రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, జూన్ 2017, బుధవారం

స్పెషల్ ఆర్టికల్!





        నేటి నియో నోయర్ లేదా డార్క్ మూవీస్ కి మాతృక బ్లాక్ అండ్ వైట్ ల కాలం నాటి  (1930-60) ఫిలిం నోయర్  అని చెప్పుకున్నాం. దీన్నే క్లాసిక్ నోయర్ అంటారు. కథా కథనాల పరంగా ఈ రెండిటికీ తేడా ఏమిటంటే, టెక్నాలజీ అభివృద్ధి చెందని ఆ కాలంలో బలమైన పాత్రచిత్రణలు చేసి, బరువైన కథనాలు చేసి ప్రేక్షకుల్ని కూర్చో బెట్టే వారు. తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందాక పాత్ర చిత్రణల్ని, కథనాలనీ లైట్ తీసుకుని టెక్నికల్ గా ఆకర్షించడం మొదలెట్టారు. తెలుగుకి వస్తే, డార్క్ మూవీస్ కథనాల్లో హాలీవుడ్ నోయర్ రీతులన్నిటినీ అనుసరించడం కాసేపు ఆపి, స్థానిక అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని, ఒక ‘లోకల్ నోయర్’ ని రూపొందించుకుంటే బావుంటుంది. చిత్రీకరణలో- అంటే ఎలిమెంట్స్ విషయంలో మాత్రం - ఫిలిం నోయర్- లేదా నియో నోయర్ రీతుల్నే  అవలంబించవచ్చు. హాలీవుడ్ లో నియో నోయర్ బిగ్ బిజినెస్. బిగ్ స్టార్స్, బిగ్  డైరెక్టర్స్ వీటికి పట్టం గడుతూంటారు. క్రిస్టఫర్ నోలన్ ‘మెమెంటో’ (2001- తెలుగులో ‘గజినీ’) తీసినా, లేదా  మార్టిన్ స్కోర్ససీ ‘షటర్ ఐలాండ్’  (2010) తీసినా,  1940 ల నాటి ఫిలిం నోయర్ రీతుల్ని  పరిశీలించే తీశామని చెప్పుకున్నారు. ఒక రిఫరెన్స్ లేకుండా ఒక అద్భుతం రాదు.    

          గత వ్యాసాల్లో డార్క్ మూవీస్ కథలు అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లోంచి ఎలా పుడతాయో చెప్పుకున్నాం. ఏఏ పాత్రలుంటాయో చెప్పుకున్నాం. డార్క్ మూవీస్ కథలు సంపన్న వర్గాల కుసంస్కృతుల నుంచి పుడతాయి. డార్క్ మూవీస్ కథలు పర్సనల్ కథలు. ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబానికి సంబంధించి మాత్రమే వుంటాయి. అదే మాఫియా గానీ, లేదా ఇంకే గ్యాంగ్ స్టర్ మూవీస్ కథలు గానీ మొత్తం సమాజాన్ని డిస్టర్బ్ చేసేవిగా వుంటాయి. వీటిని డార్క్ మూవీస్ కథలని పొరబడకూడదు. డార్క్ మూవీస్ కథలు పర్సనల్ కథలు. హిందీలో, తమిళంలో, మలయాళంలో  కూడా ఇలాగే తీశారు- కహానీ, కహానీ -2, పింక్, షైతాన్, జానీ గద్దార్, యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్, 16- డి, సూదు  కవ్వం, నగరం, కనుపాప మొదలైనవి. 

          మోహన్ లాల్ నటించిన మలయాళ డబ్బింగ్ ‘బ్లాక్ మనీ’ డార్క్ మూవీ కాదు. ఇది ఒక మంత్రి చేసే రాజకీయ కుట్రకి సంబంధించిన యాక్షన్ థ్రిల్లర్.  డార్క్ మూవీస్ లో సీఎం, హోం మంత్రి, ఇంకో ప్రతిపక్ష నాయకుడు వంటి రాజకీయ పాత్రలకి స్థానం లేదు. వుంటే ‘పింక్’  లోలాగా కొడుకుని కాపాడుకునే పర్సనల్ కథగా వుంటాయి. అవికూడా సీఎం కొడుకు, హోం మంత్రి కొడుకు లాంటి పాత మూస ఫార్ములా పాత్రలై వుండవు. ఓ రాజకీయనాయకుడి కొడుకు, అంతే. రాజకీయ కుట్రలు చేసుకుని రాజకీయ, సామాజిక అస్థిరతలకి  పాల్పడే కథనాలు డార్క్ మూవీస్ లో వుండవు. కేవలం వ్యక్తిగత కథలే వుంటాయి. 

      ఫిలిం నోయర్ కాలంలో ప్రధానపాత్ర నేరాల్ని పరిశోధించే డిటెక్టివ్ లేదా పోలీస్ అధికారి పాత్ర, నేరంలో ఇరుక్కున్న సామాన్యుడి పాత్ర, యాంటీ హీరో పాత్ర...ఈ మూడు రకాలుగా వుండేది. నియో నోయర్ ప్రారంభమయ్యాక, మరికొన్ని నమూనాలు చేరాయి : లాయర్, రిపోర్టర్, రైటర్, ఫోటోగ్రాఫర్... ఎందుకంటే, ఈ పాత్రలకి నేరప్రపంచంలో చొచ్చుకు పోవడానికీ, పరిశోధించడానికీ వృత్తిపరమైన వెసులుబాటు,  చొరవ వుంటాయి.
          
       కాబట్టి తెలుగుకి వచ్చేసి, ఈ ప్రొఫెషనల్ పాత్రలు కాక, ఇష్టానుసారం పాత్రల్ని పెట్టుకుంటే జానర్ మర్యాదని దెబ్బతీస్తుంది. అది డార్క్ మూవీ అవదు. నల్గురు స్టూడెంట్స్ అడవిలోకి వెళ్లి ప్రమాదంలో ఇరుక్కునే టెంప్లెట్  హార్రర్, థ్రిల్లర్ సినిమాలు వస్తూంటాయి. ఈ స్టూడెంట్స్ ని డార్క్ మూవీస్ లో పెట్టి కథ నడిపితే జానర్ మర్యాద దెబ్బతినిపోతుంది. డార్క్ మూవీ అవదు. 2013 లో ఈ వ్యాసకర్త ఒక దర్శకుడికి డార్క్ మూవీ స్క్రిప్టు రాసినప్పుడు, పాతికేళ్ళు నిండని యంగ్ హీరో ప్రొఫెషనల్ గా ఏమీ కాకపోయినా, అతడికి లీ చైల్డ్ థ్రిల్లర్  నవలల పిచ్చి వున్నట్టు పాత్రచిత్రణ చేయడం జరిగింది. అతను లీ చైల్డ్ ని వూ హించుకుని సంభాషిస్తూంటాడు కూడా. కాబట్టి క్రైం వరల్డ్ తో ఈ సాహిత్య స్పర్శతోనే అతడికి నల్గురు దుష్ట ఇన్స్ పెక్టర్లని ఎదుర్కొనే తెలివి, తెగువా సమకూరినట్టు చిత్రించడం జరిగింది. బాధిత పాత్ర అయినప్పటికీ  (నేర) కథాప్రపంచంలో పాల్గొనడానికి దానికో క్వాలిఫికేషన్ ఇవ్వడంజరిగింది. 

          కాబట్టి డార్క్ మూవీస్ కథా ప్రపంచంలో జరిగే ‘బిజినెస్’ లో ఇమిడే సజాతి పాత్రలుండాలి.  పాప్  మ్యూజిక్ కార్యక్రమంలో జానపద గాయకుడు వచ్చి పాడినట్టు విజాతి పాత్రలుండకూడదు. ఈ వ్యాసకర్త ఇంకో డార్క్ మూవీ స్క్రిప్టు రాసినప్పుడు ఆ హీరో, అతడి ఫ్రెండ్ న్యూస్  ఛానెల్ నిఘా టీం పాత్రలయ్యాయి. డిటెక్టివ్ పాత్రలకి తెలుగు నేటివిటీ లేదని చెప్పుకున్నాం. ఆ డిటెక్టివ్ కి ప్రత్యాన్మాయాలే పోలీసు అధికారి, లాయర్, రిపోర్టర్, రైటర్, ఫోటోగ్రాఫర్ మొదలైన నేటివిటీ కలిసే పాత్రలు.

***
         డార్క్ మూవీస్ ని బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్లే కాదు, గొప్ప గొప్ప మేధావులూ పట్టించుకున్నారు. డార్క్ మూవీస్ ఒక పెద్ద శాస్త్రం. అసంఖ్యాక  అధ్యయనాలూ గ్రంధాలూ కోర్సులూ ఇప్పటికీ వెలువడుతూంటాయి. ఈ సమాచారారణ్యంలోంచి తెలుగు నేటివిటీకి నారు తీసుకొచ్చి నాట్లు వేయాలంటే మాటలు కాదు.  తెలుగు నేటివిటీతో బాటు, చూసే ప్రేక్షకులెవరనేది కూడా దృష్టిలో పెట్టుకోవడం అవసరం. ఒకప్పుడు వున్నట్టు ఇప్పుడు పాఠక  ప్రపంచం లేదు, ప్రేక్షక ప్రపంచమే వుంది. పాఠక ప్రపంచం వున్నప్పుడు లోతైన కథలు, పాత్రలు, సమస్యలు సినిమాల్లో వుండేవి.  ప్రేక్షక ప్రపంచంగా మారేక, ఇవన్నీ అప్రస్తుతాలై పోయాయి. ఈ సినిమాలో ఈ హీరో తానుగా నిర్ణయం తీసుకోక,  మరొకరు చెప్తేనే యాక్షన్ లోకి దిగాడు కదాని పాత్ర చిత్రణ చెప్తే - ఐతే ఏంటి అనేస్తున్నారు. అది అవుట్ డేటెడ్ పరిశీలన అంటున్నారు. డెప్త్ వుంటే అవుట్ డేటెడ్, డెప్త్ లేకపోవడం అప్ డేటెడ్. కాబట్టి ఫిలిం నోయర్ కథనాల్లోని బరువైన విషయాల్ని  తెలుగులో దించితే ఇప్పుడు లాభించదు.
            నియో నోయర్ మూవీస్ ని చూసే ముందు వీటి మాతృకలైన ఫిలిం నోయర్ మూవీస్ ని కూడా చూడాలి. 

          1.  నియో నోయర్ మూవీస్ అస్తిత్వ సమస్యలు, ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు ( పెద్ద నోట్ల రద్దు వంటివి), టెక్నాలజీతో వచ్చే సమస్యలు, మెమరీ కి సంబంధిన సమస్యలు మొదలైన వాటితో వుంటున్నాయి. ఫిలిం నోయర్ కాలంలో హత్యల  చుట్టూ వుండేవి.

          తెలుగుకి సేఫ్ బెట్  : హత్య, లేదా హత్యాయత్నం, లేదా కిడ్నాప్ చుట్టూ కథలు (కహానీ, కహానీ -2, పింక్, షైతాన్, జానీ గద్దార్, యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్, 16- డి, సూదు కవ్వం, నగరం, కనుపాప మొదలైనవి). 

          2. నోయర్ మూవీస్ కుట్రకి పథకం పన్నడంతోనో, హత్యకేసు పరిశోధన చేపట్టడంతోనో ప్రారంభమవుతాయి. హింసాత్మక ఘటన ప్రారంభంలో ఒకసారి జరిగి, మళ్ళీ చివర్లో ముగింపులో వుంటుంది. హింస రెండు మూడు సంఘర్షిస్తున్న పాత్రల మధ్య వ్యక్తిగతంగానే  వుంటుంది. అదే యాక్షన్ మూవీస్ లోనైతే  అనేక హింసాత్మక ఘటనలు జరుగుతూనే  వుంటాయి. ఇవి సమాజాన్ని అట్టుడికిస్తూంటాయి. నోయర్ మూవీస్ లో సామాజిక మార్పులు పాత్రలకి ఎఫెక్ట్ అవుతూంటాయి. వేలకోట్లు సంపాదించిన పాత్రకి ఆ డబ్బు ప్రపంచీకరణ వల్లే వచ్చింది. దాంతో అతడి జీవన శైలి మారిపోయింది. పబ్ లో రాత్రంతా ఎంజాయ్ చేసి హై ఎండ్ కారులో దూసుకెళ్ళి  పిల్లర్ కో, పిల్లాడికో గుద్దాడు. ఆ నేరం లోంచి తప్పించుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులేశాడు...

         తెలుగుకి సేఫ్ బెట్ :  కుట్రతో మొదలెట్టుకోవచ్చుగానీ, హత్యకేసు దర్యాప్తుతో మొదలెడితే అది ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుంది. హత్య ఎలా జరిగిందో ఫ్లాష్ బ్యాక్ లో అదంతా చెప్పుకు రావాల్సి వస్తుంది. అత్యధిక నోయర్ మూవీస్ ఇలాటి ఫ్లాష్ బ్యాక్సే. కాబట్టి జరిగిపోయిన హత్య కేసు దర్యాప్తుతో మొదలెట్టడం కంటే, హత్య జరిపించి మొదలెట్టడం మంచిది. లైవ్ గా వుంటుంది. ‘జానీ గద్దార్’ హత్యతో మొదలై దాని పుట్టుపూర్వోత్తరాల ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. తమిళ డబ్బింగ్  ‘16-డి’ హత్యతో మొదలై, ఐదేళ్లు ముందు కెళ్తుంది కథ. అక్కడ్నించీ దర్యాప్తు మొదలవుతుంది. ‘జానీ గద్దార్’ ఫ్లాష్ బ్యాక్ కథ అయితే, ‘16- డి’  ఐదేళ్ళ తర్వాత రియల్ టైం స్టోరీ. ఇది లైవ్ గా వుంటుంది. ఇప్పుడు జరుగుతున్న కథ ఆసక్తిగా వుంటుంది ఎప్పుడైనా. 

          3. నోయర్ మూవీస్ లో అనుకోని ప్రమాదాలతో కథలు  మొదలవుతాయి. బిల్లీ వైల్డర్ తీసిన  ‘సన్ సెట్ బోలెవార్డ్’ (1950 ) లో పన్నెండో నిమిషంలో ప్లాట్ పాయింట్ వన్ వచ్చి కథ మొదలవుతుంది. అప్పుల వాళ్ళు కారు స్వాధీనం చేసుకోవాలని హీరోని వెంటాడు తూంటారు. కారు టైరు  పేలడంతో హీరో ఒక బంగాళా లోకి టర్న్ తీసుకుని తప్పించుకుంటాడు. ఆ బంగళా లోనే అతడి కథ మొదలవుతుంది.

          తెలుగుకి సేఫ్ బెట్ : యధాతథంగా తీసుకోవచ్చు. ‘పింక్’ లో హత్యాయత్నంగా మారిపోయే అనుకోని ఆత్మరక్షణా ప్రయత్నం, ‘షైతాన్’ లో అనుకోని కారు ప్రమాదం మొదలైనవి. 

          4. నోయర్ లో  సుఖాంతాలే వుండవు, దుఖాంతాలూ ఎదురవుతాయి. బాధితుడైన హీరో చనిపోయే కథలుంటాయి (సన్ సెట్ బోలెవార్డ్),  యాంటీ హీరోలు బతికి బాగుపడే కథలుంటాయి. హీరోని ట్రాప్ చేసే వాంప్ చనిపోయే ముగింపు (డబుల్ ఇండెమ్నిటీ) కూడా వుంటుంది. 

         తెలుగుకి సేఫ్ బెట్ :  హీరోకి సుఖాంతం. యాంటీ హీరోకి దుఃఖాంతం. యాంటీ హీరో రిస్కీ పాత్ర. ఒకర్ని  చంపి తను చనిపోతే బ్యాలెన్స్ అవుతుంది. లేదా ‘కహానీ -2 లోలాగా  ప్రత్యర్ధిని చంపిన హీరోయిన్ని పోలీసు అధికారి తప్పించేసినట్టు  సుఖాంతం చేయవచ్చు. కానీ ఒక హత్య చేసే యాంటీ హీరో తెలివితేటలతో చట్టాన్నుంచి తప్పించుకున్నట్టు ముగిస్తే రిస్కే. 

          5. నోయర్ లో యాంటీ హీరోయిన్ హీరోని ట్రాప్ చేసి తన ఎదుగుదలకి వాడుకుంటుంది (డబుల్ ఇండెమ్నిటీ). ఆమె ప్రేమిస్తోందనుకుని హీరో గాఢంగా ప్రేమించి మోసపోతాడు. కుట్ర బుద్ధితో చివరికామె అరెస్ట్ అవచ్చు, చనిపోవచ్చు.
          తెలుగుకి సేఫ్ బెట్ :  యధాతథంగా తీసుకోవచ్చు.

          6. నోయర్ సినిమాలు ఎక్కువగా వర్తులాకార కథనంతో వుంటాయి. అంటే ఒక సంఘటనతో మొదలై,  ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి,  మళ్ళీ ఆ సంఘటన దగ్గరికొచ్చి ముగియడం. 

          తెలుగుకి సేఫ్ బెట్ : మొత్తం కథ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడం పాత పద్ధతి. ప్రత్యక్షంగానే కథ చెబుతూ ఎక్కడైనా అవసరముంటే ఫ్లాష్ బ్యాక్ చూపించ వచ్చు. 

          7. చాలా నోయర్ మూవీస్ ఎక్కువగా స్వగతంతో ప్రారంభవుతాయి. కథనంలోనూ అక్కడకడా స్వగతం వస్తూంటుంది. స్వగతంతోనే ముగుస్తుంది.   
       
          తెలుగుకి సేఫ్ బెట్ :  స్వగతం అవసరంలేదు. హీరో తన గురించి తాను చెప్పుకుంటూంటే అబద్దాలు చెప్పడం లేదని ఎలా నమ్మాలి? అతడి స్వగతానికి విశ్వసనీయత ఏమిటి? కనుక ఈ ఆత్మకథ చెప్పుకోవడం, ఆత్మాశ్రయ ధోరణి ప్రదర్శించడం అవసరం లేదు. పైగా ఇది కథనాన్ని బరువెక్కిస్తుంది. సినిమా విజువల్ మీడియా, ఆడియో ప్రసారం కాదు. కనుక రచయిత / దర్శకుడు మాత్రమే హీరో కథ చెప్తే నమ్మదగినదిగా, తేలికగా వుండే అవకాశముంది. 

          8. నోయర్ మూవీస్ డైలాగులు పంచ్ లతో కవితాత్మకంగా వుంటూ, మరోవైపు కొత్త పదాల్ని కాయిన్ చేస్తూ రఫ్ అండ్ టఫ్ గానూ, హస్యాయుతంగానూ  వుంటాయి. ఉదాహరణకి : Ameche: Telephone, Barber: Talk, Bean-shooter: Gun,  Beezer: Nose,  Berries: Dollars,  Big house: Jail, Blip off: To kill, Cabbage: Money,  Chicago lightning: gunfire…ఇలా నోయర్ మూవీస్ సృష్టించిన  పదాలకి డిక్షనరీలే వున్నాయి. 

         
తెలుగుకి సేఫ్ బెట్ :  ఇతర సినిమాల్లో రొటీన్ గా వాడుతున్న తోపు, క్లారిటీ, మావా, బావా, జఫ్ఫా లాంటి మాటలు తెలుగు నోయర్ లో వాడేస్తే  శబ్దపరంగా జానర్ మర్యాద మంట గలిసి పోతుంది. సృష్టించ గలిగితే  ఫ్రెష్ పదాల్ని ఫన్నీగా కాయిన్ చేయాలి. డైలాగులు కవితాత్మకంగా వుండనవసరం లేదు, బావుండదు కూడా. అదే సమయంలో సినిమాటిగ్గానూ వుండకుండా రియలిస్టిక్ గా వుంటే మంచిది. డైలాగుల్ని పాలిష్ చేస్తూ ఎన్ని సార్లు తిరగరాస్తే అంత మంచిది. క్రిస్టఫర్ ‘మెమెంటో’  కి పదిహేడు సార్లు తిరగరాశారు. వారం రోజులో డైలాగ్ వెర్షన్ రాసి అవతల పడేసే వాళ్ళున్నారు. అదిక్కడ కుదరదు. ఈ జానర్ ని అర్ధం చేసుకున్న రచయిత / దర్శకుడు మాత్రమే కనీసం రెండు నెలల సమయం తీసుకుంటే గానీ డార్క్ మూవీ డైలాగ్ వెర్షన్ రాదు.

         
9. నోయర్ పాత్రల మానమర్యాదల గురించి  క్రిమినాలజిస్టు నికోల్ రాఫ్టర్ మాట ల్లో...నోయర్  సినిమాలు అధోగతి పాలైన ప్రపంచానికి అద్దం పడతాయి.ఇందులో ప్రతీ ఒక్కరికీ ఏదో పాపం అంటుకునే  వుంటుంది. అదేసమయంలో నిరాశా నిస్పృహలతో వుంటారు. నోయర్ సినిమాల్లో హీరో హీరోయిన్లు అనే మాటకి తావులేదు- ప్రతీ ఒక్కరూ తమ తమ దుర్బుద్ధులతో స్వార్ధంగా బతికెయ్యడానికి ప్రయత్నిస్తారు.
          ఇంకో విధంగా నోయర్ సినిమాల ఫిలాసఫీని ఈ కింది పంక్తుల్లో చూడొచ్చు :
         
          Birds abandon a tree whose fruits are gone,
                   swans abandon a pond that has dried up.
                   A woman abandons a man of no means,
                   counselors abandon a fallen leader.
                   Bees abandon a flower that’s lost its freshness,
                   deer abandon a forest that’s been burned.
                   Every one has an agenda;
                   who is appreciative, who is whose beloved?

(Translated from Sanskrit by Thomas Cleary)

          తెలుగుకి సేఫ్ బెట్ :  శాశ్వత సత్యమిది. సార్వజనీనమైనది.

***
        కథనంలో పైన సూచించిన సేఫ్ బెట్లు మార్చుకోవాలన్పిస్తే  మార్చుకోవచ్చు. జానర్ మర్యాదా, నేటివిటీ, టార్గెట్ ప్రేక్షకులూ అనుమతించిన మేరకు మార్చుకోవచ్చు. కథనం మీద ఎవరికైనా పూర్తి  క్రియేటివ్ స్వేచ్ఛ వుంటుంది.  అయితే డార్క్ మూవీస్ తో ఎలా పడితే అలా క్రియేటివ్ స్వేచ్ఛ  తీసుకోలేరు. వేరే డైలాగులెందుకు, రొటీన్ తోపు, క్లారిటీ...లాంటివి పెట్టేద్దామనుకుంటే అప్పుడు డార్క్ మూవీ శిల్పం, జానర్ మర్యాదా  చెడతాయి. ఫ్లాష్ బ్యాక్ తో మొదలెడితే ఏమౌతుంది - అనుకుంటే శిల్పం చెడకపోవచ్చు, కానీ టార్గెట్ ప్రేక్షకులకి రుచించదు. హీరో స్వగతంతోనే కథ నడిపిద్దామనుకుంటే  అదీ టార్గెట్ ప్రేక్షకులకి నచ్చక పోవచ్చు. 

          కథకి స్ట్రక్చర్ అనేది ఏ తరహా కమర్షియల్ సినిమాకైనా మారేది కాదని తెలిసిందే. స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరని చాలా సార్లు చెప్పుకున్నాం. స్ట్రక్చర్ కి నియమాలుంటాయి. క్రియేటివిటీకి వుండవు. ఎవరి అభిరుచుల్ని బట్టి వాళ్ళ క్రియేటివిటీని ప్రదర్శించుకుంటారు. అయితే కథలో మొదటి మలుపు అరగంటలోనే ఎందుకు రావాలి- చెప్పడానికి అరిస్టాటిల్ ఎవరు- సిడ్ ఫీల్డ్ ఎవరు- నా క్రియేటివిటీ నా ఇష్టమని తీసికెళ్ళి క్లయి మాక్స్ దగ్గర పెడితే, అది క్రియేటివ్ చమత్కృతి అవదు. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది. ఎందుకంటే స్ట్రక్చర్ ని చెడ గొట్టారు కాబట్టి. అందుకే  స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు. స్ట్రక్చర్ మీద క్రియేటివ్ ప్రతాపం చూపించలేరు. ఆ స్ట్రక్చర్ మీద కథ అల్లుకోవడం మీదే క్రియేటివ్ ప్రతిభా వ్యుత్పత్తులు దండిగా ప్రదర్శించు కోవచ్చు. ఫ్లాష్ బ్యాకులు పెట్టుకుంటారో, స్వగతాలు పెట్టుకుంటారో ఇంకేం  పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. అయితే డార్క్ మూవీస్ ఈ క్రియేటివ్ స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. అదీ పాయింటు!  క్రియేటివిటీ ని కూడా ఇలాగే వుండాలని కొన్ని నియమాలు పెట్టి శాసిస్తున్నాయి. ఇది అర్ధం జేసుకున్నప్పుడే డార్క్ మూవీస్  కథనాల్ని డార్క్ మూవీస్  కథనాలుగా చేసుకోగలరు.

-సికిందర్