రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, సెప్టెంబర్ 2016, శనివారం

రుస్తుం సంగతులు- 3


రుస్తుం ది ఒకే  అర్ధవంతమైన పెద్ద కథ కాదనీ,  రెండు అసమగ్ర  కథల కథావళీ అనీ గత రెండు వ్యాసాల్లో గుర్తించాం. ఒకటి భార్య ద్రోహ కథ ఫస్టాఫ్ లో- రెండు భర్త దేశభక్తి కథ సెకండాఫ్ లో. భార్య ద్రోహ కథగా మొదలై  భర్త దేశభక్తి కథగా మారిపోయేలాటి  డబుల్ సిమ్ సినిమా ఇది. సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు ఈ వ్యాధిని. ఫస్టాఫ్ లో డెంగ్యూ దోమ కుడితే సెకండాఫ్ లో చికెన్ గున్యా దోమ కుట్టినట్టు వుంటుంది మనకి. అంతే గానీ  పరిశుభ్రమైన చికెన్ బిర్యానీ లాంటి డిష్ పెట్టాలనుకోరు మనకి. హిందీలో తక్కువేగానీ తెలుగులో ఈ మోజు ఎక్కువే వుంది- ధమ్, దొంగోడు, జ్యోతో లక్ష్మి, సైజ్ జీరో,  జనతా గ్యారేజ్, జ్యో అచ్యుతానంద- లాంటివి ఎన్నో వచ్చాయి, ఇంకా వస్తాయి. ‘రుస్తుం’ ఫస్టాఫ్ లో భార్య ద్రోహ కథైనా ఎంత అసహజంగా వుందో గత వ్యాసంలో చూశాక, ఇక సెకండాఫ్ లో సాగే భర్త దేశభక్తి కథ కూడా ఇంకెంత అసహజంగా వుంటుందో ఇప్పుడు చూద్దాం...
          హీరోని గొప్ప దేశభక్తుడిగా తేల్చడానికి  నేవీ స్కామ్ అనే ఒకదాన్ని సృష్టించారు. బ్రిటన్ లో  ఒక యుద్ధ నౌక అమ్మకానికొస్తుంది. దాన్ని కొనుగోలు చేయాలనీ నావికా దళం నిర్ణయిస్తుంది.  ఇన్స్ పెక్షన్ అధికారిగా రుస్తుం వెళ్లి పరిశీలిస్తాడు. అది కాలం చెల్లిన యుద్ధ నౌకలా వుందని అన్ ఫిట్ సర్టిఫికేట్ ఇస్తానంటాడు.  కాదు పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలని నేవీ అధికారులు ఒత్తిడి చేస్తారు. బాగా డబ్బు కూడా ఇస్తామంటారు. ఈ అవినీతినికి ఒప్పుకోడు రుస్తుం. దీన్నాపాలని  నిర్ణయించుకుంటాడు. ఈ నేవీ అధికారుల వెనుక విక్రం (రుస్తుం భార్య ప్రియుడు) వున్నాడని కూడా తెలుసుకుంటాడు. నేవీ అధికారులకీ రుస్తుం కీ మధ్య ఈ సమస్య నలుగుతూ వుంటుంది. రుస్తుం డిఫెన్స్ సెక్రెటరీ దృష్టికి కూడా తీసుకుపోతే అతనూ ఈ స్కామ్  లో భాగస్థుడేనని అర్ధమౌతుంది. ఇక రుస్తుం ఒక ఆలోచన చేసి వాళ్ళు చేస్తున్న స్కామ్ తాలూకు పత్రాలు తన దగ్గరున్నాయనీ,  వాటిని బయట పెడతాననీ బెదిరిస్తాడు. 

        బ్యాక్ గ్రౌండ్ లో ఈ కథ నడుస్తూండగానే  తన భార్య- విక్రంల ఎఫైర్ తెలుస్తుంది రుస్తుం కి (ఈ ఎఫైర్ తెలియడమే స్క్రీన్ ప్లేకి  ప్రారంభం). అప్పుడు విక్రం ని చంపడానికి వెళ్తూ రుస్తుం మధ్యలో పోస్టాఫీసు కెళ్ళి డిఫెన్స్ సెక్రెటరీకి ట్రంక్ కాల్ చేసి వాదన పెట్టుకుంటాడు. ఇప్పుడు విక్రం ని వదలనని అనేస్తాడు. వెళ్లి విక్రం ని కాల్చి చంపేస్తాడు. 

        ఇదీ హత్య వరకూ జరిగిన స్కామ్ పూర్వ కథ. దీని తర్వాత కోర్టులో ఇదెలా తేలిందో చూద్దాం : విక్రం ని చంపి పోలీసులకి లొంగిపోతాడు రుస్తుం. నిజ కథలో అయితే నానావతి ప్రోటోకాల్ ప్రకారం నేవీ అధికారులకే లొంగిపోతాడు. నేవీ అధికారులు బొంబాయి పోలీసులకి అప్పగిస్తారు ఫార్మాలిటీస్ పూర్తిచేసి. అయితే ఇక్కడ కోర్టులో కూడా రుస్తుం వచ్చి అడుగుతున్న నేవీ అధికారుల కస్టడీకి వెళ్ళననీ, పోలీస్ కస్టడీలోనే ఉంటాననీ వాదిస్తాడు. ఎందుకిలా అంటున్నాడో మనకి అర్ధం కాదు. కథ చివర్లో నేవీ స్కామ్ ని రివీల్ చేసినప్పుడు అర్ధమవుతుంది- నేవీ అధికారులు తన విరోధులు కాబట్టి, వాళ్ళల్లో ఒకడైన విక్రంని తను చంపాడు కాబట్టి,  వాళ్ళ కస్టడీకి వెళ్ళ ననడాన్ని అర్ధం జేసుకోవచ్చు.       కానీ ఎవరి కస్టడీలో ఉండాలో నిందితుడికి కోర్టు ఛాయిస్ నిస్తుందా- కోర్టుదే నిర్ణయమవుతుంది గాని? ఇదీ ప్రశ్న. పోనీ దర్శకుడు తన ఇష్టానుసారం కథ నడుపుకోవడం కోసం కోర్టు కాస్త లైట్ తీసుకుని  పోలీస్ కస్టడీకే ఇచ్చిందనుకుందాం- అప్పుడా పోలీసులైనా ఒక నిందితుడుగా వున్న  రుస్తుంని కస్టడీలోకి తీసుకున్నాక,  ఇంకా అతణ్ణి నేవీ యూనిఫాంలోనే అనుమతించరు కదా? మళ్ళీ ఆ యూనిఫాంలోనే  జడ్జీ ఎదురుగా హాజరు పర్చరు కదా? నేవీలో అతను సస్పెండ్ అయ్యాక యూనిఫాం వేసుకునే అధికారమే వుండదు కదా- మెడల్స్ తో సహా అన్నీ సరెండర్ చేయాల్సిందే కదా? 
          సరే, పోలీసులు కూడా దర్శకుడి హంగామా చూసి రూల్స్ ని కాస్త  లైట్ గానే తీసుకున్నారే అనుకుందాం- అతణ్ణి జ్యుడీషియల్  కస్టడీకి జైలుకి తరలించినప్పుడైనా  జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీ దుస్తుల్లోకి అతను మారిపోవాల్సిందే కదా? మళ్ళీ జైలు అధికారులు కూడా దర్శకుడి తడాఖాకి తట్టుకోలేక సరేలేరా బాబూ నీ కథ కోసం, హీరోగార్ని నేవీ డ్రెస్ లోనే  రిచ్ గా, గ్రాండ్ గా ప్రతీ ఫ్రేములో చూపించడం కోసం – డ్రస్సు వుంచుకోఫో- అనేసి  మరీ లైట్ గా తీసుకున్నారే అనుకుందాం- మరి హత్య చేసిన హీరో ఆ డ్రెస్ తీయకుండా ఎలాటి సంకేతాలు ఇస్తున్నట్టు  తన పాత్రపరంగా? - నేను దేశాన్ని రక్షించే నేవీ ఆఫీసర్ని, నన్ను మీరు చట్టాలకి అతీతుడుగా, ప్రత్యేకంగా చూడాలి, ఆమేరకు తీర్పు ఇవ్వాలి సుమా - అని కోర్టుని బెదిరిస్తున్నట్టు లేదూ పాత్ర?  ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఎలా ఈ డ్రెస్ లాజిక్ ని ఎగేసినా, అంతిమంగా పాత్ర చిత్రణనే  దెబ్బతీసింది కదా, ఈ యూనీఫాం ధారణ? లాజిక్ ని చూడొద్దు, సినిమాని సినిమాలాగే చూడాలన్న వితండ వాదన చేస్తే  ఇలాగే నాన్సెన్స్ గా తయారవచ్చు పాత్రలు!

          ఇక సొంతంగా కేసు వాదించుకునే విషయం. ఇది కోర్టులు అనుమతించేదే (pro se legal representation).  ఐతే నానావతి తన కేసు తాను వాదించుకోలేదు.  ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో నిందితుడైన సునీల్ దత్ కూడా తన కేసు వాదించుకోడు. అతడి తరపున లాయర్ పాత్రలో అశోక్ కుమార్ వాదిస్తాడు. సునీల్ దత్, అశోక్ కుమార్ వీళ్ళంతా ఆరోజుల్లో స్టార్స్. కాబట్టి ఒక స్టార్ నిందితుడి స్థానంలో పాసివ్ గా వున్నా, రెండో స్టార్ కేసు వాదిస్తూ యాక్టివ్ గా ఉండడంతో బాక్సాఫీసు లెక్క భర్తీ అయింది. కానీ ‘రుస్తుం’ లో ఫస్టాఫ్ లో హత్య చేసిన దగ్గర్నుంచీ పోలీసుల బందీగా ఏమీ చేయక పాసివ్ గా వుండిపోయే అక్షయ్  కుమార్ లాంటి స్టార్,  ఇక యాక్టివ్ అవకపోతే సినిమా లేదు. లాయర్ గా ఇంకో స్టార్ ని  తెచ్చిపెట్టాలనుకోలేదు. అందుకని సెకండాఫ్ లో కోర్టు విచారణలో అక్షయ్ ని యాక్టివేట్ చేసినట్టుంది- అందుకే తన కేసు తను వాదించుకునే పాయింటు తెరపైకొచ్చిందని అర్ధం జేసుకోవాలి. 


        సరే, రుస్తుం యాక్టివ్ పాత్ర అయ్యాడు. కేసు విచారణ రుస్తుం భార్యతో విక్రం శారీరక సంబంధం కారణంగా హత్య అనే కోణంలోనే సాగుతూండగా, రుస్తుం ఇంట్లో దుండగుల సోదాతో నేవీ స్కామ్ కోణం మళ్ళీ తెరపైకొస్తుంది. రుస్తుం భార్య జైలుకొచ్చి దుండగుల గురించి  రుస్తుంకి చెప్తే, అది ముఖ్యమైన పత్రాల కోసం నేవీ అధికారులు చేసిన కుట్ర అని చెప్పి, వాళ్లకి ఒక డిమాండ్ పెట్టమని కవర్ అందిస్తాడు. అందులో స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలుంటాయి.


      ఇప్పుడు ప్రశ్న: రుస్తుం స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ ఎప్పుడు  ఓపెన్ చేశాడు? విక్రం ని చంపడానికి వెళ్తూ పోస్టాఫీసుకి వెళ్లి డిఫెన్స్ సెక్రెటరీతో  ట్రంకాల్ మాటాడినప్పుడే ఎక్కౌంట్ ఓపెన్ చేశాడని విచారణలో తేలుతుంది. అంటే అతను స్విస్ బ్యాంకు అధికార్లతో ఫోన్లో మాట్లాడేసి, ఎకౌంట్ ఓపెన్ చేయించుకుని, అప్పటికప్పుడే ఎక్కౌంట్ నంబర్ కూడా పొందేశాడా- ఇది సాధ్యమా?


        ఆ ఎక్కౌంట్ నంబర్ వున్న కవరు కూడా ఇంకా జేబులోనే పెట్టుకు తిరుగుతున్నాడా? పోలీసులుగానీ, జైలు అధికారులుగానీ స్వాధీనం చేసుకోలేదా?
        ఇక రుస్తుం భార్య వెళ్లి నేవీ అధికారులకి ఆ పత్రాలు కావాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని బేరం పెడుతుంది. 1959 లో ఐదు కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో లక్షాధికారులే వుండేవాళ్ళు గానీ కోటీశ్వరుల సంఖ్య తక్కువే. అన్ని కోట్లు ఆ రోజుల్లో నేవీ అధికారులైనా ఎక్కడ్నించి తెచ్చిస్తారో. లక్షల్లో బేరం పెడితే ఇప్పటి ప్రేక్షకులు నవ్వుతారని బిల్డప్ కోసం ఐదుకోట్లు పెట్టారేమో. బాక్సాఫీసు తూకం బాగానే సరిచూసుకుంటున్నారు. ఆ ఐదు కోట్లూ స్విస్ ఎక్కౌంట్ లో వేసేందుకు ఒప్పందం కుదురుతుంది. 


        ఇప్పుడు డిఫెన్స్ సెక్రెటరీతో వ్యవహారం చూద్దాం : కేసు విచారిస్తున్న పోలీసు అధికారి డిఫెన్స్ సెక్రెటరీకి రుస్తుం ట్రంక్ కాల్ చేసిన మాటాడిన ఎవిడెన్స్ కోసం ఢిల్లీ వెళ్లి డిఫెన్స్ సెక్రెటరీని కలుస్తాడు. అప్పుడు డిఫెన్స్ సెక్రెటరీ తన కొచ్చే కాల్స్ అన్నిటినీ రికార్డు చేస్తానని చెప్పి- రుస్తుం కాల్ చేసి మాటాడి నప్పటి ఆడియో టేపు విన్పిస్తాడు. ‘విక్రం ని వదలను’ అన్న మాటలున్న ఆ టేప్ తెచ్చి కోర్టులో పెడతాడు పోలీసు అధికారి. దాంతో కేసు ఓడిపోతాడు రుస్తుం. ఆత్మ రక్షణ కోసం తను హత్య చేయలేదనీ, హత్య చేయాలని ముందు నిర్ణయించుకునే విక్రం దగ్గరి కెళ్ళి చంపాడనీ  రుజువైన దరిమిలా జ్యూరీ ఇక తీర్పు కి సిద్ధమౌతుంది. 


       ఇక్కడ ప్రశ్నలు : డిఫెన్స్ సెక్రెటరీ రుస్తుం మాటల్ని కూడా రికార్డు చేయడం తన డెత్ వారంట్ ని తను రాసుకోవడం కాదా? ఎవడైనా స్కామ్  చేస్తున్న వాడు అలా రికార్డు చేసి దగ్గర వుంచుకుంటాడా అలాటి మాటలు-  అది కూడా అధికారికంగా తన సొంత కార్యాలయంలో? రుస్తుంని పట్టించే ‘విక్రం ని వదలను’  అన్న మాటలున్న మేరకే టేపుని కత్తిరించి కోర్టులో పెట్టినంత మాత్రాన- రుస్తుం కేసు ఓడిపోతాడా? అసలు డిఫెన్స్ సెక్రెటరీకి రుస్తుం భార్య - విక్రంల  శారీరక సంబంధంతో సంబంధమేంటయ్యా బాబూ చెప్పూ- అని కోర్టు అడగదా?  నా భార్యతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి - విక్రం ని వదలనని రుస్తుం ఎక్కడో డిఫెన్స్ సెక్రెటరీకి కాల్ చేసి ఎందుకు చెప్తాడయ్యా స్వామీ- అని కోర్టు నిలదీయదా? అసలీ ‘విక్రం ని వదలను’ అన్న మాటకి ముందు- మాటకి తర్వాత  వాళ్ళిద్దరేం మాటాడుకున్నారో పూర్తి సంభాషణతో టేపు కోర్టుకి సమర్పిస్తావా, లేకపోతే ఇలాగే ఈ ముక్క పట్టుకుని నకరాలు చేస్తావా?- అని కోర్టు మొట్టికాయ వేయదా?

        అప్పుడు పూర్తి టేపు కోర్టుకి సమర్పించాల్సి వస్తే డిఫెన్స్ అయ్యగారి పనేమౌతుందో?! ఇలా వుంది కథా రచన! సినిమాల్లోనే ఇలాటి భయంకర కథా రచనలుంటాయి- అవి చెల్లిపోతాయి- సినిమాల్ని కళ్ళతో చూస్తారు కాబట్టి. సాహిత్యంలో ఇలాటి భయంకర కథా రచనలు చెల్లవు- మెదడుతో చదువుతారు కాబట్టి. 


        కోర్టు అడగకపోతే అడగకపోయింది- గెలుస్తానన్నట్టు అంత ఫోజుపెట్టి కేసు వాదించుకున్న రుస్తుం కూడా ఈ టేపు ముక్క చెల్లదని  అనడు. ఎందుకంటే స్కామ్   బయట పడుతుందని అట!
        తర్వాత జైల్లో అదే పోలీసు అధికారికి స్కామ్ గురించి మొత్తం చెప్పేస్తాడు- మరి దీన్ని బయట పెట్టి కేసునుంచి విడుదల కావొచ్చుగా? –అని అధికారి అంటే- స్కామ్ బయట పెడితే దేశానికి చెడ్డ పేరొస్తుందని అంటాడు రుస్తుం!
        దేశానికి చెడ్డ పేరొస్తుందని స్కాములు చేసుకునే వాళ్ళని చేసుకోనిస్తూ అలాగే వుండనిస్తా డన్నమాట!


        దీనికి ‘నువ్వు చాలా గొప్ప దేశభక్తుడివి’ – అని మెచ్చుకుంటాడు పోలీసు అధికారి. ‘అయితే స్కామ్ చేస్తున్నాడని విక్రంని దేశభక్తితో చంపావన్న మాట- నీ భార్యతో సంబంధం పెట్టుకున్నందుకు పత్నీ భక్తితో కాదన్న మాట?’ అని మాత్రం అడగడు. అడిగితే ఇరకాటంలో పడతానని దర్శకుడు అడగనిచ్చి వుండడు. 


        కానీ ఒకటి అడిగేస్తాడు పోలీసు అధికారి- ‘ఐదు కోట్లు తీసుకుని స్కామ్ పత్రాలు నేవీ వాళ్లకి ఇచ్చేశావా?’- అని. అప్పుడు  రుస్తుం కొంటెగా నవ్వి- ‘అసలా పత్రాలుంటేగా- వూరికే బుకాయించా’ అంటాడు!


        మరి స్విస్ బ్యాంకు ఎక్కౌంట్లో ఐదు కోట్ల సంగతి అడగాలిగా అధికారి? అదికూడా అడగడు- అడిగితే దర్శకుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడని వదిలేసినట్టున్నాడు. 
ఇలా తలతిక్కగా వుంటుంది కథానిర్వహణ! 


        ఇన్ని లోపాలు ఎత్తి చూపిస్తూంటే ఇది చదువుతున్న వాళ్లకి కోపాలు రావొచ్చు. ఇన్ని లోపాలే ఒక దర్శకుడో, రచయితో వెళ్లి హీరోకో, నిర్మాతకో కథ వినిపిస్తే వాళ్ళ అవగాహన కొద్దీ ఎత్తి చూపి- మార్చి రాసుకు రమ్మంటారు. మార్చి మార్చి మళ్ళీ మళ్ళీ  రాయిస్తూంటారు. ఆ టార్చర్ నంతా భరిస్తూ అప్పుడు రాని కోపాలు, ఇప్పుడెందుకు రావాలి?


       ‘రుస్తుం’ లో ఇదంతా కాదు- దేశానికి చెడ్డ పేరొస్తుందని హీరో స్కామ్ ని బయట పెట్టక పోవడం పెద్ద నేరం కాకపోవచ్చు దర్శకుడి దృష్టిలో. కానీ దర్శకుడు పాల్పడ్డ అసలు నేరం వేరే వుంది- దేశానికీ, ఆనాటి నావికా దళానికీ చెడ్డ పేరొచ్చేలా రాసుకున్న ఈ కథతో.          ఈ కథాకాలం 1959 అంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి పట్టుమని పదిహేనేళ్ళు పూర్తికాలేదు. అప్పట్లో ఏ నాయకులకి కూడా దేశాన్ని దోచేసుకుందామన్న అవినీతి బుద్ధుల్లేవు. కొత్త దేశం, కొత్త బాధ్యతలు, భయభక్తులు -ఇవే వుండేవి.  అందులోనూ రక్షణ శాఖలో స్కామ్ అప్పట్లో వూహకే అందనిది. నిజమే, 1948 లో ఒక ఉదంతం జరిగింది. జీపుల కుంభకోణం. ఇంగ్లాండ్ నుంచి 80 లక్షలకి రెండు వందల జీపుల్ని రక్షణ శాఖ కొనుగోలు చేస్తే 155 మాత్రమే వచ్చాయి. అప్పటి ఇంగ్లాండ్  హై కమీషనర్ వీకే కృష్ణ మీనన్ ఈ  ఉదంతంలో ఇరుక్కున్నారు. తర్వాత జీపుల లెక్క క్లియర్ చేశారు. దీన్ని స్కామ్ అని కూడా అనలేం- రక్షణ శాఖలో మొట్ట మొదటి స్కామ్ చేసేందుకు సాహసించింది – స్వాతంత్య్రం వచ్చిన 40 ఏళ్ళకి-  1987లో-  బోఫోర్స్ తుపాకులతో మాత్రమే,  అంతే!


        కానీ ‘రుస్తుం’ దర్శకుడు ఈ కథలో  1959 లోనే రక్షణ శాఖలో స్కామ్ ని సృష్టించినప్పుడు అప్పుడప్పుడే పుట్టిన దేశ ప్రతిష్టకి, నావికాదళ గౌరవానికీ భంగంకల్గిస్తున్నా నన్న స్పృహతో లేడు! అప్పట్లో నేవీ అధికారులు అవినీతి పరులని చూపడం చాలా దుర్మార్గమని కూడా గ్రహించలేదు! (ఇంకా వుంది)


-సికిందర్