రచన- దర్శకత్వం : అభిమన్యు
తారాగణం : ప్రియమణి, శాంతీ రావు, శరణ్యా ప్రదీప్, సమీరా, నెట్టూరి నిరజ, ప్రదీప్ రుద్ర, జాన్ విజయ్, కిషోర్ కుమార్ తదితరులు
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, మార్క్
కె రాబిన్, ఛాయాగ్రహణం: వై. దీపక్
బ్యానర్ : ఎస్ వి సి సి డిజిటల్
సమర్పణ : భరత్ కమ్మ
నిర్మాతలు: బాపినీడు, సుధీర్
విడుదల : ఫిబ్రవరి 11,
2022 (ఆహా)
***
సినిమాలకు
దూరమైన ప్రియమణి డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద బిజీ అవుతోంది. ‘ఫ్యామిలీ
మాన్’, ‘హిజ్ స్టోరీ’ వంటి రెండు విజయవంతమైన వెబ్ సిరీస్ తర్వాత, ‘ఆహా’ ఓటీటీ లో ‘భామా కలాపం’ వెబ్ మూవీ నటించింది. వెబ్ స్టార్ గా వెలగడంతో ఇప్పుడు ఆరు హిందీ, తమిళ, కన్నడ, తెలుగు
సినిమాల్లో కూడా నటిస్తోంది. తెలుగులో ‘విరాటపర్వం’ ఇంకా విడుదల కావాల్సి వుంది. ‘భామా కలాపం’ వెబ్ మూవీకి ఆమెని తీసుకోవడం ఒక మంచి మార్కెట్ యాస్పెక్ట్. కొత్త దర్శకుడు, నిర్మాతలూ ప్రియమణితో తలపెట్టిన ఈ వెబ్ మూవీ క్రైమ్ జానర్ కి
సంబంధించింది.
వెబ్
ప్రపంచంలో ప్రేమలు, పెళ్ళిళ్ళ రోత కంటెంట్ కంటే క్రైమ్ కెక్కువ గిరాకీ వుంది. కొన్ని
సినిమాలు సినిమాల పేరిట థియేటర్లో రిలీజవుతున్నాయి. తీరా చూస్తే అవి వెబ్ కి
సరిపోయే వెబ్ మూవీస్ లెవెల్లో వుంటున్నాయి. ఒకప్పుడు కొన్ని సినిమాలు తీరా చూస్తే
షార్ట్ మూవీస్ కి సరిపోయే కంటెంట్ తో వుంటూ థియేటర్లో ఫ్లాపయ్యేవి. ఇప్పుడు వెబ్
కంటెంట్ అని తెలుసుకోక కొన్ని థియేటర్ సినిమాలు తీసి పడేసి దెబ్బ తినేస్తున్నారు. అదే
థియేటర్ సినిమా తీసి వెబ్ లో రిలీజ్ చేస్తే? ఇలా ఎప్పుడైనా
జరిగిందా? ఇప్పుడు ‘భామా కలాపం’ విషయంలో జరిగింది. దీన్ని వెబ్ మూవీగా అనుకుని తీశారు గానీ, నిజానికిది థియేటర్లో రిలీజ్ చేయాల్సిన మూవీ. ఇదెలా వుందో ఒకసారి చూద్దాం...
అనుపమా మోహన్ (ప్రియమణి) ఓ స్కూలు
కెళ్ళే కొడుకుతో, ఆఫీసు కెళ్ళే భర్త మోహన్ (ప్రదీప్ రుద్ర)
తో అపార్ట్ మెంట్ లో వుంటుంది. యూట్యూబ్ లో వంటల ఛానెల్ నిర్వహిస్తూ వుంటుంది. అదే
సమయంలో మిసెస్ పీపింగ్ టామ్ గా తలనెప్పులు తెస్తూంటుంది. ఎంతసేపూ ఇతరుల ఫ్లాట్స్
లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం, ఆ ముచ్చట్లేసుకోవడం. ఏ ఇంట్లో
గొడవ జరిగినా తలదూర్చి చూడడం, ఇతరులకి చెప్పడం. ఇలా చేయడం
అదో మానసిక తృప్తి ఆమెకి. దీంతో ఆమెకి అపార్ట్ మెంట్ డిటెక్టివ్ అనే పేరొస్తుంది. ఇక ఈమె చేష్టల్ని భరించలేక మీటింగ్ పెడతారు ఈమె సంగతి
తేల్చుకోవాలని అపార్ట్ మెంట్ వాసులు. అప్పుడు ఓ డానియేల్ బాబు (కిషోర్ కుమార్) అనే
పాస్టర్ ప్రవచనాలు చెప్పి ఆమెని కాపాడేస్తాడు.
అయినా ఆగదు అనుపమ. అటు ఫిరోజ్ అనే
పౌల్ట్రీ వ్యాపారి ఫ్లాట్లో రాత్రిపూట భార్యాభర్తలు గొడవ పడడాన్ని గమనించి క్యూరియాసిటీ
పెంచుకుంటుంది. తెల్లారి పని మనిషి శిల్పా (శరణ్యా ప్రదీప్) ని పంపించి ఏం జరిగిందో తెలుసుకు రమ్మంటుంది.
ఇంట్లో ఎవరూ లేరనీ, భార్య సైరా ( సమీరా) వూరెళ్ళి పోయిందనీ వచ్చి చెప్తుంది శిల్పా. అయినా
ఏదో జరగరానిది జరిగిందనీ, అది తెలుసుకోవాలనీ, అనుపమ ఆ ఫ్లాట్ లోకి వెళ్ళగానే అక్కడున్న మణి అనే క్రిమినల్ ఎటాక్ చేస్తాడు. కాపాడుకునే
ప్రయత్నంలో వాణ్ని పొడిచేస్తుంది అనుపమ. వాడక్కడే చస్తాడు.
ఇది కాదు అసలు విషయం- ఆ ఫ్లాట్లోనే ఫిరోజ్ చచ్చి పడుంటాడు. పోలీసులు వచ్చి
దర్యాప్తు ప్రారంభిస్తారు. ఫిరోజ్ ని చంపిందెవరు? ఎందుకు
చంపారు? భార్య ఏమైంది? మరి అనుపమ మణిని
చంపిన సంగతి పోలీసులకి తెలియదా? ఒక ‘ఎగ్’ కోసం ఫిరోజ్ ని చంపారని తెలుస్తుంది, ఏమిటా ‘ఎగ్’ ? దాని కథేమిటి? అసలీ మిస్టరీ అంతా ఏమిటి? నేరకపోయి ఇరుక్కున్న
అనుపమ ఎలా బయటపడింది ఇందులోంచీ? ఇదీ మిగతా కథ.
' అంధాధున్’ లో వేటగాడి బారినుంచి ఓ కుందేలు తప్పించుకుంటూ ఎగిరి వచ్చి పడడంతో కారు
యాక్సిడెంట్ అవుతుంది. దాంతో కథే మారిపోతుంది. కళ్ళు లేని హీరో నోరు లేని కుందేలు
వల్ల ప్రాణాలు కాపాడుకుంటాడు. ఇలాగే ‘భామా కలాపం’ లో గొర్రెప్పిల్ల కారుకి అడ్డు రావడంతో యాక్సిడెంట్ జరిగి కథ ఇంకో మలుపు
తిరుగుతుంది. ఇది ఓపెనింగ్ సీను. గొర్రెప్పిల్లే ఎందుకు?
కాన్సెప్ట్ తో సంబంధముంది గనుక. కలకత్తా
మ్యూజియం నుంచి ఒక ఆధ్యాత్మిక మహిమ గల ‘ఎగ్’ కొట్టేసి వస్తున్న క్రిమినల్స్, గొర్రెప్పిల్ల
అడ్డొచ్చిన ఆ ప్రమాదంలో 200 కోట్ల విలువైన
ఆ ‘ఎగ్’ ని పోగొట్టుకుంటారు. ఆ ‘ఎగ్’ ఎగిరివెళ్ళి ఫిరోజ్ పౌల్ట్రీ ట్రక్కులో పడుతుంది.
గత నవంబర్లో హాలీవుడ్ నుంచి వచ్చిన ‘రెడ్ నోటీస్’ అనే కామిక్ థ్రిల్లర్ లో‘క్లియోపాత్రా ప్రాచీన ఎగ్’ కోసం వేట
వుంటుంది. ఈ ‘క్లియోపాత్ర ప్రాచీన ఎగ్’ అనేది సినిమా
కోసం కల్పించిన కథ. చారిత్రక స్పర్శతో ఈ కల్పన వల్ల ఈ కామిక్
థ్రిల్లర్ కో విషయ గాంభీర్యం ఏర్పడింది. ఇలాగే ‘భామా కలాపం’
లో ఏసు ప్రభువు పునర్జన్మకి సంకేతంగా వున్న ‘ఎగ్’ అని చెప్తూ, ఆధ్యాత్మిక స్పర్శతో కల్పిత కథ చేశారు.
ఈ కల్పితాన్ని అసలు దేవుడంటే అర్ధమేమిటో చెప్పడానికి కథలో వాడుకున్నారు. మత
ప్రచారకుల మూఢనమ్మకాలకి ప్రజలెలా బలి అవుతారో, దాంతో ఎలాటి దారుణాలు
జరుగుతాయో చెప్పే ఈ కాన్సెప్ట్ లో, ఇతరుల విషయాల్లో తలదూర్చి
పీతూరీలు చెప్పే అలవాటుతో కూడా ఎలాటి ప్రమాదంలో పడవచ్చో హెచ్చరిక చేశారు. ఈ రెండు
ట్రాక్స్ నీ ఏకత్రాటిపై నడిపిస్తూ అర్ధవంతమైన కథ చేశాడు కొత్త దర్శకుడు.
అయితే ఆ ‘ఎగ్’ ఏసు పునర్జన్మకి, అంటే ఏసు రాకకి సంకేతంగా
వున్నప్పుడు, కలకత్తా మ్యూజియంలో అనామకంగా ఎందుకుంటుంది? రోమ్ లో పోప్ ఆధీనంలో వుండాలి కదా?
కాన్సెప్ట్ ఒకటైతే ఇంకేదో కథ చేసే
అసమర్ధని ఈ మధ్యే చాలా సినిమాల్లో చూస్తున్నాం- నిన్నటి ‘మహాన్’ సహా. కానీ ‘భామా కలాపం’ లాంటి
ఒక కామిక్ సస్పెన్స్ లో కాన్సెప్ట్ కి చేసిన న్యాయం గుడ్ రైటింగ్ కి- గుడ్ మేకింగ్
కీ అద్దం పడుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, కామిక్ థ్రిల్లర్ల పేరిట
వస్తున్న జానర్ మర్యాదలు కూడా తెలియని అమెచ్యూరిష్ సినిమాల మధ్య ఈ
‘భామా కలాపం’ ఒక డబుల్ మర్డర్
మిస్టరీ జోన్లో- అదీ కుటుంబ సమేత వీక్షణకి అన్ని అర్హతలున్న సింపుల్ వ్యూయింగ్
మెటీరీయల్- లైట్ రీడింగ్ మెటీరీయల్ చందమామ కథల్లాగా. సినిమాల్లో గుడ్ రైటింగ్ కోసం, గుడ్ మేకింగ్ కోసమూ మొహం వాచివున్న అభిరుచిగల ప్రేక్షకులకి ఈ ‘అనుపమ రుచికర వంటకం’ ఓ సమతులాహారం అనొచ్చు.
ఈ మధ్య ‘మహానటి’ ఫేమ్
హై గ్రేడ్ కీర్తీ సురేష్ నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చూసి, ఏం లో- గ్రేడ్ సినిమాలు సెలెక్టు చేసుకుంటోందిరాబాబూఅని తలబాదుకున్నాం. రెండు వారాల క్రితం సరికొత్తగా తళతళ మెరుస్తూ, ‘గుడ్ లక్
సఖీ’ తో ఆమె అఖండ అపకీర్తి
ఆకాశాన్నంటి రెపరెప లాడింది. సఖీమ తల్లికి ఇంతకంటే సాధించాల్సిన ఆశయం లేదు. ఇలాంటప్పుడు
ప్రియమణి వచ్చి సర్ప్రైజ్ చేసింది. ఒక రియలిస్టిక్ జానర్లో హోమ్లీ ఎంటర్ టైనర్ కి
కథానాయికై తనలోని నటిని పిండి ఆరేసింది. అసలు అంత సీనియర్ నటి అని కూడా
అన్పించకుండా, స్లిమ్ బాడీ షేప్ తో, మంచి
ముఖ వర్ఛస్సుతో, హావభావ ప్రకటనతో,
క్యారక్టర్ కి యూత్ అప్పీల్ని కిక్కొట్టి టాప్ గేర్ లో నడిపించింది. థియేటర్లో
రిలీజై వుంటే మాస్ అప్పీల్ ని కూడా టపాసుల్లా పేల్చేది బాక్సాఫీసు ఆవరణలో.
సమస్యలో పడ్డాక చివరంటా
పాత్రకి అనేక అనుభవాలు. వాటిలో కొన్ని వొళ్ళు జలదరింప జేసేవి. సమస్య లోంచి
బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఎదురు తిరిగి సమస్యని ఇంకా పెంచేయడం అనే డ్రైవ్
పాత్రని, పాత్రతో బాటు తననీ బిజీగా వుంచుతాయి. కథ తన చేతి
నుంచి దాటిపోదు. క్షణం క్షణం థ్రిల్ చేస్తూ, ఒక పక్క అమాయకత్వం, ఇంకో పక్క భయం, తెగింపూ అనే పాత్రోచిత నటనతో సినిమాని భుజానేసుకుని నడిపిస్తుంది.
తప్పకుండా ఆమెకి ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆఫర్లు మరిన్ని పెరుగుతాయి.
అయితే కుకింగ్ ఛానెల్ యూట్యూబర్ గా
ఆమెని పూర్తి స్థాయిలో చూపించలేదు. ఆమె ఏం వంటలు చేస్తోందో, యూట్యూబ్
లో ఎందరు చూస్తున్నారో ఏదీ రిజిస్టర్ చేయలేదు. ఇంట్లో ఏం తింటున్నామో వండుకుని, ఆ ఫోటోలు 80 కోట్ల మంది ప్రభుత్వ రేషన్ మీద బ్రతుకుతున్న పేదలున్న దేశంలో, ఫేస్ బుక్ లో టాం టాం చేసుకుంటున్న ఈ రోజుల్లో- కేవలం ‘అనుపమ ఘుమఘుమ’ అని చెప్పేసి సరిపెట్టకుండా, విజువల్ గా ఈ విషయంలో ఆమె పాపులారిటీ కూడా చూపించి వుంటే, ఈ పాపులారిటీని పణంగా పెట్టి ఆమె చంచల స్వభావంతో దుస్సాహసాలు చేయడం కథకి
మరింత బలాన్నీ, భావోద్వేగాల్నీ చేకూర్చేది.
ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ)
పల్లవి (శాంతీ రావు), పని మనిషి శిల్ప(శ రణ్యా ప్రదీప్), ఫిరోజ్ భార్య సైరా వంటి కీలక స్త్రీ పాత్రలుండడం, ఇవి సహజత్వంతో కూడుకుని వుండడం గమనించొచ్చు. ఇందులో ఐఓ పల్లవి
7 నెలల గర్భవతిగానే, ఆయాస పడుతూ దగ్గరుండి కేసు దర్యాప్తు
చేయడం ఆలోచింపజేస్తుంది. ఈమెని నిండు గర్భవతిగా చూపించాల్సిన అవసరమేముంది? ఇది చివర్లో పే ఆఫ్ అయ్యే కాన్సెప్ట్ తో ముడిపడున్న అంశం. మూఢనమ్మకం ఎలాటి
పనులు చేయిస్తుందో చూపించడానికి గర్భంలో పిండం అవసరం. ఒక వైపు ‘ఎగ్’ అనే మూఢ నమ్మకం, ఇంకో
వైపు ‘పిండం’ అనే మానవత్వం.
పని మనిషి శిల్పా పాత్రలో శరణ్యా
ప్రదీప్ టాలెంట్ కూడా చెప్పుకోదగ్గది. నేరంలో అనుపమతో బాటు తనూ ఇరుక్కుని, అనుపమతో బాటే చేయకూడని పనులు చేస్తూ వుండాల్సిన పరిస్థితిని చాలా సహజంగా
నటించింది, అక్కడక్కడా డార్క్ హ్యూమర్ ని జోడిస్తూ. సైరా పాత్ర నటించిన సమీరా- అల్లాని వదిలేసి ఏసూ అంటూ
మూఢనమ్మకాల పాస్టర్ ని నమ్మి తెచ్చుకునే పరిస్థితిని జాలి పుట్టేలా నటించింది. గుర్తుండి
పోయే ఈ నాల్గు కీలక స్త్రీ పాత్రలు ఈ వెబ్ మూవీకి బిగ్ ఎస్సెట్స్ అనాలి. తెలుగు
సినిమాల్లో స్త్రీ పాత్రలు ఎడాపెడా కలుపు మొక్కలవుతున్న వేళ.
ఇక విలన్ నాయర్ (జాన్ విజయ్) వ్యవహారం
చూస్తే, ఓ వంద తమిళ మలయాళ కన్నడ సినిమాల నటుడు జాన్ విజయ్
కామిక్ విలనీ పరేష్ రావల్ స్టయిల్లో వుంటుంది సైకో తనంతో. వేష భాషలతో ఎంటర్ టైన్
చేస్తాడు. అలాగే ‘కేరాఫ్ కంచరపాలెం’
నటుడు కిషోర్ కుమార్ పొలిమేర - కన్నింగ్ పాస్టర్ పాత్ర స్వభావాన్ని అద్భుత ఎక్స్
ప్రెషన్స్ తో ప్రకటించాడు డైలాగ్ డెలివరీ సహా. ఏ నటీ, ఏ నటుడూ
కమర్షియల్ నటనలకి పాల్పడకుండా నిజ జీవితపు వ్యక్తుల్లా అన్పించడం ఇందులో గమనించాల్సిన
ముఖ్యాంశం.
సాంకేతికంగా- దృశ్యాల చిత్రీకరణలో
ఒక సెటిల్డ్ వాతావరణం కన్పిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ నిదానంగా, నిద్రాణంగా వున్నట్టు- దృశ్య వాతావరణం మోడరన్ హైదరాబాద్ ని ప్రతిబింబించదు.
అపార్ట్ మెంట్లో జరిగినవి రెండు మర్డర్స్ అయితే, ఈ పరిస్థితి
తీవ్రతకి కాంట్రాస్ట్ గా, నిదానంగా సాగే పోలీస్
ఇన్వెస్టిగేషన్, తీరుబడిగా పాత్రల యాక్టివిటీస్ వగైరా సినిమా
చూస్తున్నట్టు వుండదు- మనపక్కనే ఇలాటి దృశ్యాలు ఎలా కన్పిస్తాయో అలా వుంటాయి.
మర్డర్స్ జరిగిన సీన్ల తర్వాత, దానికి తగ్గట్టు కథ పరుగెత్తక, మూవీ స్లో అవడం బోరు కొట్టేస్తుంది. తర్వాతర్వాత ఈ స్లో పేసింగ్ సహజత్వం
కోసమని అర్ధమయ్యాక లీనమైపోతాం.
చాలా పాత అపార్ట్ మెంట్ భవనం, దాని చుట్టూ పాత ఇళ్ళూ రోడ్లూ, వీటికి తగ్గ కళా
దర్శకత్వం- కథ మూడ్ ని స్థాపిస్తాయి. మూడ్ ని ఎలివేట్ చేసే వై. దీపక్ ఛాయాగ్రహణమొక బలం. కానీ జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్ ల సంగీతం
అంత మార్కేమీ వేయదు. ఒక బ్యాక్ గ్రౌండ్ పాట వుంది. సినిమా నిడివి రెండు గంటలా 10
నిమిషాలుంది పాటల్లేకుండా డైలాగ్ వెర్షన్ తో. ఈ నిడివి ఈ కథకి ఎక్కువే. ఓ ఇరవై
నిమిషాలు తగ్గించేస్తే హాయిగా వుండేది.
అయితే ఇది ఎడిటర్ విప్లవ్ చేతిలో
లేని విషయం బహుశా. ఏది డిలీట్ చేయాలన్నా సీన్స్ లో మైన్యూట్ డిటైల్స్ అడ్డుపడతాయి. ఏది డిలీట్
చేసినా ఇంకో డిటైల్ కి లీడ్ దెబ్బతింటుంది. రాసేప్పుడే ఇన్ని మైన్యూట్ డిటైల్స్,
క్లూస్ లేకుండా జాగ్రత్త పడాలి. ఇల్లాజికల్ గా వున్న ప్రియమణి సూట్ కేసు
లాక్కొచ్చే సీను ఎత్తేసి, డైరెక్టుగా ఆమె తనింట్లో సూట్
కేసుని పని మనిషికి చూపించి- ఎలా తెచ్చిందో రెండు డైలాగుల్లో చెప్పేస్తే సరిపోయేది, థ్రిల్ చేసేది. ఇలా చేసి తర్వాత ముందు కథలో దీని కనెక్టింగ్ సీన్లు కూడా
ఎత్తేయొచ్చు. రాసేప్పుడే చేసుకోవాల్సిన ఎడిటింగ్ ఇది. పోతే డైలాగులు ఎక్కడా
సినిమాటిక్ గా వుండకపోవడం రిలీఫ్.
అవసరమైన పాత్రల్ని, వాటి స్వభావాల్ని, కార్యకలాపాల్నీ, కాన్సెప్ట్ నీ సెటప్ చేయడానికి
30 నిమిషాల పైగా సమయం తీసుకున్నాడు. 40 వ నిమిషంలో మర్డర్స్ జరుగుతాయి. మరిన్ని
పాత్రలు కలుస్తాయి. ఇక్కడ్నించీ మొదలయ్యే మిడిల్లో - డెడ్ బాడీతో అనుపమ సంఘర్షణ ఒక
విజయం - ఒక అపజయంగా వుంటున్నాక, తనకి తెలీని ‘ఎగ్’ వ్యవహారం కూడా మెడకి చుట్టుకుంటుంది విలన్
నాయర్ ఎంట్రీతో. నాయర్ ‘ఎగ్’
కావాలంటాడు. ఒక పక్క శవం, ఇంకో పక్క ఈ నాయర్, భర్త, పోలీసులూ- ఈ చదరంగంలో పావులు కదపలేక, ఏ పావు కదిపినా దొరికిపోయే ప్రమాదంలో
పడుతూ సాగే పాత్ర అనుపమ. ఇక్కడ రెండు ప్రధాన ప్రశ్నలు వెంటాడుతూంటాయి- చేసిన
హత్యలోంచి ఎలా బయటపడుతుంది? భర్తకి తెలిస్తే ఏమవుతుంది?
మొదటి దానికి ఒక హేపీ మూమెంట్ వచ్చేసి
టెన్షనంతా రిలీజ్ చేసేస్తుంది... చచ్చిన శవం బతికే వుండడంతో. ఈ సీను అత్యంత
ఇంటలిజెంట్ రైటింగ్. కానీ వాడు మళ్ళీ చావడంతో మొదటికొస్తుంది. ఈ ప్రశ్నకి అంతిమ
జవాబు- ఇన్స్ పెక్టర్ రూపంలో వస్తుంది. క్లాసిక్ మూవీ ‘డెత్
విష్’ లో చార్లెస్ బ్రాన్సన్ ని,
పోలీసు అధికారి కేసులోంచి బయటపడేసే లాంటి ముగింపుతో.
మరి భర్త సంగతి? వుంటాడా, విడాకులిచ్చి పోతాడా? ఇక్కడ కూడా ఇంటలిజెంట్ రైటింగ్ హెల్ప్ చేస్తుంది. ఇదేమిటో స్క్రీన్ మీద
చూడాల్సిందే.
ఈ మూవీకున్న ఇంకో బలమేమిటంటే, ప్రతీ ఐదూ పదినిమిషాల కొక సర్ప్రైజ్ చేయడం. చూస్తే కథ ‘ఎగ్’ కోసం ఒక హత్య, దీంతోనే
ముడిపడి ఇంకో హత్య, ‘ఎగ్’ ని చేజిక్కించుకోవడానికి ఒక విలన్ విలనీ- చివరి కేముంది- ‘ఎగ్’ కోసం అసలు ఫిరోజ్ ని చంపిన విలన్ గా ఈ విలన
దొరికిపోయి- ‘ఎగ్’ ప్రభుత్వ
పరమవుంతుందన్న కథ లాగే వుంటుంది. ఇలాగే గనుక వుండుంటే విషయం లేని ఎన్నో
థ్రిల్లర్స్ లాగా ఇదీ ఫ్లాట్ గా సాగి కుప్ప కూలేది.
ఇలా కాకుండా సెకండాఫ్ లో ఇంకో విలన్
బయటపడ్డంతో - మొత్తం కథ కొత్త మలుపు తిరిగిపోయింది. ఇలా దాగున్న అసలు విలన్నీ పైకి
తీయడం ఎండ్ సస్పెన్స్ కథల సినిమాల్లో
సాధారణంగా జరిగేదే, అవి ఫ్లాపయ్యేవే. అసలు విలన్ వున్నాడని
చెప్పకుండా, సరైన సమయంలో సర్ప్రైజింగ్ గా బట్టబయలు చేయడమనేది
- ఎండ్ సస్పెన్స్ గండాన్ని దాట వేసే టెక్నిక్.
అయితే లాజికల్ గా (కామన్ సెన్సు పరం
గా) అనేక లిబర్టీలు తీసుకున్నాడు కొత్త దర్శకుడు. అనుపమ రెండు సార్లు మారు తాళం
చెవులు తయారు చేసుకోవడం, అసలు సూట్ కేసుని తన ఫ్లాట్ కి
తీసుకు రావడంలోని సామంజస్యం మొదలైనవి. అసలు పోలీసులు ఫిరోజ్ ఫ్లాట్లో వేలిముద్రలు
సేకరిస్తే, అక్కడ అనుపమ చంపిన క్రిమినల్ వేలి ముద్రలు సహా అనుపమా వేలిముద్రలూ దొరికిపోయి
చిటికెలో కేసు సాల్వ్ అయిపోయేది. ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన కథ
అన్నాక- ప్రతీ చోటా కామన్ సెన్సు తో కూడిన కథనం ప్రొఫెషనల్ గా వుండాల్సిందే. లేదంటే
పోలీసు పాత్రలు నవ్వుల పాలవుతాయి. అసలు ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తే సస్పెండ్ అవుతారు
కూడా.
‘భామా కలాపం’ కాన్సెప్ట్ కూడా సడెన్ గా క్లయిమాక్స్ లో ఎగదన్నుకొస్తుంది- అసలు విలన్ లాగే.
అంతవరకూ నడుస్తున్న కథ ‘ఎగ్’ కోసమే తప్ప
ఇలాటి కాన్సెప్ట్ కోసమని వూహించలేం. చివర్లో
కథని సమప్ చేస్తూ దేవుడంటే అర్ధం గురించి, మూఢ నమ్మకాల గురించీ
చెప్పిన మాటలు ఆలోచనాత్మకంగా వుంటూ, మూవీకో హూందాతనాన్ని తెస్తాయి - కొత్త దర్శకుడికి, నిర్మాతలకీ, ‘ఆహా’ కూ కాస్త గౌరవ మర్యాదలు
సహా. జాతీయ మీడియాలో మంచి రేటింగ్స్ పడిన ఈ వెబ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. మహిళా చిత్రాలు
రావడం లేదంటారు, ఇది పోషకాలతో వండిన మహిళా చిత్రమే.
—సికిందర్