రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, అక్టోబర్ 2021, బుధవారం

1067 : ఫ్లాష్ బ్యాక్ సంగతులు


 "Don't tell the reader about the past until he or she cares about the future. A flashback should not stop a movie just to provide exposition. A flashback should move the story forward”  – David Trottier, The Walt Disney Company screenplay developer

    కొం పొలం కథ ఫ్లాష్ బ్యాక్ గా ప్రారంభించడంలో గల దోషాన్ని తెలియజేస్తూ  దీని మీద వివరంగా రాయమన్నారు ఒక దర్శకుడు. అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో రాస్తున్నాం. కొండపొలం కథ హీరో సివిల్ సర్వీసుల ఇంటర్వ్యూకి హాజరవడంతో ప్రారంభమవుతుంది. ఇంటర్వూలో అతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టు కోరుకోవడానికి కారణం చెప్తాడు. తను గొర్రెల కాపరి కొడుకు, నల్లమల అడవుల్లో స్వీయ శిక్షణ పొందాడు ... ఇలా చెప్పుకుపోతూంటే అధికారికి నమ్మకం కలగదు. తన కథ రెండు గంటలు చెప్తేగానీ అర్ధంగాదని అంటాడు హీరో... ఆ కథ ఫ్లాష్ బ్యాకుగా ప్రారంభమవుతుంది.

        లా ప్రారంభించడంతో హీరో ఎవరో, అతడి జీవితమేమిటో ముందే కథ తెలిసిపోతోంది కదాని దర్శకుడన్నారు. ఫ్లాష్ బ్యాక్ కాకుండా లీనియర్ కథగా చేసి వుంటే పాత్ర, దాని కథ, గోల్ క్రమానుగత సస్పెన్స్ తో చూసేలా చేసేవన్నారు. నిజమే, సినిమాలో చూపించిన విధంగా, అతను ఫారెస్ట్ ఆఫీసర్ కాబోతున్నాడని ముందే చెప్పేసి, దాని తాలూకు ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించడంతో, అన్నీ తెలిసిపోతూ పేలవంగానే ప్రారంభమయింది కథ. కథ ఎత్తుగడ ఆసక్తి పుట్టించేలా వుండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించారు.

        ఈ ఫ్లాష్ బ్యాక్ సినిమా చివరంటా సాగి ఇంటర్వూ దగ్గర కొచ్చి ముగుస్తుంది. ఇలా తన కథ చెప్పుకొచ్చిన హీరో, చివరి వాక్యాలు చెప్పి, ఫారెస్ట్ ఆఫీసర్ గా పోస్టులో చేరిపోయి  శుభం వేస్తాడు. ఫారెస్ట్ ఆఫీసరవుతాడని ప్రారంభంలోనే తెలిసిపోయింది. తెలిసిపోయిన దాన్నే చివర్లో చూపించడం దేనికి? ఇందులో డైనమిక్స్ ఏమున్నాయి?

        వాస్తవానికి ఈ కథ అడవుల్లో ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొనే గొర్రెల పెంపకం దార్ల కథ. తన తండ్రి పడుతున్న ఈ కష్టాల్ని తండ్రి వెంట వుంటూ కళ్ళారా చూసిన హీరో, ఈ కష్టాల్ని ఎలా తీర్చాలని గాక, స్మగ్లర్ల బారి నుంచి అడవుల్ని కాపాడాలన్న వేరే ఆశయం ఎత్తుకుని ఫారెస్ట్ ఆఫీసరవుతాడు!

        అంటే స్టోరీ కాన్సెప్ట్ డిమాండ్ చేస్తున్న ఆశయం ఒకటైతే హీరో చేసిందొకటి. ఇలా స్టోరీ అయిడియానే ఫ్రాక్చరైంది. కథ డిమాండ్ చేస్తున్న ప్రధాన ఆశయం గొర్రెల పెంపకందార్ల సమస్యల సంబంధించిన పరిష్కారం జరగనే లేదు. ఇది దారి తప్పిన ముగింపు. కథగా కూడా ఇది సమగ్రంగా లేదు. నల్లమల్ల అడవులంటే కేవలం ఒక పులి, గొర్రెల పెంపకందార్లు, స్మగ్లర్లు మాత్రమే అన్నట్టు చూపించారు. కానీ ఇంకా గిరిజనులు కూడా వుండాలి, ఇతర వన్యప్రాణులూ, మరీ ముఖ్యంగా ఫారెస్ట్ శాఖ సిబ్బందీ వుండాలి అడవన్నాక. వన్య ప్రాణుల్ని, ఫారెస్టు సిబ్బందినీ  అలా వుంచుదాం. అన్నీ బాధలు పడుతున్న గొర్రెల పెంపకం దార్లకి ఆసరా ఇచ్చే విధంగా గిరిజన పాత్రలు లేకపోవడం ఈ కథ రీసెర్చి రాహిత్యాన్ని తెలుపుతోంది.

        ఇక్కడొక సమాచారం చూద్దాం :  "గొర్రెల మేకల పెంపకం దార్లను నల్లమల అడవుల్లో మేపుకు అనుమతి ఇవ్వాలి. గిద్దలూరు నియోజకవర్గంలో 2లక్షల గొర్రెలు మేకలు ఉన్నాయి. ఈ వృత్తిని నమ్ముకొని గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బెస్తవారి పేట, కంభం, అర్ధవీడు మండలాల్లో 5వేల కుటుంబాలు జీవనాధారం సాగిస్తున్నారు. వేసవిలో మేత లేక, నీరు లేక ఇతర ప్రాంతాలకు, అడవులకు వలసలు వెళ్తున్నారు. అక్కడ అనేక సమస్యలకు గురవుతున్నారు. గ్రామాల్లో నీటి సమస్యకి, మేత సమస్యకి ప్రభుత్వం పరిష్కారం చూపగలిగితే వలసలు ఆగుతాయి.

        "తొలకరి లో వర్షాలు పడితే నల్లమల అడవుల్లో పచ్చిక పెరుగుతుంది. అక్కడ మేపుకునే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అడవిలో మేతకు వెళ్తే  అటవీ అధికారులు గొర్రెల కాపరులను కొడుతూ, వారి దగ్గర ఆహార పదార్థాలను, పొట్టేళ్ళను లాక్కొని తీసుకెళుతున్నారు....

        "ప్రతి గ్రామానికి వేసవిలో గొర్రెల మేకల పెంపకం దార్లకు నీటి తొట్లను, అలాగే గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో కనీసం 10 ఎకరాల పొలాన్ని కల్పించాలి. గొర్రెల పెంపకం దార్లు అంటే సమాజానికి బలమైన ఆహారం ఇచ్చే వారు. అటువంటి వారికి ప్రభుత్వం తగిన ప్రాతినిధ్యం కల్పించాలే తప్ప వారిని హింసకు గురి చేయడం సరికాదు..."

        మన హీరోకి ఈ సమస్యలు, పరిష్కారాలు కన్పించ లేదేమో. కళ్ళముందున్న కుటుంబ సంరక్షణ వదిలేసి అటవీ సంరక్షణకి కంకణ బద్ధుడై అధికారి అయిపోయాడు! ఇలా ఐడియా దశలోనే ఈ కథ విఫలమైన దృష్టాంతమిది. ఐడియాని రీసెర్చి చేసి, ఐడియా దశలోనే అందులో కథ వుందా, గాథ వుందా, లేక ఈ సినిమాలో వున్నట్టు వివిధ పాయింట్లతో ఎపిసోడిక్- డాక్యుమెంటరీ కథనముందా పరిశీలించుకోక పోవడం దెబ్బ కొట్టింది.

2.
        సరే, ఫ్లాష్ బ్యాక్కొద్దాం. ఈ సినిమాని పూర్తిగా ఫ్లాష్ బ్యాకుగానే చూస్తాం. ఫ్లాష్ బ్యాక్ అనేది కథ అవదు. కథంటే పాత్ర ప్రెజెంట్ టైమ్ ని చూపించేది. ఫ్లాష్ బ్యాక్ పాస్ట్ టైమ్ అవుతుంది. హీరో ఇంటర్వ్యూ సీన్లు ప్రెజెంట్ టైమే కాబట్టి ఇదే కథ. ఫ్లాష్ బ్యాక్ అనేది పాత్ర పాస్ట్ టైమ్ లో వెల్లడయ్యే సమాచారం. లేదా జ్ఞాపకం. అంటే ప్రెజెంట్ టైమ్ లో చెప్తున్న కథకి అవసరమైన సమాచారాన్ని అందించే రీసోర్స్ మాత్రమేనాన్న మాట ఫ్లాష్ బ్యాక్.

        ఫ్లాష్ బ్యాకులు రెండు రకాలు. అప్పుడప్పుడు సందర్భానుసారం వచ్చే మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు, ఒకే ఫుల్ లెన్త్ తీసుకునే లాంగ్ ఫ్లాష్ బ్యాకులు. మొదటిది అకేషనల్, రెండోది స్ట్రక్చరల్. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులకి స్ట్రక్చర్ వుండదు. అవసరం లేదు కూడా. అవి బిట్లు బి‌ట్లుగా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇమిడి వుంటాయి గనుక. లాంగ్ ఫ్లాష్ బ్యాక్ తానే ఒక స్ట్రక్చరై వుంటుంది. ఎందుకంటే మొదలు, చివర బెత్తెడు కథే వుంటుంది కాబట్టి, ఓ పూర్తి నిడివి కథంత స్పేస్ ని లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఆక్రమిస్తుంది కాబట్టి దానికి కథ కుండే స్ట్రక్చర్ అత్యవసరం. అంటే కథకి ఎలాగైతే బిగినింగ్- మిడిల్- ఎండ్ లతో కూడిన త్రీయాక్ట్ స్ట్రక్చర్, ప్లస్ ఒకే కాన్ఫ్లిక్ట్ వుంటుందో అలాగన్న మాట. కొండ పొలం లాంగ్ ఫ్లాష్ బ్యాక్ కి ఇలా స్ట్రక్చరే లేదు. ఒకే కాన్ఫ్లిక్ట్  లేదు. వివిధ పాయింట్లతో (కష్టాలతో) కూడిన వివిధ కాన్ఫ్లిక్టులు వచ్చిపోతూంటాయి -  స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటరీ- ఎపిసోడిక్ కథనం లాగా. ఇలా ఫ్లాపయిన టైగర్ హరిశ్చంద్ర’, ఆటోనగర్ సూర్య లాంటివి లాగా. ఒకే సెంట్రల్ కాన్ఫ్లిక్ట్, దాంతో సంఘర్షణా అనే కథా లక్షణాన్ని కోల్పోతూ. 

3.
        ఇలా లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ముందు, కొండపొలం లో వున్నట్టు మొదలు, చివర వుండే బెత్తెడు కథకి స్ట్రక్చర్ అవసరపడదు. కానీ ఫ్లాష్ బ్యాక్ ని ప్రారంభించే ట్రిగర్ పాయింట్ ఒకటి ముందున్న కథకి హుక్ లా వుండాలి. ఇది కొండపొలం లో లేక సాదాగా, పేలవంగా  ప్రారంభమయింది ఫ్లాష్ బ్యాక్.

        ట్రిగర్ పాయింట్ ఎలా వుంటుందో చూద్దాం - సినిమా కథలో ఫ్లాష్ బ్యాక్ అవసరం ఎంతవరకన్నది పాత్ర కేర్పడే అవసరాన్నిబట్టి వుంటుంది. సినిమా కథ పాత్ర లోంచే పుడుతుంది కాబట్టి ఫ్లాష్ బ్యాక్ అవసరం కూడా పాత్రలోంచే పుట్టాలి. ఫ్లాష్ బ్యాక్ అంటే పాత్ర జ్ఞాపకాల దొంతరే కాబట్టి. ఆ జ్ఞాపకాల తుట్టెని కదిపే ఎమోషనల్ లీడ్ వుండాలి. పరిస్థితి తీవ్రత, డిమాండ్ ఎమోషనల్ లీడ్ నిస్తాయి. కొండపొలం లోలాంటి బలహీన పరిస్థితి ఫ్లాష్ బ్యాక్ ని అస్సలు డిమాండ్ చేయదు.

        శ్రీనివాస రెడ్డి నటించిన జయమ్ము నిశ్చయమ్మురా లో స్క్రీన్ ప్లే ప్రారంభమే హీరో సముద్రం దగ్గర నిలబడి ఎమోషనల్ గా చూడడం  హీరోకి సంబంధించినంత వరకూ తీవ్ర పరిస్థితే కావచ్చు. అది ప్రేక్షకులు  ఫీలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అతను ఏ మానసిక స్థితిలో వున్నాడో ఇంకా ఆ ప్రారంభ సీనులోనే ప్రేక్షకులకి మెంటల్ మేకప్ తెలీదు. ఇక అతను మెళ్ళో తాయెత్తు తెంపి సముద్రంలోకి విసిరేస్తే దానికి కూడా ప్రేక్షకులు స్పందించలేరు. అదేమీ హీరోయిన్ తాళిబొట్టు తెంపి పారెయ్యడ మంత తీవ్ర సంఘటన కాదు - ఆ ఒక్క చర్యతో ప్రేక్షకులకి కుతూహలం పుట్టించడానికి. 

        అసలు తెంపింది  తాయెత్తు అని కూడా అప్పటికి ప్రేక్షకులకి తెలీదు, తర్వాత కథలో తెలుసుకుంటారు. కనుక  ‘జయమ్ము నిశ్చయమ్మురాలో ఇలా ఈ సీను విషయం లేని సీనుగా తేలుతోంది. విషయంలేని  సీనుతో స్క్రీన్ ప్లే ప్రారంభాన్ని ముడి వేయడం కుదరనట్టే, ఫ్లాష్ బ్యాకుకీ ఇంధనం ఇవ్వడం కుదరదని ఇక్కడ సోదాహరణంగా గమనించవచ్చు. అంటే ప్రారంభ సీనే కనెక్ట్  అవకుండా తేలిపోతూ, పాసివ్ మూడ్ లోకి నెట్టేస్తోందన్న మాట ప్రేక్షకుల్ని! 

4.
        అందుకని హీరో పాత్ర కొంత డెవలప్ అయ్యాకే ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళాలి. యే దిల్ హై ముష్కిల్లో హీరో పాత్ర డెవలప్ అయ్యాకే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. డెవలప్ అవడం వర్తమానంలో జరిగేది. అంటే  ప్రెజెంట్ టైమ్. వర్తమానంలో ఈ హీరో ఒక సింగర్ అని అతడి చేతే అన్పిస్తారు. సింగర్ గా ఎలా స్ట్రగుల్ చేసి ఈ రేంజికి వచ్చాడో పరిచయం చేస్తారు. అప్పుడు తనకి పరిచయమైన అమ్మాయిలతో ప్రేమలు ఎలాగెలా కొనసాగాయో చెప్పిస్తూ  ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టిస్తారు అతడి పాయింటాఫ్ వ్యూలోనే.

        ఇతనెందుకు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టుకున్నాడు? ఆ పరిస్థితి ఏమొచ్చింది? ఇతను మొదలెట్టుకోలేదు, పరిస్థితి డిమాండ్ అలా చేసింది. ఆ పరిస్థితి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇంటర్వ్యూ ఇవ్వడమనే పరిస్థితి, అవసరం, డిమాండ్ వగైరా అతడి చేత ఫ్లాష్ భ్యాక్ ప్రారంభించేలా చేసింది. కనుక ఈ స్క్రీన్ ప్లే ప్రారంభ సీనుకి అర్ధం, బలం, సపోర్టూ వగైరా చక్కగా ఏర్పడుతూ,  ఫ్లాష్ బ్యాక్ పట్ల కుతూహలం కూడా పుట్టించడానికి కారణమయ్యింది. దేనికీ కారణం కాని సీను ఒక సీనే కాదు.   
            ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా గంటన్నర సేపు హీరో వర్తమానమంతా చూపించి, అప్పుడు ఎక్కడ్నించో వచ్చిన  కొత్త పాత్రని ప్రవేశ పెట్టి, అతను హీరోని గుర్తుపట్టేలా చేసి,  ‘బాబూ నువ్విక్కడున్నావా?’ లాంటి డైలాగుతో తో ఆశ్చర్యపోయేలా చేసి, ప్రేక్షకులకి కుతూహలం పుట్టిస్తారు. ఇంతసేపూ వర్తమానంలో ఇంత సాత్వికంగా కన్పిస్తున్న హీరో ఈ హీరో కాడా? ఇంకెవరోనా? ఐతే ఎవరు? ఎక్కడ్నించి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఆ ఫ్ల్లాష్ బ్యాక్ కథాకమామిషేమిటి....అన్నవి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది.

        ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథ అంటే- మెయిన్ స్టోరీ కాదు. అది మెయిన్ స్టోరీకి కావలసిన సందర్భంలో, కావాల్సిన సమాచారాన్ని తవ్వి అందించే వనరు మాత్రమే. జస్ట్ డేటా బ్యాంక్. బాబూ నువ్విక్కడ వున్నావా?’  అని హీరోని చూసి పాత్ర ఆశ్చర్య పడ్డప్పుడు, ఆ బాబు ఇక్కడున్న కారణాన్ని తెలిపే గత సమాచారాన్ని అందిస్తూ ఓపెన్ అయ్యేదే  ఫ్లాష్ బ్యాక్ అనే డేటా బ్యాంక్- కాల్ సెంటర్- సమాచార కేంద్రం ఏదైనా. ఈ సమాచారాన్ని గంటల తరబడీ ఇస్తూ కూర్చోలేరు, బోరు కొడుతుంది.  ఫ్యాక్షన్ సినిమాల్లో అరగంటకి మించి ఫ్లాష్ బ్యాక్స్ వుండవు.

సరైన ట్రిగర్ పాయింటు లేకుండా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభిస్తే విఫలమవుతుందనే దానికి అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ లో కూడా చూడొచ్చు. ఈ కథని నాన్ లీనియర్ గా ఫ్లాష్ బ్యాక్స్ చేసి చెప్పారు. ఓపెనింగ్ బ్యాంగ్ గా బావుంటుందనుకుని ఫీలైనట్టున్నారు, అనసూయ హీరోతో లిఫ్ట్ లో ఇరుక్కునే సీను ముందే చూపించేస్తూ సినిమా ప్రారంభించారు. కథాక్రమంలో డెవలప్ అయి దాని సమయంలో అది రావాల్సిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఓపెనింగే వేయడంతో, ఇప్పుడే కథేమిటో తెలిసిపోయింది! ఇలా ప్రారంభంలోనే  లిఫ్ట్ సీను వేసి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ చూపించడంతో ముందేం జరుగుతుందో కథ తెలిసిపోవడమేగాక, ఈ సీను తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ వల్ల  ఏ సస్పెన్సూ కూడా లేకుండా పోయింది. ఇంటర్వెల్లో వేయాల్సిన లిఫ్ట్ సీను అనాలోచింతంగా సినిమా ఓపెనింగ్ లో వేసేస్తూ ఘోరమైన పొరపాటు చేసి - సినిమా మొత్తాన్నీ నీరు గార్చేశారు.

        ఇలా కాకుండా, దీని ఒరిజినల్  ఎలివేటర్ బేబీ లో లీనియర్ గానే కథ చెప్పాడు. దీనివల్ల ముందేం జరుగుతుందో తెలీదు. డిజాస్టర్ జానర్ మూవీ కథనం ఇలాగే వుంటుంది. లీనియర్ గా హీరో కథ, హీరోయిన్ కథా చూపించుకుంటూ వెళ్ళి, లిఫ్ట్ లో ఇరికించి అప్పుడు ఇంటర్వెల్  బ్యాంగ్ ఇచ్చాడు. దీని నిడివి గంటన్నర కూడా లేదు కాబట్టి, తెలుగులో చూపించిన హీరో హీరోయిన్ల పూర్వరంగమే ఇందులో ఎక్కువ నస పెట్టకుండా చప్పున ముగిసిపోతుంది.

5.
        లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ని ప్రారంభించే కొన్ని ఉత్తమమైన ట్రిగర్ పాయింట్స్ ని ఇప్పుడు చూద్దాం -  టైటానిక్ లో చూస్తే, సెర్చి బృందం మునిగిన టైటానిక్ నౌకలో విలువైన వజ్రం అన్వేషణలో సముద్ర గర్భం లోంచి సేఫ్ ని పైకి తీసి తెర్చినప్పుడు, అందులో ఒకమ్మాయి చిత్రపటం దొరుకుతుంది. ఆ చిత్రపటాన్ని చూస్తూ గత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది వృద్ధురాలు. ఆ చిత్రపటంలో వున్నది తనే. ఏమిటి తన ప్రేమ కథ? ఆ ప్రేమ తనకి దక్కిందా లేదా? దక్కక పోతే జీవితాంతం ఇలాగే వుండి పోయిందా? ఆందోళనా, ఆతృతా కల్గించే ఈ ప్రశ్నలే ఫ్లాష్ బ్యాకుని ప్రేరేపించే ట్రిగర్ పాయింటు.

        నోట్ బుక్ లో చూద్దాం. హాస్పిటల్లో ఒక వృద్ధుడు వృద్ధురాలైన పేషెంట్ కి నోట్ బుక్ లోంచి ప్రేమ కథ విన్పిస్తూంటే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. దీనికి ముందు కొంత కథ వుంటుంది హాస్పిటల్లోనే. ఆ దృశ్యాలు ఇక్కడ వర్ణించలేం గానీ, ఆ నోట్ బుక్ లో ఎవరి ప్రేమ కథ, ఎవరి జ్నాపకాలు రాశి వున్నాయీ అన్న ట్రిగర్ పాయింటుతో ఫ్లాష్ బ్యాక్ ఇగ్నైట్ అవుతుంది.

‘సిటిజన్ కెన్ లో చూద్దాం. ఒక పత్రికాధిపతి చనిపోతూ రోజ్ బడ్ అనే మాట చెప్పి చనిపోతాడు. ఈ రోజ్ బడ్ అనే మాట ట్రిగర్ పాయింట్. దీంతో ఇదేమిటో తెలుసుకోవాలని రిపోర్టర్ పాత్ర ప్రారంభించేదే లాంగ్ ఫ్లాష్ బ్యాక్.

        ఇలా లాంగ్ ఫ్లాష్ కి సస్పెన్సుతో కూడిన ట్రిగర్ పాయింట్ చాలా అవసరం. కొండ పొలం కథని లాంగ్ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాల్సిన అవసరమే లేదు. దాన్ని కథ లక్షణాలతో త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో కూర్చి, లీనియర్ కథనంగా చెప్తేనే డైనమిక్స్ తో కూడిన ఉత్కంఠ రేపొచ్చు.

 —సికిందర్  
 


సిడ్ ఫీల్డ్ 


సిడ్ ఫీల్డ్ ..సినిమా రంగంలో ఈ పేరు వినని దర్శకులు / రచయితలూ వుండరు. పండిత భాషలో , గ్రంధాల్లో  గుంభనంగా వుండి పోయిన స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని సులభ భాషలో ఔత్సాహికులకి కరతలామలకం చేసిన స్క్రీన్ ప్లే పండిట్ సిడ్ ఫీల్డ్.. నేడు స్క్రిప్ట్ రచనలో విప్లవాత్మక మార్పులు ఎలా చోటు చేసుకుంటున్నాయో ఆసక్తి కరంగా చెప్పుకొచ్చారు. చదవండి.. 

         ప్రపంచవ్యాప్తంగా నేను నిర్వహిస్తున్న స్క్రీన్ ప్లే కోర్సుల్లో, వర్క్ షాపుల్లో భాగంగా వేలకొద్దీ  స్క్రీప్లే లని చదివి వుంటాను. కచ్చితంగా ఎన్ని వేలు అన్నది చెప్పలేను, లెక్క వేయడం ఏనాడో మానేశాను. కానీ నేనే దేశంలో, ఏ నగరంలో పర్యటించినా అంతటా నాకొకే ప్రశ్న ఎదురవుతూంటుంది. పదేపదే ఈ ప్రశ్నే వేస్తూంటారు : సర్వసాధారణంగా స్క్రిప్టు రచయితల్లో  మీరు గమనించిన కామన్ లోపం ఏమిటనేది ఆ ప్రశ్న. కామన్ గా వుండే లోపాలు అనేకం వున్నాయి. హీరో పాత్రకి లక్ష్యం లేకపోవడం దగ్గర్నుంచీ, సెకండ్ యాక్ట్ లో స్ట్రక్చర్ పరమైన బలహీనతలు, బలమైన ముగింపులూ లేకపోవడం వరకూ అనేకం ఉంటున్నాయి. అయితే ఒక్క లోపం మాత్రం ప్రాంతాల కతీతంగా  కొట్టొచ్చినట్టూ  ఉంటోంది. అదేమిటంటే ఏ దేశంలోనైనా చాలా మంది రచయితలు కథని డైలాగుల ద్వారా నడిపించేస్తున్నారు. పాత్రల ఆలోచనల్ని, ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ నీ డైలాగులతోనే వివరించేస్తున్నారు.


          నిజమే, కొన్ని కథల్ని బట్టి ఈ విధానం తప్పక పోవచ్చు. 500 డేస్ ఆఫ్ సమ్మర్’  లాంటి రోమాంటిక్ కామెడీల్లో ఎంత నాన్ లీనియర్ గా కథ ఉన్నప్పటికీ యాక్షన్ ని చూపించడం, దృశ్యాలు ముందుకు కదలడం- డైలాగుల ద్వారానే జరగవచ్చు. ఈ సినిమాలో ప్రేమికుల మధ్య వున్న రిలేషన్ షిప్ కిచ్చిన డెప్త్ ప్రేక్షకుల్ని కట్టి పడేసే ఎమోషనల్ త్రెడ్ లా వుంటుంది. 


          నేడు స్టయిల్ పరంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నవలా రచయితలు ఉపయోగించే క్రియేటివ్ టూల్స్ ని సినిమాల్లో వాడుకోవడం పెరిగిపోతోంది. పాయింటాఫ్ వ్యూ, మెమరీ, వాయిసోవర్ నేరేషన్, ఫ్లాష్ బ్యాక్స్ వగైరా క్రియేటివ్ టూల్స్ నవలా రంగం నుంచి దిగుమతి అయిపోతున్నాయి. దీంతో సమకాలీన స్క్రీన్ ప్లేల రూపు రేఖలే మారిపోతున్నాయి.


          ఇదే అంశం ఈ మధ్య నేనొక మిత్రుణ్ణి అనుకోకుండా ఓ కేఫెలో కలుసుకున్నప్పుడు చర్చ కొచ్చింది. చాలా కాలం తర్వాత కలుసుకోవడం వల్ల యోగ క్షేమాలు మాటాడుకున్నాం. తను టీవీ షోస్ కి రాస్తున్నట్టు చెప్పాడు. నేను నా వృత్తిలో భాగంగా గత రెండేళ్లుగా నాన్ స్టాప్ గా దేశాలు పట్టుకు తిరుగుతున్నా నన్నాను. ఐతే దేశ దేశాల్లో స్క్రీన్ ప్లే రైటింగ్ లో తేడాలేమైనా గమనించావా అని అడిగాడతను. ఇవ్వాళ్ళ అంతర్జాతీయంగా స్క్రీన్ ప్లే సాంప్రదాయ రచన నుంచి చాలాదూరం ప్రయాణించి వికాసం పొందు తోందని చెప్పాను. నేను సందర్శించిన ఏ దేశ నగరంలో నైనా బ్రెజిల్, కైరో, మాడ్రిడ్, మనీలా, మెక్సికో సిటీ, ముంబాయి, సింగపూర్, వియన్నా.. ఎక్కడైనా, భాష ఏదైనా - స్క్రీన్ ప్లేలని బొమ్మల ద్వారానే చెప్తున్నారని వివరించాను.  విజువల్ గా స్క్రీన్ ప్లేలు చాలా పరిణామం చెందుతున్నాయనీ, వాటి రూపం, నిర్వహణ, ఖండికలుగా వేర్పడి వుంటున్నాయనీ చెబుతూ,  ఈ క్రమంలో ముంబాయిలో  మై నేమ్ ఈజ్ ఖాన్అనే హిందీ సినిమాకి స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేసిన అనుభవం గురించి కూడా చెప్పాను. ఈ ఇండియన్ ఫిలిం స్క్రిప్ట్ ని నా శిష్యుడే రాశాడు. ఈ కథ మన హృదయాల్లో మానవతని తడుముతుంది. దీంతో ఇది భాషలకి, దేశీయతలకీ, సంస్కృతులకీ అతీతంగా సార్వజనీనంగా ఉండిపోయింది. ఈ కథ ఫ్లాష్ బ్యాక్స్ తో, మెమరీస్ తో జీవితంలోకి హీరో ప్రయాణం లాగా వుంటుంది. అయితే ఇందులో హీరో పాత్ర ఇంకా బాగా వ్యక్త మవడానికి వాయిసోవర్ నేరేషన్ ని ప్రవేశ పెట్టమని సలహా నిచ్చాను. ఇందువల్ల ఎక్కువ వివరణలు ఇచ్చే అవస్థ తప్పుతుంది. కాకపోతే వాయిసోవర్ నేరేషన్ ప్రవేశ పెట్టడం వల్ల,  చాలా వరకూ స్టోరీ లైన్ ని రీ స్ట్రక్చర్ చేయాల్సి వచ్చింది - ముఖ్యంగా బిగినింగ్ లో.  ఐతే దీని ఇంపాక్ట్ మొత్తం సినిమా మీద చాలా  బాగా పనిచేసింది! 


          నేను వాయిసోవర్ నేరేషన్ ని ఎందుకు సిఫార్సు చేశానంటే, స్క్రీన్ రైటింగ్ లో ఒక సింపుల్ రూలుంది : యాక్షన్ ని క్యారక్టర్ డ్రైవ్ చేయాలి, లేదా క్యారక్టర్ ని యాక్షన్ డ్రైవ్ చెయ్యాలని.  500సమ్మర్ డేస్’, ‘షాషాంక్ రెడెంప్షన్’, ‘జూనో’  వంటి సినిమాల్లో యాక్షన్ ని క్యారక్టర్ డ్రైవ్ చేస్తుంది. లిటిల్ మిస్ సన్ షైన్’ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ది లుక్ అవుట్’  లలో క్యారక్టర్ ని యాక్షన్ డ్రైవ్ చేయడాన్ని గమనించ వచ్చు. 


          నా దృష్టి కొచ్చినంత వరకూ స్క్రీన్ ప్లే రచన ఇప్పుడు చాలా వికాసం పొందింది. ఇది ఒకరకంగా విప్లవం కూడా! ఒకసారి ఎటోన్మెంట్’  లో చూడండి, ‘వాంటేజ్ పాయింట్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్లలో చూడండి..ఈ విప్లవకర ధోరణిని మీరు బాగా గమనిస్తారు. ఇప్పుడు రిలీజవుతున్న దాదాపు ప్రతీ సినిమాలో వాయిసోవర్లు, సబ్ టైటిల్సు, ఫ్లాష్ ప్రెజెంట్ లు, ఇంటర్వ్యూలు, ఇంకా ఇతర మల్టీ మీడియా ప్రెజెంటేషన్ ఎలిమెంట్లూ అనేకం ఉంటున్నాయి...

***