రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 8, 2020

967 : రివ్యూ


దర్శకత్వం: హనీ ట్రెహాన్
తారాగణం: నవాజుద్దీన్ సిద్ధిఖీ
, రాధికా ఆప్టే, తిగ్మాంశూ ధూలియా, ఖాలిద్ త్యాబ్జీ, పద్మావతీ రావ్ తదితరులు
రచన: స్మితా సింగ్
, సంగీతం: స్నేహా ఖన్వాల్కర్, ఛాయాగ్రహణం: పంకజ్ కుమార్
బ్యానర్:  ఆర్ ఎస్ విపి మూవీస్
నిర్మాత: రోనీ స్క్రూ వాలా
, అభిషేక్ చౌబే 
విడుదల: నెట్ ఫ్లిక్స్
***                                                                                                
        టీటీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో సినిమా రాత్ అకేలీ హై నియో నోయర్ జానర్ లో ఒక మర్డర్ మిస్టరీ. కొత్త దర్శకుడు, క్యాస్టింగ్ డైరెక్టర్ హనీ ట్రెహాన్ దీని మేకర్. వరసగా ఇది క్యాస్టింగ్ డైరెక్టర్లు దర్శకత్వం వహించిన మూడో సినిమా. దిల్ బేచారా తో ముఖేష్ చబ్రా, శకుంతలా దేవి తో అనూ మీనన్ అనే ఇద్దరు క్యాస్టింగ్ డైరెక్టర్లు కూడా డైరెక్టర్ లయ్యారు. ఈ ఇద్దరికీ భిన్నంగా హనీ ట్రెహాన్ మిస్టరీ తీశాడు. ఫ్రేము ఫ్రేముకీ చాలా కష్ట పడ్డాడు.అయితే ఈ క్రియేటివ్ కష్టం మేకింగ్కి వుంటే సరిపోతుందా, కంటెంట్ కి అవసరం లేదా? ఈ ప్రశ్ననోసారి పరిశీలిద్దాం...

కథ
      ఐదేళ్ల క్రితం ఓ రాత్రి కాన్పూర్ హైవే మీద కారుకి యాక్సిడెంట్ జరిపి జంట హత్యలు చేస్తారు దుండగులు. కారులో భూస్వామి రఘు బీర్ సింగ్ భార్య, డ్రైవర్ వుంటారు. వాళ్ళ మృత దేహాలు దొరక్కుండా చేస్తారు. 

        ఐదేళ్ల తర్వాత
, కాన్పూర్ లో అరవై ఏళ్ల భూస్వామి రఘుబీర్ సింగ్, ఎవరో తెలియని ఉంపుడుగత్తె రాధ (రాధికా ఆప్టే) ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న రాత్రే హత్యకి గురవుతాడు. సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) దర్యాప్తు చేపడతాడు. రాధతో బాటు మహల్లో చాలా పరివారముంటుంది. రఘుబీర్ సింగ్ మొదటి భార్య తమ్ముడు విశాల్, కొడుకు కరణ్, కూతురు కరుణ, అల్లుడు రవి, చెల్లెలు ప్రమీల, మేనల్లుడు విక్రమ్, మేనకోడలు వసుధ, పనిమనిషి చున్నీ...  వీళ్ళందరూ కలిసి ఆస్తి కోసం రాధ చంపిందని ఆరోపిస్తారు. సబిన్ స్పెక్టర్ జటిల్ యాదవ్ అందర్నీ అనుమానిస్తాడు. 

        కేసులో అందర్నీ ప్రశ్నిస్తూ ముందుకు పోతున్న అతణ్ణి లోకల్ నాయకుడు మున్నారాజా
(ఆదిత్యా శ్రీవాస్తవ) అడ్డుకుంటాడు. మున్నా రాజా ఎసెస్పీ లాల్జీ శుక్లా (తిగ్మాంశూ ధూలియా) కి సన్నిహితుడు. లాల్జీ శుక్లా జటిల్ యాదవ్ దర్యాప్తుకి బ్రేకులేస్తూంటాడు. జటిల్ యాదవ్ కి నిజాన్ని బయటికి లాగి దోషిని పట్టుకోవాలన్న పట్టుదల పెరిగిపోతుంది.

        ఇంతకీ ఎవరు దోషి
? ఎందుకు చంపారు? అంత మంచి చరిత్రలేని రాధ పెళ్ళయిన రాత్రి ఏం చేసింది? మతి స్థిమితం లేని హతుడి కొడుకు ఆస్తిని ఆజమాయిషీ చేయలేడని హక్కులు పొందాలని చూస్తున్న హతుడి బావమరిదే చంపాడా? కరెంటు పోయిందని లాంతరేసుకుని హతుడి గదిలోకి వెళ్ళిన పని మనిషి చున్నీ అక్కడ ఎవర్ని చూసింది? హతుడి మేనకోడలు వసుధ ఆ రాత్రి కాసేపట్లోనే వేసుకున్న చున్నీ ఎందుకు మార్చుకుంది? హతుడి చెల్లెలు ప్రమీల, మేనల్లుడు విక్రమ్ లోకల్ లీడర్ మున్నారాజాని వాటా ఎందుకు అడిగారు? ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో చున్నీని ఎవరు, ఎందుకు చంపారు? చున్నీని చంపిన హంతకుణ్ణి ఎవరు చంపారు? ప్రమీల ఎందుకని ఆత్మహత్య చేసుకుంది? ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు రాధా గతమేమిటి? ఐదేళ్ల క్రితం జరిగిన జంట హత్యల వెనకెవరున్నారు? అసలు హతుడు రఘుబీర్ సింగ్ అసలు స్వరూపమేమిటి? ఈ జటిల కేసుని సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు
     సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి మార్క్ వేస్తాడు. పాత్ర గురించి దర్శకుడు వివరించినట్టు, అతను సామాన్యుడిలా వుండాలి. హీరోలా అన్పించకూడదు. చేసే పనులలో హీరోయిజం వుండాలి. అలా సినిమా ఎస్సై లా కాకుండా, రియల్ ఎస్సైలా వుంటాడు. అతడికి 40 ఏళ్ళు. పెళ్లి కాలేదు. అతడి తల్లి (ఇళా అరుణ్) అతడి ఫోటో ఎవరికి చూపించినా రంగు తక్కువ, వయసు ఎక్కువని సంబంధాలు రావు. రంగు పెరగడం కోసం ఒక క్రీము వాడుతూంటాడు. ఇలా అమ్మాయిలకి నచ్చని వాడు, మొత్తమంతా ఆడవాళ్లతో వున్న మహల్లో పడతాడు కేసు గురించి. పెళ్లి రోజే విడో అయిన రాధ పట్ల రోమాంటిక్ గా వుంటూ, ఆమెని కాపాడే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. పాత్ర ఫన్నీగా వుండదు. సీరియస్ గానే వుంటుంది. పాత్రని చివరంటా నిలబెట్టే ప్రయత్నమైతే చేస్తాడు. కానీ కాసేపటి తర్వాత కథే సహకరించదు. ఒకళ్ల తర్వాత ఒకళ్లని ప్రశ్నించే పర్వంతోనే గంటకి పైగా గడిచిపోతుంది. గంటన్నరకి గానీ యాక్షన్ దృశ్యాలు మొదలై పాత్రకి వూపు రాదు. మళ్ళీ చివర్లో అరగంట పాటు వుండే ముగింపు దృశ్యాలు బోరే. ముగింపు థ్రిల్లింగ్ గా లేకపోవడం కారణం.

        రాధికా ఆప్టే పేద బాధిత పాత్ర. మగవాళ్ళతో ఆమె గతం జీవితాన్ని మార్చేస్తుంది. పెళ్ళయిన రాత్రే భర్త చావుకి కేంద్ర బిందువయ్యే పాత్ర. దర్యాప్తుకి ఏమాత్రం సహకరించని పాత్ర. ఈమె కూడా ఒక మార్కు వేస్తుంది. ఇక అనుమానితులుగా మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులకి ఎక్కువ స్పేస్ లేదు. 

        సాంకేతికంగా కాన్పూర్ నేపథ్యంలో తీసిన సినిమా. లొకేషన్స్ బావున్నాయి. అయితే నైట్ సీన్లు ఎక్కువ వుండడం
, పగలు ఇండోర్ సీన్లు కూడా లో- కీ లైటింగ్ తో వుండడం నియో నోయర్ జానర్ అన్పించాలని తీసినట్టుంది. ఓపెనింగ్ లో నైట్ హైవే యాక్సిడెంట్ సీను నోయర్ జానర్ మర్యాదకి బలమైన నిదర్శనం. అయితే నోయర్ జానర్ మర్యాదలకి లైటింగే కాకుండా ఇంకో  ఎనిమిది ఎలిమెంట్స్ వుంటాయి. వీటి జోలికి వెళ్లక పోవడం ఒక లోపం. మూవీలో మిస్టీరియస్ వాతావరణ సృష్టికి నేపథ్య సంగీతం మాత్రం బాగా తోడ్పడింది. పూర్తిగా నోయర్ జానర్ లో లేకపోయినా, కొత్త దర్శకుడు హనీ ట్రెహాన్ మేకింగ్ నైపుణ్యం మాత్రం సాంకేతికంగా మంచి నాణ్యతతో వుంది. మూవీలో వున్న మిస్టరీ స్వభావానికి తగ్గ డార్క్ మూడ్ విజువల్స్ తో ఒక శైలిని పాటించాడు.  

కథాకథనాలు

        నేను మిస్టరీలు తీయను, సస్పెన్సులే తీస్తానన్నాడు సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. ఎందుకంటే మిస్టరీల్లో కూర్చోబెట్టే సస్పెన్స్ వుండదు. చివర్లోనే కథేమిటో, అసలేం జరిగిందో సస్పెన్స్ అంతా ఓపెనవుతుంది. అంతవరకూ ప్రేక్షకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడమే. ఇలా కాక సస్పెన్స్ కథలో ఇప్పుడేం జరుగుతుందో, ఇంకేం జరుగుతుందో నన్న అనుక్షణ యాక్షన్ లో వుంటుంది సస్పెన్స్. మిస్టరీలు జడప్రాయమైన ఎండ్ సస్పెన్స్ లైతే, సస్పెన్సులు చైతన్యవంతమైన  సీన్ టు సీన్ ఉత్కంఠ రేపే సస్పెన్సులు. కాబట్టి హిచ్ కాక్ మిస్టరీలు ఎందుకు తీయనన్నాడో అసలంటూ అర్ధమైతే, ఎండ్ సస్పెన్స్ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోరు. కానీ మన ఇండియన్ సినిమాల్లో అదేం అలవాటో గానీ, మర్డర్ కథ అనగానే వీరావేశంతో ఎండ్ సస్పెన్స్ మిస్టరీలు తీసెయ్యడమే. సస్పెన్స్ అంటే చిట్ట చివరి వరకూ రహస్యం దాచడమే అనుకుంటున్నారు. చాలా సిల్లీ. ఈ పెద్ద బాలశిక్ష స్టేజి అవగాహన నుంచి పైకెదగాలి.

        కొత్త దర్శకుడు హనీ ట్రెహాన్, కొత్త రచయిత్రి స్మితా సింగ్ ఈ నోయర్ ని ప్రయత్నించారు. హాలీవుడ్ నియో నోయర్ చైనా టౌన్ స్ఫూర్తి అన్నాడు ట్రెహాన్. హిచ్ కాక్ తీసిన నార్త్ బై నార్త్ వెస్ట్ కూడా ప్రభావితం చేసిందన్నాడు. హిచ్ కాక్ అభిమానినన్నాడు. కానీ తను తీస్తున్న నోయర్ ని హిచ్ కాక్ లా సస్పెన్స్ కథలో తీయపోవడం అందరి లాగే సస్పెన్స్ కీ మిస్టరీకీ తేడా తెలియకపోవడం వల్లేనని మనం అర్ధం జేసుకోవచ్చు. కొందరు ఆగథా క్రిస్టీ కథా ప్రపంచాన్ని సృష్టించాడన్నారు. ఆగథా క్రిస్టీ కథా ప్రపంచాలు మిస్టరీ నవలలు. మిస్టరీ నవలలు చదివిస్తాయి. మిస్టరీ సినిమాలు బోరు కొడతాయి. ఆగథా క్రిస్టీ మిస్టరీల ముగింపులు మైండ్ బ్లోయింగులు. ట్రెహాన్ మిస్టరీ ముగింపు బోరు. ముగించడానికే అరగంట తీసుకున్నాడు. దాచి పెట్టిన రహస్యాన్ని అరగంట పాటు వివరించాల్సి వచ్చింది. ఇదేమన్నా క్లాస్ రూమ్ పాఠమా? 

        కొందరు గత సంవత్సరం విడుదలైన
నైవ్స్ అవుట్ తో పోల్చారు. నైవ్స్ అవుట్ నోయర్ జానర్ కాదు. నోయర్ జానర్ లో రియాన్ జాన్సన్ అంతకి ముందు బ్రిక్ తీశాడు. పెద్ద స్టార్లతో వస్తూ వుండిన నోయర్ జానర్ తో ప్రయోగం చేసి యువ నటులతో కాలేజీ నేపథ్యంలో టీనేజి నోయర్ గా తీసి సంచలనం సృష్టించాడు. అలాగే నైవ్స్ అవుట్ లో ఆగథా క్రిస్టీ వాతావరణాన్నే క్రియేట్ చేస్తూ ఒక ప్రయోగం చేశాడు. అగథా క్రిస్టీ నవలల్లో వుండే  ఎండ్ సస్పెన్స్ మిస్టరీగా  తీయలేదు. ఎవరు చంపారో మధ్యలోనే చూపించేసి, సీన్ టు సీన్ సస్పెన్స్ గా కథ నడిపాడు. అతను శాస్త్రాన్ని చదివి అర్ధం జేసుకుని సినిమాలు తీస్తాడు. ఏది ప్రింట్ మీడియా కథనమో, ఏది విజువల్ మీడియా కథనమో తెలుసుకోకుండా సినిమాలు తీసి ఫ్లాపవుతున్న వాళ్ళు మనదగ్గరే వున్నారు.

        ఎవరు చంపారు? అన్న విజువల్ మీడియాకి పనికిరాని పాయింటు పట్టుకుని రెండున్నర గంటలు లాగాడు. గంట లోగానే కథ కదలక విసుగు పుట్టిస్తుంది. అరడజను మందిని ఒకరి తర్వాత ఒకర్ని ప్రశ్నించడాలే కదలని సీన్స్ ని క్రియేట్ చేస్తాయి. అనుమానితులందరూ మార్పు లేకుండా అనుమానితులుగానే వుండిపోతారు. కథలో చలనం కోసం అనుమానితులని ఫిల్టర్ చేసి కొందర్ని లిస్టులోంచి తప్పించే చర్యలకి పూనుకోడు సబిన్స్ పెక్టర్. ఎలా వున్న పాత్రల్ని అలా ఈడ్చుకుంటూ పోతూనే వుంటుంది కథ. పోయిపోయి చివరికి హత్యారహస్యం విప్పుతూ అరగంట వివరణ. ఈ వివరణని బుర్ర కెక్కించుకునే ఓపికా ఆసక్తీ వుండవు. చివర్లో వివరణ లెవరిక్కావాలి, విజువల్ యాక్షన్ తో మొదట్నించీ కథ తెలుస్తూండాలి గాని.

        ఎవరు చంపారన్నది ముఖ్యం కాదు, ఎందుకు చంపారన్నది ముఖ్యమన్నాడు దర్శకుడు. కానీ కథ నడిపింది అన్ని మిస్టరీల్లాగే ఎవరు చంపారన్న బోరు కొట్టే పాయింటుతోనే. ఎవరు ఎందుకు చంపారో చివర్లో రివీల్ చేశాడు. దాన్ని బట్టి ఈ కథలో స్త్రీలందరూ ఏదో రకంగా హతుడి బాధితులే. అంటే పితృస్వామ్యం పాయింటు అన్నమాట. కహానీ 2 లో, హైవే లో చైల్డ్ ఎబ్యూజ్ పాయింటు లాగా. ఈ రెండు సినిమాలూ సస్పెన్స్ థ్రిల్లర్స్. ముగింపులో రివీలయ్యే చైల్డ్ ఎబ్యూజ్ పాయింటు షాకింగ్ గా, డిస్టర్బింగ్ గా వుంటుంది. అదీ ముగింపు అంటే. 

        ట్రెహాన్ మిస్టరీలో అతను చెప్పినట్టు ఎందుకు చంపారన్నది ముఖ్యమైనప్పుడు
, ఎవరు చంపారన్న ప్రశ్నతో కాకుండా, ఎందుకు చంపారన్న ప్రశ్న తలెత్తేలా స్త్రీ పాత్రల్ని డ్రైవ్ చేసి వుంటే సరిపోయేది. అరవై ఏళ్ల వాణ్ణి పెళ్ళయిన రాత్రి ఎందుకు చంపారు? నిజంగానే ఈ ప్రశ్న కుతూహలం రేకెత్తించేదే. కానీ సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ ఈ ప్రశ్న వదిలేసి, పసలేని ఎవరు చంపారన్న ప్రశ్న మీదే దృష్టి పెట్టి కథ నడుపుకున్నాడు. 

        మీరందరూ అనుమానితులే అంటాడు
, కానీ మిమ్మల్ని చూస్తే జాయింటుగా సమ్ థింగ్ ఇంకేదో ఫీలవుతున్నాను, అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను... అని వుంటే,  ఆ ఫీలింగ్ తో కథ నడిపివుంటే, అప్పుడు అరవై ఏళ్ల పెళ్లి కొడుకుని శోభనం కాకుండానే ఎందుకు ఢామ్మని రైఫిల్ తో కాల్చి ఖతం చేసి పారేశారన్న కథకి ఆపరేటింగ్ క్వశ్చన్, లేదా డ్రమెటిక్ క్వశ్చన్ ప్రేక్షకుల్ని ఎలర్ట్ చేసేది.
                       
సికిందర్