రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, February 26, 2015

సాంకేతికం : ఫైట్స్


ఫైట్స్..జీవితాన్ని త్యాగం చేసే కళ!

కణ్ణన్ నందూ రాజ్ 
             సినిమాల్లో నిద్రపుచ్చే సన్నివేశా లుండొచ్చు. నిఖార్సైన సిగరెట్ సాంగ్స్ ఉండొచ్చు. శుభ్రంగా ఇంటికి పంపించేసే ఇంటర్వెల్స్ కూడా ఉండి తీరొచ్చు.. కానీ బోరు కొట్టే ఫైటింగ్ దృశ్యాలున్నట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఫైటింగ్ దృశ్యాలకి ప్రేక్షకులు లేచిపోవడం ఎక్కడా జరగలేదు. ఎందుకు? ఎందుకంటే, ఏ రెండు సినిమాల్లోనూ అవి ఒకేలా వుండవు కాబట్టి. నిన్నటి ఫైటింగ్ ఇవ్వాళ్ళ కన్పించదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మారిపోతూ ఉండేవి ఫైట్సే, యాక్షన్ దృశ్యాలే. ‘ఎన్నైతే అలలు సముద్రం లో ఉంటాయో, అన్నేసి వేరియేషన్స్ తో పుట్టుకొచ్చేవి ఫైట్స్ ఒక్కటే!’

        ‘కథ-స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు’ లో ఫైట్స్ నవ్విస్తే, ‘బిందాస్’ లో ఇంటర్వెల్ దగ్గర హృదయాల్ని కదిలిస్తుంది. ‘నేను మీకు తెలుసా’ లో ఊపిరి బిగబట్టేలా చేస్తే, ‘ఆరుగురు పతివ్రతలు’ లో చెప్పలేనంత థ్రిల్ చేస్తాయి. ఫైట్స్ ఇప్పుడు రియలిస్టిక్ బిజినెస్ అయిపోయింది. ఎప్పటికప్పుడు ఫైట్ మాస్టర్ల నుంచి కొత్తదనాన్ని డిమాండ్ చేసే క్రాఫ్ట్ గా మారిపోయింది. ఈ డిమాండ్ ని తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తే  వెనకబడిపోవడమే.

        కణ్ణన్ నందూ రాజ్ అలియాస్ నందూ మాస్టర్ విషయంలో ఈ వెనకబడి పోవడం జరగలేదు. జరగదు కూడా. 24 ఏళ్ల సుదీర్ఘ మైన తన సర్వీసులో అలసత్వాన్ని ప్రదర్శించింది లేదు. అప్రమత్తంగా ఉంటూ, నిత్య విద్యార్థిలా ఎప్పుడూ కొత్త కొత్త టెక్నిక్స్ తో, సాఫ్ట్ వేర్స్ తో, సీ జీ యోగ్యతలతో, తనని తాను అప్ డేట్ చేసుకుంటూ,  ఈ పోటీ రంగంలో వెనకబాటు తనానికి దీటుగా కెరీర్ కొనసాగిస్తున్న ఆల్ టైం హిట్ ఫైట్ మాస్టరీయన.

        కృష్ణ కాంత్ పార్క్ కి ఉదయం ఎనిమిది గంటలకివెళ్తే, అక్కడ ఫైటర్స్ తో ప్రాక్టీసు చేయిస్తూ కన్పిస్తారు. హేండీ కామ్ తో ఆ ఫైట్ కంపోజింగ్స్ ని చిత్రీకరించి, ఎడిట్ చేసుకుని, ఎఫెక్ట్స్ వేసి, సీజీ అవసరముంటే అదీ పూర్తి చేసుకుని, రిజల్ట్స్ ని పరిశీలించుకుంటారు. ఈ ప్రాక్టీసు-చిత్రీ కరణ సెషన్ కొన్నిరోజులపాటూ సాగుతుంది. ఇది పూర్తి సంతృప్తి కల్గించాకే  సెట్స్ మీదికి వెళ్లి వాటిని ఎనాక్ట్  చేస్తారు.
      ‘బిందాస్’ లో పాపులరైన  ఇంటర్వెల్ ఫైట్ కి దర్శకుడు వీరుపోట్ల చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో  హీరో మంచు మనోజ్ కూడా ఇన్వాల్వ్ అయి, నందు మాస్టర్ తో కలిసి టీం వర్క్ చేశారు. ఆ ప్రాక్టీసు ఆరు రోజులపాటు సాగింది. ఆ తర్వాతే షూటింగు కెళ్ళారు. ఈ సినిమా చూసి వున్న ప్రేక్షకులకి ఆ యాక్షన్ దృశ్యాలెంత కదిలించాయో గుర్తుండే వుంటుంది.

       ‘జీవితాన్ని త్యాగం చేసే కళ అన్నా మాదీ!’ అన్నారు ఎమోషనల్ గా – ‘ఎదురుగా రిస్కు  కన్పిస్తూనే వుంటుంది కదన్నా, అయినా తెగిస్తాం మేం. ప్రాణాల్ని పణంగా పెడతాం. హీరోకి మాత్రం చిన్న ప్రమాదం జరగనివ్వం. ఇదొక అద్భుతమైన ఆర్ట్ అన్నా, డిఫెన్స్-అఫెన్స్-యాక్షన్-రియాక్షన్ - టైమింగ్..  వీటి చుట్టే మా కళ  అల్లుకుని వుంటుంది. పాతబడి పోయే ప్రసక్తే లేదన్నా. ఎందుకంటే ఎన్నైతే అలలు సముద్రం లో ఉంటాయో, అన్నేసి వేరియేషన్స్ తో పుట్టుకొచ్చేవి ఫైట్స్ ఒక్కటే!’

     ‘అసలు ఫైట్ మాస్టర్ అర్హతలేమిటి?’ అన్నప్పుడు, కెమెరా నాలెడ్జి, ఎడిటింగ్, కంపోజింగ్, డిస్కషన్ ఈ నాల్గూ తప్పనిసరి అన్నారు. చర్చ మూలాల్లో కి వెళ్ళింది. ఆ వివరాలు చూస్తే, ఫైట్ మాస్టర్ గా ఎదగాలంటే ముందుగా జిమ్నాస్టిక్స్ నేర్చుకుని ఫైటర్ గా ఏడేళ్ళ పాటు అన్నిరకాల ఫైట్స్ చేయాలి. ఆ తర్వాత ఐదేళ్లూ అసిస్టెంట్ గా కంపోజింగ్, ఎడిటింగ్, ఇతర షూటింగ్ లావాదేవీ లూ చూసుకోవాలి. అప్పుడే యూనియన్ పెద్దలు మాస్టర్ గా కార్డు ఇవ్వడం గురించి ఆలోచిస్తారు. బయట ఏ కరాటేలు నేర్చుకుని, ఎన్ని బెల్టులు సాధించుకొచ్చినా, ఇక్కడ మొదటినుంచీ మళ్ళీ మొదలవ్వాల్సిందే తప్ప షార్ట్ కట్స్ వుండవు.

         చిన్నప్పప్పుడు మొదట్నించే మొదలయ్యారు నందూ మాస్టర్. ఆదోనిలో స్థిరపడ్డ తల్లిదండ్రులు తమిళులు. అక్కడే పుట్టి పెరిగిన తను కర్రసాము, కత్తిసాము, మల్లయుద్ధం, బండి చక్రం తిప్పడాలూ వంటి రూరల్ విద్యలు నేర్చుకుని, 1987 లో హైదరాబాద్ బాట పట్టారు. విచిత్రంగా విఖ్యాత  డాన్స్ మాస్టరు సుందరం దగ్గరి కెళ్ళి, తనని డాన్సర్ గా చేర్చుకొమ్మని బతిమిలాడారు. విధి ఈ అపక్రమాన్ని ఒప్పుకోలేదేమో. జిమ్నాస్టిక్స్ వైపు మళ్ళి అది నేర్చుకుంటూ హీరో సుమన్ కి అసిస్టెంట్ గా చేరారు. ఈయన టాలెంట్ ని సుమన్ గుర్తించి చెన్నైలో సుప్రసిద్ధ రాజూ మాస్టర్ కి రికమెండ్ చేశారు. అలా 1990 లో రాజూ మాస్టర్ దగ్గర ఫైటర్ గా చేరారు. నేటి టాప్ మాస్టర్లు రామ్ – లక్ష్మణ్ లు, విజయ్ అప్పటికే రాజూ మాస్టర్ దగ్గర పని చేస్తున్నారు. నందూ రాజ్ వీళ్ళకి సహ ఫైటర్ గా కుదిరారు. అప్పట్నుంచీ అన్ని భాషల్లో ఎందరెందరో అగ్రహీరోల సినిమాలకి పనిచేస్తూ వచ్చాక, 2001 లో రాజేంద్రప్రసాద్ నటించిన ‘అమ్మాయి నవ్వితే’ కి మాస్టర్ గా ప్రమోట్ అయ్యారు నందూ.

       నాటి నుంచి నేటి దాకా 80 సినిమాలు పూర్తి చేశారు. తనకి ఈవీవీ సత్యనారాయణ సినిమాలకే ఎక్కువ పేరొచ్చిందట. ‘మంజూనాథ’ లో చిరంజీవి శివతాండవం పాటకి రోప్ సీన్ చేసింది తనే. ఒక్కోసారి పాటల చిత్రీకరణల్లో కూడా ఫైట్ మాస్టర్ల అవసరముంటుందని చెబుతూ, ‘అందాల రాముడు’ లో ఒక పాటకి  సునీల్  మోకాళ్ళ మీద వేసిన పిల్లిమొగ్గలు అంతా తను చేసిన వైర్ వర్కే నన్నారు.

       ఇకపోతే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’, హేమంత్ మధుకర్ దర్శకత్వం లో ‘వస్తాడు నా రాజు’ సినిమాలకి తాజాగా యాక్షన్ దృశ్యాల కొరియోగ్రఫీ పూర్తి చేసిన కణ్ణన్ నందూ రాజ్ మాస్టర్, ప్రస్తుతం మళ్ళీ మంచు మనోజ్ తో ‘మిస్టర్ నోకియా’, తనీష్ తో ‘కోడిపుంజు’ లతో బాటు, ‘సంచలనం’, ‘ తొలిసారిగా’ అనే మరో రెండు సినిమాలకీ   ఫైట్స్ సమకూరుస్తూ బిజీగా వున్నారు.

సికిందర్

(జూన్, 2011 ‘ఆంద్ర జ్యోతి’ కోసం)