రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, నవంబర్ 2015, గురువారం

లవ్ 'మ్యాటర్'
రచన- దర్శకత్వం : ఆధిక్  రవిచంద్రన్

తారాగణం : జివి ప్రకాష్ కుమార్, ఆనంది, మనీషా యాదవ్, సిమ్రాన్, రోబో శంకర్, జ్యోతి లక్ష్మి, విటివి వెంకటేష్, అతిధి నటులు: ఆర్య, ప్రియా ఆనంద్, ఆధిక్ రవిచంద్రన్  
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : జివి ప్రకాష్ కుమార్,  కెమెరా : రిచర్డ్ ఎం.  నాథన్, ఎడిటింగ్ : ఆంథోనీ ఎల్. రూబెన్ 
బ్యానర్ :  రుషి మీడియా , నిర్మాత : సిజె జయకుమార్ 
విడుదల : 5 అక్టోబర్, 2015

           యువ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఇంకో వైపు హీరోగా నటిస్తూ బిజీ అయిపోయాడు. కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలు పోషిస్తూ వచ్చిన ఇతను, ఈ సంవత్సరం జనవరిలో ‘ప్రేమకథా చిత్రమ్’  తమిళ  రీమేక్ అయిన ‘డార్లింగ్’ లో హీరోగా నటించి మంచి  హిట్ ఇచ్చాడు. తిరిగి వెంటనే  ‘త్రిష ఇల్లానా నయనతార’  లో కూడా హీరోగానే  నటించి ఇంకో హిట్టిచ్చాడు. ఇదే ఇప్పుడు ‘త్రిష లేదా నయనతార’  గా తెలుగులో డబ్బింగ్ అయ్యింది. కొత్త దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఈ సినిమాతో ఒక అడల్ట్ కామెడీని అందించాడు. యువతరం ప్రేమల్ని కాస్త పచ్చిగానే  చూపిస్తూ అమ్మాయిల్ని ఎలా ప్రొజెక్ట్ చేశాడో ఈ కింద చూద్దాం... 

కథేమిటి
    జీవా ( ప్రకాష్ కుమార్), రమ్య (ఆనందిని), ఆదితి ( మనీషా యాదవ్) లు ఒకే ఆస్పత్రిలో పుట్టి ఒకే స్కూల్లో చదువుకుంటారు. జీవాకో  బాబాయ్ (విటివి వెంకటేష్ ) వుంటాడు. అమ్మాయుల విషయంలో కలిగే సందేహాలన్నిటినీ ఇతడితో తీర్చుకుంటుంటాడు జీవా. ఇంటర్మీడియేట్ లో చేరాక ఓ వారం పాటు ఆదితి బెంగళూరు వెళ్తుంది. దీంతో క్లాస్ మేట్  ప్రోద్బలంతో  రమ్య కి క్లోజ్ అవుతాడు జీవా. కానీ ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం చాలదు. ఆ పని ఆమె చేసేస్తుంది.ఇద్దరూ ప్రేమలో పడి  ఓ రాత్రి షికార్లు తిరిగి వస్తారు. తెల్లారి ఈ విషయం క్లాస్ మేట్ కి చెప్తాడు జీవా . క్లాస్ మేట్ ఊరంతా  టాంటాం చేస్తాడు. దీంతో అవమానం ఫీలయిన రమ్య జీవాకి ఛీ కొట్టేసి తెగతెంపులు చేసుకుంటుంది. అతనేం చెప్పినా విన్పించుకోకుండా చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఆందోళనలో వున్న జీవాకి ఆదితి నుంచి ఫోన్ రావడంతో వెంటనే ఆమెని ప్రేమించడం మొదలెడతాడు.  

    ఆదితి తాగుడు మరుగుతుంది. మానెయ్యమంటే అలాగేనని ప్రామీజ్ చేస్తుంది. కానీ పబ్ లో మళ్ళీ తప్ప దాగి కన్పించేసరికి హర్ట్ అవుతాడు. తాగిన మైకంలో అతణ్ణి అవమానించి వెళ్ళ గొడుతుంది. ఈమెని కూడా మర్చి పోవడానికి ఇప్పుడు రాజమండ్రిలో వైన్ షాపు నడుపుతున్నబాబాయ్ దగ్గరి కెళ్ళి పోతాడు. తీరా అక్కడి కెళ్ళే సరికి అక్కడే జాబ్ చేస్తూ వుంటుంది రమ్య. వెంటనే అతడికి మళ్ళీ  ఆశ చిగురిస్తుంది. మూడేళ్ళ  తర్వాత కూడా ఇంకా ద్వేషిస్తున్న ఆమెని ప్రేమించేట్టు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ ప్రయత్నాలు ఎలా సాగాయి. ఎవరెవరు తోడ్పడ్డారు, రమ్య ప్రేమలో పడిందా లేదా, పడితే ఈ ప్రేమ ఇంకే మలుపు తిరిగిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
       యూత్ ని, ముఖ్యంగా అబ్బాయిల్ని దృష్టిలో పెట్టుకున్న కథ ఇది. దండిగా ద్వందార్ధాలు దట్టించి అడల్ట్ -సెక్స్ కామెడీగా వదిలారు. అబ్బాయిల క్రేజ్ ని సొమ్ము చేసుకోవడానికి అమ్మాయిల్ని నెగెటివ్ గా చూపిస్తూ, విరివిగా కామెంట్లు చేశారు. అమ్మాయిలు అహం తప్ప ఇంకేదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉంటారని చూపిస్తూ, కన్యలు  ఎప్పుడో డైనోసార్ల కాలం నుంచే లేరని చెప్పిస్తారు. కేవలం కామోద్రేకాల్ని రెచ్చగొట్టి అబ్బాయిల జేబులు కొల్లగొట్టాలన్న దృష్టితోనే ఈ కథ వుంది తప్ప- ఆనాడు డా. దాసరి నారాయణరావు తీసిన ‘నీడ’ లాంటి అబ్బాయిల్ని హెచ్చరించే కథ మాత్రం కాదు. తెలుగులో దర్శకుడు దాసరి మారుతీ ఈ పంథాలోనే వెళ్లి ఫుల్ స్టాప్ పెట్టుకున్నలాంటి కథనే, తమిళ దర్శకుడు తన ఎంట్రీకి వాడుకున్నాడు. తమిళ మారుతీ అన్పించుకున్నాడు.

ఎవరెలా చేశారు 
     ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఇలాటిదే మన తెలుగు సినిమాలో నైతే యువ హీరోలు నానా ఓవర్ యాక్షన్లూ, వెకిలి తనాలూ చేసి భరించ లేకుండా చేసేవాళ్ళు. కనీసం ఈ పని చెయ్యనందుకు హీరో ప్రకాష్ కుమార్ ని అభినందించాలి. సహజత్వం పేరుతో పచ్చిగా నటించాడు తప్పితే  ఓవరాక్షన్ చేయలేదు. దిసీజ్ జీవీ ప్రకాష్ కుమార్ అన్న ఇగో ప్రదర్శించలేదు. గల్లీల్లో తిరిగే అతి సాధారణ కుర్రాడు ఎలా ఉంటాడో, ఆ తీరులో కన్పిస్తూ మంచి ఈజ్ తో నటించాడు. ఇంతా చేసి అబ్బాయిలకి ఏం చెప్పాడన్నది అలా ఉంచితే, ఓ అమ్మాయి ఛీ కొడితే ఇంకో అమ్మాయి వెంట పడే ఠికానా లేని పాత్రగా మాత్రంప్రేక్షకులకి కన్పిస్తాడు. తనే సంగీతం వహించిన ఈ సినిమాలోని పాటలు మాస్ ధోరణిలో అన్నీ డప్పు పాటలే కావడం ఉద్దేశపూర్వకంగా చేసినట్టుంది. అంటే మధ్య తరగతిలో కూడా మరీ స్లమ్ డాగ్ మిలియనీర్ లాంటి బస్తీ కుర్రాడన్నమాట. 

    హీరోయిన్లలో ఆనందిని తెలుగులో మారుతీ తీసిన ‘బస్టాప్’ లో హీరోయినే. గ్లామర్ పాత్రలకి కాకుండా ఇలా నటనకి అవకాశం వున్న  మధ్యతరగతి అమ్మాయి పాత్రలు ఆమెకి బాగా సెట్ అవుతాయని అన్పిస్తుంది చూస్తూంటే. ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు మెయిన్ హీరోయిన్ మర్యాదగానే వుండాలి కాబట్టి ఆ ఫార్ముల ప్రకారం ఒద్దికగా నటించింది గానీ, పాత్ర అసలుకైతే అంత పవిత్రమైనదేం  కాదు.

    రెండో హీరోయిన్ ఫాస్ట్ గా వుండే మనీషా యాదవ్ కూడా అమ్మాయిల్ని నెగెటివ్ గా చి త్రించడానికి ఉపయోగ పడిన మరో నటి. తాగుడు  సీన్లలో తడబడకుండా నటించేసింది. మెయిన్ హీరోయిన్ ఆంటీ గా సిమ్రాన్, సెకండ్ హీరోయిన్ బామ్మగా జ్యోతి లక్ష్మీ నటించారు. చివర్లో అతిధి పాత్రలో తమిళ స్టార్ ఆర్య వచ్చి కాస్సేపు హడావిడి చేస్తాడు.

    ఈ సినిమాకి రిచర్డ్ ఎం. నాథన్ కెమెరా వర్క్ చెప్పుకోదగ్గది. చిన్న బడ్జెట్ సినిమాని కూడా రిచ్ గా చిత్రీకరించాడు.
రామ జోగ‌య్య‌శాస్త్రి, వెన్నెల‌కంటి, శ్రీమ‌ణి, రాఖీ పాటలు రాశారు. శశాంక్ వెన్నెల కంటి మాటలు రాశారు.

చివరి కేమిటి
     దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కేవలం సెక్స్ కంటెంట్ తో యువ ప్రేక్షకుల్లో అబ్బాయిల్ని ఆకర్షించడానికి ఈ సినిమా తీశాడు తప్పితే ఎలాంటి మంచి చెప్పడానికీ  కాదు. ఇదీ ఒకందుకు నయమే- బూతంతా చూపించి చివర్లో నీతి  చెప్పడం కంటే! ఆ మాటకొస్తే, గతవారమే  విడుదలైన కునాల్ ఖేమూ నటించిన హిందీ ‘గుడ్డూ కా గన్’ మరీ  ఘోరమైన సెక్స్ కామెడీ. అయితే తమిళ దర్శకుడు  హీరోని అతి పవిత్రుడుగా, హీరోయిన్లని మాత్రం  క్యారక్టర్స్ లేని అమ్మాయిలుగా చూపించిన  ఏకపక్ష కథనంలో,  ఆ అమ్మాయిలపట్ల చివరికెలాటి సానుభూతినీ సృష్టించ లేకపోయాడు, సెక్స్ బొమ్మలుగానే చూపించి రెచ్చగొట్టడం తప్పితే! తమిళంలో దీన్ని హిట్ చేశారంటే అది హీరోగా నటించిన ప్రకాష్ కుమార్ వల్ల కావచ్చు. కానీ తెలుగులో ప్రకాష్ కుమార్ కి ఆదరణ సంగతెలా వున్నా, ఇలాటి కేవలం బూతు సినిమాలంటే  మారుతి తీసిన రెండు మూడు సినిమాలతోనే మొహం మొత్తింది ప్రేక్షకులకి. తిరిగి అదే బాపతు ఇప్పుడు ప్రత్యక్షమయింది యువ ప్రేక్షకుల ఎదుట!          

    ‘లవ్ అంటేనే  ఆ మ్యాటర్, ఆ మ్యాటర్ ఉంటేనే లవ్’ అని హీరోయిన్ చేత అన్పించి తేల్చిన దర్శకుడు, ఆ ప్రకారం హీరోని ఆ మ్యాటర్ లోకి ఎందుకు దించలేదో, దించకూడదో అర్ధం గాదు. మళ్ళీ ఈమెని ఛీ కొట్టి వెళ్ళిపోయిన వాడు ఇంకో అమ్మాయి కనపడగానే ఆమె వెంట ఎలా పడతాడో అర్ధంగాదు - డైనోసార్ ల కాలం నుంచీ కన్యలు లేరని బాబాయ్ కూడా తేల్చాక! ఈ లెక్కన ఈ పవిత్రుడైన అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఒక అర్ధం పర్ధంలేని పెర్వర్షన్ తో కూడిన ఇలాటి సినిమాల కంటే ‘గుడ్డూ కా గన్’ లాంటి సెక్స్ పిచ్చోడి పాట్లనీ, వాడికి జరిగే శాస్తినీ కామెడీగా చూపించే సినిమాలు బెటర్.                     
                                           

-సికిందర్