రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, నవంబర్ 2019, గురువారం

891 : సందేహాలు - సమాధానాలు

Q :   మీతో నాకు పరిచయం లేదు. అయితే స్టోరీ సినాప్సిస్ నేరేషన్ గురించి మీరు రాసిన ఆర్టికల్ ఫాలో అయి కథ చెప్పాను. వెంటనే ఓకే చేశారు. తర్వాత ఆ కథని ట్రీట్ మెంట్ రాసుకుని రెండు గంటలు మొత్తం అన్ని సీన్లు విన్పిస్తే, నచ్చలేదని రిజెక్ట్ చేశారు. ట్రీట్ మెంట్ నచ్చక పోతే మొదట నచ్చిన కథ రిజెక్ట్ అవుతుందా? 
కొత్త దర్శకుడు

A :   రిజెక్ట్ అవదు. మీరు సినాప్సిస్  చెప్పి ఓకే చేయించుకోవడానికీ, ట్రీట్ మెంట్ విన్పించడానికీ మధ్య గ్యాప్ లో ఇంకో కథ నచ్చి వుంటే తప్ప!  అందుకని  ట్రీట్ మెంట్ సిద్ధం చేసుకున్న తర్వాతే లైన్లయినా, సినాప్సిస్ లైనా చెప్పుకుంటే బావుంటుంది. ముందు లైను నచ్చాకనో, సినాప్సిస్  నచ్చాకనో తర్వాత తీరిగ్గా ట్రీట్ మెంట్ చేసుకోవచ్చులే నన్న అలసత్వం మంచిది కాదు. పూర్తి స్థాయి ట్రీట్ మెంట్ తోనే (బౌండెడ్ స్క్రిప్టు) వెళ్లి సినాప్సిస్ విన్పించాలి. అది ఓకే అయితే, రెడీగా వున్న ట్రీట్ మెంట్ ఆ వెంటనే చూపించేస్తే, అక్కడితో మ్యాటర్ క్లోజ్ అవుతుంది. ఇలా కాక సినాప్సిస్ ఒకసారి, ట్రీట్ మెంట్ ఇంకోసారి విడివిడిగా విన్పిస్తే ఆ గ్యాపులో ఏమైనా జరగొచ్చు. మళ్ళీ- ఈసారి మరీ పెను భారంగా రెండు గంటలు  ట్రీట్ మెంట్ వింటూ కూర్చునే ఓపిక లేకపోవచ్చు. ఉన్నా సెకండ్ థాట్స్ రావచ్చు. అప్పుడు నచ్చిన కథ ఇప్పుడెందుకో నచ్చకపోవచ్చు. కనుక సినాప్సిస్ శ్రవణం, ట్రీట్ మెంట్ సమర్పణ ఏకకాలంలో జరిగిపోతే ఇంకే దారుణమైన ఘడియలు రావు.

          ఇప్పుడెలాగూ మీ దగ్గర బౌండెడ్ స్క్రిప్టు వుంది కాబట్టి, ఒకసారి సినాప్సిస్, మళ్ళింకో సారి ట్రీట్ మెంట్ విన్పించాల్సిన టెన్షన్ వుండదు. ఓ అరగంట సినాప్సిస్ నేరేషన్ విన్పించాక ఓకే అయితే, రెడీగా వున్న ట్రీట్ మెంట్ తో ముందుకెళ్ళి పోవచ్చు. అంటే వివరంగా సీన్లు వినరని కాదు, వింటారు. ముందు మీకు ఆఫీసు కేటాయించి తర్వాత అన్నీ వింటారు. మార్పు చేర్పులు అవసరమన్పిస్తే చేయమంటారు. షార్ట్ కట్స్ తో పనిజరగదు. షార్ట్ కట్స్ కి లోతుపాతులు వుండవు. లోతుపాతుల్లేకుండా రాత్రికి రాత్రి పని జరగదు. చేతిలో బౌండెడ్ స్క్రిప్టు వుంటే చాలా లోతు పాతులున్నట్టు.

           కేవలం సినాప్సిస్ వరకూ రాసుకుని విన్పించి ఓకే చేయించుకున్నాక, ట్రీట్ మెంట్ రాస్తున్నప్పుడు తేడాలు రావచ్చు. తప్పకుండా వస్తాయి. విన్పించిన సినాప్సిస్ లాగే ట్రీట్ మెంట్ వుండాలని లేదు. అది సినాప్సిస్ కంటే బెటర్ గానో, వరస్ట్ గానో డెవలప్ అవచ్చు. అప్పుడా ట్రీట్ మెంట్ విన్పిస్తే, మొదట విన్పించిన సినాప్సిస్ తో  విభేదించి రిజెక్షన్ కి గురవచ్చు. సినాప్సిస్ దానికదే ఫైనల్ రూపం కాదు. రాసుకున్న సినాప్సిస్ కి చేసుకున్న ట్రీట్ మెంట్ తర్వాత తేలిన కథే ఫైనల్ కథ. ఈ ట్రీట్ మెంట్  ప్రకారం తిరగ రాసుకున్న సినాప్సిస్సే ఫైనల్. ఇదే విన్పించాలి.

          షార్ట్ కట్స్ కష్టాలకి ఉదాహరణలు... ఒకతను ఏం చేసి నిర్మాతని పట్టాడో పట్టేశాడు. ఆఫీసు ఓపెన్ చేయించి కూర్చుని ఏం కథ చేయాలా అని నెలల తరబడి ఆలోచిస్తున్నాడు. ఆఫీసు రేపోమాపో అన్నట్టుంది. ఇంకో అతను ఏదో కథ తీస్తూ పోతే తొంభై నిమిషాలే వచ్చింది. అది వదిలేసి పారిపోయాడు. షార్ట్ కట్స్ తో కామెడీ లుంటాయి.

Q :   దయచేసి "పారసైట్ " అనే సౌత్ కొరియన్ మూవీ యొక్క స్క్రీన్ ప్లే సంగతులు రాయండి.
రాజు AD

 
A :  పారసైట్’ (2019) అద్భుతమైన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ అంతర్జాతీయ ప్రశంసలతో. ఈ అద్భుతం కేవలం స్క్రీన్ ప్లే సంగతులతో తెలియదు. కేవలం స్క్రీన్ ప్లే సంగతులతో ఉపయోగం కూడా లేదు. దీని జానర్ క్రాఫ్ట్ ని కలిపి అర్ధం జేసుకోగలిగితేనే ఉపయోగం. కానీ వివిధ క్రాప్టులు ఇప్పుడొస్తున్న మేకర్లకి అర్ధం గావడం లేదు, ఏంచేస్తాం. వాళ్ళు రాసుకున్న కథల్లోనే ఒక సీను కేదైనా క్రాఫ్ట్ చెప్తే అర్ధం జేసుకోలేకపోతున్నప్పుడు, వేరే సినిమాల్లో క్రాఫ్టులు తెలుసుకోవా లనుకోవడ మెందుకు? అవసరం లేదు. ఇప్పటికే సత్యజిత్ రే ‘నాయక్’ గురించి పదేపదే ప్రస్తావించడం అతిగా వుంది. ఇంకోసారి చెప్పుకుంటే, అందులో సౌండ్ తో ఆయన క్రాఫ్ట్ ఎన్ని సంగతులతో ముడిపడి ఎలాటి కథ అదికూడా చెప్పిందో అర్ధంజేసుకోలేకపోతే, ఫీలై ఇన్స్ పైర్ అవకపోతే, ఏ సినిమా సైన్స్ తెలుసుకుని ఏం లాభం. ‘ఖైదీ’ క్రాఫ్ట్ ఎందరికి అర్ధమైంది? అందుకని ‘పారసైట్’ లాంటి మూవీ స్క్రీన్ ప్లే సంగతులు క్రాఫ్టు విహితంగా రాయడం బావుండక మానుకున్నాం.

 
Q :  ఫలానా సినిమా స్క్రీన్ ప్లే సంగతులు రాయమని మిమ్మల్ని ఇంకా అడుగుతున్నారంటే అది మీకు హేపీగా వుందా, బాధగా వుందా?
పేరు రాయలేదు

A :   పాయింటు హేపీయా, బాధనా అని కాదు, అవసరమా అని. ఇప్పటి అవసరమేమిటంటే, ఇంతకాలం పొందిన జ్ఞానంతో మీరే స్క్రీన్ ప్లే సంగతులు రాసి మీలో కథకుడో, దర్శకుడో ఎన్ని అంగుళాలు వున్నాడో తేల్చుకోవడం. అసలు స్క్రీన్ ప్లే సంగతులు ఏమర్ధమయ్యాయో కూడా తేల్చుకోవడం. తెలుగు సినిమాలన్నీ ఒకేలా వుంటున్నప్పడు స్క్రీన్ ప్లే సంగతులు ఒకేలా ఎంతకాలం చదివి బోరు కొట్టించుకుంటారు? ఆ మాటకొస్తే ఇప్పుడు తెలుగు సినిమాలకి రివ్యూలు కూడా అవసరం లేదు. అయినా మనమున్నామని తెలిపేందుకు అప్పుడొకటీ అప్పుడొకటీ రాద్దాం. 

Q :   ‘ఖైదీ’ స్క్రీన్ ప్లే సంగతులులో అది కమర్షియల్ స్ట్రక్చర్ తో వున్న ఆర్ట్ సినిమా కథ అన్నారు. అందుకని నూతనత్వం వచ్చిందన్నారు. ఐతే అది తమిళంలో తీశారు. అలాటిది తెలుగులో తీస్తే వర్కౌట్ అవుతుందా?
అనంత్, ASSO

A :   పైనే చెప్పుకున్నట్టు క్రాఫ్టే పాయింటు. క్రాఫ్ట్ ని అర్ధం జేసుకోనంతవరకూ ఏ ప్రయోగాలూ సాధ్యం కావు. అసలు మామూలు కమర్షియల్ సినిమాల్లోనే కొన్ని క్రాఫ్ట్స్ వుంటాయి. ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’ క్రాఫ్ట్ ఏమిటి? సీనుకి ఒక్క డైలాగు మాత్రమే వుండడం. ఇది గమనించారా? గమనించకపోతే ఎందుకు సినిమా వాళ్ళు సినిమాలు చూస్తున్నట్టు? ఏ ఉద్దేశంతో ఈ క్రాఫ్ట్ వుంది? చివర కోర్టు సన్నివేశాల్లో హెవీగా ఎన్టీఆర్ డైలాగులు వుండడంతో. ఇంత హెవీ డైలాగులు చాలా సేపు ఆడియెన్స్ తట్టుకోవాలంటే మిగతా సినిమాలో ఎక్కువ డైలాగుల భారం వేయకూడదు.ఇలా చేస్తే ఇక్కడ రిలీఫ్ గా సీన్లు చూసిన ప్రేక్షకులు, అక్కడ హేవీ డైలాగుల్నిభారంగా ఫీల్ కారు అందుకని క్లయిమాక్స్ సన్నివేశాల వరకూ సీనుకొక్క డైలాగు మాత్రమే వ్యూహాత్మకంగా వాడారు దాసరి నారాయణ రావు.  సీనుకొక్క డైలాగు మాత్రమే ఎలా సాధ్యమైంది? సన్నివేశ సారాంశం తెలిస్తే అర్ధమవుతుంది. జస్ట్ యాడ్ ఏజెన్సీ లో కాపీ రైటర్ వుంటాడు. అతను ఒక్క లైనులో అమ్మకపు వస్తువు గురించి మ్యాటర్ క్రియేట్ చేస్తాడు. క్రాఫ్ట్ అంటే ఏమిటో, దాని అవసరమేమిటో జ్ఞాన సముర్పార్జన లేకుండా ‘ఖైదీ’ లా తెలుగులో కమర్షియలార్ట్ తీయడం కష్టం. కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకోకుండా కళాత్మక సినిమాల జోలికి పోవద్దంటాడు రాబర్ట్ మెక్ కీ. తెలుగులో ఇప్పుడెన్ని కమర్షియల్ మసాలాలు తీసి అనుభవం గడించినా కమర్షియలార్ట్ పట్టుబడే అవకాశం కనిపించడం లేదు.

సికిందర్