రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, జనవరి 2022, శుక్రవారం

1113 : రివ్యూ!

రచన - దర్శకత్వం: పొలిమేర నాగేశ్వ‌ర్‌ 
తారాగణం : ఆది సాయి కుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి తదితరులు 
క‌థ‌: వేణుగోపాల్ రెడ్డి, సంగీతం: శేఖ‌ర్ చంద్, ఛాయాగ్రహణం : అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల
, అశోక్ రెడ్డి మిర్యాల 
విడుదల :
జనవరి 7, 2022
***

        పదేళ్ళ క్రితం ప్రేమ కావాలి’, లవ్లీ ల తర్వాత ఆది సాయి కుమార్ కి 12 ఫ్లాపులే తప్ప హిట్ ప్రాప్తం కాలేదు. ఇప్పుడు అతిధి దేవోభవ తో ఇలాటి కొత్త తరహా సినిమాలే చేస్తానన్నాడు. ఇందులోని పాత్రతో తనలో కొత్త అది ని చూస్తారని అన్నాడు. కొత్త దర్శకుడు కూడా రెండు దశాబ్దాల ప్రయత్నం తర్వాత ఇప్పుడు దర్శకుణ్ణి అయ్యాననీ, ఈ మూవీ మలుపు తిప్పే మూవీ అవుతుందనీ, ఇందులో సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా వుంటుందనీ వర్ణించాడు, ఇద్దరి మాటలూ ఎంతవరకూ నిజం? నిజమనుకుని ఎలా భ్రమల్లో వున్నారు? 12 ఫ్లాపుల తర్వాత ఆది, 20 ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత దర్శకుడూ సినిమా అంటే ఏమిటో ఎలాటి అవగాహనతో వున్నారో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అభయ్ రామ్ (ఆది సాయికుమార్) తల్లి (రోహిణి) తోడు లేకపోతే వుండలేక పోతాడు. చిన్న తనం నుంచే అతను మోనోఫోబియా అనే మనోవ్యాధితో వుంటాడు. ఒంటరిగా వుండాలంటే భయం. ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుండాలి. ఎప్పుడూ తోడు తెచ్చుకుంటున్న ఇతణ్ణి చూసి గర్ల్ ఫ్రెండ్ బై చెప్పేస్తుంది. మరోపైపు ఉద్యోగంలో పై స్థాయికి ఎదగాలనుకుంటున్న అభయ్ కి ఈ ఫోబియా సమస్యై పోతుంది. ఇలా వుండగా వైష్ణవి (నువేక్ష) అనే ఇంకో అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ పెళ్ళికి దారి తీసేసరికి సంకటంలో పడతాడు. తన సమస్య ఈమెకి చెప్పాలా వద్దా? చెప్తే ఏమవుతుంది? చెప్పక పోతే ఏమవుతుంది? ఈ ప్రశ్నలే మిగతా కథ.  

ఎలావుంది కథ

2019 లో నిహారికా కొణిదెల నటించిన సూర్యకాంతం లో ఆమె పాత్రకి పెళ్ళంటే భయమనే కమిట్ మెంట్ ఫోబియా లేదా గామోఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియాతో ఆధునిక సినిమాలా వుండాల్సింది కాస్తా ఎలా మూస ఫార్ములా ప్రేమ డ్రామాలాగా వుందో, అలా అతిధి దేవోభవ లో ఒంటరిగా వుండాలంటే భయమనే మోనో ఫోబియాతో వుంది.

        2015 లో నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య లో ఎండ తగిలితే ప్రాణాలకి ప్రమాదమయ్యే జిరోడెర్మా  పెగ్మెంటోసమ్ అనే అనువంశిక శారీరక రుగ్మతతో - ఎలా ఆ ఎత్తుకున్న పాయింటు వదిలేసి, అరిగిపోయిన రొటీన్ ముక్కోణ ప్రేమ చట్రంలో బిగించారో, అలా అతిధి దేవోభవ లో పాత్ర ప్రాబ్లం ఒకటైతే, నడిపిన కథ ఇంకోటిగా తయారయ్యింది. 

        ఏదో ఫోబియా నావెల్టీగా వుందని ఎత్తుకోవడం, దాన్ని బాక్సాఫీసు ఫ్రెండ్లీగా ఎలా మార్చాలో తెలీక రొటీన్ మూస ఫ్రేమల్లోకి తిప్పేయడం మనకలవాటే. ఈ అలవాటు కూడా ఒక ఫోబియాతోనే... ఏమిటీ, గోలీమార్ మన్మర్జియమ్ సొల్లమ్ ఫోబియా  అని కొత్తగా చదివావా? అది మనకర్ధం కాదు గానీ, అలా అని పబ్లిసిటీ చేసి నువ్వే కావాలి లవ్ స్టోరీ తీయ్, చూడక చస్తారా  - అని ఆత్మారాముడు అనడం, దానికి ఆత్మ సమర్పణ చేసుకోవడం. ఇంతకంటే అతిధి దేవోభవ అనే 1.5 రేటింగ్ సినిమాని విశ్లేషించుకుంటే రేటింగ్ కే అవమానమవుతుంది.

నటనలు- సాంకేతికాలు

  ఆది నటించిన పాత్రకి అర్ధం పర్ధం వుంటేగా అద్భుతంగా ఫీలవడానికి. ఒంటరిగా వుండాలంటే భయమనే ఫోబియాతో రకరకాల సైకో సీన్లు నటించడమే ఆదికి అద్భుతంగా అన్పించి, ప్రేక్షకులకి రికమెండ్ చేస్తే సరిపోతుందా? అసలీ పాత్రతో కామెడీ చేయాలో, థ్రిల్లర్ చేయాలో తేల్చుకోకపోతే తేలేది కన్ఫ్యూజనే. పాత్ర చిత్రణ వదిలేసి నటుడుగా చెప్పుకుంటే నటించగలడు. కాకపోతే ఇలాటి ఫ్లాప్ పాత్రలు నటించడమే ఇప్పటికి పదమూడో సారి సమస్య.

        హీరోయిన్ నువేక్ష అందంగా కన్పించడానికే తప్ప నటించడానికి కాదేమో. పాత్ర వుంటేగా నటించడానికి. సినిమా మొత్తంలో వర్క్ చేయకుండా రెమ్యూనరేషన్ తీసుకున్నది తనే అయుంటుంది. సప్తగిరి కామెడీకి నవ్వాలో ఏడ్వాలో అర్ధంగాని మానసిక స్థితి. యూట్యూబ్, ఫేస్బుక్ కొత్తకొత్త తెలుగు కామెడీ షార్ట్ వీడియోల ముందు సప్తగిరి కామెడీ ఔట్ డేటెడ్ అయిపోయింది. షార్ట్ వీడియోలని బీట్ చేసే కామెడీ చేయకపోతే సప్తగిరికి సమస్యే.

        ఇక ఇతర నటీనటుల గురించి టెంప్లెట్ గా చెప్పుకుంటే, పాత్రల పరిధి మేరకు చక్కగా ఒదిగిపోయి నటించారు. అక్కడక్కడ నవ్వులు పూయించి మెప్పించారు. ఒరిగిపోయి మనమీద నిద్రించలేదు. ఇక సాంకేతిక విలువలు, సంగీతం, దర్శకత్వం అన్నీ ఎలావుండ కూడదో అలా వున్నాయి. 

        దర్శకత్వం, దృశ్యాల్ని మల్చిన తీరు, కథ నడపడం అన్నిటా వైఫల్యమే కన్పిస్తుంది. ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ ఈ ఫోబియా కథలోకి వెళ్ళాలంటే ఫోబియా వల్ల కామెడీలతో గడపడం, సెకండాఫ్ లోనూ హీరోకున్న ఫోబియాతో ఎంతసేపూ సైకో సీన్ల తో కాలక్షేపం చేయడంతప్ప, ఫోబియాకి విరుగుడు దిశగా ప్రయాణించాలంటే ఫోబియా వల్ల, నసతోనే లాగించడమనే స్కీముని దిగ్విజయంగా అవలంబించాడీ కొత్త దర్శకుడు. ప్రేమిస్తున్నట్టు చివరిదాకా చెప్పలేక నస పెట్టే ప్రేమ సినిమాలున్నాయి. అదే ఇదీ. కాకపోతే ప్రేమ బదులు ఫోబియా. ప్రేమ సీసాలో ఫోబియా సారా పోస్తే కొత్త సినిమా.       

        12 ఫ్లాపుల తర్వాత హీరో ఆది, 20 ఏళ్ళ స్ట్రగుల్ తో కొత్త దర్శకుడూ చేసిన ఉమ్మడి కృషి - ఫ్లాపవుతుందని తెలియక ఇష్టపడి కష్టపడి తీసిన ఫ్లాప్. ఇలా అసలు బేసికల్ గా సినిమా అంటే ఏమిటో తెలుసుకోవడానికి మరిన్ని ఫ్లాపులు తీయాల్సిందేనేమో.
—సికిందర్