రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, May 24, 2020

947 : సందేహాలు - సమాధానాలు

Q: మొన్న టీవీలో వచ్చినప్పుడు ‘హిట్’  సినిమా చూసాను. కాని మీ అంత పరిశీలనగా చూడలేదు. చిన్నప్పుడెప్పుడో జరిగినదానికి ఇప్పుడు పగ తీర్చుకోవడం, దానికి పోలీస్ అయిన భర్త అడ్డు చెప్పి, మానసిక వైద్యుడికి చూపించకపోవడంలో అర్థం లేదు. అలాగే చంపటానికి అంత స్కెచ్ వేసి కిడ్నాప్ చెయ్యాలా? రోడ్డు మీద నుంచున్నప్పుడు ట్రక్కుతో గుద్దించి చంపవచ్చు, లేకపోతే సింపుల్ గా ఎక్కడో అక్కడ కాల్చి పారేయచ్చు. ఇకపోతే షీలాలా ఎవరైనా కోరి మర్డర్ కేసుల్లో తల దూరుస్తారా? చాలా లాజిక్‌లు మిస్సయ్యాయి.

        ఇలాగే ‘అతడు’ సినిమా చాలా సార్లు టివిలో (కామెడి కోసం) చూసినప్పుడల్లా అనుకుంటాను. సిబిఐ అంత దిక్కుమాలిన ఇన్వెస్టిగేషన్ చేస్తుందా అని?  అసలు ప్రకాష్‌రాజ్ ఏం వెతుకుతున్నాడో అతనికైనా తెలుసా? సినిమాలో చాలా లాజిక్కులు మిస్సయ్యాయి. మహేష్ భవనం కిందకి దూకినప్పుడు అక్కడికి రైల్వే స్టేషన్ ఎలా వస్తుందో?  రైలు మీదకు దూకినప్పుడు ఎలక్ట్రిక్ వైర్లు తగలలేదా? గుడివాడలో మిస్సయిన చరణ్‌రాజ్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్‌లో కనపడడు. బాంకులు పేరు కూడ చూడకుండా చెక్కులు పాస్ చేస్తాయా? ఇలా చాలా ఉన్నాయి. ఈ సినిమాని మీ స్టయిల్లో వివరంగా విశ్లేషించవలసిందిగా కోరుతున్నాను.
బోనగిరి, బ్లాగర్ 

A: ఇంకెందుకు అయిపోయిన దానిగురించి. విషయమేమిటంటే అప్పట్లో ‘అతడు’ చూడడం కుదర్లేదు. తర్వాతెప్పుడూ చూడాలన్పించలేదు. ఎందుకో తెలీదు, అలా గడిచిపోయింది. ఇప్పుడు మీరు చెప్తూంటే విశేషాలు తెలుస్తున్నాయి. లాజిక్ అవసరం లేని ‘మ్యాజిక్’ కదా, అలాగే వుంటుంది. సినిమాల్ని గారడీ వాడి ఆటగా మార్చేస్తే చప్పట్లు కొట్టక ఏం చేస్తారు. ఇక ‘హిట్’ గురించి మీరు చెప్పింది బావుంది. రోడ్డు మీద నించున్నప్పుడు ట్రక్కుతో గుద్దించి చంపవచ్చు, తుపాకీతో కాల్చి పారేయ్యొచ్చు. దానికో స్కెచ్, కిడ్నాపూ అవసరం లేదు. అసలు తనే కారుతో గుద్ది చంపేయ వచ్చు. భర్త అడ్డు చెప్పకపోవడం కూడా ఒకటి. మానసిక వైద్యం ఆమెకి కాదు, కథకే కామన్ సెన్సు వైద్యం అవసరముంది. హిట్ -2 లోనైనా ఈ వైద్యం జరుగుతుందో లేదో చూద్దాం.

Q:  రోమాంటిక్ డ్రామాలకు అలాగే రోమాంటిక్ కామెడీలకు తేడాలు చెప్పండి. రెండు జానర్స్ లో పాసివ్, ఆక్టివ్ పాత్రలు, వాటి గ్రోత్ ఎలా ఉండాలి తెలియజేయండి. రోమాంటిక్ డ్రామా లలో పెద్దల పాత్రలతో ప్రధాన పాత్రలకు లక్ష్యాలు ఏర్పడడం లేదా వాళ్ళు మారడం లేదా వాళ్ళు చెప్పిన మాటలు విని  కలుసుకోవడం లేక విడిపోవడం జరుగుతుంటాయి, ఇవి ఎంత వరకు కరెక్ట్ అంటారు. అలాగే రెండు జానర్స్ లలో క్రియేటివ్ గా ఆలోచించి ఏవైనా రూల్స్ బ్రేక్ చేస్తూ కథలు చేసుకోవచ్చా? మిడిల్ సీన్లంటే క్యారక్టర్ గ్రోత్ లేదా యాక్షన్ కంటిన్యూటీ, ఏదో ఒకటై వుంటాయి అని మీరే ఒకసారి చెప్పారు. మరి ఈ జానర్ లలో అదెలా వుండాలో కూడా వివరించండి.
డివి, అసోసియేట్ 

 A: రోమాంటిక్ డ్రామా, రోమాంటిక్ కామెడీ తేడాల గురించి అనేక సార్లు చెప్పుకునీ చెప్పుకునీ అలసిపోయాం కదా. 2016 లో ‘రోమాంటిక్ కామిడేడ్పులు’ అని ఏకంగా ఆ ర్టికలే రాశాం. ఆ కింద లింక్ ఇచ్చాం, చూడండి. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. ఇక ఈ జానర్స్ లో క్రియేటివ్ గా ఆలోచించి రూల్స్ బ్రేక్ చేస్తూ కథలు చేయడం గురించి : రూల్స్ అనేవి సినిమాల్లోంచి ఏర్పడ్డాయి. విజయవంతమైన, పరాజయం పాలైన సినిమాల్లోని స్టోరీ మెకానిజంలని చూసి, ఇలాతీస్తే బావుటుంది, ఇంకిలా తీస్తే బావోదు అని రూల్సు ఏర్పాటు చేశారు. సినిమాల్లోంచే శాస్త్రం పుట్టింది, శాస్త్రంలోంచి సినిమాలు కాదు. పదార్థం లేక శాస్త్రం లేదు. ముందు పదార్థం, తర్వాతే దాన్ని బట్టి శాస్త్రం. న్యూటన్ నెత్తి మీద ఆపిల్ పండు రాలిపడితే, దాన్నిబట్టి భూమికి గురుత్వాకర్షణ శక్తి వుందని తెలుసుకుని శాస్త్రం రాశాడు. స్ట్రక్చర్ కూడా సినిమాల్ని పరిశీలించే పుట్టింది. ముందు స్ట్రక్చర్ రాస్తే దాంతో సినిమాలు పుట్టలేదు. అరిస్టాటిల్ నాటకాలు చూసే నాటక శాస్త్రం రాశాడు. భరతముని నాట్యం చూసే నాట్య శాస్త్రం రాశాడు. ట్రాఫిక్ లో గుద్దుకు చస్తుంటే అది చూసి ట్రాఫిక్ రూల్స్ ఏర్పడ్డాయి. చేసే వాడు రాయడు, చూసే వాడు రాస్తాడు. ఎండ్ సస్పెన్స్ తీస్తే సినిమాలు ఫ్లాపవుతాయని ప్రాచీనుడెవరైనా తాళపత్రాల మీద రాశాడా? ఎండ్ సస్పెన్స్ సినిమాలు ఫ్లాపవుతున్నాకే ఎందుకుఫ్లాపవుతున్నాయో అందులోని కారణాలతో పరిశీలకులు హెచ్చరించారు. ‘ఈక్వలైజర్ టూ’ లో రొటీన్ కథకి మిడిల్ తగ్గించి, 40 నిమిషాలు క్లయిమాక్స్ పెట్టుకుంటే సక్సెస్ అవుతుందని ఎవరైనా ముందు రూల్స్ చెప్పారా? దర్శకుడు అలా తీశాక, అవును ఇది కూడా ఒక రూలే కదా అని పరిశీలకులు చెప్పగల్గుతున్నారు. రూల్స్ ఎవరి మెదళ్లలోంచీ వూడి పడవు, తీస్తున్న సినిమాల్లోంచే పుట్టుకొస్తాయి. అయితే జరుగుతున్నదేమిటంటే, రూల్స్ సిడ్ ఫీల్డ్ అనే ఎవరో ఏర్పాటు చేశాడనీ, లేదా మెక్ కీ అనే అతను చెబుతున్నాడనీ, వీళ్ళెవరు సినిమాలెలా తీయాలో మా సినిమా వాళ్ళకి చెప్పడానికి, మా సినిమా వాళ్లకి సినిమాలెలా తీయాలో తెలీదా -   మా సినిమా వాళ్ళంటే ఏమనుకుంటున్నారు -అనే వీర ప్రచండ అజ్ఞాన వైఖరి ఏదైతే వుందో - దాంతో వస్తోంది సమస్య. దాంతో వస్తున్నాయి 92 శాతం ఫ్లాపులన్నీ. స్క్రీన్ ప్లే నిపుణుడు, రివ్యూ రైటర్ ఎవరూ సొంత అభిప్రాయాలని రుద్దరు, సినిమాలు స్థాపించిన సూత్రాల్నే తిరిగి గుర్తు చేస్తారు. వీళ్ళు జస్ట్ రిపోరర్స్ లాంటి వాళ్ళు. ఉన్న వాస్తవాన్ని రిపోర్టింగ్ చేస్తారంతే. 

        కాబట్టి, రూల్స్ గురించి అపోహలు తొలగించుకుని, వాటిని బ్రేక్ చేయాలన్న అనవసర కోపతాపాలకి పోకుండా, ముందు తామేం చేయాలో గుర్తిస్తే బావుంటుంది. తీసే పాత మూస సినిమాల వారసత్వ మోజుని బ్రేక్ చేసి, కొత్త తరహా కథలతో కొత్త తరానికి ఏం చెబుతారన్నది ఛాలెంజి అవాలి. కానీ ఈ ఛాలెంజికి ఎవరూ సిద్ధంగా వుండరు. అలాంటప్పుడు ఏ రూల్స్ తోనూ పనిలేని, సినిమా టికెట్లు తెగని, ఇండీ మూవీస్, ఆర్ట్ మూవీస్, వరల్డ్ మూవీస్ లాంటివి తీసుకుని అహాన్ని సంతృప్తి పర్చుకోవచ్చు. 

Q: ప్రేమ కథల్లో సెకండ్ యాక్ట్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఏ ప్రేమ కథ తీసుకున్నా అంతో ఇంతో ఇంట్రస్ట్ గా ఉండే పాత్రలను మొదటి అరగంటలో పరిచయం చేస్తారు ఆ తర్వాత షరా మామూలే. ఆ పాత్రలు బాగానే ఉన్నా ప్రేమకథ లో ఫీల్ కానీ లేదా డెప్త్ కానీ మిస్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది. హీరో హీరోయిన్ ను ప్రేమించాలి, తను అతనికి పడాలి, అని బలంగా ప్రేక్షకుడు కోరుకుని అది జరిగిన తర్వాత, వాళ్ళ ప్రేమ కథలో విషయం లేక నీరసం నిస్సత్తువ ఆవహిస్తాయి ప్రేక్షకులకు. హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డాక ఏం జరగాలి? లవ్ స్టోరీ లలో స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తూ కథలు చేసుకోవచ్చా? ఇవన్నీ వివరించగలరు.
ఏవీ, అసోసియేట్

A: ఏ కథలోనైనా సెకండ్ యాక్ట్ (మిడిల్) బిజినెస్ ఒకటే వుంటుంది. దీని గురించి వివిధ సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాస్తున్న ప్రతీసారీ చర్విత చరణంగా వివరించాకే విశ్లేషణ లోకి వెళ్తున్నాం. ఏ కథకైనా అదే బిజినెస్ వుంటుంది. సమస్యతో పోరాటం, ప్రత్యర్ధి తో యాక్షన్ రియక్షన్ల ఇంటర్ ప్లే. మిడిల్ బిజినెస్ అంటేనే మన సైకలాజికల్ గా, ఒప్పుకుంటే స్పిరిచ్యువల్ గా కూడా - మన కాన్షస్ మైండ్, సబ్ కాన్షస్ మైండ్ ల లడాయే కాబట్టి, ఇది లేకుండా ఏ రకమైన కథా వుండదు. వుంటే కథ కాదు. 

        ప్రశ్నలో మీరడిగిన సందేహాలన్నీ మిడిల్ గురించే. ప్రేమ కథల డైనమిక్స్ అన్నీ మీకు కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చూస్తే తెలుస్తాయి. ఇక స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం గురించి పై ప్రశ్నకి జవాబు చూడగలరు. గతవారం Q&A కూడా చూడగలరు. 

Q: మీరొక పోస్ట్ లో రీసెంట్ గా, అసలు నేను ప్రేమిస్తున్నాను అని పాత్రలు ఒకరికొకరు చెప్పుకోవడం చాలా వరస్ట్ రైటింగ్ అన్నారు. ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశాలు ఎలా ఉండాలి ఉదాహరణలు ఇవ్వగలరు. నోట్: ప్రేమ కథలలో వచ్చేవి అవే మానసిక పరిపక్వ త లేని పాత్రలు కాబట్టి వాళ్ళు తమ ప్రేమను వ్యక్తం చేయడాన్ని సదరు రచయితలు, దర్శకులు కూడా భారీ గానే రాస్తారు తీస్తారు. హీరోలు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారు. అసలు ప్రేమ కథలలో పాత్రల మానసిక స్థితి గతుల గురించి చెప్పండి.
ధీర్, దర్శకత్వ శాఖ 

A: వాళ్ళు ప్రేమలో పడ్డారనే విషయం చూస్తున్న సీన్ల ప్రకారం ప్రేక్షకులకి తెలిసిపోతూంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ఇంకా చెప్పడం దేనికి? ప్రేక్షకులు తెలివి లేని వాళ్ళా? ఆ మేరకు తీసిన ఫుటేజీ బడ్జెట్ వేస్ట్ కదా? ప్రింట్ మీడియా రైటింగ్ తెచ్చి విజువల్ మీడియాకి రాసి పడేస్తే ఇలాగే వుంటుంది. కచ్చితంగా ఇది బోరు కొట్టే సీను. ఇందులో మార్కెట్ యాస్పెక్ట్ గానీ, క్రియేటివ్ యాస్పెక్ట్ గానీ లేదు. యూత్ అప్పీల్ సరే. ఆమె ప్రేమిస్తున్న విషయం ప్రేక్షకులకి కళ్ళారా తెలుసు. అది పాత సంగతే. వొళ్లారా ఆమె ఎలా ప్రేమిస్తోందో ప్రేక్షకులకి తెలియని కొత్త సమాచారం కావాలి. ప్రేమిస్తున్న విషయం అతడికి నిర్ధారణ చేయడానికి వొళ్ళు వూపిందా, కళ్ళు తిప్పిందా, పెదవి కొరికిందా, అసలు నాలిక్కర్చుకుని పారిపోయిందా విజువల్ యాక్షన్ కావాలి. ఏదైనా టిఫిన్ చేసిపెట్టిందా, అతడి పనులు చేసి పెట్టడానికి వెంటపడుతోందా, అతను తిన్న జాంపండు చాటుగా కోరికి ఓల్డ్ డ్రామా చేసిందా, అతడికి గాయమైతే పర్రున చున్నీ చించి కట్టి మెలోడ్రామా ఆడిందా కావాలి. ప్రేమ కథకి విజువల్ యాక్షన్ ప్రాణం. ప్రేమనేది చైతన్య వంతమైనది. వొళ్ళూ మనసూ కదిలిపోయేలా చేసేది. ఫిలిం ఈజ్ బిహేవియర్ అని సింపుల్ గా చెప్పాడు సిడ్ ఫీల్డ్. ప్రియదర్శన్ తీసిన ‘కాంచీ పురం’ లో ఒక స్టన్నింగ్ సీనుంటుంది : నువ్వు నచ్చావని బావ నీకు చెప్పాడా అని పదిహేను పదహారేళ్ళ కూతుర్ని ప్రకాష్ రాజ్ అడిగే సీను. అప్పుడు కూతురు -తను నచ్చానని బావ చెప్పాడని వలవలా ఏడ్చెయ్యడం ఆ వయసుకి ఆమె బిహేవియర్. ఏడ్వకుండా డైలాగు చెప్పేస్తే క్యారక్టర్ లేదు, సీను లేదు. మీరు చెప్పిన మానసిక పరిపక్వత లేని పాత్ర ఇలా వుంటుంది. మానసిక పరిపక్వత లేదు కాబట్టి ఎలా ప్రవర్తించాలో పాత్రకి తెలియదనుకుని రచయితలు, దర్శకులు భారీ డైలాగులు రాసేస్తే అది పాత్ర మానసిక ప్రపంచం మీద దాడి అవుతుంది. పాత్రలోకి వెళ్లి పాత్ర చేత పలికిస్తే, ప్రవర్తింపజేస్తే ఇలా వుండదు. ఇలాటి చిత్రణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రేమ  కథల్లో మానసిక స్థితుల గురించి ఎలా చెప్తాం. ఆ కథల్లో ఏర్పాటయ్యే గోల్ ని బట్టి వుంటుంది.

Q: నేను ఇండీ ఫిలిం చేసే ఉద్దేశంతో వున్నాను. దీనికి బిజినెస్ జరగాలంటే ఏం చేయాలంటారు?
దర్శకుడు  

A: వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- (మీరనే ఇండీ ఫిలిం కూడా) - ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమాల  టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ వుండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే ( అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు. వ్యాపార విలువ లేని కళా ప్రక్రియల గురించి ఆలోచించడం అనవసరమేమో.  

సికిందర్ 

‘రోమాంటిక్ కామిడేడ్పులు’