రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జనవరి 2020, ఆదివారం

911 : సందేహాలు -సమాధానాలు


Q: సినిమా కథలకి స్ట్రక్చర్ ఎంతవరకు అవసరం? స్ట్రక్చర్ లేకుండా కథలు చేయలేమా? శ్రీనివాస్ ఆర్, సహ దర్శకుడు
A: చేసుకోవచ్చు. సినిమా కథకి కొలమానాలేవీ లేవు. ఇలా అనుకుంటేనే నిర్భీతిగా తోచినట్టూ రాసుకోవచ్చు. ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో స్క్రీన్ ప్లే కోర్సులూ, బయట స్క్రీన్ ప్లే వర్క్ షాపులూ ఇదంతా దండగ వ్యవహారం. కెమెరాతో చిత్రీకరించాలంటే, ఎడిటింగ్ చేయాలంటే, గ్రాఫిక్స్ చేయాలంటే, పాటలు కూర్చాలంటే దేనికీ కొలమానా లవసరం లేదు, శాస్త్రం లేకుండానే అన్నీ చేసుకో వచ్చు. ఆఫీసు కూడా వాస్తు శాస్త్రం లేకుండా పెట్టుకోవచ్చు.  వీళ్ళెవరైనా ఇలా కాదని శాస్త్ర ప్రకారం చెప్తూంటే హేళన చేసి పంపొచ్చు.   

Q: గోల్ హీరోది కాకుండా ఎవరి బలవంతం మీదో, బ్లాక్ మెయిల్ వల్లో పని చేయాల్సి వచ్చినప్పుడు ప్లాట్ పాయింట్ - 1 దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లక్ష్యం హీరోది కాదు కాబట్టి ఎమోషన్ జెనరేట్ అవ్వదు కదా? ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే లు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. అలాగే దీనికి రిఫరెన్స్ గా తీసుకోదగిన సినిమాలు కూడా తెలుపగలరు.
పీ., సహకార దర్శకుడు
 
A: మీరనే దాన్ని బట్టి ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే హీరో బ్లాక్ మెయిల్ వల్లో, బలవంతం వల్లో తత్సంబంధ గోల్, అంటే తనది కాని, తన మీదపడ్డ గోల్ ని తీసుకునే సమస్య ఏర్పాటవుతుంది. అప్పుడా బ్లాక్ మెయిల్ లేదా బలవంతపు పట్టులోంచి ఎలా బయట పడాలన్నదే యాక్టివ్ హీరో ప్రయత్నంగా కథ నడుస్తుంది. అంతే తప్ప మీదపడ్డ గోల్ గురించి కాదు. పాసివ్ హీరో అయితే ఆ వొత్తిళ్ళకి (బ్లాక్ మెయిల్, బలవంతం) లొంగి, ఈసురోమని ఏడుస్తూ మీద పడ్డ గోల్ పూర్తి చేసి దండం పెడతాడు. ఈ తేడా గమనించండి. సమస్య ఏర్పాటయింది తన మీద పడ్డ గోల్ గురించి కాదు, తను ఇరుక్కున్న పరిస్థితి (బ్లాక్ మెయిల్, బలవంతం) గురించి. అందువల్ల ఎమోషన్స్ వీటి చుట్టే వుంటాయి. ఈమధ్య ఒక కథలో రోడ్డు పక్క వెయిట్ చేస్తున్న ఎవరో అమ్మాయిని కారొచ్చి గుద్దేస్తే, అక్కడున్న లేత హీరో భయపడి పారిపోతాడు. ఈ కేసులో తను ఇరుక్కుంటాడేమోనని భయపడుతూ వుంటాడు. సాక్ష్యాధారాలూ తనకి వ్యతిరేకంగా వుంటాయి. దీన్నుంచి తను బయటపడాలంటే, యాక్సిడెంట్ చేసి ఆ అమ్మాయిని చంపిందెవరో పట్టుకోవడానికి వయసు చాలని లేత హీరో చచ్చినట్టూ బయల్దేరాలి. అయితే ఈ కథలో ఆ అమ్మాయితో హీరోకి కనెక్షన్ లేనప్పుడు ఎమోషన్ లేదుకదా అనే ప్రశ్న వచ్చింది. ఎమోషన్, కథా ఎవరో తెలియని అమ్మాయి చనిపోవడం గురించి కాదని ఈ లైను చెప్తేనే తెలిసిపోతోంది. ఇది ఫార్ములా కథైతే ఆ అమ్మాయి హీరోకి తెలిసిన అమ్మాయే అయివుండి, అయ్యో చనిపోయింది కదా అనే ఫార్ములా ఎమోషన్ కనెక్ట్ అయి, ఆ చంపిన వాణ్ణి పట్టుకుని శిక్షించే పస లేని, ప్రేక్షకులకి ఇంకా అవసరం లేని, రొటీన్ ఫార్ములా రివెంజి కథయి పోతుంది. ఇది రియలిస్టిక్ కథ. జీవితంలో ఒక్కోసారి మనకి సంబంధం లేని సంఘటనల్లో ఇరుక్కునే అనుభవా లెదురవుతూంటాయి. ఇందులోంచి ఎలా బయట పడాలన్న ప్రయత్నమే హీరో వాస్తవిక కథ. ఇది బయటపడడం  గురించి కథ, పగదీర్చుకోవడం గురించి కాదు.

        ‘మజ్బూర్లో, అమితాబ్ బచ్చన్ తను బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోతానని తెలిసి, కుటుంబం కోసం హంతకుడి డీల్ ఒప్పుకుంటాడు. ఐదు లక్షలు తీసుకుని, హంతకుడు చేసిన హత్యని తన మీదేసుకుని, ఉరికంబం ఎక్కబోతాడు. ఇంతలో జైల్లో బ్రెయిన్ ట్యూమర్ కి చికిత్స జరిగిపోవడంలో చావాల్సిన వాడు బతికి, ఇక ఉరి కంబం ఎక్కడం ఇష్టం లేక, జైల్లోంచి పారిపోయి హంతకుణ్ణి పట్టుకుంటాడు. ఇందులో అమితాబ్ మొదటి ఎమోషన్ కుటుంబ సంక్షేమం, తర్వాతి ఎమోషన్ హత్యలోంచి బయటపడ్డం. మొదటి ఎమోషన్ తో వున్న గోల్ హంతకుడి డీల్ ఒప్పుకుని అది పూర్తిచేయడం, రెండో ఎమోషన్ తో వున్న గోల్ హంతకుడి మీద తిరగబడ్డం.
        కాబట్టి బ్లాక్ మెయిల్, బలవంతం అన్నవి అన్యాయాలే గనుక, వీటితో మొదలయ్యే గోల్స్ తిరుగుబాటుతోనే ముగుస్తాయి. గోల్ ఎలిమెంట్స్ నాల్గు వుంటాయని తెలిసిందే : 1. కోరిక, 2. పణం,3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. ప్లాట్ పాయింట్ వన్లో సమస్యని ఏర్పాటు చేసినప్పుడు, అక్కడున్న గోల్ లో ఈ నాల్గూ సమకూరాయా లేదా సరి చూసుకుంటే సరిపోతుంది.

Q: 1. కొత్త జానర్ సినిమాలు ప్రయత్నించ వచ్చంటూ ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ టీనేజి లవ్ స్టోరీ గురించి ఏదో ఒక ఆర్టికల్ రాశారు. ఇంకా వేరే జానర్స్ ఏం ప్రయత్నించవచ్చో వివరించండి. సినిమాలు వివరించ నవసరం లేదు, ఉదాహరణ లివ్వండి చాలు. 
       2. కొత్త దర్శకులు వెబ్ సిరీస్ కూడా ప్రయత్నించ వచ్చంటారా, లేక సినిమాలకే పరిమితం కావాలంటారా? ఈ మధ్య బాగా పేరున్న దర్శకులు కూడా వెబ్ సిరీస్ ఎక్కువ చేస్తున్నారు కదా?
       
3. మీరు ఎప్పుడో బ్లాగులోనే అన్నట్టు గుర్తు. దర్శకుడు అవాలంటే రెండు మూడు కథలు తయారు చేసుకుని తిరగ వద్దని, ఒకే కథతో గట్టిగా ప్రయత్నించాలని. దీని మీద ఇంకోసారి వివరణ ఇవ్వండి. ఎందుకంటే, బయట ప్రాక్టికల్ గా నిర్మాతలు లేదా హీరోలు ఇది కాదు, ఇంకెక్కడైనా చెప్పండని అంటున్నారు. ఇది నా ఫ్రెండ్స్ కే జరిగింది.
        4. ప్రతి ఆదివారం సందేహాలు - సమాధానాలు కొనసాగించమని ఇదివరకే కోరితే మీరు పట్టించుకోలేదు. ఏదైనా అలవాటు చేయాలి. వరుసగా రెండు వారాలు ఇచ్చి చూడండి, అందరూ ప్రిపేర్ అయి ప్రశ్నలు పంపుతారు. ఒక ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది. పది మందికి మంచే జరుగుతుంది కదా? ఆలోచించండి. ప్రతి ఆదివారం ఈ శీర్షికలో ఫలానా జానర్ మూవీస్ చూడండని మీరు మూవీస్ చెప్పడమో, లేదా ప్రశ్నలు అడిగిన వారు ఎవరైనా ఈ భాషలో సినిమాలు బావున్నాయి చూడమనో, షేర్ చేసుకోవడమో జరిగితే బాగుంటుంది కదాని చిన్న ఆలోచన.  
          నోట్ : ఏదో ఒక ఫ్రెండ్ తో రెగ్యులర్ గా మాట్లాడడం అన్న థాటే తప్ప, మేమింకా నేర్చుకోలేదు మీరింకా నేర్పండని అనడం లేదు. ఇది గమనించండి. థాంక్యూ. 
రవి, సహకార దర్శకుడు 

A: 1. హీరోయిక్ బ్లడ్ షెడ్అనేది హాంగ్ కాంగ్ కొత్త యాక్షన్ జానర్ కి పెట్టిన పేరు. జాన్ వూ దర్శకత్వంలో “ఏ బెటర్ టుమారో” తో బాటు మరికొన్ని వచ్చాయి. హాంగ్ కాంగ్ లో తీసే రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ సినిమాలని కాసేపు పక్కన పెట్టి, ఈ కొత్త జానర్ ని ప్రయతించి సక్సెస్ అయ్యారు. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు చూసి, వీటి కథా కథనాలతో, పాత్ర చిత్రణలతో, మేకింగ్ తో ఈ జానర్ కి సమకూర్చిన ప్రత్యేక జానర్ మర్యాదలేమిటో స్టడీ చేయండి. ఈ జానర్ మర్యాదలు తీసేసి రొటీన్ తెలుగు మాడిన మసాలా చేయాలనుకుంటే దీని జోలికి పోనవసరం లేదు. దీని రిఫరెన్స్ లేకుండానే ఇప్పుడు తీస్తున్నలాటి తెలుగు మాడిన మసాలాలు యధా విధిగా తీసుకోవచ్చు.

        ఫ్యామిలీ ఓరియెంటెడ్ అడ్వెంచర్ జానర్ : తెలుగులో వచ్చే స్టార్ సినిమాలేమిటి? ఫ్యామిలీల కోసమని అవే కథలు, అవే పాత్రలు, అవే కామెడీలు, టెంప్లెట్ లో అటు మార్చి ఇటు మార్చి అవే దర్శకత్వాలతో అలాగే తీయడమేగా? వీటికి మళ్ళీ రివ్యూలు. పాపం ఫ్యామిలీ ప్రేక్షకులు! చూసిందే చూసి చూసి చూస్తూనే... వుంటారు యుగాంతం దాకా. హాలీవుడ్ లో “ఫ్యామిలీ ఓరియెంటెడ్ అడ్వెంచర్” జానర్ సినిమాలతో దీనికి చెక్ పెట్టొచ్చు. కల్ట్ క్లాసిక్ “ది ప్రిన్సెస్ బ్రైడ్” లాంటివి చూసి, ఫీల్ తో సహా వీటి జానర్ మర్యాదలేమిటో గుర్తించండి. వీటిని పట్టుకొచ్చి మళ్ళీ అదే మసాలా ఫ్యామిలీ స్టార్ సినిమాలుగా మార్చేస్తే లాభం లేదు. 
          కామెడీలో కొన్ని సబ్ జానర్స్ వున్నాయి గానీ అవి తెలుగులో పనికి రావు. అలాగే రోమాన్స్ లో ‘చిక్ ఫ్లిక్’ అనే గర్ల్స్ కామెడీలున్నాయి. ఇవి కూడా తెలుగుకి కుదరకపోవచ్చు. కానీ ‘గై ఫిలిమ్స్’ అనే హాలీవుడ్ జానర్ వుంది. యాక్షన్ లో ఈ జానర్ విభిన్నంగా వుంటుంది కొన్ని ప్రత్యేక జానర్ మర్యాదలతో. దీన్ని ప్రయత్నించ వచ్చు. తెలుగు కమర్షియల్ సినిమాలకి హాలీవుడ్, హాంకాంగ్, కొరియన్ జానర్సే ఇమిడిపోతాయి. వరల్డ్ మూవీ జానర్స్ పనికిరావు. కొంపలు ముంచుతాయి.
           2. ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని అందులో కృషి చేస్తే మంచిది. సినిమా అనుకుంటే సినిమాల వైపే వుండాలి. సినిమా దర్శకత్వ అవకాశం ఇక రాదని ఫైనల్ గా సినిమాలకి గుడ్ బై చెప్పేస్తే, అప్పుడు వెబ్ సిరీస్ దర్శకత్వం వైపు వెళ్తే వెళ్ళొచ్చు గానీ, అక్కడా స్ట్రగుల్ చేయాల్సిందే. సినిమాల్లో అసిస్టెంట్ గా పని చేస్తూ దర్శకత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, అసిస్టెంట్ గా కూడా గ్యాపులు వస్తూంటాయి. ఆ గ్యాపులో వెబ్ సిరీస్ కి అసిస్టెంట్ గా అవకాశం లభిస్తే వెళ్ళొచ్చు. ఇటు యధావిధిగా సినిమా దర్శకత్వ  ప్రయత్నాలు చేసుకోవడానికి వీలుంటుంది. లక్ష్యం చెదరదు. గ్యాప్ అనేది ఆర్ధిక సమస్యల్ని సృష్టించవచ్చు. అందుకని స్థిరపడే వరకూ ఏదో ఒక ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆన్ లైన్లో ఎన్నో జాబ్స్ వుంటాయి. రోజుకో గంట కేటాయిస్తే సరిపోతుంది. అప్పులు మాత్రం చస్తే చెయ్యకూడదు. అప్పుల బాధలు క్రియేటివిటీని దెబ్బ తీస్తాయి. ఇక పేరున్న దర్శకులు వెబ్ సిరీస్ చేస్తున్నారంటే పేరుంది కాబట్టి చేస్తున్నారు. 

           3. కథ విన్నాక ఇది కాదు, ఇంకెక్కడైనా చెప్పండని అంటున్నారంటే ఇంకో కథ వుంటే చెప్పమని కాదు. అలా ఎన్నటికీ  జరగదు. ఒక అభ్యర్ధికి ఒక్క అవకాశమే ఇస్తారు. అది నచ్చకపోతే ఇంకోటి చెప్తామంటే అవకాశమివ్వరు. కనుక ఒకటి కాకపోతే ఇంకొకటి విన్పించవచ్చన్న ఆప్షన్స్  పెట్టుకుని రెండు మూడు కథలతో వెళ్ళడం అవివేకం. రెండు మూడు చోట్ల ప్రయత్నిస్తూంటే, ఎక్కడ ఏ కథ చెప్పవచ్చో నిర్ణయించుకుని, అక్కడ ఆ కథ మాత్రమే చెప్పడానికైతే, రెండు మూడు కథలు తయారు చేసుకోవచ్చు. అరుదుగా ఒకే చోట రెండు మూడు సార్లు అవకాశ మివ్వచ్చు. ఒక స్టార్ కి రెండు సార్లూ రెండు కథలు చెప్పి విఫలమయ్యాడు పేరున్న దర్శకుడే. అయినా ఆ స్టార్ మూడో అవకాశమిస్తున్నాడు. వ్యక్తిగత సంబంధాల్నిబట్టి వుంటుంది. అసలు వైఫల్య కారణాల్లో ముందు మొదటి దాని మీద దృష్టి పెట్టాలి. రాంగ్ హీరోకి, లేదా రాంగ్ నిర్మాతకి విన్పిస్తున్నారా? ఎవరు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోకుండా విన్పించి లాభంలేదు. బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఈ సమస్య వుండదు. ఎవరు ఏ టైపు కథలు వింటున్నారు, ఏ టైపు కథలు కాదంటున్నారు, ఈ సమాచారం ఒక పక్క సేకరించుకుంటూ వుంటే టైం వేస్ట్ కాదు.
         4. దీని గురించి చెప్పడానికేమీ లేదు, అంతా తెలిసిందే. ప్రశ్నలు వస్తే ప్రతీ ఆదివారం శీర్షిక నిర్వహించడానికి అభ్యంతర మేదీ లేదు.
సికిందర్