రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

1137 : రివ్యూ!

దర్శకత్వం : సాగర్ కె చంద్ర
తారాగణం : పవన్ కళ్యాణ్
, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, రావు రమేష్, మురళీ శర్మ, బ్రహ్మానందం, రఘుబాబు, తనికెళ్ళ భరణి తదితరులు
కథ : సాచి
, రచన : త్రివిక్రమ్, సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : రవి కె చంద్రన్
బ్యానర్ : సితార ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
విడుదల : ఫిబ్రవరి 25
, 2022

***

                ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఎట్టకేలకు విడుదలయ్యింది. మలయాళం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ గా పవన్- రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో మాస్- ఫ్యాన్స్- మసాలా బాక్సాఫీసు నజరానాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రీమేక్ ఎలా వుందో చూద్దాం...

కథ

    భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూలు జిల్లా మఠకేశ్వర్ మండలం, తెలంగాణా సరిహద్దులోని పోలీస్ స్టేషన్లో నిజాయితీ పరుడైన సబ్ ఇన్స్ పెక్టర్. ఒక రాత్రి డానియేల్ శేఖర్ (రానా) అనే మాజీ సైనిక హవల్దార్ తెలంగాణా లోని నల్లపట్లకి అటవీ ప్రాంతంలో  వెళ్తూంటాడు. అతను కారులో నిషేధ ప్రాంతంలో మద్యం రవాణా చేస్తున్నాడని పట్టుకుని నిర్బంధిస్తాడు భీమ్లా. కారులో ఆ  మద్యం సీసాలు తనకు కోటాలో వచ్చాయనీ, తను మాజీ సైనిక హవల్దార్ ననీ డానియేల్ ఎంత చెప్పినా విన్పించుకోడు. అడ్డుకున్న పోలీసుల్ని కొట్టినందుకు వూరుకునేది లేదంటాడు. దీంతో డానియేల్ అహం దెబ్బతిని ఎదురు తిరుగుతాడు. భీమ్లా కూడా ఆత్మగౌరవం కోసం తిరగబడతాడు. డానియల్ సైన్యంలో మాజీ హవల్దారే గాక, ఓ పెద్ద రాజకీయ నాయకుడి (సముద్ర ఖని) కొడుకని భీమ్లాకి తెలీదు. బెయిల్ మీద బయటికి రాగానే నీ సంగతి చూస్తానని డానియేల్ హెచ్చరిస్తాడు. ఇద్దరి మధ్య ఘర్షణ అంతకంతకూ పెరుగుతూ పోయి ప్రాణాలు తీసుకునే శత్రువులుగా మారిపోతారు. ఇక వీళ్ళ మధ్య తగువు ఎలా పరిష్కారమయిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

    మలయాళంలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ (కోషీ - మాజీ హవల్దార్ పాత్ర), బిజూ మీనన్ (అయ్యప్పన్- ఎస్సై పాత్ర) ఇద్దరూ పేరున్న నటులే. మలయాళంలో ఇద్దరికీ విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఏ ఒక్కర్ని తక్కువ చేసి చూపించినా ఆ అభిమానులతో ఇబ్బందే. అందుకని ఎవరి గెలుపూ, ఎవరి ఓటమీ లేనిఇదమిత్థమైన ఒక ముగింపూ కూడా లేని కథగా మలయాళంలో ఇది తెరకెక్కింది. దీంతో నటులుగా వాళ్ళ ఇమేజులకి న్యాయం జరిగిందేమో గానీ, కథకి న్యాయం జరగలేదు. కథ ప్రకారం వాళ్ళ మధ్య ఇగో వర్సెస్ ఆత్మగౌరవం సమస్యని వాళ్ళే తేల్చుకోకుండా, మధ్యలో పై అధికారుల జోక్యంతో శాంతించే, పాత్రౌచిత్యాల్ని దెబ్బ తీసే తీరు వుంది.  

        అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవల్ని పై అధికారులూ నాయకులూ కల్పించుకుని ఎప్పుడో ఆపి వుండొచ్చు. సాధారణంగా ఇదే జరుగుతుంది. మొదట్నుంచీ జరిగేవన్నీ జరగనిచ్చి, చిట్టచివరికి మధ్యలో దూరి కథని ఆపారు అధికారులు. కథ ఆగింది కానీ ముగియలేదు. పాపులర్ నటుల ఇమేజుల్ని కాపాడేందుకు కథతో ఇలా చేయాల్సి వచ్చింది దర్శకుడికి. 

        తెలుగులో పవన్ కళ్యాణ్ కీ, రానాకీ సమాన స్థాయి ఇమేజులు, ఫ్యాన్ బేసులు లేవు. అయినా ముగింపుని మార్చలేదు. పేలవంగానే ముగించారు. ఇక కృత్రిమత్వం, ఫార్ములా, మూస అనేవాటికి దూరంగా కేరళ గ్రామీణ నేటివిటీ కోసం కృషి చేశాడు మలయాళ దర్శకుడు సాచీ. ఈ హాట్ కథకి ప్రతిగా కూల్ కలర్స్ వాడి నేత్రానందం కల్గించాడు. పాటలు లేవు. నేపథ్య సంగీతం మాత్రం ట్రైబల్ ట్యూన్స్ కుదరక కుదేలయింది. మాటలు సింథటిక్, డిజైనర్, మూస, పంచ్, టెంప్లెట్ ధోరణుల నుంచి రిలీఫ్ గా, నిజజీవితంలో మనుషులు మాట్లాడుకున్నట్టు వుంటాయి.  ఫైట్లు మనుషులు పోరాడుకున్నట్టు వుంటాయి. దాదాపు మూడు గంటల నిడివే ఈ స్వల్ప కథకి, అత్యల్ప కాన్ఫ్లిక్ట్ కీ బాగా ఎక్కువ. ఒక దశ కొచ్చేటప్పటికి చిన్న విషయానికి ఇంత సాగదీయడం అనవసర మన్పించే కథ. నాయకులూ ఉన్నతాధికార్లూ ఆ ఇద్దర్నీ కూర్చోబెట్టి క్లాసు తీసుకుంటే, ఎప్పుడో ముగిసిపోయే గొడవ. కథకి ప్రారంభంలో చూపించే పాశుపతాస్త్రంతో పోలిక వర్కౌట్ కాని పరిస్థితి ఇంకో పక్క. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఎమోషనల్ ప్రేక్షకులతో బాటు, ఇద్దరు నటుల ఫ్యాన్స్ తో దీనికింత సక్సెస్ వచ్చి వుంటుంది.

    తెలుగులో పవన్ కళ్యాణ్ కోసం రీమేక్ చేశారు. ఫస్టాఫ్ పెద్దగా మార్చకపోయినా, సెకండాఫ్ లో పవన్ హీరోయిజం కోసం, మాస్ బేస్ కోసం చాలా మార్పులు చేశారు. ఇవి శృతిమించకుండా వుండడం రీమేక్ ని కాపాడింది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ అంత కిచిడీ మసాలా చేయకుండా రక్షించారు. ఒరిజినల్లో పాటల్లేవు, రీమేక్ లో పవన్ కి మాస్ సాంగ్స్ వున్నాయి. ఒరిజినల్ మూడు గంటలు సాగితే, రీమేక్ ని రెండున్నర గంటల్లో ముగించడం మంచి పద్ధతి. ఒరిజినల్ పూర్తి రియలిస్టిక్ అయితే, రీమేక్ సెమీ రియలిస్టిక్.

        అహానికీ ఆత్మగౌరవానికీ మధ్య ఘర్షణ చెలరేగినప్పుడు, యూనివర్సల్ పాజిటివ్ ఎమోషన్ అయిన ఆత్మగౌరవమే గెలవాలి. టామ్ హాంక్స్ నటించిన ది గ్రీన్ మైల్ లో అహంభావియైన పోలీసు అధికారి టామ్ హాంక్స్ వల్ల జైల్లో బందీ అయిన నల్లజాతీయుడు, చివరికి నిర్దోషి అని రుజువైనా, మరణ శిక్ష విధించమనే ప్రాథేయ పడతాడు. తన మానమర్యాదలు ఇన్ని ఖండనలకి గురయ్యాక ఇక జీవించలేనంటాడు. ఆత్మగౌరవంతో చనిపోతాననే అంటాడు. టామ్ హాంక్స్ తలవంచుకునే పరిస్థితి. గొప్ప ముగింపు, గొప్ప మెసేజ్. ఇది ఆస్కార్ కి నామినేట్ అయింది.

నటనలు సాంకేతికాలు

    అలాగని పవర్ స్టార్ ఒన్ మాన్ షో చేయలేదు. ఫస్టాఫ్ లో రానాని చేసుకోనిచ్చాడు. సెకండాఫ్ లో తను స్వారీ చేశాడు. పాత్ర హూందాతనాన్ని కాపాడుతూనే. అక్కడక్కడా సంభాషణలతో ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూ. ఒరిజినల్లో బిజూ మీనన్ పోషించిన పాత్రకి కమర్షియల్ హంగుల్లేవు, పక్కా సహజత్వం. పవన్ కి పక్కా కమర్షియల్. అయితే ఈ కమర్షియాలిటీ నీటుగా, ఆరోగ్యకర వినోదంగా వుండడం చెప్పుకోవాల్సిన విషయం. ఒక రియలిస్టిక్ ని తీసుకుని, జాగ్రత్తగా కమర్షియల్ చేస్తే తెలుగులో నీటైన సినిమాల రాక ప్రారంభమవుతుంది. మలయాళం ఒరిజినల్ లేకుండా భీమ్లా నాయక్ ని వూహించలేరు. ఒకవేళ వూహించినా నీటుగా తీయలేరు. రచ్చ పిచ్చ కచ్చా మసాలా ఐపోతుంది. ఓ బాధ్యతగల పొలిటీషియన్ గా పవన్ ఇలా కాకుండా చూసుకున్నాడు.

        రానా ఇగోయిస్టిక్ నటన కూడా నిలబెట్టింది మూవీని. రానా పుట్టిందే ఇలాటి పాత్రల కోసం. ఆల్రెడీ నేనే రాజు నేనే మంత్రి తో చేశాడు. ఇప్పుడు మరింత బాగా చేశాడు. ఫస్టాఫ్ లో ప్రతీ సన్నివేశాన్నీ రగిల్చిన తర్వాత, సెకండాఫ్ లో పవన్ తో బ్యాలెన్సు కుదరక తగ్గాడు. సెకండాఫ్ పవన్ ది. తనని సస్పెండ్ చేయించిన రానా అంతు చూసే రెగ్యులర్ హీరోగా పాత్ర మారడం వల్ల. మలయాళ కథలో హీరోలెవరూ లేరు, పాత్రలే వున్నాయి, వాళ్ళతో కథే వుంది.   పవన్, రానాల ఫైట్ ఒక ప్రధానాకర్షణ. ఈ ఇద్దరిదీ ఇగో- ఆత్మగౌరవాల పోరాటమన్నట్టే వుంటుంది గానీ, క్యారక్టర్ ఆర్క్స్ ఇంతకి మించి పెరగవు. అసలు తామేమిటో తెలుసుకుని ఎదగరు. పవన్ పోలీసు, రానా మాజీ సైనికుడు. తామిద్దరూ కొట్టుకుంటే పోయేది దేశం పరువు - ప్రజల ముందు తమ పరువూ అని గుర్తించరు. ఈ లోపం మలయాళంలో కూడా వుంది.

    ఇక నిత్యామీనన్ (పవన్ భార్య పాత్ర) గొడవల్లో బాగా ఇన్వాల్వ్ అయి పవన్ ని డ్రైవ్ చేసే పాత్రకూడా. కానీ చివర్లో ఈ పాత్ర కనిపించదు. సీఐ గా మురళీశర్మ, రాజకీయ నాయకుడుగా సముద్రఖని, బార్ ఓనర్ గా రావురమేష్ కన్పిస్తారు ఆ పాత్రలకి తగ్గ న్యాయం అనుభవంతో చేస్తూ.

        తమన్ పాటలు, బీజీఎమ్ బావున్నాయి - భీమ్లా నాయక్ సామాజిక వర్గపు సాహిత్యంతో. కథలో సామాజిక వర్గ స్పృహ లేదు. పవన్ స్టార్ మరింత పూర్తి స్థాయి పొలిటీషియన్ అన్పించుకుంటూ, సూర్య తీసిన జైభీమ్ లాంటిది తీయగల్గినప్పుడు వుండొచ్చేమో వర్గ స్పృహ.

        రవి కె చంద్రన్ కెమెరా వర్క్ కిచ్చిన గ్రేడింగ్ అంత ప్రభావశీలంగా అన్పించదు ఇలాటి కథకి. పైన చెప్పుకున్నట్టు ఒరిజినల్లో ఈ హాట్ కథకి కాంట్రాస్ట్ గా కూల్ కలర్స్ వాడి నేత్రానందం కల్గించాడు సాచీ. దర్శకుడు సాగర్ కె చంద్ర అప్పట్లో ఒకడుండే వాడు కి ఇచ్చిన గ్రేడింగ్ దానికి సరిపోయింది. ఇక చెప్పుకోవాల్సింది దర్శకుడి గురించే. అప్పట్లో ఒకడుండే వాడు రియలిస్టిక్ మేకింగ్ స్టయిల్ నే తన శైలితో ముందుకి తీసుకు పోతూ ఒక ఐడెంటిటీ నేర్పర్చుకున్నాడు. ఇది మంచి విషయం. ఇవన్నీ కలుపుకుని భీమ్లా నాయక్ బాక్సాఫీసుకి మర్యాదైన వినోదాల విందు, ఒరిజినల్లోని భావుకత మినహా.

—సికిందర్