రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, జులై 2015, గురువారం

ఒకటే ప్లస్!


స్క్రీన్ ప్లే దర్శకత్వం : యోగేష్
తారాగణం: నాగశౌర్య, సోనారిక, అజయ్‌, జాకీర్‌ హుస్సేన్‌, రవి కాలే, ఆశిష్‌ విద్యార్థి, కోట శ్రీనివాసరావు, సప్తగిరి, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, సత్య తదితరులు
 కథ
, మాటలు: మధుసూదన్‌   సంగీతం: సాగర్‌ మహతి  ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
బ్యానర్‌: సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌   నిర్మాత : వి.వి.ఎన్‌. ప్రసాద్‌
విడుదల : 26 జూన్ 2015  

*
 Casting is sometimes a fate 
and destiny  more than skill
and talent, from a director’s
point of view
.
—Steven Spielberg  
కెరీర్ ప్రారంభంలో తాజా హీరో నాగశౌర్య రెండు రోమాంటిక్ సినిమాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులుచూడకు రామయ్య’ హిట్టవడంతో తానిలాగే పువ్వులిచ్చి ప్రేక్షకుల్ని గెలుచుకుంటాననీ, 
తుపాకులు పట్టననీ ఓ ప్రకటన చేశాడు. ఈ నాల్గో సినిమాకే ఆ చెయ్యనన్న పని కాస్తా పూర్తి చేశాడు- తుపాకులు, కాల్పులు, ఫైట్లు, ఛేజింగులు, యాక్షన్! ‘జాదూగాడు’ గా మాస్ అవతారమెత్తాడు.  ఏకొత్త హీరోకైనా విభిన్న పాత్రలు పోషించాలనుంటుంది. ఐతే విభిన్న పాత్రలకి ఐతే క్లాస్ కాకపొతే మాస్ అనే రెండే ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల యంగ్ హీరోలందరూ వైవిధ్యం లేకుండా  ఒకే పోతలో పోసిన అవే నటనలతో క్లోనింగ్ రూపాలుగా కన్పిస్తున్నారు!
     ‘చింతకాయల రవి’  ఫేమ్ దర్శకుడు యోగేష్ మాగంటి ఈసారి మాస్ యాక్షన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాగశౌర్యని మాస్ పాత్రలో చూపించడానికి చేసిన కృషిని –సగటు తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం అందరూ ఎంతవరకు చేస్తున్నారో అంతవరకే  చేసి- ఇంకో పైమెట్టు ఎక్కించడానికి నిరాకరించాడు. రాంగోపాల్ వర్మ తీసిన ‘సత్య’ లోనైనా, పూరీ జగన్నాథ్ తీసిన ‘టెంపర్’ లోనైనా  ఆ మాస్ పాత్రల్ని ఎమోషన్ అనే రాకెట్ ఇంధనమే నడిపింది. క్యారక్టర్లో  ఎమోషన్ వుంటే యాక్షన్ కథనానికి కూడా ఎమోషన్ వచ్చేస్తుంది. కాబట్టి యోగేష్ ప్రెజెంట్ చేసిన నాగశౌర్య క్యారక్టర్ ఎమోషన్ ని కొనసాగించక పోవడంతో,  ఆ యాక్షన్ కథనం కూడా డ్రైగా మారి, ఆక్సిజన్ కోసం గిలగిలా కొట్టుకోవాల్సొచ్చింది - సినిమా చూస్తున్న మనలాంటి వాళ్ళతో సహా!
          ఆక్సిజన్ని మాయం చేసిన జాదూగాడి కథేమిటో ఒకసారి చూద్దాం..
          వూళ్ళో అవీఇవీ కాజేసి అమ్ముకునే కృష్ణ ( నాగశౌర్య) అనే ఆకతాయిని వూళ్ళో వాళ్ళందరూ పట్టుకు నిలదీస్తే –కోటి రూపాయలు సంపాదించుకొస్తానని సవాలు చేసి హైదరాబాద్ వచ్చేస్తాడు (ఏనాటి పాత్ర, ఏనాటి కథ!). ఇక్కడ సెక్యురిటీ గార్డ్ గా పనిచేసే ఫ్రెండ్ ( శ్రీనివాస రెడ్డి) రూమ్ లో దిగుతాడు. 
         ఒకరోజు పేపర్లో ఓ బ్యాంకు లోన్ల రికవరీ కోసం ఏజెంట్లుగా పనిచేసే అభ్యర్థుల్ని కోరుతూ వేసిన ప్రకటనని చూస్తాడు. ఆ రికవరీ ఏజెంటుగా చేరి మొండి బకాయిదార్లని తన్ని వసూలు చేస్తూంటాడు. అలా గణేష్ ( ఫిష్ వెంకట్) అనే రౌడీ దగ్గరకి వసూలుకి వెళ్ళినప్పుడు, అతడి ధైర్యపరాక్రమాల్ని చూసి ఇంప్రెస్ అవుతాడు ఆ రౌడీని మేపుతున్న బాస్ శ్రీశైలం (జాకీర్ హుస్సేన్). కృష్ణకి తన దగ్గర జాబ్ ఆఫర్ చేస్తాడు. ఈ శ్రీశైలం ప్రత్యర్ధుల్ని కిరాతకంగా చంపుతూంటాడు. కేంద్ర ఆర్ధికమంత్రి జగదీష్ నాయుడు (కోట శ్రీనివాసరావు) తరపున పని చేస్తూంటాడు.  గ్యాంగులో కృష్ణ చేరడంతో అక్కడ ముఖ్య అనుచరుడుగా వున్న గుంటూరు శ్రీను (అజయ్) తనకి పోటీగా ఉన్నాడని  ఫీలయ్యి విరోధం పెంచుకుంటాడు. 

          ఇలా వుండగా కృష్ణ ఓ నర్సుగా పనిచేస్తున్న పార్వతి (సొనారిక) అనే మలయాళీ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈమె దుబాయి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకునే ప్రయత్నాల్లో వుంటుంది. ఓ దశలో ఈమెతో పాటూ తనూ దుబాయ్ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు కృష్ణ. అయితే ఇంతలో  కేంద్ర ఆర్ధిక మంత్రి జగదీష్ నాయుడు, శ్రీశైలం కి ఒక ఇంటర్నేషనల్ డీల్ అప్పగిస్తాడు. ఆ డీల్ ఓ బినామీ పేరు మీద జరగాలంటాడు. శ్రీశైలం కృష్ణని మాయ చేసి బినామీగా రంగంలోకి దింపి సంతకాలు పట్టించుకుని, ఫోటోలూ వేలిముద్రలూ తీసుకుంటాడు. 
       ఇదిలా వుండగా సిటీ పోలీస్ కమీషనర్ (ఆశీష్ విద్యార్థి) ఒకడుంటాడు. ఇతడికి అమెరికాలో కూతురు కట్టుకునే ఆస్పత్రి నిర్మాణానికి పాతిక కోట్లు కావాలి. ఈ డబ్బు కోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ సెల్వ (రవి కాలే) ని వేధిస్తూంటాడు. ఈ డబ్బు కోసం ఒక పథకం వేసుకుని, సెల్వ శ్రీశైలం దగ్గరికి వెళ్లి ఒక మనిషి కావాలంటాడు. తను ఒక జువెలరీ షాపుని దోచుకోవాలను కుంటున్నాడు కాబట్టి, ఆ దొంగగా ఒకణ్ణి చూపించి వాణ్ణి ఎన్ కౌంటర్ చేయడానికి. శ్రీశైలం కృష్ణ వివరాలు అందిస్తాడు. 
            మరోపక్క కృష్ణ ని ఎంకరేజి చేస్తున్న శ్రీశైలం మీద పగ పెంచుకున్న గుంటూరు శ్రీను,  శ్రీశైలం మీద ఎటాక్ చేసి మూడు కోట్లు వసూలు చేసుకుని వెళ్లిపోబోతాడు. కృష్ణ అడ్డుకుంటాడు. దీంతో కృష్ణని కిడ్నాప్ చేసి గోవాలో వున్న శ్రీశైలం బిజినెస్ మొత్తాన్నీ తన పేర మార్పించుకుంటాడు గుంటూరు శ్రీను. ఇంకోపక్క ఇన్స్ పెక్టర్ సెల్వ కూడా కృష్ణని ట్రాప్ చేసి శ్రీశైలం  డీల్ చేస్తున్న రెండువేల కోట్ల బిజినెస్ ఏమిటో చెప్పమని బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. ఇలా రెండువైపులా ఇరుక్కున కృష్ణ ఈ చిక్కుల్లోంచి ఎలా బయటపడ్డాడనేది మిగతా కథ.

ఎవరెలా చేశారు
        హీరో నాగశౌర్య ఈపాటికి ఎందరో చిన్నా పెద్దా హీరోలు చేసేసిన మాస్ పాత్రలో మరో జెరాక్స్ కాపీయే. ఇంత శ్రమించి ఈ మాస్ పాత్ర ద్వారా ఏం ప్రత్యేకత సాధించాడో తెలీదు. ఇతర యంగ్ హీరోల కంటే ప్రేక్షకులకిచ్చిన కొత్తదనమేమిటో, వాళ్ళ హృదయాలపై వేసిన ముద్రేమిటో కూడా తెలీదు. వాళ్ళల్లో ఒకడిగా తనూ  చేరిపోయాడు తప్ప వాళ్లకి డిఫరెంట్ గా నిలబడ లేకపోయాడు. కెరీర్ రూపకల్పన అంటే ఇదేనా?

          తనలాగే సాఫ్ట్ లుక్స్ తో వున్న యంగ్ హీరోలు లేకపోలేదు. ఆవారా మాస్ పాత్రల సరదా వాళ్ళు కూడా తీర్చుకుంటూ విఫలమైన వాళ్ళే. ఐతే తనకీ అలాటి సాఫ్ట్ లుక్సే వున్నా,  వాళ్లకి లేని యాక్షన్ హీరోగా రాణించే బాడీ ఒకటి ఎసెట్ గా వుంది. అయినా యాక్షన్ హీరో అంటే వాళ్ళ లాగే అదే పాత మూస మాస్ హీరోనే అనుకోవడంవల్ల తన బాడీ తో తనకున్న ఎసెట్స్ గుంపులో గోవిందా అయిపోయాయి. అందరూ చేసేస్తున్న మూస మాస్ పాత్రని తీసి అవతల పెట్టేసి- ఒక యంగ్ లాయర్ గానో, ఒక యంగ్ పొలిటీషియన్ గానో, ఒక యంగ్ బిజినెస్ మాన్ గానో. ఒక యంగ్ బ్యూరోక్రాట్ గానో ఈ యాక్షన్ పాత్రని రూపొందించుకుని వుంటే, వాళ్ళల్లో తను ప్రత్యేకంగా భాసించేవాడు. ప్రేక్షకులకి కొత్తదానాన్ని ఇచ్చేవాడు. ఈ రోజుల్లో కూడా ఇంకా యంగ్ హీరోకి పదేపదే చూసేసివున్న చదువు సంధ్యల్లేని అదే ఆవారా మాస్ పాత్రేమిటి! యాక్షన్ పాత్రంటే మాసోడే అయివుండాలా? ఇన్నోవేషన్ కి దూరమైపోయి, అలసత్వం పెంచుకున్న దర్శకులు ఇంకోటి ఆలోచించలేక యంగ్ హీరోలకీ, ప్రేక్షకులకీ అన్యాయమే చేస్తున్నారు. ఏ మాస్ ప్రేక్షకులని అనుకుంటున్నారో వాళ్ళూ ఆధునీకీకరణ చెందారు. ఇంకా సినిమాల్లో పాత్రలకి పేర్లు పెడుతున్నట్టు కృష్ణ, చందూ, పార్వతి, మాహాలక్ష్మి లాంటి  పేర్లు వాళ్ళ పిల్లలకే పెట్టుకోవడం ఎప్పుడో మానేశారు. గుడిసెల్లో నివసించే  కూలీపని చేసుకునే వాళ్ళు సైతం రామయ్య, కిష్టయ్య, రాములమ్మ, కిష్టమ్మ అనే పేర్లు అవతలకి గిరవాటేసి - శ్రవణ్, అభిమాన్, మానస, మౌనిక లాంటి పేర్లు పిల్లలకి పెట్టుకుని క్రియేటివిటీ చూపించుకుంటున్నారు! ఇలా లోకమంతా ఒక దారైతే తెలుగు సినిమాల దొక దారి- తెలుగు ప్రేక్షకులతో ఏ విషయంలోనూ కనెక్షన్ కట్ అయి ఎవరికి వారే యమునా తీరే!
          కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులు కూడా ఆరోజుల్లో మాస్ పాత్రలతో బాటు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయనాయకులుగా, రైతులుగా ..నటించి మెప్పించిన వాళ్ళే. ఇప్పటి యంగ్ హీరోలు మాత్రం గిరిగీసుకుని, ఐతే మాస్ కాకపోతే రోమాంటిక్ పాత్రలు-అన్నట్టుగా ఈ రెండిటి చుట్టే గిరికీలు కొడుతున్నారు పాపం! 
          టాలీవుడ్ లో ఇంకా ఇలాటి పాత్రలే సినిమాలుగా మరికొన్ని రాబోతున్నాయి- తేడా అల్లా ఆ యంగ్ హీరోలు ఇద్దరు ముగ్గురు నేస్తాల్నేసుకుని ఫస్టాఫ్ లో దొంగతనాలు చేస్తూ బతికేయడం, సెకండాఫ్ లో ఫారెస్ట్ కి పారిపోవడం! ఇదే వరస పెట్టుకుని తమలోకంలో తాము కథలు తయారుచేసుకుంటున్నారు!
       హీరోయిన్ సోనారికా భడోరికా చూడ్డానికి బానే వున్నా ఆమె చేయడానికి ఏమీ లేకపోయింది. ప్రధాన కథతో సంబంధంలేకుండా ఫార్ములా సినిమాల్లో లాగా హీరోతో లవ్ ట్రాక్ కి పరిమితమై పోయింది. క్లయిమాక్స్ లో విలన్స్ లో ఒకడు ఈమెని కిడ్నాప్ చేస్తే కథతో సంబంధం ఏర్పడినట్టుకాదు, ఎక్స్ ప్లాయిట్ చేసినట్టు. 
          కమెడియన్లు కూడా కరివేపాకు పాత్రలే. శ్రీనివాసరెడ్డి, హర్షలు ఫస్టాఫ్ లో కొంతవరకు నవ్వించి మాయమై పోతారు. సెకండాఫ్ లో వాళ్ళు పనికి రానట్టు కొత్త పాత్రలో సప్తగిరి ప్రవేశించి బూతు కామెడీ సృష్టిస్తాడు.  
          విలన్స్ లో ఏ ఒక్కరూ సీరియస్ కారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అని బిల్డప్ తో ప్రవేశించిన ఇన్స్పెక్టర్ పాత్రలో రవికాలే- ఆ విషయంలో గప్ చుప్ అయిపోతాడు. అనుచరుడి పాత్రనటించిన అజయ్ రొటీన్ గానే కన్పిస్తాడు- నటించేది ఎప్పుడూ ఇలాటి పాత్రలే కాబట్టి.
          మధుసూదన్ అనే రచయిత కథ, మాటలు అందించాడు. మాస్ సినిమాకి తగ్గట్టు మాటలు బాగానే రాశాడు కానీ కథ విషయంలో ఏదైనా విదేశీ సినిమా ఇన్ స్పిరేషనేమో తెలీదు - అయినా కథనానికి వాడిన టెక్నిక్ తో బాటు, కథ కూడా వర్కౌట్ కాలేదు.
          మణిశర్మ కుమారుడు సాగర్ మహతి సంగీతం ఓ మాదిరిగా వుంది. చెప్పుకోవాల్సింది శాయి శ్రీరాం ఛాయగ్రహణంతో బాటు, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ గురించి. అయితే ఇది మార్పులేకుండా అదే బ్యాక్ డ్రాప్ తో అరిగిపోయిన మూస మాస్ సినిమా కావడం వల్ల, వీళ్ళిద్దరి ప్రతిభ అంతా వృధా అయిపోయింది.

స్క్రీన్ ప్లే సంగతులు
        ఈ మధ్య వస్తున్న సినిమాల  స్క్రీన్ ప్లేల్లో ఒక విషయం ఒప్పుకోవచ్చు. ఇదివరకులా కాక కథ పాయింటుకి రావడ మన్నది ( సెకండ్ యాక్ట్ లేదా మిడిల్  ప్రారంభం) బోరు కొట్టించకుండా అటూఇటుగా ముప్పావు గంటలో ఇంటర్వెల్ లోపే వస్తోంది!
          ‘జాదూగాడు’  స్క్రీన్ ప్లేలో ప్లస్ పాయింట్ ఇదొక్కటే. మైనస్ లు ఆరు  వరకూ వున్నాయి- ఇవే సినిమాని తేలిపోయేలా చేశాయి : 1) ఎమోషన్ ని నిర్లక్ష్యం చేయడం, 2) మిడిల్ బిజినెస్ మాయం కావడం, 3) కథనానికి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ వాడడం, 4) కథనంలో సెటప్స్ అండ్ పే ఆఫ్స్ సమస్య, 5) కథకి టైం లాక్ వేయడం, 6) కథని ఎండ్ సస్పెన్స్ గా చెప్పడం!

          1) ఎమోషన్ నిర్లక్ష్యం : కథలో ఎమోషన్ ఎప్పట్నించీ పుడుతుంది? ప్రధాన పాత్ర సమస్యలో ఇరుక్కున్నప్పట్నించీ!  అంటే బిగినింగ్ పరిచయ విభాగం తర్వాత ముగింపులో ఏర్పాటు చేసే సమస్య-  లేదా స్టోరీ పాయింట్ అనేదాంట్లో ఎమోషన్ ఉండాలన్నమాట. ఈ ఎమోషనే అటు తర్వాత మొత్తం సినిమాకి ఆత్మ లా వుంటుంది.  ఈ ఎమోషన్ నవరసాల్లో ఏ వొక దానితోనైనా కూడుకుని ఉండొచ్చు. ఈ స్క్రీన్ ప్లేలో  హీరోని విలన్ బినామీ డీల్ లో ఇరికించడం దగ్గర కథ మలుపు తిరిగి హీరోకి సమస్య ఏర్పాటయింది. ఇదే స్టోరీ పాయింటుగా ఎస్టాబ్లిష్ అయ్యింది. హీరోకి తనని ఇరికిస్తున్నారని తెలీదు. ఈ ఎమోషన్ ఆడియెన్స్ ఫీలవుతారు. కానీ ఈ ఎమోషన్ ని కొనసాగిస్తూ ఆ తర్వాత ఉండాల్సిన కథనం లేదు. 

          ఆ ఎమోషన్ ని కూడా పటాపంచలు చేస్తూ- ఆ సమస్యనీ, స్టోరీ పాయింటునీ వదిలేసి - మళ్ళీ ఇంకో పాయింటు, తర్వాత మళ్ళీ ఇంకో పాయింటు, దీన్ని కూడా వదిలేసి మళ్ళీ ఇంకో పాయింటు ఎత్తుకోవడంగా కథనం సాగుతుంది. 
          దీంతో ఎమోషన్ జాడేలేకుండా పోయి రసం తీసేసిన చెరుకు గడలా డ్రైగా, ఫ్లాట్ గా, కేవలం క్రిమినల్స్ క్రిమినల్స్ కొట్టుకు చచ్చే తంతుగా మారిపోయింది కథనం.

          2) మిడిల్ బిజినెస్ మాయం కావడం :  హీరోని ఇరికిస్తూ సమస్యలో పడేసినప్పుడే కథ ప్రారంభమైనప్పుడు,  స్క్రీన్ ప్లే పరంగా ఇప్పుడీ ఘట్టంతో మిడిల్ విభాగం మొదలైనట్టే. అంటే మిడిల్ విభాగపు బిజినెస్ అమల్లోకొచ్చేసి హీరో తాను ఇరుక్కున్న సమస్య మీద పోరాటం మొదలెట్టాలి. అంటే ఒకటి రెండు సీన్లలో తాను ఇరుక్కున్నాడని తెలుసుకోవాలి. ఇదేం జరగదు. మిడిల్ బిజినెస్సే వుండదు. 

          3) కథనానికి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ వాడడం : బిగినింగ్ ముగింపు లో ఎస్టాబ్లిష్ చేసిన  హీరో ఇరుక్కున్న సమస్యతో పోరాటం ఎలా జరుగుతుందో నని ఎదురు చూస్తూంటే, దాన్ని వదిలేసి-  హీరో ని జువెలరీ షాపు దోపిడీ లో ఇరికించి ఎన్ కౌంటర్ చేయాలనుకున్న ఇన్స్ పెక్టర్ తో సమస్య, ఇది కూడా వదిలేసి- హీరోని కిడ్నాప్ చేసి అనుచరుడు గోవా బిజినెస్ సొంతం చేసుకునేందుకు మరో సమస్యా, మళ్ళీ ఇన్స్ పెక్టర్ వచ్చి హీరో ఇరుక్కున్న బినామీ డీల్ లో లాభపడేందుకు హీరోని ట్రాప్ చేస్తూ మళ్ళీ ఇంకో సమస్యా...ఇలా స్టాప్ అండ్ స్టార్ట్ అనే సినిమాకి పనికిరాని ఆత్మవినాశక టెక్నిక్ ప్రదర్శించడం తో ప్లాట్ లైన్ ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా నడిచి ముక్క ముక్కలైంది. 

      4) కథనంలో సెటప్స్ అండ్ పే ఆఫ్స్ సమస్య : ఇన్స్ పెక్టర్ పాత్రని ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా అంత బిల్డప్  ఇస్తూ ప్రవేశ పెట్టాక ( సెటప్), హీరో ని జువెలరీ షాపు దోపిడీ అన్న ప్రతిపాదన పెట్టి ఎలా ఎన్కౌంటర్ ( పే- ఆఫ్) చేస్తాడో చూపెట్టకుండా మొత్తం ఆ ఉత్కంఠనే డిలీట్ చేశారు. వూళ్ళో కోటి రూపాయలు సంపాదించుకు వస్తానని చెప్పిన మాట ( సెటప్) ఏమయ్యిందో చివరికి హీరోయిన్ తో దుబాయ్ వెళ్లి పోతున్నట్టు ( పే- ఆఫ్) ముగింపు నిచ్చారు.
             5) కథకి టైం లాక్ వేయడం :  బిగినింగ్ ముగింపులో బినామీ డీల్ లో హీరోని ఇరికించిన సమస్యతో మిడిల్ నడపకుండా దాన్ని పెండింగ్ లో పడేసి క్లయిమాక్స్ కోసం అట్టి పెట్టుకున్నారు. ఇలా ఇప్పుడు తేల్చాల్సిన సమస్య ముగింపులో ఎప్పుడో ఎత్తుకుంటాం, వెయిట్ చేయమని కథకి టైం లాక్ వేసేయడం వల్ల మొత్తం కథే చల్లారిపోయింది. 
          నీలకంఠ తీసిన ‘మాయ’ అనే థ్రిల్లర్ లోనూ ఇలాగే చేశారు. ఇందులో సినిమా ప్రారంభం లోనే ఫ్యాషన్ ఈవెంట్ కి నెలరోజులు టైం వుందని చెప్పి, దాన్ని  క్లైమాక్స్ లో ఘటనల వరకూ సాగలాగారు. అప్పటికి ఆ ఫ్యాషన్ ఈవెంట్ అనే ఎలిమెంట్ కి కథనంలో కాలదోషం పట్టేసింది. ఇలా సినిమా మొత్తాన్ని ఆప్షన్ లాక్ తో కాకుండా టైం లాక్ తో నడపడంతో ‘మాయ’ ప్రేక్షకులకే మాయా చేయలేకపోయింది. ‘జాదూగాడు’ లో కూడా బినామీ డీల్ ని క్లయిమాక్స్ దాకా మురగ బెట్టడం వల్ల  దానికి కాలదోషం పట్టేసి వీక్షణాసక్తినే కోల్పోయేట్టు చేసింది. టైం లాక్ స్టోరీలకి తెలుగులో విజయాలు లేవు.

          6) కథని ఎండ్ సస్పెన్స్ గా చెప్పడం :  ఇక్కడే వుంది మొత్తం కిటుకంతా! పైన చెప్పుకున్న 1, 2, 3, 5 నంబర్ లోపాలకి మూలకారణం ఈ ఆరో  నంబర్ సమస్యే! ఎండ్ సస్పెన్స్ కథనం! ఎప్పట్నుంచో- ఏళ్ల తరబడీ చెప్పుకుంటున్న మాట- తెలుగు సినిమాలకి శాపాలు పాసివ్ పాత్రలే, ఎండ్ సస్పెన్సులే ననీ!
      ఇదిగో ‘జాదూగాడు’ కూడా ఎండ్ సస్పెన్సునే  మోసుకొచ్చాడు! క్లయిమాక్స్ లో మొత్తం  అయిపోయాక ఆ సస్పెన్స్ ని విప్పుకుంటూ కూర్చున్నాడు. మొదట్లో తనని  బినామీ డీల్ లో ఇరికిస్తున్నట్టు  తనకి తెలుసట. తెలిసే గేమ్ ఆడాడట. గుంటూరు శ్రీను తనూ ఒకటయిపోయి, ఉత్తుత్తి కిడ్నాప్ తో  శ్రీశైలం ని బోల్తా కొట్టించి గోవా బిజినెస్ లాక్కున్నారట.. ఇలా విప్పుకుంటూ పోతాడు. 
          బిగినింగ్ ముగింపులో బినామీ డీల్ తో సమస్య ఏర్పాటు చేసి దాన్ని వదిలెయ్యడానికి ఇదీ కారణం! అక్కడ్నించే హీరో పాత్రని సస్పెన్స్ లో పెట్టేసి అక్కడ్నించీ ఎండ్ సస్పెన్స్ కథనం కొనసాగించా రన్న మాట. ఇందుకే కథనంలో  ఆ సమస్య తాలూకు ఎమోషన్- హీరో ఎమోషనూ  ఈ జాదూ దెబ్బకి హాంఫట్ అయిపోయాయన్న మాట. 
        బినామీ డీల్ తో సమస్యని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఎండ్ సస్పెన్స్ కోసం అట్టి పెట్టుకున్నందువల్ల, దాంతో ప్రారంభమవ్వాల్సిన మిడిల్ బిజినెస్ ప్రారంభం గాక, ఏ సినిమాకైనా వెన్నెముక వంటి మిడిల్ విభాగమే లేకుండా పోయిందన్న మాట! 
          ప్రధానమైన బినామీ డీల్ ఘట్టాన్ని ఎండ్ సస్పెన్స్ కే పరిమితం చేయడం వల్ల, దాని కథనం జోలికెళ్ళలేక, తూతూ మంత్రంగా వేరేవేరే సమస్యలు సృష్టించి, డాక్యుమెంటరీలకి పనికొచ్చే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కథనం చేసుకున్నారన్నమాట. 
          ఎండ్ సస్పెన్స్ కే ప్రధానమైన బినామీ డీల్ పాయింటుని తాకట్టు పెట్టారు కనుక, కథకి టైం లాక్ కూడా పడిపోయిందన్నమాట. ఎండ్ సస్పన్స్ తో ఇన్ని అనర్ధాలూ జరిగాయన్న మాట! వూర మాస్ యాక్షన్ హోరులో ఇవన్నీ మిస్సయ్యాయి!!          నవలగా చదువుకోవడానికి ఎండ్ సస్పెన్స్ బావుంటుంది- సినిమాగా చూసేందుకు పనికిరాదని చాలా సార్లు చెప్పుకున్నాం.  సినిమాకి సీన్ టు సీన్ సస్పెన్స్ మాత్రమే వుంటుంది.  ఆ సస్పెన్స్ ని ఓపెన్ గానే వుంచి, దాంతో జరిగే సంఘటనల్ని  సీన్ తర్వాత సీనుగా సస్పెన్స్ తో నడపడమే సీన్ టు సీన్ సస్పెన్స్ పధ్ధతి. 

          ఒకవేళ ఈ సినిమాలో పెట్టుకున్నట్టు ఎండ్ సస్పెన్సే తప్పనప్పుడు,  దాన్ని ‘దొంగాట’ లో చూపించినట్టుగా చేసుకోవచ్చు- కనీసం సెకండాఫ్ ప్రారంభం నుంచైనా మూసి పెట్టిన పాత్రల్ని రివీల్ చేసి, సస్పెన్స్ విప్పుకుంటూ పోతూ! 
          ‘స్టోరీ’ అన్న గ్రంధంలో కొత్త దర్శకులకి రాబర్ట్  మెక్ కీ ఒక హెచ్చరిక చేస్తాడు- ముందుగా సాదా సీదా కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకున్నాకే ప్రయోగాల జోలికెళ్ళాలని!

          ఇది నిజం. కథనం తో ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే పాండిత్యాలు ప్రదర్శిస్తే ఇంతేమరి!—సికిందర్