రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఆగస్టు 2017, బుధవారం

490 : శ్రావణ - నోనో - ప్రేమల మాసం స్పెషల్!



        వారం కూడా ఒకటి రెండు కొత్త సబ్జెక్టులు  రాసుకుని చేసిన ఒకే రకం పొరపాట్లు హీరోకి గోల్ లేకపోవడం, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే గా వుండడం.  ప్రేమ సినిమాల టెంప్లెట్ (అంటే అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించలేక క్షోభ పడడమో ) ఏనాడో 2000 లలో చిన్నసినిమాలతో మొదలై – లైటర్ వీన్ లవ్ స్టోరీస్ అనే పేరు తగిలించుకుని- మిల్స్ అండ్ బూన్ నవలల్లాగా – టీనేజర్లకి ఉద్దేశించి- అదే టెంప్లెట్ తో అవే అచ్చి బుచ్చి ప్రేమ కథలతో దశాబ్దాలు మారినా అలాగే కొనసాగుతూ వచ్చీ వచ్చి, ఇప్పుడు పెద్ద సినిమాలకీ ఎగబ్రాకి ఇటీవల మజ్నూ, నిన్నుకోరి, ఫిదా లాంటివి రావడంతో- టెంప్లెట్ మరింత ఆకర్షణీయంగా కన్పించడం మొదలెట్టింది. దీంతో చిన్న సినిమాలకి తిరుగులేని సర్టిఫికేట్ దొరికిపోయినట్టు, రెట్టింపు ఉత్సాహంతో టెంప్లెట్ పెట్టుకుని రోమాంటిక్ కామెడీలకి సిద్ధమవుతున్నారు. టీనేజీ ప్రేమలు పెద్ద నటులే  నటించేస్తూంటే ఇక లేత పిండాలకి  అడ్డేముంది. 

          స్టార్స్ తో తీసే యాక్షన్ సినిమాలు వాటి టెంప్లెట్ తో ఈ ఏడాది మొత్తం ఆరుకి ఆరూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ టెంప్లెట్ తో విసిగిన సీనియర్ రచయిత వేరే సొంతంగా రియలిస్టిక్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ యాక్షన్ కి టెంప్లెట్ బెడద దాదాపు వదిలినట్టే. టెంప్లెట్ ని వదిలించుకున్న  మొదటి సినిమాగా గత వారం విడుదలైన ‘గౌతమ్ నందా’ ని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ప్రేమ సినిమాలకి టెంప్లెట్ పీడా వదలాల్సి వుంది. అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించడానికి గింజుకోవడమో లాంటి కృత్రిమత్వపు టెంప్లెట్  కథలతో నిన్నుకోరి, ఫిదా హిట్టయ్యాయంటే-  వాటికి బ్యానర్స్, స్టార్స్,  డైరెక్టర్స్ గ్లామర్ వుండడం వల్ల. అదే మజ్నూ కి ఈ వేల్యూస్ వున్నాపనిచెయ్యలేదు. ఈ వేల్యూస్ తీసేస్తే ఇవన్నీ వారం వారం విడుదలై అడ్రసులేకుండా పోతున్న చిన్నా చితకా  టీనేజీ  రోమాంటిక్ కామెడీలే విషయపరంగా.

          కాబట్టి నిన్నుకోరి, ఫిదా  హిట్టయ్యాయని అవే రెండు పాయింట్లతో (అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించలేక కుమిలిపోవడమో), కొత్త వాళ్ళు,  కొత్త వాళ్ళతో బడ్జెట్ రోమాంటిక్ కామెడీలుగా  తీస్తే, వారం వారం ఏం జరుగుతోందో వీటికీ అదే జరుగక మానదు. ఇక్కడ పేర్లు అవసరంలేదు గానీ-  తయారు చేసుకున్నసబ్జెక్టులపై నమ్మకం కలగకరమ్మంటే వెళ్ళాక- తెలిసిందేమిటంటే హీరోకి గోల్ లేకపోవడం, దాంతో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు తయారవడం. టెంప్లెట్ ప్రేమల్లో ఇంతే, గోల్స్ వుండవు. గోల్స్ లేకుండానే టెంప్లెట్ ప్రేమలుంటున్నాయి. గోల్ అనేదే కథకి బేస్. చందమామ కథలకి కూడా. గోల్ లేకపోతే  స్ట్రక్చర్ వుండదు, స్ట్రక్చర్ లేకపోతే  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయిపోతుంది. పెద్ద బ్యానర్స్, స్టార్స్,  డైరెక్టర్స్ గ్లామర్స్ తో ఇవి కవరైపోవచ్చు. చిన్న సినిమాలకి స్ట్రక్చర్ లో వున్న ఆర్ధవంతమైన కథే రక్ష. ఎన్నో పెద్ద సినిమాలకి పనిచేసిన రచయితకి ఈ పొరపాటు అర్ధమయి,  గోల్ ని సెట్ చేయడానికి ఒప్పుకోవంతో  ఈ రోమాంటిక్ కామెడీకి  బలం, అర్ధంపర్ధమూ వచ్చి, టెంప్లెట్ వదిలిపోయి- సందేహాలన్నీ తీరిపోయి దర్శకుడు సహా టీం అంతా ఖుష్.  స్క్రిప్టుని అక్కడక్కడా మార్చడానికి ఇంకో పది రోజులు పట్టొచ్చు.

          ఇంకోచోట, ఇంటర్వెల్ ‘బ్యాంగ్’ లో ప్రేమని వెల్లడించలేక హీరో అదే టెంప్లెట్ లో జంప్ అవడం. ఇప్పుడు హీరో గోల్ ఏమనుకోవాలి? జంప్ అయ్యేవాడికి ఏం గోల్ వుంటుంది? ప్రేమలో వున్న యంగ్ హీరోపాత్ర,  సినిమా చూస్తున్న యూత్ ని మోటివేట్ చేసేట్టు వుండక, సమస్య వస్తే జంప్ అయిపోరా  అన్నట్టుంటే అదేం సినిమా? టెంప్లెట్ లవర్స్ కి ఇది తెలియడంలేదు. హీరోయిన్ కి లవ్ చెప్పేస్తే పోయేదేముంది బానిస టెంప్లెట్ తప్ప. ఎందుకు చెప్పలేడు? అదెంత సేపు? టెంప్లెట్ మొదలైన కాలంలో 2000 లోనంటే  సెల్ ఫోన్స్ లేవు, నెట్ వాడకం అంతగా లేదు. ఇప్పుడేమయ్యింది? ఒక మెసేజ్ కొట్టలేడా? ఇలా చేయడంలేదా యూత్? అనుకున్నది చేసెయ్యడం, ఎదుర్కోవాల్సింది తర్వాత చూసుకోవడమే ఇదే నేటి యూత్ తెగింపు. ఈ మానసిక లోకాన్ని చూపెట్టకుండా - ప్రేమని వెల్లడించలేని హీరో  సెకండాఫ్ అంతా లోలోన కుళ్ళి చావడమేమిటి? లవ్ చెప్పేస్తే తెగిస్తున్నట్టు, ఒక గోల్ వున్నట్టు, గోల్ తో స్ట్రక్చర్ వచ్చేసినట్టు, దాంతో చల్లారిన టెంప్లెట్ ఆమ్లెట్ వదిలిపోయినట్టు. ఇంటర్వెల్లో హీరో లవ్ చెప్పెసేట్టు చేశాక కథకి ఎంతో చైతన్యం వచ్చింది...

          ప్లాట్ పాయింట్ వన్ అన్నాక గోల్ ఏర్పడాల్సిందే. గోల్ కి యూత్ అప్పీల్ వుండాల్సిందే. దాంతో బాక్సాఫీసు అప్పీల్ రావాల్సిందే. అపార్ధం చేసుకుని విడిపోవడమో, ప్రేమని వెల్లడించలేక తన్నుకు చావడమో యూత్ అప్పీల్ ముమ్మాటికీ కాదు. ఈ మోటివేట్ చెయ్యని బలహీన టీనేజి ప్రేమలు,  స్టార్ సినిమాలకి వాటి హంగూ ఆర్భాటాలతోనైతే  చెల్లిపోవచ్చు.


-సికిందర్