రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, October 9, 2017

528 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు

  
     సినిమాల్లో ప్రతీ పాత్రకీ ఓ పేరుంటుంది. పేరు స్క్రిప్టులో వుండి  స్క్రీన్ మీద పలక్క పోతే ఆ పాత్రని బట్టి దాని వీక్షణాసక్తిమారుతూం
టుంది.హీరో,  హీరోయిన్,  యాంటీ హీరో,  విలన్ పాత్రలకైతే మిస్టీరియస్ వాతావరణమేర్పడుతుంది, కమెడియన్ కైతే మరింత చులకన భావమేర్పడుతుంది. కోయెన్ బ్రదర్స్ ఈ పనే చేశారు. డిటెక్టివ్ విస్సర్ అనే పేరు స్క్రిప్టులో రాశారు గానీ, డైలాగుల్లో ఎక్కడా ఏ పాత్ర చేతా ఆ పేరుని పలికించరు. ఇలా  పేరులేని పాత్రగా మిస్టీరియస్ గా చెలామణి అవుతూంటాడు ఈ యాంటీ పాత్ర పోషించిన ఎమెట్ వాల్ష్. సినిమా మొత్తమ్మీద విస్సర్ కి మార్టీ తో మూడు, ఎబ్బీ తో రెండు సీన్లు వుంటాయి. ఎబ్బీకి  మొదటి సీన్లో దాక్కుని వుంటే, క్లయిమాక్స్ సీనులో  వచ్చిన వాడి పేరేమిటో తెలీదు ఎబ్బీకి. ఇక మార్టీకి విస్సర్ తో వున్న మూడు సీన్లలో,  మార్టీ కూడా విస్సర్ పేరు ఎక్కడా పలకడు. ఇలా సినిమాలో ఎక్కడా విస్సర్ అనే పేరే వినపడదు. కథలో ప్రధానపాత్ర విస్సరే. అగ్గి రాజేసి కూర్చున్నది ఇతనే. కానీ ఇతడి పేరు ప్రేక్షకులకి తెలీదు. డెషెల్ హెమెట్ నవల్లోంచి స్ఫూర్తి పొంది కోయెన్ బ్రదర్స్ ఇలా చేశారు. కోయెన్ బ్రదర్స్ తాము తీయాలనుకున్న ఈ డార్క్ మూవీ జానర్ ప్రక్రియకోసం, 1929 లో హెమెట్ రాసిన ‘రెడ్ హార్వెస్ట్’  హార్డ్ కోర్ డిటెక్టివ్ నవల ( ఫ్యాక్షన్ కథలాగే వుంటుంది, సినిమాలు వచ్చాయి. అకిరాకురసావా కూడా దీని స్ఫూర్తి తోనే ‘యొజింబో’ తీశారు) ని పరిశీలించారని  ఇదివరకే చెప్పుకున్నాం. ఇందులో డిటెక్టివ్ పాత్ర పేరు ‘ది కాంటినెంటల్ ఆప్’, కానీ ఈ పేరుని ఇతర పాత్రలెప్పుడూ పలకవు. 

            టాలీవుడ్ కీ హాలీవుడ్ కీ  ప్రధాన తేడా ఏమిటంటే, హాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా సినిమాల్ని అందిస్తుంది. కాబట్టి నవ్వుల పాలవకుండా జాగ్రత్తపడతారు మేకర్లు. తెలుగు సినిమాలు చూసి నవ్వుకుంటే చుట్టుపక్కల  నాల్గు వూళ్ళల్లో నవ్వుకుంటారంతే, విశ్వ వ్యాప్తంగా పరువేం పోదు. కాబట్టి హాలీవుడ్ దర్శకుడు కొత్త వాడైనా లోతైన అవగాహనతో కమర్షియల్ గా తీస్తాడు. కొత్త దర్శకులుగా కోయెన్ బ్రదర్స్ తీయాలనుకున్న నోయర్ జానర్ విధి విధానాల్ని  కూలంకషంగా అధ్యయనం చేసి ఇంత కళాత్మకంగా తీశారు. కళాత్మకం కాకపోతే అది నోయర్ మూవీ కాబోదు. రాబర్ట్ మెక్ కీ అంటాడు – మొదట మీరు సాధారణ  సినిమాలతో చేయితిప్పుకున్న తర్వాతే  కళాత్మకాల జోలికి పోండి - అని. కోయెన్ బ్రదర్స్ రావడం రావడమే కళాత్మకాన్ని ఎత్తుకుని ప్రూవ్ చేసుకున్నారు. మార్కెట్ లో నిలబడని  రోమాంటిక్ కామెడీల మత్తులో వూగుతూ వుండే మేకర్లకి  ఈ కళ  అర్ధమయ్యే ప్రసక్తే లేదు. సరదాగా రాస్తున్న దీన్ని సరదాగా చదివేసి అవతల పడేస్తే సరిపోతుంది.

            క్రితం వ్యాసం 31వ సీనుతో పాత్రలకి నిజాలు తెలిసే కథనం ప్రారంభమయిందని తెలుసుకున్నాం. ఈ సీనులో  మార్టీ ని పూర్తిగా చంపిన రేకి అసలు నిజాలు తెలుసుకునే ట్రాక్ ఏర్పాటయ్యిందని తెలుసుకున్నట్టే,  ఇప్పుడు 32 వ సీనులో ఎబ్బీకి కూడా తెలియని నిజాలు (భర్త చావు ఆమెకి తెలియనే తెలీదు) తెలిసే సీనులోకి మనం ప్రవేశిస్తున్నాం...

32. ఎబ్బీ బార్ కెళ్ళి పరిశీలించడం, విస్సర్ ఆమెని గమనించడం
       ఇలా రాశారు : ఎబ్బీ కారు దిగి చీకట్లో వున్న బార్ ఫ్రంట్ డోర్ కేసి అడుగులేస్తుంది. ఆఫ్ స్క్రీన్లో  లయబద్ధంగా దేన్నో కొడుతు
న్న చప్పుడు లీలగా విన్పిస్తూం
టుంది. ఆమె తాళం చెవితో డోర్ తీసి లోపలికి  అడుగు పెట్టగానే చప్పుడాగిపోతుంది. 

         ఎబ్బీ లైట్ స్విచ్చులేసి, చుట్టూ చూసి, బ్యాక్ ఆఫీసు డోర్ కేసి వెళ్తుంది. అది లాక్ చేసి వుంటుంది. లాక్ తీస్తూ - మార్టీ?-  అంటుంది ప్రశాంతంగా. 
            డోర్ తెర్చుకుంటుంది. చీకటిగా వున్న రూమ్ లోకి ఇవతలి లైటు పడుతుంది. 
            
మార్టీ ఆఫీసులో బాత్రూం -
            బాత్రూం లోపలి నుంచి చూస్తే  తలుపు పూర్తిగా వేసి వుండదు. ఆఫీసు గదిలో పడుతున్న లైటు వెలుగు తలుపు సందులోంచి లోపలికి  ప్రసరిస్తూవుంటుంది. ఆ తలుపుని పట్టుకున్న విస్సర్ స్లీవ్ కఫ్, చెయ్యీ కన్పిస్తూంటాయి.

            ఎబ్బీ పైకి ఫోకస్ - డోర్ దగ్గర నిలబడి వున్న ఎబ్బీ ముందుకు అడుగులేసి చప్పున ఆగిపోతుంది. కెమెరాని దాటుకుని  వెళ్ళిపోతుంది.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ - 
  టేబుల్ మీద సగం కుళ్ళిన చేపలు  పడుంటాయి. టేబుల్ సొరుగులు కొన్ని లాగేసి వుంటాయి. వాటిలోని వస్తువులు టేబుల్  మీద చెల్లా చెదురుగా  పడుంటాయి.
            ఎబ్బీ పైకి ఫోకస్ - ఒకడుగు ముందు కేస్తుంది. ఆమె కాళ్ళ కింద గాజు ముక్కలు చిట్లుతున్న శబ్దం.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ - పగిలిన గాజు ముక్కలు చాలా పడుంటాయి కింద.
            ఎబ్బీ పైకి ఫోకస్ - కిందికి చూస్తున్న ఆమె తల తిప్పి బ్యాక్ డోర్  కేసి చూస్తుంది.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ- బ్యాక్ డోర్  విండో గ్లాస్ పగిలి, డోర్  హేండిల్ డ్యామేజీ  అయి వుంటుంది. బయటి నుంచి అద్దం పగులగొడితే దాని ముక్కలు లోపల పడ్డాయని తెలుస్తూంటుంది.
            
ఎబ్బీ పైకి ఫోకస్ - నెమ్మదిగా టేబుల్ కేసి వెళ్తుంది చేపల్ని చూస్తూ. అక్కడ్నించి పక్కకి చూస్తుంది.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ - టేబుల్ వెనకాల సేఫ్ దగ్గర టవల్ పడుంటుంది. ఫ్రేములోకి ఎబ్బీ చెయ్యివచ్చి దాన్నందుకుంటుంది.
            స్లో మోషన్ లో - ఆ టవల్లో చుట్టి వున్న సుత్తి కిందపడి చప్పుడవుతుంది.
            ఎబ్బీ పైకి ఫోకస్ - కిందికి వంగి సుత్తి అందుకోబోతూంటే ఐ లెవెల్ లో సేఫ్ కాంబినేషన్ డయల్ ఫోకస్ లో కొస్తుంది. ఆ డయల్ సుత్తితో డ్యామేజీ చేసినట్టు వుంటుంది. ఎబ్బీ దృష్టి సుత్తి పైనుంచి టేబుల్ దగ్గరున్న చెయిర్ కింద నేల మీద పడుతుంది.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ - రక్తపు మరకలు.
            ఎబ్బీ పైకి ఫోకస్ -  అలాగే చూస్తూ లేస్తూంటే, టేబుల్ పైన ఆమె కళ్ళు పడతాయి. లేస్తున్నప్పుడు అద్దం ముక్కలు ఆమె కాలికింద శబ్దం చేస్తాయి.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ - చచ్చిన చేపలు, వాటి వెనకాల  టేబుల్ చుట్టూ పగిలిన అద్దం ముక్కలు.
            ఎబ్బీ పైకి ఫోకస్ - తదేకంగా చూస్తూంటుంది.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ - చచ్చిన చేపలు.
            ఎబ్బీ పైకి ఫోకస్ -  ఆమె వెనక్కి అలా పడిపోతూ వుంటే, ఆమెతో బాటే కెమెరా వొ రుగుతుంది, ఆమెని క్లోజ్ షాట్ లో వుంచుతూ. ఆమె తల తలగడ పైన పడుతుంది. స్లోగా కెమెరా పుల్ బ్యాక్ చేస్తే – ఆమె తన ఫ్లాట్ లో బెడ్ మీద వాలి వున్నట్టు రివీలవుతుంది. కళ్ళు విప్పార్చుకుని కదలకుండా వుంటుంది.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ - చీకటిగా వున్న ఫ్లాట్ కిటికీ అవతల లైటు వెలుగు
తున్న వీధి, అవతలి  బిల్డింగ్ ముందు భాగమూ  కన్పిస్తూంటాయి.
            ఎబ్బీ మీద లాంగ్ షాట్ - నిశ్చలంగా అలాగే వుంటుంది. ఓ క్షణం తర్వాత  బెడ్ మీంచి లేచి,  ఫ్రంట్ డోర్ దగ్గరికెళ్ళి లాక్ తీస్తుంది. తూలుతూ బెడ్ దగ్గరికొస్తుంది.
                                                                                   ఫేడవుట్
***
      ఈ సీను టేకింగ్ పూర్తిగా - ఇంటర్వెల్ సీనులో  రే మార్టీ ని చంపినప్పటి షాట్ కంపోజిషన్ తోనే వుంది. పాయింటాఫ్ వ్యూ షాట్స్ - ఫోకస్ షాట్స్ మాత్రమే రిపీటవుతూ. షాట్ కంపోజిషన్ కూడా ఒక కవిత్వం, ఒక వాక్య నిర్మాణం. ఈ షాట్స్ మనల్ని కేవలం దృశ్యాన్ని చూసేట్టు చేయవు, చదివింపజేయడం కూడా చేస్తాయి. మార్టీని రే చంపుతున్నప్పుడు ఏ షాట్స్  రికార్డు చేశాయో, అవే షాట్స్ ఎబ్బీకి నిజం తెలుస్తున్నప్పుడు రికార్డు చేశాయి. నిజాన్ని జరిగింది జరిగినట్టే చూపిస్తుంది ప్రకృతి. మనిషే వక్రీకరిస్తాడు. ఈసీను డైరెక్టర్ చెబుతున్నభాష్యం  కాదు, ఇంటర్వెల్ దగ్గర్నుంచి ప్రకృతే  వచ్చి చెప్తున్న భాష్యం. ఆమెకి నిజాన్ని తెలపడం కోసం ఇంత కష్టపడ్డారు దర్శకులు, ఇది మాత్రం నిజం. 

            ఐతే ఈ సీను ప్రారంభం స్క్రిప్టులో వున్నట్టు వుండదు. విస్సర్ సేఫ్ ని పగులగొడుతున్న షాట్ తోనే ప్రారంభముంటుంది సినిమాలో. బార్ లోకి ఎవరో వస్తున్నట్టు అన్పించి అతను బాత్రూం లో  దాక్కుంటాడు. అయితే ఎబ్బీ  బార్ దగ్గరికి వచ్చేముందు బార్ బయట కూడలిలో అదే యముడి వాహనం (విగ్రహం) షాట్  పడుతుంది ( హెడ్డింగ్ ఫోటో  చూడండి). అంటే యముడు (విస్సర్) లోపల వున్నాడనే అర్ధం. విస్సర్ మార్టీని చంపడానికి వచ్చినప్పుడు ఇదే దృశ్యం, ఇప్పుడు ఎబ్బీ వస్తున్నప్పుడు ఇదే దృశ్యం.

            ఎబ్బీ లోపలికొచ్చి లైట్లు వేయడం, ఆ లైటు వెలుగు మార్టీ ఆఫీసులోంచి అవతల బాత్రూంలో వరకూ పడ్డంలో గొప్ప అర్ధముంది. అసంకల్పితంగా ఆమె కుట్రదారుణ్ణి ఎక్స్ పోజ్ చేసేసింది, కానీ ఈ విషయమే ఆమెకి తెలీదు. ఎబ్బీ  - రే లని తను చంపినట్టు సృష్టించి మార్టీకి చూపించిన  ఫోటోకోసం వచ్చి సేఫ్ పగులగొడుతూంటే, ఎబ్బీ రావడం తో అంతరాయం కలిగి బాత్రూంలో దాక్కున్నాడు విస్సర్. ఆమె లైటేస్తే వెలుగులో తడిసిపోతున్నాడిలా!

            ఇది విస్సర్ కి రానున్న ప్రమాదానికి హెచ్చరిక. ఇదే తర్వాత వీళ్ళిద్దరి క్లయిమాక్స్ సీన్లో- చంపడానికి వచ్చిన విస్సర్ ఇలాగే  వెలుతురుకి ఎక్స్ పోజ్ అయిపోతూ తన ఉనికి చాటుకుంటూ వుంటాడు. ఆమె చీకట్లో వుండి  అతడి కదలికల్ని బట్టి వ్యూహం పన్నుతూంటుంది.  చీకటి వెలుగుల సయ్యాట.  ఆమెకి చీకటి సేఫ్ అయితే, అతడికి వెలుతురు డేంజర్. ఎవరైనా వెలుతురునే కోరుకుంటారు, చీకటిని కోరుకోరు. ఇక్కడ రివర్స్ అయిన పరిస్థితి. ఈ చీకటి వెలుగుల ప్లే డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ లో ఒకటి.

             ఎబ్బీ బార్  కి రావడడం రావడం లైటెయ్యడంతో,  ఆమెకీ విస్సర్ కీ తర్వాత జరిగే లడాయికి  బీజం పడిపోయిందన్న మాట. ఇలా పరిస్థితుల కల్పన కూడా పరోక్షంగా కథ  చెబుతోంది. ప్రతీదీ కథ కోసమే చేశారు దర్శకులు. 

            ఈ సీనులో గాజుముక్కల తుంపర తెలుగు మెలోడ్రామాతో చెప్పుకుంటే, మార్టీ తో ఆమె సంసారం ముక్కచెక్కలయ్యిందనేందుకు నిదర్శనం. అక్కడే సేఫ్ ని చూసింది గానీ ఆ సేఫ్ లోనే తన మీద విస్సర్ సృష్టించిన ఫోటో వుందని తెలీదు. ఆమెకిప్పుడు ఖరారయ్యిందేమిటంటే,  రే మళ్ళీ వచ్చి మార్టీతో ఘర్షణ పడ్డాడని. చివరికి రక్తపు మరకలు  చూడగానే ఇక మార్టీ లేడని నిర్ధారణ అయిపోయి కుప్పకూలింది...

            ఇలా అంచెలంచెలుగా ఈ సీనుని బిల్డప్ చేసి ఆమెకి నిజాన్ని తెలియజేశారు.


(సశేషం) 

-సికిందర్