రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, February 26, 2015

ఆ నాటి సినిమా..


మ్యూజికల్ మాస్టర్ పీస్!

నం తీసే సినిమాలని విదేశీయులెవరైనా  ప్రశంసించినప్పుడు సార్వజనీనత సిద్ధించి మనం ఎదిగినట్టు లెక్క. ఓ పొద్దుటే మద్రాసులో గానకోకిల లతా మంగేష్కర్ రికార్డింగ్ థియేటర్ కి కారులో ప్రయాణిస్తూ ‘ఎంత బాగా తీశారు, ఇంత మంచి సినిమాని డబ్బింగ్ చేసేకన్నా రీమేక్ చేస్తే బావుంటుంది కదా’- అని పట్టుబట్టడం చూసి అంజలీ దేవి- ఆదినారాయణరావుల జంటకి నోట మాట రాలేదు. ఆ ముందు రోజే లతామంగేష్కర్  హిందీకి డబ్బింగ్ పాడేందుకు బొంబాయి నుంచి వచ్చారు. రాత్రే సినిమా చూశాక తెల్లారే రికార్డింగ్ కి వెడుతూ ఈ మాట!

     రికార్డింగ్ థియేటర్లో కూర్చుని ఈ అంశం పైనే చర్చోప చర్చలు. ఇంకాలస్యం చేయకుండా  అప్పటికప్పుడు నిర్ణయం. 1957 మార్చి 27 న ‘మాయాబజార్’ విడుదలైన సుమారు నెలన్నర రోజులకే, అంటే మే 10 న విడుదలై ఆ ‘మాయాబజార్’ తో గట్టి పోటీని సైతం తట్టుకుని నిలబడి, ఘానాతిఘన విజయం సాధించిన మ్యూజికల్ మాస్టర్ పీస్ ‘సువర్ణ సుందరి’ ని హిందీలో డబ్బింగ్ కాకుండా, రీమేక్ చేసేందుకు ఆ లతా మంగేష్కర్ సాక్షిగానే నిర్ణయం.

     సాక్షాత్తూ  ఉత్తరాది లతే ప్రశంసించాక ఇంకా ఓ తెలుగు సినిమా విశ్వజనీనత కి వేరే సర్టిఫికేట్ అవసరమేముంటుంది ?
     తెలుగు సినిమా ఆస్కార్ కి ఎప్పుడెళ్ళొచ్చు? ‘సువర్ణసుందరి’ లాంటి దేశీయత ప్రదర్శించినప్పుడు కనీసం నామినేషన్ గడప తొక్కొచ్చు. దేశీయత వినా ఏ కళకీ అంతర్జాతీయ సమాజపు మద్దతు లేదు.

     కొందరు  కళాకారులకి వాళ్ళ కళాభినివేశాన్ని గుర్తుచేస్తే పసిపిల్లలై పోతారు. బింకాలూ ఇగోలూ పోజులూ వుండవు. పోటీ యావలోపడి కరప్ట్ అవని ఒరిజినాలిటీ గల కళాకారులై వుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎనభై రెండో ఏట ఇంత పండు వయసులో అంజలీదేవి అర్ధదశాబ్దం నాటి ‘సువర్ణసుందరి’ జ్ఞాపకాల్లోకి విహరిస్తే,  అదేమిటో వివశత్వం, అద్భుత ఆనందం, ఆర్తి ఆమెకు! ఆ కాసేపూ  వినిపించిన సంగతులు నిన్న జరిగినట్టే అన్పిస్తున్నాయి.  ఇన్ని దశాబ్దాల తర్వాతా అంత మెమరీనీ, ఆ ఫీల్ నీ జనరేట్ చేయడం ఒకరివల్ల అయ్యే పనే కాదు. ఎవరైనా తమకు సొంతమైన కళని ప్రేమించి, తదాత్మ్యం చెందకుండా ఇతరుల్ని మెప్పించలేరు.  ఈ  విషయంలో అంజలీ దేవికి హేట్సాఫ్ చెప్పాల్సిందే!

      స్ట్రైకింగ్ బ్యూటీ అంజలీదేవి ‘సువర్ణసుందరి’ లో. అప్పటికింకా నిండా ముప్పయ్యేళ్ళు లేవేమో.- వదనంలో ఆ లావణ్యం, మేనిలో ఆ హొయలు మనల్ని కట్టి పడేస్తాయి. పోషించిన గంధర్వ కన్య సువర్ణసుందరి పాత్ర, ప్రతీ కార్తీక పౌర్ణమి నాడామె దివి నుంచి భువి కేతుంచుతుంది.  భూమ్మీద రాకుమారుడు జయంత్ (అక్కినేని నాగేశ్వర రావు) చేయని ఒక తప్పుకి రాజ్య బహిష్క్రుతుడై, సువర్ణ సుందరి దృష్టిలో పడతాడు. ఆ తర్వాత ఇద్దరి ప్రేమకలాపాలూ ఇంద్రుడి దృష్టిలో పడి ఆయన శపిస్తే, స్త్రీగా మారిపోతాడు జయంత్. పురుష వేషం ధరించి సువర్ణ సుందరి కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. తిరిగి ఈ జంట ఎలా ఒకటయ్యారనేది చిత్ర విచిత్ర సంఘటనలతో,  మనస్సుని గెలుచుకునే సెంటిమెంట్లతో, ఉత్తమ సంగీత సాహిత్యాల  మేళవింపు తో నవరసభరితంగా వుంటుంది.   

      కథాపరంగా ఈ సినిమా ప్రత్యేకతలు రెండు : హీరో స్త్రీగా, హీరోయిన్ పురుషుడిగా మారిపోయే జెండర్  రివర్సల్ గిమ్మిక్కు, కమెడియన్లని విలన్లుగా చూపించే అవుటాఫ్ బాక్స్ థింకింగ్.  త్రీ ఈడియెట్స్ లాంటి కైలాసం, ఉల్లాసం, చాదస్తం (రేలంగి, రమణా రెడ్డి, బాలకృష్ణ) లు  చేసే అకృత్యాలు నేటి కాలంలో మళ్ళీ రాం గోపాల్ వర్మ తీసిన ‘జంగిల్ ‘లో  పొట్టి కమెడియన్ రాజ్ పల్ యాదవ్ పాల్పడే రాక్షసానందం లోనే చూడగలం. ఇమేజిల బ్యాగేజీ లేని ఆ కాలమే ఎంతో హాయైనది.

      ‘దేవదాసు’ ఫే మ్ వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ప్రతి సన్నివేశం ఇందులో ఓ కళాఖండమే. పాండురంగ మహాత్మ్యం’ ని వెండితెర వెలుగుగా మార్చేసిన టాప్ ఛాయాగ్రాహకుడు ఎం.ఏ. రెహ్మాన్ చేతిలో ‘సువర్ణ సుందరి’  మరో అద్భుత దృశ్య కావ్యం. వాలి కళ, వెంపటి సత్యం నృత్యాలు, నారాయణ మూర్తి ఆహార్యం, ప్రకాష్ కూర్పు...ప్రతి ఒక్కటీ ఎస్సెట్సే.

    ‘దేవదాసు’  తర్వాత మరోసారి  అక్కినేని వెంట పేకేటి శివరాం, ఇతరపాత్రల్లో నాగయ్య, గుమ్మడి, సీఎస్సార్, రాజసులోచన, గిరిజ తదితరులు కన్పించే ఈ అంజలీ దేవి పిక్చర్స్ వారి దివ్య సృష్టిని తమిళంలో జెమినీ గణేశన్ తో, హిందీలో తిరిగి అక్కినేని- అంజలీ దేవిలతో రీమేక్స్ చేస్తే అవీ హిట్సే.

    తెలుగు ఒరిజినల్ కి ఆ ఏటి  ఉత్తమ జాతీయ చలన చిత్రం అవార్డుని రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందుకున్నారు ది గ్రేట్ అంజలీ దేవి.

ఎక్కడిదీ కథ?

క్కినేని- అంజలి జంటగా నటించిన ‘బాలరాజు’ (1948), ‘స్వప్న సుందరి’ (1950), జానపదాలు రెండూ 1957  లో ‘సువర్ణసుందరి’ కి స్ఫూర్తి కావొచ్చన్న విశ్లేషకుల - పోనీ సినిమా చరిత్రకారుల అభిప్రాయంతో విభేదించారు అంజలీ దేవి. సుప్రసిద్ధ సంగీత దర్శకుడైన భర్త ఆదినారాయణ రావు విరివిగా ఇంగ్లీషు పుస్తకాలు చదివేవారనీ, బహుశా వాటి లోంచి ఎక్కడో స్ఫూర్తి పొంది ఆయన ‘సువర్ణ సుందరి’ కథ రాసుకున్నారనీ అన్నారు. కాకినాడలో రంగస్థల కళాకారుడిగా వున్నప్పట్నించే ఆయన రచయిత అనీ, కవి అనీ, సంగీత దర్శకుడు కూడాననీ చెప్పుకొచ్చారు అంజలి. అలా  ‘సువర్ణ సుందరి’ కథని ఆదినారాయణరావు రచయిత సదాశివ సుబ్రహ్మణ్యం కి చెప్తే,  ఆప్పుడాయన పూర్తి స్థాయి స్క్రిప్టు రాసిచ్చారనీ, దాన్ని మళ్ళీ సముద్రాల రాఘవాచార్య మెరుగులు దిద్దారనీ, మాటలు కూడా కొన్ని ఆయనే రాశారనీ వివరించారామె. టైటిల్స్ లో సంభాషణల రచయితగా మల్లాది రామకృష్ణ శాస్త్రి పేరుంటుంది. కథకి సదాశివ బ్రహ్మంతో బాటు ‘ఆదిత్యన్’ అనే పేరు వేశారు. ఈ ‘ఆదిత్యన్’  ఎవరంటే ఆదినారాయణ రావే. ఎందుకో సొంత పేరు వేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదట. ఇక పాటలు సముద్రాల, జూనియర్ సముద్రాల, కొసరాజు రాశారు.
      మొత్తం 14 పాటలున్న ఈ మూడున్నర గంటల సంగీత రసాత్మక జానపద ఫాంటసీ లో  సముద్రాల రాఘవాచార్య రాసిన ‘పిలవకురా’ పాట పి. సుశీల కంఠంతో టాప్ సాంగ్ గా చెప్పొచ్చు. ఐతే అంజలీ దేవి తన మీద చిత్రీకరించిన ఆరు పాటలూ సుశీల చేత పాడించి, ఒక్క ‘హాయి హాయి గా  ఆమని సాగే’  పాటని మాత్రం జిక్కీ చేత ఎందుకు పాడించారని అడిగినప్పుడు, ‘ఏమో ఆమె మరుగున పడిపోతోందని పాడించి వుంటారేమో!’ అన్నారు అమాయకంగా అంజలీదేవి.

అక్కినేనికి బహుమతి!

కూలీ’ షూటింగులో అమితాబ్ బచ్చన్ బల్ల అంచుకి గుద్దుకుని ప్రమాదం పాల
య్యారు. తర్వాత కోలుకుని అదే స్థాయిలో ఫైట్స్ చేస్తూ వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు విషయంలో అలా జరగలేదు. ఆయనకి  ‘సువర్ణ సుందరి’ రైట్ ఎబౌట్ టర్న్ కి శాస్వత చెక్ పెట్టేసింది. కుడివైపు నుంచి ఎడమకి చుట్టూ తిరగలేని పరిస్థితి ఇప్పటికీ వెన్నాడుతోంది !

‘సువర్ణ సుందరి’ లో కోయ వాళ్ళతో ఒక పోరాట దృశ్యంలో పైనుంచి దూకాలి అక్కినేని. అలా దూకినప్పుడు కాలు మడత పడిపోయింది. దాంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీంతో తను నటిస్తున్న వేరే సినిమా  ‘మాయాబజార్’ విడుదల మూడు నెలలు ఆలస్య మైపోయింది.  అప్పటినుంచీ అక్కినేని ఒక్క ‘ప్రేమనగర్’ మినహా ఏ సినిమా పాటలోనైనా ఆ స్టెప్స్ వేసినప్పుడు రైట్ అబౌట్ టర్న్ ఉండదు. ఇదీ ‘ఆయనకి ‘సువర్ణ సుందరి’  ఇచ్చిన బహుమానం.

హిందీ రీమేక్ లో నటించమని అక్కినేనిని కోరినప్పుడు ఒప్పుకోలేదు. తెలుగులోనే తనది ప్రాముఖ్యం లేని పాత్ర,  ఇంకా హిందీలో ఎందుకన్నారు. బలవంత పెడితే సరేననక తప్పలేదు. అదే ఆయన జీవితంలో నటించిన ఏకైక హిందీ సినిమా అయింది. ఇదికాదు విశేషం- హిందీలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. చిన్నప్పుడు హిందీ విశారద పరీక్ష పాసవడం వల్లే  ఇది సాధ్యమైంది.  అలాగే అంజలీ దేవి కూడా తన పాత్రకి  తనే హిందీ డబ్బింగ్ చెప్పుకున్నారు.


సికిందర్
(మార్చి 2010, ‘సాక్షి’ కోసం)


    పాటలంటే మాటలా!


    హాయి హయిగా ఆమని సాగే '  ఘంటసాల – జిక్కి - దీని హిందీ రూపం ‘కుహూ కుహూ బోలె కోయలియా’  లతా- రఫీ  పాడారు.  సంగీత దర్శకుడిగా ఆదినారాయణ రావుని అజరామరుడిగా చేసిన  పాటలు... రాగమాలికలో - అంటే  హంసానందిని, బహార్, యమన్, కానడ అనే నాల్గు రాగాల్లో ప్రయోగాత్మకంగా స్వర పరచిన ఈ పాట ఉత్తర, దక్షిణ తేడాల్ని చెరిపేసింది.

     బాంబే జర్నలిస్టుల సంఘం  ఆదినరాయనరావుని ఉత్తమ జాతీయ సంగీత దర్శకుడి అవార్డుతో సత్కరించింది. ఇవాళ  ఇళయరాజా, ఏ.ఆర్.  రెహ్మాన్ లకి జాతీయ స్థాయిలో దక్కుతున్న గౌరవాల గురించి ఎంతో ప్రచారం జరుగుతోంది గానీ, దక్షిణ భారతం నుంచి ఏనాడో ఆదినారాయణరావు సాధించిన ఈ ఘనత రికార్డయి వుంది. ఆదినారాయణరావు ట్యూన్స్ ని ఎక్కడ నుంచీ తీసుకుంటాడో  తెలీదు. ఎలా మౌల్ద్ చేస్తాడో అంతకన్నా తెలీదు. .కాస్త మహారాష్ట్ర టచ్ ఉంటుందంతే.  అందుకే ‘భక్త తుకారాం’ పాటలు కూడా మరాఠా నేపధ్యానికి అంతగా అతికిపోయాయి.

   ఇక ‘రండి రండి' పాటలో అంజలీ దేవి చీరకట్టు లతామంగేష్కర్ కి  ఎంత ముచ్చటో.   ఆ పాటకి ఆమె బాగా ఇష్టమై పోయింది.   హిందీ పాటల రికార్డింగ్ పూర్తయ్యాక, అప్పట్లో లతా తీసుకుంటున్న పారితోషికం పాటకి 40 వేల చొప్పున వేసి, అంజలీ దేవి –ఆదినారాయనరావులు అందించబోతే తీసుకోలేదు.  'ఇంత  అద్భుతమైన  సంగీతానికి ఎలా వెల  కట్టగలం, ఈ పాటలకి అసలేమీ తీసుకోకుండా పాడాలి. అలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందు లొస్తాయి కాబట్టి, పాటకి రెండు వేల చొప్పున మాత్రం ఇవ్వండి' అని లతా అనేసరికి కళ్ళు తిరిగాయి అంజలీ దేవి –ఆదినారాయణరావు జంటకి..

మ్యూజికాలజిస్టు ‘రాజా’ సౌజన్యంతో  



సాంకేతికం : ఫైట్స్


ఫైట్స్..జీవితాన్ని త్యాగం చేసే కళ!

కణ్ణన్ నందూ రాజ్ 
             సినిమాల్లో నిద్రపుచ్చే సన్నివేశా లుండొచ్చు. నిఖార్సైన సిగరెట్ సాంగ్స్ ఉండొచ్చు. శుభ్రంగా ఇంటికి పంపించేసే ఇంటర్వెల్స్ కూడా ఉండి తీరొచ్చు.. కానీ బోరు కొట్టే ఫైటింగ్ దృశ్యాలున్నట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఫైటింగ్ దృశ్యాలకి ప్రేక్షకులు లేచిపోవడం ఎక్కడా జరగలేదు. ఎందుకు? ఎందుకంటే, ఏ రెండు సినిమాల్లోనూ అవి ఒకేలా వుండవు కాబట్టి. నిన్నటి ఫైటింగ్ ఇవ్వాళ్ళ కన్పించదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మారిపోతూ ఉండేవి ఫైట్సే, యాక్షన్ దృశ్యాలే. ‘ఎన్నైతే అలలు సముద్రం లో ఉంటాయో, అన్నేసి వేరియేషన్స్ తో పుట్టుకొచ్చేవి ఫైట్స్ ఒక్కటే!’

        ‘కథ-స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు’ లో ఫైట్స్ నవ్విస్తే, ‘బిందాస్’ లో ఇంటర్వెల్ దగ్గర హృదయాల్ని కదిలిస్తుంది. ‘నేను మీకు తెలుసా’ లో ఊపిరి బిగబట్టేలా చేస్తే, ‘ఆరుగురు పతివ్రతలు’ లో చెప్పలేనంత థ్రిల్ చేస్తాయి. ఫైట్స్ ఇప్పుడు రియలిస్టిక్ బిజినెస్ అయిపోయింది. ఎప్పటికప్పుడు ఫైట్ మాస్టర్ల నుంచి కొత్తదనాన్ని డిమాండ్ చేసే క్రాఫ్ట్ గా మారిపోయింది. ఈ డిమాండ్ ని తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తే  వెనకబడిపోవడమే.

        కణ్ణన్ నందూ రాజ్ అలియాస్ నందూ మాస్టర్ విషయంలో ఈ వెనకబడి పోవడం జరగలేదు. జరగదు కూడా. 24 ఏళ్ల సుదీర్ఘ మైన తన సర్వీసులో అలసత్వాన్ని ప్రదర్శించింది లేదు. అప్రమత్తంగా ఉంటూ, నిత్య విద్యార్థిలా ఎప్పుడూ కొత్త కొత్త టెక్నిక్స్ తో, సాఫ్ట్ వేర్స్ తో, సీ జీ యోగ్యతలతో, తనని తాను అప్ డేట్ చేసుకుంటూ,  ఈ పోటీ రంగంలో వెనకబాటు తనానికి దీటుగా కెరీర్ కొనసాగిస్తున్న ఆల్ టైం హిట్ ఫైట్ మాస్టరీయన.

        కృష్ణ కాంత్ పార్క్ కి ఉదయం ఎనిమిది గంటలకివెళ్తే, అక్కడ ఫైటర్స్ తో ప్రాక్టీసు చేయిస్తూ కన్పిస్తారు. హేండీ కామ్ తో ఆ ఫైట్ కంపోజింగ్స్ ని చిత్రీకరించి, ఎడిట్ చేసుకుని, ఎఫెక్ట్స్ వేసి, సీజీ అవసరముంటే అదీ పూర్తి చేసుకుని, రిజల్ట్స్ ని పరిశీలించుకుంటారు. ఈ ప్రాక్టీసు-చిత్రీ కరణ సెషన్ కొన్నిరోజులపాటూ సాగుతుంది. ఇది పూర్తి సంతృప్తి కల్గించాకే  సెట్స్ మీదికి వెళ్లి వాటిని ఎనాక్ట్  చేస్తారు.
      ‘బిందాస్’ లో పాపులరైన  ఇంటర్వెల్ ఫైట్ కి దర్శకుడు వీరుపోట్ల చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో  హీరో మంచు మనోజ్ కూడా ఇన్వాల్వ్ అయి, నందు మాస్టర్ తో కలిసి టీం వర్క్ చేశారు. ఆ ప్రాక్టీసు ఆరు రోజులపాటు సాగింది. ఆ తర్వాతే షూటింగు కెళ్ళారు. ఈ సినిమా చూసి వున్న ప్రేక్షకులకి ఆ యాక్షన్ దృశ్యాలెంత కదిలించాయో గుర్తుండే వుంటుంది.

       ‘జీవితాన్ని త్యాగం చేసే కళ అన్నా మాదీ!’ అన్నారు ఎమోషనల్ గా – ‘ఎదురుగా రిస్కు  కన్పిస్తూనే వుంటుంది కదన్నా, అయినా తెగిస్తాం మేం. ప్రాణాల్ని పణంగా పెడతాం. హీరోకి మాత్రం చిన్న ప్రమాదం జరగనివ్వం. ఇదొక అద్భుతమైన ఆర్ట్ అన్నా, డిఫెన్స్-అఫెన్స్-యాక్షన్-రియాక్షన్ - టైమింగ్..  వీటి చుట్టే మా కళ  అల్లుకుని వుంటుంది. పాతబడి పోయే ప్రసక్తే లేదన్నా. ఎందుకంటే ఎన్నైతే అలలు సముద్రం లో ఉంటాయో, అన్నేసి వేరియేషన్స్ తో పుట్టుకొచ్చేవి ఫైట్స్ ఒక్కటే!’

     ‘అసలు ఫైట్ మాస్టర్ అర్హతలేమిటి?’ అన్నప్పుడు, కెమెరా నాలెడ్జి, ఎడిటింగ్, కంపోజింగ్, డిస్కషన్ ఈ నాల్గూ తప్పనిసరి అన్నారు. చర్చ మూలాల్లో కి వెళ్ళింది. ఆ వివరాలు చూస్తే, ఫైట్ మాస్టర్ గా ఎదగాలంటే ముందుగా జిమ్నాస్టిక్స్ నేర్చుకుని ఫైటర్ గా ఏడేళ్ళ పాటు అన్నిరకాల ఫైట్స్ చేయాలి. ఆ తర్వాత ఐదేళ్లూ అసిస్టెంట్ గా కంపోజింగ్, ఎడిటింగ్, ఇతర షూటింగ్ లావాదేవీ లూ చూసుకోవాలి. అప్పుడే యూనియన్ పెద్దలు మాస్టర్ గా కార్డు ఇవ్వడం గురించి ఆలోచిస్తారు. బయట ఏ కరాటేలు నేర్చుకుని, ఎన్ని బెల్టులు సాధించుకొచ్చినా, ఇక్కడ మొదటినుంచీ మళ్ళీ మొదలవ్వాల్సిందే తప్ప షార్ట్ కట్స్ వుండవు.

         చిన్నప్పప్పుడు మొదట్నించే మొదలయ్యారు నందూ మాస్టర్. ఆదోనిలో స్థిరపడ్డ తల్లిదండ్రులు తమిళులు. అక్కడే పుట్టి పెరిగిన తను కర్రసాము, కత్తిసాము, మల్లయుద్ధం, బండి చక్రం తిప్పడాలూ వంటి రూరల్ విద్యలు నేర్చుకుని, 1987 లో హైదరాబాద్ బాట పట్టారు. విచిత్రంగా విఖ్యాత  డాన్స్ మాస్టరు సుందరం దగ్గరి కెళ్ళి, తనని డాన్సర్ గా చేర్చుకొమ్మని బతిమిలాడారు. విధి ఈ అపక్రమాన్ని ఒప్పుకోలేదేమో. జిమ్నాస్టిక్స్ వైపు మళ్ళి అది నేర్చుకుంటూ హీరో సుమన్ కి అసిస్టెంట్ గా చేరారు. ఈయన టాలెంట్ ని సుమన్ గుర్తించి చెన్నైలో సుప్రసిద్ధ రాజూ మాస్టర్ కి రికమెండ్ చేశారు. అలా 1990 లో రాజూ మాస్టర్ దగ్గర ఫైటర్ గా చేరారు. నేటి టాప్ మాస్టర్లు రామ్ – లక్ష్మణ్ లు, విజయ్ అప్పటికే రాజూ మాస్టర్ దగ్గర పని చేస్తున్నారు. నందూ రాజ్ వీళ్ళకి సహ ఫైటర్ గా కుదిరారు. అప్పట్నుంచీ అన్ని భాషల్లో ఎందరెందరో అగ్రహీరోల సినిమాలకి పనిచేస్తూ వచ్చాక, 2001 లో రాజేంద్రప్రసాద్ నటించిన ‘అమ్మాయి నవ్వితే’ కి మాస్టర్ గా ప్రమోట్ అయ్యారు నందూ.

       నాటి నుంచి నేటి దాకా 80 సినిమాలు పూర్తి చేశారు. తనకి ఈవీవీ సత్యనారాయణ సినిమాలకే ఎక్కువ పేరొచ్చిందట. ‘మంజూనాథ’ లో చిరంజీవి శివతాండవం పాటకి రోప్ సీన్ చేసింది తనే. ఒక్కోసారి పాటల చిత్రీకరణల్లో కూడా ఫైట్ మాస్టర్ల అవసరముంటుందని చెబుతూ, ‘అందాల రాముడు’ లో ఒక పాటకి  సునీల్  మోకాళ్ళ మీద వేసిన పిల్లిమొగ్గలు అంతా తను చేసిన వైర్ వర్కే నన్నారు.

       ఇకపోతే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’, హేమంత్ మధుకర్ దర్శకత్వం లో ‘వస్తాడు నా రాజు’ సినిమాలకి తాజాగా యాక్షన్ దృశ్యాల కొరియోగ్రఫీ పూర్తి చేసిన కణ్ణన్ నందూ రాజ్ మాస్టర్, ప్రస్తుతం మళ్ళీ మంచు మనోజ్ తో ‘మిస్టర్ నోకియా’, తనీష్ తో ‘కోడిపుంజు’ లతో బాటు, ‘సంచలనం’, ‘ తొలిసారిగా’ అనే మరో రెండు సినిమాలకీ   ఫైట్స్ సమకూరుస్తూ బిజీగా వున్నారు.

సికిందర్

(జూన్, 2011 ‘ఆంద్ర జ్యోతి’ కోసం)