రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 12, 2017

544 : రివ్యూ!



ర్శత్వం: అజయ్ ఆండ్రూస్
తారాగ
ణం: మంచు నోజ్, అనీషా అంబ్రోస్, పోసాని, అజయ్ ఆండ్రూస్, జెన్నీఫర్, సుహాసిని,  మిలింద్ గునాజీ దితరులు
స్క్రీన్ ప్లే : గోపీమోహన్, ఛాయాగ్రణం: వి.కె. రామరాజు, సంగీతం :  శివ నందిగామ
బ్యానర్ : పద్మ ఫిలింస్ ఇండియా ప్రై.లి., ఎన్‌..సి
నిర్మాతలు: ఎస్‌.ఎన్‌.రెడ్డి, క్ష్మీకాంత్
విడుదల : నవంబర్ 10, 2017
***
         
2010  లో ‘బిందాస్’  అనే వొక విజయం తర్వాత ఆ సంవత్సరంలోని  చివరి రెండంకెలు హైలైట్ చేస్తూ 10 సినిమాలతో  దెబ్బతిన్న మంచు మనోజ్, ఈ మూస మాస్ నుంచి కాస్త తప్పుకుని ఒక మంచి ప్రయతం చేద్దామనుకున్నట్టుంది. మంచి ప్రయత్నం  కోసం దేశమో, రాష్ట్రమో,  ఇంకేదో సామాజికమో ఎత్తుకుంటే ఎలివేట్ అవుతాననుకుని, శ్రీలంక శరణార్ధుల సమస్య వైపు మొగ్గాడు. మహేష్ బాబు వెళ్లి రాజస్థాన్ నీటి సమస్య తీర్చినా (ఖలేజా – కలేజా అంటే సరిపోతుంది), రవితేజ వెళ్లి బీహార్ లో ఇంకేదో వాళ్ళ గొడవ  ఎత్తుకున్నా (కిక్ -2) సాధ్యం కాని మంచి ప్రయత్నం తనవల్ల అవుతుందనుకుని మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ కి శ్రీకారం చుట్టాడు. గూఢచారి ఏ దేశమో వెళ్లి మన దేశం కోసం గూడుపుఠానీ  నడిపినా  అదొక అందం, బాక్సాఫీసుకి మందం. గూఢచారి కానివాడు పరదేశంలో మనది కాని స్థానిక సమస్యలు తీర్చాలనుకుంటే, బాక్సాఫీసుకి ఆ ఇన్ పుట్ అర్ధంగాక  అవుట్ పుట్ ఇస్తుందా? ఇది చూద్దాం...

 కథ 
      సూర్య (మనోజ్) ఇండియాలో వొక శ్రీలంక శరణార్ధ సంతతి. యూనివర్శిటీలో చదువుతూంటాడు. ఒక మంత్రి కొడుకు, వాడి స్నేహితులూ కలిసి యూనివర్సిటీలో ముగ్గురు  విద్యార్ధినుల మీద అత్యాచారం చేయబోతే ఇద్దరు విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక విద్యార్థిని పారిపోతూంటే ఆమెని కూడా చంపి ఆత్మహత్యగా  చిత్రిస్తారు. ఈ కేసుని వ్యక్తిగత సమస్యలతో చేసుకున్న ఆత్మహత్యలుగా మార్చెయ్యడంతో సూర్య తిరగబడతాడు. చనిపోయిన విద్యార్ధినుల్లో  ఇద్దరు శ్రీలంక శరణార్ధులుంటారు. సూర్య ఉద్యమించడంతో విద్యార్ధులంతా మద్దతుగా ఆందోళనకి దిగుతారు. దీంతో సూర్యని డ్రగ్ కేసులో ఇరికించి హింసిస్తారు పోలీసులు. ఒక మంచి కానిస్టేబుల్ (పోసాని) చిత్రహింసల్ని అడ్డుకుని సూర్య గురించి అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు సూర్య శ్రీలంకలో తమిళుల మీద జరిగిన దమనకాండ చెప్పుకొస్తాడు. 

          శ్రీలంకలో ఏ హక్కులూ లేక అల్లాడుతున్న  తమిళులు తిరగబడితే కాల్చి చంపుతూంటాయి ప్రభుత్వ బలగాలు. దీంతో పీటర్  (మనోజ్ -2) ఈలం పేరుతో తీవ్రవాద దళాన్ని నిర్మించి తమిళులకి ప్రత్యక దేశంకోసం అంతర్యుద్ధానికి తెరతీస్తాడు. పోరు తీవ్రమవుతుంది.  తట్టుకోలేక ఇండియాకి పారిపోతారు ఓ పదకొండుగురు తమిళులు. వాళ్లకి విక్టర్ (అజయ్ నూతక్కి) నాయకత్వం వహిస్తాడు. సముద్ర మార్గంలో బయల్దేరిన పడవ ప్రయాణం అనేక ఒడిదుడుకుల పాలవుతుంది. ఆ పడవలో ఓ పసి పిల్లాడు కూడా వుంటాడు. పది రోజులపైగా సాగే  ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయన్నది, చివరికి ఎందరు మిగిలి తమిళనాడు చేరారన్నది మిగతా కథ.
ఎలావుంది కథ 


        కీ.శే. నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ని స్మరించుకునేలా వుంది. ఇటు కథ కాకుండా, అటు డాక్యూడ్రామా కాకుండా ఏదోగా వుంది. 2013 లో ‘రావణ దేశం’ గా తమిళంలో తీసిన దీన్ని ఇవ్వాళ తెలుగులోకి తెచ్చి పొరపాటు చేశారులా వుంది. ఎంతో రీసెర్చి చేసిన దర్శకుడు  అజయ్ ఆ రీసెర్చి సారాన్ని  సినిమా కథగా మల్చడంలో విఫలమయ్యాడు. 2009 లో నిజంగా జరిగిన తమిళ శరణార్ధుల పలాయనం మీద ఈ కథ చేయాలనుకుంటే అది సినిమాకి పనికి రాదనే చెప్పొచ్చు. ఒక సందర్భంలో శివాజీ గణేశన్ - ఆర్టు సినిమా అంటే పడవ పోతూ వుంటుంది, పోతూనే వుంటుంది, రెండు గంటలదాకా ఇంకా పోతూనే వుంటుంది...కానీ ఏమీ జరగదు! – అని జోకేసినట్టు తయారయ్యింది ఈ కథ. 
      
          ఏది కథవుతుంది? పడవలో శరణార్ధుల కష్టాలే చెప్పాలనుకుంటే అది సర్వైవల్ జానర్ గాథవుతుంది, కథవదు. ఎందుకంటే  విషాదాంతం కాబట్టి. విజయాలు చూపిస్తేనే కథలవుతాయి. గాథ అవాలన్నా కూడా, మొదట్నుంచీ గాథే చెప్పాలి. సగంవరకూ అంతర్యుద్ధంతో యాక్షన్ జానర్ లో వైరి వర్గాల మధ్య ‘ఆర్గ్యుమెంట్’ సహిత కథ చెబుతూ, మళ్ళీ తర్వాత సగం సర్వైవల్ జానర్ లో ఉత్త ‘స్టేట్ మెంట్’ మాత్రపు  పడవ ప్రయాణ గాథ చెప్పడం రసభంగం.

          కథకి  బేస్ ఆర్గ్యుమెంట్. గాథకి బేస్ స్టేట్ మెంట్. కమర్షియల్ సినిమాకి ఉస్సూరన్పించే స్టేట్ మెంట్లిచ్చే గాథలు పనికిరావు, వేడివేడి ఆర్గ్యుమెంట్స్ సహిత కథలే  కావాలి. ఐనా పడవలో బయల్దేరిన శరణార్ధుల కష్టాలెవరిక్కావాలి. ఒకటీ అరా జరిగే ఈ ప్రమాదాలే శరణార్ధుల ప్రధాన సమస్య కాదుగా? శ్రీలంక శరణార్ధుల అసలు సమస్య స్వదేశంలో పెనం మీద మలమల మాడి, పారిపోయి తమిళనాడు  వస్తే అక్కడ పొయ్యిలోపడి -  వెరసి -  ఏ దేశం మాది? అన్న ప్రశ్నలేవనెత్తుతూ చెప్పాల్సిన కథ. 
ఎవరెలా చేశారు 
      మనోజ్ త్రిపాత్రాభినయం చేశాడు – ఒకటి స్టూడెంట్, రెండు తీవ్రవాది, మూడు స్థూలకాయం. తను షేపులోకి రాకపోతే యూత్ అప్పీల్ కష్టమవుతుందని  గుర్తిస్తే బావుంటుందేమో.  తెరమీద తనని చూస్తూంటే పాత్ర మీద కన్నా స్థూల కాయం మీదికే బాగా దృష్టిపోయేలా వుంది. రెండు పాత్రల్నీ రౌద్రంగా నటించాడు, హింసాత్మక దృశ్యాలతో. ఉక్రోషంతో డైలాగులు పలికాడు. తీవ్రవాద పాత్ర ఎల్టీ టీఈ అధిపతి  వేలుపిళ్ళై ప్రభాకరనే అని వేరే చెప్పనవసరంలేదు. మొదటి తీవ్రవాద పాత్రకి ఫస్టాఫ్ లో పోరాట దృశ్యాలతో నిడివి ఎక్కువున్నా, రెండో స్టూడెంట్ పాత్ర – ఇటు తీవ్రవాద పాత్రకీ, అటు సెకండాఫ్  పడవ ప్రయాణానికీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్తూ రావడం వల్ల  నిడివి తక్కువ. ఫస్టాఫ్ పీటర్ కథ సెకండాఫ్ కొచ్చేసరికి విక్టర్ గాథగా సాగేసరికి,  మనోజ్ పాత్రల పంపకం కుదర్లేదు.

          పోసానిది అదే నటన. టీవీ రిపోర్టర్ పాత్రలో  అనీషా అంబ్రోస్ ది  సంక్షిప్త పాత్ర. విక్టర్  గా నటించిన దర్శకుడు అజయ్ కి సింహభాగం సినిమా దక్కింది. ఇది పూర్తిగా శోకపూరిత పాత్ర పడవ ప్రయాణంలో. 

          పడవలో ఇంకో పది ఆడా మగా పడుచు పాత్రలు, ముసలి పాత్రలూ, వొక పసి పాత్రా వుంటాయి. ఈ పాసిపాత్రే పెరిగి స్టూడెంట్ పాత్ర అయి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. పడవలో ఈ పాత్రలన్నిటితో విషాదమయ వాతావరణమే వుంటుంది. దుష్ట మంత్రిగా మిలింద్ గునాజీ చాలాకాలం తర్వాత తెర మీదికొస్తే, మహిళా హక్కుల సంఘం చీఫ్ గా సుహాసిని. 

          ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ దృశ్యాలు. శ్రీలంక సైన్యానికీ, తమిళ పులులకీ మధ్య జరిగే యుద్ధ దృశ్యాలు  అత్యంత శక్తివంతంగా, అంతే వాస్తవికంగానూ, ప్రభావశీలంగానూ  వున్నాయి. ఇవన్నీ వొరిజినల్ ‘రావణ దేశం’ లోనివే. అక్కడక్కడా మనోజ్ పాల్గొన్న యాక్షన్ దృశ్యాల్ని మాత్రం రీషూట్ చేశారు. అవుట్ డోర్ లొకేషన్స్ శ్రీలంక నేటివిటీతోనే వున్నాయి. ఇక పడవ ప్రయాణపు సెకండాఫ్ ఎపిసోడ్ అంతా యధాతధంగా వొరిజినలే.  ఈ ఎపిసోడ్ చివర్లో తుఫాను వచ్చే దృశ్యాల సీజీ బీభత్సభరితంగా వుంది. కెమెరా మాన్
వి.కె. రామరాజు సముద్రంలో రిస్కు తీసుకుని చిత్రీకరణ చేశాడు. నేపధ్యసంగీతం ఫర్వాలేదు. 
 చివరికేమిటి 
     సగాలు రెండూ ఒకటైతే జగం జగమే గానీ,  ఇలాటి సగాలు ఒకటైతే కాదు. వసూళ్ళ పిల్లలు పుట్టి పారాడవు. ఫిఫ్టీ –ఫిఫ్టీ ...నీదో సగం, నాదో సగం  అని హీరో – దర్శకుడు ఫస్టాఫ్, సెకండాఫ్ లు పాడుకుని పంచుకుంటే రెండు సినిమాలవుతాయి, ఒకటి కాదు. ఒకటి కథ, రెండోది గాథ. ఇవి రెండూ ఆడా మగలైతే అలాగే కలుసుకుని డ్యూయెట్ పాడుకోవచ్చు, రెండూ మగలై ఆడదాని కోసం వెతుక్కుంటున్నాయి. వాటిని మాయం చేశాడు కథకుడు. 

          ఇందుకే ముందుగా  తట్టిన ఐడియాలో  స్ట్రక్చర్ చూసుకోవాలనేది. చూసుకోకపోతే కథ కాకుండా కొంపలు ముంచే గాథ తయారవుతుంది - లేదా ఇలా సగం కథ, సగం గాథ మాయలేడిలా ముస్తాబవుతుంది. ఇలాటి దుష్టసమాసం ఇంతవరకూ ఏ సినిమాలోనూ లేదు బహుశా. 

          ఈ కథ + గాథకి కవరింగ్ లెటర్ లా ఇంకో కథ వుంది - స్టూడెంట్ కథ. ఈ స్టూడెంట్ కథకే స్ట్రక్చర్ వుంది. విద్యార్ధినుల మరణాలపై ఉద్యమించడం,  అరెస్టయి ఎన్ కౌంటర్ ని ఎదుర్కోవడం, తప్పించుకుని విజయం సాధించడం. ఇదంతా సాగుతున్నప్పుడు అతను మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో శ్రీలంక శరణార్ధుల గురించి చెప్పుకొస్తూంటాడు – ఒక పీటర్ కథగా,  ఇంకో విక్టర్ గాథగా. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ కే స్ట్రక్చర్ లేకుండా పోయి ఏం చెప్తున్నాడో అర్ధంగాని గందరగోళానికి దారితీసింది. 

          ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభించిన శ్రీలంక శరణార్ధుల కథ కథలాగే కొనసాగాలంటే, ఇంటర్వెల్ కల్లా లంక దళాలకి తట్టుకోలేక శరణార్ధులు తమిళనాడు చేరుకోవాలి. సెకండాఫ్ తమిళనాడులో ఆ శరణార్ధులు దేశంకాని దేశపు వాళ్ళుగా ఎదుర్కొనే  వివక్ష, అణిచివేతా వగైరాలతో కూడిన సంఘర్షణ చూపించి, ఈ సమస్యకి పరిష్కారం చెబుతూ ముగించాలి. అంతేగానీ శ్రీలంకలో వాళ్ళ  దైన్యం చూపించి,  పడవలో పడేసి ప్రయాణపు కష్టాలు చూపించి ముగించేస్తే అది పూర్తిగా చెప్పడం కాదు. తమిళనాడులో వాళ్ళ పరిస్థితిని కూడా చూపిస్తేనే  ప్రేక్షకులకి పూర్తి సమాచారమిచ్చి అవగాహన కల్గించినట్టు, విషయం పరిపూర్ణంగా చెప్పినట్టు. అప్పుడే ఈ  మొత్తం అర్ధవంతమైన కథ అన్పించుకుంటుంది. 

          కాందీశీకుడి రూపంలో తమిళనాడులో స్టూడెంట్ పడ్డ బాధలు చూపించాంగా అంటే, అది చూపించడం కాదు, సినిమా వీక్షణానుభవాన్ని చెరచడం. పోరాడే స్టూడెంట్ తో బాటు చనిపోయిన ఇద్దరు శరణార్ధ విద్యార్థినులది కల్పిత, కృత్రిమ, రొటీన్ సినిమాటిక్ ఫార్ములా  కథ. మిగతా కథో గాథో రియలిస్టిక్ గా చూపించుకొస్తూ,  స్టూడెంట్ కథని మూస ఫార్ములాగా ఎలా చూపిస్తారు. ఇక్కడ కావాల్సింది వీళ్ళ కథ కాదు, పడవెక్కి పారిపోయి వచ్చిన ఆ పదకొండు మంది శరణార్ధుల రియలిస్టిక్ కథ. కనుక ఈ స్టూడెంట్ కథ అనే కవరింగ్ లెటర్ అనవసరమై పోతుంది. కథ చెప్పడానికి అతి టాలెంట్  ప్రదర్శించుకోనక్కర్లేదు, టాలెంట్ సరిపోతుంది.

          సారాంశం? పడవ ప్రయాణంలో గల్లంతైన నిజ సంఘటన పై చేసిన రీసెర్చి కేవలం అంతవరకే డాక్యుమెంటరీకి పనికి వస్తుంది. దానికి అంతర్యుద్ధపు కథ, స్టూడెంట్ కథా అని  జోడించడానికి పనికిరాదు. 

          ఈ మొత్తానికి కలిపి చివర్లో స్టూడెంట్ ఇచ్చే స్పీచికి  కూడా అర్ధం లేదు. రండి, మనమంతా కలిసి జీవిద్దాం, వివక్ష వద్దు....లాంటి మాటలు ఎక్కడైనా పీడితుడు చెప్తే ఎవరైనా వింటారా, లేక పీడించే వర్గం నుంచి ఎవడైనా ఇటు స్టూడెంట్ వైపు వచ్చి కలుపుకుని అంటే, వినబుల్ గానూ చూడబుల్ గానూ వుంటుందా?

-సికిందర్
https://www.cinemabazaar.in