రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జనవరి 2018, సోమవారం

594 : 'భాగమతి' రివ్యూ - 3


            1. కథని ఎండ్ సస్పెన్స్ అని తెలియకుండా కవర్ చేసే విధానం : ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ (1958)
          2. కథని ఎండ్ సస్పెన్స్ అని తెలుపుతూనే దృష్టి మళ్ళించే విధానం : ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ – (2017)
          3. ఎండ్ సస్పెన్స్ కథ ఎలా వుంటుంది? A  అనే ఒక సంఘటన జరిగిందనుకుందాం.అదెలా జరిగిందో, ఎవరు చేశారో దర్యాప్తు అధికారికి తెలీదు. అతను B, C, D, E, F...ఇలా కొందర్ని అనుమానితులుగా భావించి దర్యాప్తు చేస్తూంటాడు. దర్యాప్తులో ఒకొక్కర్నీ నిందితులు కాదని నిర్ధారించుకుంటూ వస్తూ,  చిట్టచివరికి ఆధారాలతో సహా వాళ్ళల్లో ఒకర్ని పట్టుకుంటాడు. అప్పుడా ఆధారాలన్నీ ఆ నిందితుడికి ఆపాదించేందుకు విశ్లేషణలన్నీ చేసుకొస్తూ - ఆ నిందితుడు A అనే సంఘటనకి ఎందుకోసం, ఎలా పాల్పడిందీ  మొదట్నించీ మూసిన కథంతా చెప్పుకొస్తాడు. నిందితుడు తలవంచుకుంటాడు.

          ఇది ఏ మీడియాకి పనికొస్తుంది? నవలగా ప్రింట్ మీడియాకి పనికొస్తుంది.

          సినిమాకి ఎందుకు పనికి రాదు? సినిమాగా తీస్తే వచ్చే ఇబ్బందేమిటంటే, విజువల్ అప్పీల్ వుండదు. విజువల్ అప్పీల్ కి ఓపెన్ స్టోరీ యాక్షన్ తో వుండాలి. పై మూసిన కథలాగా కాదు. పై ఉదాహరణ ప్రకారం A అనే సంఘటన చూపించి,  B, C, D, E, F...లలో ఎవరు ఆ సంఘటనకి పాల్పడ్డారో చూపించకపోతే, దర్యాప్తు అధికారి ఒకరొకర్నీ ప్రశ్నిస్తూనే ఫస్టాఫ్ తోబాటు – సెకండాఫ్ లో చాలా వరకూ గడపాల్సి వస్తుంది. అంతవరకూ విషయ మేంటో అర్ధంగాక ప్రేక్షకుడి సహనం నశిస్తుంది. కథ ఎంతసేపూ ఆ దర్యాప్తు అధికారికీ, ఆ నిందితులకీ – వాళ్ళ వాళ్ళ మధ్య వుండిపోతుంది. వాళ్ళు వాళ్ళు మంతనాలాడుకుంటూ వుంటే ప్రేక్షకుడి కేం అర్ధంగాదు. థ్రిల్ ఫీల్ కాడు.  అంటే కథ వాళ్ళ మధ్య పాసివ్ గా వుండి పోతోందన్నమాట. కాబట్టి  సినిమా కొచ్చేసి  కథని  దాయకూడదు, కథనాన్ని మాత్రమే దాయాలి. కథ వచ్చేసి ఓపెన్ గా,  యాక్టివ్ గా ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ గా కన్పించి థ్రిల్ చేయాలి. 


       రెండో ఇబ్బంది – చివరికి నిందితుణ్ణి  పట్టుకుని దర్యాప్తు అధికారి ఆ సంఘటన తాలూకు కార్యకారణ సంబంధ విశ్లేషణంతా నిందితుడి కాపాదిస్తూ చెప్పుకొస్తూంటే, బోరు కొడుతుంది. ఎందుకంటే,  అతను చెప్పేవాటిని  ప్రేక్షకుడు మెదడుకి చాలా  పనికల్పించి అర్ధంజేసుకుంటూ, మొదట్నించీ ఏదేది ఎలా ఎందుకు జరిగాయో నిందితుణ్ణి దృష్టిలో పెట్టుకుని తులనాత్మక విశ్లేషణ చేసుకుంటూ కన్విన్స్ అయ్యే కష్టాన్ని, భారాన్నీ  మోయాల్సి వస్తుంది. అ సమయంలో దర్యాప్తు అధికారి ఎన్ని నిజువల్స్ (మాంటేజెస్) వేస్తూ ఎంత హడావిడీ చేసినా,  అవన్నీ అప్రస్తుతమైపోతాయి ప్రేక్షకుడికి. ఇలా  సస్పెన్స్ అంతా చివర్లో ఓపెన్ అయింది కాబట్టి దీన్ని ఎండ్ సస్పెన్స్ కథ అంటున్నారు. ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో మిస్టరీ సబ్ జానర్ కింది కొస్తాయి. 

          4. మరి ఇలాటి కథని సినిమాకి ఎలా మార్చుకోవాలి?
 పైనే చెప్పుకున్నట్టు A  అనే ఒక సంఘటన జరిగిందనుకుందాం. అదెలా జరిగిందో, ఎవరుచేశారో, ఎందుకు చేశారో  ప్రేక్షకుడికి మొత్తం చూపించేస్తారు. B  అనే వాడే  ప్రేక్షకుడికి స్పష్టంగా నిందితుడుగా కన్పిస్తూంటాడు. ఇంకా వేరే అనుమానితులుండరు. C అనే దర్యాప్తు అధికారికి B  తెలియవచ్చు, తెలియకపోవచ్చు, తెలిస్తే డైరెక్టుగా పట్టుకునే ప్రయత్నంతో  కథ నడుపుతాడు, తెలియకపోతే కొంత సమయం తర్వాత తెలుసుకుని, అప్పుడు పట్టుకునే ప్రయత్నంగా కథ నడుపుతాడు. పట్టుకున్నాక శిక్షిస్తాడు.

          ఇది ఏ మీడియాకి పనికొస్తుంది? ప్రింట్, విజువల్ రెండిటికీ పనికొస్తుంది. అయితే ప్రింట్ మీడియా నవలకి అంత బావుండక పోవచ్చు. నవల సినిమాలగా, సినిమా నవల లాగా వుండకూడదు. సినిమా అట్టడుగు స్థాయి సాహిత్య ప్రక్రియ. జనసామాన్యం కోసం దాన్నలాగే తీయాలి.

         సినిమాగా ఇలా తీస్తే కలిగే లాభాలు  – ఈ ఓపెన్ యాక్షన్ స్టోరీ వల్ల విజువల్ అప్పీల్ వుంటుంది. A అనే సంఘటన దగ్గరే అది ఎవరు చేశారో, ఎలా చేశారో, ఎందుకు చేశారో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఇక కథలో సమాచారానికి సంబంధించిన ఏ బ్యాగేజీనీ మోయ నవసరం లేకుండా, పాయింటు మీద దృష్టి పెతాడు. కథ పాత్రలకీ ప్రేక్షకుడికీ ఓపెన్ గా  వుంటుంది. ఓపెన్ గా  వుండనిది కథనమే. అంటే C ఎలా తప్పించుకుంటూ వుంటాడు, B పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తూ వుంటాడు- పరస్పరం సీన్ల వారీగా ఎత్తుగడలతో ప్రేక్షకుడు వూహించని కథనాన్ని సృష్టించుకుంటూ పోతూంటారు. అందువల్ల దీన్ని సీన్ టు సీన్ సస్పెన్స్ అంటారు. అందుకని ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ కింది కొస్తాయి.  
***
       5. పైన 3 లో చెప్పుకున్న ఎండ్ సస్పెన్స్ కథలకి ఎండ్ సస్పన్స్ అని  తెలియకుండా కవర్ చేస్తూ నడపడమెలా?  ప్రింట్ మీడియాకి పనికొచ్చేవని చెప్పుకున్న మిస్టరీ సబ్ జానర్ కథల్ని సినిమాకి మల్చి హాలీవుడ్ కొత్త ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో  A  అనే సంఘటన జరుగుతుంది. ఇది ప్రేక్షకుడికి చూపించరు. అసలు A అనే సంఘటన జరిగిందని ఎక్కడా ప్రస్తావించరు. ఫ్రెష్ గా ప్రారంభం B ని C పరిచయం చేసుకోవడంతో చూపిస్తారు. అక్కడ్నించీ అదే B కి D, E, F, G, H ...ఇలా ఎంతమందైనా పరిచయం కావొచ్చు. వీళ్ళతో B కి విచిత్ర అనుభవాలు ఎదురవుతూంటాయి. దీంతో మొదట పరిచయమైన C  డూప్లికేట్ అనీ,  తన మీద కుట్ర చేయడానికి వచ్చాడనీ మిగిలిన వాళ్ళకి చెప్పడంతో, కథ C  మీదికి మళ్ళుతుంది. దురుద్దేశం పెట్టుకుని విలన్ లా వచ్చినట్టు కనబడుతున్న C కుట్ర రట్టు చేసే క్రమంలో,  అసలు B నే విలన్ అన్న గుట్టు B ద్వారానే రట్టయ్యేలా సంఘటనలు జరుగుతాయి. మొత్తం కథ తిరగబడుతుంది.  అప్పుడు C, D, E, F, G, H ...అందరూ ఒకే బృందమని రివీలవుతుంది. వీళ్ళు B ని రౌండప్ చేసి, ఆనాడు  ఫలానా A  అనే సంఘటన జరగడానికి కారణం నువ్వు, ఇదిగో సాక్ష్యాలూ అని ప్రూవ్ చేసి పట్టుకుంటారు. 

          దీనివల్ల కలిగే లాభాలు – A అనే సంఘటనని దాచి పెట్టారు కాబట్టి,  C, D, E, F, G, H ... వగైరాలు B ని పట్టుకోవడానికి వచ్చిన దర్యాప్తు బృందంగా అస్సలు కన్పించరు. B తో వీళ్ళు సృష్టించి నడిపే డ్రామాని ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తూంటాడు. రొటీన్ A అనే సంఘటనకి B ని పట్టుకోవడానికి వచ్చిన గ్రూపు అని తెలియకపోవడంతో ప్రేక్షకుడు ఫ్రెష్ గా ఫీలవుతాడు. కథ పాసివ్ గా కాక, డ్రామా అని తెలియని డ్రామాతో యాక్టివ్ గా థ్రిల్లింగ్ గా వుంటుంది. దీంతో  ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో సినిమాలకి పనికిరాని మిస్టరీ సబ్ జానర్ ఉచ్చులోంచి బయటపడి, సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ గానే రూపం ధరిస్తాయి.

         1958 లో బ్రిటిష్ సినిమా ఇది సాధించి ఎండ్ సస్పన్స్ ని కవర్ చేసి లాండ్ మార్క్ మూవీగా నిలబడింది- అదే ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’

          దీన్ని అనుసరిస్తూ మొట్టమొదట బెంగాలీలో ఉత్తమ్ కుమార్ - షర్మిలా టాగూర్ లతో  ‘శేష్ అంక’ (1963) వచ్చింది. తర్వాత తమిళంలో శివాజీ గణేశన్ – బి. సరోజా దేవిలతో ‘పుథియ పరవై’  (1964), హిందీలో మిథున్ చక్రవర్తి – రాఖీ లతో ‘ధువా’ (1981), మలయాళంలో మమ్ముట్టి - శోభనలతో ‘చరితం’ (1989) వచ్చాయి.


          మిస్టరీ సబ్ జానర్ కి  మూవీ ఫ్రెండ్లీ క్రియేటివిటీ అయిన ఇలాటి కథలూ  స్ట్రక్చర్ లోనే వుంటాయి. పైన చెప్పుకున్న ఉదాహరణలో ఈ క్రియేటివిటీ వచ్చేసి, ప్లాట్ పాయింట్ వన్ గా C మీద అనుమానం, ప్లాట్ పాయింట్ టూగా C కాదు B అని దొరికిపోవడంగా వుంటుంది.  ఒకసారి పై సినిమాలు చూస్తే విజువల్ అప్రోచ్ బాగా అర్ధమవుతుంది. నిజానికి ఇలాటి కథ వేరే ట్రెండీ బ్యాక్ డ్రాప్ లో ఈ వ్యాసకర్త రాసింది ఇద్దరు దర్శకుల చేతులు మారుతూ గత రెండేళ్లుగా చక్కర్లు కొడుతోంది.
***
     6. పైన 3 లో చెప్పుకున్న  ఎండ్ సస్పెన్స్ కథని ఎండ్ సస్పన్సే అని తెలుపుతూనే దృష్టి మళ్ళించే విధానం – A  అనే సంఘటనని ప్రేక్షకుడికి చూపించేస్తారు.  అదెలా జరిగిందో, ఎవరు చేశారో  ప్రేక్షకుడితో పాటు దర్యాప్తు అధికారికీ  తెలీదు. అతను B, C, D, E, F...ఇలా కొందర్ని అనుమానితులుగా భావించి దర్యాప్తు చేస్తూంటాడు. మధ్యలో ఎక్కడో, ఆ  జరిగిన A  అనే సంఘటనలో మృతి చెందిన వ్యక్తి దర్యాప్తు అధికారికి తెలిసిన వాడుగా రివీల్ అవుతుంది. ఆ మృతి చెందిన వ్యక్తి ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో చాలా షాకింగ్ విషయాలుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ని మధిస్తూంటే  దానితో B, C, D, E, F...లలో అందరూ, లేదా ఒకరితో వున్న కనెక్షన్ బయటపడుతుంది. దీంతో దర్యాప్తు అధికారి ఆ నిందితుణ్ణి లేదా నిందితుల్ని పట్టుకుంటాడు. 

          దీంతో లాభాలు : అనుమానితుల్ని చూపిస్తూ  నిందితుణ్ణి పట్టుకునే బోరుకొట్టే రొటీన్ కి, ఫ్లాట్ గా వుండే కథనానికీ, ఫ్లాష్ బ్యాక్ వల్ల ప్రేక్షకుడి దృష్టి మళ్ళించి, కథకి చలనమూ డెప్త్ తీసుకురావొచ్చు. ఇలా ఇది ఎండ్ సస్పెన్స్ తో మిస్టరీ సబ్ జానర్ లోంచి బయటపడి, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫ్రెండ్లీ సబ్ జానర్ లోకొచ్చేస్తుంది. 

           ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ఇలాంటిదే. మర్డర్ మిస్టరీల
ఫార్ములాని బ్రేక్ చేసి, మూస చట్రంలోంచి మర్డర్ మిస్టరీ జానర్ ని ఎప్పుడో 1930 లలోనే బయట పడేసిన రచయిత్రి అగథా  క్రిస్టీ. ఆమె రాసిన నవలే  ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ మూవీ.

          ఇవీ మిస్టరీ,  సస్పన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ల సంగతులు. ఇలాస్పష్టత తెచ్చుకున్నాక, ఇప్పుడు ‘భాగమతి’ ఎందులో ఇమిడిందో, ఇమడకపోతే ఎందుకు ఇమడలేదో,  రేపు ముగింపు వ్యాసంలో చూద్దాం.


సికిందర్