రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, మే 2019, శనివారం

830 : టిప్స్


       74. ఉప కథ ప్రధాన కథ ఎప్పుడూ అవదు. ప్రధాన కథతో సంబంధమున్నదైతే ఉపకథ విడికథ ఎన్నడూ అవదు. కాన్సెప్ట్ గోల్ కి మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ లేకపోతే, ఈ రెండూ వున్న స్టోరీ గోల్ లో అంతర్లీనమై పోతుంది. పాత్రకి స్టోరీ గోల్ తో ఫిజికల్ యాక్షన్, కాన్సెప్ట్ గోల్ తో ఎమోషనల్ యాక్షన్ వుంటాయి. అప్పుడు సమగ్రపాత్ర చిత్రణవుతుంది. సినిమా ఫ్లాపయిందంటే ఎందుకు ఫ్లాపయిందో సరైన కారణం  క్రియేటివ్ స్కూలుకి, వరల్డ్ మూవీస్ పాఠశాలకీ అంతుబట్టదు. ఈ వర్గాలు స్టోరీ మెకానిజాన్ని నమ్మవు. పరాజయ కారణాలు స్ట్రక్చర్ స్కూల్ చెప్తే నచ్చదు. కారణాలు తెలియకుండా ఇలా సుఖంగా గడిచిపోతూంటే చాలు. మహర్షులు, సీతలు వాటి పాట్లు అవి పడతాయి.

          75.భైరవ గీతలాంటి పెళ్లి తప్పించుకుని పారిపోయే హీరోహీరోయిన్ల యాక్షన్ కథతో తప్పకుండా సెకండాఫ్ లో సమస్యలొస్తాయి. యాక్షన్ కామెడీ అయితే  విలన్లతో  ఏదో కామెడీలు చేసుకుంటూ ఎంటర్ టైనర్ గా మల్చవచ్చు. సీరియస్ యాక్షన్ కథల్లో దాడులు ప్రతి దాడులే ఆక్రమిస్తాయి. ఫైట్ మాస్టర్స్ ప్రతిభకి ఇవి అద్దం పట్టవచ్చు తప్ప, కథాపరంగా నిలువుటద్దాలేమీ వుండవు. తప్పకుండా ఇంటర్వెల్ అనే జంక్షన్ యాక్షన్ సినిమాలకి పరీక్షా కేంద్రమై ఎదురవుతుంది. ఇక్కడ నించుని సెకండాఫ్ లోకి చూస్తూంటే దట్టమైన కారడవిలా కన్పిస్తుంది. ఆ కారడవిలో సరైన దారి కనుక్కుని సాగక పోతే ప్రయాణం గల్లంతవడమే  అవుతుంది. అందుకని ఈ జంక్షన్ లో ఒక గైడ్ పోస్టు నేర్పాటు చేశారు విజ్ఞులు. ఇది ఒకే డైరెక్షన్ చూపిస్తుంది : సబ్ ప్లాట్ వెంట వెళ్ళిపోవడం. సబ్ ప్లాట్ అంటే ఉపకథ. ఒక ఉపకథని పెట్టుకుని దాన్ని ముగించుకుని, ప్రధాన కథకి వెళ్లిపోవడం. యాక్షన్ కథకి దారెటూ అని ఇక్కడ నించుని చూడకూడదు. సబ్ ప్లాట్ ఏమిటా అని ఆలోచించాలి. ప్రతీ యాక్షన్ కథకీ సెకెండ్ యాక్ట్ స్లంప్ అనే మాంద్యం ఎదురవుతుంది. సెకెండ్  యాక్ట్ అంటే ఇంటర్వెల్ ముందు వుండే మిడిల్ -1, ఇంటర్వెల్ తర్వాత వచ్చే మిడిల్ - 2 విభాగాలు కలిపి. ఈ రెండిట్లో స్లంప్ ఏర్పడుతుంది యాక్షన్ కథలకి. అందుకని మిడిల్ -1 లోనే ఉప కథ ప్రారంభించాలి, దాన్ని మిడిల్ -2 లో ముగించాలి. ఈ కవరింగ్ వల్ల యాక్షన్ మూవీ ఫ్లాట్ గా అన్పించదు. ఐతే రెండు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్, పూర్వం ఒక ఉపకథతో ఈ లోటు తీరిస్తే, ఇప్పుడు ఇప్పటి కాలానికి నాల్గు ఉపకథలతో స్లంప్ ఆనే గొయ్యిని పూడ్చి, యాక్షన్ స్క్రీన్ ప్లే నిర్వచనాన్నే మార్చేశాడు రచయిత రిచర్డ్ వెంక్ ‘ఈక్వలైజర్ -2’ తో.

          76. సినిమా టైటిల్ మిడిల్- 1 లో వుండే కథలోంచే వస్తుందంటున్నాడు ఒక హాలీవుడ్ మహాశయుడు. ఎందుకని? ఇక్కడే కథా లోకపు ఐరనీ అంతా వుంటుందని.

          77.  ‘బటన్’ అనేది సీను ముగింపులో డైలాగు రూపంలో గానీ, యాక్షన్ రూపంలో గానీ పాత్ర చేరుకునే ఎమోషనల్ మజిలీ అంటున్నాడు ఇంకో హాలీవుడ్ మహాశయుడు. ఈ ఎమోషనల్ మజిలీ దగ్గర బటన్ నొక్కినపుడు తర్వాతి సీను ఈ లీడ్ తో - ఈ బటన్ తో వుంటుందంటున్నాడు. అంటే ‘మహర్షి’లో మహేష్ బాబుకి తన సక్సెస్ కారణం నరేష్ అని తెలియడం ఎమోషనల్ మజిలీ లేదా బటన్ అవుతుందన్నమాట. అలాగే ‘సీత’ లో సోనూసూద్ పెట్టే సహజీవనం ప్రపోజల్ కాజల్ అగర్వాల్ కి ‘బటన్’ అవుంతుందన్న మాట. కథకుడు పాత్రని ఇలా ఒక ఎమోషనల్ మజిలీకి - బటన్ కి - చేర్చాక, ఇక్కడాగి పాత్రలాగే ముందు కథ గురించీ, పాత్ర వ్యూహం గురించీ ఆలోచించాలే తప్ప, పలాయన వాదంతో ఈ బటన్ ని వదిలేసి ముందుకెళ్ళి పోతే, అతను కథని కుట్టే మంచి టైలర్ మాత్రం కాలేడు. పై రెండు సినిమాల్లో ఇందుకే బొత్తాలు లేని చొక్కాలు చేతికొచ్చాయి

          78.
లైటర్ వీన్ లవ్ స్టోరీస్ అంటూ బలహీన స్క్రిప్టులు రాయడం తెలుగులో సర్వ సాధారణమైపోయింది. అవన్నీ ఫ్లాపవుతున్నాయి. ఎందుకు ఫ్లాపవుతున్నాయని పరిశీలిస్తే ఒకటే తెలుస్తుంది : లైటర్ వీన్ లవ్ స్టోరీస్ పేరుతో ప్రతీదీ బలహీనపర్చడం వల్ల అవి తిరుగు లేకుండా ఫ్లాపవుతున్నాయి. హీరో బలహీనుడు, హీరోయిన్ బలహీనురాలు, వాళ్ళ మధ్య సమస్యా బలహీనం, దాంతో సంఘర్షణా బలహీనం, చివరికి పరిష్కారమూ బలహీనమే. అసలు సంగతేమిటంటే, లైటర్ వీన్ లేదా సింపుల్ లవ్ స్టోరీ ఎప్పుడూ కాంప్లికేటేడ్ గానే వుంటుంది. పాత్రలు, వాటి మధ్య పుట్టే సమస్య, దానికి పరిష్కారమూ సింపుల్ గా వుంటూనే, సంఘర్షణ అనే కథనం మాత్రం పోనుపోనూ ఉప్పూ కారం జల్లినట్టు కాంప్లికేటేడ్ - అంటే సంక్లిష్టంగా మారిపోతూ వుంటుంది. వైరుధ్యాలే ఎప్పుడూ కథల్ని నిలబెడతాయి. అంటే బరువైన కథలు సింపుల్ కథనమనే వైరుధ్యంతో వుంటే, సింపుల్ కథలు వచ్చేసి సంక్లిష్ట కథనమనే వైరుధ్యాన్ని కలిగి ఉంటయి. ‘Make your story simple – and complicate everything else’ అన్నది హాలీవుడ్ వూదే బాక్సాఫీసు బాకా.

          79. మీ కథ ఇంటర్వెల్లో పాత్రకి విజయానికి సంబంధించి ఆత్మసంతృప్తి లభించినట్టయితే, సెకండాఫ్ ప్రారంభంలో కథని స్టే చేయండి. పాత్రని సేదదీర నివ్వండి. పూర్తి చేయాల్సిన గోల్ గురించి నింపాదిగా పునరాలోచించుకోనివ్వండి. దీని తర్వాత మాత్రమే తర్వాతి  సంఘర్షణని తీవ్రతరం చేయండి. కథని స్టే చేసిన కాలాన్ని పాత్రకి స్టేట్ ఆఫ్ గ్రేస్ గా భావించండి - హాలీవుడ్ మహాశయుడు.

          80. ముక్కోణ ప్రేమల్లో కథ హీరోదైతే, ఎదుటి పాత్రలుగా రెండు  హీరోయిన్ పాత్రలుంటాయి. కథ హీరోయిన్ దైతే,  ఎదుటి పాత్రలుగా రెండు హీరో పాత్రలుంటాయి. అదే ఇతర జానర్స్ లో హీరోకి ఇద్దరు విలన్లు విడివిడిగా వుండరు. వుంటే ఒకే లక్ష్యంతో కుమ్మక్కై వుంటారు. ఎందుకంటే హీరోకి రెండు లక్ష్యాలు కుదరదు కాబట్టి. ఇద్దరు విలన్లు వేర్వేరు లక్ష్యాలతో వుంటే, ఒక విలన్ సద్దాం హుస్సేన్ లా ఎందుకో బంకర్లాంటి  దాంట్లో దాక్కుని పడుకుని, హీరో చేతిలో ఉత్తి పుణ్యాన చచ్చిపోతాడు  రంగస్థలంలో లాగా. హీరోకి కూడా ఇతడితో లక్ష్యం లేదు కాబట్టి, కథలో వేస్టుగా వేలాడుతున్న అన్ వాంటెడ్ ఫెలోని  స్వచ్ఛ భారత్ కార్యక్రమం లాంటిది చేపట్టి, ప్రక్షాళన చేసేస్తాడు సరదా సరదాగా.

         
81. అసలు కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేలో ఎదురురెదురు రెండే పాత్రలుంటాయి. ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్ర. కారణం, మనుషులనే వాళ్ళకి కాన్షస్ మైండ్ ఒకటి, సబ్ కాన్షస్ మైండ్ ఒకటి మాత్రమే ముందు చూపుతో ఆలోచించి ప్రకృతి అమర్చింది. లేకపోతే  ఈ లోకాన్ని  మనుషులెప్పుడో ఖతం చేసుకునే వాళ్ళు. అలాటిది ముక్కోణ ప్రేమ కథల్లోకి తెచ్చి ఒక పాత్ర వర్సెస్  రెండు పాత్రలు పెడితే ఇంటర్ ప్లే ఎలా సాధ్యమవుతుంది? కాన్షస్ మైండ్ వర్సెస్ సబ్ కాన్షస్ మైండ్ + అదనపు సబ్ కాన్షస్ మైండ్ అసహజమూ, ప్రకృతి విరుద్ధమూ కదా? ఇందుకే ఒక పెళ్ళికాని హీరో x ఇద్దరు పెళ్లి కాని  హీరోయిన్లు, లేదా ఒక పెళ్ళికాని హీరోయిన్ x ఇద్దరు పెళ్లి కాని హీరోల ముక్కోణాలు పెద్దగా కనెక్ట్ కావు. ఎప్పుడు కనెక్ట్ అవుతాయంటే,  మూడింట్లో రెండు పాత్రలకి పెళ్ళయిపోయి వుంటేనే. ఈ రకం ముక్కోణాల్లో సంజయ్ లీలా భన్సాలీ బలమైన ఇంటర్ ప్లేలని సృష్టిస్తాడు హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999) లోనైనా, ‘బాజీరావ్ మస్తానీ’ (2015) లోనైనా. కాసా బ్లాంకా’ (1942) లాంటి హాలీవుడ్ లో కూడా ఇంతే. ఆప్ కీ కసమ్’ (1975), ‘ఏక్ హసీనా దో దీవానే’(1972) లాంటి బాలీవుడ్స్ లో కూడా ఇంతే. మేఘ సందేశం’ (1982), ‘జీవిత చక్రం’ (1971) లాంటి టాలీవుడ్స్ లో కూడా ఇంతే. దేవదాసు’ (1953) లో పార్వతి (సబ్ కాన్షస్) అంటే భయపడి పారిపోతాడు దేవదాసు (కాన్షస్). చంద్రముఖితో కాన్షస్ వరల్డ్ లోనే వుండి పోతాడు. విడిగా కాన్షస్ మైండ్ కి జీవితం లేదు. సబ్ కాన్షస్ (అంతరాత్మ)తో కలిసుంటేనే జీవితం, లేకపోతే  పతనం. దేవదాసు పతనం ఇలాంటిదే. ఇందులో నీతి ఇదే. సరే, గొప్ప కథలిప్పుడు అవసరం లేదు. గొప్ప సినిమాలు తీయాలంటే ఆస్తికులై వుండాల్సిందే, స్టీవెన్ స్పీల్ బెర్గ్ ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్తో ప్రేక్షకుల ఆత్మిక దాహాన్నిఅంత గొప్పగా తీర్చగాలిగాడంటే, నాస్తికుడై కాదు.

         
 82. జోసెఫ్ క్యాంప్ బెల్ ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్థియరీ క్లాసిక్ స్టోరీ స్ట్రక్చర్ కి పనికొచ్చేది. హాలీవుడ్ స్క్రీన్ ప్లేల కోసం అరిస్టాటిల్ మోడల్ నుంచి ప్రారంభమై, జోసెఫ్ క్యాంప్ బెల్ మీదుగాసిడ్ ఫీల్డ్ కొచ్చి స్థిరపడినట్టు ఒక ప్రొఫెసర్ రాసిన వ్యాసాన్ని గతంలో ఈ  బ్లాగులో పోస్టు చేశాం. అది చదివే వుంటారు. 90 లనుంచి హాలీవుడ్ సినిమాలు సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తూ వస్తున్నాయి. క్యాంప్ బెల్ స్ట్రక్చర్ తో అమెరికన్ నవలలు వస్తున్నాయి, రోమాంటిక్ నవలలు సహా.  మారుతున్న కాలాల్లో మారుతున్న  ప్రేక్షకాభిరుచిని దృష్టిలో పెట్టుకుంటూ హాలీవుడ్ స్క్రీన్ ప్లే లని సరళీకృతం చేసుకుంటూ వస్తోంది. తెలుగులో బాహుబలియే తీసినా అందులో సిడ్ ఫీల్డ్ వుంటాడే తప్ప క్యాంప్ బెల్ వుండడు. ఎప్పుడో అరుదుగా దంగల్’  లాంటి దానిలో వుంటాడు. టైగర్ జిందా హైలో కొంత వుంటాడు.

          83. క్యాంప్ బెల్ చెప్పింది పురాణాల కథా నిర్మాణాన్ని. వాటిలో కథానాయకుడికి ప్రయాణంలో పన్నెండు మజిలీ లుంటాయని  చెప్పాడు. ఈ పురాణాల నిర్మాణాన్ని అనుసరించి స్టార్ వార్స్ సిరీస్, ఇండియానా జోన్స్ సిరీస్ వంటి సినిమాలు అనేకం వచ్చాయి. తర్వాత ఈ పన్నెండు మజిలీల్ని పదికి తగ్గించి మైకేల్ హాగ్ ఒక మోడల్ నిచ్చాడు. పది కూడా అవసరం లేదని,  సిడ్ ఫీల్డ్ ఆరుకి తగ్గించి పారడైం ఇచ్చాడు. హీరో మజిలీలకి మజిలీలు చేసుకుంటూ కూర్చుంటే కాలం మారిన ప్రేక్షకులు నిద్ర పోవడం ఖాయం. సిడ్ ఫీల్డ్ ప్లాట్ పాయింట్ -1, పించ్ -1, ఇంటర్వెల్, పించ్ -2, ప్లాట్ పాయింట్ -2 అనే  ఆరు స్టేజీలకి తగ్గించి  స్పీడు పెంచడంతోదీనివెంటే పడింది వ్యాపార స్పృహ దండిగా  వున్న హాలీవుడ్. 

          84. సినిమా ప్రొడ్యూసరు అయిన ప్రతివాడూ పిక్చరు టిన్నులు తిరపతికి పట్టుకెళ్ళి, ప్రోక్షం చేయిస్తూంటే ఒకానొకడు నేనునమ్మను’, అని పిక్చరు రిలీజు చేసి డబ్బు చేసుకుంటే వాణ్ణి  ఎవరూ అడగరు, కాని పిక్చరు ఫ్లాప్ అయిందో లోకం కోడై కూసినట్టుగా అందరి ఆక్షేపణలకూ గురి అవుతాడు. పైకి ఎలా కన్పిస్తుందంటే, టిన్నులు ప్రోక్షం  చేయించుకున్నవాళ్ళందరూ,  పిక్చరు మట్టి కరిచిన వాళ్ళతో సహా, చాలా  వివేకం గల వాళ్ళయినట్టూ, అలా చెయ్యని ఒక్కడూ గాడిద అయినట్టూ కన్పిస్తుంది  - కొడవటిగంటి కుటుంబరావు. 

సికిందర్