రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, జులై 2019, సోమవారం

850 :స్క్రీన్ ప్లే సంగతులు


    దొరసాని’, ‘నిను వీడని నీడను నేనే’ ఈ రెండిటిలో దాగి మనకి తెలీని సమస్య ఇంకేముందా తెలుసుకుందామని రీసెర్చి పేరుతో  ఫ్రీ సెర్చి చేస్తూంటే, బ్రాకెట్ లోకి ఇస్మార్ట్ శంకర్కూడా వచ్చి చేరిపోయింది. ఇంటర్వెల్లో పూర్తిగా కథా పాత్రా రివర్స్ అయ్యే ట్విస్టుతో సెకండాఫ్ లు విఫలమవడం ఇప్పుడు చూస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగు వేరు, ట్విస్టు వేరు. బ్యాంగు  కథని కొత్త మలుపుతో ముందుకు తీసికెళ్తుంది. బ్యాంగులో వున్నమలుపే కథకి ముందు దారి చూపిస్తుంది. ట్విస్టు ఇలా కాదు, ట్విస్టులో మలుపు వుండదు, పజిల్ వుంటుంది. ఈ పజిల్ విప్పగల్గితేనే కథ ముందు కెళ్తుంది. వారం తర్వాత వారం విడుదలైననివీనీనే’, ఇస్మార్ట్ శంకర్రెండూ ట్విస్టుతో పజిల్ విప్పలేక సెకండాఫ్ విలవిల్లాడాయి. ముగింపు ట్విస్టుల గురించి మనకి తెలిసిందే గానీ, ఇలా ఇంటర్వెల్లో ఇచ్చే ట్విస్టుల వ్యవహారం తెలీదు. దీని గురించి బోలెడు రీసెర్చి అనే ఫ్రీ సెర్చి పైసా ఖర్చు లేకుండా ఇంటర్నెట్ లో చేసుకుంటూ వుంటే, హాలీవుడ్ లో ఒక బ్లాగర్ రాసిన ఆర్టికల్ తగిలింది. ఈయన పేరేమిటో వెల్లడించకుండా బ్లాగు నిర్వహిస్తున్నాడు. తనకి నిర్మాతలతో పని వుంటుందనీ, వాళ్ళు గూగుల్ సెర్చి గనక చేస్తే వాళ్ళని విమర్శించిన బండారం బయట పడుతుందనీ, అందుకని పేరు దాస్తున్నాననీ బ్లాగులో రాసుకున్నాడు నవ్వొచ్చేట్టు.

                  ఇంకలాగే ఎప్పుడో ఒక ఆదివారం అలవాటు చొప్పున అబిడ్స్ వెళ్లి  ఫుట్ పాత్ మీద కొన్న ఒక పాత పుస్తకంలో కూడా సమాచారం దొరికింది. అప్పటి ‘ఎస్క్వైర్’ పత్రిక సాహిత్య సంపాదకుడు రస్ట్ హిల్స్ కథానికల మీద రాసిన చిన్న పుస్తకమది. ఈ రెండిటి సారాంశమేమిటంటే - కథ వేరు, పరిస్థితి వేరని. చాలా మంది పరిస్థితే కథనుకుని రాసేస్తున్నారనీ. ‘దొరసాని’, నివీనీనే’, ‘ఇస్మార్ట్ శంకర్’ ఇలాగే వున్నాయి. పరిస్థితిని దాటి కథెత్తుకోవడం తెలీలేదు
          ఇక్కడ ముందుగా ‘దొరసాని’, ‘నిను వీడని నీడను నేనేరెండిటి విషయం చూద్దాం. ‘ఇస్మార్ట్ శంకర్’ కెలాగూ స్క్రీన్ ప్లే సంగతులు వేరే ఆర్టికల్ వుంటుంది...
          1. సిట్యుయేషన్ (అంటే పరిస్థితి) : హీరో తన ప్రమేయం లేకుండా ఒక పరిస్థితిలో ఇరుక్కుకుంటే అది సిట్యుయేషన్. అప్పుడు హీరో పాసివ్ పాత్ర.
           2. స్టోరీ :  హీరో తానున్న పరిస్థితి లోంచి బయటపడేందుకు తన ప్రమేయంతో చర్య తీసుకుంటే అది కథ. అప్పుడు హీరో యాక్టివ్ పాత్ర.

           ఉదాహరణ : ‘శివ’ లో కాలేజీ మీద మాఫియా పడగనీడలో వుంటున్న నాగార్జున, తననే  తిరగబడి జేడీ కొడితే షాక్ అయిపోవడం సిట్యుయేషన్.


         ‘శివ’ లో నాగార్జున కాలేజీ మీద మాఫియా పడగ నీడ అనే  సిట్యుయేషన్ ని ఏ మాత్రం సహించక తిరగబడి తనే జేడీని టఫా టఫా కొట్టేస్తే అది సైకిల్ చైను, అంటే కథ.
         కథలు సైకిల్ చైనుల్ని పుట్టిస్తాయి, సిట్యుయేషన్లు కాదు. సిట్యుయేషన్లు సైకిల్ ని చూస్తూ కూర్చోమంటాయి. సింపుల్ గా అర్ధమయ్యే తేడా.
         సిట్యుయేషన్ని హీరో దాటాలి. దాటితే కథ పుడుతుంది. లేకపోతే సిట్యుయేషన్ అనే గర్భంలో అలాగే పడివుండి మృత శిశువై పోతుంది. కథ పుడితే హీరో యాక్టివ్ పాత్ర అవుతాడు. సిట్యుయేషన్లోనే  కొనసాగుతూంటే పాసివ్ పాత్ర అయిపోతాడు.
        స్ట్రక్చర్ ప్రకారం చూస్తే ఈ సిట్యుయేషన్ బిగినింగ్ విభాగంతో మొదలవుతుంది. ఇలా బిగినింగ్  విభాగంలో వున్న సిట్యుయేషన్ లోంచి హీరో బయటపడాలనుకోవడం ప్లాట్ పాయింట్ -1 ని, గోల్ ని సృష్టిస్తాయని తెలిసిందే.            అయితే స్క్రీన్ ప్లేలో ఈ బిగినింగ్ విభాగానికో పరిధి అంటూ వుంటుంది. ఆ పరిధి లోపు ప్లాట్ పాయింట్ -1, గోల్ అన్నవి కథని పుట్టిస్తూ ప్రధాన మలుపుని ఏర్పాటు చేస్తాయని కూడా తెలిసిందే.

         సిట్యుయేషన్ అలా కాదు, దానికి పరిధులుండవు. బిగినింగ్ ముగిసిపోయాక పుట్టే కథాక్రమంలో ఎక్కడైనా ఎన్నిసార్లయినా సిట్యుయేషన్స్ తలెత్త వచ్చు.
         ‘నివీనీనే’ లో హీరో అద్దంలో చూసుకుంటే వేరే మొహం కనపడ్డం బిగినింగ్ ముగిసిపోయి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడడం.
          అప్పుడు హీరో గోల్ తీసుకుని తనలో వున్నదెవరో తెలుసుకోవడానికి పూనుకుంటాడు. యాక్టివ్ పాత్రగా మారతాడు.
          ఇంటర్వెల్లో తనే అద్దంలో కన్పిస్తున్న వ్యక్తిలో వున్న ఆత్మ అని తెలుసుకుంటాడు. ఇది సిట్యుయేషన్.
          ఇందులోంచి బయట పడేందుకు సరైన ప్రయత్నాలు చేయకపోవడంతో ఇక్కడ్నుంచీ పాసివ్ పాత్ర అయిపోయాడు.
          గోల్ ఏర్పడినప్పుడు యాక్టివ్ గా పనిచేసిన పాత్ర, ఇంకో సిట్యుయేషన్ ఎదురుకాగానే చేతగాక పాసివ్ అయిపోయింది.
          ‘దొరసాని’ లో ప్రేమికులు దొర కళ్ళబడ్డం ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఏర్పడ్డ సిట్యుయేషన్. అప్పుడు ప్రేమికులు సినిమా ముగింపు వరకూ కూడా ఆ సిట్యుయేషన్ లోంచి బయట పడే ప్రయత్నం చేయక, దొర తమ్ముడి చేతిలో చచ్చిపోతారు.
          పారిపోవడం సిట్యుయేషన్ లోంచి బయటపడ్డం కాదు, అది సమస్య నుంచి పలాయనమవుతుంది. యాక్టివ్ పాత్రలు సమస్యనుంచి పలాయనం చిత్తగించవు. నిలబడి  ఎదుర్కొంటాయి.
          పాత్రలకి ఈ విజ్ఞత వుంటే కాసేపు ప్రేమని పక్కన పెట్టి, ముందు ప్రేమలో సుఖం లేకుండా చేస్తున్న సమస్యని తొలగించుకోవాలని ప్రయత్నిస్తాయి. అప్పుడే ప్రాణాలతో పాటు ప్రేమా దక్కే అవకాశముంటుంది. ప్రాణాలు పోయే ప్రేమలు దేనికి?
          లేకపోతే పాసివ్ పాత్రలుగా ప్రాణాలు కోల్పోతాయి. ఈ సినిమా ముగింపు వరకూ సిట్యుయేషనే తప్ప, ఎక్కడా కథ పుట్టలేదు, కథలేదు. సినిమా అనే దృశ్య మాధ్యమం కథ మీదే ఆధారపడుతుంది, సిట్యుయేషన్ మీద కాదు.
          పక్కా మాస్ గా చెప్పాలంటే - సిట్యుయేషన్ వంటకమైతే, కథ వడ్డన. సిట్యుయేషన్ తోనే కథ నడపడమంటే, వంటకమే చేస్తూ కథ వడ్డించకుండా ప్రేక్షకుల్ని కాలే కడుపులతో తన్ని వెళ్ళగొట్టడమే.          కథ అంటే ఆర్గ్యుమెంట్, సిట్యుయేషన్ కేవలం స్టేట్ మెంట్. కథంటే ఆర్గ్యుమెంట్ తో జడ్జిమెంటు రాయడం, సిట్యుయేషన్ కేవలం సంఘటనని రిపోర్టింగ్ చేయడం.
          రిపోర్టింగ్ సినిమా కాదు, జడ్జిమెంట్ సినిమా. కథంటే సృజనాత్మకత, సిట్యుయేషన్ వార్తా రచన. సిట్యుయేషన్ సవాలు అయితే, కథ దానికి సమాధానం.
         సిట్యుయేషన్ పాత్రతో సంబంధం లేకుండా ఏర్పడుతుంది. కథ పాత్రతోనే పుడుతుంది. సిట్యుయేషన్ కథ కాదు, కానీ కథలో సిట్యుయేషన్స్ వుంటాయి. ‘నివీనీనే’ లో ఇంటర్వెల్ లాగా. 
          అయితే పైన చెప్పుకున్న బ్లాగర్ ఏమంటాడంటే, స్క్రీన్ రైటర్లు సిట్యుయేషనే బావుందన్పించి దాన్ని పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ పోతారనీ; తెలియక, తెలిసీ కూడా ఇలా చేస్తారనీ అంటాడు.
          హాయిగా వున్న సిట్యుయేషన్ లోంచి కథని పుట్టిస్తే స్వచ్ఛత పోతుందన్నట్టుగా  భావిస్తారనీ అంటాడు.
          ఇది ఈ వ్యాసకర్తకి కూడా అనుభవమైంది. కోడైరెక్టర్ ఒకాయన ఒక పెద్ద హీరోకి  కథ చేసుకుంటే, అందులో ఇప్పుడు చెప్పుకుంటున్న విధంగా సిట్యుయేషన్లే తప్ప స్టోరీ లేదు.
          హీరోకిలా గోల్ లేకపోతే వర్కౌట్ కాదని చెప్తే - ఇదిలాగే వుండాలనీ, లేకపోతే ప్యూరిటీ పోతుందనీ సమాధానం. కాసుల గలగలలు విన్పించని ప్యూరిటీ...
          కథల్లో మార్పు చేర్పులు చేస్తే చాలా మంది డిస్టర్బ్ అయ్యేది దేనికంటే, సిట్యుయేషన్స్ నీ,క్యారక్టర్స్ నీ కదిపితే అది ప్యూరిటీనీ, తమ నైపుణ్యాన్నీడిస్టర్బ్ చేస్తాయనే. 
          నిజమే. కథ చేస్తే సిట్యుయేషన్స్, క్యారక్టర్స్ కచ్చితంగా డిస్టర్బ్ అవుతాయి, అవ్వాల్సిందే. కథ అనే ములుగర్రతో పొడవక పోతే సిట్యుయేషన్స్, క్యారక్టర్స్ అలాగే  పడుకుని వుంటాయి - ఊబిలో దున్న లాగా.
          ఇందుమతి ఒక కంపెనీలో పనిచేస్తోందనుకుందాం. జీవితం హాయిగా వుందనుకుంటే బాయ్ ఫ్రెండ్ గుడ్ బై కొట్టేశాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్ దూరమవసాగాడు. ఈ రెండూ వుండగా ఇక ఉద్యోగం వూడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యోగంతో తప్ప వేరే ఆదాయం లేని దుస్థితి. ఇన్ని సమస్యలు  చుట్టుముట్టాయి.
          దీనికి ఇందుమతి ముందు ఉద్యోగాన్ని కాపాడుకోవడం ముఖ్యం, ఇందుకు బాయ్ ఫ్రెండ్ గుడ్ బై కొట్టేసిన బాధని ఇక మర్చిపోగల్గాలి. దూరమవుతున్నబెస్ట్  ఫ్రెండ్ ని దగ్గరయ్యేలా చేసుకోవాలి. ఈ వ్యక్తిగత సమస్యల్ని ముందు అడ్డు తొలగించుకుంటే, వృత్తిగత సమస్య మీద బాగా దృష్టి పెట్టగల్గుతుంది.
          వీటిలో మొదటిది సిట్యుయేషన్, అంటే సవాలు. రెండోది కథ, అంటే సమాధానం. తలెత్తిన సిట్యుయేషన్ కి బాధ పడుతూ కూర్చుంటే ఆ సిట్యుయేషన్ అలాగే కొనసాగుతూ తను అందులోనే వుండిపోతుంది.
          సిట్యుయేషన్ ని చక్కదిద్దుకోవడానికి పూనుకుంటే, సిట్యుయేషన్ వెనక్కెళ్ళి కథ సృష్టిస్తూ తను ముందు కెళ్తుంది.
         వెనక్కెళ్ళని సిట్యుయేషన్ కథకి చోటివ్వదు. ఇది రచయిత నియంతృత్వమే తప్ప ఏ ప్యూరిటీ కాదు. నియంతృత్వం ప్యూరిటీ అవదు. అందులో అభ్యుదయం వుండదు. అభ్యుదయం లేని ఉస్సూరు మన్పించే రచనలు వస్తాయి.
          స్టోరీకీ సిట్యుయేషన్ కీ తేడా తెలుసుకున్నాక, ఇప్పుడు సిట్యుయేషన్ కీ ట్విస్టు కీ తేడా తెలుసుకుందాం...
***
         అనూహ్యంగా ఎదురయ్యేదే  ట్విస్ట్. మనం ‘ఆమె’  చూద్దామని టికెట్ బుక్ చేసుకుని పోతే థియేటర్లో ‘మిస్టర్ కేకే’ వుండడం ట్విస్ట్. 

          ఖర్మరా అని ఇంకో టికెట్ తీసుకుని ‘మిస్టర్ కేకే’ చూడ్డం ట్విస్టు కి ట్విస్టు. మళ్ళీ ఎందుకీ ట్విస్టు అంటే, అది కాకపోతే ఇదైనా చూసి రివ్యూ రాయాల్సిన అవసరముంది కాబట్టి.
          అసలు ‘ఆమె’ రిలీజ్ క్యాన్సిలైందని బుక్ మై షో వాడు హీనపక్షం మెసేజి అయినా పంపాలని ఏకోశానా ఫీల్ కాకపోవడంతో ఈ ట్విస్టులు.
          ట్విస్టు తిన్నాక అసలేం జరిగిందని సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే, ఒకే ఒక్క వెబ్సైట్లో ‘ఆమె’ మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అని వార్త.
          ఇది ముందు చూసి వుంటే ఈ ట్విస్టులుండవు, సిట్యుయేషనే వుంటుంది. అలాగే సినిమాల్లో ట్విస్టు కోసం లీడ్స్ ఇస్తూపోతే, లేదా ఫోర్ షాడోయింగ్ చేస్తే, వీటిని గమనిస్తున్న ప్రేక్షకులకిది  ట్విస్ట్ అవదు, సిట్యుయేషన్ అవుతుంది.
          ఇంకో మాటలో చెప్పాలంటే లీడ్స్ లేకుండా, ఫోర్ షాడోయింగ్ లేకుండా వచ్చే ఊహించని సిట్యుయేషనే  ట్విస్ట్. ‘నివీనీనే’ లో హీరోకి అద్దంలో కన్పిస్తున్నమారు రూపం నిజ వ్యక్తి అనీ, తనే అతడిలో వున్న ఆత్మ అనీ ఇంటర్వెల్లో తెలియడం ట్విస్ట్.
          దీనికి ముందు నుంచీ లీడ్స్ గానీ, ఫోర్ షాడోయింగ్ గానీ ఇవ్వలేదు. ఆ సీన్లోనే ఆ  పోలీసు అధికారియే అప్పటికప్పుడు ఇచ్చే వివరణతో ఆ ట్విస్టు అనూహ్యంగా వస్తుంది.
          ‘సవ్యసాచి’ లో ఇంటర్వెల్ దగ్గర అకస్మాత్తుగా ఇల్లు పేలిపోయి, హీరో అక్క కిడ్నాపైందని సీను రావడం ట్విస్టు అవుతుందా? పోనీ సిట్యుయేషన్ అవుతుందా? రెండూ కావు.
          ట్విస్టు రావాలంటే, ముందునుంచే హీరో కిడ్నాపైనట్టు చూపించాలి. ‘నివీనీనే’ లో ముందునుంచీ అద్దంలో హీరో మారురూపం చూపిస్తున్నట్టు. అప్పుడు కిడ్నాపయ్యింది తను కాదనీ, తన అక్క అనీ హీరో తెలుసుకుంటే అది ట్విస్ట్ అవుతుంది.
          సిట్యుయేషన్ రావాలంటే, ముందు నుంచీ కిడ్నాప్ చేయబోయే విలన్ తో లీడ్స్, ఫోర్ షాడోయింగ్ వుండాలి. ఇలా ట్విస్టూ కాక, సిట్యుయేషనూ కాక, ఉరుములేని పిడుగులా ఆ సీన్ని మధ్యలో తెచ్చి, ఓ అతుకు అతికించి ఇదే బ్యాంగ్ పొమ్మన్నారు.
          ఉత్త బ్యాంగు తాటాకు చప్పుడు. అందులో టెర్రర్ అనుభవమవదు, ఎమోషన్ ఫీలవ్వం. ఆ బ్యాంగు ప్రకంపనలు ముందునుంచీ వుండాలి, లీడ్స్ రూపంలో, ఫోర్ షాడోయింగ్ రూపంలో. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కూడా ఇదే చెప్తాడు.
          ఊహించని సిట్యుయేషన్ ట్విస్ట్. ట్విస్ట్ కథని కొత్తగా మార్చేస్తుంది, సిట్యుయేషన్ వున్నకథకే  కొత్తమలుపు నిచ్చి సాగనిస్తుంది. ట్విస్ట్ పజిల్ (చిక్కుముడి) ని విప్పమంటుంది. సిట్యుయేషన్ సిద్ధంగా వున్న కొత్త మలుపుతో పోరాడమంటుంది.

***
         ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింటు లేదా తేడా ఇంకోటుంది. కథలో ఆన్ని సిట్యుయేషన్సూ కాన్ఫ్లిక్ట్ (సంక్షోభం) కావు. అలాగే అన్ని ట్విస్టులూ కాన్ఫ్లిక్ట్ కావు.

          కథలో కాన్ఫ్లిక్ట్ ఒక్కసారే ఏర్పడుతుంది. అది బిగినింగ్ విభాగం ముగిసి ప్లాట్ పాయింట్ -1 ఏర్పడ్డప్పుడు. ఇక్కడ పుట్టేది మాత్రమే కాన్ఫ్లిక్ట్. దీంతోనే హీరోకి గోల్, సంఘర్షణా వుంటాయి.  
          ఈ కాన్లిక్ట్ మొత్తం కథకి కేంద్ర బిందువుగా వుంటుంది. ‘శివ’ ప్లాట్ పాయింట్ -1 లో  నాగార్జున జేడీని కొట్టడంతో విలన్ రఘువరన్ తో కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. దీన్నే కేంద్ర బిందువుగా చేసుకుని మొత్తం కథా నడిచింది.
          ఈ కాన్ఫ్లిక్టే కథలో మున్ముందు సిట్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. అంతే గానీ ఈ సిట్యుయేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ కావు.
          ప్రతీ ఇంటర్వెల్ బ్యాంగూ కాన్ఫ్లిక్ట్ కాదు. ఫస్టాఫ్ లో ఎక్కడైనా ప్లాట్ పాయింట్ -1 వచ్చి కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే, ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ కాన్ఫ్లిక్ట్ కాదు. అది వున్న కాన్ఫ్లిక్ట్ కి తీవ్ర రూపం మాత్రమే.
          ‘శివ’ లో ప్లాట్ పాయింట్ -1 లో నాగార్జునకి రఘువరన్ తో కాన్ఫ్లిక్ట్ ఏర్పడ్డాక, ఇంటర్వెల్ బ్యాంగుగా నాగార్జున ఫ్రెండ్ శుభలేఖ సుధాకర్ ని రఘువరన్ చంపించడం కాన్ఫ్లిక్ట్ కాదు. ఉన్న కాన్ఫ్లిక్ట్ తీవ్రత పెంచుకోవడమే.
          ఇంటర్వెల్లో ఈ తీవ్రరూపంలో వున్న సిట్యుయేషన్ కి మూలం ప్లాట్ పాయింట్ -1 దగ్గర పుట్టిన కాన్ఫ్లిక్టే. కనుక ఈ ఇంటర్వెల్ మలుపు కాన్ఫ్లిక్ట్ నుంచి వచ్చిన ఉప ఉత్పత్తి (బై ప్రొడక్టు) మాత్రమే.
          ఇలా ఎన్ని మలుపులు, సిట్యుయేషన్స్ ఏర్పడితే అవన్నీ కాన్ఫ్లిక్ట్ కి అన్నేసి ఉప ఉత్పత్తులు లేదా పర్యవసానాలు మాత్రమే అవుతాయి.
          మొన్నొక మీటింగులో ఇదే కన్ఫ్యూజన్. ఇంటర్వెల్ బ్యాంగు దగ్గరే  హీరోకి  గోల్ ఏర్పడిందని అక్కడ్నించే కథ ప్రారంభించారు. కానీ అంతకి ముందే ప్లాట్ పాయింట్- 1 దగ్గరే గోల్ పుట్టిందనీ, అక్కడే కథా ప్రారంభమయ్యిందనీ  మర్చిపోతున్నారు.
          ఈ మర్చిపోవడం వల్ల సెకండాఫ్ అంతా కన్ఫ్యూజనే. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా మాయ చేస్తుంది. ఈ మాయలో పడిపోతే సెకండాఫ్ ఇంతే సంగతులు.
          అఫ్ కోర్స్, ఇంటర్వెల్లో ప్రారంభమయ్యే కథలు కూడా చాలా వుంటాయి. అప్పుడు అక్కడే ప్లాట్ పాయింట్ -1, గోల్ ఏర్పడతాయి.
          అక్కడే కథ ప్రారంభమవుతుంది. అంటే బిగినింగే ఇంటర్వెల్ దాకా బారెడు సాగుతుందన్న మాట. ‘ఇస్మార్ట్ శంకర్’ లో కూడా ఇది చూడొచ్చు.
                                         ***
         ఇలాగే ట్విస్టు విషయం కూడా. ‘నివీనీనే’ ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్టు కాన్ఫ్లిక్ట్ కాదు, కథా ప్రారంభమూ కాదు. అది వున్న కాన్ఫ్లిక్ట్ నే సంక్లిష్టం చేయడం. 
          అతను మొదట అద్దంలో మారు రూపం కనబడ్డం చూడ్డం దగ్గరే బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ -1, కాన్ఫ్లిక్ట్, గోల్ ఏర్పడినప్పుడే కథ ప్రారంభమయ్యింది.  ఇంటర్వెల్ ట్విస్టుతో కాదు.
          హీరోకి తనలో ఇంకొకరి ఆత్మ వుండడం కాదు, తనే ఇంకొకరిలో ఆత్మగా వున్నాడనీ, అంటే తను చచ్చి పోయాడనీ తెలుసుకుని షాక్ తినడం ఈ ఇంటర్వెల్ ట్విస్టు. ఇది  వున్న కథకే చిక్కుముడి తప్ప, ఇక్కడే కథ పుట్టినట్టు కాదు.
          ఐతే  ట్విస్టు ఇక్కడ ఇంటర్వెల్లో వర్కౌట్ కాదని ఈ సినిమా రివ్యూలో పెర్కొన్నాం. ఎలాగంటే ఇది ‘సిక్స్త్ సెన్స్’   హాలీవుడ్ సినిమాలోని ముగింపు ట్విస్ట్. ‘సిక్స్త్ సెన్స్’ ముగింపు ట్విస్టు ఆ కథకి ఎండింగ్.
          ఒక సినిమా ఎండింగ్ ట్విస్టుని ఇంకో సినిమా కథ మధ్యలో ఇంటర్వెల్లో పెడితే ఆ తర్వాత నడపడానికి కథేముంటుంది.
          హాలీవుడ్ లోనే ‘సిక్స్త్ సెన్స్’ ప్రభావంతో ఇరవైకి పైగా రకరకాల కథలతో సినిమాలు తీశారు. వాటిలో ఆ ట్విస్టు ఎండింగ్ ట్విస్టుగానే పెట్టుకున్నారు తప్ప మధ్యలో తెచ్చి పెట్టుకోలేదు. ఈ కామన్ సెన్స్ వాళ్ళకుంది.
          ‘సిక్స్త్ సెన్స్’ లో బ్రూస్ విల్లీస్ సైకియాట్రిస్టు. అతడి దగ్గరికి ఓ బాలుడు వచ్చి, తనకి ఆత్మలు కన్పిస్తున్నాయని, నయం చేయమనీ అంటాడు. విల్లీస్ కేసు టేకప్ చేస్తాడు.
          పోనుపోనూ వీళ్లిద్దరిమధ్య కథ చివరికెలా ముగుస్తుందంటే, ఆ బాలుడుకి కన్పిస్తున్న విల్లీస్ విల్లీస్ కాదు, విల్లీస్ కూడా ఒక ఆత్మే! అతనెప్పుడో చనిపోయాడు.      
          ఇది ఎండింగ్ ట్విస్టు. దీనికింకా కొనసాగింపు ఎలా వుంటుంది? దీన్ని ఇంటర్వెల్ ట్విస్టుగా పెట్టుకుని ఎలా కొనసాగిస్తారు?
          ‘మ్యాడ్ మాక్స్ -2’ లో ఆయిల్ కంపెనీ మీద దుండగులు దాడి చేసే దోచుకోవాలనే ప్రయత్నాలని మెల్ గిబ్సన్ తిప్పి కొడుతూంటాడు.
          చివరికి కంపెనీ వాళ్ళు ట్యాంకర్లో ఆయిల్ ని ఒక చోట సరఫరా చేయాలనుకుంటారు. ఆ ట్యాంకర్ వెంటబడి దాడులు చేస్తూంటారు దుండగులు.
          ఈ యాక్షన్లో అందర్నీ చంపేస్తాడు గిబ్సన్. ట్యాంకర్ దొర్లిపోతుంది. అప్పుడు దిగి చూస్తే, ట్యాంకర్ లోంచి ఆయిల్ కారదు, ఇసుక రాలుతూ వుంటుంది.
          ఆ ఇసుకని చేతిలో పట్టి విషాదంగా నవ్వుకుంటాడు గిబ్సన్. ఇది ఎండింగ్ ట్విస్ట్. తన నుపయోగించుకుని దుండగుల్ని నిర్మూలించడానికి కంపెనీ వాళ్ళు ఇలా ఏమార్చా రన్న మాట.
          ఈ ముగింపు ట్విస్టుని ఇంకో సినిమాలో ఇంటర్వెల్ ట్విస్టుగా పెడితే ఏమవుతుంది? ఇంటర్వెల్లో బాగానే కిక్కిస్తుంది. అక్కడ్నించీ సెకండాఫ్ కథని ఆ ట్విస్టుని  సిట్యుయేషన్ గా మార్చి నడపాల్సి వస్తుంది.
          ఎప్పుడైతో ఈ ఎండింగ్ లో వుండాల్సిన ట్విస్టుని ఇంటర్వెల్ తర్వాత నుంచి సిట్యుయేషన్ గా మారుస్తారో, అప్పుడా కథ ‘నివీనీనే’ సెకండాఫ్ లాగా అతుకుల బొంతలా మారుతుంది.
          ‘నివీనీనే’ సెకండాఫ్ లో హీరో ఆత్మ  అద్దంలో కనబడుతున్నవ్యక్తి శరీరంలోంచి  బయటికి వచ్చే విఫలయత్నంతో కథ, అసలు తనెలా చనిపోయాడో తెలుసుకునే కథ, బ్రెయిన్ సర్జరీ ద్వారా బయటికి రావాలనే కథ, తనకో తల్లి వుందని తెలిసి ఆమెతో సెంటిమెంటల్ కన్నీళ్ళ కథ. సెకండాఫ్ సిండ్రోంతో గజిబిజి గందరగోళం.
          మరి ఇంటర్వెల్లో వేరే సినిమా ముగింపు ట్విస్టు వర్కౌట్ కాకపోతే ఏ ట్విస్టు పెట్టాలి? ట్విస్టు డైనమిక్స్ ఏమిటి?
                                     **
          1973 లో హాలీవుడ్ లో ‘40 క్యారట్స్’ అనే సినిమా వచ్చింది. ఇది బేతాళ కథలా వుంటుంది. దీన్ని తమిళంలో కె బాలచందర్ కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధ, మేజర్ సౌందరరాజన్, రజనీ కాంత్ లతో 1975 లో ‘అపూర్వ రాగంగళ్’ గా తీశారు. దీన్నే దాసరి నారాయణరావు 1976 లో నరసింహ రాజు, శ్రీవిద్య, జయసుధ, సత్యనారాయణ, మురళీమోహన్ లతో ‘తూర్పు పడమర’ గా తీశారు.
          ఇందులో కథ నరసింహ రాజు, శ్రీవిద్యలు ప్రేమించుకుంటారు, జయసుధ, సత్యనారాయణలు ప్రేమించుకుంటారు. జయసుధ శ్రీవిద్య కూతురని, నరసింహరాజు సత్యనారాయణ కొడుకని కథ మధ్యలో తెలిసి షాక్ తో ట్విస్టు పడుతుంది?
          ఇప్పుడేం చేయాలి? ఈ ట్విస్టు నెలా విప్పాలి? తండ్రీ కొడుకులు తల్లీ కూతుళ్ళని ప్రేమించారు. తండ్రి కూతుర్ని ప్రేమించాడు, కొడుకు తల్లిని ప్రేమించారు.
          ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది? అని పాట. బేతాళ కథల్లో 24 వ కథ ఇదే. కొడుకు రాణిని ప్రేమిస్తాడు, తండ్రి రాకుమారిని ప్రేమిస్తాడు.
          ఈ వావివరసల చిక్కు ముడిని విప్పడానికి తమిళంలో రజనీ కాంత్ పాత్రని ప్రవేశపెడతారు, తెలుగులో మురళీ మోహన్ పాత్రని ప్రవేశపెడతారు.
          అంటే ఇక్కడ కథ మధ్యలోపడ్డ ట్విస్టు విప్పడానికి తాళంచెవి పాత్రని వాడారు.
ట్విస్టులో మలుపు వుండదు, పజిల్ వుంటుంది. ఈ పజిల్ ని విప్పే తాళం చెవిని కనుగొన గల్గితేనే కథ ముందుకెళ్తుంది.
          కథ మధ్యలో ట్విస్టు వేస్తే దాన్ని విప్పే తాళం చెవి పాత్రని కనుగొని చివర్లో వాడాలి. అంతవరకు ఈ చిక్కుముడి ఎలా వీడుతుందన్న సస్పన్స్ తో దృశ్యాలు నడపాలి.
***
          చివరిగా - రస్ట్ హిల్స్ తన పుస్తకంలో ఏమంటాడంటే, ట్విస్టు మిస్టరీగా, కాన్ఫ్లిక్ట్ గా, టెన్షన్ గా మూడు రకాలుగా వుంటుందని.  
         మిస్టరీ ఫీల్ తో వుంటే, అది క్యూరియాసిటీ పెంచుతుందని. కాన్ఫ్లిక్ట్ తో వుంటే, అది డైలమాని సృష్టిస్తుందని, టెన్షన్ తో వుంటే, అది రిలీఫ్ ని డిమాండ్ చేస్తుందని. 
          మిస్టరీకి తగు వివరణ నిచ్చి క్యూరియాసిటీని తీర్చ వచ్చని, కాన్ఫ్లిక్ట్ కి తగు నిర్ణయం  తీసుకుని డైలమాని నివృత్తి చేయవచ్చని, టెన్షన్ కి తగు సంతుష్టీకరణతో రిలీఫ్ నివ్వచ్చని.

సికిందర్