రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 21, 2019

862 : సందేహాలు - సమాధానాలు



Q :  బహిర్ముఖంగా తల్లిని ఎదుర్కొంటున్న వాడు, తల్లిని అనారోగ్యం పాల్జేశానన్న చింతతో తనకి తనే ప్రత్యర్ధి అయి, తనతో తానే అంతర్ముఖీనంగా సంఘర్షించడం మొదలెడతాడు. ఇలాటి పాత్ర వరల్డ్ మూవీస్ లో, ఆర్టు మూవీస్ లో, గాథల్లో వుంటుంది.కమర్షియల్ మూవీస్ లో కాదుఅని మన్మథుడు - 2  స్క్రీన్ ప్లే సంగతులులో రాశారు.  మీరన్నట్టు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్  ఎక్కువగా ఆర్ట్ సినీమాలలోనే చూస్తాము.  కానీ తెలుగు సినిమాలలో ఖుషీ, మన్మధుడు -1, అర్జున్ రెడ్డి, ఇవన్నీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తో నడిచిన సినిమాలే కదా...మరి అవి బాగా ఆడాయి కదా? ఎందువల్ల? క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ ముఖ్యంగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ మీదే ఆధారపడి వుంటాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? అవి తెలుగులో ఆడే అవకాశం లేదంటారా
పేరు రాయలేదు

 
A :  ఏ కథయినా క్యారక్టర్ డ్రివెన్ స్టోరీగానే వుంటుంది. క్యారక్టర్ నడపక పోతే కథ ఎక్కడిది?  గాథ వుంటుంది. వరల్డ్ మూవీ వుంటుంది, ఆర్ట్ సినిమా అవుతుంది. ఆ క్యారక్టర్ పాసివ్ పాత్రవుతుంది. కాబట్టి క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ - ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ రెండూ రెండు ధృవాలు. కలిసి వుండవు. క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ లో ఎక్స్ టర్నల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్టులు రెండూ వుంటాయి. అప్పుడే అది యాక్టివ్ పాత్రగా నిలబడుతుంది.

          మన్మథుడు - 2 తో మీరు పేర్కొన్న సినిమాల్ని పోల్చకూడదు.
మన్మథుడు -2  లో నాగార్జున ప్రత్యర్ధి అయిన తల్లి పాత్రతో  ఎక్స్ టర్నల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్టులు రెండిటితో ప్రారంభమవుతాడు. ఎప్పుడైతే తన ఎత్తుగడలతో ఆమెని అనారోగ్యం పాల్జేస్తాడో - ఇక ఆ అపరాధభావంతో ఆమెతో - అంటే ఆ ప్రత్యర్ధితో - ఎక్స్ టర్నల్ కాన్ఫ్లిక్ట్ నుంచి వైదొలగి. లోలోన ఇంటర్నల్ కాన్ల్ఫిక్ట్ తో వుండి పోతాడు. కథ మధ్యలో ప్రత్యర్థి పాత్ర కనుమరుగయ్యాక ఇక నాగార్జునకి పనేముంటుంది. ఇందుకే ఆయన పాత్ర విఫలమయింది. పాత్ర విఫలమైతే కథ విఫలమైనట్టే. సింపుల్ గా చెప్పాలంటే, మన్మథుడు -2 ఫస్టాఫ్ కమర్షియల్ సినిమా, సెకండాఫ్ ఆర్టు సినిమా. మన తెలుగు సినిమాలు తెలియక కమర్షియల్ సినిమాల ముసుగేసుకుంటున్న ఆర్ట్ సినిమాలే. ఇది ఎన్నటికీ అర్ధం జేసుకోలేరు. ఇలాగే భారీగా పదుల కోట్లు బంగాళాఖాతంలో కలుస్తూంటాయి. ఈ డబ్బు అమరావతి కిచ్చినా రాజధాని తయారై  కళ్ళ ముందుంటుంది.

          మీరు పేర్కొన్న సినిమాల్లో ప్రత్యర్థి పాత్రలు మొదట్నించీ వుండవు. మొదట్నించీ ప్రత్యర్ధి పాత్ర వుండనప్పుడు, ఇలాటి రోమాంటిక్ డ్రామాలు తప్ప, ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తో రోమాంటిక్ కామెడీలు, ఇతర కమర్షియల్ - యాక్షన్ - మాస్ - స్టార్ వగైరా సినిమాలు సక్సెస్ కావు. మీరు చెప్పినవే కాదు, చాలా పూర్వం దేవదాసు, మేఘసందేశం, సాగరసంగమం లాంటివి కూడా ప్రత్యర్థి లేని ఇంటర్నల్ కాన్ఫ్లిక్టుతో రోమాంటిక్ డ్రామాలుగా హిట్టయ్యాయి.

Q :  మీరు తెలుగు సినిమాల సక్సెస్ రేటు 10 శాతమేనని తరచూ పేర్కొంటుంటారు. ఈ అంశాన్ని నా ‘తెలుగు ఫిలిం అడాప్టేషన్స్’ పరిశోధనలో భాగంగా చేర్చాను. పూర్వం దర్శకులు సాహిత్యం నుంచి కథలు తీసుకునే వారు. ఈ తరం దర్శకులు సినిమాల నుంచి మాత్రమే రిఫరెన్సులు తీసుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. ఇది నిజమేనంటారా? పోతే, 1990 లకి పూర్వం తెలుగు సినిమాల సక్సెస్ రేటు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా అధ్యయనం 1960 - 80 మధ్య కాలానికి సంబంధించినది. ఈ కాలంలోనే నవలలు ఎక్కువగా సినిమాలుగా వచ్చాయి. ఇకపోతే, మీరొక చోట ఇలా రాశారు: ‘తెలుగు సినిమాల తొలి స్వర్ణయుగమైన 1931-51 మధ్య (భక్తప్రహ్లాద నుంచీ పాతాళ భైరవిదాకా) వచ్చిన లాంటి సినిమాలు మలిస్వర్ణ యుగంలో లేవు. మలిస్వర్ణ యుగం 1951 -71 మధ్య (మల్లీశ్వరినుంచీ చెల్లెలి కాపురంవరకూ) సాగింది. మలిస్వర్ణయుగంలో వచ్చిన లాంటి సినిమాలు తర్వాత వ్యాపారయుగంలో లేవు. వ్యాపారయుగం 1971- 91 మధ్య (‘దసరాబుల్లోడు నుంచీ గ్యాంగ్ లీడర్వరకూ) కొనసాగింది. ఇంతే, మూడు యుగాల్లో సుమారు తరానికోమారు  సినిమాల తీరుతెన్నులు మారుతూ వచ్చాయి. అంటే, రెండు దశాబ్దాలకో మారు కొత్త  తరం నిర్మాతలూ దర్శకులూ వచ్చేస్తూ సినిమాల్ని కొత్తబాట పట్టించసాగారన్నమాట!' అని. ఈ సమాచారం మూలాల గురించి తెలియజేయగలరు.
దిలీప్ కుమార్, eflu 

A :  ఈ సమాచారం ఆయా కాలాల సినిమాలని పరిశీలించి స్వయంగా రూపొందించుకున్నది.  వెనుక చరిత్ర తెలియకపోతే  ముందు ప్రయాణం తెలియదు కాబట్టి. మీకు కావాలంటే సవివర సమాచారమిస్తాను. మీరు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు, పరిశోధనాకాలం తొలినాటి నుంచీ వుండాలని చర్చించినట్టు గుర్తుంది. అంటే తెలుగు సినిమాలు మూకీలుగా ప్రారంభమైన 1921 నుంచీ. 1921 లో తెలుగుసినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయడు తొలి మూకీగా ‘భీష్మ ప్రతిజ్ఞ’ నిర్మించారు. ఇది పౌరాణిక నాటకం. కాబట్టి అడాప్టేషన్స్ అన్నవి మొదటి మూకీతో పౌరాణిక నాటకాలతోనే ప్రారంభమయ్యాయి. నడుస్తున్న నాటకాన్ని నడుస్తున్నట్టే షూట్ చేసే వాళ్ళు. తర్వాత టాకీలుగా వచ్చిన సినిమాలు 1937 వరకూ పౌరాణిక నాటకాలే. అంటే అడాప్టేషన్సే. 1936 లో మొట్ట మొదటి సారి సినిమాకి కథ ఎలా రాయాలో తెలుసుకుని, కృతివెంటి నాగేశ్వరరావు, తన సొంత నాటకాన్ని’ ప్రేమ విజయం’ అనే కాల్పనిక సాంఘీక చిత్రంగా మల్చారు. ఇలా ఇలా తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ మొదలైన భాషల నవలలూ నాటకాలూ కాలక్రమంలో ఎన్నో సినిమాలుగా వచ్చాయి మీరు తీసుకున్న 1960 - 80 కాలావధి వరకూ. మీరిదే కాలావధి తీసుకున్నా పూర్వరంగాన్ని పరిచయం చేయాల్సి వుంటుందేమో ఒకసారాలోచించండి.

          ఇక 1980- 90 లలో సక్సెస్ రేటు విషయానికొస్తే, 1980 లో 60 నిర్మిస్తే 44 హిట్టయ్యాయి. దీన్నిబట్టి వూహించుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నన్ని సినిమాలు అప్పట్లో లేవు. ఇప్పుడున్నన్ని వివిధ దృశ్య మాధ్యమాలు అప్పట్లో లేవు. కొన్ని సినిమాలు 200, 500 రోజులు కూడా ఆడేవి. అప్పట్లో కాలం, క్వాలిటీ, సంఖ్యా కలిసొచ్చాయి. 2000 తర్వాత నుంచి ఏదీ కలిసిరావడం లేదు. రణరంగం, డియర్ కామ్రేడ్ లాంటి ఎండుగడ్డి స్టార్ సినిమాలు అప్పట్లో వూహించం.


          ఇక
ఈ తరం దర్శకులు నవలల్ని అడాప్ట్ చేసుకోవడానికి చేతన్ భగత్ లా తెలుగులో ఈ తరం నవలలు రాసే వాళ్ళు లేరు. రాసినా చదివే వాళ్ళు లేరు. సోషల్ మీడియా వల్ల రచనా వ్యాసంగాలు మట్టి కొట్టుకుపోయాయి. సోషల్ మీడియాలో పోస్టులే సాహిత్యసేవ అనుకుంటున్నారు. అందువల్ల ఈ తరం దర్శకులు విదేశీ సినిమాలతో హాత్ కీ సఫాయీ చేసుకుంటున్నారు. 

 
Q :   సార్, మీరు చాలా గ్రేట్ సార్. కథలు రాసేవాళ్ళకి చాలా వ్యాసాలు అందిస్తున్నారు. కన్నడ, తెలుగు సినిమా రైటర్లకి మీ వల్ల చాలా ఉపయోగం. నేను మూడు నెలలు ఫిలిం ట్రైనింగ్ పొందాను. నాకు నిర్మాతలు, లేదా దర్శకులు ఎలా దొరుకుతారో చెప్పగలరు. ఎన్. కన్నయ్య, రైటర్

A :  ఇలాటి సిల్లీ ప్రశ్నలు అడగొచ్చా?  రైటర్ గా మీరు నిర్మాతలకో, దర్శకులకో కథ లివ్వాలనుకోవడం మర్చిపోండి. కథ రాసుకుంటే దర్శకులై పోండి, లేదా దర్శకుల కథలకి అవకాశముంటే పని చేయండి. ఈ రెండూ కాదంటే, డైలాగ్ రైటర్ గా కృషి చేయండి. ముందు వ్యవస్థ ఎలా వుందో తెలుసుకుని ఫోకస్డ్ గా ప్రణాళికలేసుకోండి. రైటర్ నుంచి కథ తీసుకునే పద్ధతి గత ఇరవై ఏళ్లుగా లేదు. 

సికిందర్