రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 1, 2016

రివ్యూ

రచన- దర్శకత్వం: కొరటాల శివ
తారాగణం: ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌, సమంత, నిత్యామీనన్‌, సాయికుమార్‌, సురేష్‌, ఉన్ని ముకుందన్‌, సచిన్‌ ఖెడేకర్ కర్‌, అజయ్‌, బ్రహ్మజీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: తిరు
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు: ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌
విడుదల : సెప్టెంబర్ 1, 2016
***
చాలా  హైప్ తో, పబ్లిసిటీతో  ‘జనతా గ్యారేజ్’ పేరుతో ఈసారి ఎన్టీఆర్ ప్రేక్షకులకి అందించిన నజరానా ఎంత జనరంజకంగా వుందో చూద్దాం...
కథ 
          1980 లలో  సత్యం (మోహన్ లాల్) హైదరాబాద్ లో జనతా గ్యారేజ్ తెరుస్తాడు. తమ్ముడు (రెహమాన్) ని బాగా చదివించి పెళ్లి చేస్తాడు. సత్యం తన గ్రూపుతో గ్యారేజీ పనులు చేస్తూనే తనదగ్గరి కొచ్చే సామాన్యుల సమస్యలు తీరుస్తూంటాడు. ఈ క్రమంలో ముఖేష్ రాణా ( సచిన్ ఖేడేకర్) అనే పారిశ్రామిక వేత్తకి శత్రువుగా మారతాడు. ఒకరోజు మాట వినని సత్యం తమ్ముణ్ణి, భార్యని  ముఖేష్ చంపించేస్తాడు. దీంతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన కొడుకు (ఆనంద్) ని వాడి మేనమామ(సురేష్) కిచ్చి ముంబాయి పంపించేస్తాడు సత్యం. మేనమామకో కూతురు బుజ్జి (సమంత)  వుంటుంది. ఆనంద్ చదువుకుని పర్యావరణ పరిశోధకుడు అవుతాడు. పర్యావరణాన్ని దెబ్బ తీసే పరిశ్రమలకి వ్యతిరేకంగా పోరాడుతూంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చి ఒక మైనింగ్ మాఫియా మీద పోరాడతాడు. ఈ మాఫియా ముఖేష్ రాణాతో చేతులు కలిపిన సత్యం కొడుకు రాఘవ ( ఉన్ని ముకుందన్) కి బుద్ధి చెప్తాడు ఆనంద్. 

          ఆనంద్ రావడానికి ముందు, సత్యం మీద కూడా ముఖేష్  హత్యాయత్నం చేస్తాడు. దీంతో ఆరోగ్యకారణాల రీత్యా ప్రజల తరపున పోరాడ్డం మానుకుంటాడు సత్యం. ఆనంద్ వచ్చి పర్యావరణాన్ని దెబ్బ తీసే మైనింగ్ ని అడ్డుకోవడంతో, అతణ్ణి పిలిచి తన బాధ్యతలు అప్పగిస్తాడు సత్యం. ఇక సత్యం బాధ్యతల్ని మీదేసుకున్న ఆనంద్ ఇక్కడ్నించీ ఏం చేశాడన్నది మిగతా కథ.


ఎలావుంది కథ
          సారీ, వెరీ సారీ, ఇంత భారీ బడ్జెట్ వెచ్చించి ఎన్టీఆర్ తో తీశామనుకుంటున్న కథ కథ కాదు, ఇది ఒక గాథ మాత్రమేనని చెప్పాల్సి వస్తోంది. ఈ గాథలో ఒక గ్యారేజీ ఓనర్ మంచి డాన్ గా ఎదగడమనే  కథనం గాడ్ ఫాదర్ నాటి నుంచీ  సర్కార్ వరకూ చూస్తున్నదే. అదే తిరిగి దర్శనమిచ్చింది. కనుక కొత్తదనం ఏమీలేదు. ఇక పర్యావరణ కార్యకర్తగా హీరో చేసే పోరాటం  కాస్తా వదిలేసి,  గ్యారేజీ తరపున ప్రజల మాన- ప్రాణ -ఆస్తి సమస్యలపై  పోరాడే నాయకుడుగా మారడంతో హీరో పాత్ర ఏమిటో తెలియకుండా పోయిన వైనం కూడా వుంది. మళ్ళీ ఈ గాథ లోనే కుటుంబ సంబంధాలు కూడా చూపడంతో ఏకసూత్రత పూర్తిగా దెబ్బ తినిపోయింది. ఇదొక కథ అయివుంటే, మిగతా కమర్షియల్ సినిమాల్లో లాగానే  ఒక సెంట్రల్ పాయింటు వుండి, దాంతో సంఘర్షణా- పోరాటం ఉండేవి.  పర్యావరణంతో గానీ, గ్యారేజ్ తో గానీ, కుటుంబంతో గానీ,  ఎక్కడా ఒక ప్రధాన సమస్యంటూ ఏర్పాటు కాకపోవడంతో, ఇది కథా లక్షణాన్ని కోల్పోయింది. ఇదిగో మా జీవితాలు ఇలా ప్రారంభమై, ఇలా కొనసాగి, ఇలా ముగిసింది మా కథ- అని గోడు వెళ్ళ బోసుకునే సంఘటనల పేర్పు  అనే ‘గాథ’ గానే ఇది రూపొందింది. ఈ గాథని కథగా మార్చాలంటే చాలా మేజర్ రిపేర్లు అవసరపడతాయి.

 ఎవరెలా చేశారు
          ఎన్టీఆర్ నటనకి, నృత్యాలకి,  పోరాటాలకీ వంక పెట్టలేం గానీ, సక్సెస్ నిచ్చేవి ఇవి మాత్రమే కావు- తగిన పాత్ర కూడా వుండాలి. తన పాత్ర ఏమిటన్నదే ప్రశ్నార్ధక మయ్యింది- తను పబ్లిసిటీతో విపరీతమైన ఆసక్తి రేపిన పర్యావరణం గురించి పోరాడే కొత్త పాత్రా, లేక జనం కోసం పోరాడే అదే రొటీన్ మాస్ క్యారక్టారా? మొదటిదిగా ప్రారంభమై రెండో దాంట్లోకి తిరగ బెట్టలేదూ? ఇలా ఎందుకు జరిగిందో,  దీని జస్టిఫికేషన్ ఏమిటో ఎన్టీఆరే చెప్పాలి. ఇదొక కథై వుంటే ఇలా జరిగేది  కాదనేది నిర్వివాదాంశం. తను నటించింది గాథలో కాబట్టి ఇలా తయారయ్యింది పాత్ర, ఇంతకంటే మరేం లేదు. ఇలా తయారైన పాత్రలో బాగా నటించాడనుకుంటే అనుకోవచ్చు. ఎన్టీఆర్ నటనకి వంకపెట్టడం వుండదు. పాత్రలే అర్ధవంతంగా వుండాలి. ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు -చల్తా హై-  అనుకుంటే అది వేరు. 
  
          మోహన్ లాల్ ఫస్టాఫ్ వరకూ ఆసక్తి కల్గిస్తాడు. అతడి నటనని కూడా వంకబెట్టలేం. అయితే అతడి పాత్ర చేసే పోరాటానికి తగ్గ ప్రత్యర్థే లేకపోవడంతో క్రమంగా పాత్ర బలహీన పడుతూ – ఇక అతడి స్థానంలోకి ఎన్టీఆర్ రాగానే నామ్ కే వాస్తేగా మిగిలిపోతాడు. 

          ప్రేక్షకులకి చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, హీరోయిన్లిద్దరూ నిరాశపర్చడం. సమంతాకీ, నిత్యా మీనన్ కీ సరైన పాత్రలే లేవు. ఉన్న పాత్రలతో పట్టుమని పదినిమిషాలు కూడా కన్పించరు. సెకండాఫ్ లోనైతే  చాలా సేపూ ఇద్దరూ మాయమైపోతారు. ఓ పాటకి, కాస్త గిలిగింతకీ వచ్చేసి వెళ్ళిపోయే ఈ స్టార్ హీరోయిన్లు పారితోషికాలు మాత్రం పూర్తిగానే పొంది వుంటారు పుష్కలంగా.  వీళ్ళిద్దరికీ తోడైనట్టు- ఐటెం సాంగ్ తో ఐదే నిముషాలు కన్పించి పోతుంది కాజల్ అగర్వాల్. తగిన ఫ్లో లేకుండా సడెన్ గా వచ్చి పడే ఈ ఐటెం సాంగ్ డిస్టర్ బెన్స్ గానే వుంటుంది. 

          విలన్ గా సచిన్ ఖెడేకర్ కూడా హీరోయిన్లలాగే అతిధి పాత్ర పోషించే వేస్టు పాత్ర! కమెడియన్లు లేరు, కామెడీ లేదు. ఉన్న వెన్నెల కిషోర్ కి కూడా రెండే సీన్లు!. ఇక గ్యారేజీ మెకానిక్కులుగా బ్రహ్మాజీ, అజయ్ ఇంకొంత మంది వుంటారు- ఎప్పుడో 1980 లలో గ్యారేజీ ప్రారంభమైన నాటినుంచీ ఎలావున్న వాళ్ళు అలా ఏదో కోర్టు ఆదేశాల ప్రకారం యథాతథ స్థితిని పాటిస్తున్నట్టు- పెళ్ళీ పెటాకులు లేకుండా అలాగే ఉండిపోతారు. ఇప్పటికి వీళ్ళు ముసలి  వాళ్ళయి వుండాలి! క్లయిమాక్స్ దగ్గరలో అర్జెంటుగా పెళ్ళిచేసుకుని అంతలో చచ్చిపోతాడు పాపం అజయ్. పోతే మిగిలినవన్నీ సహాయపాత్రలు. పోలీసు అధికారిగా సాయికుమార్ కూడా అసంబద్ధ పాత్ర చిత్రణ బాధితుడే. 

          దేవీశ్రీ ప్రసాద్ నుంచి ఓ రెండు పాటలు బావున్నాయి. పోరాటాలు పరమ రొటీన్ గా వున్నా, తిరు కెమెరా వర్క్, ఇతర సాంకేతిక విలువలు షరా మామూలుగా ఉన్నతంగా వున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకి ఉన్నతంగా ఉండేవి ఇవే!


చివరికేమిటి?
          ఎన్టీఆర్ మోహన్ లాల్ ల కాంబినేషన్ అంటూ అంచనాలు పెంచేయడం మంచిదే- కానీ పొజిషనింగ్ ని కూడా చూసుకోవాలి. ఈ ఇద్దరు హేమా హీమీలు ఒకవైపు వుంటే,  ఎదురుగా అంతే పవర్ఫుల్ పాత్ర, నటుడూ వుండడం కూడా అవసరం. ఇద్దరు హేమీ హేమీలకి తుస్సుమనే విలన్ ని పెట్టారు- వాడికి  సరైన పనే  లేదు. ఒకసారి ప్రజల భూమి లాక్కో బోతాడు, ఇంకోసారి అక్రమ మైనింగ్ చేయబోతాడు, మరింకో సారి అక్రమంగా ఆస్పత్రి కట్టించబోతాడు...చెబుతున్నది కథగా లేకపోతే ఇంతే. ఒక పాయింటు మీద విషయం నిలబడదు. చివరికి సీఎం ని దింపడానికి నగరంలో విలన్ బాంబులు పేల్చడం ఎంత పురాతన బలహీన క్లయిమాక్స్!

          ఈ సినిమా ఇంటర్వెల్ పడ్డా కథేమిటో తెలియదు, సెకండాఫ్ లో పదినిమిషాల తర్వాత ఎన్టీఆర్ కీ, మోహన్ లాల్ కి సరైన కమర్షియల్ సినిమా పొజిషనింగ్ తో,  పరస్పరం విరోధులయ్యే వాతావరణం కన్పించి- అంతలో ఇద్దరూ చేతులు కలపడంతో అదికూడా తేలిపోతుంది. ఇక ఇద్దరూ చిల్లర సమస్యలే చూసుకోవడంతో ఓ పాయింటూ లేక కథే ప్రారంభం కాదు. చివరి దాకా కథే వుండదు. అందుకే ఇది గాథ!  బిగినింగే తప్ప, మిడిల్, ఎండ్ లేని అనంత గాథ. స్టీవెన్ స్పీల్ బెర్గ్ చెప్పినట్టు, సినిమా వాళ్ళు కథలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయారు- బిగినింగే వుంటుంది...మిడిల్ వుండదు...ఎంతకీ ముగియని ఎండ్ తప్ప!

          దర్శకుడు కొరటాల శివ రచయితగా వచ్చిన వాడే. కానీ ఏ ప్రాతిపదికన రచనలు చేస్తున్నట్టో తెలీదు. ఇంతగా రిపేరు కొచ్చిన రచన ఇంకోటి చేయలేదేమో. ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా చూసేస్తే సరి.


-సికిందర్



          



.