలరిస్టుల్ని నియమించుకోవచ్చు కదా అన్పించ వచ్చు. కా నీ అది కాదు సమస్య. ఎడాపెడా సినిమాలు తమ మీద వచ్చి పడిపోవడం వల్ల కాదు పని భారం పెరిగి ఒత్తిడి.. సీవీ రావు మాటల్లోనే చెప్పుకుంటే- సినిమాల్ని రిలీజ్ ఘడియ వరకూ ఎడిటింగ్ చేస్తూ ఆక్షరి నిమిషాల్లో డీఐ కి పంపిస్తూంటారు. దీంతో ఒత్తిడి పెరిగి నాణ్యతతో కూడా రాజీ పడాల్సి వస్తోంది..’  ఇదీ సమస్య. ఆఖరి నిమిషాల్లో ఆదరాబాదరా అవసరాలు తీర్చే సమస్య!


      ‘మగధీర’ ’ క్లయిమాక్స్ దృశ్యాలకి ఈయన అలాటి డెడ్ లైన్ ( రెండు రోజులు మాత్రమే గడువు!) ఒత్తిడినే ఎదుర్కోవాల్సి  వచ్చింది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో డీఐ  అక్కడక్కడా పాలిపోయినట్టు కన్పించడానికి కారణం ఇలాటి పని ఒత్తిడే. తెలుగు సినిమాలపై వెబ్ సైట్లలో వచ్చే ఇంగ్లీషు రివ్యూలలో, డీఐ బాగా లేదని రాస్తూంటారు. ఎందుకు బాగా రాలేదో కారణాలు తెలుసుకుని రాస్తే, కలరిస్టుల  నైపుణ్యం మీద అనుమానాలు తొలగి పోయే అవకాశముంటుందని అబిప్రాయపడ్డారు తను. 


          డీఐ అంటేనే కెమెరామాన్ చిత్రీకరించు కొచ్చిన  బొమ్మల్ని రేణువులుగా విడగొట్టి, శుద్ధి చేసి, తిరిగి ఫిలిం మీదికి ఎక్కించడం. ఈ ఫిలిం ట్రీట్ మెంట్, డీ-స్పాటింగ్, డర్ట్ ఫిక్సింగ్, కలర్- లైటింగ్ కరెక్షన్ ప్రక్రియల్లో కలరిస్టు సూక్ష్మ గ్రాహి అయివుంటాడు. అతడి ఏకాగ్రతకి పూర్తి 30 రోజుల గడువూ ఇవ్వకపోతే, క్వాలిటీ రాదన్నారు సీవీ రావు.


        ఓకే, ఇక సాంకేతికాల్లోకి వెళితే, ఆయన చెప్పిన ప్రకారం- సాంప్రదాయ గ్రేడింగ్ లో ఎనలైజర్ తో బొమ్మని మాత్రమే సరి చేయగల్గుతారు. స్కిన్ కలర్ ని బేస్ చేసుకుని, దృశ్యంలో ప్రధాన బొమ్మ వరకూ మాత్రమే సరిదిద్ద గలుగుతారు. దీన్ని ప్రైమరీ కలర్ కరెక్షన్ అంటారు. ఈ బొమ్మ మినహా మరే దృశ్య భాగాన్నీ ఎనలైజర్ తో దిద్దడం  కుదరదు. అంటే- దృశ్యంలో పొద్దు తిరుగుడు పువ్వు ప్రధాన బొమ్మగా వుంటే, దాని పసుపు వర్ణం ( అంటే స్కిన్ కలర్)  ని ఆధారం చేసుకుని కాడనీ, తొడిమల్నీ, ఆకుపచ్చ రంగుతో ఎంతయినా ఆకర్షణీయం చేయొచ్చు. కానీ పైన ఆకాశాన్నీ, కింద నేలనీ మాత్రం ఏమీ చేయలేరు. ఈ పువ్వు స్థానంలో మనిషి రూపమే  ప్రధాన బొమ్మగా వున్నా కూడా, ఆ  స్కిన్ కలర్ ని బేస్ చేసుకుని, ఆ రూపం వరకూ మాత్రమే సింగా రించగల్గుతారు. 

        డీఐ తో అలా కాదు- దృశ్యం లో ప్రధాన బొమ్మతో బాటు, నేపధ్యంలో ఇంకా ఏవైనా విశేషాలుంటే వాటన్నిటినీ రంగులతో, వెలుగు నీడలతో సరి దిద్దెయ్యొచ్చు. అంటే పొద్దు తిరుగుడు పువ్వు తో బాటు పైన భూమ్యాకాశాల్నీ, చుట్టూ పశుపక్ష్యాదుల్నీ, సమస్త విశేషాల్నీ కొట్టొచ్చేట్టు తీర్చిదిద్ద వచ్చన్న మాట. దీన్ని సెకండరీ కలర్ కరెక్షన్ అంటారు. పాత గ్రేడింగ్ పద్ధతి ప్రైమరీ కే పరిమితమైతే, డీఐ వచ్చేసి సెకండరీకి విస్తరించి, మొత్తం ఫ్రేమునీ కళకళ లాడేట్టు చేస్తుంది.ఇదెలా జరుగుతుందో వీడియో స్క్రీన్ మీద ఉత్సాహంగా చేసి చూపించారు.


     బేస్ లైట్ ఈయన అభిమాన వర్క్ స్టేషన్. దాని ముందు ఆత్మవిశ్వాసంతో గర్వంగా కూర్చుని పని చేస్తారు. ఇందుకోసం లండన్ లో బేస్ లైట్ కంపెనీ ఇచ్చిన ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. 2005 లో ఒక నార్వేజియన్ ఫిలిం కిల్ బుల్ జో’ ( క్వెంటిన్ టరాంటినో తీసిన కిల్ బిల్ కి పేరడీ) తను డీఐ చేసిన మొదటి సినిమా. అయితే తెలుగులో బడ్జెట్ పరిమితులుండే  చిన్నా చితకా సినిమాలకి డీఐ చేసుకునే అదృష్టం ఉండదా అని అడిగితే- దీనికిలా  చెప్పారు :  ‘వాళ్ళు ముడి ఫిలిం కి పెట్టే లక్షల రూపాయల్ని డీ ఐ కి కేటాయించుకుని, డిజిటల్లో చిత్రీకరణ జరుపు కోవచ్చు. చిన్న సినిమాలకి కూడా డీఐ అదృష్టం వుంటుంది. ఎలాగూ ఆ డిజిటల్ అవుట్ పుట్ ని ఫిలిం మీద ప్రింట్లు వేయించుకునే సదుపాయం వుంది కదా, ఇలా చేసుకుంటే భారీ సినిమాల డిఐ హంగులు చిన్న సినిమాలకీ సాధ్యమే!


       చిత్తూరు జిల్లా దొడ్డి పల్లి కి చెందిన సీవీ రావు ( చెరపల్లి వెంకటేశ్వర రావు) ఆర్ధిక శాస్త్రంలో పీ హెచ్ డీ చేసి, మల్టీ మీడియాలో మాస్టర్స్ డిప్లొమా పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఓ మల్టీ మీడియా సంస్థలో  పని చేస్తున్నప్పుడు, 2005 లో  కె. బసిరెడ్డి నెలకొల్పిన డిజిక్వెస్ట్లాబ్ లో అవకాశం వచ్చింది. అప్పట్నించీ మగధీర’, ‘కిక్’, ‘స్టాలిన్’, ‘ప్రస్థానం’, ‘సాధ్యం’, ‘తకిట తకిట’, ‘కాఫీబార్వంటి తెలుగు సినిమాలతో బాటు, 9 ప్రాంతీయ భాషల్లో, మూడు అంతర్జాతీయ భాషల్లో మొత్తం 90 పై చిలుకు సినిమాలకి కలరిస్టుగా సేవలందించారు.

        షూటింగు లకి ముందు ఛాయాగ్రాహకులకి ఎక్స్ పోజర్ లెవెల్స్ పైన మాత్రమే  సూచన లిచ్చే తనకి, సెట్స్ కి వెళ్ళే అలవాటు లేదన్నారు.


సికిందర్ (అక్టోబర్ 2010, ఆంధ్రజ్యోతి- సినిమా టెక్శీర్షిక)