రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, జనవరి 2016, బుధవారం

నాన్నతో న్యూసెన్సు

రచన – దర్శకత్వం : సుకుమార్

తారాగణం : ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, అమిత్, తాగుబోతు రమేష్, నియోల్  తదితరులు
పాటలు : చంద్రబోస్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : చక్రవర్తి విజయ్, కళ : రవీందర్, ఎడిటింగ్ : నవీన్ నూలి, యాక్షన్ : పీటర్ హెయిన్స్, రామ్ –లక్ష్మణ్
బ్యానర్ :  బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర, నిర్మాత : బివి ఎస్ ఎన్ ప్రసాద్
విడుదల : జనవరి 13, 2016

***టెంపర్’ లాంటి మాస్ యాక్షన్ తో ప్రేక్షకుల్ని, తన అభిమానుల్నీ సంతృప్తి పర్చగల్గిన ఎన్టీఆర్ ఈసారి ‘నాన్నకు ప్రేమతో’  అనే సెంటిమెంటల్ టైటిల్ తో ఇదొక క్లాస్ సినిమా అనే సూచనలిస్తూ సంక్రాంతి పోటీల్లో మొదటి సినిమాగా వచ్చేశాడు. రెండేళ్ళ క్రితం ‘నేనొక్కడినే’  అనే పరాజయంలోంచి తేరుకుని మళ్ళీ టాప్ స్టార్ తో దర్శకుడుగా నిరూపించుకునేందుకు సుకుమార్ పట్టుదలతో వచ్చేశాడు. అలాగే ‘అత్తారింటికి దారేది’ సూపర్ హిట్ తర్వాత ‘దోచేయ్’ తీసి నష్టపోయిన అగ్ర నిర్మాత బి వి ఎస్ ఎన్  ప్రసాద్ ఈసారి ఎన్టీఆర్- సుకుమార్ లతో అదృష్టాన్ని పరీక్షించుకుందామని  వచ్చేశారు. ఈ ముగ్గురూ కలిసి ‘నాన్నకు ప్రేమతో’ అంటూ పండక్కి ప్రేక్షకులకి పంచి పెట్టిందేమిటో  ఈ కింద చూద్దాం.

కథ
        లండన్లో ఒక ఉద్యోగం పోగొట్టుకున్న అభి ( ఎన్టీఆర్) ఆ ఎమోషన్ తో కంపెనీ అధికారిని కొట్టి వచ్చేస్తాడు. ఎమోషన్ ని ఎప్పటికప్పుడు తీర్చుకోవాలన్న ఫిలాసఫీ అతడిది. దాంతో కొట్టేస్తూంటాడు. బయటికి వచ్చిన అతను తనే ఒక కంపెనీ ప్రారంబిస్తాడు. ఇంతలో తండ్రికి బాగా లేదన్న కబురొస్తుంది. తండ్రి రమేష్ చంద్ర ( రాజేంద్ర ప్రసాద్) ఆరోగ్యం చెడి ఇంకో నెల మాత్రమే బ్రతికే స్థితిలో ఉంటాడు. ఒకప్పుడు బాగా బతికిన పారిశ్రామిక వేత్త అతను. కృష్ణ మూర్తి  ( జగపతి బాబు)  అనే ఇంకో పారిశ్రామికవేత్త మోసం చేయడంతో వీధిన  పడతాడు. అతికష్టంగా  తన ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. కానీ కృష్ణ మూర్తి చేసిన మోసానికి ప్రతీకార భావంతో  ఇంకా రగిలి పోతూనే ఉంటాడు. ఇదంతా ఇప్పుడు అభికి చెప్పేస్తాడు. దీంతో ఇంకో ముప్పై రోజుల్లో చనిపోయే తండ్రి కోసం కృష్ణమూర్తి మీద పగ సాధించాలని నిర్ణయించుకుంటాడు అభి. అన్నలు ( రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల) వారించినా విన్పించుకోడు.

        బ్రిటన్లో  అతిపెద్ద గ్యాస్ కంపెనీ నడుపుతూ కోట్లకి పడగలెత్తిన  కృష్ణమూర్తి కూతురు దివ్యాంక ( రాకుల్  ప్రీత్ సింగ్). ఈమెని అభి ట్రాప్ చేస్తాడు. అభి మేధస్సు, కుశాగ్ర బుద్ధీ అనంతం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథమాటిక్స్, జామెట్రీ సమీకరణాలతో ప్రతీ సంఘటనా ఊహిస్తాడు, చూస్తాడు. సృష్టిలో ఎక్కడో జరిగే ఒక కదలిక ఇంకెక్కడో జరిగే ఇంకో కదలికని నిర్ణయిస్తుందని-
ఎడ్వర్డ్ లారెంజ్ కాయిన్ చేసిన పదం ‘బటర్ ఫ్లై ఎఫెక్ట్’ ని ఉటంకిస్తూంటాడు. 

        వీటినే ఆధారం చేసుకుని దివ్యని ప్రేమలో పడేస్తాడు. దివ్య తండ్రి కృష్ణమూర్తితో అపాయింట్ మెంట్ సంపాదిస్తాడు. కృష్ణ మూర్తికి  ఇంకేవో పజిల్స్ వ్యామోహం వుంటుంది. అభికి తన కూతుర్ని ఇవ్వడానికి ఇష్టం లేని తను- అభి ఎవరో చెప్పేసి, మీనాన్న పగ నువ్వు తీర్చుకోలేవని సవాలు విసురుతాడు. ఈ సవాలుని అభి ఎలా స్వీకరించాడు, ఇందుకు ఎలాటి ఎత్తుగడలు వేశాడు, పూర్తిగా కృష్ణ మూర్తిని జీరో స్థాయికి తెచ్చి ఎలా వీధిన పడేశాడు...మొదలైనవి మిగతా కథ.


ఎలావుంది కథ
        వినడానికి రొటీన్ గానే వుంటుంది. తండ్రి పగ దీర్చుకునే కొడుకు కథ. కమర్షియల్ గా  రకరకాలుగా ఈ లైను రిపీటవుతూ వస్తూనే వుంది.  చాలావరకూ సక్సెస్ అవుతూనే వుంది. కాకపోతే కేవలం ప్రతీకారపు ఎమోషన్ మీద మాత్రమే  ఆధారపడే యాక్షన్ లైనుగా కాక,  కాస్త సెంటిమెంట్లూ ఫీలింగులతో, తండ్రీ కొడుకుల బంధాన్ని కూడా బలీయంగా చూపించినప్పుడు సక్సస్ అవుతున్నాయి. తండ్రి మీద తల్లి పగ దీర్చుకునే హీరో లైన్ తో కూడా హిట్టయ్యాయి. హిందీలో తన తల్లిని మోసం చేసి పెద్ద బిల్డర్ గా ఎదిగిన తండ్రిని పూర్తిగా దివాలా తీయించే లైనుతో ‘త్రిశూల్’ అనే హిట్ వుంది.  ఇందులో అమితాబ్ బచ్చన్ కొడుకు, సంజీవ్ కుమార్ తండ్రి. దీన్నే  కమల్ హసన్ తో తమిళంలో ‘కాదల్ మీంగళ్’  గా రీమేక్ చేశారు. వీటిలో హీరోల ఎమోషన్స్ కి ఓవర్ ఇంటెలిజెంట్ కలర్ ఇవ్వలేదు. సామాన్య ప్రేక్షకుల దగ్గర్నుంచీ పై తరగతి ప్రేక్షకుల వరకూ సులభంగా అర్ధమయ్యే, ఫీలయ్యే కథనాలతోనే వుంటాయి. ప్రస్తుత సినిమా లైను వరకూ మాస్ నుంచీ ఫ్యామిలీ వరకూ సేఫ్ లైనే. కాకపోతే ఈ లైన్ చెప్పిన విధానంతోనే మనలాంటి  కాస్తో కూస్తో చదువు సంధ్యలున్న వాళ్లకి కూడా క్యాచ్ చేయలేక బుర్ర వేడెక్కి పోతుంది. దర్శకుడు ఒక ప్రొఫెసర్ లాంటి అవతారమెత్తి, రసాయన- భౌతిక- గణిత- మానసిక తదితర శాస్త్రాలు ససాక్ష్యంగా, అన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపిస్తూ చెప్పదలచుకున్న కథకి పాఠాలు బోధిస్తున్నట్టూ వుంటుంది. ప్రొఫెసర్ సుకుమార్, ‘నేనొక్కడు’ ఫ్లాప్ లోంచి ముందు తను నేర్చుకోవాల్సిన కమర్షియల్  పాఠాలు  నేర్చుకోకుండా, తిరిగి ప్రేక్షకులకి అవే ‘నేనొక్కడు’  నొక్కుడు లేసన్సే ఇవ్వడంతో ఈ కథతో  ప్రేక్షకుల సంక్రాంతి సంబరాలకి సంబంధం లేకుండా పోయింది. ‘బటర్ ఫ్లై ఎఫెక్ట్’ ని ‘కావోస్’ థియరీ అని కూడా అంటారు. కావోస్ థియరీతో కమల్ హసన్ తీసిన ‘దశావతారం’ సగటు ప్రేక్షకుడికి  కూడా అర్ధమైపోతుంది. సుకుమార్ కథ వెండి తెరలాంటి విజువల్ మీడియాకి  సంకల్పించాల్సింది కాదు, ప్రింట్ మీడియాకి పరిమితం చేసి నవలగా రాస్తే చదువుకోవడానికి బావుంటుంది. స్పిరిచ్యువల్ గురు దీపక్ చోప్రా రాసిన ‘సింక్రో డెస్టినీ’ పుస్తకం చదివి వుంటే, సుకుమార్ తన లైనుకి కమర్షియల్ కథనం ఎలా చేయాలో తెలుసుకునే వీలయ్యేదేమో.

ఎవరెలా చేశారు.
        ఎన్టీఆర్ సుకుమార్ తో సాహసించడంవరకూ మంచిదే. ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన ఎవరూ అస్పృశ్యులు కారు. అవే మూస సినిమాలు, అవే మూస పాత్రలూ రొటీన్ అయిపోయిన ఎన్టీఆర్ కాస్త వెరైటీ పాత్రకి ప్రయత్నించడం- ప్రస్తుత తెలుగు సినిమా దిగజారిన ప్రమాణాల దృష్ట్యా అత్యవసరమే. ఎన్టీఆర్ కి సుకుమార్ మళ్ళీ ‘నేనొక్కడినే’  లాంటి కథని ఒక లైనుగా చెపితే కనెక్ట్ అయ్యేవాడు కాదేమో. ఒక్క మాటలో పక్కా కమర్షియల్ గా కన్పిస్తున్న  తండ్రి పగ- కొడుకు సెగ అంటూ  సుకుమార్ లైను చెప్తే వెంటనే కనెక్ట్ అయిపోతుంది ఎన్టీఆర్ కి. దీంతో లైను బావుంది కదాని ఆ లైనుని కథనం చేసిన తీరుని లైట్ తీసుకున్నట్టుంది. ఇక్కడే ఫ్యాన్స్ కి కూడా మింగుడు పడని  స్క్రిప్టింగ్ తతంగం నడించింది.

తన పాత్ర వరకూ ఎన్టీఆర్ మాస్ లుక్ కి దూరంగా కొత్త మేకోవర్ తో గడ్డం పెంచి నీటుగా కన్పించే కాస్ట్యూమ్స్ తో, ఆ  పాత్ర ఎలా వున్నా దాంట్లో ఒదిగిపోయాడు. ఎక్కువ సమయ స్ఫూర్తిని డిమాండ్ చేసే ఈ ( ఓవర్ ) ఇంటలిజెంట్  పాత్రని  ‘స్పెక్టర్’  లో డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ ని మించి  సూపర్ ఫాస్ట్ గా పోషించాడు. అయితే చాలా ప్రతీదానికీ సైంటిఫిక్ లాజిక్కులతో ఓవర్ యాక్షన్ లా తయారయ్యింది. ‘కిక్ -2’ లో రవితేజ యాక్టివ్ ని మిన్హ్సిన ఓవర్ యాక్టివ్ పాత్రతో ఎలా కనెక్ట్ కాలేదో, అలాగే ఎన్టీఆర్ పాత్ర పరిస్థితి కూడా. పాటలకి మంచి స్టెప్స్ వేశాడు, యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. స్క్రీన్ మీద  కన్పించినప్పుడల్లా ఒక అప్పీల్ ని, ఆకర్షణనీ తీసుకొచ్చాడు. అయితే ఎంత సేపూ యాక్షన్ తో విలన్ తోనే తప్ప, ఎమోషనల్ గా నాన్నతో కనెక్ట్ కావడం గురించి శ్రద్ధ తీసుకోలేదు. ముగింపులో మాత్రమే ఆ బాండింగ్, బాధ కనబరచాడు.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్టివ్ పాత్రని పోషించింది. ఆమెకీ ఓ పర్సనల్ కథ వుంది. దీన్ని ఎన్టీఆర్ పాత్ర  తీర్చిన తీరూ బావుంది. రాజేంద్ర ప్రసాద్ కుర్చీకీ, హాస్పిటల్ బెడ్ కీ పరిమితయిన పాత్ర. కొడుకుల పాత్రల్లో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల అంటీ ముట్టనట్టు వుండే పాత్రలు. ఇక జగపతి బాబు విలన్ ప్రస్థానం గురించే వేరే చెప్పేదేముంది. ఆయనకకి  ఆయనే సాటి. 

        టెక్నికల్ గా, సంగీతపరంగా, లొకేషన్స్ పరంగా  మంచి విజువల్, మ్యూజికల్ అప్పీల్స్  తో వున్నాయి. సుకుమార్ దర్శకత్వం ఎప్పటిలాగే ఫ్రెష్ గా వుంది. కానీ కథకి ఉండాల్సిన ఫీల్, నేటివిటీ ( తెలుగుదనం) కొట్టొచ్చినట్టూ లోపించాయి.

చివరికేమిటి
తెలుగు సినిమా తీయాలనుకున్నప్పుడు అది పగా- ప్రతీకారాల కథైనా, కుటుంబ కథయినా ముందు నేటివిటీ అవసరం. విదేశీ నేటివిటీతో, అక్కడి మనుషుల మధ్య మనవాళ్ళ కథలు చూపించినంత  మాత్రాన తెలుగు సినిమా చూస్తున్న తృప్తి కలగదు. అలాంటప్పుడు ఇంగ్లీష్ సినిమా తీయడం బెటర్. ఈ సినిమాని కంటెంట్ పరంగా చూసినా, నేటివిటీ పరంగా చూసినా హాలీవుడ్ సినిమాగా తీస్తే ఏమీ తేడా రాదు. ఇప్పటికీ ఇంగ్లీషులో డబ్బింగ్ చేసి ఓవర్సీస్ లో విడుదల చేయొచ్చు. సుకుమార్ ఒక్కటి గ్రహించాలి: ఒకప్పుడు తను లెక్కల లెక్చరరే. కానీ విద్యార్ధుల కంటే తెలివైన వాడుగా కన్పించాలని మేధో ప్రదర్శన చేసి వుండరు ఆ వృత్తి ధర్మం రీత్యా. కానీ సినిమాలకి వచ్చేటప్పటికి తను చాలా ఇంటెలిజెంట్ అని అంతా ప్రదర్శించుకునే ఎగ్జిబిషనిజం బాగా కన్పిస్తోంది. దీనికి దూరంగా వుండి  అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడదగ్గ సీదా సాదా కమర్షియల్ సినిమాలు తీయడం ఎలాగో తెలుసుకుంటే అందరికీ మంచిది. కమర్షియల్ సినిమాలో వరల్డ్ సినిమా కథ రీతుల్ని ప్రవేశపెట్ట లేరు. ఇవి రెండూ వేర్వేరు జానర్స్. అలా మిక్స్ చేయాలనుకుంటే ‘మయూరి’ లాంటి క్రాసోవర్ తీయాలి- ‘నాన్నకు ప్రేమతో’ లాంటి ఫ్యామిలీస్ కూడా చూసే సబ్జెక్టు కాదు. 

 -సికిందర్