రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 21, 2023

1320 : మూవీ నోట్స్


 

    'శాకుంతలం లాంటి ఒక సినిమా తీయడానికి గత వందేళ్ళల్లో 20 రిఫరెన్సులు వుండగా కూడా, శాకుంతలం ని ఇంత నిరంకుశంగా సమర్పించారంటే కాళిదాసుని, కాళిదాసుని విశదపర్చిన పూర్వ కళాకారుల్నీ కేర్ చేయకపోవడమే. కనీసం రెండు రిఫరెన్సులు తీసుకున్నా శాకుంతలం ఇంత రస విహీనమయ్యేది కాదు. 1943 లో హిందీ శకుంతల’, 1966 లో తెలుగు శకుంతల ఈ రెండూ సరిపోతాయి. శకుంతల గాథని 1920 లోనే రెండు సార్లు మూకీల కాలంలోనే సినిమాగా తీశారు. ఇందులో మొదటిది బ్రిటిష్ నటి డరోతీ కింగ్ డమ్ నటించింది. 1929 లో దేశంలో తొలి దర్శకురాలు ఫాతిమా బేగం దర్శకత్వం వహించింది. ఇప్పటికి మూకీల నుంచి టాకీలకి అప్ గ్రేడయ్యాయి సినిమాలు. మళ్ళీ 1931 లో ఖుర్షీద్ బేగం నటించింది. 1931 లోనే జేజే మదన్ దర్శకత్వంలో ఇంకోటి. 1932 లో సురభి కమలాబాయి నటన. 1940 లో ఎంఎస్ సుబ్బు లక్ష్మి నటన. 1941 లో జ్యోత్స్నా గుప్తా నటన. 1943 లో వి. శాంతారాం దర్శకత్వంలో జయశ్రీ -చంద్రమోహన్ లు నటించిన హిందీ వెర్షన్ ఎన్నదగింది. ఇది అమెరికాలో విడుదలైన మొదటి భారతీయ సినిమాగా నమోదైంది. దీంతో బాటు 1966 లో తెలుగులో కమలాకర కామేశ్వరరావు  దర్శకత్వంలో ఎన్టీఆర్- బి. సరోజాదేవిలు నటించింది మరో మంచి రిఫరెన్సు. ఇలా 2022 వరకూ 20 సార్లు తీశారు శకుంతల గాథ. కానీ ఇప్పుడు 21 వ సారి శాకుంతలం ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది అయింది.

        ఇంకా ఇక్కడ విదేశీ వెర్షన్లు కూడా చెప్పుకుంటే, 1820 లో జర్మన్ సంగీత కారుడు ఫ్రాంజ్ షూబర్ట్ ఒపేరా కోసం ప్రారంభించిన స్వర రచన అసంపూర్ణంగా మిగిలిపోయింది. శతాబ్దం తర్వాత 1921 లో ఇటాలియన్ సంగీతకారుడు ఫ్రాంకో అల్ఫానో స్వరపర్చిన  లా లెజెండా డీ శకుంతల అనే ఒపేరా సిద్ధమైంది. దీని రెండో వెర్షన్ 1952 లో ప్రదర్శించారు. 1838 లోనే ఎర్నెస్ట్ రేయెర్ స్వరపర్చిన సాకౌంటల అనే బ్యాలే వుంది. ఇంకా 1962 లో సోవియెట్ రష్యా  సంగీతకారుడు సెర్గీ బలసనియన్ స్వరపర్చిన ఇంకో బ్యాలే శకుంతల వుంది. ఇలా వుండగా 2006 ఏప్రెల్ 23 న ఫ్రాంకో అల్ఫాన్సో ఒపేరాని రోమ్ లో తిరిగి ప్రదర్శించారు (చిత్రపటం చూడండి).

అంటే, ప్రపంచ కళాకారుల్ని శతాబ్దాలుగా ఇంతగా ఆకర్షిస్తున్న కాళిదాసు శకుంతల క్లాసిక్ ని చాలా గ్రాఫిక్స్ పెంచి కాదు, కుంచెని  ముంచి భావాత్మకంగా పెయింటింగ్ చేయాలన్న మాట! 

        శకుంతల యాక్టివ్ క్యారక్టర్ కాదు. ఆమె భర్త దుష్యంతుడు కూడా యాక్టివ్ క్యారక్టర్ కాదు. అందుకని ఇది కథ కాదు, గాథ. అంటే పాత్రలు దేనికవి సంఘర్షణ అనుభవిస్తాయి తప్ప పరిష్కారం కోసం పరస్పరం సంఘర్షించుకోవు. చివర్లో మూడో పాత్ర వచ్చి పరిష్కరిస్తుంది. కాబట్టి పాత్రల మధ్య పరిష్కారం కోసం పరస్పర సంఘర్షణ వుండని ఇలాటి పురాణ గాథల్ని పరవశింపజేసే నాటకీయత ఒక్కటే కాపాడుతుంది. ఈ నాటకీయత గాథలో మూడు మలుపులు వచ్చే చోట్ల బలంగా, విజువల్ గా (అంటే సంఘటన ఆధారంగా) వుంటే, మలుపుల మధ్య కథనం కూడా అంతే రసోత్పత్తితో సమ్మోహనకరంగా వుంటుంది. దృశ్యాలు దృశ్యకావ్య హోదాని సంతరించుకుంటాయి. ఇదే చూస్తాం 1943, 1966 వెర్షన్లలో. ఈ క్రియేటివ్ ఎత్తుగడలు  గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకుడుకి తెలియదని చెప్పడం కాదు. శాకుంతలం పుణ్యమాని మనకి తెలియని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం మాత్రమే- రిఫరెన్సుల ఆధారంగా.

ఆరు ఘట్టాల గాథ

శకుంతల గాథ శకుంతల జననం, పెంపకం, పరిణయం, శాపం, తిరస్కారం, శాప విమోచనం అనే ఆరు ఘట్టాలుగా వుంది. ఈ ఆరు ఘట్టాల్లో స్టోరీలైన్ శకుంతల జీవిత చిత్రణే. ఆమె స్వశక్తు రాలు కాదు, పుట్టగానే అనాధ అయింది, అప్పట్నుంచీ పరాధీన గానే వుంది. పుట్టగానే శకుంత పక్షులు పెంచాయి. తర్వాత కణ్వ మహర్షి చెంతన దత్త పుత్రికగా  పెరిగింది. పోనీ దుష్యంతుడ్ని పెళ్ళి చేసుకుని స్థిరపడదామనుకుంటే, అతను మళ్ళీ వచ్చి తీసుకుపోతానని వెళ్ళి పోయాడు. యాగానికి వెళ్ళిపోయిన కణ్వుడి గైర్హాజరీలో తీసికెళ్ళ డం మర్యాద కాదని. ఇది చాలనట్టు దుర్వాసుడు వచ్చి ఆమెని శపించాడు, తర్వాత శాపవిమోచనం చెప్పినా, ఆ ఉంగరం పోగొట్టుకుని భర్త దగ్గర పరాభవాన్ని ఎదుర్కొంది. అడవుల్లో ఏకాకిగా మిగిలి బిడ్డని కంది. చివరికి భర్త తప్పు తెలుసుకుని వస్తే బాధల్లోంచి విముక్తి పొందింది. ఆడదానికే అన్ని పరీక్షలూ, ఆడదే అన్నీ భరించాలీ అనే ఇందులో నీతి. ఇప్పుడు కాదు, అప్పటి కాలంలో. అప్పట్లో ఆడదానికి చదువు వుండేది కాదు కాబట్టి.

        ఈ స్టోరీలైన్లో శకుంతల బాధల్ని భరించడమనే పాయింటు ప్రధానంగా వుంది. ఇది శోక రసం. పాయింటు ఇది కాబట్టి ఈ శోక రసాన్ని ప్రధాన రసంగా తీసుకుని కథనం చేస్తూ, దీనికి వీర, శృంగార, అద్భుత, బీభత్స - తత్సంబంధ రసాల్ని అనుబంధ రసాలుగా చేసుకుని ఆయా దృశ్యాల్ని అలంకరించ వలసి వుంటుంది. ఇంతలో శోకం, మరింతలో శృంగారం; ఇంతలో శోకం, మరింతలో అద్భుతం- ఇలా సుఖదుఖాల ద్వంద్వాలతో ఎత్తుపల్లాల ప్రయాణ మన్నట్టుగా ప్రేక్షకుల మెదళ్ళలో రిజిస్టర్ చేస్తూ పోవాలి శకుంతల జీవిత కథని. సీన్లు ఇలా టూ డైమెన్షనల్ గా సాగాలి. అప్పుడు గాథ ఫ్లాట్ గా మారే ప్రమాదం తప్పుతుంది.

         శాకుంతలం లో వున్నది సాంతం డైమెన్షన్లు లేని ఫ్లాట్ గా సాగే సీన్లే. ఏ సీనూ రసాలూరదు. మామిడి పండు చీకి రసాలు జుర్రుకుంటున్నట్టు వుండదు. పాత్రగా శకుంతల కంటే పెద్ద ట్రాజడీ, టార్చర్ ఈ రస విహీన రచనే.                

        ముత్యాల ముగ్గు లో సెంట్రల్ క్యారక్టర్ సంగీతది ఆమెకి జరిగే ట్రాజడీలోంచి పెల్లు బికేది శోక రసమే అయినా, సినిమా శోకరస ప్రధానం కాదు. శోక రసాన్ని ప్రధాన రసంగా చేసి కథ నడపలేదు. నడిపితే ఫ్లాపయ్యేది. ఆమె శోకాన్ని తీర్చేందుకు ఆమె పిల్లలతో అద్భుత రసాన్ని ప్రధాన రసంగా చేసి వినోదాత్మకంగా కథ నడిపారు. ఇది కాల్పనిక కథ కాబట్టి సక్సెస్ కోసం ఎలాగైనా స్వేచ్ఛ తీసుకోవచ్చు. శకుంతల లాంటి పురాణంతో స్వేచ్ఛ తీసుకోలేరు. శోక రసాన్నే ప్రధాన రసంగా చేసి గాథ నడపాల్సిందే. సంగీతంలో బాణీల్ని కూర్చినప్పుడు ఏ వాద్యపరికరం ఎక్కడ ఎప్పుడు ఎలా శృతి కలుపుతూ పలుకుతుందో - అలా గాథలో ప్రధాన రసానికి అనుబంధ రసాలు పలికినప్పుడు దృశ్యాలు కట్టి పడేస్తాయి.

        పైన చెప్పుకున్నట్టు 1921 లో ఇటాలియన్ సంగీతకారుడు ఫ్రాంకో అల్ఫానో లా లెజెండా డీ శకుంతల అని సిద్ధం చేసిన ఒపేరా నోట్సు అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం బాంబు దాడిలో ధ్వంసమయ్యాయి. అయినా పట్టువదలని అల్ఫానో 1952 కల్లా తిరిగి కొత్త నోట్సు పూర్తి చేసి ఒపేరాని ప్రదర్శించాడు. సంగీత రూపకంగా సాగే ఈ ఒపేరా చాలు- శకుంతల గాథలో పలికే వివిధ రసాల తీరుతెన్నులు తెలియడానికి. శాకుంతలం లో మణిశర్మ నేపథ్య సంగీతం ఏం పలికిందో, ఎందుకు పలికిందో వేరే స్టడీ చేయాలి సంగీతం తెలిసిన వాళ్ళు.

స్క్రీన్ ప్లేలో ఆ మూడు మలుపులు

శకుంతల గాథలోని  ఆరు ఘట్టాలు మూడు మలుపులతో వుంటాయి. ప్లాట్ పాయింట్ వన్, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ టూ. అంటే త్రీయాక్ట్స్ స్ట్రక్చరే. ప్రధాన పాత్రల మధ్య పరిష్కారం కోసం పరస్పర సంఘర్షణ వుండని త్రీ యాక్ట్స్. ప్లాట్ పాయింట్ వన్- దుర్వాసుడి శాప ఘట్టం. మిడ్ పాయింట్ -శకుంతల భర్త దుష్యంతుడి దగ్గరికి బయల్దేరే ఘట్టం. ప్లాట్ పాయింట్ టూ -దుష్యంతుడి సభలో శకుంతల పరాభవం. స్క్రీన్ ప్లేకి మూలస్తంభాలైన ఈ మూడు మలుపులూ శాకుంతలం లో తప్పుల తడకగా వున్నాయి. ఇందుకే వీటి మధ్య కథనం ఎక్కడికక్కడ కొడిగట్టిన దీపమైంది.

        1943 హిందీ శకుంతల లో ప్లాట్ పాయింట్ వన్ చూద్దాం :  తోటలో భర్త దుష్యంతుడి రాకకై నిరీక్షిస్తున్న శకుంతల (జయశ్రీ), నేస్తం లాంటి  జింక తన దగ్గరికి రావడంతో ప్రేమగా నిమురుతూ, ఎక్కడున్నావు ఇన్నాళ్ళూ, నన్ను మర్చిపోయావా?... నువ్వెందుకు మర్చిపోతావులే, నేనే మర్చిపోయా అని ఉలిక్కిపడి తేరుకుని, ఆఁ ? ... ఏమన్నాను నేనూ? మర్చిపోయానా? ఆఁ ?... అంటే... ఆయన కూడా ఇలాగే నన్ను మర్చిపోయాడా?’ అని బలహీన స్వరంతో అని, జింకని వదిలేసి ఆందోళనగా ఇంట్లోకి పరుగెత్తి, వేలికున్న ఉంగరం చూసుకుంటూ, మర్చిపోయావా నన్ను ప్రియా? నా గుండె తట్టుకోవడం లేదు... మర్చిపోయావా నన్ను ప్రియా?’ అని మరింత బలహీన స్వరంతో దుఖితురాలవుతున్నప్పుడు- గుమ్మంలోకి దుర్వాసుడు వచ్చేసి పిలుస్తాడు. ఒకసారి పిలుస్తాడు, రెండు సార్లు పిలుస్తాడు. పలకదు. తన దుఖంలో తానుంటుంది. ఇది గమనించని అతను, పిలుస్తున్నా పలక్కపోవడం అవమానంగా తీసుకుని శపిస్తాడు- నువ్వు ఎవర్నైతే తల్చుకుంటూ నన్నవమానించావో వాడు నిన్ను మర్చిపోవుగాక!  అని శాపం పెట్టి వెళ్ళిపోతాడు.

        అటు హస్తినాపురం రాజభవనంలో నిద్రిస్తున్న దుష్యంతుడు అదిరిపడి మేల్కొని సేవకుల్ని పిలుస్తాడు. సేవకులొచ్చి అడిగితే  ఏమీ చెప్పలేకపోతాడు.

        ఈ ప్లాట్ పాయింట్ వన్ దృశ్యంలో నాటకీయత శకుంతల జింకని పలకరించడంతో మొదలైంది. దుర్వాసుడు రాకముందు జింకని లీడ్ గా తీసుకుని మరపు గురించి, దాంతో ఆమెకి దుష్యంతుడి పట్ల కలిగిన సందేహాల గురించీ ఆందోళనకరంగా, శోక రసంతో సీను రన్ అవుతోంది. దుర్వాసుడొచ్చి అందుకు తగ్గట్టుగానే శాపం పెట్టడంతో (బీభత్స రసం) అవతల దుష్యంతుడు అన్నంత పనీ చేశాడు- శకుంతలని మర్చేపోయాడు. జింకతో మాట్లాడుతూ శకుంతల రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టింది (అద్భుత రసం). అందుకే అలా ఫీలయ్యింది. ప్రపంచంలో రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టేది ఇద్దరే - ఆడవాళ్ళు, జంతువులు. మగవాడు నెత్తి మీద ఢామ్మని పిడుగు వచ్చి పడే దాకా సోమరిగా టైమ్ పాస్ చేస్తూనే వుంటాడు.

        ఈ సీనులో ఇంకో అర్ధం కూడా చూడొచ్చు. ఆడదానివైనా నీ సిక్స్త్ సెన్స్ తో నువ్వు అనుమానిస్తే వెంటనే చర్య తీసుకో. అనుమానిస్తూ కూర్చోకు. అనుమానించిందే జరుగుతుంది. దటీజ్ హౌ మైండ్ వర్క్స్. శకుంతల అనుమాన నివృత్తికి పూనుకోకుండా వర్రీ అవుతూ కూర్చోవడం వల్లే ప్రకృతి ఆమె అనుమానాన్ని నిజం చేసేందుకు నెగెటివ్ ఫీలింగ్ రూపంలో దుర్వాసుడ్ని పంపింది.

        ఇలా ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుకి  డెప్త్ ఏర్పడింది. ఇందులో శాపంతో అవతల దుష్యంతుడి రియాక్షన్ కూడా చూపించి సర్కిల్ ని కంప్లీట్ చేశారు. ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా సరే. అయితే శకుంతలకి సంబంధించి రస పుష్టితో ఈ నాటకీయత కేవలం డైలాగులతో గాకుండా సంఘటనా పూర్వకంగా చూపించి వుంటే మరింత ప్రభావ వంతంగా వుండేది. ఎన్ని డైలాగులు చెప్పినా సంఘటన ఆధారంగా విజువల్ గా చెప్పినప్పుడే బలంగా రిజిస్టర్ అవుతుంది. 1943 లో వి శాంతారాం తలపోసిన నాటకీయత అప్పటి  విధానం కావొచ్చు. 1966 వచ్చేసరికి తెలుగులో కమలాకర కామేశ్వర రావు క్రియేషన్ విజువల్ నేరేషన్ కి ప్రాణం పోసింది. ఇదెలా వుందో చూద్దాం...

డెప్త్ లేని విజువల్ కాన్ఫ్లిక్ట్

1966 తెలుగు శకుంతల లో ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు మరపు గురించి ఫోర్ షాడోయింగ్ (పరిణామాల ముందస్తు హెచ్చరిక) సీను వుంటుంది. దుష్యంతుడు (ఎన్టీఆర్) శకుంతల (బి సరోజా దేవి) ని గాంధర్వ వివాహ మాడేక, గుర్తుగా ఉంగరమిచ్చి, మళ్ళీ వచ్చి తీసికెళ్తానని సెలవు తీసుకుంటున్నప్పుడు, శకుంతల బేలగా చూసి, నన్ను మర్చిపోతారేమో?’ అంటుంది. అందుకు దుష్యంతుడు, నేను మర్చిపోతానా? ఎంత మాట. నా ధర్మాన్ని మర్చిపోను, నన్ను నేను మర్చిపోను అని అనునయించి సెలవు తీసుకుంటాడు.

        దీని తర్వాత, ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ సీనులో- తోటలో శకుంతల ఆనందంగా విహరిస్తున్నప్పుడు చెలి కత్తెలు (శారద, గీతాంజలి) వచ్చి ఆటలు పట్టిస్తారు. శకుంతల, నా స్వామి నా కోసం కబురు పంపుతాడా?’ అంటుంది. ఆయన ఇప్పుడేం చేస్తూంటాడు అని కూడా అంటే, నీకంటే ఎక్కువ నీకోసం ఎదురు చూస్తూంటాడు అంటుంది చెలికత్తె. ఎలా?’ అంటే, ఏముందీ నీ బొమ్మని చూసుకుంటూ అంటుంది చెలికత్తె.

        అవతల హస్తినాపురంలో ఏవో మధుర వూహల్లో తేలిపోతున్న దుష్యంతుడ్ని చూసి భటుడు (పద్మనాభం), ఏంటో నీలో నువ్వు ముసిముసిగా  నవ్వుకుంటున్నావ్?’ అంటాడు. దుష్యంతుడు తేరుకుని బొమ్మ వేయడానికి సిద్ధమవుతాడు. అది చూసి భటుడు, కొంపదీసి అనాఘ్రాత పుష్పం ఆ అడవి పిల్లది కాదు కదా?’ అంటాడు.

        ఇటు తోటలో శకుంతల దుష్యంతుణ్ణి తల్చుకుంటూ మైమరపులో వుంటుంది. అక్కడికి దుర్వాసుడొచ్చి పిలిస్తే పలకదు. మళ్ళీ పిలిచినా తన లోకంలోంచి ఇవతలకి రాదు. దీంతో కోపంతో శపిస్తాడు. అతడి శాపం సృష్టించే కల్లోల వాతావరణానికి అవతల దుష్యంతుడు వేస్తున్న శకుంతల బొమ్మ ఎగిరిపోతుంది. ఈ గాలి దుమారమేమిటో అర్ధంగాక ఉక్కిరి బిక్కిరవుతాడు. ఆ బీభత్సానికి అతడి స్మృతి పథంలోంచి శకుంతల వైదొలగి పోతుంది.

        ఈ ప్లాట్ పాయింట్ వన్ దుష్యంతుడు వేస్తున్న బొమ్మ, గాలి దుమారం, బీభత్సం అనే సంఘటన ఆధారంగా విజువల్ యాక్షన్ తో వుంది. ఇది వి శాంతారాం సృష్టి కున్న డెప్త్ తో లేదు. అందులో మర్చిపోవడం అనే పాయింటుతో శకుంతల మానవ సహజ భయాలతో లాజికల్ గా వుంటే, తెలుగులో టీనేజి అమ్మాయి కలల విహారంతో డైమెన్షన్ లేకుండా సాదాగా వుంది ప్లాట్ పాయింట్ వన్ సీను ప్రారంభం- మర్చిపోవడమనే పాయింటు దీనికి ముందు సీనులో విడిగా వుండడం వల్ల - ప్లాట్ పాయింట్ వన్ సీను లో డెప్త్ లోపించింది.

        అదే శాంతారాం సృష్టిలో మర్చిపోవడమనే పాయింటుతోనే ప్లాట్ వన్ సీను రన్ అవడంతో డెప్త్, అర్ధం, పరమార్ధం కలిసొచ్చాయి. తెలుగులో తర్వాత దుర్వాసుడి శాపంతో విజువల్ యాక్షన్ని ప్రదర్శించింది సీను. దీంతో భౌతికంగా బలం చేకూరింది, మానసికంగా కాదు. అయినా ఈ హిందీ తెలుగు ప్లాట్ పాయింట్ వన్ సీన్లు ప్రేక్షకుల మెదళ్ళలో రిజిస్టర్ అయ్యేవే. తాజా శాకుంతలం లో కనీసం శాపం కూడా రిజిస్టర్ కాదు.

పాపం శాపం


        ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు ఫ్లాష్ బ్యాకుగా వేసిన సీన్లో, శకుంతలని పెళ్ళాడిన దుష్యంతుడు (దేవ్ మోహన్), శకుంతల (సమంత) తో అంటాడు- ‘...తొందరలోనే వచ్చి నిన్ను సకల రాజ లాంఛనాలతో తీసుకెళ్తాను, దిగులు పడకు దేవీ అని. దీనికి శకుంతల అంటుంది, పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. మీ ప్రేమకు కూడా దూరమైతే?’ అని. దీనికి దుష్యంతుడు అంటాడు, భవబంధాలకు దూరమైన కణ్వ మహర్షినే నీ ప్రేమతో కట్టి పడేశావు. చెట్లు పుట్టలు, జంతువుల ప్రేమను కూడా నీ సొంతం చేసుకున్నావు అని ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగి, ఇదిగో మన ప్రేమ చిహ్నం అంటాడు. ఇక వెళ్ళనా?’ అంటాడు. బాధతోనే తలూపుతుంది. వెళ్ళిపోతాడు.

                ఈ సీను చాలా అసహజంగా, పేలవంగా వుంది. డైలాగులు అర్ధరహితంగా వున్నాయి. పై రెండు హిందీ తెలుగు వెర్షన్లలో వున్నట్టుగా మర్చిపోవడం గురించి లీడ్ సీను, లేదా మెయిన్ సీను కాకుండా, ప్రేమ గురించి ఈ సీను వుంది. నన్ను మర్చిపోతారేమో?’ అనకుండా, మీ ప్రేమకి కూడా దూరమైతే?’ అంటుంది. కానీ తర్వాత దుర్వాసుడొచ్చి, దుష్యంతుడి ప్రేమకు దూరమవు గాక! అని శపించ బోవడం లేదు, దుష్యంతుడు నిన్ను మర్చిపోవుగాక! అని శపించడానికి రాబోతున్నాడు. కానీ సీను చూస్తే టార్గెట్ పాయింటు మరపు గురించి గాక, ప్రేమ గురించి వుంది! ఇలా వుంటే ఏం రక్తి కడుతుంది ఇంత పెద్ద సినిమా సీను?
                
            పైగా మీ ప్రేమకు కూడా దూరమైతే?’ అన్నప్పుడు దుష్యంతుడిచ్చిన అర్ధం లేని సమాధానం భవబంధాలకు దూరమైన కణ్వ మహర్షినే నీ ప్రేమతో కట్టి పడేశావు. చెట్లు పుట్టలు, జంతువుల ప్రేమను కూడా నీ సొంతం చేసుకున్నావు అని. అంటే, నా ప్రేమకు దూరమైనా నీకు చెట్టు పుట్టల ప్రేమ వుందిగా, జంతువుల ప్రేమ వుందిగా, మీ ఫాదర్ కణ్వ మహర్షి లవ్  కూడా వుంది, ఇంకేం అడ్జస్ట్ అయిపో అనా? ఏమిటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది? వీళ్ళు ప్రబంధ నాయికానాయకులా? వెనుక ఒక సీన్లో, నీకు జంతుజాలం ప్రేమ కాదు, మగని ప్రేమ కావాలని చెలికత్తెలు అన్నారే? వెనుక ఏం రాశారో చూసుకోరా?

                ఇక ఉంగరం సంగతి. ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగి, ఇదిగో మన ప్రేమ చిహ్నం అంటాడు. అది ప్రేమ చిహ్నమా, క్యాలండరా? ఆ ఉంగరం మీద ఎన్ని అక్షరాలున్నాయో అన్ని వారాల్లో తిరిగి వస్తాననని వాగ్దానం చేస్తూ, ఆమె లెక్కించుకోవడానికి ఇచ్చిన క్యాలండర్! పై హిందీ తెలుగు వెర్షన్లలో ఉంగరమివ్వడంలో ఇదీ అర్ధం. అంతేగానీ, మన ప్రేమకి చిహ్నంగా ఇదుంచుకో, వస్తా, నీకూ నాకూ ఇక బైబై! అని కాదు! ఇంత మైండ్ బ్లోయింగ్ గా రచన చేస్తే సినిమా గ్లోబల్ హిట్టే అవ్వాలి! 

                ఇక వెళ్ళనా అని వెళ్ళిపోతాడు. ఈ సీనంతా శకుంతల చెప్పలేని బాధతో, కన్నీళ్ళ తో వుంటుంది. దుష్యంతుడు వెళ్ళిపోవడం ఆమె కంత శిక్ష అన్నట్టు వుంటుంది.  అతను వెళ్ళిపోయాక ఆనందంగా పాట పాడుకుంటుంది. మానసిక స్థితిలో ఈ మార్పెందుకో తెలీదు. పాట పూర్తయ్యాక సకల రాజ లాంఛనాలతో దుష్యంతుడు వస్తూంటాడు. ఇదామె వూహ. వూహల్లో తరలి వస్తున్న దుష్యంతుణ్ణి చూసుకుంటూ మైమరపులో వుండగా, అట్నుంచి దుర్వాసుడు వస్తూంటాడు. దుర్వాసుడ్ని చూసి చెలికత్తెలు బెదిరిపోతారు. దుర్వాసుడి కోపం గురించి ఒక చెలికత్తె ఒక కథ చెప్తుంది. ఇలా దుర్వాసుడు దారిలో చెలికత్తె లతో పరిచయం ముగించుకుని శకుంతల దగ్గరి కొస్తాడు. ఆమె ఇంకా ఆ వూహా లోకంలోనే వుంటుంది. పిలిస్తే పలకదు. ఎంత పిలిచినా తిరిగి చూడదు. దీంతో తనని ఖాతరు చేయని శకుంతలని దుర్వాసుడు శపించి వెళ్ళిపోతాడు.

                ఇంటర్ కట్ లో ఈ శాపంతో అటు హస్తినాపురంలో దుష్యంతుడి రియాక్షన్ సీను హిందీ తెలుగు వెర్షన్లలో వున్నట్టు ఇక్కడ వుండదు. ఫ్లాట్ గా శకుంతల మీద సీనుతో పేలవంగా ముగిసిపోతుంది. దుర్వాసుడు వస్తూంటే సీన్లు వేసి అంత బిల్డప్ ఇచ్చారే గానీ, ఆ బిల్డప్ తో ఒరిగిందేమిటో చూపించలేకపోయారు. ఈ సీనులో మెయిన్ ఈవెంట్ అయిన దుర్వాసుడి శాపానికున్న శక్తి ఎలాంటిదో చూపించలేకపోయారు. అతడి శాపానికి హస్తినాపురం చేరే ఫ్రీక్వెన్సీ గానీ, వైబ్రేషన్ గానీ లేవు. మరి దుష్యంతుడు శకుంతలని  మర్చి పోయినట్టా, మర్చి పోనట్టా, ఏమైనట్టు? దారిలో సిగ్నల్ టవర్స్ లేకనా? జియో అంబానీకి చెప్పి ఏర్పాటు చేసుకోవాల్సుంటుందా? 

ఏ ఫ్రీక్వెన్సీ లేని, వైబ్రేషన్ లేని దుర్వాసుడి కూనిరాగం శాపంతో  సినిమా హిట్టవ్వాలని ఎలా ఆశిస్తారు. కథ పుట్టే ప్లాట్ పాయింట్ వన్ హిట్టవ్వకపోతే సినిమా ఎలా హిట్టవుతుంది. అసలు ఇది ప్లాట్ పాయింట్ వన్ సీను అని తెలుసుకుని రచన చేశారాని పెద్ద అనుమానం!

(మిగతా రేపుదయం)
—సికిందర్