రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, అక్టోబర్ 2018, సోమవారం

694 : స్క్రీన్ ప్లే సంగతులు


        ప్పుడు  సినిమాల్లో చిన్నప్పటి కథలు చూపిస్తే వస్తున్న మార్కెట్ యాస్పెక్ట్ పరమైన సమస్యలేమిటో కిందటి వ్యాసంలో చూశాం. కేవలం హీరో పాత్ర చిత్రణకి బేస్ కోసం చిన్నప్పటి కథలు చూపిస్తే అది యూత్ అప్పీల్ ని చంపేస్తోందనీ, పైగా కథగా స్క్రీన్ ప్లేలో అదే విభాగానికీ చెందని అనాధలా మిగిలిపోతోందనీ చెప్పుకున్నాం. ఇలాకాక – బాల్య కథని స్క్రీన్ ప్లేలో భాగంగా చేస్తూ, దాంతోనే బిగినింగ్ విభాగాన్ని ప్రారంభిస్తే, అప్పుడా బాల్య పాత్ర చిత్రణతోబాటు దానికో  సమస్యతో, ఆ సమస్యతో దానికో గోల్ తో,  ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే చిన్నప్పటి కథలకి ఓ అర్ధం వుంటుందనీ దొంగరాముడు ఉదాహరణగా అవగాహన కొచ్చాం. చిన్నప్పుడే పాత్రకి ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేసేస్తే ఇంకా ప్రయోజనాలేమిటంటే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రారంభమయ్యే కథలో (మిడిల్లో ) హీరో నేరుగా ప్రవేశిస్తాడు. అక్కడ ఆల్రెడీ వున్న చిన్నప్పటి గోల్ ని చేపట్టి మిడిల్ విభాగాన్ని నేరుగా పాలిస్తాడు. ఎక్కడైనా హీరో నేరుగా మిడిల్ విభాగంలో అడుగుపెట్టి, సిద్ధంచేసి పెట్టిన కథని పాలించడం వుంటుందా? ఇలాంటప్పుడే వుంటుంది. బాల్య కథనే బిగినింగ్  విభాగంగా చూపించేస్తే ఇక హీరోకి బిగినింగ్ విభాగం చూపించాల్సిన అవసరం రా దు. స్క్రీన్ ప్లే రచనలో ఇదొక కొత్తానుభూతినిచ్చే అపూర్వ ప్రక్రియ అవుతుంది! 

         
త నెల విడుదలైన ‘ఈక్వలైజర్ - 2’ లో ఇలాటిదే చమత్కృతి గురించి చెప్పుకున్నాం : సెకెండాఫ్ ప్రారంభమైన పావుగంటలో క్లయిమాక్స్ ప్రారంభమైపోవడం! ఈ రోజుల్లో కథెవడిక్కావాలి. ఇంకా ఇప్పుడు కూడా స్క్రీన్ ప్లేలో సాంప్రదాయంగా బిగినింగ్ అరగంట – మిడిల్ (కథ) గంట – ఎండ్ ఆరగంటా అనే 25% + 50% + 25 % పంపకా లేమవసరం?  ఫస్టాఫ్ లో అరగంట వుండే బిగినింగ్ ని ముప్పావు గంటకి పెంచి, ఓ పావుగంట మాత్రమే మిడిల్ -1 తో ఇంటర్వెల్ వేసేసి, సెకండాఫ్ ప్రారంభంలో ఇంకో పావు గంట మాత్రమే మిడిల్ -2 చూపించేసి, మిగిలిన ముప్పావు గంటా క్లయిమాక్స్ (ఎండ్) కెళ్లిపోతే చాలా రొటీన్ మూస బాధలు వదుల్తాయి. మిడిల్ యాభై నుంచి పాతిక శాతానికి తగ్గిపోవడం వల్ల, పాతిక శాతం కథతో బోరు సగానికి సగం తగ్గిపోతుంది!  ‘ఈక్వలైజర్ - 2’ లో జరిగిందిదే. 

         ఇలాటిదే దొంగరాముడులో జరిగింది. చిన్నప్పటి కథని బిగినింగ్ గా వేసేస్తే, హీరోతో ఈసురోమని అదే రొటీన్ బిగినింగ్ ని మళ్ళీ మళ్ళీ చూపిస్తూ సినిమాలు తీసే అవసరమే రాదు, నేరుగా మిడిల్లో ఎంట్రీ ఇస్తాడు. లేకపోతే జరుగుతున్న దేమిటి? బిగినింగ్ విభాగాన్నిప్రారంభిస్తూ హీరో అదే ఎంట్రీ ఇచ్చి అదే ఫైట్ చేస్తాడు. అదే గ్రూప్ పాటేసుకుంటాడు. హీరోయిన్ తో అదే లవ్ ట్రాక్ ప్రారంభించి అదే కామెడీ చేస్తాడు. ఆమెతో అదే టీజింగ్ సాంగేసుకుంటాడు. అదే లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడు. ఆమెతో అదే డ్యూయెట్ వేసుకుంటాడు. అప్పుడు విలన్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. విలన్ తో హీరోకి గోల్ ఏర్పడుతుంది. 

          ఈ కథనంలోనే బిగినింగ్ విభాగపు బిజినెస్ అయిన – కథా నేపధ్యపు ఏర్పాటు, హీరో సహా పాత్రల పరిచయం, విలన్ తో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్యతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటూ తాలూకు కథనమంతా వుంటుంది. ఇలాకాక దీన్ని బాల్య కథలోకి తోసేసినప్పుడు, ఇదే రొడ్డకొట్టుడు రొటీన్ నుంచి హీరో బతికి పోతాడు. తన బదులు తన చిన్నప్పటి పాత్రధారి బాల నటుడెవరో  ఇది పోషించి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో రెండో కృష్ణుడులాగా ఏంచక్కా ఫ్రెష్ గా మిడిల్లో ఎంట్రీ ఇచ్చి, బాలనటుడి గోల్ నెత్తుకుని, నేరుగా కథని ఆపరేట్ చేస్తాడు. ఈ సినేరియాలో ‘శివ’ ని వూహిస్తే – నేరుగా నాగార్జున సైకిలు చైనుతో జేడీని కొట్టే సీనుతో ఎంట్రీ ఇవ్వొచ్చు. అంతకి ముందు అరగంట బిగినింగ్ కథనమంతా  శివ బాల్యపు కథగా వుండొచ్చు.

      అయితే ఈ చిన్నప్పటి కథలు కొన్ని, చిన్నప్పుడు హీరో తన తల్లిదండ్రుల్ని విలన్ చంపడాన్ని చూడడంగానో, లేదా చిన్నప్పుడు అన్నదమ్ములు తప్పి పోవడంగానో కూడా వుంటాయి. వీటిలో చిన్నప్పుడు హీరోకి గోల్ ఏర్పడదు. అంటే కథ వుండదు. తల్లిదండ్రుల చావు చూసిన హీరోగారు పెరిగి బాగా పెద్దవాడై, ఓ పాతిక ముప్పయ్యేళ్ళూ  కామెడీలూ, హీరోయిన్ తో ప్రేమలూ గట్రా వెలగబెడుతూ జల్సాగా గడిపేశాక, అప్పుడొకానొక రోజు, తల్లిదండ్రుల్ని చంపిన విలన్ గుర్తుకొచ్చి గుండెల్లో అగ్నిపర్వతాలు ఎడాపెడా పేల్చుకుంటాడు. అంటే ఇప్పుడిన్నాళ్ళకి తీరిగ్గా నిద్రలేచి గోల్ ఏర్పర్చుకున్నాడన్న మాట.

          ఇలాగే చిన్నప్పుడు అన్నదమ్ములు తప్పిపోతే ఎవడికీ పట్టింపు (గోల్) వుండదు. పెద్దవాళ్ళై ఎప్పుడో ప్రమాదవశాత్తూ కలుసుకుంటారు. ఇక్కడ కూడా చిన్నప్పటి దృశ్యాలు బిగినింగ్ విభాగం అన్పించుకోవు. పెద్దవాళ్ళయాకే బిగినింగ్ మొదలవుతుంది.

          సిడ్ ఫీల్డ్ ప్రకారం సర్కిల్ ఆఫ్ బీయింగ్ అని ఒకటుంటుంది. అంటే,  కథకి సంబంధించి హీరోకి గతం తాలూకు ఫ్లాష్ బ్యాక్. ఇదే పాత్రని నిర్దేశిస్తుంది, ఇదే పాత్రని వెన్నాడుతుంది, ఇదే పాత్రకి బలాన్నిస్తుంది. ‘ఖైదీ’ లో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ (సర్కిల్ ఆఫ్ బీయింగ్) ఇలాటిదే. ఇది హీరోకి బాల్యంలో ఏర్పడొచ్చు, పెద్దయ్యాకా ఏర్పడొచ్చు. ‘అంకుశం’ లో కుప్పతోట్లో ఏరుకు తిన్నబాల్యంలో ఏర్పడి – ఈ కసే పెద్దయ్యాకా వుంటుంది. పాత్రకి ఇలాటి బలాన్నిచ్చే, భగభగ మండించే ఇలాటి సర్కిల్ ఆఫ్ బీయింగ్స్ తోనైనా ఇప్పుడు బాల్య కథల్లేవు- ఏమంటే హీరోగారికి ఫలానా తిక్క ఎలా ఏర్పడిందో ప్రేక్షకులు అర్ధం జేసుకోవడానికి చిన్ననాటి సీన్లు! ఫలానా పిల్లని ఎంతగా ప్రేమించాడో ప్రేక్షకులకి తెలియడానికి చెడ్డీల నాటి  ముచ్చట్లు! పనికిమాలిన దృశ్యాలు. హీరో క్యారెక్టరైజేషన్ అనగానే బచ్చాతనంలో కెళ్ళిపోయి కథలల్లడం. మనిషికి బాల్యంలోనే నమ్మకాలేర్పడతాయా? అవే జీవితమంతా శాశ్వతంగా వుండిపోతాయా? మీసాలొచ్చాక నమ్మకాలేర్పడకూడదా? కేవలం హీరో పాత్ర చిత్రణ కోసం చైల్డ్ స్టోరీ అనేది స్క్రీన్ ప్లేకీ,  మార్కెట్ యాస్పెక్ట్ కీ పెద్ద అడ్డంకి. దొంగరాముడులో లాగా చిన్నప్పుడు పాత్ర చిత్రణతో బాటు, అప్పుడే బిగినింగ్ విభాగాన్ని కూడా ప్రారంభిస్తూ, ఆ చిన్నప్పుడే మొత్తం కథకీ  కావాల్సిన గోల్ నేర్పాటు చేస్తే ఎంతో ఉపయోగముంటుంది.  ఒక కొత్త ప్రక్రియకి నాంది అవుతుంది. ప్లాట్ పాయింట్ వన్ రానంత సేపూ కథ ఏర్పడదు. ప్లాట్ పాయింట్ వన్ లోపు బిగినింగ్ లో వుండేదంతా కథ కాదు. కేవలం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రారంభం కాబోయే కథకి అది ఉపోద్ఘాతమే. అలాగే క్లయిమాక్స్ (ఎండ్) అంతా కూడా కథ కాదు, కథకి ఉపసంహారం మాత్రమే. ఒక్క మిడిలే కథ, మిడిల్లోనే కథ!    

        దొంగరాముడు చిన్నప్పుడు తల్లికి మందుల కోసం దొంగతనానికి పాల్పడడంతో  పోలీసులకి పట్టుబడ్డం, తల్లి మరణించడం, చెల్లెలు అనాధ అవడమనే బిగినింగ్ విభాగపు బిజినెస్ తో, చిన్నప్పుడే ప్లాట్ పాయింట్  ఏర్పడి, జీవితపు చౌరస్తాలో అప్పుడే నిలబడ్డాడని చెప్పుకున్నాం. అంటే ఇక నేరుగా గోల్ ని, కథని, ఎదిగిన దొంగరాముడుకి అందించేస్తాడన్న మాట. ఇక్కడ కేవలం హీరో పాత్రచిత్రణ కోసం బలహీనంగా వాడుకుంటున్న బాల్య పాత్రకీ, దొంగరాముడు బాల్యపాత్రకీ గమనించాల్సిన ముఖ్యమైన తేడా ఏమిటంటే – చిన్న దొంగరాముడు కథకోసం పుట్టి, ఒక గోల్ తో తన ఉనికిని, ప్రాముఖ్యాన్నీ చాటుతున్నాడు. గోల్ ని, లేదా కథని, పెద్ద దొంగరాముడికి అప్పజెప్తూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంటే డ్రమెటికా స్టోరీ రూలు ప్రకారం, హేండాఫ్ పాత్రయ్యాడన్నమాట. మనుషులు మారాలిలో శోభన్ బాబు చనిపోతూ శారదకి కథని అప్పజెప్పినట్టు, ఎర్ర మందారంలో రాజేంద్ర ప్రసాద్ చనిపోతూ యమునకి కథని అందించినట్టు. పెద్ద దొంగరాముడొచ్చేసి నేరుగా కథని పాలించడానికి కథని సిద్ధం చేసి పెట్టే పెద్దతనంతో హెండాఫ్ పాత్రయాడు చిన్నదొంగరాముడు...

సికిందర్