రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, డిసెంబర్ 2022, బుధవారం

1270 : న్యూస్!


 

    పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ డమ్ కి నిచ్చెనలు వేస్తున్నాడా? ప్రణాళిక వేసుకోవడం ఆల్రెడీ ప్రారంభమైంది. చిన్న చిన్న సూచనలు గ్లోబల్ వేదికల మీద కనిపిస్తూనే వున్నాయి. గత ఆగస్టులో తను బహుళ బ్రాండ్ షూట్లతో బిజీగా వున్నప్పుడు న్యూయార్క్ లో వార్షిక ఇండియన్ డే పరేడ్కి హాజరై, కె -పాప్ గ్రూపు బ్యాండ్ తో కలిసి ఇచ్చిన మ్యూజిక్ వీడియో వైరల్ అయింది. మేము ఆగము అసలే ఆగము అని ఒక తెలుగు లైను వుండే ఈ పాప్ నంబర్ లో ఇచ్చిన డాన్స్ మూవ్ మెంట్స్ సోషల్ మీడియాలో వెర్రెత్తించాయి.

        కె- పాప్  లేదా కొరియన్ పాప్ అనేది దక్షిణ కొరియాలో ఉద్భవించిన ఈ శతాబ్దపు  ట్రెండ్‌ సెట్టింగ్ మ్యూజికల్ గ్రూపు. ఈ గ్రూపులో అనేక బ్యాండ్ లున్నాయి. వాటిలో ట్రైబ్ ఒకటి. ఈ ట్రైబ్ కళాకారులతోనే కలిసి మ్యూజిక్ వీడియో ఇచ్చాడు. కె -పాప్ గ్రూప్ ఇండియన్ స్టార్ తో కలిసి పని చేయడం అదే మొదటిసారి.  ప్రయోగాత్మకంగా రాక్, హిప్-హాప్, ఎలక్ట్రానిక్ డ్యాన్స్ వంటి అనేక రకాల కళా ప్రక్రియల సమ్మేళనం ట్రైబ్ అందించే సంగీతం. అల్లు అర్జున్ వీడియో ఒక టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో భాగంగా వెలువడింది.
        
తర్వాత డిసెంబర్ మొదటివారంలో పుష్ప తో రష్యా ప్రయాణం. అక్కడ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా మాస్కోలో రష్యన్ భాషలో పుష్ప ప్రీమియర్ ప్రదర్శన. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి, హీరోయిన్ రశ్మికా మందన్న మాస్కో ఫెస్టివల్లో స్పెషల్ షో తర్వాత, పుష్ప రష్యన్ డబ్బింగ్ వెర్షన్ ని థియేట్రికల్ రిలీజ్ చేసి వచ్చారు.    మాస్కోలోని ఇండియన్ ఎంబసీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఎరౌండ్ ది వరల్డ్ లో ఒకటిగా ఫెస్టివల్లో  పుష్ప ని ఎంపిక చేసింది.  అంతేగాకుండా క్రిటిక్స్ పిక్ గా కూడా నమోదైంది.  ఇక థియేట్రికల్ రిలీజ్ కి అల్లుతో పాటు టీమ్ మొత్తం ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు.  రేడియో ఇంటర్వ్యూలు, టీవీ ఇంటర్వ్యూలు ధారాళంగా ఇచ్చారు.
        
అయితే దిగ్భ్రాంతికరంగా సినిమా భారీ యెత్తున ఫ్లాపయింది. మూడు రోజుల్లోనే చాలా థియేటర్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రచార కార్యక్రమాల సమయంలో ఖర్చు చేసిన 3 కోట్ల రూపాయలూ నష్టంగా మిగిలింది.
        
ఇది అల్లుకి వార్నింగ్ బెల్. దీని ఫలితమేమిటో తర్వాత చూద్దాం. పై రెండు తీపి- చేదు అనుభవాలలా వుండగా, జపాన్ లో ఎన్టీఆర్- రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్లు డ్రీమ్ రన్‌ అన్పించి సంతోషాన్ని మిగిల్చాయి. ఆర్ ఆర్ ఆర్ జపాన్ బాక్సాఫీసు కలెక్షన్ 15 కోట్లకి చేరుకుంది. జపాన్ అంతటా దాదాపు 210 థియేటర్లలో రిలీజ్ చేశారు. వాటిలో 31 ఐమాక్స్ థియేటర్లు. రెండోది, అటు ప్రఖ్యాత ఆస్కార్ నామినేషన్ రేసులో వుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (ఎన్టీఆర్, రామ్ చరణ్), స్క్రీన్‌ప్లే, ఒరిజినల్ సాంగ్, స్కోర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్‌ఎక్స్, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి మొదలైన 14 ప్రధాన కేటగిరీల క్రింద నామినేషన్ రేసులో ఎంటరైంది.
        
మరోవైపు, ఆర్ ఆర్ ఆర్ జనవరి 2023లో జరిగే ప్రసిద్ధ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి రెండు విభాగాల్లో నామినేట్ అయింది. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఆంగ్లేతర భాష ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) లకి గాను రెండు కేటగిరీల్లో నామినేట్ చేసింది.
        
కె- పాప్ హిట్, పుష్ప రష్యన్ ఫ్లాప్, ఆర్ ఆర్ ఆర్ జపాన్ హిట్, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు ఇవన్నీ చూస్తూంటే అల్లు అర్జున్ కి తను గ్లోబల్ స్టార్ అవ్వాలన్న పట్టుదల పెరగడం సహజమే. దీని ఫలితంగానే ఇప్పుడు పుష్ప- ది రైజ్ సీక్వెల్ పుష్ప- ది రూల్ విషయంలో చేస్తున్న డిమాండ్లు. అసలు పుష్ప- ది రూల్ షూటింగ్ ప్రారంభం కాకముందే, ఓవర్సీస్ హక్కుల కోసం మేకర్స్ రికార్డ్ ధరని డిమాండ్ చేశారు. ఓవర్సీస్ రైట్స్ పొందేందుకు 80 కోట్లకి పైగా అడగడం మొదలెట్టారు. బయ్యర్లు బెదిరిపోయారు.
        
ఇప్పుడు అల్లు డిమాండ్లు మేకర్స్ కి బడ్జెట్ ని పెంచేస్తున్నాయి. పుష్ప ఫ్రాంచైజీ మొదటి ఇంస్టాల్ మెంట్ పుష్ప- ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో ఇంస్టాల్ మెంట్ పుష్ప -ది రూల్ మరింత భారీగా, మెరుగ్గా నిర్మించడానికి దాదాపు 400 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. ప్రీక్వెల్ కి మించి సీక్వెల్ అన్నమాట. అయితే అల్లు గ్లోబల్ ప్రణాళికల ఫలితంగా ఈ బడ్జెట్ మరింత పెరుగుతోంది. తొందరగా పూర్తి చేసేందుకు వొత్తిడి చేయకుండా గ్లోబల్ ప్రమాణాలతో తీయాలన్నదే అల్లు కోరిక.
        
అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గ్లోబల్ గా వైరల్ అవుతూంటే తను లోకల్ గా వుండలేడు కదా? అటు రష్యాలో పుష్ప ఫ్లాపవడం చూస్తే, గ్లోబల్ ప్రమాణాలకి అది సరిపోలేదనే అర్ధం. హాలీవుడ్ ప్రమాణాలే గ్లోబల్ ప్రమాణాలు. కేవలం సాంకేతికంగా కాదు, విషయపరంగా కూడా. హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజారణ పొందడానికి విషయపరంగా ఏ సార్వజనీతనతో వుంటున్నాయో ఆ ప్రమాణాలు. లోకల్ నుంచి పానిండియా అవడం వెరైనట్టే, పానిండియా నుంచి గ్లోబల్ అవడం పూర్తిగా వేరు. ఇది కుర్తించినప్పుడే అల్లు అర్జున్ గ్లోబల్ ప్రణాళికలు విజయవంతమవుతాయి.
        
న్యూయార్క్ వార్షిక ఇండియన్ డే పరేడ్ లో, యే భారత్ కా తిరంగా హై, కభీ నహీ ఝుకేంగా (ఇది మా త్రివర్ణ పతాకం, ఇది తగ్గేదేలే) అని నినదించినట్టు, ఇది నా గ్లోబల్ పుష్ప- తగ్గేదేలే! అన్పించేట్టు వుండాల్సి వుంటుంది.

“But having a really good understanding of history, literature, psychology, sciences ― is very, very important to actually being able to make movies.” ― George Lucas

సికిందర్