రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, May 6, 2020

937 : స్క్రీన్ ప్లే సంగతులు


        ఇంటర్వెల్ తర్వాత-
        విషయం 1. హాస్పిటల్ బెడ్ మీదున్న విక్రం ఫ్లాష్ బ్యాక్ చూస్తాడు. అందులో చెల్లెలు సుష్మి ఎవరో ఇద్దరు ఇంట్లోకి తొంగి చూశారంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ బిట్ తర్వాత, అభిలాష్ వచ్చి నేహా మిస్సింగ్ కేసులో విక్రం ని ప్రశ్నించాలంటాడు. విక్రం ఎదురుతిరుగుతాడు. ఇద్దరూ కొట్టుకోబోతూంటే చీఫ్ వచ్చి తిడతాడు. విక్రం ని ప్రశ్నించే పధ్ధతి ఇది కాదంటాడు. విక్రం ని వెళ్లి పొమ్మంటాడు. వెళ్తూంటే ఆపి, రోహిత్ రాజూ గెస్ట్ హౌస్ ముందు శవం కోసం సెర్చ్ పార్టీతో వున్నాడు వెళ్ళమని రహస్యంగా చెప్తాడు. విక్రం వెళ్ళిపోతాడు. చీఫ్ నేహా కేసుని అభిలాష్ నుంచి పీకి విక్రం కిస్తున్నట్టు చెప్తాడు. 

        వివరణ:  చాలా ఆశ్చర్యమేస్తుంది ఈ సీను చూస్తూంటే. ఇన్వెస్టిగేషన్ కథతో ప్రేక్షకులకి పెద్దగా ఇంటలిజెన్స్ వుండదనుకున్నట్టుంది కథకుడు. పరస్పర విరుద్ధ విషయాలు చెప్పాడు. శవం ప్రీతిదా, నేహాదా తెలుసుకోవడానికి పరుగెత్తడం మానేసి, మధ్యలో చెల్లెలి ఫ్లాష్ బ్యాకు షాకుతో హాస్పిటల్లో జాయినయ్యాడు విక్రం. హాస్పిటల్లో జాయినయిన వాడి మీద వచ్చి అభిలాష్ దౌర్జన్యం. నేహా కేసులో ప్రశ్నించాలంటూ దెబ్బలాట. ఇంకా నేహా మిస్సింగ్ కేసేమిటి లెటర్ అందితే? ఇదిప్పుడు మర్డర్ కేసు. ఇప్పుడిప్పుడే ఒక లెటర్ దొరికిందనీ, ఆ లెటర్ లో డెడ్ బాడీ గురించి వుందనీ తెలియదా అభిలాష్ కి? రెండోది, చీఫ్ వచ్చి, విక్రంకి రహస్యంగా చెప్పడమేమిటి? డెడ్ బాడీ గురించి అభిలాష్ కి తెలియకూడదనా? ఇవేం నాటకాలు. లెటర్ లో గెస్ట్ హౌస్ ముందు  డెడ్ బాడీ వుందని వుంటే, గెస్ట్ హౌస్ వెనుక రోహిత్ సెర్చ్ చేస్తున్నాడని చీఫ్ చెప్పడమేమిటి? ఇక నువ్వు కేసు మీద కంటే విక్రం మీద ఫోకస్ చేస్తున్నావని కేసు నుంచి అభిలాష్ ని తప్పించడం. కేసులివ్వడం, లాక్కోవడం ఆషామాషీగా  వుంది. కేసు మీద కంటే తన మీద ఫోకస్ చేస్తాడని విక్రం ముందే చెప్పాడు చీఫ్ కి. ఆ మాట నిజం చేస్తూ ఇప్పుడు చీఫ్ నిర్ణయం. మరి విక్రం ఎమోషనల్ గా పనికి రాడని తనే అన్నాడు. ఇప్పుడు నేహా కేసు విక్రంకే ఎందుకిస్తున్నాడు. ఈ కేసులిచ్చే, పీకే డ్రామా అవసరమా ఈ కథకి? 

       విషయం 2. రాజూ గెస్ట్ హౌస్ ముందు సెర్చ్ పార్టీ తో రోహిత్ వుంటే విక్రం వచ్చేస్తాడు. శవం ఇంకా దొరకలేదనీ, ట్రై చేస్తున్నాననీ అంటాడు రోహిత్. ‘ట్రై చేస్తున్నావా? ఇక్కడ దొరికే బాడీ ప్రీతిదో నేహాదో కూడా తెలీదు. ట్రై చేస్తే సరిపోదు,వెళ్లి ప్రెజర్ పెట్టు. నేను ఫోరెన్సిక్స్ కి వెళ్తున్నా’ అని వెళ్లి పోతూంటాడు. మళ్ళీ ఆగి, ‘మన సస్పెక్ట్ లిస్టులో వున్న వాళ్ళ షూస్, కారు టైర్స్, బైక్ టైర్స్ లో వున్న మడ్ శాంపిల్స్ తీసుకుని కంపేర్ చేయించు. మ్యాచ్ అయితే నాకు చెప్పు. వాళ్ళ ఫోన్లో లైవ్ ట్రాకింగ్ వుంటే ఇక్కడికి వచ్చారేమో చెక్ చేసి చెప్పు’ అని వెళ్ళిపోతాడు.

        వివరణ:  షీలా రాసిన శవంలేని ఉత్తుత్తి లెటర్ మీద ఫేక్ ఇంటర్వెల్ తో బాటు ఇంత కథ. ఆ లెటర్ ఆడుకోవడానికి అదృశ్య విలన్ రాసి వుంటే అదొక అందం, అదొక కథ. పైగా ఇక్కడికొచ్చిన విక్రం క్షణం కూడా వుండడు. రోహిత్ కి చెప్పేసి వెళ్ళిపోతాడు. శవం నేహాదా, ప్రీతిదా ఇక్కడే వుండి తెలుసుకోవాలన్న అర్జెన్సీ ఫీలవడం లేదు. ప్రీతితో ఏ ఫీలింగూ లేకపోతే లేకపోయింది, గర్ల్ ఫ్రెండ్ నేహాని కూడా పట్టించుకోవడం లేదు. ఫోరెన్సిక్స్ కి వెళ్ళిపోతానని జంప్ అవుతున్నాడు. చీటికీ మాటికీ ఈ ఫోరెన్సిక్స్ గోలేంటో అర్ధం గాదు. విక్రం ని ఫోరెన్సిక్స్ కి ట్రాన్స్ ఫర్ చేసేస్తే సరి, అక్కడే పడుంటాడు. ఇంకోటేమిటంటే, శవమే దొరక్కుండా, అనుమానితుల శాంపిల్స్ తీసుకోమంటున్నాడు. శవం దొరక్కపోయినా వాళ్ళని కేసులో ఇరికించేస్తాడా? అనుమానితులు ప్రీతి కేసులో వున్న వ్యక్తులు. ఒకవేళ నేహా శవం దొరికినా వాళ్ళని ఇరికించేస్తాడా? ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమన్నట్టు శవం లేకపోయినా హంతకుణ్ణి పట్టేసుకోవాలనుకుంటున్నాడు... 

     విషయం 3. ఫోరెన్సిక్స్ లాబ్ లో విక్రం ఆ లెటర్ ని  చూపిస్తూ వుంటాడు. డాక్యుమెంట్ ఎగ్జామినర్ దాని మీద చేతి వ్రాతని పరిశీలనకి తీసుకుంటాడు. విక్రం షీలా ఇంటికి వెళ్తాడు అక్కడ రోహిత్ విక్రం కి నేహా కాల్ లిస్టు ఇస్తాడు. కాల్ లిస్టులో విక్రం కి క్లూ ఏమీ దొరకదు. ఇక బ్లూ కారుని ఓఆర్ ఆర్ మీద ఎవరూ చూడలేదని అంటాడు రోహిత్. లారీ యార్డులో టైరు గుర్తులు వాటర్ ట్యాంకర్స్ వి కావచ్చంటాడు. ఇదంతా చూసి క్లూస్ ఏమీ దొరడం లేదని విసుక్కుంటాడు విక్రం. షీలాని మరొకసారి లెటర్ ఎలా దొరికిందో చెప్పమంటాడు విక్రం. ఆమె చెప్తూంటే అతడి దృష్టి గోడకున్న చిత్రపటం మీద పడుతుంది. ఆ చిత్రపటం తనే వేశానని అంటుంది షీలా. విక్రం దాంతో లాబ్ కి వెళ్తాడు. ఈ చిత్రపటంలో వున్న స్ట్రోక్స్, లెటర్ లో వున్న స్ట్రోక్స్ ఒకటేనా పరిశీలించి చెప్పమంటాడు. 

        వివరణ: ప్రతీ వివరణా ఒక హార్రర్ ఫీలింగుతో భయపెడుతోంది. ఎన్నని తప్పులు ఎత్తి చూపడం. మొత్తానికి నేహా కాల్ లిస్టు వచ్చింది. ఈ కాల్ లిస్టు తెచ్చిన వాడు తర్వాత ప్రీతి హత్య కేసులో భార్యతో బాటు కిల్లర్ గా రివీలయ్యే విక్రం అసిస్టెంట్ రోహితే. ఈ కాల్ లిస్టు తెస్తే తనే దొరికిపోతాడని అతడికి తెలీనట్టుంది. ఎందుకంటే, నేహా అదృశ్యంలో కూడా తనే విలన్. ఫాహద్ తో కలిసి ఆమెని కిడ్నాప్ చేసేప్పుడు ఆమెతో పాటు ఆమె ఇంట్లోనే వున్నాడు. కేసు ఫైలు కోసం వెళ్లి ఆ ఫైలు చూస్తూ కూర్చున్నాడు. చూస్తూ చూస్తూ, పళ్ళ రసంలో ఆమెకి మత్తు మందు కలిపిచ్చి, ఫాహద్ తో కిడ్నాప్ చేయించేశాడు. ఇది చివర్లో కిడ్నాప్ సీను రివీలయినప్పుడు చూస్తాం. అంటే ఆ ఫైలు కోసం ఫోన్ చేసే వెళ్లుంటాడు. అప్పుడా కాల్ లిస్టులో చివరి నంబర్ తనదే అయ్యుంటుంది. వేరే నంబర్ నుంచి కాల్ చేసినా ఆ నంబర్ వుంటుంది. ఈ కాల్ లిస్టు ఇప్పుడు చెక్ చేస్తున్న విక్రం, చివరి నంబర్ వ్యక్తిని పట్టుకోకుండా, క్లూస్ ఏమీ దొరకడం లేదని విసుక్కుంటాడు. ఏంటిది విక్రం? ఒక్క చోటైనా- ఒక్కటంటే ఒక్క చోటైనా శ్రద్ధ పెట్టి ఆలోచించవా? ఈ కేసంటే నీకిష్టం లేదా?  


      అసలు ఫైలు కోసం రోహిత్ నేహా ఇంటికి వెళ్ళడమేమిటి? ఆమె ఆఫీసు ఫైలు ఇంటికెందుదుకు తెచ్చి చూపిస్తుంది? రేపు ఆఫీసుకే రమ్మంటుంది. అసలు రోహిత్ ఎవరు ప్రీతి కేసులో ఫైలు అడగడానికి? రోహిత్ విక్రం అసిస్టెంట్. ప్రీతి కేసు చూస్తున్నది శ్రీనివాస్. ఇక ఆ పళ్ళ రసం గ్లాసేమైందో, అదెందుకు లాబ్ కెళ్లలేదో విక్రం కే తెలియాలి. మరొకటేమిటంటే, రోహిత్ గానీ, ఫాహద్ గానీ గ్లవ్స్ తొడుక్కోలేదు. వాళ్ళ వేలిముద్రలు చాలా ఏర్పడి వుండాలి. ఈ కేసు చూసిన ఘనమైన అభిలాష్ ఏం చేశాడో? ‘హిట్’ పేరు నిలబెట్టాలని ఎవడికీ లేదు. ‘హొమిసైడ్ ఇల్లాజికల్ టీం’ అని బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటున్నారు. 

        ఇక లారీ యార్డులో టైర్ల గుర్తులు. నిజానికి చివర్లో రివీలయ్యే దాన్ని బట్టి, ఫాహద్ ప్రీతిని బ్లూ కారులో అపహరించాక, ఇక్కడికి తెచ్చి ఆ కారుని కార్గో ట్రక్ ఎక్కించాడు. అప్పు డా బ్లూ కారు టైర్ల గుర్తులు కూడా పడాలిగా? ట్రక్కు గుర్తులు మాత్రమే ఎందుకు చూపిస్తున్నాడు కథకుడు? 

     ఇక చిత్రపటం. లెటర్ తీసుకుని లాబ్ కి పరుగెత్తడమే దండగ. షీలా ఇంట్లో దొరికిన ఈ రెండూ ఒకటేనని కొట్టొచ్చినట్టూ కన్పించిపోతోంది మన కళ్ళకి. విక్రం లాబ్ లో కూడా కాదు, ఇంట్లో కూర్చుని కామన్ సెన్స్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన వాడు. లాబ్ కి ఒరిజినల్ చిత్రపటం కూడా తీసికెళ్లలేదు. రహస్యంగా ఫోటో తీసి కాపీ అందించాడు. ఒరిజినల్ కావాలని టెక్నీషియన్ అంటే, ఒరిజినల్ తీసుకు రాలేనని విసుక్కున్నాడు. ఎందుకు తీసుకురాలేడు? పోలీస్ పవర్ లేదా? ఆ చిత్రపతమే తీసుకు వెళ్తూంటే షీలా లబలబలాడి అప్పుడే నిజం చెప్పేసేదిగా ఆ లెటర్ తనే రాశానని! పాత్రలతో లైవ్ డ్రామా- కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకుండా, చెత్తా చెదారం క్లూస్ తో ఫేక్ సస్పన్స్ సృష్టించడమేమిటి? ఎండ్ సస్పెన్స్ తో వచ్చే సమస్య ఇదే. ఇన్ఫర్మేషన్ పోగేసుకు వెళ్ళడమే తప్ప నో కాన్ఫ్లిక్ట్, నో డ్రామా, నో కథ.
         
(వార పత్రికల్లో సీరియల్ లాగా... ఇంకా వుంది.
సీరియల్ రాసే అదృష్టం కల్పించిన
కథకుడికి కృతజ్ఞతలు!)

సికిందర్