రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, సెప్టెంబర్ 2015, బుధవారం

రైటర్స్ కార్నర్          2012 లో ‘పాన్ సింగ్ తోమార్’ కి ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ అవార్డుతో వెలుగులో  కొచ్చిన సంజయ్ చౌహాన్, డీవీడీల్లో సినిమా కథల్ని కాపీ చేయడం దగ్గర మొదలై, జాతీయ అవార్డుతో బాటు ‘ఫిలింఫేర్’, ‘స్క్రీన్’ అవార్డులు కూడా సాధించుకోగల సొంత కథలతో బాలీవుడ్ లో ఓ స్థాయికి చేరిన రచయిత. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’, ‘ఐయాం కలాం’, ‘మైనే గాంధీకో క్యో మారా’ వంటి సొంత కథలతో తన ప్రతిభ చాటుకున్న చౌహాన్, నందితా దత్తా కిచ్చిన ఈ ఇంటర్వ్యూ లో-  హిందీ సినిమా రచయితలది ఎంత దయనీయ స్థితో చెప్పుకొస్తూ, కొత్త రచయితలకి కొన్ని విలువైన సూచనలు చేశారు..
కథని నమ్ముకున్న సినిమాలకే అవార్డు లొస్తున్నాయి. దీన్ని మీరెలా చూస్తారు? ఇప్పుడు  రచయితల పాత్రలో ఎలాటి మార్పు లొచ్చాయంటారు?
          కప్పుడు బలమైన కథలకే ప్రాధాన్య ముండేది. అప్పట్లో అబ్రార్ అల్వీ ని గానీ, కె.ఎ. అబ్బాస్ ని గానీ ఎవర్ని తీసుకున్నా రచయితలంటే  మంచి గౌరవం లభించేది. దర్శకుడు- రచయిత అనే కాంబినేషన్ కూడా అప్పట్లో వుండేది. ఆ తర్వాత సలీం -జావేద్ ల కొత్త తరం ప్రారంభమయ్యింది. ఇది రచయితలకి స్టార్ హోదాని సంతరించి పెట్టింది. విధిగా పోస్టర్ల మీద రచయితల పేర్లూ పడేవి. సలీం- జావేద్ లు విడిపోయాకా వాళ్ళ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేక పోయారు. ఇక్కడ్నించే హిందీ  సినిమా చరిత్రలో చాలా దుర్దశ ప్రారంభమయ్యింది. అది డీవీడీ రైటింగ్ కల్చర్.  నిర్మాతలో దర్శకులో డీవీడీ లిచ్చి, ఉన్నదున్నట్టు సీన్లు రాసుకు రమ్మనడం ప్రారంభించారు. జావేద్ అఖ్తర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తొస్తోంది. ఆయన ఒక కథ రాసుకుని నిర్మాతకి వినిపిస్తే- అంతా విన్న ఆ నిర్మాత, మీ కథ అద్భుతమే,  కానీ ఇలాటి కథతో ఇదివరకు సినిమా రాలేదే? అన్నారట!
          దీని తర్వాత సోనీ పిక్చర్స్ వారు హిందీలో ‘సావరియా’ తీశారు. సోనీ రాకతో డిస్నీ పిక్చర్స్, ట్వెంటీయత్ సెంచురీ ఫాక్స్ ల వంటి హాలీవుడ్ కంపెనీలు కూడా హిందీలోకి అడుగు పెట్టాయి. దీంతో నిర్మాతలు దర్శకులూ జాగ్రత్త పడ్డారు. రచయితగా ఇందుకు  నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కంపెనీలు హిందీలో ఎవరెవరు ఏఏ  సినిమాలు తీస్తున్నారో ఓ కన్నేయడం ప్రారంభించాయి. హాలీవుడ్ సినిమాల్ని కాపీ చేస్తే నోటీసులు పంపసాగాయి. వాళ్ళ సినిమాల్ని మనం కాపీ కొట్టి కోట్ల రూపాయలు వాళ్లకి కట్టబెట్టే కన్నా, మన రచయితలకే ఓ 10-15 లక్షలిచ్చి సొంత కథలు బాగా రాయించుకుందామన్న జ్ఞానం వచ్చింది. సొంత కథలు అడగడం ప్రారంభించారు. అందులో సీక్రెట్ ఫార్ములా వుండాలనుకున్నారు. అలా సౌత్ ఇండియా కెళ్ళి అక్కడ హిట్టవుతున్న సినిమాల రీమేక్ హక్కులు కొనడం మొదలెట్టారు. ఈ ట్రెండ్ కూడా ఇంకో  మూడు
నాలుగేళ్ళలో ముగిసిపోవచ్చను కుంటున్నాను.
        ఇదే సమయంలో కథాబలమున్న సినిమాలు రావడం రెండు మూడేళ్ళ క్రితం ప్రారంభమయ్యింది. అది కూడా పూర్తిగా కథని నమ్ముకుని కాదు- హీరోల్ని నమ్ముకునే. ఆ హీరోలతో సినిమాలు కూడా మట్టి కరిచాయి. నాకు తెలిసి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక్క సల్మాన్ ఖాన్  సినిమాలే అవెంత బ్యాడ్ గా ఉన్నప్పటికీ  ఆడుతున్నాయి. ఇదీ నేటి పరిస్థితి. ఇక ముందెలా వుంటుందో చెప్పలేను.
          కాబట్టి ఇప్పుడు నిర్మాతలూ స్టార్లూ కూర్చుని ఇంకేం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అక్షయ్  కుమార్ నటించిన ‘ఓ మై గాడ్’ వంద కోట్ల క్లబ్ లో చేరి వుండకపోతే ‘స్పెషల్ 26’ లో ఆయన నటించి వుండేవారే  కాదు. ‘ఓ మైగాడ్’ లో మెయిన్ క్యారక్టర్ వేసిన పరేష్ రావల్ ఎవరు? ఓ యాభై ఏళ్ల పెద్ద మనిషి. ఆయనతో కథాబలం వల్లే ఆ సినిమా హిట్టయ్యింది. ఎటు తిరిగీ కథని నమ్ముకోవాల్సిందే. అందువల్ల రచయితల మీద ఇప్పుడు  బరువు బాధ్యతలు బాగా  పెరిగాయి.

అంటే మీరనేది హిందీ సినిమాలు సౌత్ రీమేకుల మీదే ఎక్కువ ఆధార పడ్డాయనా?   

          అవును. ఇక్కడ హిందీ సినిమా పరిశ్రమని సరీగ్గా అర్ధం జేసుకోవాలి. పరిశ్రమ అనడంలోనే అది వ్యాపారమేగానీ కళ కాదని అర్ధమవుతోంది. ఎవరైనా కోట్ల రూపాయలు ఒక సినిమాకి పెడుతున్నారంటే సమాజ సేవ చేస్తున్నారని కాదు, వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్టు. కనుక ఆ పెట్టుబడి మీద రిటర్న్స్  ఉంటాయా లేదా అని ఆరా తీస్తారు. అప్పుడు సౌత్ సినిమా ఏదైనా హిట్టయ్యిందనుకోండి, దాని మీద దృష్టి పెడతారు. అది విజయవంతమైన హిట్ ఫార్ములా అని రుజువయ్యింది కాబట్టి- దాన్ని రిమేక్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయిని నమ్ముతారు. అందులో మంచి లాభాలు గడించాక ‘పాన్ సింగ్ తోమర్’, ‘బర్ఫీ’ లాంటి ఒరిజినల్ సినిమాలు  ఒకే నిర్మాత తీయడానికి ముందుకొస్తారు.

కథా బలమున్న సినిమాలకి ఇప్పుడు గుర్తింపు వస్తోందన్నారు, మరైతే రచయితల పరిస్థితేమిటి?
          నిజమే. ‘పాన్ సింగ్ తోమర్’ పూర్తయి విడుదల కాకపోవడం మా అందర్నీ ఆందోళన పర్చిన మాట వాస్తవం. ఏం చేయాలో అర్ధం గాలేదు. అప్పుడు దాని దర్శకుడు తిగ్మాంశూ ధూలియా,  మనమొక నలభై లక్షలు పెట్టి స్మాల్ మూవీ చేద్దామన్నారు. పారితోషికాలు తీసుకోకుండా లాభాలోస్తే పంచుకుందామన్నారు. ఈ అయిడియాతో కథల్ని అన్వేషించ సాగాం. ఒక రోజు నేను ‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’  (1962) చూస్తూ కూర్చున్నాను. అది నా అభిమాన సినిమా. చూస్తూంటే  దీన్ని ఈ కాలపు కథగా మారిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ సాహెబ్ సాహెబూ కాదు, బీవీ అతడి బానిసా  కాదు, ఎవరో ప్రేయసి వుంటే ఆమెకి గుర్తింపూ  వుండకూడదు.. ఇలా ఒక  కథ అల్లి తిగ్మాంశూకి విన్పించాను. అలా 40 లక్షల్లో దాన్ని తీసేశాం. దాంట్లో తెలిసిన నటులెవరూ లేరు. సినిమా విడుదలయ్యాకా అందరికీ కొత్తగా అన్పించింది. బలమైన కొత్త తరహా కథ, కొత్త రకం ట్రీట్ మెంట్, ఫీల్ వగైరా. మంచి బిజినెస్ జరిగింది. కొత్త ఐడియా తో తీస్తే ఆదరించే ప్రేక్షకులెప్పుడూ వుంటారు. 

       దీని సక్సెస్ తో ‘పాన్ సింగ్ తోమర్’ విడుదల కాగల్గింది. దీనికి ‘ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’ అని ట్యాగ్  లైన్ వేయాల్సి వచ్చింది. అప్పటికి కూడా అన్యమనస్కంగానే విడుదల చేశారు. పబ్లిసిటీకి రెండు వారాలు మాత్రమే టైం ఇచ్చారు. ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరో గా కమర్షియల్ అంశాలు లేకుండా ఒక నిజ కథ ఆధారంగా తీసిన సినిమా అది. విడుదలయ్యాల మంచి స్పందన వచ్చింది అన్ని వర్గాల నుంచీ. కాబట్టి కథా బలమున్న స్మాల్ మూవీస్ కి ఎప్పుడూ ఢోకా ఉండదని మరోసారి మా విషయంలో రుజువయ్యింది. ఇలాటివి సక్సెస్ అయినప్పుడు నిర్మాతలు రచయితలకి డీవీడీ కల్చర్ అప్పటికంటే ఎక్కువ మొత్తాలు చెల్లించడానికి సిద్ధ పడుతున్నారు. డీవీడీ రైటింగ్ అంటే మక్కీకి మక్కీ డైలాగులతో సహా దించడమే. ఇక రచయితలకి మానమర్యాద లెక్కడుంటాయి చెప్పండి. అప్పట్లో నేనెక్కడికి వెళ్ళినా నాకొక డీవీడీ ఇచ్చి రాసుకు రమ్మనేవారు. మొహం మీద వాళ్ళని ఏమనలేక, డీవీడీ తెచ్చుకుని చూస్తూ -నో ఇది నేను రాయను గాక రాయనని కేకలేయడమే!

డీవీడీల దశ నుంచి ఇప్పుడు కథాబలం దశకి వచ్చారు మీరు- ఈ మార్పెలా వుంది?
         
చూడండీ, జీవితంలో మన నిర్ణయాలు మనం  తీసుకోగల దశ కూడా ఒకప్పటి కొస్తుంది. మన ఛాయిస్ ని మనమే ఎంపిక చేసుకోగల మంచి రోజులూ వస్తాయి. ఇప్పుడు నేనున్న  స్టేజిలో ఇలా కూర్చుని నాకు నచ్చని వర్క్ కి నో చెప్పగల స్వేచ్చతో వున్నాను. అంటే ఏదో సాధించాననేగా? ‘పాన్ సింగ్ తోమర్’ సక్సెస్ తర్వాత ఒక నటీమణి నన్ను  పిల్చి తను ఒక జీవిత చరిత్ర తీయాలను కుంటున్నట్టు చెప్పారు. ‘పాన్ సింగ్ తోమర్’ జీవిత చరిత్రే కాబట్టి వీటిలో నేను ఎక్స్ పర్ట్ నని మార్కెట్లో వ్యాపించింది. ఆ నటీమణి చెప్పిన జీవిత చరిత్ర భావరీ దేవీ అనే ఆవిడది.  శరీరాన్ని పణంగా పెట్టి పనులు జరిపించుకుంటుంది, రాజకీయనాయకుల సరదాలు  తీర్చుకోవడానికి వాడుకుంటారు. అప్పుడామె డిమాండ్లు హద్దులు దాటడంతో వాళ్ళు ఇరుకున పడతారు. కథ సంక్లిష్టంగా తయారవుతుంది. ఇదంతా విని- అసలు మీరేం చెప్పాలనుకుంటు న్నారని ఆ నటీమణిని అడిగాను. మీ క్యారక్టర్ ఎవరు? ఏ క్యారక్టర్ తో జర్మీ చేస్తున్నారు కథలో? మంచి వాడెవడు? చెడ్డ వాడెవడు? అప్పుడేమిటి కథ? మీరేం స్టాండ్ తీసుకో దల్చారు చివరికి? పైగా  భావరీ దేవీ కథతో సినిమాలు తీసే ఆలోచనలో మరికొందరూ వున్నారు. వాటిలో మల్లికా షెరావత్ తో ఒకటి. ఆమెతో ఈ కథ అంటే సెక్స్ తో రెచ్చ గొట్టేదిగానే వుంటుంది. అందుకని ఈ కథతో ముందుకు వెళ్ళ వద్దని ఆవిడకి చెప్పాను. ఈ కథ నాకూ నచ్చలేదు కాబట్టి నేనూ రాయనని చెప్పేశాను. ఆవిడఅర్ధం జేసుకుని విరమించుకున్నారు. నేను నో చెప్పే పొజిషన్లో వున్నాను కాబట్టి ఒక బ్యాడ్ మూవీ కి రాయకుండా అలా తప్పుకోగలిగాను. 

మరి మీరు ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’ సీక్వెల్ కి ఎందుకు రాయడం లేదు?
          ఇంత త్వరగా సీక్వెల్ అంటే జీర్ణించుకోలేకపోయాను. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’ అనుకోకుండా హిట్టయింది. చీకట్లో రాయేసి చూశామంతే. అన్నిసార్లూ అలా జరక్కపోవచ్చు. అదీగాకా ఆ సినిమా తీయాల్సిన పరిస్థితి  వేరు. దాంతో మాకంత పేరొస్తుందని ఊహించను కూడా లేదు.  అలాటి హిట్ కి సీక్వెల్ అంటే దానికంటే ఎక్కువ అంచనాలుంటాయి ప్రేక్షకులకి. అప్పటికీ నేను తిగ్మాంశూతో కొంత స్క్రిప్ట్ వర్క్ చేశాను కూడా. కన్విన్స్ కాలేక తప్పుకున్నాను. నాకు తెలిసి ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’ , ‘పాన్ సింగ్ తోమర్’ ల తర్వాత  ‘మిలన్ టాకీస్’ తీయాలి. అప్పుడు మా రేంజి ఒకటొకటిగా ఎక్కడెక్కడికి చేరుకుంటుందో మార్కెట్ కి అర్ధమౌతుంది. ఇలాంటప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్లి సీక్వెల్ తీయడం మంచి నిర్ణయం కాదన్పించింది.

మళ్ళీ రచయితల విషయానికొస్తే, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి సరయిన చట్టా లున్నాయంటారా?
          లేవు. చట్టాలు చేసే ముందే వాటిని ఉల్లంఘించే మొనగాళ్ళు ఉన్నారిక్కడ. చట్టాల పట్ల ఇండియన్ల మైండ్ సెట్టే అది. కాపీరైట్ అని అంటూంటారు. రచయితగా ఇక్కడ పనిచెయ్యాలి, బతకాలి, డబ్బు సంపాదించాలి. సినిమా అంటే ఏమిటి? సినిమా అంటే మూలంలో ఒక అయిడియా లేదా కాన్సెప్ట్. కనుక ఏ నిర్మాతో దర్శకుడో తమతో రచయిత చర్చిస్తున్న సబ్జెక్టు  వాస్తవానికి ఒక అయిడియా అనీ, కాన్సెప్ట్ అనీ అనేసి, రాతపూర్వకంగా రిజిస్టర్ చేయించుకుంటే  రచయిత ఏం చేస్తాడు? అవే ఐడియాలూ కాన్సెప్టులూ ఎవరికైనా స్ఫురించవచ్చు కదా? స్క్రీన్ ప్లే, డైలాగులూ రాస్తే వాటిమీద హక్కులెలా అడుగుతాడు రచయిత? 
          పూర్వం కాంట్రాక్టులు ఉండేవి కావుగానీ విలువలు ఉండేవి. పరస్పర గౌరవ మర్యాదలుండేవి. అప్పుడు సరిపోయిది. ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి. అర్ధంకాని 10-15 పేజీల కాంట్రాక్ట్ మీద సంతకాలు చేయాల్సి వస్తోంది. అందులో వుండే న్యాయ పరిభాషని అర్ధం జేసుకోవడం మనవల్ల కాదు. లాయర్ అవసరం. ఎంతమంది రచయితలు  లాయర్లని భరించగలరు. కొత్త రచయితలు అసలేం మాటాడలేరు. నీకు వర్క్ కావాలంటే హక్కులన్నీ మాకుంటాయి, ఇష్టం లేకపోతే  థాంక్యూ వెరీ మచ్ గుడ్ బై - అనేస్తారు నిర్మాతలు. 
      మరి ఫిలిం రైటర్స్ అసోసియేషన్ (ఎఫ్ డబ్ల్యీవ్ ఏ) పాత్రేమిటి?
        మా హక్కుల్ని కాప్పాడ్డానికి వాళ్ళు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. చాలాసార్లు సక్సెస్ అయ్యారు. కానీ ఆ డబ్బెవరివ్వాలి? నిర్మాతలేగా? అసోసియేషన్ వాళ్ళు మాత్రమేం చేయగలరు? అలాంటి కాంట్రాక్టుల మీద సంతకాలు చేయవద్దని మాత్రం చెప్తూంటారు. చేయకపోతే అసోసియేషన్ మా వైపుంటుంది. మరి సంతకం చేయకపోతే- నీతో మాకు పనేం లేదు వెళ్ళచ్చని నిర్మాతలంటారే- ఎలా? అసోసియేషన్ ఏం చేస్తుంది?
రచయితలకి సామాజిక బాధ్యతా అవసరమంటారా?
         
మనం ఏం చెప్తున్నామో అది ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సామాజిక బాధ్యత అవసరమే.
కొత్త రచయితలకి మీరిచ్చే సలహా?
          ఏం రాయాలనుకున్నారో అది రాసెయ్యాలి. కొన్నిసార్లు డబ్బు అవసరం కొద్దీ నానా చెత్తా రాయాల్సి వస్తుంది. తప్పదు. ఆసియాలోనే ఖరీదైన నగరం ముంబాయి. ఇక్కడ బతకడం కష్టం. పోతే కాపీ చేయడం గానీ, ఇతరుల్లా రాయాలనుకోవడం గానీ చేయకుండా వుంటే మంచిది. ఏదైనా రచయిత తనలోంచి వచ్చిన దైతేనే ఎంజాయ్ చేస్తూ రాయగలడు. ఎవరి సినిమా కూడా బ్యాడ్ అని తప్పుబట్ట కూడదు. మంచి చెడ్డలు విశ్లేషించుకుంటే ప్రయోజనం వుంటుంది. ఎవర్నీ ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సినిమా తీస్తున్నప్పుడు దాన్ని నమ్మే తీసివుంటారు.
*
29, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఇంకో కామెడీ లడాయి!రచన- దర్శకత్వం : శరత్ రెడ్డి
తారాగణం : ధీర్ చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్ ఖాన్, కావ్యా రెడ్డి, ఫారుక్ ఖాన్ తదితరులు.
మాటలు : ఫారుక్ ఖాన్, సంగీతం : శ్రవణ్, ఛాయాగ్రహణం : సృజన్ రెడ్డి పింగళి
నిర్మాత :  బి ఆర్ కె
విడుదల : 18 సెప్టెంబర్, 2015
***
          హైదరాబాద్ లోకల్ కామెడీలు ఒక ట్రెండ్ లాగా కొనసాగుతున్నాయి. ఓల్డ్ సిటీ ‘డెక్కన్ వుడ్’ కేంద్రంగా ఇవి ఏ బాలీవుడ్ కీ, టాలీ వుడ్ కీ చెందని సినిమాలుగా గత పదేళ్లుగా ఉత్పత్తి అవుతున్నాయి. ‘అంగ్రేజ్’ అనే తొలి హిట్ కామెడీ తో తెలంగాణాలో, తెలంగాణా సరిహద్దుల్లో కర్నాటక, మహారాష్ట్ర జిల్లాల్లోనూ మార్కెట్ ని పెంచుకుని  ‘హైదరాబాద్ నవాబ్స్’, ‘హంగామా ఇన్ దుబాయి’, ‘హైదరాబాద్ బకరా’ ...అంటూ అడపాదడపా విడుదలవుతూనే ఉన్నాయి. అటు పూర్తి హిందీ కాని- ఇటు ఉర్దూ కాని యాసలో (అక్కడక్కడా కొన్ని తెలుగు మాటలతో) అచ్చ హైదరాబాదీ ప్రజలు మాట్లాడే భాషలో ఇవి పాపులరవుతున్నాయి. వీటిలో కామెడీకి అంతుండదు. ఓల్డ్ సిటీ ఉర్దూ హాస్య కవితలకీ, నాటికలకీ ఎంత ప్రసిద్దో, స్థానిక ప్రజల్లో ఈ సినిమాలంత ప్రసిద్ధ మవుతున్నాయి. వీటిలో పాత్రలు ధరిస్తున్న చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్ ల వంటి వాళ్లకి ఇప్పటికే అభిమానులేర్పడ్డారు. 

          శరత్ రెడ్డి రచన, దర్శకత్వం వహించిన ప్రస్తుత హైదరాబాదీ కామెడీ ‘గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ ఓ రెండు గంటలసేపు బాగా నవ్వుకోవడానికి పనికొచ్చే లోకల్ దాదాల హంగామా. హైదరాబాద్ నగర జీవితం, ఆచారాలు, యాస, హైదరాబాదీ జోకులూ తెలిసిన వాళ్లకి మంచి ఎంజాయ్ మెంట్. 

        ఈ కామెడీకి క్రికెట్ ని టార్గెట్ చేశారు. రెండు గ్యాంగులు వాళ్లిష్టమొచ్చినట్టు క్రికెట్ ఆడుకుని తన్నుకునే కథ ఇది. ఈ క్రికెట్ కి దారితేసేది ఒకమ్మాయి. ఈమెని పీస్ (piece)గా పిలుచుకుంటారు. 

          ఓల్డ్ సిటీలో చిన్నప్పుడు ఇస్మాయిల్ (ధీర్ చరణ్ శ్రీ వాస్తవ్), గుల్లూ (అద్నాన్ సాజిద్ ఖాన్) లిద్దరూ ప్రాణ మిత్రులు. ఒకరికి కష్టమొస్తే ఇంకొకరు తట్టుకోలేరు. ఒకరి మీద ఎవరిదైనా చె య్యిపడిందో, ఆ మరొకరి చేతిలో వాడిపని ఖతమే. అలాటి జిగ్రీ దోస్తులు బద్ధ శత్రువులైపోతారు. కారణం స్కూల్లో ఓ పిల్ల ఇద్దర్నీ ఆకర్షించడం. పెద్దయ్యాకా వాళ్ళ జీవితంలో ఆ పిల్ల వుండదు గానీ, శత్రుత్వం అలాగే వుంటుంది. 

          ఇప్పుడు ఇస్మాయిల్ భాయ్ గా ఒకడు, గుల్లూ దాదాగా మరొకడూ గ్యాంగ్స్ ని ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న వ్యాపారులదగ్గర వసూళ్ళ దందా చేస్తూంటారు. ఎప్పుడైనా ఎదురెదురు పడితే జబ్బలు చరుచుకుని, తొడలు కొట్టుకుని ఛాలెంజి చేసుకోవడమే తప్ప కొట్టుకునేది వుండదు. ఒకడు అరిస్తే ఓల్డ్ సిటీ దద్దరిల్లుతుందని అంటే, మరొకడు అరిస్తే మొత్తం తెలంగాణాయే  దద్దరిల్లుతుందని సవాళ్లు విసురుకుంటారు. జీవితంలో వీళ్ళు ఒక్క సారైనా కొట్టుకుంటే కళ్ళారా చూసి చచ్చిపోవాలని ఓ ముసలాయన ఉబలాట పడుతూంటాడు.

          హీరో (ఫారుక్ ఖాన్) అనీ ఒక సినిమా పిచ్చోడుంటాడు. హీరో కావాలన్న కోరికతో అడ్డదిడ్డమైన యాడ్స్ ఫిలిమ్స్ లో నటిస్తూంటాడు. ఆ  యాడ్ ఫిలిం మేకర్ యాభై వేలు తెచ్చిస్తే హీరోగా అవకాశ మిప్పిస్తానంటాడు. చేతిలో చిల్లిగవ్వ వుండదు. దాదా లిద్దరూ హెల్ప్ చేయరు. అప్పుడు ఒక అందమైన అమ్మాయి (కావ్యా రెడ్డి) ని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఆమె వెంట  పడి తిరుగుతూంటాడు. ఆమెకూడా అతణ్ణి ప్రేమిస్తూంటుంది. ఇంట్లో హీరో తల్లి పెళ్ళికి తొందర పెడుతూంటుంది. కానీ తన అభిమాన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోనంతవరకూ తను చేసుకోనని మొండి పట్టుదలతో ఉంటాడు. ఇప్పుడీ అమ్మాయిని ప్రేమించాక అర్జెంటుగా పెళ్లాడాలన్పిస్తోంది. కానీ అమ్మాయి తక్కువదేం కాదు- ముందు డబ్బులు సంపాదించి చూపించమంటోంది.

       ఇలావుండగా, ఓసారి వసూళ్ళ కి బయల్దేరిన  ఇస్మాయిల్ కి ఇదే అమ్మాయి కన్పించేసరికి ఫ్లాట్ అయిపోతాడు. గుల్లూ కూడా ఈమెని  చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇద్దరికీ ‘పీస్’ బావుందన్పిస్తుంది. ఈ ‘పీస్’ ఎవరో తెలీని హీరో ఆమెని తెచ్చి లింకప్ చేస్తానని ఇద్దరి దగ్గరా డబ్బులు లాగుతూంటాడు. తీరా చూస్తే  ఆ ‘పీస్’ తను ప్రేమిస్తున్న అమ్మాయేనని తెలిసి మాయమైపోతాడు. 
ఇలాకూడా దాదాలు వదిలి పెట్టరని- ఇద్దరూ ఒకే ‘పీస్’ ని ప్రేమిస్తున్న సంగతి బయట పెట్టేసి, ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తాడు. ఇద్దరూ భగ్గుమంటారు. మళ్ళీ చిన్నప్పటి అమ్మాయితో కథలాంటిదే రిపీట్ అవుతుంది. ఇక ఓల్డ్ సిటీలో వీళ్ళ వల్ల శాంతిభద్రతలు దెబ్బ తింటున్నాయని ఇంకో ప్లానేస్తాడు హీరో. ఇద్దరూ క్రికెట్ ఆడుకుని ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆ ‘పీస్’ అని ఆశ పెడతాడు.

      ఈ కామెడీకి వున్న ప్రధాన  లక్షణమేమిటంటే, చకచకా కథ ముందుకి సాగిపోతూ వుండడం. ఫస్టాఫ్ లో ఒకమ్మాయి- ముగ్గురు ప్రేమికుల మధ్య ఎన్ని డైనమిక్స్ ఉంటాయో- సెకండాఫ్ లో దాదాపు గంటపాటు ఆడుకునే క్రికెట్ లో అన్ని మలుపులుంటాయి. ఈ క్రికెట్ కి ఏ రూల్సూ వుండవు. టాస్ వేసిన దగ్గర్నుంచీ గొడవలే. ఈ గొడవలు రూల్స్ అతిక్రమిచారని ఎదుటి టీముతో కాదు, రూల్స్ ప్రశ్నే తలెత్తదు. అంపైర్ దిష్టి బొమ్మలా నిలబడి చూస్తూంటాడు. గొడవలు సొంత టీములో ఎవరైనా సరీగ్గా ఆడకపోతేనే. అప్పుడు ఉరికించి ఉరికించి కొడుతూంటారు ఇస్మాయిల్, గుల్లూ తమ టీం ప్లేయర్స్ ని. ఇస్మాయిల్ బ్యాటింగ్ చేస్తే కూడా మామూలుగా  వుండదు- అతను సిక్సర్ కొట్టడు,  సిక్స్ కిలోమీటర్స్ కొడతాడు. బాల్  వెళ్లి ఎర్రగడ్డలో పడేట్టు, లేదా చంద్రాయణ గుట్టలో పడేట్టు. గుల్లూ బౌలింగ్ ప్రావీణ్యం మరొకెత్తు. గుండ్రంగా, అర్ధచంద్రాకారంలో, అడ్డంగా, నిలువుగా ఎలాగైనా పరుగెత్తుకొచ్చి కన్ఫ్యూజ్ చేసేస్తూ బౌలింగ్ చేస్తాడు. ఇక ఈ టీములో కాసేపు, ఆ టీములో కాసేపూ వుండి హీరో ఆడేస్తూంటాడు. దీనికి మందు కొడుతూ ఒకడు కామెంటరీ చెప్తూంటాడు. 

       ఆట ఊపందుకుంటుంది. గుల్లూ ఓడిపోతూంటాడు. అప్పుడు ఇంకో యంగ్ దాదా తన గ్యాంగ్ తో వచ్చేస్తాడు. ఇతను కూడా ఆ ఆమ్మాయిమీదే కన్నేశాడు. ఇప్పుడు వచ్చేసి సీనియర్ దాదా లిద్దర్నీ తన్నడం మొదలెడతాడు. పోలీసులొస్తారు. అమ్మాయితో హీరో బాలీవుడ్ కి పారిపోతాడు. చివరికి ఒక నీతిని తెలుసుకుంటారు దాదాలు : ఇలా అమ్మాయి కోసం ఫ్రెండ్ షిప్ ని చెడగొట్టుకో వద్దని.         

          దర్శకుడు శరత్ రెడ్డి ఓల్డ్ సిటీ శివారులో మరీ పూర్ లోకేషన్స్ లో షూట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో షూట్ చేసివుంటే నేటివిటీ కన్పించేది. ఒక్క చార్మినార్ ని చూపించేసినంత మాత్రాన నేటివిటీ రాదు. మిగతా కథా కథనాలు, కామెడీ, చిత్రీకరణా ఓకే. సందర్భానికి తగ్గట్టు హిందీ తెలుగు సినిమా పాటల బిట్లు పెట్టారు. సంగీతం ఓమాదిరిగా వుంది. కెమెరా వర్క్ బావుంది. అంతంతమాత్రం గ్లామర్ వున్న లోకల్ టాలెంట్ కావ్యా రెడ్డి కి ప్రథమార్ధంలోనే పాత్ర. సెకండాఫ్ లో ఎక్కడా కన్పించదు. చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్, ఫారుక్ ఖాన్ ల టైమింగ్, కామిక్ సెన్స్ ఈ సినిమాకి ఉత్తేజాన్ని తీసుకొస్తాయి. 

-సికిందర్

                    

 


ట్రీట్ మెంట్ శాంపిల్...

‘అన్నా, నీకో మంచి ఆఫరొచ్చింది’ - అంటూ వచ్చేశాడు డోసుబాబు తూలుతూ. 
        మాణిక్యం లాప్ టాప్ లో గూగుల్ ఎర్త్ లో బ్యాంకాక్ ని జూమ్-ఇన్ చేసి శ్రద్ధగా చూస్తున్నాడు. ‘నేను ఇండియాలో వుండట్లేదురా’ అన్నాడు. ‘లేదన్నా, ఫారిన్ నుంచి వచ్చిన ఎన్నారై అమ్మాయి- టెన్నిస్ అంటే చాలా ఇష్టం. కానీ ఆడాలంటే ఇంట్లో ఆడేటోళ్ళంతా సెంటిమెంట్లతో ఆమెనే గెలిపించేస్తున్నారు. అలాటి గెలుపు ఆమె కొద్దట అన్నా...ఏ సెంటి మెంటూ లేనోడితో ఆడి  గెలిస్తేనే నిజమైన గెలుపట..’ అంటున్న వాడితో- ‘నేను సెంటిమెంట్లు లేని గొడ్డు ని అని డిసైడ్ అయిపోయావా?’ అన్నాడు మాణిక్యం.
         ‘నీ దగ్గర క్యాషియర్ గా ఉన్నప్పుడు, నీ కోటి రూపాయలు పోగొడితే, నువ్వు తన్ని వెళ్ళ గొట్టినా నేనలా అనుకోలేదన్నా’ అని ప్రామీజ్ చేశాడు డోసుబాబు.
 
        ‘ఆ ఫ్యామిలీతో నీకే రిలేషనూ లేనప్పుడు సెంటి మెంట్లు ఉండవ్- అందుకని నువ్వు కరెక్ట్ –‘అన్నాడు మళ్ళీ డోసుబాబు.
        ‘ఒకవేళ ఆ అమ్మాయిని చూసి నాకు సెంటిమెంట్లు పుట్టేస్తే?’ అన్నాడు మాణిక్యం. ‘పుట్టవన్నా..నువ్వు మలేషియా వెళ్ళిపోతున్నావ్..నువ్వు మలేషియాని వదులుకుని ఇక్కడే వుండి పోవు, ఛాలెంజ్’ అన్నాడు డోసుబాబు. నవ్వి, ‘చూద్దాం’ అన్నాడు మాణిక్యం.
        అప్పుడు అటు కట్టేసి వున్న కుమార్ వైపు చూసి- ‘ఈడి కతేందన్నా?’ అన్నాడు డోసుబాబు.     ‘ఆడు కూడా నన్నొదిలేసి పోడు..ట్రై చేసి చూడు- వాడికి మందూలేదు ముక్కా లేదు’ అన్నాడు మాణిక్యం.
        డోసుబాబు తినిపిస్తున్న ముక్కలు ఆబగా తినేస్తూ- పోస్తున్న మందు గటగటా తాగేశాడు కుమార్. డోసుబాబు కట్లు విప్పేసి వెళ్లి పొమ్మన్నాడు. కుమార్ లేచి నాలుగడుగు లేసి- మందెక్కువై తూలి పడి పోయాడు. మరిక  లేవలేదు.
        ఇద్దరూ అతన్నే చూడసాగారు విషాదంగా.
***

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

కమర్షియలార్ట్!


రచన - దర్శకత్వం :  అశ్విన్ శరవణన్
తారాగణం : నయనతార, లక్ష్మీ ప్రియ, ఆరి, అంజద్ ఖాన్,
మైమ్ గోపి
, ఉదయ్ మహేష్, రోబో శంకర్ తదితరులు.
సంగీతం : రాన్ ఎథాన్ యోహాన్
, ఛాయాగ్రహణం : సత్యన్ సూర్యన్,
కూర్పు : టీఎస్ సురేష్
, కళ : రామలింగం
బ్యానర్ : సీకే ఎంటర్ టైన్ మెంట్స్- శ్రీ శుభ శ్వేతా ఫిలిమ్స్
నిర్మాతలు :
స్వెట్లానా, వరుణ్, తేజ, సీవీ రావ్
విడుదల : 17 సెప్టెంబర్ 2015
***
          హార్రర్ ర్ సినిమాలు ఈడులో వున్న ఆడ దెయ్యాలతో హార్రర్ కామెడీలుగా మారిపోయి మార్కెట్ ని ముంచెత్తు తున్నప్పుడు సీరియస్ హార్రర్ ని ఎవరైనా చూస్తారా?
దమ్మున్న హార్రర్ చూడాలనుకునే మనసున్న  ప్రేక్షకులు తప్పక చూస్తారు. 
ఆ హార్రర్ అడుగడుగునా కొత్త లోకాల్లోకి విహరింప జేస్తూంటే సంలీనమైపోయి 
సీట్లకి అతుక్కుపోతారు- ఆసాంతం మెస్మరైజ్ అయి సినిమాతో బాటే ఓ 
మిస్టికల్ జర్నీ చేసి, ఆత్మసంతృప్తితో తెప్పరిల్లుతారు ఆఖర్న! 
మనలోకి మనం ప్రయాణం చేసేలా చేసేదే మీనింగ్ ఫుల్ సినిమా- క్వాలిటీ సినిమా అని కదా? దీనికెందుకు నోచుకోవడం లేదు టాలీవుడ్ నించీ తెలుగు ప్రేక్షకులు ఎంతకీ? 

          తెలుగు సినిమాలెలా తీస్తున్నారంటే, కథ అంటేనే భయపడిపోతున్నారు- దాని లోతుల్లోకి వెళ్లి చెప్పే సంగతి తర్వాత! ఆ లోతుపాతుల్లోకి  ప్రేక్షకుల మస్తిష్కాల్ని దిగ్గొట్టి ఇదిరా నువ్వు చూడాల్సిన సినిమా అని  చెప్పే సంగతి కూడా దేవుడెరుగు- మానసికంగా కాన్షస్ వరల్డ్ లో మజా చేసే మనిషి ఇగో,  ఎలాగైతే ఆ ‘రెండో మనసు’ అనే సబ్ కాన్షస్ ప్రపంచంలోకి అడుగెట్టాలంటేనే  భయపడి చస్తుందో - అలా సినిమా కథలోకి వెళ్ళాలంటేనే బెదిరిపోతూ,  పైపైనే కామెడీల  పేరుతో కాలక్షేపం చేస్తూ- సగం సినిమా నడిపేశాకైనా సీరియస్ గా కథలోకి వెళ్ళే ధైర్యం చేయలేక- మళ్ళీ ‘కన్ఫ్యూజ్ కామెడీ’ ల అతుకులతో పనికానిచ్చేసి- చిట్ట చివర్న ఏదో పిసరంత కథని విదిల్చి వెళ్ళిపోతున్నారు

          ఈ ధోరణికి సమాధానంగా ‘మయూరి’  అనే తమిళ హార్రర్ డబ్బింగ్ వచ్చింది. గ్రోఅప్ మాన్! గ్రోఅప్- అని తెలుగు సినిమాకారుల కర్తవ్యాన్ని బోధిస్తోంది. ప్రేక్షకుల్ని చవకబారు మనుషులుగా ట్రీట్ చేయకండి- నకిలీ నోట్లేమీ ఇవ్వడం లేదు వాళ్ళు- నిఖార్సైన  సరుకివ్వండని ప్రభోదిస్తోంది. దెయ్యం సినిమా వేదాలు వల్లించడ
మేమిటన్పిస్తే, దేవుడుకూడా ఫ్లాపుల బారినుంచి కాపాడలేడు. 

          కేవలం 24 ఏళ్ల  సాఫ్ట్ వేర్ ఇంజనీర్- కమ్-  షార్ట్ ఫిలిమ్స్ మేకర్ అశ్విన్ శరవణన్ దర్శకుడుగా తన మొదటి సినిమాని దేశవ్యాప్తంగా ఇంత చర్చకి దారితీసేట్టు తీయగలిగాడంటే (తమిళంలో ‘మాయ’)  కాపీకొట్టి మాత్రం కాదు. ‘మయూరి’ లాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడైనా ఉండుంటే దాన్ని కాపీ కొట్టడం ఎవరివల్లా కాదు. కాపీ చేస్తే ఇలాటి క్రియేషన్ పుట్టదు. పర్సనల్ టే స్ట్ తోనే ఇలాటి ఒరిజినాలిటీ తొణికిసలాడే క్రియేషన్ సాధ్యమవుతుంది. మామూలు కొరియన్ యాక్షన్ సినిమాలనే ఉన్నదున్నట్టు కాపీ కొట్టలేక చతికిల బడుతున్న నేపధ్యంలో- ఎక్కడో చూసి కాపీకొట్టి
మయూరిని తీయడం అసలు సాధ్యంకాదు- ఆస్కార్ విన్నర్ ‘చికాగో’ ని కాపీ కొట్టి అలాగే తీయగలరా? అలా కాపీకి అందనిది ‘మయూరి’ కాన్సెప్ట్- దాని విజువల్ వండర్. మొదటి నాల్గు రోజుల్లో తమిళనాడులో ఆరుకోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.75 కోట్లు ( షేర్) వసూళ్లు సాధించిందని-‘ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్’ రాసింది. నయనతార పారితోషికానికే  తప్ప నిర్మాణానికీ, ప్రచారానికీ పెద్దగా వెచ్చించిందీ లేదనీ పేర్కొంది. ఇది చిన్న సినిమా ఘన విజయం. చిన్న సినిమాకి ‘ గాఢమైన విషయం’ తోనే విజయాలు. ఇంకో పదికోట్ల దాకా శాటిలైట్ హక్కులు రావచ్చని ట్రేడ్ వర్గాల అంచనా కూడా. 

          నయనతారతో ఈ హార్రర్ కి స్టార్ అప్పీల్ వచ్చింది. ఆమె పాత్ర ఈ హార్రర్ థ్రిల్లర్లో ‘అనామిక’ చేదు అనుభవాన్ని మరపించే గుర్తుండి పోయే పాత్రే. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే ఇలా ఆత్మజ్ఞానం కోసం పాత్ర ప్రయాణంగా ఎప్పుడొస్తుందోనని కళ్ళుకాయలు చేసుకుంటున్న అభిజ్ఞుల కొరతంతా  తీర్చేస్తుంది. 

మైండ్ మేనేజ్ మెంట్ 
        యూరి ( నయనతార) సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూండే ఛోటా నటి. వెంట ఓ ఏడాది చంటి బిడ్డ. ఈ బిడ్డకోసం రెండు త్యాగాలు చేసింది- భర్తని, కెరీర్ నీ. తనలాగే సినిమా ప్రయత్నాలు చేస్తున్న అర్జున్ (ఆరీ) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతలోనే గర్భవతయ్యింది. అతను మండిపడ్డాడు. ఆమెకి హీరోయిన్ గా అవకాశా లిప్పిద్దామనుకుంటున్న అతడికి ఈ పరిణామం రుచించలేదు. అబార్షన్ చేయించుకోమన్నాడు. ఒప్పుకోలేదు. వదిలేసి వెళ్ళిపోయాడు.
          ఈ గతం, ఇప్పుడు ఏడాది కూతురు, కనిపించని భవిష్యత్తూ, పోగుపడిన అప్పులూ  ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న స్వాతి ( లక్ష్మీ ప్రియ) ఫ్లాట్ ని షేర్ చేసుకుని కాలం గడుపుతోంటే, పగటి దెయ్యంలా తలుపులు బాదేసి బీభత్సం సృష్టిస్తున్నాడు అప్పులాడో పక్క.

          ఈ నేపధ్యంలో ముందు అప్పు తీర్చెయ్యాలని  తను యాడ్ ఫిలిం లో నటించిన, ఓ ప్రొడ్యూసర్ నుంచి రావాల్సిన చెక్కుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూంటుంది. ఆ ప్రొడ్యూసర్ ఫోనే ఎత్తడు. ఇక ఆఖరి వార్నింగ్ ఇచ్చేస్తాడు అప్పులాడు. 

          ఆర్కే (మైమ్ గోపి) అని ఒక సినిమా దర్శకుడు ఉంటాడు. ఇతను ‘చీకటి’ అని హార్రర్ సినిమా తీసి ఏడు నెలలుగా అది విడుదలకాక వర్రీ అవుతూంటాడు. పబ్లిసిటీ కోసం ఓ ఆలోచన చేసి, తన హార్రర్ సినిమాని రాత్రిపూట థియేటర్లో ఒంటరిగా కూర్చుని భయపడకుండా చూసిన వాళ్లకి ఐదు లక్షలు బహుమానమని ప్రకటిస్తాడు. ఇది మయూరిని ఆకర్షిస్తుంది అప్పు తీర్చెయ్య
డానికి.

          స్వాతి పనిచేస్తున్నది కూడా ఈ సినిమాకే. ఆమె వారిస్తుంది. బిడ్డ నుంచుకుని ఇలాటి సాహసాలు  చేయవద్దంటుంది. మయూరి విన్పించుకోదు. అప్పుడే ఒక ప్రొడ్యూసర్  ఛాలెంజింగ్
గా తీసుకుని ఆ హార్రర్ ని ఒంటరిగా చూసేందుకు సిద్ధమైపోతాడు. అప్పుడొక ఊహించని పరిణామంతో ఆ సీనులోకి మయూరి ఎంటరైపోతుంది. రాత్రిపూట ధైర్యంగా థియేటర్ లో ఒంటరిగా కూర్చుని, ఆ సినిమా చూడ్డం మొదలెడుతుంది...ఇలా సినిమా మొత్తం చూసేసి, ఆ బహుమతి మొత్తం దక్కించుకుందా, లేక ఏదైనా ప్రమాదం కొని తెచ్చుకుందా అన్నది ఇక్కడ్నించీ మిగతా పట్టుసడలని కథ. కానీ ఈ చెప్పుకున్నంత సాదాగా వుండదు తెరమీద చూసే టప్పటికి కథ. ఎన్నో పొరలు, ఇంకెన్నో పరదాలు తీస్తున్న కొద్దీ బయల్పడే నిగూఢ రహస్యాలు- మైండ్ మేనేజి మెంటూ ఈ సింపుల్ పాయింటుని పరివేష్ఠించి వుంటాయి. 

ఎవరెలా చేశారు          హార్రర్ కామెడీలు కల్గిస్తున్న అభిప్రాయం పుణ్యాన నయనతార కూడా ఇందులో దెయ్యంగా భయపెడుతుందేమో నని, ఆశతో ఈ సినిమా కెళ్ళే వాళ్ళు ఎక్కువమంది వున్నారు.  వాళ్లకి ఎదురు చూడని షాకిస్తుంది నయనతార. తనెందుకు  దెయ్యంగా నటించాలి? ప్రేక్షకుల ప్రతినిధి కదా తను, తనతో బాటు వాళ్ళనీ  ఆత్మల లోకంలో విహరింప జేయాలి- ఏ హార్రరూ కల్గించని దివ్యానుభూతితో తిరిగి వాళ్ళ ప్రపంచంలోకి తెచ్చి వదిలిపెట్టాలి. దెయ్యాల్ని దండిం చడానికి దేవుడి సహాయం తీసుకునే బాపతు దివ్యానుభూతి కాదు, లేదా మహేష్ భట్ ఆనాడు తీసిన సూపర్ హిట్ మ్యూజికల్ హార్రర్ ‘రాజ్’ లో ప్రేతాత్మకి సతీసావిత్రి మెటాఫర్ గా హీరోయిన్ తో పోరాటం పెట్టినప్పడు, ఆ మిథికల్ ( పౌరాణిక) షుగర్ కోటింగ్ కి, ఆడా మగా తేడాలేకుండా ప్రేక్షకులందరూ తీర్చుకున్న ఆత్మిక దాహంలాటి దివ్యానుభూతి కూడా కాదు- చక్కగా తమలోకి తామూ ప్రయాణించి  సత్యాన్ని కనుగొనేప్పటి అనిర్వచనీయమైన దివ్యానుభూత్యి అది! ఇంతకంటే నటించే పాత్రకి ప్రయోజనం లేదు, పరాకాష్ఠ లేదు. నయన్ కెరీర్ లోనే ఎన్నదగ్గ పాత్ర ఇది. 

               ప్రేమలు, పాటలు, కామెడీలూ ప్లస్ గ్లామర్ ప్రదర్శనా- ఇది కాదు సినిమా అంటే అని కూడా ప్రతిపాదిస్తూ సగటు సింగిల్ మదర్ స్ట్రగుల్ ని అత్యంత సహజంగా కళ్ళ ముందుంచింది. క్లయిమాక్స్ లో అంత బీభత్సంలోనూ ఫేసు బ్లాంక్ గా పెట్టిందనీ,  ఏ భయమూ- బాధా లేని కార్డ్ బోర్డు తనంతో లాగించేసిందనీ ఓ పక్క విమర్శ వుంది. అది విమర్శలో పొరపాటు. ఆ పరిస్థితిలో ఆమె పాత్ర ఏ  టైం అండ్ స్పేస్ లోకి ఎంటరయ్యిందో అర్ధం జేసుకోవడంలో వేసిన పప్పులో కాలు.  ఆ మొత్తం భయానక పరిస్థితిలో తను ప్రేక్షక మాత్రురాలిగా- ఓ సాక్షిగా మాత్రమే ఉంటూ గమనిస్తోంది సంఘటనల క్రమాన్ని. రెండోది, ఆ సమయంలో తను చూస్తున్నదంతా థియేటర్ లో కూర్చుని సినిమా! దానికి షరతు- భయపడకుండా, బీపీ పెరగకుండా చూడాలని! అందుకే ఫేసులో ఆ నిర్లిప్తత. బహుమతి పట్ల నిబద్ధత. 


          ఇక ఇతర పాత్రల వ్యవహారం మరీ మిస్టీరియస్ గా వుంటుంది. ప్రతీ పాత్రకీ ఒక గోల్ వుంటుంది. ఆ గోల్స్ తో సినిమా దర్శకుడిగా నటించిన మైమ్ గోపి పక్కా ప్రొఫెషనల్ గా, పత్రికా  ఎడిటర్ అంజద్ ఖాన్ పక్కా విలన్ గా; నిజ జీవితంలోనూ, ‘చీకటి’ అనే ఆ సినిమాలోనూ గమ్మత్తయిన పాత్రలు పోషించే ఆరి, సినిమా చూడడాని కొచ్చే నిర్మాతగా జీఎం కుమార్...ఇలా మొత్తం  పత్రికా- సినిమా రంగాలకి చెందిన పాత్రల్లో వీళ్ళందరూ, ఫారెస్ట్ ఆఫీసర్ గా రోబో శంకర్  ని కలుపుకుని ఓ గూడుపుఠాణీ నడిపిస్తూ - సస్పెన్సూ మిస్టరీ నిలువెల్లా పులుముకుని కన్పిస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా లక్ష్మీ ప్రియ నటన కూడా దృష్టి నాకర్షిస్తుంది. 

          మల్టిపుల్ ఫార్మాట్ లో అంటే తెలుపు నలుపులో, రంగుల్లో సమాంతరంగా సాగే ఈ హార్రర్ థ్రిల్లర్ కథ డిమాండ్ చేస్తున్న వెలుగు నీడల మిస్టీరియస్ వాతావరణాన్ని అత్యంత ప్రతిభావంతంగా కెమెరాతో పట్టుకోగల్గిన సత్యన్ సూర్యన్, ఆ వాస్తవ (కలర్), కాల్పనిక (తెలుపు నలుపు)  కథల తాలూకు ఫుటేజిని తికమక పెట్టకుండా సాఫీగా, టెర్రిఫిక్ గా ఎడిటింగ్ చేసుకొచ్చిన ఎడిటర్ ఎస్. సురేష్; సినిమాలో సినిమాగా నడిచే కథలో చిత్రకళతో, అసలు సినిమాలో దృశ్యకళతో క్లాసిక్ లుక్ తీసుకొచ్చిన కళాదర్శకుడు రామలింగం, గుబులెత్తించే శబ్ద ఫలితాలతో హార్రర్ వాతావరణాన్ని పరివ్యాప్తం చేసిన సౌండ్ డిజైనర్స్ సచిన్ సుధాకరన్- హరిహరన్ లు, హార్రర్ ఓరియెంటెడ్ పాటలతో, నేపధ్య సంగీతంతో రాన్ యోహాన్ అనే కొత్త సంగీత దర్శకుడూ..స్టంట్ కోరియోగ్రాఫర్ అంరబీ...ఇలా వీళ్ళందరూ కంటెంట్ తో పోటీపడుతూ పనిచేశారు. సినిమాలో సరయిన కంటెంట్ లేక సాంకేతికుల టాలెంట్ అంతా వృధా పోయే సందర్భాలే ఎక్కువ ఉంటున్నాయి చాలాకాలంగా. ఈసారి ఇది జరగలేదు.  

స్క్రీన్ ప్లే సంగతులు 
        స్క్రీన్ ప్లేల్లో కథనానికి క్రియేటివిటీ అనగానే ఫ్లాష్ బ్యాకులతో సీన్లు వేయడం మొదలెడతారు ఉత్సాహంగా. సినిమాని ఫ్లాష్ బ్యాక్ తో ఓపెన్ చేసేద్దాంరా, ఫలానా చోట మధ్యలో ఆపేసి ఓ ఝలక్కిద్దాం, ప్రెజెంట్ లో కొచ్చేద్దాం.. అప్పుడా మిగతా ఫ్లాష్ బ్యాక్ వుంటుందే, దాని కోసం గింజుకు చావాల్రా సినిమా చూసే చవటలూ ...లాంటి నెవర్ గ్రీన్ నెగెటివ్ డిస్కషన్సే చేస్తారు. ఫలితం 90 శాతం అట్టర్ ఫ్లాప్స్ క్లబ్ లో ఘరానాగా అలవాటైన గ్రాండ్ ఎంట్రీ! టాలీవుడ్ కి ఇంకో కంత్రీ!! 

          ‘మయూరి’ దర్శకుడి విజన్ వేరు. షార్ట్ ఫిలిమ్స్  తీసివున్న దర్శకులు కమర్షియలేతర విదేశీ సినిమాల ప్రభావంతో ఔటాఫ్ బాక్స్ మూవీస్ అందిస్తున్నారు.  తెలుగులో ‘రన్ రాజా రన్’ తీసిన షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు సుజీత్ ని చెప్పుకోవచ్చు.  ‘మయూరి’ దర్శకుణ్ణి చూస్తే, ఓవరాల్ గా ‘మయూరి’  సినిమా మేకప్ అంతా కమర్షియల్- యూరోపియన్/ అవాంట్ గార్డ్/ నాయిర్ సినిమాల కలబోతగా  తెలిసిపోతుంది. కమర్షియల్ సినిమాని ఒడుపుగా వరల్డ్ సినిమాతో సంకరం చేసినట్టు కన్పిస్తుంది. సినిమాలో సినిమా- మళ్ళీ చూస్తున్న సినిమాలోకే పాత్రలు వెళ్ళిపోయి సన్నివేశాల్లో పాల్గొనడం లాంటి అధివాస్తవిక ( సర్రియలిజం) పోకడ ఇక్కడ కొట్టొచ్చినట్టూ  కనపడుతోంది. ప్రత్యేకంగా యూరోపియన్/ అవాంట్ గార్డ్/ నాయిర్/ వరల్డ్  సినిమా/ సర్రియలిజం ఎట్సెట్రా ఎట్సెట్రా తీస్తే ఇక్కడెవరూ చూడరు. ప్రపంచమంతా హాలీవుడ్ సినిమాలు ఆడినట్టుగా ఈ సినిమాలు ఆడవు. యూరప్ కి పరిమితమైన ప్రాంతీయ సినిమాలివి. 

          ఈ సీరియస్ హార్రర్ కి కామెడీ, డాన్సులు, పాటలు, ప్రేమలూ వగైరాలతో  షుగర్ కోటింగ్ ఇవ్వలేదేమిటా అన్పించవచ్చు. వరల్డ్ సినిమాని వరల్డ్ సినిమా అన్పించకుండా, పల్లె నుంచీ పట్నం దాకా తెలిసిన  కమర్షియల్ పాత్రలతో తో సంకరం చేయడమే ఇక్కడ షుగర్ కోటింగ్. మళ్ళీ కామెడీ, డాన్సులు, పాటలు, ప్రేమలూ పెట్టి రొటీన్ సినిమా అన్పించుకోవడం కాదు. వరల్డ్ సినిమా ధోరణిని ఇలా కమర్షియలైజ్ చేసి  సరికొత్త వీక్షాణానుభవం ఇస్తున్నాక ఇంకా వేరే షుగర్ కోటింగు లవసరమా? 

          కాబట్టి, ఫ్లాష్ బ్యాక్స్ తో పనిలేకుండా  వరల్డ్ సినిమా ధోరణిలో  కమర్షియల్ పాత్రలతో రన్ అయిందిక్కడ. సినిమా ప్రారంభం ఫ్లాష్ బ్యాక్ లా ఉండక, ఈ  కథనం ఎందుకు బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తున్నాడో ఇలాటి ఎపిసోడ్లు మరెన్నో గడిచాకా గానీ- సెకండాఫ్ లో నయనతార థియేటర్లో ఆ సినిమా చూస్తున్నప్పుడు గానీ అర్ధంగాదు. అర్ధమయ్యాక ఆ కథన చమత్కృతికి చకితులైపోతాం!
***
మైమ్ గోపి
    ఈ క్రమం ఒకసారి చూద్దాం : సినిమా ప్రారంభంలో బ్లాక్ అండ్ వైట్ లో, వసంత్ (ఆరి) అనే ఆర్టిస్టు తను బొమ్మ లేస్తున్న పత్రికలో ‘మాయావనం’ అనే సీరియల్ కథ చెప్పుకొస్తూంటాడు ఫ్రెండ్ కి. ఓ అడవిలో ఒకప్పుడుండిన మాయావనం అనే పిచ్చాసుపత్రిలో మాయా అనే ‘పేషంట్’  చనిపోయి దెయ్యమైన కథ. 

          ఇప్పటికీ ఆమె ఆత్మ మనుషుల్ని వెంటాడుతోంది. ఎవరైనా తన పేరు మూడు సార్లు పలికితే ప్రత్యక్షమైపోతుంది. ఇదంతా ఆ ఫ్రెండ్ నమ్మడు. అప్పుడు మూడు సార్లు ఆ పేరు
పిలవగానే మాయా ప్రత్యక్షమైపోతుంది. షాక్ అవుతాడు. అంతలో అది అతడి భార్యతోనే ప్లే చేసిన ట్రిక్ అని బయటపడుతుంది కానీ, వీడియో కెమెరాలో రికార్డయిన బొమ్మ చూస్తే, కూర్చున్న వసంత్  వెనకాలే లీలగా దెయ్యం ఆకారం కన్పిస్తూంటుంది. ఇది సుదీర్ఘంగా సాగే ఓపెనింగ్ సన్నివేశం.

          ఇక కలర్ లో నయనతార జీవితాన్ని చూపిస్తూ, మధ్య మధ్య లో ఈ బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్లు ఇంకా ఇలా కంటిన్యూ అవుతూంటాయి : ఈ సీరియల్ ప్రచురిస్తున్న పత్రికా ఎడిటర్ రామ్ (అంజద్ ఖాన్),  సీరియల్ రాస్తున్న రచయిత మదన్ (ఉదయ మహేష్), పిచ్చాసుపత్రి స్కాం మీద పరిశోధన చేసి 
 "The Madness in Asylum" అన్న  గ్రంథం రాసిన కేథరీన్ అనే విదేశీ పరిశోధకురాలూ పరిచయమవుతారు. 

          తర్వాత మదన్ చెప్పుకొచ్చే సీరియల్ కథ ప్రకారం- 24 ఏళ్ల క్రితం మాయా మాథ్యూస్ అనే గొప్పింటి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. మ్యారేజ్ యానివర్సరీ నాడు గర్భవతి అవుతుంది. అదే రోజు భర్తకి మరొకామెతో సంబంధం వుందని తెలుస్తుంది. ఆ భర్తకి విషమిచ్చి చంపేసిందని ఆమెని తీసికెళ్ళి అడవిలో వున్న మాయావనం అనే పిచ్చాసుపత్రిలో పడేస్తారు. అక్కడే బిడ్డని కంటుంది. 

          ఆ పిచ్చాసుపత్రి ఒక స్కాం. ఒక మందుల కంపెనీ దీన్ని పథకం ప్రకారం నడుపుతూ, మానసిక వికలాంగుల మీద మందుల ప్రయోగాలు చేస్తూ, చనిపోయిన వాళ్ళని పాతి పెట్టేస్తూ వుంటుంది. మాయా కన్న బిడ్డని ఆమెకి దూరం చేసి, ఆమె మీద కూడా డ్రగ్స్ ప్రయోగిస్తే కళ్ళు పోతాయి. ఒకరోజు బిల్డింగ్ పైనుంచి పడిపోయి చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆమె చేతికి కోట్ల రూపాయల విలువ చేసే వజ్రపుటుంగరం ఉండాలనీ ఓ పుకారు వ్యాప్తిలో వుంటుంది. దీనికోసం అక్కడున్న సమాధుల్ని తవ్వే దొంగల్ని మాయా ఆత్మ చంపేస్తూంటుంది...

          బ్లాక్ అండ్ వైట్ లో ఈ సీరియల్ కథ,  కలర్ ఇంటర్ కట్స్ లో నయనతార ఆర్ధిక ఇబ్బందులు వగైరా చూపించుకొస్తూ, మరో వైపు ‘చీకటి’ అనే హార్రర్ సినిమా దర్శకుడి సమస్యలు చెప్పుకొస్తూ- ఒంటరిగా సినిమా చూస్తే ఐదులక్షల బహుమతి అంటూ అతడిచ్చిన ప్రకటనతో ఒక నిర్మాత సినిమా చూడ్డానికి రావడంతో- మలుపు తిరిగి ఇంటర్వెల్ కొస్తుంది కథ.  

          ఇంతవరకూ ఇది బిగినింగ్ విభాగమే. ఈ బిగినింగ్ విభాగంలో పత్రికలో సీరియల్ కథని పక్కన బెడితే, నయనతార- సినిమా దర్శకుడు- నిర్మాత ఈ ముగ్గురితో నడుస్తున్న వాస్తవ కథని ఫాలో అయితే,  నయనతార  లీడ్ పాత్రకి సంబంధించి- పాత్ర పరిచయం, పరిస్థితి చూపించి, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనగా  అప్పులోడి తో అంతకంతకీ విషమంగా మారుతున్న పరిస్థితిని చూపించుకొస్తూ, ‘చీకటి’ సినిమా బహుమతి ప్రకటనతో సమస్యని క్రియేట్ చేసి ఆ దిశగా నయనతార పాత్రని నడిపించారు. ఇక్కడ ఆమెకి పోటీగా ఓ నిర్మాత సినిమా చూడ్డానికి వచ్చేశాడు.

          నయనతార పాత్రకి ఇప్పటివరకూ బహిర్గత ప్రత్యర్ధి (
external conflict) పాత్ర లేదు. ఆమెకి అంతర్గత ప్రత్యర్ధి (internal conflict) మాత్రమే వుంది. అది అప్పుల బాధ రూపంలో.  ఈ సమస్య తీరడానికి బహుమతి ప్రకటన ఇచ్చిన దర్శకుడికీ బహిర్గత ప్రత్యర్ధి పాత్ర లేదు- అంతర్గత ప్రత్యర్ధిగా ‘చీకటి’ సినిమా విడుదల సమస్యే వుంది. ఇలా నయన్ పాత్ర- దర్శకుడి పాత్రా ఒకరి కొకరు ప్రత్యర్ధులు కారు ఇప్పటివరకూ. ఇక ముందు అవబోతున్నారా? లేదా పరస్పర సహకారంతో  ఇద్దరి సమస్యలూ పరిష్కారమయ్యే interactional conflict  కి దారితీయబోతున్నారా?

          ఈ ఆసక్తి రేకెత్తించే ప్రశ్నతో ఇంటర్వెల్ దగ్గరికి వెళితే, ఆ వచ్చిన నిర్మాత ‘చీకటి’ సినిమా చూస్తూంటాడు. ఆ సినిమాలో ఒక పాత్రగా తనని తానే చూసుకుని కంగారు పడతాడు. ఆనక చచ్చిపోతాడు. నయన్  థియేటర్ లోకి వస్తూంటే ఇంటర్వెల్ పడుతుంది.
***

ఆరి
     ఇప్పుడు మిడిల్ విభాగంలో పడింది కథ. నిర్మాత చచ్చిపోయాడు. సినిమా చూసి భయపడి చచ్చిపోలేదు. మాయా ఆత్మ చంపేసింది. నయన్ వచ్చింది. ఈమె పరిస్థితి ఏమిటి? అటు దర్శకుడి మీద పోలీసులు కేసు పెట్టారు. అతను  ఇరుక్కుంటున్నాడు. ఇటు నయన్ ప్రాణాల మీదికి తెచ్చుకుంటోంది. సినిమా చూడ్డం మొదలెట్టింది. ఇప్పుడు షాక్ అవడం ప్రేక్షకుల వంతు!

           ఈ ‘చీకటి’ పేరుతో దర్శకుడు తీసిన సినిమా మరేమిటో కాదు- ఫస్టాఫ్ లో చూపించుకుంటూ వచ్చిన సీరియల్ కథే. ఆ మొత్తం సీన్లూ ‘చీకటి’ సినిమాలో భాగమే! సీరియల్ కి బొమ్మ లేస్తున్న ఆర్టిస్టు వసంత్, అతడి ఫ్రెండ్, భార్య, సీరియల్ రాస్తున్న రచయిత మదన్, ప్రచురిస్తున్న ఎడిటర్ రాం, విదేశీ పరిశోధకురాలూ వీళ్ళందరూ  దర్శకుడి సినిమా కథలో పాత్రలే!

          ఈ పాత్రలతోనే నయన్ ఇప్పుడు ‘చీకటి’ సినిమా చూస్తోంది. చచ్చిపోయిన నిర్మాత చూసింది ఈ పాత్రలతో సినిమానే. దీన్ని రివీల్ చేయకుండా తెలివిగా వేరే సీన్లు చూపించాడు దర్శకుడు అశ్విన్ శరవణన్. 

          ఇప్పుడు నయన్ సినిమా చూస్తూంటే రచయిత మదన్ మరొకడితో కలిసి సీరియల్ కి పరిశోధన కోసం మాయావనాని కొచ్చి ఆత్మ చేతిలో హతమైపోతాడు. తర్వాత ఆ నేస్తం కూడా ప్రాణాలు కోల్పోతాడు. ఏమాత్రం భయపడకుండా ఈ సినిమా చూస్తున్న నయన్ కళ్ళని అకస్మాత్తుగా వెనుక నుంచి రెండు తెల్లని చేతులొచ్చి కప్పేస్తాయి. ఇదింకో షాక్ ట్రీట్ మెంట్ ప్రేక్షకులకి!

          అప్పుడు చూస్తే నయన్ ఆ సినిమాలో తనూ ఒక భాగంగా వుంటుంది. ఇది గుర్తిం చడానికి ఆమె రూపం, దుస్తులూ కలర్లో వుంటాయి-  పాత్రలూ దృశ్య భాగాలూ అన్నీ షరా మామూలుగా తెలుపు నలుపులో వుంటాయి.

          సినిమాలో ఇప్పుడు మాయవనంలో ఎడిటర్ రాం, ఆర్టిస్టు వసంత్  కనపడతారు. వసంత్ కి రివాల్వర్ గురిపెట్టి వున్న రామ్ ని  చాటున వుండి చూస్తూంటుంది నయన్. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ  జరిగి వసంత్ పారిపోయాక- రామ్ తన పని పూర్తి చేయిస్తూంటాడు- ఉంగరం కోసం సమాధుల్నితవ్వించే పని. ఏది మాయా సమాధో తెలీదు. అన్నీ తవ్వుకుంటూ పోవాల్సిందే. మాయా సమాధిలో ఆమె వజ్రపుటుంగరాన్ని కాజేయాల్సిందే. పరిశోధకురాలు కేథరీన్ కూడా జాయినవుతుంది. ఇదంతా గమనిస్తూనే వుంటుంది మాయా ఆత్మ. ఇంతలో నయన్ ని చూడనే చూస్తాడు రామ్...

***
అంజద్ ఖాన్
          ఓ సినిమా చూస్తున్న పాత్ర తనే ఆ సినిమాలోకి ప్రవేశించి పాల్గొనడం, లేదా సినిమాలోని పాత్రే నిజ ప్రపంచంలోకి వచ్చెయ్యడం లాంటి  అధివాస్తవిక- ఫాంటసీ కథలతో హాలీవుడ్ లో చాలా సినిమాలే ఉన్నాయి. వరల్డ్ సినిమాల్లోంచి స్ఫూర్తి  పొందినవి. ఇదే ‘మయూరి’ లోఇప్పుడు చూస్తున్నాం. ఇంతకీ నయన్ ని చూస్తున్న సినిమాలోకే ఆమెని ఎంటర్ చేయడంలో దర్శకుడి ఉద్దేశం ఏమైవుంటుంది? ఆమె జన్మ గురించి ఆమెకి తెలియని రహస్యాలు కళ్ళారా చూపించి, నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం చూపించడం. సైకో థెరఫీ చేయడం. ఇదే దర్శకుడి ఎజెండా. 

          ఈ సైకో థెరఫీ ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ (1985)  అనే హాలీవుడ్ సినిమాలో ఎలా జరిగిందో స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ ఇలా వివరిస్తాడు- 


            గొప్ప సినిమా కథల్లో సీక్రెట్ లాంగ్వేజి వుంటుంది. దాంతో అవి మనకి సైకో థెరఫీ చేస్తాయి. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ ( తెలుగులో ‘ఆదిత్య-369’, కథ మార్చారు) అనే సినిమాలో ఇదే జరుగుతుంది. సినిమా ప్రారంభంలో మైకేల్ ఫాక్స్ నీ, అతడి కుటుంబాన్నీ పరిచయం చేస్తారు. తల్లి తాగుబోతు, తండ్రి సోమరిపోతు. కుటుంబం బాగుపడే పరిస్థితి లేదు. 


          ఈ నేపధ్యంలో  మైకేల్ కి టైమ్ మెషీన్ లో కూర్చుని కాలం లో వెనక్కి ప్రయాణించే అవకాశం వచ్చినప్పుడు, అతను  సరీగ్గా 1955 వ సంవత్సరంలో ల్యాండ్ అవుతాడు. అక్కడ తన చిన్నప్పటి తల్లి దండ్రుల్ని చూస్తాడు. వాళ్ళు హై స్కూల్లో చదువుతూంటారు. లేత అమ్మాయిగా వున్న తల్లిని ప్రేమిస్తున్న లేత కుర్రాడు తండ్రి ఆమె ఇంటి ముందు పడిగాపులు గాస్తూ, కారు కింద పడబోతే, మైకేల్ కాపాడి ఆ కారు కింద తను పడిపోతాడు. తండ్రి పారిపోతాడు. మైకేల్ తల్లి అతణ్ణి ఇంట్లో పెట్టుకుని సపర్యలు చేస్తూ, జాలికొద్దీ అతడితో  ప్రేమలో పడుతుంది. 

          మైకేల్ కంగారు పడతాడు. ఈమె తండ్రితో ప్రేమలో పడకపోతే భవిష్యత్తులో తను పుట్టలేనని- ఆ పిరికి, ఆత్మవిశ్వాసం లేని- అయోమయపు తండ్రి మీద తల్లికి బలమైన ప్రేమ ఏర్పడేట్టు చేయాలని ఎదురు చూస్తూంటాడు. ఒకరోజు స్కూల్లో ఎవరో తల్లిని టీజ్ చేస్తూంటే అప్పుడు తండ్రిని రెచ్చగొడతాడు. వాళ్ళని కొట్టి ఆమెని కాపాడుకోమని. దాంతో తండ్రి ఇక చాలా ధైర్యం తెచ్చుకుని వాళ్ళని తన్ని ఆమెని కాపాడుకుంటాడు. దాంతో ఆమె వెంటనే మైకేల్ ని మానేసి, మైకేల్ కి కాబోయే ఆ తండ్రితో  ప్రేమలో పడుతుంది. జాలిపడి ఒకర్ని ప్రేమించడం కన్నా, తన కోసం సాహసం చేసే వీరుణ్ణి  ప్రేమించడం గొప్ప కదా?

          మైకేల్ తిరిగి వర్తమాన కాలంలోకి వచ్చి చూస్తే - ఇంట్లో పరిస్థితి మారిపోయి వుంటుంది. తల్లి తాగుడు మానేసింది. తండ్రి గొప్ప వాడయ్యాడు. ఓ పెద్ద ఇల్లు కట్టుకున్నాకుని సంతోషంగా వుంటున్నారు. ఇదంతా తండ్రి క్యారక్టర్లో మార్పు వల్లే జరిగింది. ఆ తండ్రి హై స్కూలప్పుడే తల్లిని అలా కాపాడుకోక పోయి వుంటే, ఇంత ఆత్మవిశ్వాసంతో ఇలా గొప్ప వాడయ్యే వాడే కాదు.  తండ్రి చిన్నప్పటి రోజుల్లోకి  కొడుకు వెళ్లి, తండ్రి క్యారక్టర్ ని రిపేరు చేసి వచ్చాడన్నా మాట!
                                                            ***
రోబో శంకర్ 
        హిప్నటిస్టులు పేషంట్లని గతంలోకి తీసికెళ్ళి చేసే పని ఇదే. ఈ మధ్య కాలంలో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే థెరఫీ పాపులరై,  గత జన్మలోకి తీసికెళ్ళి అక్కడి సమస్యని తొలగించి ఇప్పటి జీవితాల్ని బాగు చేస్తున్నా మంటున్నారు. ఎంతవరకు నమ్మాలో తెలీదు. ఆ మధ్య ఒక తెలుగు ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారంలో గంటపాటు ఓ మానసిక వైద్యుడు చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. అంతర్జాతీయంగా డాక్టర్ బ్రియాన్ వెస్ ఈ చికిత్సలో సిద్ధ హస్తుడని చెబుతున్నారు.

          ఇలా ‘మయూరి’ లో జరిగిందీ కూడా సైకో థెరఫీనే. చూస్తున్న సినిమాలోకి నయన్ ని  ప్రవేశపెట్టి వూరికే ఏదో గమ్మత్తు చేయాలనీ చేసింది కాదు. తన మెచ్యూరిటీతో దర్శకుడు ఆమెకి  తెలియాల్సిన నిజాల కోసం ఆమె ప్రయాణంగా అలా సర్రియాలిస్టిక్ చిత్రణ చేశాడు. అందుకే ఇది మీనింగ్ ఫుల్ సినిమా అయ్యింది.

          2003 లో అనురాగ్ బసు దర్శకత్వం లో మహేష్ భట్ నిర్మించిన ‘సాయా’ (నీడ) అనే హార్రర్ లో- హీరోకి అనేక హార్రర్ అనుభవాలు ఎదురవుతూంటాయి. ఎందుకో అర్ధం జేసుకోలేకపోతాడు. ఒక ఆత్మమాత్రం  తననిలా వేధిస్తోందని తెలుస్తూంటుంది. ఆ ఆత్మ ఎప్పుడూ నీటి ప్రపంచాల్నే సృష్టిస్తూ వుంటుంది. ఉన్నట్టుండి ఇల్లంతా నీటితో నిండిపోతుంది. లేదా స్లాబ్ లోంచి భళ్ళున నీళ్ళు పడతాయి. ఈ నీళ్ళ ట్రాకుని పట్టుకుని ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆ ప్రయాణం సాగి సాగి,  ఓ ఈశాన్య రాష్ట్రంలో మారుమూల గ్రామానికి చేరుతుంది. ఆ మారుమూల గ్రామంలోనే కొన్ని నెలల క్రితం వరద నీట్లో పడి చనిపోయింది గర్భంతో వున్న తన భార్య. ఒక డాక్టరుగా మెడికల్ క్యాంపుకి ఆమె అక్కడికెళ్ళింది. వరద నీటిలో పడి చనిపోయి మృతదేహం కూడా దొరకని తన భార్య ఆత్మే, ఆ వరద నీళ్ళు సృష్టిస్తూ తనకేదో చెప్పాలని ప్రయత్నిస్తోందని,  పరుగెత్తి  గ్రామమంతా విచారిస్తే, గిరిజన కుటుంబ సంరక్షణలో పసి కూతురు వుంటుంది. తన కూతురే. చనిపోయిందనుకున్న భార్యని ఆ గిరిజన కుటుంబం రక్షించి పురుడు పోశాక ప్రాణాలు విడిచింది...

          నిజం తెలుకుని జీవితాన్ని సవరించుకునేలా చేసిన ఈ పాత్ర ప్రయాణం భౌతిక ప్రపంచంలో జరిగింది. నయన్ పాత్ర ప్రయాణం కాల్పనిక ప్రపంచం అనే సినిమాలో జరిగింది, ఇంతే తేడా. ఇందులోనే తన జన్మ రహస్యం తెలుసుకుంటుంది, ఇందులోనే తన తల్లెవరో, ఆమె ఎలా చనిపోయిందో తెలుసుకుంటుంది, ఇందులోనే ఇప్పటికీ వజ్రపుటుంగరం జరుగుతున్న పన్నాగాలు తెలుసుకుంటుంది- తెప్పరిల్లి  ఈ ప్రపంచంలోకి వచ్చి చూస్తే- వెళ్ళిపోయిన ఈ భర్త అర్జునే కూతుర్నెత్తుకుని ప్రత్యక్షం. చూసిన సినిమాలో వసంత్ పాత్రలో కన్పించింది ఇతనే అని అప్పుడు మనకి తెలుస్తుంది. 

          సమూలంగా సైకో థెరఫీ జరిగింది నయన్ కి. వెలితీ, జీవితంలో ప్రశ్నలూ అన్నీ తీరిపోయాయి.   ఇప్పుడు తల్లి ఆత్మకి శాంతి కూడా చేకూరింది. చూసిన సినిమాలో తను సాగించిన ప్రయాణంలో విడిపోయిన భర్త అర్జున్ ని వసంత్ పాత్రగా కలుసుకుంది, ఇద్దరూ పరస్పరం సహకరించుకుని ప్రమాదం లోంచి బయట పడ్డారు- ఇప్పుడు చూస్తే నిజజీవితంలో తన భర్త తన దగ్గరికి వచ్చేశాడు మనసు మార్చుకుని - సుఖాంతం! 
***

లక్ష్మీ ప్రియ
      ఈ సినిమాలో ప్లాట్ డివైస్ గా వజ్రపు టుంగరానికి లాజిక్ కన్పించదు. అంత ఖరీదైన ఉంగరాన్ని ఆస్పత్రి ఉద్యోగులు ఎప్పుడో కొట్టేయక, ఆమె చనిపోయాక కూడా దాంతోనే ఎలా సమాధి చేస్తారు. ఈ సందేహాన్ని కూడా తీరుస్తాడు దర్శకుడు. సినిమా చూడ్డానికి వచ్చిన నిర్మాత ఎవరైతే ఉన్నాడో, అతనే ఆనాడు మయూరి తల్లిని ఆస్పత్రిలో చేర్పించిపోయాడు, పోతూ ఆనాడే ఆ ఉంగరాన్ని కొట్టేశాడు. ఆ ఉంగరం కొన్ని పాత్రలు అనుకుని అన్వేషిస్తున్నట్టుగా సమాధిలో లేనే లేదు. ఆ ఉంగరం పెట్టుకునే సినిమా చూడ్డానికి వచ్చాడు నిర్మాత. ఆ రావడం బహుమతి మీద ఆశతో కాదు. మాయా మాథ్యూస్ గురించి తీసిన ఈ సినిమాలో తన గురించి ఏమైనా బయట పెట్టారేమో తెలుసుకుందామని. అసలు నయన్ కి పారితోషికం ఎగ్గొట్టిన నిర్మాత కూడా ఇతనే అని తెలుస్తుంది మనకి. అలా వచ్చి సినిమా చూస్తూంటే మాయ ఆత్మే అతణ్ణి చంపేసింది. అప్పుడా ఉంగరం  ఏమైంది? అతడి శవాన్ని చూసిన ఆ సినిమా దర్శకుడే  దాన్ని కొట్టేశాడు!

          మరి ఇతనేమయ్యాడు? ఇదే ఫినిషింగ్ టచ్ సినిమాకి : సినిమా సక్సెస్ ఫుల్ గా విడుదల చేసుకుని సీక్వెల్ తీస్తున్నాడు- ‘చీకటి అడవి’ అని. అందులో పాత్రధారి మయూరే. అదే పాడుబడ్డ పిచ్చాసుపత్రి భవనంలో షూటింగ్. అప్పుడు పంజా విసిరింది మాయా ఆత్మ. చచ్చిపోయాడు.  అతడి వేలికున్న ఉంగరం ఎగిరి పడింది. నయన్ దాన్ని తీసుకుంది.. 

          ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు, విలనెవరు? వజ్రపుటుంగరం కోసం ఆశపడిన వాళ్ళందరూ విలన్లే. ‘హీరో’ కన్పించని, పగదీర్చుకునే ఆత్మ రూపంలో వుంది- ఆల్ టైం హాలీవుడ్ క్లాసిక్ ‘మెకన్నాస్ గోల్డ్’ లో నిధి వేటగాళ్ళకి కనిపించని భూకంపం రూపంలో వున్నట్టు. 

          నయన్ పాత్ర ఈ మొత్తం బిజినెస్ ని వీక్షిస్తూ తన అస్తిత్వాన్ని కనుగొనే సంఘర్షణతో వుంది. కథకి అనేక పొరలు, పాత్రలకి అనేక రూపాలు- ఇదీ ఇంటలిజెంట్ రైటింగ్ తో పరిపూర్ణ రూపం ధరించిన ఈ హార్రర్ థ్రిల్లర్ విజయ రహస్యం.
***

దర్శకుడు అశ్విన్ శరవణన్ 
       బెండపూడి సూర్య తేజ అనే పాఠకుడు ఈ బ్లాగ్ కి తన సందేహాల్ని ఇలా తెలియజేశారు :
            మధ్యే ‘మయూరి’ సినిమా చూశాను. ఆ సినిమా పూర్తి స్థాయి స్ట్రక్చర్ లోనే ఉందా? హర్రర్, థ్రిల్లర్ కధలలో యాక్టివ్,పాసివ్ పాత్రలుగా ఎవరెవరుండాలి, వాటి పాత్రల చిత్రీకరణ ఎలా ఉండాలి ? స్ట్రక్చర్ ఎలా ఉండాలి ? మీరు ఈ మూవీ చూస్తున్నారని ఆశిస్తూ ‘మయూరి’ స్ట్రక్చర్ ఇలా ఉంటే బావుంటుందని అనుకున్నాను.  అది కింద రాస్తున్నాను. ఇది సరి అయినదో కాదో వివరించగలరు.
      
మొదటగా ‘చీకటి’ సినిమా కాంటెస్ట్ ని వివరించి ప్రొడ్యూసర్ పాత్రని థియేటర్ కిరప్పించి అతను సినిమా చూస్తూ చనిపోయాకా, టైటిల్స్ ఇచ్చి మయూరి పాత్రని, ఆ పాత్ర తాలుకు సమస్యలను ఎస్టాబ్లిష్ చేసి, ఆ పాత్రని సినిమా కాంటెస్ట్ కి తీసుకెళ్లే సమస్యలను సెటప్ చేసుకుని, ప్లాట్ పాయింట్ దగ్గర మయూరి ని థియేటర్లో కుర్చోపెట్టేసుంటే బావుండుననిపించింది.

          అప్పుడు ముందుగా మధ్య మధ్యలో బ్లాక్ అండ్  వైట్ లో చూపించిన సినిమా మొత్తం కంటిన్యూ గా చూపించి, ఇంటెర్వెల్ దగ్గర మయూరి ని సినిమా లోకి లాక్కెళ్ళాల్సింది.

          ద్వితీయార్ధం లో ముడులు విప్పుకుంటూ ప్రీ- క్లయిమాక్స్ లో మయూరి తల్లి మాయే అని, ఇద్దరూ ఒకేలా ఉన్నారనీ చూపించారు. పైగా మాయ కధలో మాయ పాత్రని నయనతార వుంది కాబట్టి ఆమెతోనే  చిత్రీకరించి ఉంటే బావుంటుందని అనిపించింది. క్లయిమాక్స్ కి ఎలాగో ఉంగరాన్ని దాచి ఉంచుకున్నారు కాబట్టి ఫరవాలేదు అనిపించింది. ఈ స్ట్రక్చర్ సరి అయినదో కాదో విశదీకరించగలరు
          
           ముందుగా హార్రర్ సినిమాల  స్ట్రక్చర్- పాత్రలు- పాత్ర చిత్రణల కొద్దాం. ఇవి చాలా ఎలిమెంటరీ పాఠాలు. ఇంకా వీటి దగ్గరే ఉండిపోతే  ముందుకు పోలేం. ఈ బేసిక్ నాలెడ్జిని దాటి మహా సముద్రం ఇంకా వుంది. క్రియేటివ్ వేరియేషన్స్ చాలా వున్నాయి కథా కథ నాలకీ, పాత్ర చిత్రణలకీ. ఇక తీసిన సినిమాకి డబ్బులు రావాలంటే అది రోమాన్స్ అయినా హార్రర్ అయినా ఇంకేదైనా స్ట్రక్చర్ ఒక్కటే. పాత్రలొక్కటే- వాటి చిత్రణ ఒక్కటే. స్ట్రక్చర్ వచ్చేసి త్రీ యాక్ట్ స్ట్రక్చర్. దీని గురించి తెలిసిందే. ఇక పాత్రలు- హీరో అన్నాక యాక్టివ్ పాత్రే అయివుండాలి. విలన్ కూడా ఇంతే. ట్రాజడీ అనుకున్నప్పుడు, ఆర్ట్ సినిమా అనుకున్నప్పుడూ  పాసివ్ పాత్రలు రాసుకోవచ్చు. ఈ యాక్టివ్- పాసివ్  పాత్రల స్వభావాలెలా ఉంటాయో కూడా తెలిసిందే. తెలియకపోతే మరో సారి చెప్పుకుందాం. 

          ఇక ‘మయూరి’ కి ప్రత్యాన్మాయ స్ట్రక్చర్ ని సూచించారు పాఠకుడు. పదేపదే మనం చెప్పు కుంటున్న దేమిటంటే-  పాతబడిపోయిన ఫ్లాష్ బ్యాక్ కథనాలు, ఓపెనింగ్ బ్యాంగులూ మానెయ్యాలని. ఈ పనే చేశాడు ‘మయూరి’ దర్శకుడు. నేరుగా ఫ్లాష్ బ్యాక్ కాకుండా, మరుగుపర్చి సినిమాలో సినిమాగా చూపించాడు ఆ పూర్వ కథని.   బ్యాంగ్ తో ఓపెన్ చేయ కుండా సాదాగా కథ ప్రారంభించాడు. ప్రారంభంలోనే నిర్మాతకి సినిమాని చూపించి, అతన్ని చంపి టైటిల్స్ వేయడం - అంటే ఓ సంఘటనతో బ్యాంగ్ ఇచ్చి సినిమా ప్రారంభించడం -చాలా పాతబడిపోయిన కథనమే. దీన్ని బ్రేక్ చేశాడు ( ‘భలే భలే మగాడివోయ్’ లో కూడా బ్రేక్ చేశారు). ‘మయోరి’ స్ట్రక్చర్ త్రీ యాక్ట్ స్ట్రక్చరే. కేవలం ఆ స్ట్రక్చర్ చట్రంలో కథ చెప్పడంలో క్రియేటివ్ వేరియేషన్ కనబరచాడు. షార్ట్ ఫిలిమ్స్- వరల్డ్ సినిమా అనే డేటా బ్యాంక్ ని కలిగి వున్న దర్శకుడికి అబ్బిన ఈ క్రియేటివ్ వేరియేషన్స్ తో ఏది, ఎందుకు, ఎలా, ఎప్పుడు చూపించాడో   అదంతా రివ్యూలో చెప్పుకున్నాం. కనీసం ఇలా హార్రర్- థ్రిల్లర్- అడ్వెంచర్ సినిమాలకైనా ఔటాఫ్ బాక్స్ థింకింగ్ వుంటే బావుంటుంది.

          ఇప్పటి అవసరం ‘మయూరి లాంటి’ ఇంటలిజెంట్ రైటింగ్ తో కూడిన కమర్షియల్ సినిమాలు. పెద్ద సినిమాలకి ఇది ఎటూ కుదరదు. చిన్నసినిమాలు పెద్ద సినిమాల ఫార్మాట్ లోపడి పోకుండా, టెంప్లెట్స్ ని నమ్ముకోకుండా, స్వతంత్రంగా ఇంటలిజెంట్ రైటింగ్ తో కంటెంట్ ని పెంచుకున్నప్పుడు  ఏడాదికి ఓ రెండుమూడయినా సక్సెస్ లు చూడొచ్చు. చిన్న సినిమాలకి అసలు సక్సెస్ లే లేనప్పుడు, అనేకం  విడుదలకే నోచుకోలేనప్పుడూ, ఈ మాత్రం సక్సెస్ లు నయమే కదా- ఇంటలిజెంట్ రైటింగ్ తో?


-సికిందర్

.