రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, September 29, 2015

ఇంకో కామెడీ లడాయి!



రచన- దర్శకత్వం : శరత్ రెడ్డి
తారాగణం : ధీర్ చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్ ఖాన్, కావ్యా రెడ్డి, ఫారుక్ ఖాన్ తదితరులు.
మాటలు : ఫారుక్ ఖాన్, సంగీతం : శ్రవణ్, ఛాయాగ్రహణం : సృజన్ రెడ్డి పింగళి
నిర్మాత :  బి ఆర్ కె
విడుదల : 18 సెప్టెంబర్, 2015
***
          హైదరాబాద్ లోకల్ కామెడీలు ఒక ట్రెండ్ లాగా కొనసాగుతున్నాయి. ఓల్డ్ సిటీ ‘డెక్కన్ వుడ్’ కేంద్రంగా ఇవి ఏ బాలీవుడ్ కీ, టాలీ వుడ్ కీ చెందని సినిమాలుగా గత పదేళ్లుగా ఉత్పత్తి అవుతున్నాయి. ‘అంగ్రేజ్’ అనే తొలి హిట్ కామెడీ తో తెలంగాణాలో, తెలంగాణా సరిహద్దుల్లో కర్నాటక, మహారాష్ట్ర జిల్లాల్లోనూ మార్కెట్ ని పెంచుకుని  ‘హైదరాబాద్ నవాబ్స్’, ‘హంగామా ఇన్ దుబాయి’, ‘హైదరాబాద్ బకరా’ ...అంటూ అడపాదడపా విడుదలవుతూనే ఉన్నాయి. అటు పూర్తి హిందీ కాని- ఇటు ఉర్దూ కాని యాసలో (అక్కడక్కడా కొన్ని తెలుగు మాటలతో) అచ్చ హైదరాబాదీ ప్రజలు మాట్లాడే భాషలో ఇవి పాపులరవుతున్నాయి. వీటిలో కామెడీకి అంతుండదు. ఓల్డ్ సిటీ ఉర్దూ హాస్య కవితలకీ, నాటికలకీ ఎంత ప్రసిద్దో, స్థానిక ప్రజల్లో ఈ సినిమాలంత ప్రసిద్ధ మవుతున్నాయి. వీటిలో పాత్రలు ధరిస్తున్న చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్ ల వంటి వాళ్లకి ఇప్పటికే అభిమానులేర్పడ్డారు. 

          శరత్ రెడ్డి రచన, దర్శకత్వం వహించిన ప్రస్తుత హైదరాబాదీ కామెడీ ‘గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ ఓ రెండు గంటలసేపు బాగా నవ్వుకోవడానికి పనికొచ్చే లోకల్ దాదాల హంగామా. హైదరాబాద్ నగర జీవితం, ఆచారాలు, యాస, హైదరాబాదీ జోకులూ తెలిసిన వాళ్లకి మంచి ఎంజాయ్ మెంట్. 

        ఈ కామెడీకి క్రికెట్ ని టార్గెట్ చేశారు. రెండు గ్యాంగులు వాళ్లిష్టమొచ్చినట్టు క్రికెట్ ఆడుకుని తన్నుకునే కథ ఇది. ఈ క్రికెట్ కి దారితేసేది ఒకమ్మాయి. ఈమెని పీస్ (piece)గా పిలుచుకుంటారు. 

          ఓల్డ్ సిటీలో చిన్నప్పుడు ఇస్మాయిల్ (ధీర్ చరణ్ శ్రీ వాస్తవ్), గుల్లూ (అద్నాన్ సాజిద్ ఖాన్) లిద్దరూ ప్రాణ మిత్రులు. ఒకరికి కష్టమొస్తే ఇంకొకరు తట్టుకోలేరు. ఒకరి మీద ఎవరిదైనా చె య్యిపడిందో, ఆ మరొకరి చేతిలో వాడిపని ఖతమే. అలాటి జిగ్రీ దోస్తులు బద్ధ శత్రువులైపోతారు. కారణం స్కూల్లో ఓ పిల్ల ఇద్దర్నీ ఆకర్షించడం. పెద్దయ్యాకా వాళ్ళ జీవితంలో ఆ పిల్ల వుండదు గానీ, శత్రుత్వం అలాగే వుంటుంది. 

          ఇప్పుడు ఇస్మాయిల్ భాయ్ గా ఒకడు, గుల్లూ దాదాగా మరొకడూ గ్యాంగ్స్ ని ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న వ్యాపారులదగ్గర వసూళ్ళ దందా చేస్తూంటారు. ఎప్పుడైనా ఎదురెదురు పడితే జబ్బలు చరుచుకుని, తొడలు కొట్టుకుని ఛాలెంజి చేసుకోవడమే తప్ప కొట్టుకునేది వుండదు. ఒకడు అరిస్తే ఓల్డ్ సిటీ దద్దరిల్లుతుందని అంటే, మరొకడు అరిస్తే మొత్తం తెలంగాణాయే  దద్దరిల్లుతుందని సవాళ్లు విసురుకుంటారు. జీవితంలో వీళ్ళు ఒక్క సారైనా కొట్టుకుంటే కళ్ళారా చూసి చచ్చిపోవాలని ఓ ముసలాయన ఉబలాట పడుతూంటాడు.

          హీరో (ఫారుక్ ఖాన్) అనీ ఒక సినిమా పిచ్చోడుంటాడు. హీరో కావాలన్న కోరికతో అడ్డదిడ్డమైన యాడ్స్ ఫిలిమ్స్ లో నటిస్తూంటాడు. ఆ  యాడ్ ఫిలిం మేకర్ యాభై వేలు తెచ్చిస్తే హీరోగా అవకాశ మిప్పిస్తానంటాడు. చేతిలో చిల్లిగవ్వ వుండదు. దాదా లిద్దరూ హెల్ప్ చేయరు. అప్పుడు ఒక అందమైన అమ్మాయి (కావ్యా రెడ్డి) ని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఆమె వెంట  పడి తిరుగుతూంటాడు. ఆమెకూడా అతణ్ణి ప్రేమిస్తూంటుంది. ఇంట్లో హీరో తల్లి పెళ్ళికి తొందర పెడుతూంటుంది. కానీ తన అభిమాన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోనంతవరకూ తను చేసుకోనని మొండి పట్టుదలతో ఉంటాడు. ఇప్పుడీ అమ్మాయిని ప్రేమించాక అర్జెంటుగా పెళ్లాడాలన్పిస్తోంది. కానీ అమ్మాయి తక్కువదేం కాదు- ముందు డబ్బులు సంపాదించి చూపించమంటోంది.

       ఇలావుండగా, ఓసారి వసూళ్ళ కి బయల్దేరిన  ఇస్మాయిల్ కి ఇదే అమ్మాయి కన్పించేసరికి ఫ్లాట్ అయిపోతాడు. గుల్లూ కూడా ఈమెని  చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇద్దరికీ ‘పీస్’ బావుందన్పిస్తుంది. ఈ ‘పీస్’ ఎవరో తెలీని హీరో ఆమెని తెచ్చి లింకప్ చేస్తానని ఇద్దరి దగ్గరా డబ్బులు లాగుతూంటాడు. తీరా చూస్తే  ఆ ‘పీస్’ తను ప్రేమిస్తున్న అమ్మాయేనని తెలిసి మాయమైపోతాడు. 
ఇలాకూడా దాదాలు వదిలి పెట్టరని- ఇద్దరూ ఒకే ‘పీస్’ ని ప్రేమిస్తున్న సంగతి బయట పెట్టేసి, ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తాడు. ఇద్దరూ భగ్గుమంటారు. మళ్ళీ చిన్నప్పటి అమ్మాయితో కథలాంటిదే రిపీట్ అవుతుంది. ఇక ఓల్డ్ సిటీలో వీళ్ళ వల్ల శాంతిభద్రతలు దెబ్బ తింటున్నాయని ఇంకో ప్లానేస్తాడు హీరో. ఇద్దరూ క్రికెట్ ఆడుకుని ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆ ‘పీస్’ అని ఆశ పెడతాడు.

      ఈ కామెడీకి వున్న ప్రధాన  లక్షణమేమిటంటే, చకచకా కథ ముందుకి సాగిపోతూ వుండడం. ఫస్టాఫ్ లో ఒకమ్మాయి- ముగ్గురు ప్రేమికుల మధ్య ఎన్ని డైనమిక్స్ ఉంటాయో- సెకండాఫ్ లో దాదాపు గంటపాటు ఆడుకునే క్రికెట్ లో అన్ని మలుపులుంటాయి. ఈ క్రికెట్ కి ఏ రూల్సూ వుండవు. టాస్ వేసిన దగ్గర్నుంచీ గొడవలే. ఈ గొడవలు రూల్స్ అతిక్రమిచారని ఎదుటి టీముతో కాదు, రూల్స్ ప్రశ్నే తలెత్తదు. అంపైర్ దిష్టి బొమ్మలా నిలబడి చూస్తూంటాడు. గొడవలు సొంత టీములో ఎవరైనా సరీగ్గా ఆడకపోతేనే. అప్పుడు ఉరికించి ఉరికించి కొడుతూంటారు ఇస్మాయిల్, గుల్లూ తమ టీం ప్లేయర్స్ ని. ఇస్మాయిల్ బ్యాటింగ్ చేస్తే కూడా మామూలుగా  వుండదు- అతను సిక్సర్ కొట్టడు,  సిక్స్ కిలోమీటర్స్ కొడతాడు. బాల్  వెళ్లి ఎర్రగడ్డలో పడేట్టు, లేదా చంద్రాయణ గుట్టలో పడేట్టు. గుల్లూ బౌలింగ్ ప్రావీణ్యం మరొకెత్తు. గుండ్రంగా, అర్ధచంద్రాకారంలో, అడ్డంగా, నిలువుగా ఎలాగైనా పరుగెత్తుకొచ్చి కన్ఫ్యూజ్ చేసేస్తూ బౌలింగ్ చేస్తాడు. ఇక ఈ టీములో కాసేపు, ఆ టీములో కాసేపూ వుండి హీరో ఆడేస్తూంటాడు. దీనికి మందు కొడుతూ ఒకడు కామెంటరీ చెప్తూంటాడు. 

       ఆట ఊపందుకుంటుంది. గుల్లూ ఓడిపోతూంటాడు. అప్పుడు ఇంకో యంగ్ దాదా తన గ్యాంగ్ తో వచ్చేస్తాడు. ఇతను కూడా ఆ ఆమ్మాయిమీదే కన్నేశాడు. ఇప్పుడు వచ్చేసి సీనియర్ దాదా లిద్దర్నీ తన్నడం మొదలెడతాడు. పోలీసులొస్తారు. అమ్మాయితో హీరో బాలీవుడ్ కి పారిపోతాడు. చివరికి ఒక నీతిని తెలుసుకుంటారు దాదాలు : ఇలా అమ్మాయి కోసం ఫ్రెండ్ షిప్ ని చెడగొట్టుకో వద్దని.         

          దర్శకుడు శరత్ రెడ్డి ఓల్డ్ సిటీ శివారులో మరీ పూర్ లోకేషన్స్ లో షూట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో షూట్ చేసివుంటే నేటివిటీ కన్పించేది. ఒక్క చార్మినార్ ని చూపించేసినంత మాత్రాన నేటివిటీ రాదు. మిగతా కథా కథనాలు, కామెడీ, చిత్రీకరణా ఓకే. సందర్భానికి తగ్గట్టు హిందీ తెలుగు సినిమా పాటల బిట్లు పెట్టారు. సంగీతం ఓమాదిరిగా వుంది. కెమెరా వర్క్ బావుంది. అంతంతమాత్రం గ్లామర్ వున్న లోకల్ టాలెంట్ కావ్యా రెడ్డి కి ప్రథమార్ధంలోనే పాత్ర. సెకండాఫ్ లో ఎక్కడా కన్పించదు. చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్, ఫారుక్ ఖాన్ ల టైమింగ్, కామిక్ సెన్స్ ఈ సినిమాకి ఉత్తేజాన్ని తీసుకొస్తాయి. 

-సికిందర్