రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, జులై 2016, శనివారం

షార్ట్ రివ్యూ!


రచన- దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మప్రియదర్శి పులికొండ,
నందు, అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నగేష్‌ బానెల్‌
బ్యానర్‌: ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌
సమర్పణ: డి. సురేష్‌బాబు
నిర్మాతలు: రాజ్‌ కందుకూరి, యష్‌ రంగినేని
విడుదల : జులై 29, 2016
***
      చిన్న బడ్జెట్ సినిమా అంటే పెద్ద బడ్జెట్ సినిమాల హంగూ ఆర్భాటాల్ని అనుకరించే నాసిరకం ఉత్పత్తులుగా, ఒక జోకుగా, హాస్యాస్పదంగా మారిపోయి- వారంవారం కుప్పతెప్పలుగా వచ్చిపడుతున్న  హవా నడుస్తూండగా, చెంపపెట్టులా ప్రత్యక్షమయింది ‘పెళ్లి చూపులు’ అనే రియలిస్టిక్ ఫిక్షన్. చిన్న బడ్జెట్ సినిమా అంటే రియల్ లైఫ్ అనీ, పెద్ద బడ్జెట్ సినిమా అంటే లార్జర్ దేన్ లైఫ్ అనీ  నిర్వచనాన్ని కూడా వదిలేసి టోకున ఖజానా ఖాళీ చేసుకుంటున్న చిన్నచిన్న నిర్మాతలకీ, పెద్ద సినిమాల మత్తులో జోగే ఛోటా మోటా దర్శకులకీ లాగి లెంప కాయకొట్టినట్టు దర్శనమిచ్చింది ‘పెళ్లిచూపులు’. నిజమైన సినిమా చూసే భాగ్యానికి నోచుకోనివ్వకుండా ప్రేక్షకుల నెత్తిన నానా చెత్త రుద్దుతున్న- అసలీ నోట్లు తీసుకుని నకిలీ సినిమాలు చూపిస్తున్న వాళ్ళందరికీ ‘బయటికి పోవు దారి’ చూపిస్తున్నట్టు బెత్తం పుచ్చుకుని వచ్చింది ‘పెళ్లిచూపులు’... 

         
కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ క్రాసోవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది రోమాంటిక్ కామెడీయే అయినా నేటి రోమాన్స్ ని షార్ట్ ఫిలిం మేకర్స్ ఎలా ఫీలవుతున్నారో గత కొన్ని రివ్యూల్లో చెప్పుకున్నాం. రుచీ పచీ వుండని మూస ఫార్ములా ప్రేమ సినిమాలకి ఆవల పల్లెల్లో, నగరాల్లో యూత్ ప్రేమల రియలిస్టిక్ ప్రపంచమంటూ ఒకటుంది. ఆ ప్రేమల్ని షార్ట్ ఫిలిం మేకర్స్ పట్టుకుని లవ్ మార్కెట్ లో వాస్తవికతని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ముందు మూస సినిమాల మాసిపోయిన ప్రేమలు వెలవెలబోతున్నాయి. అందుకే కృత్రిమ ప్రేమ సినిమాల వైపు యువ ప్రేక్షకులు కన్నెత్తి చూడ్డం లేదు. దీన్ని బ్రేక్ చేస్తూ నేటి యూత్ కి నచ్చే రియలిస్టిక్ ఫిక్షన్ తో ‘పెళ్లి చూపులు’ తీశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. 

        ‘పెళ్లి చూపులు’ అనగానే ఇదేదో పెళ్లి వ్యవస్థమీద అంటూ కృష్ణ వంశీ తీసిన ‘మొగుడు’ లాంటి, నందినీ రెడ్డి తీసిన ‘కళ్యాణ వైభోగమే’ లాంటి యూత్ కి ఏమాత్రం పట్టని పురాతన సోకాల్డ్ సందేశాల సంతర్పణ కాదిది. జీవితం పట్ల అత్యధిక శాతం  యువత కుండే భిన్నదృక్పథాల వితరణ ఇది. భుక్తి మార్గమేమిటో కూడా తెలుసుకోకుండా అర్జెంటుగా పెళ్ళో అంటూ ప్రాకులాడే సత్యదూరమైన అపరిపక్వ హీరో హీరోయిన్ల మూస ఫార్ములా పాత్రలు కావివి... పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు డాన్సులూ ఫైట్లూ కామెడీ లాంటి పెద్ద సినిమాల హంగుల  కోసమైతే ఈ సినిమా చూడక్కర్లేదు (ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవనీ, మాస్ వేల్యూస్ కూడా లేవనీ ఓ  రివ్యూ రైటర్ బాధ పడ్డాడు! అన్ని సినిమాల్నీ ఒకే రంగుటద్దాల్లో చూడాలన్న అవగాహనతో వున్నాడు కాబోలు ...)

       
అసలిప్పుడు ప్రేమంటే ఏమిటో?

కథ
      ప్రేమంటే వృత్తి వ్యాపకాలు. ఏ వృత్తీ లేనివాడికి ప్రేమే దక్కదు. కానీ ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) కి వృత్తి చేసుకు బతకాలంటేనే బద్ధకం. ఏ పనీలేక సోమరిపోతులా జీవించడమే ఇష్టం. కోటి రూపాయలు కట్నమిస్తే బ్యాంకులో ఎఫ్ డీ చేసుకుని ఆ వచ్చే  వడ్డీ మీద బతుకు లాగించెయ్యాలని ప్లాన్. అపసోపాలుపడి ఎలాగో ఇంజనీరింగ్ చేసిన కొడుకు ప్రశాంత్ ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవడంతో విసిగిపోయిన తండ్రి,  పెళ్లి చేసి పడేస్తే వాడి పాట్లు వాడు పడతాడని ఒక సంబంధం చూస్తాడు. ఆ పెళ్ళిచూపులకి వెళ్తే ఆ అమ్మాయి చిత్ర (రీతూ వర్మ) తో పొరపాటున గంట సేపు గదిలో బందీ అయిపోతాడు.  ఆమె ఎంబీఏ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయే ప్లాన్ తో వుంది, ఈ పెళ్ళీ గిళ్ళీ ఏమీ పట్టడం లేదు. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు తండ్రి ఇవ్వడం లేదు. ఏదో బిజినెస్ చేసి ఆ డబ్బు సంపాదించే ఆలోచనతో వుంది. ఆ బిజినెస్ పెట్టబోతే బాయ్ ఫ్రెండ్ మోసం చేసి పారిపోయాడు...

        ప్రశాంత్  తను కూడా ఎవత్తితో ఎలా తిరిగితే ఏం జరిగిందో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు. మార్చి మార్చి చెప్పుకునే ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాకులూ తూర్పు పడమరలు. ఒకే పాయింటు  దగ్గర ఇద్దరి అభిరుచులూ కలుస్తాయి : అది సాస్ లేకుండా సమోసా తినే దగ్గర. 

        మొత్తానికి కెరీర్ మైండెడ్ గా వున్న ఈమె, కెరీర్ నే  సన్యసించిన తనకి లొంగే అవకాశం లేదని నిరాశ పడ్డాక, అసలు విషయం తెలుస్తుంది- తను రాంగ్ అడ్రసుకి పెళ్లి చూపుల కొచ్చాడని. తను వెళ్ళాల్సింది వేరే ఎనిమిదో నంబర్ వీధిలో ఇంటికని!

        మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, కలిస్తే అక్కడ్నించీ వాళ్ళ సంబంధం ఎలా కొనసాగింది, అప్పుడేమేం జరిగాయన్నది మిగతా ద్వితీయార్ధపు కథ. 

ఎలావుంది కథ 
     చాన్నాళ్ళకి తెలుగులో ఒక ఫ్రెష్ కథ చూస్తున్నట్టు వుంది. కథంటే పాత్రలూ సంఘటనలూ కూడా కాబట్టి, ఇవి కూడా ఎక్కడా మూస ధోరణుల్లోకి తిరగబెట్టకుండా ఆద్యంతం ఎక్కడికక్కడ ఆధునిక పోకడలతో, ఆధునిక మనస్తత్వాల మదింపుతో ఆలోచనాత్మకంగా వుంది- ఇదంతా తెలుగు నేటివిటీని  కాపాడుతూనే. ప్రధానంగా ఈ కథ  పేరెంట్స్ కీ వాళ్ళ పిల్లలకీ  మధ్య వుండే అంతరాల గురించే తప్ప, రొటీన్ గా ప్రేమికుల మధ్య ప్రేమకి వుండే అడ్డంకుల గురించి కాకపోవడంతో, ఆ అంతరాలు కూడా పైన చెప్పుకున్న ‘మొగుడు’ లో లాగా,  కళ్యాణ వైభోగమే’ లోలాగా పెద్దలు చాదస్తపు క్లాసులు పీకే తత్త్వంతో కాక, ఆయా పరిణామాలే పరస్పరం పిల్లల్నీ పెద్దల్నీ మార్చే విజువల్ నేరేషన్ వల్ల ఈ కథ వాస్తవికతతో కూడుకున్న వినోదాత్మక విలువలతో  వుంది. ఎలాటి కృ త్రిమత్వపు ఛాయల్లేకుండా మనచుట్టూ జరిగే నిజప్రపంచం లాగే వుంది ఈ కథ. 

ఎవరెలా చేశారు
     ప్రతీ వొక్కరూ సహజ నటనతో రక్తి కట్టిస్తారు ఇందులో. హీరో విజయ్ దేవరకొండ –హీరోయిన్ రీతూ వర్మల నేచురల్ నటన ఎసెట్ ఈ సినిమాకి. పాత్రచిత్రణలు సింపుల్ గానే  వున్నా వీళ్ళవి  సంకీర్ణ పాత్రలు. ఇద్దరి మధ్యా సమస్య పెద్దదే, అయినా సంఘర్షణ భీకరంగా ఉండనవసరం లేదు. డ్రామా, మెలోడ్రామా,  సెంటి మెంట్లు మొదలైన వాటికి దూరంగా మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ టెక్నిక్ తో నిలబడ్డ పాత్రలివి. బిగ్ కమర్షియల్ సినిమాల్లో చూసినా ఏ టాప్ హీరోయినూ వేయనంత  ముద్ర తన సింపుల్ నటనతోనే సాధిస్తుంది రీతూ వర్మ. ఆమె ఫీలింగ్స్ నీ, ఆలోచనల్నీ  క్లోజప్స్ లో పట్టుకున్న తీరుతో ఆమె కలకా లం గుర్తుండిపోతుంది. అలాగే కామన్ బాయ్ గా కన్పించే విజయ్ పాత్రలోని హాస్య ధోరణి, అతడి ఫ్రెండ్స్ గా  నటించిన ప్రియదర్శి పులికొండ, అభయ్ ల ఫన్నీ కామెడీ కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యంగా హైదరాబాదీ తెలుగులో ప్రియదర్శి పులికొండ తన మాట తీరుతో ఒక భిన్నమైన కమెడియన్ గా పరిచయమవుతాడు. విజయ్- ప్రియదర్శి-అభయ్ ముగ్గురూ వున్న ప్రతీ సీనూ ఓ కామిక్ టానిక్కే. 

       పెద్దవాళ్ళ పాత్రల్లో అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ లు చాలా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా మనుషులిలాగే వుంటారు- సినిమాల్లో కొచ్చేసి నాటకీయంగా, ఓవర్ యాక్షన్స్ తో, సినిమా డైలాగులతో ఎందుకుండాలి? సినిమా చూస్తున్నట్టు వుంటే అది సినిమా ఎందుకవుతుంది? 

        ఎక్కడా సినిమా డైలాగులు విన్పించకుండా, ఎక్కడా సినిమా చూస్తున్నట్టు అన్పించకుండా దర్శకుడు కళా దర్శకత్వాన్నీ, ఛాయాగ్రహణాన్నీ, సంగీతాన్నీ, నటీనటుల ఆహర్యాన్నీ, లొకేషన్స్ నీ, సమస్తాన్నీ -  తన ఆధీనంలోకి తెచ్చుకుని- ఏ వొక్కటీ దేన్నీ డామినేట్ చేయకుండా ఏకత్వాన్ని సాధించడమే దర్శకత్వం అన్నట్టు పనిచేసుకుపోయాడు దర్శకుడు. 

    నటీనటుల దగ్గర్నుంచీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ తెలంగాణీయులే కావడం మరో ప్రత్యేకత. సాధారణంగా  తెలంగాణా సినిమా అంటే చిన్న చూపు వుంది. కారణం- ఎంతసేపూ అవే పోరాట కథలు తీస్తారని. కానీ ప్రధాన స్రవంతి లోకొచ్చి  ప్రాంతీయత కతీతంగా  కమర్షియల్ సినిమాని  తామూ  తీయగలమని ప్రప్రథమంగా ఈ సినిమాలో ప్రతీ వొక్కరూ నిరూపించారు. అదీ ఇంత  డిఫరెంట్ గా, ఇంత జనరంజకంగా!

చివరికేమిటి
        ప్రేక్షకులకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, తీస్తున్నవి సినిమాలనుకుంటూ ఇరు రాష్ట్రాల ప్రేక్షకుల్ని రాచిరంపాన పెడుతున్న వాళ్ళకి కనువిప్పూ!


-సికిందర్
http://www.cinemabazaar.in