రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, జూన్ 2023, మంగళవారం

1345 : రివ్యూ!

 
దర్శకత్వం : అలీ అబ్బాస్ జాఫర్
తారాగణం : షాహిద్ కపూర్, రోణిత్ రాయ్, సంజయ్ కపూర్, డయానా పెంటీ తదితరులు రచన : ఆదిత్య బసు, సిద్ధార్థ్-గరిమ; ఛాయాగ్రహణం : మార్సిన్ లాస్కావిక్, సంగీతం- పాటలు : బాద్షా, అనుజ్ గర్గ్; నేపథ్య సంగీతం : జూలియస్ ప్యాకియం
బ్యానర్స్ : జియో స్టూడియోస్, AAZ ఫిల్మ్స్, ఆఫ్‌సైడ్ ఎంటర్‌టైన్‌మెంట్, Sradvn ప్రొడక్షన్
నిర్మాతలు : జ్యోతి దేశ్‌పాండే, సునీర్ ఖేతర్‌పాల్, గౌరవ్ బోస్, హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జాఫర్, సుశీల్ చౌదరి
విడుదల : జూన్ 9, 2023
***

            జెర్సీ (తెలుగులో జెర్సీ’, 2019), కబీర్ సింగ్ (తెలుగులో అర్జున్ రెడ్డి’, 2021) లలో నటించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, యాక్షన్ థ్రిల్లర్ బ్లడీ డాడీ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. పెద్ద తెర మీద కాకుండా దీన్ని జియో సినిమా ఓటీటీలో ఉచితంగా అందిస్తోంది. ఉచితం కాబట్టి ఖర్చు దండగన్నట్టు ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకుండా, కేవలం హిందీలో అందించింది. దీనికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. సల్మాన్ ఖాన్ తో సుల్తాన్’, టైగర్ జిందా హై’, భారత్ వంటి హిట్స్ అందించిన జాఫర్, షాహిద్ కపూర్ తో ఈ థ్రిల్లర్ ఎలా తీశాడో తెలుసుకుందాం...

కథ

ఢిల్లీలో సుమైర్ ఆజాద్ (షాహిద్ కపూర్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి.  ఓ తెల్లారి పొద్దున్నే తన అసిస్టెంట్ జగ్గీ(జీషాన్ ఖాద్రి) తో కలిసి ఢిల్లీలో డ్రగ్స్ దందాని విచ్ఛిన్నం చేసి, 50 కోట్ల డ్రగ్స్ వున్న బ్యాగుని పట్టుకుంటాడు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో సికిందర్ చౌదరి (రోణిత్ రాయ్) ఎమరాల్డ్ అట్లాంటిస్ అనే సెవెన్ స్టార్ హోటల్ ని- ఆ హోటల్లో డ్రగ్స్  రాకెట్ నీ నడుపుతూంటాడు. సుమైర్ పట్టుకున్న డ్రగ్స్ సికిందర్ చౌదరికి చెందిందే. దీంతో అతను సుమైర్ కొడుకు అధర్వ్ (సర్తాజ్ కక్కర్) ని కిడ్నాప్ చేసి డ్రగ్స్ వున్న బ్యాగుని డిమాండ్ చేస్తాడు. సుమైర్ కి డాక్టర్ అయిన భార్య తో విడాకులై వుంటాయి. కొడుకు కిడ్నాప్ అయ్యేసరికి సుమైర్ డ్రగ్స్ ని సికిందర్ చౌదరికి ఇచ్చేయడానికి బయల్దేరతాడు.
       
హోటల్ కే వచ్చిన ఇంకో నార్కోటిక్స్ ఉద్యోగిని అదితీ రావత్ (డయానా పేంటీ) సుమైర్ డ్రగ్స్ బ్యాగుతో రావడాన్ని చూసిఆ బ్యాగుని కొట్టేసి పై అధికారి సమీర్ సింగ్ (రాజీవ్ ఖండేల్వాల్) ని పిలుస్తుంది. ఇద్దరూ సుమైర్ మీద కన్నేసి వుంచుతారు. బ్యాగు పోగొట్టుకున్నట్టు తెలుసుకున్న సుమైర్ ఇరకాటంలో పడతాడు. ఇంకోవైపు ఆ డ్రగ్స్ కోసం హమీద్ షేక్ (సంజయ్ కపూర్) అనే ఇంకో స్మగ్లర్ వచ్చి సికిందర్ చౌదరి గొంతు మీద కూర్చుంటాడు.
        
డ్రగ్స్ వున్న బ్యాగుని పోగొట్టుకున్న సుమైర్ మైదా పిండి ప్యాకెట్స్ తీసికెళ్ళి సికిందర్ చౌదరికి అంట గట్టడంతో అది బయటపడి మొత్తం అభాసవుతుంది- ఇక సుమైర్ ని పట్టుకోవడానికి సికిందర్ చౌదరి గ్యాంగ్స్ వెంట పడతారు. మరోవైపు సమీర్, అదితీలు వెంటబడతారు. ఈ రెండు గ్రూపులకి దొరక్కుండా, స్టార్ హోటల్లోనే ఎక్కడో బందీగా వున్న కొడుకుని ఎన్సీబీ అధికారి సుమైర్ ఆజాద్ ఎలా విడిపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

రొటీన్ యాక్షన్ కథే. అయితే ఇది 2011 లో ఫ్రెంచి భాషలో (స్లీప్ లెస్ నైట్) ఒరిజినల్ గా నిర్మాణం జరుపుకుంది. తర్వాత హాలీవుడ్ లో రీమేకయింది. ఈ రెండూ బాక్సాఫీసుకి బలం చేకూర్చలేదు. కానీ 2015 లో కమల్ హాసన్ తమిళంలో తూంగవనం గా రీమేక్ చేస్తే 50 కోట్ల బాక్సాఫీసుతో లాభాలు తెచ్చి పెట్టింది. దీన్ని తెలుగులో చీకటి రాజ్యం’’ గా డబ్ చేశారు. ఇప్పుడు హిందీలో బ్లడీ డాడీ గా రీమేకయింది.
       
చీకటి రాజ్యం చూసి వుంటే బ్లడీ డాడీ వెలవెలబోతూ వుంటుంది. కేవలం ఒక రాత్రి నైట్ క్లబ్ లో జరిగే యాక్షన్ కథని కమల్ హాసన్ తన స్టార్ పవర్ తో, సహజ కామెడీతో ఎక్కడికో....తీసికెళ్ళిపోయారు. ఇది షాహిద్ కపూర్ విషయంలో లోపించింది- స్టార్ పవరూ లేదు, కామెడీ లేదు. కమల్ హాసన్ స్క్రిప్టు తయారు చేసుకుని, రాజేష్ సెల్వ దర్శకత్వంలో వేగంగా పరుగెత్తే టైం పాస్ గ్యారంటీ  థ్రిల్లర్ గా సొంత బ్యానర్ పై తీస్తే, హిందీలో అలీ అబ్బాస్ జాఫర్ స్లో గా సాగే డార్క్ థీమ్ థ్రిల్లర్ గా, ఫన్ కి దూరంగా వుంచేశాడు.
       
కమల్ హాసన్ కి కొడుకు కోసం ఫిజికల్ యాక్షన్
మాజీ భార్య కారణంగా ఎమోషనల్ యాక్షన్ - ఈ రెండిటి మధ్య నలిగే పాత్రగా రక్తి కట్టిస్తే, షాహిద్ కపూర్ కి ఈ రెండు షేడ్స్ లేక ఉపరితలంలోనే వుండిపోయాడు. కమల్ హాసన్ థ్రిల్లర్ కలర్ఫుల్ గా వుండడానికి పాపులర్ స్టార్స్ నటించడం ఇంకో కారణం. కమల్ కి యాంటీగా నార్కోటిక్స్ ఉద్యోగినిగా స్టార్ హీరోయిన్ త్రిష నటించడం, ఆమెతో కమల్ చేసే ఫైట్ ఒక ఎట్రాక్షన్ కావడం కలిసొచ్చాయి.  హిందీలో ఎవరికీ తెలియని డయానా పేంటీతో ఈ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. కమల్ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ బలం వుంటే, హిందీలో రోణిత్ రాయ్ అనే పెద్దగా పేరు లేని పాత ఆర్టిస్టుతో విలన్ పాత్ర మామూలుగా వుంది. ఇంకో విలన్ గా ఒకప్పటి హీరో సంజయ్ కపూర్ ది ఓవరాక్షన్.
       
ఈ కథని కోవిడ్ -2 మహమ్మారి ముగిసిన సమయంలో స్థాపించారు. కోవిడ్-1
, 2 లతో ఎంతో మంది చనిపోయి, మరెంతో మంది ఉపాధి కోల్పోయి నేరాల వైపు మళ్ళారని చెబుతూ కథ ప్రారంభించారు. నేరాల వైపు ఏ సామాన్యులు మళ్ళారో చూపించకుండా, డ్రగ్ స్మగ్లర్స్ అనే ప్రొఫెషనల్స్ తో కథ ప్రారంభిస్తే- ఆ డ్రగ్ స్మగ్లర్స్ కొత్తగా నేరాలకి పాల్పడేదేముంటుంది - అది వాళ్ళ నిత్య కార్యక్రమమే.
       
ఇక కోవిడ్ జాగ్రత్తలంటూ ప్రారంభ దృశ్యాల్లో మాస్కూలు వేసుకుని తిరగడం చూపించి
, ఆ తర్వాత మర్చిపోయాడు దర్శకుడు. ఈ మాత్రం దానికి కోవిడ్ బిల్డప్ ఎందుకో అర్థంగాదు. ఆ హోటల్లో దాగుడు మూతలప్పుడు మాస్కు లేసుకుని వుంటే, ఎవరు ఎవరో తెలియక కన్ఫ్యూజన్ తో చాలా కామెడీగా యాక్షన్ వుండేది.

నటనలు -సాంకేతికాలు

ఈ సినిమాకి హీరోగా షాహిద్ కపూర్ గ్లామర్ లుక్ తో వుండి వుంటే బావుండేది. క్రిమినల్ గ్యాంగ్స్ లో ఒకడుగా తానూ రఫ్ లుక్ తోనే  గ్యాంగ్ స్టర్ లా వుంటే- అసలు ఎన్సీబీ అధికారిగా ఉద్యోగంలో వుంటాడా. అల్లరైపోయిన ముంబాయి ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే క్లీన్ షేవ్ తో ఎంత అఫీషియల్ గా వుండేవాడని. ఆఫీసర్ కి, గ్యాంగ్ స్టర్ కీ తేడా లేకపోతే అదేం సినిమా అనుకోవాలి?
        
ఎన్సీబీ ఉద్యోగినిగా వేసిన డయానా పేంటీ ఫార్ములా సినిమా పాత్రే. పై అధికారి పక్కన కరివే పాకు పాత్ర. వెబ్ సిరీస్ లో స్త్రీ పాత్రలు- హీరోయిన్ పాత్రలూ ఎంత శక్తిమంతంగా వుంటున్నాయో గుర్తిస్తున్నట్టు లేదు సినిమా దర్శకులు.
       
రిచ్ విలన్ గా రోణిత్ రాయ్
, అతడి పక్క వాద్యంగా సంజయ్ కపూర్ పాత విలన్లుగా వుంటారు. సాంకేతికంగా ఉన్నతంగా తీర్చి దిద్దాడు దర్శకుడు. ప్రారంభంలో ఔట్ డోర్ యాక్షన్ సీన్స్ బావున్నాయి. అయితే ఈ మేకింగ్ క్వాలిటీ అంతా పాపులర్ నటీనటులతో వుండుంటే సినిమా పై లెవెల్లో వుండేది. ఇంకోటేమిటంటే, ఎప్పుడో 2011 నాటి కాలపు ఫ్రెంచి థ్రిల్లర్ ని ఇప్పుడు రీమేక్ చేయడం విజ్ఞత అన్పించుకోదు. ఫ్రెంచి థ్రిల్లర్ ఫ్రెష్ గా వున్నప్పుడు, అప్పుడప్పుడే 2015 లో  కమల్ హాసన్ రీమేక్ చేయడం వేరే విషయం.

—సికిందర్