రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

రివ్యూ!






రచన- దర్శకత్వం : హరి

తారాగణం : సూర్య, అనూష్కా,  శృతీ హాసన్, సూరి, రాధిక, ఠాకూర్ అనూప్ సింగ్, సుమన్, శరత్ బాబు, శరత్సక్సేనా, నీతూ చంద్ర దితరులు
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : హారిస్ జయరాజ్, కెమెరా  : ప్రియన్, ఎడిటింగ్ : వీటీ విజయన్, టీఎస్ జే, స్టంట్స్ : అన్బరీవ్, కణల్ కన్నన్
బ్యానర్ : స్టూడియో గ్రీన్, సురక్ష్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలుః జ్ఞానవేల్ రాజా, ల్కాపురం శివకుమార్
విడుదల : ఫిబ్రవరి 9, 2017
***

        ‘సింగంఇంకా గర్జిస్తోంది. బాక్సాఫీసు మీద పంజా దెబ్బ ఇంకా విసురుతోంది. మొత్తం సినిమాల టర్నోవర్ లో తన  నర సింహ భాగం వాటా లాగేస్తూ  నమిలేస్తోంది. సింగం-1, 2 లతో ఎప్పుడో తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని,  సింగం -3 కి  స్టయిల్ గా SIII గా లోగో అదీ  పెట్టుకుని స్పీడు పెంచి గాండ్రిస్తోంది... సింగం ఎప్పుడూ సింగమే, రెండు నెలలుగా విడుదల ఎన్నిసార్లు వాయిదాలు పడ్డా, ఆఖరికి విడుదల రోజు మార్నింగ్ షోకి మొహం చాటేసినా అది మృగరాజే. అది జూలు విదిలిస్తే దాని మీద జోకులన్నీ బలాదూరే. సింగం మీద జోకులేస్తే అది జనం మీద పడి జేబులు బరాబర్ గా కొట్టేస్తుంది!


          సింగం కోసమే పుట్టాడు సూర్య. సూర్య కోసమే సింగం పుడుతూంటుంది. సింగం సూర్య, సూర్య సింగం ఎలా పిలచినా పలికేది బాలీవుడ్ దాకా హౌస్ ఫుల్ బాక్సాఫీసులే. దేశంలో పడ కేసిన  పక్కా నాన్ వెజ్ మసాలా యాక్షన్ లన్నీ లేచి సిగ్గుపడాల్సిందే. ఇక భాషలో సింగం తీసినా భాషలో  టైటిలే అక్కర్లేకుండా సింగమే ఒన్స్ ఫరాల్  టైటిల్  అవ్వాల్సిందే.


       
ఏమిటీ ఈసారి సింగం ప్రత్యేకత? ఒక సింగంని మించి ఇంకో సింగంగా తనతో తానే పోటీ పడే సింగం సీక్వెల్స్- ఫ్రాంఛైజెస్ మూడోసారీ పోలీస్ స్టోరీని ఇంకెంత వైవిధ్యంగా చూపించింది? మొదటి సింగంతో లోకల్ పోలీసుగా పుట్టిన సింగం ఇప్పుడు లెవెల్ పోలీసుగా విజృంభించాడు?  మొదటి సింగంతో లోకల్ సమస్యని పరిష్కరించిన సింగం, ఇప్పుడు స్థాయి సమస్యతో పోరాడేడు? అసలు సింగం ఏం చేశాడు? చూద్దాం...

కథ 
      మంగళూరులో ఓ  పోలీస్ కమీషనర్ హత్య జరిగి  ఎంతకీ కేసు తెమలక పోవడంతో  ఆంధ్రప్రదేశ్ లో గట్టి  పోలీసాఫీసర్ నరసింహం (సూర్య) మాత్రమే దీన్ని  పరిష్కరించగలడని, కేంద్రం ఒక ఆలోచన చేస్తుంది. ఒక రాష్ట్ర పోలీస్ అధికారిని ఇంకో రాష్ట్రం పంపాలంటే వయా సిబిఐయే మార్గమని చర్చించుకుని, నరసింహంని  సిబిఐ లోకి రిక్రూట్ చేసుకుని, అక్కడ్నించి మంగళూరు పంపుతుంది సీబీఐ డిసిపి గా కేంద్ర ప్రభుత్వం. కమీషనర్ ని చంపిన హంతకుల్ని పట్టుకోవడానికి అక్కడికి చేరుకున్న నరసింహం, అక్కడి  మధుసూదన్ రెడ్డి (శరత్ సక్సేనా)  అనే మాఫియాని అనుమానిస్తాడు. అతడిమీద పకడ్బందీ సాక్ష్యాధారాల్ని సంపాదించడం కోసం అతడితోనే చేతులుకలిపి నటిస్తూంటాడు. 

          విద్య (శృతీ హాసన్) అనే జర్నలిస్టు నరసింహంని పరిచయం చేసుకుని వెంట పడుతూంటుంది. కావ్య (అనూష్కా) అనే ఇంకో అమ్మాయి నరసింహంని రహస్యంగా కలుస్తూంటుంది. నరసింహం మధుసూదన రెడ్డితో చేతులు కలపడాన్ని కనిపెట్టి వార్తగా రాసేస్తుంది విద్య. దీంతో నరసింహంకి  చాలా చెడ్డ పేరొచ్చేస్తుంది. ఇది రూపుమాపుకోవడానికి వెంటనే మధుసూదన రెడ్డీ, అతడి గ్యాంగు మీదా చర్యలు తీసుకోవడం మొదలెడతాడు. దరిమిలా  కమీషనర్ హత్య వెనుక కేంద్ర మంత్రి (సుమన్), ఆస్ట్రేలియాలో వుంటున్న అతడి కొడుకూ విఠల్ (ఠాకూర్ అనూప్ సింగ్) వున్నారని తెలుస్తుంది. 

          వీళ్ళంతా కలిసి అసలెందుకు కమీషనర్ ని చంపారు? అసలు వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఏమిటి? వీళ్ళని నరసింహం ఎలా పట్టుకున్నాడు? మరోవైపు వ్యక్తిగతంగా విద్యతో ఎదుర్కొన్న సమస్య లేంటి? అతణ్ణి  కలుస్తున్న కావ్య ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సింగం  నోట్లో డబ్బులు పెట్టాల్సిందే.  

ఎలావుంది కథ?
     ఈ మూడో సింగం కాన్వాస్ ని పెంచిందీ కథ. ఈసారి సింగంని యూనివర్సల్ పోలీసుగా ప్రమోట్  చేస్తూ  అంతర్జాతీయ సమస్యని సింగంకి అప్పగించిందీ కథ. సమస్త జీవులకీ, పర్యావరణానికీ ప్రాణాంతకమైన, భూమిలో కలిసిపోయే గుణం లేని బయోమెడికల్ వ్యర్ధాలు, ఈ- వ్యర్ధాలూ  ప్రత్యేక ప్లాంట్లతో నిర్వీర్యం చేయకుండా, ఆసియా దేశాలకి తరలించి డంప్ చేస్తున్న అంతర్జాతీయ పరిశ్రమల కుట్రని భగ్నం చేస్తుందీ కథ. తమిళ సినిమా కథ అంతర్జాతీయ సమస్యల్ని ఎత్తుకోవడానికి బాక్సాఫీసు భయాలు పెట్టుకుని వెనుకాడదు. స్మార్ట్ ఫోన్లు మాస్ ప్రేక్షకుల చేతికి సైతం వచ్చేశాక తమిళ సినిమా కథలకి రెక్కలొచ్చేస్తున్నాయి. నిజానికి పాత చింతకాయ పంజరాల్లో బందీలై  వుంటున్నది తెలుగు రచయితలే- ప్రేక్షకులు కాదు. స్మార్ట్ ఫోన్లతో, షార్ట్ ఫిల్ములతో ప్రేక్షకులు ఆ పంజరాల్లోంచి ఎప్పుడో బంధ విముక్తు లైపోయారు.  తెలుగు ‘జనతా గ్యారేజ్’ బ్రహ్మాండంగా జాతీయంగా పర్యావరణ సమస్యని ఎత్తుకుని, భయపడి పాత మూస ఫార్ములా మాఫియా కమ్ కుటుంబ కథ పంజరంలో సర్దుకుని సేఫ్టీ ఫీలైనట్టు గాక- సింగం అంతర్జాతీయ డంప్ దుష్పరిణామాల్ని కూడా సామాజిక దృష్టాంతా లుగా చూపిస్తుంది. ఈ డంప్ చుట్టే కథ సాగుతుంది తప్ప, ప్లేటు ఫిరాయించి రెగ్యులర్ లోకల్ మూస మాఫియా డెన్నుల్లో రొటీన్ గా తన్నుకు చావదు. 

ఎవరెలా చేశారు 
       ‘సింగ నరసింహం’ సూర్య సినిమా సాంతం సింగిల్ హేండెడ్ గా తానేఅయి గర్జించాడు, గాండ్రించాడు, బాదేడు, తన్నేడు, చీల్చాడు, చెండాడేడు, వెంటాడేడు, వేటాడేడు, వేటు మీద వేటు వేశాడు, కాల్చాడు, కూల్చాడు, భస్మీపటలం చేశాడు- క్షణం కూడా కుదురుగా లేడు. భగభగమండే సూర్య నరసింగ సింగమతను. మోడర్నైజ్ చేసిన- నూతన కల్పన చేసిన మాస్ సినిమా అంటే ఏంటో రుచి చూపించాడతను. మొదటి సింగం నుంచీ మూడో సింగం వరకూ అదే మెరుపు వేగం నటన, అవే తూటాల్లాంటి మాటలు. అలాగని ఈ పాత్ర  హైపర్  యాక్టివ్ పాత్రకాదు. ఓవరాక్షన్ నటనా కాదు. హైపర్ యాక్టివ్ పాత్ర   కిక్ -2 లో రవితేజ విఫలమైన పాత్ర  లాంటింది. హైపర్ యాక్టివ్ నెస్  ఇమేజి పెంచే నటనే కాదు. హైపర్ యాక్టివ్ నెస్ ని చిన్న పిల్లల చేష్టగా డయాగ్నసిస్   చేస్తారు- ఈ రకం మానసిక రుగ్మతతో కూడిన ప్రవర్తన చిన్నపిల్లల్లో వుంటుంది. సూర్యది హై పవర్ యాక్షన్. సూపర్ యాక్టివ్ క్యారక్టర్. అతడి మోహంలో, కళ్ళల్లో, కదలికల్లో బలవంతంగా తెచ్చిపెట్టుకున్న భావోద్వేగ ప్రకటన, బాడీ లాంగ్వేజ్ లుండవు. అంత బీభత్సంలోనూ  అతి సునాయాసంగా సహజంగా సింపుల్ గా రౌద్ర రసమంతా పలికించేస్తాడు. ఒక కాకలు తీరిన పౌరాణిక నటుడికే సాధ్యమయ్యే నటకౌశలమిది. సినిమా సాంతం ఇంత ఎనర్జీ ఎక్కడ్నించీ పోగేసుకొచ్చాడో తెలీదు. ఇదంతా చూస్తే, ఇంతా చేస్తే గానీ ఒక మసాలా యాక్షన్ సినిమాని ఇవాళ్టి  ఎదిగిన ప్రేక్షకుల దర్బారులో ఒక స్టార్ దిగ్విజయంగా నిలబెట్టలేడేమో నన్న అనుమానం  వేస్తుంది. సూర్య కాక ఇంకెవరూ ఇంత కాక పుట్టించలేరు. 

          ఇక ఈ వారం ఇంకో ప్రత్యేకాకర్షణ – ఒకటి కాదు రెండు సినిమాల్లో- అనూష్కా!  సింగంతో బాటు ఓం నమో వెంకటేశాయలో ఆమె ఇంకెంతో లావెక్కి ప్రత్యేకాకర్షణగా నంబర్ వన్ గా నిలిచింది. ఇలాగే  లవులావుమని కంటిన్యూ అయితే బాక్సాఫీసుల్ని రీక్యాలిబరేట్ చేయాల్సి వస్తుందేమో ఆమె క్షేమంగా పట్టేట్టు.

          శృతీ హాసన్ ఫేస్ లో కూడా మార్పు క్లోజప్స్ లో బయటపడుతోంది. అందం హీరోయిన్ల పక్షపాతి అనే మాటని ఆమె నిలబెట్టుకోకపోతే అవకాశాలకి ఎసరొచ్చే ప్రమాదముంది. 

          ఈ సూపర్ ఫాస్ట్ గా పరుగులెత్తే సీన్లతో కూడిన యాక్షన్ లో సమస్యేమిటంటే - సూర్యకి, కమెడియన్ సూరికీ తప్ప- ఇంకెవరికీ కాస్తాగి పాత్రల్ని నటించేంత  స్పేస్ లేకపోవడం. ఈ రొంబ యాక్షన్లో కాస్త కామెడీతో రిలీఫ్ వుండాలన్నట్టు,  అప్పుడప్పుడు యాక్షన్ ని ఆపుతూ సూరి  వచ్చేసి, తన నాటు కామెడీతో కొంత  స్పేస్ ని సొంతం చేసుకుంటూంటాడు. వీళ్ళిద్దరికీ తప్ప- హీరోయిన్లూ విలన్లూ ఇంకెవరూ సరిగా రిజిస్టర్ కానంత మెరుపు  వేగంతో  సీన్లు - సీన్లు కావివి మైక్రో సీన్లు - వెళ్లి పోతూంటాయి. మొత్తం కలిపి నలభైకి పైగా ఆర్టిస్టులు డెకొరేషన్ బల్బుల్లా క్షణక్షణం వెలుగుతూ ఆరిపోతూ వుంటారు.

          తెరవెనుక హీరోలు స్టంట్ కో- ఆర్డినేటర్లు అన్బరీవ్
, కణల్ కన్నన్ లు. వీళ్ళతో పనిలేని సీనే దాదాపు లేదు. ఇన్నేసి యాక్షన్ సీన్లలో రిపిటీషన్ బారిన పడకుండా దేనికదిగా పోరాటాల్ని సృష్టించారు. ఏర్ పోర్టులో, రైల్వే స్టేషన్లో, హైవేలమీదా, నడిబజార్లలో, భవనాల్లో, అరణ్యాల్లో  ఎక్కడపడితే అక్కడ - కథా కథనాల వేగంతో పోటీ పడుతూ- కళ్ళు తిప్పుకోనివ్వని హైపర్ యాక్షన్ సీన్స్ ని సృష్టించారు. ఈ సీన్స్ లో  సింగం ని హైలైట్ చేసేలా చాలా లౌడ్ గా (మాస్ గా) ఆర్ ఆర్ ఒక్కటే సెకండాఫ్ వచ్చేసరికి చెవులు తట్టుకోలేని పరిస్థితి తెస్తుంది. మిరపకాయల పొగ బెట్టినట్టు ఇంత ఘాటు మసాలా అవసరం లేదేమో ఎంత మాస్ యాక్షన్ కైనా! 

          హారిస్ జయరాజ్ పాటల కోసం తన వంతు కృషి చేస్తే, లొకేషన్స్ పరంగా వీటి కోరియోగ్రఫీ రిలీఫ్ కూడా ఇచ్చేట్టు వుంది. ఈ యాక్షన్ కథకి పాటలు అడ్డుపడలేదు- వూపిరి సలపనివ్వని ఇంత  స్పీడ్ భారీ యాక్షన్ నుంచి కొన్ని నిమిషాలు  లెటజ్ చిల్ గా ఉపశమనం కల్గిస్తాయి. 

          ప్రియన్ కెమెరా వర్క్ కూడా అతి కష్టమైనది. కెమెరా స్పీడుగా పరిగెడుతూనే వుం టుందెప్పుడూ. 360 డిగ్రీ కెమెరాలు కూడా యదేచ్ఛగా వాడేశారు. జూమ్ ఇన్-  జూమ్ బ్యాక్ లేకుండా దాదాపు  షాట్స్ లేవు. కానీ  ఒకటీ  రెండు సెకన్ల నిడివితో  ఒక మైక్రో షాటే ఒక సీనుగా వుంటున్నప్పుడు, కంటిన్యూటీ చెడకుండా వీటిని క్యాప్చర్ చేస్తూ పోవడం ఎంత కష్టమో వూహించుకోవాల్సిందే. మాట్ డామన్ నటించిన బోర్న్ ఐడెంటిటీ సీక్వెల్స్ లో ‘బోర్న్ సుప్రమసీ’ (2004) లోనైతే,  సగటున ఒక్కో షాట్  నిడివి 1.9 సెకన్లు మాత్రమే. ఈ విజువల్ అప్రోచ్ ఎడిటింగ్ కీ, ఆర్ ఆర్ కీ, డీఐకీ అన్నిటికీ పెద్ద సవాలుగా మారింది- ఈ వేగం చూడలేక ప్రేక్షకుల కంటికీ ఇబ్బందై  విమర్శల పాలయ్యింది. ఇలా కళ కోసం టెక్నాలజీ గా కాక, టెక్నాలజీ కోసం కళ గా దుర్వినియోగమవడానికి దగ్గరగానే వుంది సింగం కూడా. కాకపోతే ఇక్కడ మైక్రో షాట్స్ ఎక్కువ లేవు- మైక్రో సీన్స్ వున్నాయి. 

          విజయన్
, జేలకి కూడా ఎడిటింగ్ లో  ఇది సవాలే. మైక్రో సీన్లతో,  వాటి ఇంటర్ కట్స్ తో, ఫ్లాష్ బ్యాక్స్ తో, స్పీడుతో  షాట్స్ ని ఏర్చి కూర్చి ఒక దృశ్యమాలికని  ఇంద్రధనుస్సులా చేయడం మామూలు కష్టం కాదు. 

          ఇంకా గ్రాఫిక్స్ సహా అన్ని టెక్నికల్ విభాగాలూ అత్యన్నతంగా పనిచేశాయి. వీటన్నిటినీ, వీళ్ళందర్నీ డామినేట్ చేస్తూ క్షణ క్షణం తెరమీద విచ్చలవిడిగా వెదజల్లుతున్న నిర్మాతల డబ్బు కట్టలే కనిపిస్తూంటాయి.

చివరికేమిటి 
       దర్శకుడు హరి సింగం సిరీస్ కి ఒక విజువల్ సెన్స్ ని  ఏర్పాటు  చేసుకుని అదే పాటిస్తూ వస్తున్నాడు. ఈ విజువల్ సెన్స్ తో ప్రస్తుత కథకి కథనాన్నీపాత్రల్నీ వాయువేగం పట్టిస్తూ ఎక్కడా ప్రేక్షకులకి ఆలోచించే అవకాశమివ్వకుండా చూశాడు. ఒక సీను మీద పూర్తిగా దృష్టి సారించే లోపే ఆ సీను మారిపోయే క్రమం చివరివరకూ కన్పిస్తుంది. ఒక నార్మల్ సీనులో ఎం టీవీ తరహా  మైక్రో షాట్లు వుండేవి ఒకప్పుడు. ఇప్పుడు మైక్రో షాట్ల స్థానంలో  మైక్రో సీన్లని ప్రవేశపెట్టాడు  దర్శకుడు. ఎన్నెని సీన్లు, ఎక్కడెక్కడి సీన్లు- క్షణంలో ఇక్కడ ఓపెన్ అయితే క్షణంలో స్వీడెన్ లో వుంటాయి; క్షణంలో హైవే మీద వుంటే,  క్షణంలో ఏర్ పోర్టులోవుంటాయి. ఒక సీను మీద ప్రేక్షకులు ధ్యాస నిలిపే సమయం ( అటెన్షన్ స్పాన్) బాగా తగ్గిపోయిన నేపధ్యంలో ‘టర్మినేటర్’ లాంటి సీజీ విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా కథ చెప్పే విధానమే మారిపోయిందని చెప్పాడు ఒకప్పుడు సిడ్  ఫీల్డ్. సీజీల  సంగతేమోగానీ, సింగం మైక్రో షాట్స్ తో హంగామా చేస్తోంది. ఈ టెక్నిక్ తో  కథనీ పాత్రల్నీ పట్టుకోగల్గే మాటలా వుంచి, అసలు మెదడు ఎంత అలసిపోతుందో ఆలోచించాలి. కచ్చితంగా రెండో సారి ఇలాటి సినిమా చూడలేరు ప్రేక్షకులు. 

          అయితే ఈ సీన్ల సందడి మీద కూడా దర్శకుడి కమాండ్ ఏలాంటిదంటే- ఇంత హంగామాలోనూ, ఎన్నెన్నో సీన్లతో  ఇంత స్పీడులోనూ,  ఎక్కడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కన్పించడు. గందరగోళం చేస్తున్నట్టు, నవ్వులపాలవుతున్నట్టూ అన్పించడు. దేశ విదేశాల్లో విలన్లతో ప్రధాన కథని పరుగులెత్తిస్తూనే, అందులోనే ఒక హీరోయిన్ తో హీరో ప్రేమ కథ, ఇంకో హీరోయిన్ తో పెళ్లికథ, పెళ్లి అనంతర కథ, అత్తగారింటి కథ, అత్తగారి అస్తమయ కథా; ఇంకా డ్యూయెట్లూ, వూర మాస్ కామెడీలూ....ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడేయాలో మాస్టర్ షెఫ్ లా స్పీడుగా వేసుకుంటూ పోయాడు. అయితే అంతే స్పీడుతో ఆరగించాల్సివచ్చే ప్రేక్షకాతిధుల సంగతి అలోచించినట్టు లేదు. 

          కథతో కూడా జానర్ మర్యాద తప్పలేదు. అయితే కాన్సెప్ట్ ని అలా చెప్పి వదిలేశాడు తప్పితే,  దాన్ని ప్రధానం చేయలేదు; దాంతోనే  కథ ముగించే ఆలోచన చేయలేదు ఇలాటి చాలా సినిమాలకి లాగే. నాన్ బయో డీగ్రే డబుల్ వేస్ట్స్ తో అంతర్జాతీయ కుట్ర ఇక్కడ స్థానికంగా  ఎంతమంది స్కూలు పిల్లల్ని బలిగొందో – ఆ దయనీయమైన ట్రాక్ ని కొనసాగిస్తూ, బాధిత కుటుంబాల సమక్షంలో విలన్స్  ని శిక్షించినప్పుడే కదా - తామెంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ విలన్స్ కి తెలిసివచ్చేది. బిన్ లాడెన్ ని శిక్షిస్తే అతడి బాధితుల సమక్షంలో బహిరంగంగా శిక్షించాలని ఎందుకు సలహా ఇచ్చి వుంటాడు హాలీవుడ్ రచయిత సీఐఏకి? అది సినిమా బుద్ధి కాబట్టి. అలా వుంటేనే సినిమా బావుంటుంది కాబట్టి. ఒకప్పుడు సినిమా కథల్లో విలన్ బాధితులు హీరో వెంట వుండేవాళ్ళు  కాన్సెప్ట్ ని మోస్తూ. సమాజ బాధని సింగం తానొక్కడి  ఎమోషన్ గా ఒప్పించలేడు తనూ బాదితుడైతే తప్ప. బాధితుడు కాని హీరో బాధితులు తోడయినప్పుడే  వాళ్ళ ఎమోషన్ తో కలుపుకుని తనూ జ్వలించగలడు.  సహాయ పాత్రలు అవుట్ డేటెడ్ కాలేవు, ఎందుకంటే అవి ఎప్పుడూ వుండే ఎమోషన్స్ కాబట్టి. ఒక్కో ఎమోషన్ కి ఒక్కో ప్రతీకలైన తల్లి- చెల్లి- తండ్రి- తాత- పెద్దమనిషి- స్నేహితుడు- హాస్యగాడు- మాయగాడు మొదలైన  అనేక పాత్రల్లో చాలా పాత్రలు (ఎమోషన్లు) మాయమైపోయినట్టు, లేదా నామమాత్రమైనట్టు- సామాజిక కుట్రల బాధితులు కూడా మాయమైపోయి- స్టార్ ఒక్కడే మిగులుతున్నాడు సెకండ్ హేండ్ లేదా పరోక్ష ఎమోషన్ ని  ప్రకటిస్తూ.

          ‘ది మాగ్నిఫిషెంట్  సెవెన్’ లో కౌబాయ్ హీరో డెంజిల్ వాషింగ్టన్ వూరి ప్రజలని కాపాడ్డానికి  పోరాటాలు చేస్తాడు. ప్రజలు కోరినంత మాత్రాన ఎక్కడ్నించో వచ్చి పోరాడాల్సిన ఎమోషనల్ కనెక్ట్ తనకి లేదు. కానీ చివర్లో విలన్ని చంపుతూ- ఆనాడు నా తల్లినీ చెల్లినీ చంపింది నువ్వే కదరా?-  అని జస్టిఫై చేసుకుంటాడు తన ఎమోషనల్ కనెక్ట్ ని!

          సింగం లో స్పీడుతో బాటు  మైక్రో సీన్ల కారణంగా ఒక్క సీనూ  గుర్తుకురాని విధంగా తేలిపోయిన మాట నిజమే- చూస్తున్నంత సేపే థ్రిల్ తప్ప ఎమోషన్ తో కట్టిపడేసేది లేదు, గుర్తుండేదీ లేదు. జస్ట్ కిక్ స్టార్ట్ పవర్ డ్రింక్ తాగిన చందాన వుంటుంది. ఎమోషన్ అనేది కాన్సెప్ట్ లో వుంది. ఆ నిజమైన ఎమోషన్ బాధిత పాత్రల్ని కలుపుకుని వస్తుంది- సినిమాకి ఆత్మ అనేది కాన్సెప్ట్ ని ఎమోషనల్ గా డ్రైవ్ చేసినప్పుడే ఏర్పడుతుంది. ఈ కథాత్మని కూడా జత చేసివుంటే సింగం ఇంకా సజీవమయ్యేది. 

          సింహం ఒంటరిగా పోరాడేటప్పుడుకంటే కూడా, తన పిల్లల్ని వెంటేసుకుని పోరాడుతూంటే ఆ డ్రామా బాగా గుర్తుండిపోతుంది!

-సికిందర్