దర్శకత్వం: తరుణ్ భాస్కర్
తారాగణం : బ్రహ్మనందం,
తరుణ్ భాస్కర్, చైతన్యా రావు, జీవన్
కుమార్, రాగ్ మయూర్
రఘురామ్, రవీంద్ర విజయ్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం : ఏజే ఆరోన్
నిర్మాతలు: సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్
కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్
నందిరాజ్
విడుదల : నవంబర్ 3, 2023
***
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘మహానటి’, సీతారామం’, ‘స్కైలాబ్’ వంటి కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలు
నటించాడు. తిరిగి ఇప్పుడు హీరోగా నటిస్తూ ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీకి దర్శకత్వం వహించాడు. ఏమిటీ క్రైమ్ కామెడీ, ఇదేమైనా డిఫరెంట్ గా వుందా, లేక వచ్చిపోయే మరో
రొటీన్ వ్యవహారంగా వుందా తెలుసుకుందాం...
వరదరాజులు (బ్రహ్మానందం), అతడి మనవడు వాస్తు (చైతన్యా
రావు), వీళ్ళ
లాయర్ లంచం (రాగ్ మయూర్) ఓ కేసులో కోటి రూపాయలు కట్టాల్సి
వస్తుంది. ఒకరోజు వరదరాజులు కోసం కోలా బాటిల్ తెస్తే
అందులో బొద్దింక వుంటుంది. దీంతో కంపెనీ మీద కేసు వేసి 5 కోట్లు
నష్టపరిహారం కొట్టేయాలని ప్లాను వేస్తారు. అదే సమయంలో హత్య కేసులో పదేళ్ళు జైలు
శిక్ష అనుభవించి తిరిగి వస్తాడు నాయుడు (తరుణ్ భాస్కర్). ఇతడి తమ్ముడు జీవన్ నాయుడు
( జీవన్) ఒక కార్పొరేటర్ చేసిన అవమానాన్ని భరించలేక తనూ కార్పొరేటర్ అవ్వాలన్న
కసితో వుంటాడు. దీనికి కోటి రూపాయలు కావాలి. దీనికొక ప్లాను వేస్తారు అన్నదమ్ములు.
ఆ ప్లాను ప్రకారం కోలా కంపెనీలో పని చేస్తున్న నాయుడు బాటిల్లో బొద్దింక వేస్తాడు.
ఆ కోలా కీడా (కీడా అంటే పురుగు) ని అడ్డం పెట్టుకుని కంపెనీ నుంచి కోటి రూపాయలు
లాగాలనుకుంటారు. కానీ ఆ బాటిల్ వరద రాజులు దగ్గరుంది. ఇప్పుడేం
జరిగిందనేది మిగతా కథ.
బాటిల్ కోసం నాయుడు వరదరాజులుని పట్టుకుంటే ఏం జరిగింది? కోటి కాదు ఐదు కోట్లు పంచుకోవచ్చని ఒప్పందం కుదిరాక జాయింటుగా ఈ రెండు గ్రూపులు చేపట్టిన ఆపరేషన్ ఏమిటి? కంపెనీ సీఈఓ (రవీంద్ర విజయ్) ఆడుకున్న కౌంటర్ గేమ్ ఏమిటి? ఈ గేమ్ లో షాట్స్ (రఘురామ్) అనే కిల్లర్ పోషించిన పాత్రేమిటి? ప్రాణాల మీదికి తెచ్చుకుని కాల్పుల్లో చచ్చిందెవరు, బతికిందెవరు? బాటిల్ ఏమైంది? అది ఎవరి ప్రాణాలు కాపాడింది? చివరికి డబ్బుంటే స్వేచ్ఛ వుంటుందని నమ్మిన వరదరాజులి నత్తి మనవడు నేర్చుకున్న జీవిత సత్యం ఏమిటి? ఇవన్నీ సెకండాఫ్ లో తెలుసుకోవచ్చు.
బాటిల్ కోసం నాయుడు వరదరాజులుని పట్టుకుంటే ఏం జరిగింది? కోటి కాదు ఐదు కోట్లు పంచుకోవచ్చని ఒప్పందం కుదిరాక జాయింటుగా ఈ రెండు గ్రూపులు చేపట్టిన ఆపరేషన్ ఏమిటి? కంపెనీ సీఈఓ (రవీంద్ర విజయ్) ఆడుకున్న కౌంటర్ గేమ్ ఏమిటి? ఈ గేమ్ లో షాట్స్ (రఘురామ్) అనే కిల్లర్ పోషించిన పాత్రేమిటి? ప్రాణాల మీదికి తెచ్చుకుని కాల్పుల్లో చచ్చిందెవరు, బతికిందెవరు? బాటిల్ ఏమైంది? అది ఎవరి ప్రాణాలు కాపాడింది? చివరికి డబ్బుంటే స్వేచ్ఛ వుంటుందని నమ్మిన వరదరాజులి నత్తి మనవడు నేర్చుకున్న జీవిత సత్యం ఏమిటి? ఇవన్నీ సెకండాఫ్ లో తెలుసుకోవచ్చు.
డబ్బు చుట్టూ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు పాల్పడే చర్యలతో కూడిన క్రైమ్ కామెడీ కథ ఇది. ‘బ్రోచేవారెవరురా’, ‘భలే మంచి
రోజు’ లాంటి క్రైమ్ కామెడీల కోవకి ఇది చెందుతుంది. అయితే
దర్శకత్వపు శైలి హాలీవుడ్ దర్శకుడు గై రిచీని పోలి వుంటుంది. సంగీతంలో పాప్ సంగీత
మెలాగో, క్రైమ్ కామెడీల్లో గై రిచీది అలాటి పాప్ కల్చర్
స్టయిల్. తమిళ దర్శకుడు కార్తీక్
సుబ్బరాజ్ దీన్ని వాడుతూంటాడు. ఇదే ‘కీడా కోలా’ ని తెలుగులో వస్తున్న రొటీన్ క్రైమ్ కామెడీల నుంచి వేర్పరుస్తుంది. నమ్మడానికి
వీల్లేని అసంబద్ధ కథ, మెంటల్ పాత్రలు,
మైండ్ లెస్ కామెడీ- ఫిలిమ్ నోయర్ జానర్ తరహా క్రిమినల్స్ వాడేలాటి మాటలు, బ్యాక్ గ్రౌండ్ లో క్రేజీ పాటలతో సాగే కథనం వగైరా క్రియేటివిటీలతో ఓ
రెండు గంటల బోరు కొట్టని కాలక్షేపం.
నాయుడు పాత్రలో దర్శకుడు తరుణ్
భాస్కర్ నటనలో ఇంకో మెట్టు పైకెక్కాడు. పాత్రచిత్రణే ఈ క్రైమ్ కామెడీకి బలం. అతడి
నడక, ముఖకవళికలు, తీసుకునే
నిర్ణయాలు, పాల్పడే చర్యలు- ఇవన్నీ సీరియస్ గా వుంటూనే
ఫన్నీగా వుంటాయి. ఈ సినిమాలో ఆడ పాత్రల్లేవు. చైనా నుంచి వచ్చిన ఒక నిలువెత్తు ‘బార్బీ’ డాల్ వుంటుంది. దాంతో ప్రేమలో పడతాడు. చివర్లో
గుండు దెబ్బ తిని నీట మునుగుతున్నప్పుడు ‘టైటానిక్’ లో హీరోహీరోయిన్ల అమర ప్రేమలాగా బార్బీ చేతి వేలికి తన చేతి వేలు తగిలే
సరికి ప్రాణాలు లేచొచ్చేస్తాయి. అర్ధం లేని కామెడీలకి ఇలాటి ఫన్నీ ఇన్నోవేటివ్- క్రియేటివ్
సీన్స్ ఎన్నో వాడాడు. దర్శకుడుగా, నటుడుగా యూత్ కి కావాల్సిన
ఓ కొత్త అనుభూతినంతా ఇచ్చాడు.
రెండో చెప్పుకోదగ్గ పాత్రలో వరదరాజులి మనవడుగా చైతన్యా రావు నటన. నత్తిని ఓ కొత్త పోకడతో నటించి దృశ్యాల్ని నిలబెట్టాడు. ఎన్ని సంబంధాలు చూసినా ఇతడి పెళ్ళి కాదు. చైనా డాల్ ఇతడి దగ్గరే వుంటుంది. దీంతో కూడా సంబంధాలు రావు. ఇంకో మ్యాడ్ క్యారక్టర్ జీవన్ నాయుడు పాత్రలో జీవన్ నటన ఇంకో ఫన్. లాయర్ గా రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్ మెంటల్ అనుచరుడుగా విష్ణు ఓయీ ప్రతీ సీనులో వుండే ఫన్నీ క్యారక్టర్లు. కిల్లర్ షాట్స్ గా రఘురామ్, సీఈఓ విలన్ గా రవీంద్ర విజయ్ క్రూరత్వాలు ఓపక్క. ఇక వరదరాజులుగా బ్రహ్మానందం వీల్ చైర్ కి పరిమితమై ఏంట్రా ఈ జీవితమని గడిపే ఇంకో ఫన్నీ పాత్ర.
సాంకేతికంగా ఏజే ఆరోస్ కెమెరా వర్క్
ఇంకో కళాత్మక విలువ. ఔట్ డోర్, ఇండోర్ లొకేషన్స్ పాత్రలుండే
ఇరుకు లొకాలిటీల్ని ఎక్కువగా ప్రొజెక్టు చేస్తాయి. వివేక్ సాగర్ సంగీతంలో బ్యాక్
గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ కథని ముందుకు నడిపిస్తూంటాయి.
స్క్రీన్ ప్లే చూస్తే ఇంటర్వెల్ ఇంకా ఏమీ జరక్కుండానే అకస్మాత్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది. కారణం ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ గంట అంతా నడిచేది పాత్రల పరిచయా లతో, సమస్యకి దారితీసే పరిస్థితులతో మాత్రమే. అంటే బాటిల్ ని కలిగివున్న బ్రహ్మానందం దగ్గరికి తరుణ్ భాస్కర్ వచ్చి పట్టుకోవడంతోనే ఇంటర్వెల్ వస్తుంది. అంటే కథ తాలూకు సమస్య, దాంతో గోల్ ఏర్పాటు కాకుండానే – కథ ప్రారంభం కాకుండానే- ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇలా ప్లాట్ పాయింట్ వన్ తో ఇంటర్వెల్ వేయడం రూల్స్ కి విరుద్ధమే అయినా రూల్స్ ని కూడా బ్రేక్ చేయాలనుకున్నట్టుంది దర్శకుడు. ఈ సినిమాకి కాబట్టి ఇది సరిపోయింది. మొత్తానికి ‘కీడా కోలా’ లాజిక్ లేని కథని కలర్ఫుల్ పాత్రచిత్రణల వల్ల, గైరిచీ మేకింగ్ శైలి వల్లా తేలికగా తీసుకుని ఎంజాయ్ చేయదగ్గ ఆధునిక క్రైమ్ కామెడీగా ఫర్వాలేదనిపించుకునే విధంగా తెరకెక్కిందని చెప్పొచ్చు!
—సికిందర్