రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, ఆగస్టు 2020, మంగళవారం

969 : రివ్యూ రచన - దర్శకత్వం : ఫరూఖ్ కబీర్ 

తారాగణం : విద్యుత్ జామ్వల్, శివాలికా ఒబెరాయ్, అన్నూ కపూర్, శివ్ పండిత్, నవాబ్ షా తదితరులు
సంగీతం : మిథూన్
, ఛాయాగ్రహణం : జీతన్ హర్మీత్ సింగ్
బ్యానర్ : పనోరమా స్టూడియోస్
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
***
      యాక్షన్ హీరో విద్యుత్ జామ్వాల్ ఈసారి భావోద్వేగాలు ప్రధానంగా సామాన్యుడైన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రతో అభిమానులని అలరించేందుకు ప్రత్యక్షమయ్యాడు. కొత్త దర్శకుడు ఫరూఖ్ కబీర్ యాక్షన్ ని పణంగా పెట్టి సున్నిత భావోద్వేగాలతో ప్రయోగం లాంటిది చేశాడు. అయితే తీసుకున్న కథా వస్తువు దశాబ్దాల బాలీవుడ్ చరిత్రలో అనేక సార్లు రిపీట్ చేసిందే. దీన్ని సున్నిత భావోద్వేగాల ప్రయోగంతో కొత్తగా ఏ  మేరకు నిలబెట్టాడో చూద్దాం...

 కథ
    లక్నోలో కొత్తగా పెళ్ళయిన సమీర్ చౌదరి (విద్యుత్ జామ్వాల్) - నర్గీస్ (శివలీకా ఒబెరాయ్) లు 2008 ఆర్ధిక మాంద్య పరిస్థితుల్లో ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. ఇక ఉపాధి వెతుక్కోవడం మధ్య ప్రాచ్య దేశంలో తప్పనిసరవుతుంది. ప్రపంచం ఆర్ధిక మాంద్యంలో కుదేలైనా మధ్యప్రాచ్యం చమురు బావులతో నిక్షేపంగా వుంది. అక్కడ నోమన్ (కల్పిత దేశం) లో ఉద్యోగాలు  సంపాదించుకుంటారు. పేపర్స్ క్లియర్ అవడానికి సమీర్ కి సమయం పట్టేలా వుండడంతో, ముందు నర్గీస్ బయల్దేరి వెళ్లిపోతుంది. వెళ్ళిన ఆమె కంగారుగా ఫోన్ చేస్తుంది తనని కిడ్నాప్ చేశారని. వెంటనే సమీర్ నోమన్ వెళ్ళిపోతాడు.


        అక్కడ ఉస్మాన్ (అన్నూకపూర్) అనే టాక్సీడ్రైవర్ సాయంతో నర్గీస్ ని వెతికితే ఆమె వేశ్యాగృహంలో కన్పిస్తుంది. ఆమెని విడిపించేందుకు విఫలయత్నం చేసిన సమీర్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే
, అక్కడ ఉస్మాన్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఈ హత్యలోంచి ఎలా బయట పడి భార్యని కాపాడుకున్నాడన్నది మిగతా కథ.

నటనలు - సాంకేతికాలు 
    విద్యుత్ జామ్వాల్ ఒక సామాన్య లక్నో యువకుడి పాత్ర పోషించాడు. అన్యాయాలకి ఆవేశం పొంగుకొస్తుంది. కానీ ఎదుర్కొనే ధైర్యం చాలదు. ఆగ్రహమే తప్ప పోరాటం తెలియని అమాయకత్వం. ఇలాటి ఇతను నోమన్ లో అనుభవాల్లోంచి ఎలా రాటుదేలి బలవంతుడయ్యాడన్నది అతడి క్యారక్టర్ ఆర్క్. ఈ పాత్ర చిత్రణ వల్ల అభిమానులు అతన్నుంచి ఆశించే యాక్షన్ దృశ్యాలు తక్కువ వుంటాయి. ఒక సామాన్యుడిగా భార్యని వెతకడానికి సాయపడండని అడిగినప్పుడల్లా అతడి బలహీన స్వరం వణకడం, చేతులు వణకడం వంటివి వెంటాడే నటనగా వుంటాయి. పోరాటానికి తెగించాక ఇక హద్దులుండవు. ఈ పోరాట క్రమం కూడా అంచెలంచెలుగా స్థాయి పెంచుకుంటూ వుంటుంది. క్లయిమాక్స్ లో విజృంభిస్తుంది. విద్యుత్ జామ్వాల్ అండర్ ప్లే చేసిన ఈ పాత్ర, రొటీన్ యాక్షన్ హీరో పాత్రలకి భిన్నంగా జీవంతో కన్పిస్తుంది. అతడిలోని నటుణ్ణి బయటికి తీస్తుంది. 


        నర్గీస్ గా శివాలికా ఒబెరాయ్ ది చాలావరకూ కనిపించని పాత్ర. కిడ్నాపవడం కారణం. కాసేపే వున్నా కొట్టొచ్చే గ్లామర్. శివ్ పండిత్
, ఆహానా కుమ్రా, నవాబ్ షాలు దుష్ట పాత్రలు పోషించారు.    

        మిథూన్ పాటలు
, అమర్ మోహిలే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ మూవీకి ఓ మాదిరి ట్రెండీగా వున్నాయి. అరబ్ దేశపు లొకేషన్స్ కి, యాక్షన్ సీన్స్ కి జితన్ హర్మీత్ సింగ్ ఛాయాగ్రహణం డిటో. 

కథా కథనాలు

    కథేమీ లేదు. భార్య కిడ్నాపవడం, ఆమెని విడిపించుకోవడం ఇదే కథ, ఇంటర్వెల్లో భార్య దొరికినట్టే దొరికి మళ్ళీ దూరమవుతుంది. సెకండాఫ్ కథని లాగడానికే మళ్ళీ దూరం చేయడమేమో. రెండుసార్లూ భార్యని వెతికే కథనంలో కూడా బలం వుండదు. రాయబారుల చర్చలతో, విద్యుత్ ని ప్రశ్నించడాలతో నిండిపోతుంది. ఈ బలహీనతల్ని కవర్ చేసేందుకా అన్నట్టు విద్యుత్ పాత్ర చిత్రణ. బలహీనుడు ఎలా బలవంతుడయ్యాడన్న క్యారక్టర్ ఆర్క్. ఈ క్యారక్టర్ ఆర్క్ ఒక్కటే సినిమాని నిలబెట్టిందా అంటే లేదు. క్యారక్టర్ ఎదుగుదలకి తగ్గ దృశ్యాలతో కథనం పరుగులు దీయలేదు. పక్క దోవపడుతూ చర్చలూ, ప్రశ్నించడాలూ అంటూ కూర్చుంది. ఇందుకే రెండుం పావు గంటల ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయావకాశాలు తగ్గాయి.

సికిందర్