రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, June 14, 2020

952 : సందేహాలు - సమాధానాలు


వి.డి, అసోసియేట్ అడిగిన నాల్గు ప్రశ్నలు:
Q: 1. ఏదైనా కథలో ముందుగా ప్రధాన పాత్ర ను పరిచయం చేస్తూ ఇది అతని కథగా చెప్పి, ఆ తర్వాత అనుకోకుండా ఇంకో ప్రధాన పాత్ర అంటే హీరోయిన్ ను పరిచయం చేస్తూ, హీరో తన గోల్ రీచ్ అవలేకపోయాడు కాబట్టి, హీరోయిన్ తన గోల్ రీచ్ అయ్యేలా చేయడం అన్నది ఎంత వరకు సమంజసం అంటారు? కథలో మొదటి ప్రధాన పాత్ర తను సాధించాలి అనుకున్న గోల్ సాధించలేక, ఇంకో ప్రధాన పాత్ర ఆ గోల్ కోసం పాటుపడడం మంచిదే అంటారా? కొంచెం వివరించగలరు.

A: దొంగరాముడు’ (1955) లో క్లయిమాక్స్ తో కథ ముగించడం హీరో అక్కినేని నాగేశ్వరరావు మీద వుండదు, హీరోయిన్ సావిత్రి మీద వుంటుంది. హత్య కేసులో అక్కినేని అరెస్ట్ అయితే, ఆధారాలతో విలన్ని పోలీస్ స్టేషన్ కి అప్పగించి అక్కినేనిని విడిపించి సుఖాంతం చేస్తుంది సావిత్రి. ఇక్కడ హీరో కథలో వుండీ ఏమీ చేయలేని, గోల్ లేని పాసివ్ పాత్రయ్యాడు. హీరోయిన్ కే అతణ్ణి విడిపించాలన్న గోల్ ఏర్పడింది. ఇలా ప్రధాన పాత్రగా హీరో వుండగా కథ చేతులు మారడ మన్నది - అంటే హీరోయిన్ చేతికి కథ వెళ్ళడమన్నది ఏ సినిమాలోనూ జరగదు. ఆ కాలంలో కాబట్టి సరిపోయింది. ఇప్పుడయితే ప్రధాన పాత్ర చనిపోవాలి, చనిపోతేనే దాని గోల్ ఇంకో పాత్ర తీసుకుని కథ ముగించడానికి వీలుంటుంది ( హిచ్ కాక్ ‘సైకో’ లోనైతే ప్రధాన పాత్ర చనిపోయి, దాని గోల్ కూడా పూర్తి కాకుండా పోయి, ఇంకో ప్రధాన పాత్ర తన గోల్ తో ఇంకో కథని అందుకుం
టుంది. దీని గురించి తర్వాత చెప్పుకుందాం). 

        అయితే  
దొంగరాముడు’ తో ఇన్స్పైర్ అయితే, ఇప్పుడు కొత్త రకం క్లయిమాక్సు సృష్టించవచ్చు హీరోని యాక్టివ్ గా మారుస్తూ. ఎంత సేపూ క్లయిమాక్స్ యాక్షన్ అంటే హీరోనే చేసే వందల సినిమాల రొటీన్ నుంచి బయట పడొచ్చు. అంటే హీరో ఎక్కడో వుండి క్లయిమాక్స్ యాక్షన్ కి సూచనలిస్తూంటాడు, హీరోయిన్ ఆ ప్రకారం యాక్షన్ చేసుకు పోతూంటుంది. హీరోయిన్ తో క్లయిమాక్స్ అన్నది కొత్తగా అన్పించి వైరల్ అయ్యే అవకాశముంటుంది. హీరో తను స్వయంగా యాక్షన్ లో పాల్గొనక పోయినా సూచనలిస్తూ రిమోట్ లో యాక్షన్ జరిపించడం యాక్టివ్ పాత్ర లక్షణమే, పాసివ్ అయిపోడు. 

        ప్రధాన పాత్రగా హీరో బతికుంటే తన కథ తనే ముగించుకోవాలి. ఇంకో మార్గం లేదు. ఒకవేళ బ్రతికుండీ ప్రత్యక్షంగా కథ ముగించ లేకపోతే, ఇంకో పాత్ర సాయం తీసుకుని పైన చెప్పుకున్నట్టు తన నియంత్రణలో పరోక్షంగా ముగించాలి. అప్పుడు తన కథతో తను యాక్టివ్ గా వుంటాడు. 

       ‘ఎర్రమందారం’ (1991), ‘మనుషులు మారాలి’ (1969) లలో హీరోలు చనిపోయి వాళ్ళ భార్యలు ఆశయాలు పూర్తి చేస్తారు. ‘ఎర్రమందారం’ లో దళిత సర్పంచ్ గా రాజేంద్ర ప్రసాద్ హత్యకి గురయితే, భార్య పాత్రలో యమున కథని అందుకుని పూర్తి చేస్తుంది. ‘మనుషులు మారాలి’ లో కార్మిక నాయకుడుగా శోభన్ బాబు చనిపోతే, భార్య పాత్రలో శారద కథ నందుకుంటుంది. ఇలా ప్రధాన పాత్ర చనిపోతే ఇంకో పాత్ర కథని అందుకున్నప్పుడు, ఆ పాత్రని హేండాఫ్ పాత్ర అంటారు. 

        ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన సైకో కథతో ఒక సమస్య వచ్చింది. ప్రధాన పాత్ర తో మొదలైన కథ, ఆ ప్రధాన పాత్ర హత్యకి గురవడంతో దాని కథ అర్దాంతరంగా ముగిసి, ఇంకో ప్రధాన పాత్ర తో వేరే కథ మొదలవుతుంది. ఇది అప్పట్లో రాబర్ట్ బ్లాచ్ అనే రచయిత రాసిన నవల. ఈ కథ తనకి నచ్చడం లేదని హిచ్ కాక్ తో అన్నాడు స్క్రీన్ ప్లే రచయిత జోసెఫ్ స్టెఫానో.  ప్రధాన పాత్ర చనిపోయాక దాంతో ప్రారంభమైన కథే అర్ధాంతరంగా ముగిసిపోవడం ఒకటైతే, అక్కడ్నించీ ఇంకో ప్రధాన పాత్రని తెచ్చి వేరే కథ ప్రారంభమవడం తనకి మింగుడు పడ్డం లేదన్నాడు. అప్పుడు హిచ్ కాక్, ‘ఈ రెండో పాత్ర ఆంథోనీ పెర్కిన్స్ నటిస్తే?’ అన్నాడు. స్టెఫానో స్టన్నయ్యాడు. సమస్య తీరిపోయింది. ఆంథోనీ పెర్కిన్స్ స్టార్ డమ్ వున్న నటుడు. అతను నటిస్తే కథలో ఏర్పడ్డ గండి పూడిపోతుంది. మొదటి ప్రధాన పాత్ర హీరోయిన్ జానెట్ లే తో ఆమె కథగా ప్రారంభమైన సినిమా, ప్లాట్ పాయింట్ వన్ లో హీరో ఆంథోనీ పెర్కిన్స్ కొత్తగా ప్రధాన పాత్రగా వచ్చి, ఆమెని హత్య చేస్తే, ఆమె కథని మర్చిపోయి అతడి సైకో కథలో లీనమైపోతారు ప్రేక్షకులు. ఇలా స్టార్స్ వల్ల కథతో కొన్ని అక్రమాలు సక్రమమై పోతాయి. 

        జానెట్ పాత్రలో అనూష్కా వుందనుకుందాం. సినిమా ప్రారంభమై ఓ ఇరవై నిమిషాలు ఆమె పాత్ర పరిచయం, జీవితం, ఆశయం చూస్తూ వున్నాం. ఇంతలో ఎక్కడ్నించో నాగార్జున వచ్చి ఆమెని కసక్ మన్పించి తన కథ మొదలెట్టుకుంటే, ఈ సర్ప్రయిజ్ ఎంట్రీకి అనూష్కా కథని మర్చిపోయి, నాగార్జున కొత్త కథని ఫాలో అవుతామా లేదా? ఇదీ స్టార్ చేసే మ్యాజిక్ అంటే. 

        నవల చదువుతున్నప్పుడు పాత్రల రూపాలు అందులో కన్పించవు. అప్పుడు బాగా లేని కథతో నవల మింగుడు పడదు. స్టెఫానో సమస్య ఇదే. ఐతే బాగా లేదన్పించిన ‘సైకో’ నవల్లో ఆంథోనీ పెర్కిన్స్ ని వూహించుకోమని హిచ్ కాక్ ఎప్పుడైతే అన్నాడో, అప్పుడు స్టెఫానో సెట్ రైట్ అయిపోయాడు. 

        కృష్ణం రాజు నటించిన ‘అగ్నిపూలు’ (1981) లో కృష్ణం రాజు ఏమీ చెయ్యడు. అతణ్ణి చంపే లక్ష్యంతో వచ్చి ఇంట్లో వుంటుంది జయసుధ. ఆమె లక్ష్యం చివరి వరకూ తెలీని పాసివ్ పాత్రగా, ఆమెతో ఇంటరాక్ట్ అవుతూ వుంటాడు. ముగింపులో ఆమె డైరీ బయటపడి, ఆమెని ఎదుర్కొంటూ యాక్టివ్ పాత్రయిపోతాడు. సినిమాలో వీళ్ళిద్దరి కథే వుంటే ఎప్పుడూ కృష్ణం రాజు కనపడుతూ, ఏమీ చెయ్యని అతడితో మనకి సహన పరీక్ష అయ్యేది. సినిమా ఇంకా జయప్రద, ఇంకో హిందీనటి, నిర్మలమ్మల కథ కూడా. జయసుధతో కలిపి నల్గురు స్త్రీ పాత్రల కథ. అందువల్ల కృష్ణం రాజు పాత్రని అప్పుడప్పుడు మాత్రమె చూస్తూంటాం. దీంతో పాసివ్ అని తెలిసినా, స్త్రీపాత్రల మీద మన దృష్టి వుండడంతో ఈ పాసివ్ నెస్ పెద్దగా ఫీల్ కాం. ఇలా ప్రేక్షకుల అసంతృప్తిని మేనేజ్ చేయగల్గితే చివరి వరకూ పాసివ్ గా తీసికెళ్ళి యాక్టివ్ చేయవచ్చు హీరోని. 

        పరిష్కారాలు వచ్చిన సినిమాల్లోనే వుంటాయి, ఎవరూ కనిపెట్టి చెప్పరు. ఆ సినిమాలని కాస్త కాన్షస్ గా, పరిశీలనాత్మకంగా చూడగల్గితే చాలు. 

       
కాబట్టి మీ ప్రశ్నలో, హీరో గోల్ రీచ్ అవలేకపోయాడు కాబట్టి, హీరోయిన్ ఆ గోల్ రీచ్ అయ్యేలా చేయడమన్నది ఎంత వరకు సమంజసమంటే, హీరో బతికుండగా అలా జరగదు. ఒకవేళ జరిగితే పైన చెప్పిన పరోక్షంగా రిమోట్ యాక్షన్ తో వుండొచ్చు. ఇలా కుదరకపోతే హీరోని చంపేసి, పైనే చెప్పిన హేండాఫ్ పాత్రగా అతడి గోల్ ని హీరోయిన్ కివ్వొచ్చు. 

        మీ ప్రశ్నలో కథలో మొదటి ప్రధాన పాత్ర తను సాధించాలనుకున్న గోల్ సాధించలేక, ఇంకో ప్రధాన పాత్ర ఆ గోల్ కోసం పాటుపడడం మంచిదా అంటే, మొదటి ప్రధాన పాత్ర జూనియర్ హీరో అయివుండి, రెండో ప్రధాన పాత్ర సీనియర్ హీరో అయివుంటే మాత్రమే మంచిది. జూనియర్, సీనియర్ లిద్దరున్నప్పుడు, జూనియర్ గోల్ సాధించడంలో నిస్సహాయుడవం ప్రేక్షకులు ఒప్పుకునే పాత్ర చిత్రణే. ఇద్దరూ సమాన హీరోలైనప్పుడు మంచిది కాదు. అప్పుడు ఉమ్మడి గోల్ వుండాల్సిందే. 

Q: 2. ఏ సినిమాలో అయినా సెకండ్ హాఫ్ లో విలన్ ను పూర్తిగా మట్టు బెట్టడానికో లేదా ప్రధాన పాత్ర తన గోల్ సాధించడానికి ఫస్ట్ యాక్ట్ లో పరిచయం చేయని, లేదా రాని పాత్రలను తీసుకుని రావడం, లేదా కొత్త ప్లాన్ వేయడం, లేదా కొత్త పాత్రల ఎంట్రీ తో కథ నడపడం అనేది స్ట్రక్చర్ ను ఫాలో అవడమే అవుతుందా లేదా?  

A: స్ట్రక్చర్ కి సంబంధం లేదు. స్ట్రక్చర్ కథని సెట్ చేస్తుంది. పాత్రల నడవడికని ఆ స్ట్రక్చర్ కి లోబడి క్రియేటివిటీ సెట్ చేస్తుంది. హీరో సాయంగా తీసుకునే పాత్ర ఎప్పుడైనా కథలోకి రావచ్చు. సెకండాఫ్ లో డల్ అవుతోందన్పిస్తే,  కథని రీఫ్రెష్ చేస్తూ డైనమిక్ గా ఆ పాత్రని తీసుకురావచ్చు. 

Q: 3. ఏదైనా కథలో ఓపెన్ డ్రామా చేసినప్పటికీ కథలో ట్విస్ట్ లు తెలిసి పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈమధ్య నేను ‘నైవ్స్ అవుట్’  అనే ఇంగ్లీష్ సినిమా చూసాను. దాంట్లో ఒక ఇంట్లో ఒక హత్య జరగడం, ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ అనుమానితులు అని ఎంక్వైరీ చేయడం, అంతలోపే హత్య చేసింది ఈ పాత్రే అని రివీల్ చేసి, ఓపెన్ డ్రామా చేశారు కానీ, ఇక అక్కడి నుంచి వచ్చే ట్విస్ట్ లలో ప్రధాన ట్విస్ట్ లను మనం ముందే పసిగడతాం. ఇలాంటప్పుడు కథలో సస్పెన్స్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

A: అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగడమే ట్విస్ట్. ట్విస్ట్ లు ముందు తెలిసిపోయే అవకాశమే లేదు. ఓవరాల్ గా కథ తెలిసిపోతూ వుండొచ్చు గానీ, ఇప్పుడు ఫలానా ఈ విధంగా ఈ ట్విస్టు వస్తుందని ముందూహించడం కష్టం. ఒకరి కూతుర్ని కిడ్నాప్ చేసి కిడ్నాపర్ డబ్బు డిమాండ్ చేశాడనుకుందాం. కూతురు ప్రమాదంలో వుందని టెన్షన్ లో పడతాం. పేరెంట్స్ డబ్బిస్తారా, పోలీసులకి చెప్తారా అని ప్రశ్నించుకుంటాం. పేరెంట్స్ పోలీసులకే చెప్పేస్తారు. ఇక పోలీసులు డబ్బుతో ట్రాప్ చేయాలనుకుంటారు. ఇప్పుడు రిస్కు పెరిగిందని ఇంకింత టెన్షన్ లో పడతాం. డబ్బుని ఎరగా వేసి పోలీసులు కిడ్నాపర్ని పట్టేసుకుంటారు. హమ్మయ్యా కూతురు సేఫ్ అనుకుంటాం. కానీ పోలీసులు కిడ్నాపర్ ముసుగు లాగేస్తే సర్ప్రయిజ్ - ఆ ‘కిడ్నాపర్’ కూతురే! డబ్బు కోసం నాటకమాడింది. 

        ఈ ట్విస్టు ముందూహించగలమా? ఇలా ట్విస్టుకి ఫార్ములా సీన్ రివర్సల్ ట్రిక్కే. వూహించే దానికి భిన్నంగా సీనుని రివర్స్ చేయడమే. అయితే ‘నైవ్స్ అవుట్’ లోలాగా ఓవరాల్ గా కథ తెలిసిపోతూంటే, కథనంలో ఎన్ని ట్విస్టులిచ్చినా ఆసక్తి కల్గించవు. నీ కథ తెలిసిపోయిందిలే, ఇవన్నీ అనవసరం అనుకుంటాం. కథ సరిగ్గా లేనప్పుడే ట్విస్టులతో గిమ్మిక్కులు చేయాల్సి వస్తుంది. ‘క్యాష్’ (2007) అనే హిందీ మల్టీ స్టారర్ లో అడుగడుగునా ట్విస్టులే ట్విస్టులు. ఇన్ని ట్విస్టులు పెడితే వెగటు పుట్టిస్తాయి. ఫ్లాపవుతుంది. ‘క్యాష్’ ఫ్లాపయ్యింది. కథ ఎప్పుడూ రైటర్ తెలివి తేటలు ప్రదర్శిస్తున్నట్టు వుండకూడదు.  

        ఇక కథలో సస్పెన్స్ అనేది క్రియేటివిటీ చేసుకునే పని. కథని బట్టి ఆ క్రియేటివిటీ మారుతుంది. కాబట్టి సస్పెన్స్ కోసం తీసుకునే జాగ్రత్తలు చెప్పడం కష్టం. కానీ సస్పెన్స్ ని సృష్టించడానికి సినిమాలకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్ ఐదూ ముఖ్యం. 

Q: 4. ఏ కథలో అయినా పాత్ర కు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అలాగే ఔటర్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి అంటారు. కొన్ని సార్లు పాత్రకు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఏం జరుగుతుంది? అలాగే పాత్రకు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఒకటే వుండి ఔటర్ కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఏం జరుగుతుంది అనేది కొంచెం వివరణ ఇవ్వండి.

A: ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వుండి ఔటర్ కాన్ఫ్లిక్ట్ లేకపోతే పాత్ర పాసివ్ పాత్రవుతుంది. చదువుకుని పాసవమంటే, ఆ పని చెయ్యక, నిత్యం పేరెంట్స్ చీవాట్లతో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనుభవించే పాత్ర పాసివ్ పాత్రే. చదువుకుంటూ పాసయ్యే ప్రయత్నాలు ప్రారంభిస్తే, ఔటర్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడి యాక్టివ్ పాత్రవుతాడు. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ పాత్ర వ్యక్తిగత పరిస్థితుల్ని బట్టి వుండొచ్చు. ఇన్నర్ - ఔటర్ కాన్ఫ్లిక్ట్స్ రెండూ సజీవ, చైతన్య వంతమైన పాత్రకుండాల్సిందే. ఇన్నర్ వుండి ఔటర్ లేకపోతే పాసివ్ ఎలా అవుతుందో, అలా ఔటర్ వుండి ఇన్నర్ లేకపోతే ఫ్లాట్ అవుతుంది. 

సికిందర్