రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, నవంబర్ 2019, గురువారం

893 : స్క్రీన్ ప్లే సంగతులు - 3     ఇంటర్వెల్ సీన్లో  కూడా ప్లాట్ పాయింట్ వన్ రాలేదు. అంటే కథ ప్రారంభించడం కోసం సమస్య ఏర్పాటు కాలేదు. అంటే జార్జి రెడ్డి గోల్ ప్రారంభం కాలేదు. ఇంటర్వెల్ ప్రసంగంలో విద్యార్ధులు అన్యాయాలపై తిరగబడాలని మాత్రమే ప్రసంగించి వూరుకున్నాడు. ఒక సమస్యంటూ ఏర్పడితే దానిమీద తిరగబడ్డం కథవుతుంది. ‘సైరా’ లో బ్రిటిషర్ల బలవంతపు పన్ను వసూలు సమస్య వచ్చింది కాబట్టి దాని మీద తిరగబడి పోరాటం ప్రారంభించాడు సైరా. కథా ప్రారంభానికి అది మూలం. ‘అల్లూరి సీతా రామ రాజు’ లో మన్యంలో బ్రిటిషర్లు ప్రకృతి వనరులు దోచుకుంటున్నారు కాబట్టి దాని మీద తిరగబడ్డాడు అల్లూరి సీతా రామరాజు. కథా ప్రారంభానికి, ఆ మాట కొస్తే చరిత్ర ప్రారంభం కావడానికి ఇది మూలం. ‘జార్జి రెడ్డి’ లో  ఇలాటి ఒక ప్రధాన సమస్యంటూ రైట్ వింగ్ తో  ఏర్పడకపోతే కథెక్కడిది, చరిత్రెక్కడిది?

          ఇంటర్వెల్లో కూడా కథ ప్రారంభం కాని తెలుగు సినిమాలెన్నోఇప్పటికీ చూస్తూంటాం. ఇవి ఇంటర్వెల్ తర్వాత కథలేక సెకండాఫ్ సిండ్రోంలో పడ్డమో, ఇంకేదో కథ అతికించుకుని స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చరవడమో, లేదా సినిమా చివర్లో ఎక్కడో పిసరంత కథ ప్రారంభమై మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవడమో అయి, అట్టర్ ఫ్లాపవడం చూస్తూంటాం. జార్జిరెడ్డి లో కథా ప్రారంభానికి సెకండాఫ్ లో పెట్టుకున్న సమస్య ఏమిటంటే ఎన్నికలు! ఇది ప్లాట్ పాయింట్ వన్ అయ్యే అవకాశం లేదు. అంటే ఎన్నికలతో కూడా కథ ప్రారంభం కానట్టే. అంటే ఇంకా బిగినింగ్ విభాగం ముగియనట్టే. అంటే ప్రారంభం కాని కథకి ఇంకా ఉపోద్ఘాతమే!

          అతడి భావజాలాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండానే ఎన్నికలు పెట్టేశారు. రైట్ వింగ్ తో భావజాలాల సంఘర్షణ చూపకుండానే, సమస్య ఏర్పాటు చేయకుండానే ఎన్నికలు. ఎన్నికలనేవి పాత్రకి ఏర్పాటైన సమస్యని తేల్చుకునే యాక్షన్ తో కూడిన ఒక అవకాశమే అవుతాయి తప్ప, వాటికవి కథకి సాధించాల్సిన సమస్య కాలేవు.1977 లో జనతా పార్టీ గాలిలో పుట్టుకొచ్చి ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఓడించలేదు.1975 లో ఆమె విధించిన  ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ పార్టీ పెట్టి ఎన్నికలు గెలిచారు. ఇలాగే కథా క్రమంలో కూడా ఎదుర్కొంటున్న ఒక సమస్యని పరిష్కరించుకునే సాధనంగా ఎన్నికలనే ఎలిమెంట్ ఎంటరవుతుంది తప్ప ఎన్నికలే సమస్యగా (ప్లాట్ పాయింట్ వన్ గా) ఏర్పాటు కావు.

          రెండోది, ఇంటర్వెల్ ప్రసంగానికి జార్జి రెడ్డి విద్యార్ధుల్ని సమీకరించి మీటింగ్ పెట్టడానికి తగిన కారణమేమీ కన్పించదు. ఢిల్లీ జే ఎన్ యూ లో ఫీజుల పెంపుకి వ్యతిరేకంగా విద్యార్ధులు రోడ్ల  మీది కొచ్చినట్టు - అలాటి వొక బలమైన కారణం గానీ సమస్య గానీ లేదు. ఇంకా జార్జి రెడ్డి జీవితంలో ఒక కీలక చారిత్రక ఉద్యమాన్ని ఈ సినిమాలో పక్కన పెట్టారు.1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం. అప్పుడు ఓయూ లోనే వున్నాడు. ఆ ఉద్యమం పట్ల ఆసక్తి లేదు. కానీ ఆ ఉద్యమంలో కదిలిన విద్యార్ధి లోకాన్ని చూసి, తన ఎజెండాకి కూడా విద్యార్ధుల్ని కదిలించ వచ్చని గుర్తించాడు. తెలంగాణా ఉద్యమం తర్వాత మూడేళ్ళే జీవించాడు. ఈ మూడేళ్ళ కాలంలో లెఫ్ట్ భావజాలంతో ‘పిడియూ’ స్థాపించి, చేగువేరా మోటార్ సైకిల్ డైరీస్ స్టయిల్లో సైకిల్ యాత్ర చేశాడు వరంగల్ కి. అక్కడ కాకతీయ మెడికల్ కాలేజీలో, కాకతీయ యూనివర్సిటీలో ప్రచారం చేశాడు. అతడి జెండా గుర్తు రక్తపు పిడికిలి ముద్ర. నినాదం  ‘జీనా హైతో మర్నా సీఖో, కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో’. 1972 లో ఓయూ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘర్షణలో హత్యకి గురయ్యాడు.


        సినిమాలో తారుమారు చేశారు. ఎన్నికల ప్రకటన తర్వాతే  పైన చెప్పుకున్న నినాదం, జెండా చూపించారు. దీంతో ఎన్నికలు వచ్చే వరకూ జార్జి రెడ్డికి కథకి ఏర్పడాల్సిన గోల్ లేనట్టే  తేలింది. సెకండాఫ్ లో ఎన్నికలు ప్రకటించింతర్వాత అతను హడావిడిగా జెండా తయారు చేయడం చూస్తే, అతను పాసివ్ క్యారక్టర్. ఎన్నికల్లేక పోతే జెండా, ఎజెండా, నినాదం ఏమీ వుండేవి కావా? వూరికే కాలక్షేపం చేస్తూ పాసివ్ గా వుండే వాడా?
              ఇంటర్వెల్ కి ముందు కూడా ఒక సీను జార్జిరెడ్డిని పాసివ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ముంబాయి నుంచి మంచి ఆఫర్ వస్తే, ఆ ఎగ్జిక్యూటివ్ కి ఏమీ సమాధానం చెప్పకుండా వచ్చేస్తాడు. ఆ ఆఫర్ స్వీకరించవద్దని, ఇక్కడే విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలనీ ఫ్రెండ్ అంటే ఏమీ అనకుండా కారు దిగిపోతాడు (జార్జి రెడ్డి కార్లు ఎక్కేవాడు కాదు, రబ్బర్ చెప్పులేసుకుని స్పీడుగా నడిచేవాడు). ఏమిటీ క్యారక్టర్ మనసులో ఏముందో చెప్పకుండా టూమచ్ ఇంటర్నల్ గా వుంటోంది? ఇలాగైతే ఆడియెన్స్ కి క్యారెక్టరెలా అర్ధమవుతుంది? ఆ తర్వాత విద్యార్ధులతో ఇంటర్వెల్ మీటింగ్. అంటే ఫ్రెండ్ చెప్పడం వల్ల - నిజమే తను విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడే వుండి కృషి చేయాలనీ అనుకుని ఈ మీటింగ్ పెట్టాడా? ఇది పాసివ్ క్యారక్టర్ లక్షణమే. యాక్టివ్ క్యారక్టరే  అయితే, ఆ ఎగ్జిక్యూటివ్ కి తనే స్పష్టం చేసేయాలి - తన అవసరం ఇక్కడ స్టూడెంట్స్ కి చాలా వుందని. యాక్టివ్ క్యారెక్టర్ ఇలా ఎసర్టివ్ గా వుంటుంది. అప్పుడా తర్వాత ఫ్రెండ్ తో చెప్పించుకున్న ఫలితంగా ఇలా మీటింగ్ పెట్టుకున్నాడని చులకనయ్యే అవకాశమే వుండదు. ఫ్రెండ్ తో తీసిన ఆ సీనూ లేక, ఆ సీను తీయడానికైన డబ్బులూ మిగులుతాయి. యాక్టివ్ క్యారెక్టర్ చెప్పించుకోడు, తనుగా ఆలోచించి చేస్తాడు, జరిపిస్తాడు. ఎందుకంటే అతను కథా నాయకుడు. కథ తను నడుపుతాడు, ఎవరో చెప్పినట్టు నడపడు. యాక్టివ్ క్యారక్టరైజేషన్లు ఎవరో స్క్రీన్ ప్లే పండితుల స్వకపోల కల్పితాలు కావు తిరస్కరించడానికి. నిజజీవితంలో వ్యక్తిత్వ వికాసం. యాక్టివ్ క్యారక్టరైజేషన్ అనేది వ్యక్తిత్వ వికాసపు  అభివ్యక్తి. పాసివ్ క్యారక్టరైజేషన్ వ్యక్తిత్వ వికాసం లేని అల్పత్వం.

ఒకే  ఒక్క సీక్వెన్స్
            సెకండాఫ్ అంతా ఒకే  సీక్వెన్స్ తో వుంటుంది. మొదట రిసెర్చర్ ముస్కాన్ తో ఒక ప్రెజంట్ టైం సీను. తర్వాత జార్జిరెడ్డి పెట్టిన ఇంటర్వెల్ మీటింగ్ కి ఎబిసిడి వాళ్ళ వ్యతిరేక మీటింగ్. కౌషిక్ ఎమ్మెల్యే సలహా అడిగితే సానుభూతి ప్లే చేసి జార్జి రెడ్డిని కొట్టాలని ఎమ్మెల్యే సలహా ఇవ్వడం. ఎన్నికలు ప్రకటించడంతో, ఒక జెండా అవసరమని జార్జి రెడ్డి జెండా తయారీ, పిడియూ పార్టీ ఏర్పాటు. ఎన్నికల ప్రచారం. మూడు పక్షాల హోరా హోరీ ప్రచారం. కొట్లాట, విజయంతో పాట. ఒక బస్తీలో ఎవరో దౌర్జన్యం చేస్తున్నారని జార్జి రెడ్డికి ఫిర్యాదు. జార్జిరెడ్డి వెళ్లి అడ్డుకోవడం. మాయ ప్రేమ ప్రకటన. జార్జి రెడ్డి ఏదీ తేల్చి చెప్పకపోవడం. జార్జి రెడ్డి మీద గ్యాంగ్ ఎటాక్. బ్లేడ్ ఫైటింగ్. గాయపడిన జార్జిరెడ్డి కోలుకునే ప్రయత్నం. మదర్ సెంటి మెంట్. చిన్నప్పటి దృశ్యాలతో పాట. కోలుకున్న జార్జిరెడ్డి క్యాంపస్ కి రావడం. ఇంకో కొట్లాట. గొడవలు. ఊరేగింపులు. పోలీస్ లాఠీ ఛార్జి. దేశమంతటా సంచలనం. జార్జిరెడ్డి ఉపన్యాసం. 144 సెక్షన్ విధింపు. రాళ్ల దాడులు. లాఠీ ఛార్జి. ఉద్యమాన్ని ఉధృతం చేయాలనీ పిలుపు. పోలీస్ పికెట్... దీని తర్వాత జార్జి రెడ్డి హత్య, కుటుంబ విషాదం, ముస్కాన్ గన్ ని హుస్సేన్ సాగర్ లో విసిరేయడం.

          సెకండాఫ్ గంటంపావంతా ఒకే సీక్వెన్స్ అనేది చాలా విచిత్రమైన కథనం. ఇదే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో కూడా చూస్తాం. ఇందులోనైతే ఇంకా ఫస్టాఫ్ కూడా ఒకే సీక్వెన్స్ వుంటుంది. ఏ సినిమా అయినా ఎనిమిది సీక్వెన్సుల మీద నిలబడుతుంది : ఫస్టాఫ్ లోనాల్గు, సెకండాఫ్ లో నాల్గు. అప్పుడే ఓ సినిమా చూస్తున్నట్టు వుంటుంది.
ఏ సినిమా కథకైనా- అదెంత సిగ్రేడ్ సినిమా అయినా సరే, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ లనే విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేలో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి!

       
ఈ ఎనిమిది సీక్వెన్సులు  బిగినింగ్ లో రెండుమిడిల్ లో నాల్గుఎండ్ లో రెండు వుంటాయి. ఈ సీక్వెన్సుల్ని విశ్లేషించి చూస్తే, ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే. ఒక్కో సీక్వెన్సు ఒక్కో పాయింటుతో రన్ అవుతుంది. అలా ఒక సినిమా కథలోని ఎనిమిది పాయింట్ల మీద రన్ అవుతుంది. ఒక పాయింటు ముగింపు ఇంకో పాయింటు ప్రారంభంగా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభంగా వుంటుంది.
           పైన చెప్పుకున్న కథనం చూస్తే, సెకండాఫ్ లో ప్రారంభమైన కథనం కూడా ఓ కథ కాక పోగా, ఒకే ఎన్నికలనే పాయింటుతో ఒకే సీక్వెన్సుగా  నడిపి ముగించేశారు. దీంతో సెకండాఫ్ ఏం చూశామంటే ఒకే టైం స్పాన్ లో అదే ఎన్నికల ప్రచారాలూ కొట్లాటలూ పోలీసుల చర్యలూ చూశాం. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినట్టు చిత్రణ. కానీ జార్జి రెడ్డి దేశవ్యాప్తంగా తెలిసింది ఇంతకి చాలా పూర్వం భావజాల ప్రచారం చేస్తున్నప్పుడే. ఈ సెకండాఫ్ లో కూడా కథలేక ఏం చూశామంటే ఏమో అన్నట్టుగా తయారయ్యింది. కథే లేని సినిమా అయింది. పైన చెప్పుకున్నట్టు- సెకండాఫ్ సిండ్రోం, ఫ్రాక్చర్డ్ స్క్రీన్ ప్లే, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే ఇవే చూస్తూ వచ్చాం ఇంతకాలం. ఇప్పుడు కొత్తగా అసలు కథేలేని ‘స్క్రీన్ ప్లే’ చూస్తున్నాం. దీనికి కొత్తగా ఏం పేరు పెట్టాలి?         

        రైట్ వింగ్ విరోధంతో ప్రారంభమైన అతడి పోరాటంలోంచి గోల్ - క్యాంపస్ రాజకీయాల కావల నక్సల్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆశయంగా పెరిగింది. సైకిల్ యాత్ర వరంగల్ వెళ్ళినప్పుడు, అక్కడ అజ్ఞాతంలో వున్న నక్సల్స్ ని కలుసుకున్నది ఇందుకే. ఇదేమీ చూపించలేదు ‘బయోపిక్’ లో. ఇంకోటేమిటంటే అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఖాయంగా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి. ఇది కూడా చూపించలేదు. ఈ కోరికలు తీరకుండానే అతడి మరణం సంభవించింది. ముగింపులో ఈ ఆశయాల ఊసెక్కడా లేకపోతే అదెలాటి ‘బయోపిక్’?  బయోపిక్ పాత్ర ఏవో కాలేజీల దొమ్మీల ఫలితంగా చనిపోయాడని చూపిస్తే అది మామూలు రౌడీ పాత్ర. ఓ ఫార్ములా కథ. జార్జి రెడ్డి అనే ఓ భిన్నమైన పర్సనాలిటీ ఆశయాలు తీరకుండానే అర్ధాంతరంగా చనిపోవడం బాధాకర ముగింపు. అది  ఆలోచింప జేస్తుంది.  ఈ ముగింపుని కొనసాగిస్తే, అతడి ఆశయాలకి ప్రతిరూపంగా, అతన్నుంచి స్ఫూర్తిగా  ఎందరెందరు ప్రముఖ నక్సల్ నాయకులు ఉద్భవించారో తెలుస్తుంది. అది సమగ్ర ముగింపు అవుతుంది. 


            
           ఎన్నికల ప్రచారం ఉద్రిక్తల మధ్య పోలీస్ పికెట్ ఏర్పడ్డ తర్వాత అకస్మాత్తుగా ఈ సీను వస్తుంది - రాత్రి పూట జార్జి రెడ్డి ఇంట్లోంచి గన్ తీసుకుని వెళ్తూంటాడు. భోంచేసి వెళ్ళమని తల్లి అంటుంది. మెస్ లో చేస్తానని వెళ్ళిపోతాడు. హాస్టల్లోకి వెళ్తూంటే ఆ చీకట్లో ఎటాక్ చేస్తారు. అతను చేతులతో, బ్లేడుతో ఎదుర్కొంటాడు. గన్ మాత్రం తియ్యడు. అలాగే వాళ్ళ చేతిలో గాయపడి చచ్చిపోతాడు. గన్ తీసుకుని బయల్దేరిందే ఆత్మరక్షణ కోసం అయినప్పుడు దాన్ని తీసి కాల్చి పడెయ్యక పోవడమేమిటి?


          ఈ గన్ ఏదో పోయెటిక్ ముగింపు కోసం అనుకుని ఇలా చేసినట్టున్నారు. ఆ గన్  ముగింపులో ముస్కాన్ హుస్సేన్ సాగర్ లో ఏదో సందేశంతో విసిరేయాలి కాబట్టి దాన్నిలా ‘ఎస్టాబ్లిష్’ చేయడం కోసం జార్జిరెడ్డి కిచ్చి పంపినట్టుంది. ఇది సిల్లీగా వుంది. జార్జి రెడ్డి కిచ్చి పంపిస్తే జార్జి రెడ్డి దర్శకుడు చెప్పినట్టు చేస్తాడా? వాళ్ళందర్నీ కాల్చి పడేసి ముగింపు మార్చేస్తాడు. ముస్కాన్ లేదు, గిస్కాన్ లేదు.


          అసలు జార్జి రెడ్డి దగ్గర ఎప్పుడూ గన్ లేదు. అయినా అతణ్ణి చంపాలంటే చాలా కష్టం. అతను జిమ్ లో వ్యాయామం చేసి బలిష్టంగా వుండేవాడు. సినిమాలో చూపించినట్టు కర్రసాము, కత్తి సాము లేవు. బాక్సింగ్ ఒకటే ఇంటరెస్టు. ఇంకా సినిమాలంటే ఇంటరెస్టు. పోయెట్రీ రాసేవాడు. మద్యం, సిగరెట్లు ముట్టుకునే వాడు కాదు. విద్యార్ధులకి కూడా వీటికి దూరంగా వుండాలని చెప్పేవాడు. 
ఒకసారి అతడి మీద హత్యా ప్రయత్నం చేసిన తర్వాత ఇంకోసారి ఎటాక్ చేయడం అంత సులువనుకోలేదు. అయితే అతను తానుగా వెళ్లి ట్రాప్ లో పడ్డాడు. ఎన్నికలప్పుడు ఆ సాయంకాలం ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ కి వొంటరిగా వెళ్ళి, పోటీ చేస్తున్న అభ్యర్ది మీద ఎటాక్ చేశాడు. దీంతో మూకుమ్మడిగా ఎటాక్ చేసి అతణ్ణి చంపడం సులువైపోయింది...
సికిందర్