—సికిందర్
రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Monday, April 7, 2025
1373 : స్పెషల్ ఆర్టికల్
ఇలా మాటామాటా పెరిగి, 'రంగా! అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. కోపం వస్తే నేను
మనిషిని కాను. వెళ్తావా లేదా?’ అని గర్జించాడు భయంకర్. రంగా
నిర్లక్ష్యంగా చూసి, ‘వచ్చిన పని పూర్తి కాకుండానే?’ అన్నాడు. ‘ఏం పని?’ భయంకర్ ప్రశ్న. ‘ఈ అర్ధరాత్రి పూట ఏం పని మీద వస్తారు మనలాంటి వాళ్ళు
గూట్లే?’ అని ఇంకింత రెచ్చగొట్టాడు రంగా.
'వీల్లేదు! ఇది నా పథకం. నేనే దోచుకోవాలి. అనుకున్నది సాధించక పోవడం భయంకర్
చరిత్రలోనే లేదు!' భయంకర్ గర్జన. 'మాటలతో వృధా పుచ్చడం పిరికిపందల లక్షణంరా గూట్లే!' గట్టిగా నవ్వాడు రంగా. 'జూటే!' అని ఇంకా గట్టిగా నవ్వాడు భయంకర్. ఇలా
పరిస్థితి మరింత వేడెక్కడంతో ఎందుకైనా మంచిదని దారికొచ్చాడు భయంకర్, ‘సరే, మనిద్దరం సమానమైన శక్తి పరులం. ఇలా
వృధాగా కాలయాపన చేయడం మంచిది కాదు. రంగా! శక్తిలో యుక్తిలో భుజబలంలో మనకు మనమే
సాటి. నెయ్యమైనా కయ్యమైనా సరిసమానుల మధ్యే రాణిస్తుంది...ఇక నుంచి మనం స్నేహితులం.
మన స్నేహానికెప్పుడూ భంగం కలగదు!’ అనేశాడు భయంకర్.
రంగా కూడా శాంతించి, ‘ఒక్క షరతు. ఇక
నుంచి మనమిద్దరం ఎవరెంత సంపాదించినా ఫిఫ్టీ ఫిఫ్టీ’ అని ప్రతిపాదించాడు. ‘ఫిఫ్టీ ఫిఫ్టీ, నీ షరతు ఆమోదిస్తున్నాను’ చెప్పాడు భయంకర్. ‘అయితే మన స్నేహాన్ని
అంగీకరిస్తున్నాను’ అంటూ చర్చ ముగించాడు రంగా. ఇక నుంచి ఏ దోపిడీ అయినా ఫిఫ్టీ -ఫిఫ్టీ పార్ట్నర్ షిప్ తో కలిసే
చేసుకుందామని చేతులు కలిపారు.
2025
మార్చి : రాబిన్ బాక్సాఫీసులో దేవులాడుకుంటూ వుండగా రాజూని కూడా
బాక్సాఫీసులో వేసి తాళం వేసుకెళ్ళి పోయారు ప్రేక్షకులు. రాబిన్ ని చూసి, ‘నువ్వెప్పుడొచ్చావ్ రాబిన్?’ అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు, ‘ఉగాదికి వచ్చాను, వర్కౌట్ కాలేదు’ అన్నాడు రాబిన్, ‘రంజాన్ కొచ్చాను, నాకూ వర్కౌట్ కాలేదు’ అన్నాడు రాజు. ‘మనిద్దరం ఫ్లాప్ అన్న మాట? ఇక పండగలు జీవితంలో మనల్ని క్షమించవ్!’ అన్నాడు రాబిన్, ‘సరేగానీ, నువ్వు రాబిన్ హుడ్ వి కదా, సినిమాలో రాజుల్ని కొట్టి పేదల కేశావ్, ఇప్పుడు ప్రేక్షకుల్ని కొట్టి ఈ రాజు కెయ్య రాదా!’ రిక్వెస్ట్ చేశాడు రాజు.
‘ఎవర్నో కొట్టి నీకేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? నువ్వు రాజా సాబ్ వి కదా?’ అన్నాడు రాబిన్. ‘ఏం చెయ్యను, గజినీ తీశాడు కదా అని మురగదాస్ ని
నమ్మితే ముంచాడు. ఇంత ఔట్ డెటెడ్ అనుకోలేదు’ బాధపడ్డాడు రాజు. ‘నేను కూడా భీష్మ తీశాడు కదా అని
వెంకీని నమ్మితే టెంప్లెట్ అయింది’ అన్నాడు రాబిన్. ‘ఈ డైరెక్టర్లు ఔట్ డెటెడ్ కాకపోతే టెంప్లెట్ తప్ప
ఇంకోటి తీయరా?’ రాజు ధర్మ సందేహం వెలిబుచ్చాడు.
‘ఐతే నీ ఔట్ డెటెడ్ మేకింగ్ ఎక్కడ తేడా కొట్టింది రాజా సాబ్?’ రాబిన్ అడిగాడు. ‘ముంబాయిలో ఫేమస్ థియేటర్ ఓనర్ ప్రొడ్యూసర్ కి కాల్ చేసి క్లాసు పీకాడు. ముంబాయిలో
చాలా థియేటర్స్ లో నా సినిమా ఎత్తేసి వేరే సినిమాలు ఆడించుకుంటున్నారు. ఎందుకు? హీరోయిన్ ని చంపేసినందుకు. హీరోయిన్ ని ఎక్కడైనా
చంపేస్తారా రాబిన్ భాయ్? ఫస్టాఫ్ లోనే అంత కాస్ట్లీ హీరోయిన్
ని చంపేశాడు మురుగ దాస్. ఎవర్ని? రశ్మికా మందన్న లాంటి మాస్ బేస్
వున్న స్టార్ ని! ఆమెని చంపేశాక ఇక సినిమా ఏముంటుంది- నేను కూడా ఏడుస్తూనే
నటించాను’ ఏడుపు మొహంతోనే బాధపడ్డాడు రాజు.
‘చూశాను, నువ్వు హీరోయిన్ చావక ముందూ తర్వాతా ఎప్పుడూ నవ్వలేదు.
కనీసం నవ్వు ముఖంతో కూడా లేవు. ఫ్యాన్స్ ని చావగొట్టావ్ కదా వాళ్ళకివ్వాల్సిన
కమర్షియల్ యాక్టింగ్ ఇవ్వక. ఆ ఫైట్స్ ఏమిటి రాజా సాబ్, అవి ఫైట్లేనా? ఫైట్స్ లో కూడా నీరసంగా వుండమన్నాడా మురుగ దాస్? తప్పు చేశాడు రాజా సాబ్. అంతగా చంపాల్సి వస్తే నీ
భార్యగా ఓ సెకండ్ హీరోయిన్ ని చూపిస్తే సరిపోయేది. ఆమె చనిపోయాక మెయిన్ హీరోయిన్ గా రశ్మిక ఎంట్రీ ఇచ్చి, నీతో రోమాన్స్ చేస్తూంటే నువ్విక్కడ ఇలా వుండే వాడివి
కావు, సారీ!’ సానుభూతి వ్యక్తం చేశాడు రాబిన్.
‘నా క్యారక్టర్ కిచ్చిన హైప్ చూసి పడిపోయా రాబిన్ భాయ్. రాజవంశలో నేను చివరి
రాజు అన్నాడు. నా పేరు రాజా సాబ్ అన్నాడు. అద్భుత బంగాళా, అదిరిపోయే లైఫ్ స్టయిల్. నా భార్య రాణీ సాహెబా రశ్మికా మందన్న అన్నాడు. ఆమె
చనిపోతూ అవయవ దానాలు చేస్తుందన్నాడు. కళ్ళు ఒకరికి, ఊపిరితిత్తులు ఒకరికి, గుండె ఒకరికీ
దానమిచ్చేస్తుందన్నాడు. నా మీద పగబట్టిన విలన్ ఆ ముగ్గుర్నీ చంపేసేందుకు ప్లాన్
వేస్తాడన్నాడు. ఇంతవరకూ బాగానే వుంది. కానీ ఇంటర్వెల్లో ఆ చంపుతానన్న వాడు
సెకండాఫ్ లో ఎంతకీ రాకపోతే నేనేం చేసేది. ఫస్టాఫ్ లో రాణీ సాహెబాని చంపి, సెకండాఫ్ లో ఎంతకీ విలన్ ని నా మీదికి పంపించకపోతే
సినిమా రంజాన్ కి కుర్బానీ కాక మెహర్బానీ అవుతుందా?' అంటూ తనదైన విశ్లేషణ చేసుకున్నాడు రాజవంశానికి చెందిన చివరి రాజు.
రాబిన్ ఆలోచనలో పడ్డాడు. 'ఏమిటాలోచిస్తున్నావ్?' అన్నాడు రాజు. 'ఏం లేదు, రాజా సాబ్...' అంటూ తనదైన సినిమా విశ్లేషణ మొదలెట్టాడు రాబిన్, 'ఏదో రాబిన్ హుడ్ గా ఉన్నోళ్ళని కొట్టి అనాధలకి
వేస్తున్న నన్ను హీరోయిన్ శ్రీలీలకి బాడీగార్డుని చేశాడు. నాకోసం గంజాయి మాఫియాని బలవంతంగా
ఇరికించాడు. గంజాయికి క్యాన్సర్ మందు తయారీతో ఇంకో బలవంతపు లింకు పెట్టాడు. ఇది సరిపోనట్టు
కామెడీ పేరుతో విలన్ ముందు నన్ను వీక్ క్యారక్టర్ చేశాడు. అతుకులేసిన కథ, టెంప్లెట్ కథనం ఇంకా ఈ రోజుల్లో చూస్తారంటావా రాజా సాబ్?’
‘సారీ రాబిన్. మన పండగ కలలు కల్లలయ్యాయి...అయినా ఇంకేం చేద్దామని బాక్సాఫీసు వైపొచ్చావ్?’ అడిగాడు రాజు. ‘నువ్వెందుకొచ్చావ్” అన్నాడు రాబిన్. ‘నీ కలెక్షన్లు తిందామని’ అన్నాడు రాజు. 'జీర్ణం కాదులే. తెలుగు గడ్డ పవర్ ఇది. పానిండియా పవరు మరిగిన శరీరం. ప్రతి
అంగుళం ఊర మాస్ గా, వీర కారంగా వుంటుంది. చపాతీ సినిమాలు తీసి చచ్చుబడి పోయిన
మీకు అర్ధం గాదులే!’ అనేశాడు రాబిన్. ‘రాబిన్!’ కోపంగా అరిచాడు రాజు, ‘ఆరేళ్ళ నుంచీ నేనూ వరస ఫ్లాపుల్లో వున్నాను, నువ్వూ వరస ఫ్లాపుల్లో వున్నావ్. ఈ ఔట్ డేటెడ్ డైరెక్టర్స్
ని, టెంప్లేట్ డైరెక్టర్స్ నీ పక్కన బెడితే - మనిద్దరం
సమానమైన శక్తి పరులం. ఇలా వృధాగా కాలయాపన చేయడం మంచిది కాదు. రాబిన్! శక్తిలో యుక్తిలో భుజబలంలో మనకు మనమే సాటి.
నెయ్యమైనా కయ్యమైనా సరిసమానుల మధ్యే రాణిస్తుంది...ఇక నుంచి మనం స్నేహితులం. మన
స్నేహానికెప్పుడూ భంగం కలగదు!’
రాబిన్ అనుమానంగా చూసి, ‘ఒక్క షరతు. ఇక నుంచి మనమిద్దరం ఎవరెంత సంపాదించినా
ఫిఫ్టీ ఫిఫ్టీ’ అని ప్రతిపాదించాడు. ‘ఫిఫ్టీ ఫిఫ్టీ, నీ షరతు ఆమోదిస్తున్నాను’ చెప్పాడు రాజు. ‘అయితే మన స్నేహాన్ని
అంగీకరిస్తున్నాను’ అంటూ చర్చ ముగించాడు రాబిన్. ఇక నుంచి ఏ పానిండియా మూవీ చేసినా ఫిఫ్టీ -ఫిఫ్టీ పార్ట్నర్ షిప్ తో
కలిసే చేసుకుందామని చేతులు కలిపారు.
‘టైటిల్ ఫిఫ్టీ ఫిఫ్టీ’ అన్నాడు రాజు.
‘ట్యాగ్ లైన్ సేఫ్టీ బెల్ట్’ అన్నాడు రాబిన్.
Subscribe to:
Posts (Atom)