రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 17, 2021

1106 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : సుకుమార్
తారాగణం : అల్లు అర్జున్
, రశ్మికా మందన్న, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్, అజయ్ ఘోష్, ధనుంజయ్ తదిరతులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
, ఛాయాగ్రహణం : మిరోస్లా కూబా
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ ఎర్నెని
, వై. రవిశంకర్
విడుదల : డిసెంబర్ 17
, 2021

***

        ల్లు అర్జున్ రెండు భాగాల పుష్ప మొదటి భాగం పుష్ప -ది రైజ్ విడుదలైంది. ఈ నెల నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత విడుదలైన భారీ బడ్జెట్ మాస్ మూవీ ఇదే. అల్లు అర్జున్- సుకుమార్ల కాంబినేషన్ తిరిగి దశాబ్దం తర్వాత రావడంతో ఎంత బావుందో చూద్దాం...

కథ

పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఇంటిపేరు లేని, ఫలానా తండ్రికి పుట్టానని చెప్పుకోలేని పరిస్థితుల్లో పెరిగి, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ లో కూలీగా చేరతాడు. పోలీసుల బారి నుంచి స్మగ్లింగ్ ని తప్పించగల నేర్పుతో సిండికేట్ లీడర్ కొండారెడ్డి (అజయ్ ఘోష్) మెప్పుపొంది, చిన్న షేర్ తో భాగస్థుడవుతాడు. కొండారెడ్డి ఈ సరుకు సిండికేట్ సుప్రీమ్ మంగళం శీను (సునీల్) కి చేరవేస్తే, శీను చెన్నైలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ మురుగన్ కి అమ్మి ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు.

        ఇలా వుండగా పుష్ప పాల వ్యాపారం చేసే శ్రీవల్లి (రశ్మికా మందన్న) తో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ వ్యవహారాలు సాగిస్తూండగా, శీను చెన్నైలో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న విషయం పుష్పకి తెలుస్తుంది. ఇది కొండారెడ్డికి చెప్తే, వెళ్ళి శీనుని ఎక్కువ డబ్బు డిమాండ్ చేయమంటాడు కొండా రెడ్డి. అలా వెళ్ళిన పుష్పకి శీను దగ్గర వాటాలు కుదరక, నేరుగా మురుగన్ కే సరుకు అమ్ముకుంటామని సవాలు చేస్తాడు. దీంతో శీనుతో ఘర్షణ ప్రారంభంవుతుంది...

        ఈ ఘర్షణ ఎక్కడికి దారితీసింది? ఈ ఘర్షణలో మంగళం శీను ఏమయ్యాడు? అతడ్ని భార్య దాక్షాయణి (అనసూయ) ఎందుకు శిక్షించింది? పుష్పకి కొండా రెడ్డి తోనే శతృత్వం ఎందుకు రగిలింది? కొండారెడ్డి ఏమయ్యాడు? పుష్పతో నిశ్చితార్ధం ఆగిపోయిన శ్రీవల్లి ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫవాద్ ఫాజిల్) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
గ్యాంగ్ స్టర్ జానర్లో రెగ్యులర్ టెంప్లెట్ కథ. పరిస్థితుల బాధితుడైన సామాన్యుడు నేర ప్రపంచంలోకి ప్రవేశించి బాస్ కింద పని చేస్తూ, బాస్ స్థానాన్నే ఆక్రమించి లీడర్ గా ఎదిగే రొటీన్ కథ. పుష్ప- ది రైజ్ అని టైటిల్ లోనే కథ తెలుస్తోంది. ఇటీవలే రోమాంటిక్ లో కూడా ఈ టెంప్లెట్ నే వాడారు. పైగా పుష్ప రెండు భాగాల కథ కావడంతో ఈ మొదటి భాగమంతా రైజ్ గురించే వుంటుంది. రెండు భాగాలు కలిపి స్ట్రక్చర్ చూసినప్పుడు రైజ్ తో బిగినింగ్ భాగమే ఇప్పుడు చూస్తాం. రెండో భాగంలోనే మిడిల్, అంటే కథని  చూడగలం. దాని ఎండ్ తో ముగింపూ చూడగలం.

        కాబట్టి ఈ మొదటి భాగం రాబోయే రెండో భాగానికి ఉపోద్ఘాతం మాత్రమే. బాహుబలి రెండు భాగాల కథ కూడా ఈ విభజనతోనే వుంటుంది. అందుకని కథని ఆశించకుండా రెండో భాగంలో కథకి ఉపోద్ఘాతాన్నీ, పాత్రల పరిచయాన్నీ మాత్రమే ఈ మొదటి భాగంలో చూడాల్సి వుంటుంది. ఇంకో దృష్టితో చూస్తే కాన్ఫ్లిక్ట్ లేదు కాబట్టి ఇది గాథలా కూడా వుంటుంది. ఈ మొదటి భాగం చివర్లో వచ్చే ఎస్పీ షెకావత్ పాత్రతో కాన్ఫ్లిక్ట్ రెండో భాగంలోనే ప్రారంభమవుతుందన్న మాట. అంటే అదే కథ, అసలు కథ అవుతుంది.

నటనలు - సాంకేతికాలు

అల్లు అర్జున్ పాత్రలో అల్లు అర్జున్ కాకుండా పాత్ర మాత్రమే కన్పించేలా చేసే అపూర్వ నటన ఇది. ఇలాటి డీ గ్లామ్ పాత్ర ఒప్పుకోవడం నటుడుగా ఎదగడానికే. పైగా పానిండియా ప్రేక్షకులకి, ఇతర పరిశ్రమల వర్గాలకీ తనేమిటో చెప్పుకునే అవకాశం. భాష, యాస, భంగిమ (మహాసముద్రం లో రావురమేష్ గూని పాత్రలా ఎడం భుజం పైకి లేచి వుండే అవకరం) ఒక సర్ప్రయిజ్ ప్రెజెంటేషన్. కూలీ అంటే బయట మనకి కన్పించే కూలివాడే అతడిలో కన్పిస్తాడు. పేరు చెప్పక పోతే అల్లు అర్జున్ అని తెలియడం కష్టం. ఒక స్టార్ గా ఆర్ట్ సినిమా పాత్రని గా కమర్షియల్ సినిమాలో చూపించి ఒప్పించడం సాహసమే.

        ఈ మొదటి భాగమంతా ది రైజ్ అని టైటిల్లో వున్నట్టు పాత్ర ఎదుగుదల గురించే. ఈ ఎదుగుదల క్రమాన్ని శరీర భాష కూడా క్యారీ చేస్తుంది మొదటి సీను నుంచీ చివరి వరకూ  తగ్గేదే లే... అన్న ఊత పదంతో. కూలీ వాడుగా కన్పించే మొదటి సీను నించీ కాలు మీద కాలేసుకుని కూర్చునే అలవాటు వుంటుంది. ఈ శరీర భాష ఎదగాలన్న మనస్తత్వాన్ని పట్టిస్తూంటుంది. యజమాని ఐదు లక్షలు జీతమిస్తా నంటే, నాల్గు శాతం పర్సెంటేజీ  ఇమ్మంటాడు. అలా తీసుకుంటే లక్ష తగ్గుతుందంటే ఫర్వాలేదంటాడు. ఐదు లక్షలు జీతం తీసుకుంటే యజమాని కింద కూలీ వాడుగా వుంటాడు. లక్ష తగ్గినా పర్సెంటేజీ తీసుకుంటే పార్టనర్ అవుతాడన్న బిజినెస్ మైండ్ అతడిది. మొదటి పేమెంటుతో కారు కొనేసుకుని కూలీ కొస్తాడు. ఇలా క్యారక్టర్ ఆద్యంతం చాలా యాక్టివ్ గా, మాస్ ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేసేలా, కలర్ఫుల్ గా వుంటుంది. ఇందుకు దర్శకుడు సుకుమార్ ని మెచ్చుకోవాలి. క్యారక్టరైజేషనంటే ఏమిటో చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో చూస్తాం.

        పాటల్లో కూడా స్టెప్పు లేస్తూ రెగ్యులర్ అర్జున్ కన్పించడు. స్వాతిముత్యం లో కమల్ హాసన్ రాధికతో డ్యూయెట్ లో ఎలా చేస్తాడో- అర్జున్ ఎడం  భుజం పైకి లేచి వుండే అవకరంతో అలా గమ్మత్తుగా కన్పిస్తాడు. సెకండాఫ్ లో తన గ్రూప్ సాంగ్ లోకూడా అవకారాన్ని మెయింటెయిన్ చేస్తాడు. రష్మికతో రెండు డ్యూయెట్లలో,  సమంతాతో ఐటెమ్ సాంగ్ లో కూడా రెగ్యులర్ అర్జున్ కన్పించడు. ఇక యాక్షన్ సీన్స్ చెప్పాల్సిన పనిలేదు. సెకండాఫ్ లో చావుకి దగ్గరై చేతులు కట్టేసిన నిస్సహాయ స్థితిలో, ఆవకరాన్ని మెయింటెయిన్ చేస్తూ వాటర్ స్కీముతో యాక్షన్ సీను సినిమాలో వైరల్.హీరోయిన్ రశ్మికతో రూరల్ రోమాన్స్ కూడా సెకండాఫ్ వరకూ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ మూవీ విషయమున్న క్యారక్టర్ తో అల్లు అర్జున్ ఒన్ మాన్ షో ఎలాటి ఓవరాక్షన్ లేకుండా.

        రశ్మిక రెగ్యులర్ టెంప్లెట్ పాత్రలో రూరల్ క్యారక్టర్ గా ఓకే. విలన్ గా కమెడియన్ సునీల్ కూడా ప్రయోగం చేశాడు. మంగళం శీను పాత్రలోని క్రూరత్వాన్ని కూల్ గా పోషించి సక్సెస్ అయ్యాడు. అజయ్ ఘోష్ కూడా ఓకే. మంగళం శీను భార్యగా అనసూయ ఫస్టాఫ్ అంతా బ్యాక్ గ్రౌండ్ లో వుంటూ సెకండాఫ్ లో షాకింగ్ షేడ్ చూపిస్తుంది. ఇక చివరి ఇరవై నిమిషాల్లో ఎస్పీగా వచ్చే మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ సైకో పాత్రలా ఏం చేయబోతున్నాడో సస్పెన్స్ ని క్రియేట్ చేస్తాడు. రెండున్నర గంటల ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతానికి రిలీఫ్ గా సెంట్రల్ ఎట్రాక్షన్ అవుతాడు తన యాక్టింగ్ స్కిల్స్ తో.

        సాంకేతికంగా అడవుల నేపథ్యంలో ఎర్ర చందనం చెట్ల నరికి వేత, స్మగ్లింగ్, యాక్షన్ సీన్స్ మొదలైనవి ఉన్నతంగా వున్నాయి. కాకపోతే దేవీశ్రీ ప్రసాద్ బిజీఎం పూర్ క్వాలిటీ తో వుంది. రసూల్ పోకుట్టి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా హైలైట్ కావు. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ ల యాక్షన్ కొరియోగ్రఫీ కథ లోనేని థ్రిల్ ఎలిమెంట్ ని భర్తీ చేస్తాయి. మొత్తం ప్రొడక్షన్ డిజైన్ కి విజువల్ క్వాలిటీతో కెమెరాలో బంధించాడు  మిరోస్లా కూబా. దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలన్నీ బావున్నాయి. వైరల్ అయిన సమంతా ఐటెమ్ సాంగ్ మాత్రం చిత్రీకరణలో అంత కిక్కిచ్చేలా లేదు.

        పుష్ప ఈ మొదటి భాగం కథ ప్రారంభంకాని మొదటి భాగం లాగే తీయడం వల్ల విషయపరంగా చెప్పుకో దగ్గది కాదు. అల్లు అర్జున్ పాత్రే ఈ సినిమా, కథ కాదు. కథ కోసం రెండో భాగం చూడాలి. విషయపరంగా ఈ మొదటి భాగాన్నే నిలబెట్టే క్రియేటివ్ యాస్పెక్ట్ కి అవకాశమున్నా దాన్ని ఉపయోగించుకోలేదు. సినిమాని రెండుగా విడగొట్టడంతో రిజల్టూ  రేటింగ్స్ కూడా అలాగే వస్తున్నాయి...పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్! అన్న డైలాగు కంటెంట్ కి కూడా వర్తించక పోవడంతో.

—సికిందర్