రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, ఆగస్టు 2014, ఆదివారం

'రభస' రివ్యూ..
                                   
కామెడీ సీసాలో కషాయం!


రచన- దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ 

తారాగణం: ఎన్టీఆర్, సమంతా, ప్రణీత, షాయాజీ షిండే, నాజర్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, అజయ్, రఘుబాబు, జయసుధ, హేమ తదితరులు.
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : శ్యాం కె.నాయుడు, కళ : ప్రకాష్, కూర్పు : కోటగిరి, పోరాటాలు : రాం- లక్ష్మణ్, 
బ్యానర్ : శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, సమర్పణ : బెల్లంకొండ సురేష్ 
సెన్సార్ : U/A, విడుదల : 29 ఆగస్టు 2014


***

2010 ‘బృందావనం’ తర్వాత- ఎన్టీఆర్ నటించిన ఐదు సినిమాల్లో ఒక్క ‘బాద్షా’ తప్ప- ‘దమ్ము’, ‘ఊసరవెల్లి’, ‘రామయ్యా వస్తావయ్యా’ - ఇప్పుడు ‘రభస’- నాల్గుకి నాల్గూ అపజయాల పాలవడానికి కారణాలేమిటో ఈపాటికి ఎన్టీఆర్ తెలుసుకునే వుండాలి. తన సీనియర్లైన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా పంథా మార్చుకుని ‘మనం, ’దృశ్యం’, ‘లెజెండ్’ లలాంటి కొత్తదనాలతో సెకెండ్ ఇన్నింగ్స్ ని దిగ్విజయంగా ప్రారంభించుకుని ప్రేక్షకులకి కొత్తానుభూతుల్ని పంచిపెడుతోంటే, తానింకా ఆ సీనియర్లు ఏనాడో నటించి వదిలేసిన 1980-90 లనాటి పురాతన కథా కమామిషుల మీదే ఇంకా మోజుపెంచుకోవడం విచారకరం. మాస్ చిత్రాలకి ఆనాటి సినిమాలే గీటు రాయి కావు. ఏ కాలంలోనైనా భావోద్వేగాలు అలాగే వుంటాయి. అభిరుచులే మరిపోతూంటాయి. భావోద్వేగాల్లోంచి అభిరుచులు పుట్టవు, అభిరుచుల్లోంచే భావోద్వేగాలు ఉద్భవిస్తాయి. ఇదెలాగో, సినిమా సమకాలీన ధర్మానికి అభిరుచుల్ని అనుసరించే భావోద్వేగాలెలా వస్తాయో తర్వాత తెలుసుకుందాం.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కిది రెండో సినిమా. మొదటి సినిమాగా 2011 లో ఇదే నిర్మాతలతో, యంగ్ స్టార్ రామ్ తో ‘కందిరీగ’ అనే రోమాంటిక్ సూపర్ హిట్ కామెడీ తీస్తూ తనదొక శైలినీ, సృజనాత్మకతనీ ఏర్పాటుచేసుకున్న తను, ఇప్పుడు రెండో సినిమాకే అవన్నీ తీసి పక్కనబెట్టేసి, ఓ పెద్ద స్టార్ తో చవకబారు సినిమా లాగించెయ్యడం విషాదకర పరిణామం. తన అనారోగ్యకారణంగా ఇలా జరిగిందనుకోవడానికి వీల్లేదు. స్క్రిప్టు చాలా ముందే తయారైపోయి వుంటుంది.

ఈ స్క్రిప్టుతో దర్శకుడు తెలిసో తెలీకో ‘కందిరీగ’ స్క్రిప్టుతో చేసిన గిమ్మిక్కే చేశాడు. ‘కందిరీగ’ స్క్రీన్ ప్లేది ఫ్రాక్చరైన స్ట్రక్చర్. ఐతే ఇంటర్వెల్లో ఈ ఫ్రాక్చర్ ఫీలవ్వకుండా మొదట్నించీ ఒక స్పష్టమైన ఎజెండాతో స్పీడుగా నడిపిన కథనం, దానికిస్తూ వచ్చిన అమోఘమైన ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన షుగర్ కోటింగ్, దాని సెకండాఫ్ ని బతికించింది.

‘దర్శకులం డాట్ కామ్’ లో ‘కందిరీగ’ రివ్యూ రాసినప్పుడే, ఇలాటి ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లేలతో ఏం జరగవచ్చో హెచ్చరించడం కూడా జరిగింది. ‘కందిరీగ’ లాంటి సంపూర్ణ హాస్యప్రధాన యాక్షన్ కథని మాత్రమే ఆ స్పీడు కథనమూ, అంతేసి షుగర్ కోటింగూ ఫ్రాక్చర్ ని మరిపించగలవేమోగానీ, అదే ఫక్తు సీరియస్ యాక్షన్ కథై నప్పుడు ఆ ఫ్రాక్చర్ దగ్గరే కుప్ప కూలిపోతుందని చెప్పడం జరిగింది.


చెప్పినట్టుగానే సరీగ్గా ‘రభస’ అనే ఫక్తు సీరియస్ యాక్షన్ కథతో మళ్ళీ ‘కందిరీగ’ లాంటి గిమ్మిక్కుకే పాల్పడి మొత్తం కుప్పకూల్చుకున్న దర్శకుడ్ని చూసి నవ్వాలో ఏడ్వాలో అర్ధంగావడం లేదు! ఈ గొడవేంటో ‘స్క్రీన్ ప్లే’ సంగతులు విభాగంలో పూర్తిగా చూద్దాం..


అమ్మకిచ్చిన మాట - వదిలేసి పరోపకారాల బాట! 
అనగనగా కార్తీక్ (ఎన్టీఆర్) అనే అమెరికాలో చదువుకునే విద్యార్ధి. చిన్నప్పుడు తన తల్లి మేనత్త కి మాటిస్తే, ఆ మాట నిలబెట్టడంకోసం ఇండియా వస్తాడు. పాతికేళ్ళ క్రితం మేనత్త చచ్చిపోతూ తన కూతురు చిట్టి (సమంతా) ని కార్తీక్ తల్లి చేతుల్లో పెట్టి, నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని మాట తీసుకుంది. అయితే దీన్ని బేఖాతరు చేసి కుటుంబంతో సహా సిటీ కెళ్ళి పోయి రాజకీయంగా బాగా ఎదిగాడు మేనమామ ధనుంజయ్ (సాయాజీ షిండే). ఇప్పుడతన్ని లొంగ దీసి మరదల్ని పెళ్లి చేసుకురమ్మని పురమాయిస్తుంది కార్తీక్ తల్లి (జయసుధ).

ఇలా సిటీ కొచ్చిన కార్తీక్ చిట్టీ అనుకుని ఆమె ఫ్రెండ్ భాగ్యం ( ప్రణీత) తో ప్రేమలోపడతాడు. ఆమెని ప్రేమలో దింపడం కోసం ఆమె కాలేజీలోనే యాంటీ లవర్స్ స్క్వాడ్ పేరుతో కాలేజీలో ప్రవేశిస్తాడు. అదే కాలేజీలో చదువుతున్న చిట్టీ అలియాస్ ఇందూ అతడితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ వుంటుంది. అసలైన ప్రేమల గురించి లెక్చర్లిచ్చే కార్తీక్ ని చూసి భాగ్యం ప్రేమలో పడుతుంది. ఇంతలో తన మరదలు భాగ్యం కాదు, చిట్టీ అని తెలుసుకుంటాడు కార్తీక్. కానీ మరదలు చిట్టీని చూస్తే ఆమె ఇంకెవర్నో ప్రేమిస్తూంటుంది. ఇప్పుడు అమ్మమాట కోసం చిట్టీని కార్తీక్ తనవైపు ఎలా తిప్పుకున్నాడన్నది మిగతా కథ....అని అనుకుంటా రెవరైనా! కానీ కాదు-మాటా గీటా వదిలిపారేసి, ఇంకేవో రెండు ఫ్యాక్షన్ (గంగిరెడ్డి అనే నాగినీడు- పెద్దిరెడ్డి అనే జయప్రకాష్ రెడ్డి) కుటుంబాల మధ్య ఎప్పుడో తనవల్ల ఏర్పడిన స్పర్ధల్ని తొలగించడానికి వాళ్ళింట్లోనే మకాం వేస్తాడు.

ఎన్టీఆర్ మంచి లుక్ తో, మంచి నటనతో అభిమానులవరకూ అలరిస్తాడేమో. విషయపరంగా సినిమా లుక్ కూడా బావుండాలని చూసుకోకపోతే ఇమేజి పరంగా ఏ లుక్కయినా, ఏ స్టెప్పులూ ఫైట్లయినా సినిమాని ఏం కాపాడతాయి. అరిగిపోయిన పురాతన పాత్రతో, బాగా నలిగిపోయిన అతిపురాతన మామా అల్లుళ్ళ సవాల్ కథతో, అదికూడా అర్ధంకాని గందరగోళపు కథనంతో వుంటే, ట్రెండ్ లో వున్న స్టార్ అనేవాడు ఎన్ని షోకులు చేసుకుంటే ఏం లాభం.


సమంతా ఈ సారికూడా బోల్తా కొట్టింది. ఆమెకీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి- ఇలాటి పనికిరాని పాత్రలతో ఇలాగే కొనసాగితే కనీసం త్రిష లాగించినంత కాలం కూడా సినిమాల్లో వుండదు. ప్రణీత మొహం నిండా పెద్ద పెద్ద కళ్ళే ఇబ్బందికరంగా డామినేట్ చేసే వ్యవహారం. ఈ సినిమాలో అర్ధాంతరంగా ఈమె పాత్ర ముగిసిపోతుంది. అరుపుల షాయాజీ షిండే, ఇంకో అరుపుల అజయ్, భోళా జయప్రకాష్ రెడ్డి, సీరియస్ నాగినీడూ లవి, ఫ్యాక్షన్ సినిమాల్లో ఎప్పుడో అరిగిపోయిన పాత్రలు, నటనలు.

ఇక సెకండాఫ్ అనగానే బ్రహ్మానందం రావడమనే స్కీము ఇంకెన్నాళ్ళు తెలుగు సినిమాల్ని పట్టి పీడి స్తుందో తెలీదు. ఈ స్కీము రహస్యం కూడా తెలిసిపోయేదే- సెకండాఫ్ లో కథ నడపడలేక దర్శకుడు చేతులెత్తేస్తే- బ్రహ్మానందం వచ్చేసి కథతో సంబంధం లేకుండా నవ్వించి వెళ్ళిపోతే, ఓ అరగంట స్క్రీన్ టైము గడిచిపోయి దర్శకుడికి తేలికవుతుంది! పదేపదే ఈ అరిగిపోయిన స్కీము గిన్నీసు బుక్కు బ్రహ్మానందానికి ఎంత త్వరగా బోరుకోడితే అంతమంచిదని ఎదురు చూడ్డం తప్పితే చేసేదేం లేదు. సినిమా మొదట్నుంచీ కథలో భాగంగా ఆ పాత్ర వుంటే అది వేరే విషయం.

చీటికీ మాటికీ ఫైట్స్ ఇంకో సహన పరీక్ష. అలాగే పాటల మీద కూడా శ్రద్ధపెట్టలేదు. ఒక్క ఛాయాగ్రహణం మాత్రమే సాంకేతిక విభాగంలో మార్కు లేయించుకుంటుంది. కథకి తగ్గట్టే సంభాషణలు పేలవంగా ఉన్నాయి.

స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకుడు తన తొలి సినిమా ‘కందిరీగ’ ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లే తో తెలిసో తెలీకో చేసిన గిమ్మిక్కు సక్సెస్ కావడంతో- రెండో సినిమాకీ రిస్కు ఎందుకని దాన్నే నమ్ముకున్నట్టున్నాడు...ఐతే తను చేసిన గిమ్మిక్కు ‘కందిరీగ’ లో ఎలా వర్కౌటయ్యిందో సశాస్త్రీయంగా విశ్లేషించుకో నందున, గుడ్డిగా నమ్మి దాన్నే ‘రభస’కీ అన్వయింప జేసినట్టుంది. అప్పుడిది ఎలా తయారయ్యిందంటే, ‘కందిరీగ’ అనే యాక్షన్ కామెడీ సీసాలో ‘రభస’ అనే సీరియస్ యాక్షన్ ని నింపేసి కషాయం తయారు చేసినట్టయ్యింది!

‘కందిరీగ’ ఫస్టాఫ్ లో విలన్ తో ఛాలెంజి ప్రకారం హీరోయిన్ని హీరో ప్రేమించేట్టు చేసి, అతడికి బుద్ధి చెప్పించడంతో, హీరో లక్ష్యం పూర్తయ్యి ఇంటర్వెల్లోనే కథ ముగిసినట్టయ్యింది. ఇక సెకండాఫ్ లో కథే ముంటుంది?

సెకండాఫ్ లో అతికించిన కథే! విలన్ మళ్ళీ అదే హీరోయిన్ని ఎత్తుకుపోయి పెళ్ళాడే ప్రయత్నం చేయడమనే సెకండాఫ్ కొనసాగింపు తెచ్చి అతికించిన ముక్కే. అది ఫస్టాఫ్ కథా కథనాల్లోంచి సహజంగా ప్రవహించిన ప్రక్రియ కాదు. అయితే అతికించిన ముక్క అనే ఫీల్ కలక్కుండా కాపాడిందేమిటంటే, సినిమాప్రారంభం నుంచీ దీన్నో అనితరసాధ్యమైన షుగర్ కోటింగ్ తో- తెగ నవ్వించే యాక్షన్ కామెడీగా స్పీడుగా నడిపించుకు రావడమనే కథన చాతుర్యమే. ఒక్క బోరు కొట్టే సీను గానీ, డైలాగు గానీ లేకుండా పడిన జాగ్రత్తే. షుగర్ కోటింగ్ పాత మూసలో వెలసిపోయిన దై వుంటే కూడా ఎంత కథనమూ ఫ్రాక్చర్ ని మరిపించేది కాదు. ఒక్క అనితరసాధ్యమైన ఇన్నోవేటివ్ షుగర్ కోటింగ్ వల్ల మాత్రమే నిలబడ్డ వికలాంగ స్క్రీన్ ప్లే ‘కందిరీగ’ ది!

ఏమిటా ఇన్నోవేటివ్ షుగర్ కోటింగ్? హీరో రామ్ పాత్రకిచ్చిన వినూత్న తరహా క్యారెక్టరైజేషనే. పాత్ర మేనరిజమ్స్ ప్రధానాకర్షణ అయ్యాయి. రియల్ ఫన్ కీ, వెకిలితనానికీ మధ్యన సన్నని రేఖ వుంటుంది. దీన్ని గుర్తుంచుకుని క్లాస్-మాస్ రెండూ కలగలిసిన టిపికల్ క్యారెక్టర్ గా తీర్చిదిద్దారు. దీన్ని గురించి ఇంకా చెప్పాలంటే- జేమ్స్ బానెట్ తన ప్రసిద్ధ స్క్రీన్ ప్లే పుస్తకంలో రాసినట్టు- ‘Another factor augmenting the sugar coat is real life. Audiences are fascinated and delighted by successful imitations of real life -real human gestures, expressions, moods and conversations, when a great story artistically treats real life to create a metaphor, it retains that fascination and becomes a primary interest holder. It riverts their attention’ అదన్న మాట- నిజజీవితానికి షుగర్ కోటింగ్ ఇస్తూ సక్సెస్ ఫుల్ గా ఇమిటేట్ చేసిన పాత్ర చిత్రణ అది! పాత్ర కలర్ ఫుల్ గా వుంటే కథ ఎన్ని లోపాలనైనా జయించేస్తుంది!

ఈ షుగర్ కోటింగ్ ఏమీ సాధ్యపడని ‘రభస’ లాంటి సీరియస్ (ఫ్యాక్షన్) యాక్షన్ కథని ఇంటర్వెల్లో చేర్చిన మజిలీ- విలన్ కూతుర్ని చేసుకుని తీర్తానని హీరో చేసే ఛాలెంజి – ఆతర్వాత సెకండాఫ్ లో ఐపులేకుండా పోవడమనే ఫ్రాక్చర్ ని ఏం చేసీ- ఎన్ని ఫైట్లు పెట్టీ మరిపించలేకపోయారు. ‘కందిరీగ’ కామెడీతో చేసిన స్కీము సీరియస్ యాక్షన్ కి పనికిరాదని ముందే చెప్పుకున్నాం. సెకండాఫ్ లో హీరో తన లక్ష్యం మర్చిపోయి వేరే కథ నడపడమే- ఉపకథ ని ప్రధాన కథగా మార్చెయ్యడమే ఘోర తప్పిదమైపోయింది.

ఇంకా పాత సినిమాలే ఉన్నదున్నట్టూ అనుసరణీయమనే దురభిప్రాయం కూడా తోడయ్యింది. ఆనాటి సినిమాల్లోని భావోద్వేగాలు (ఎమోషన్స్ ) నిస్సందేహంగా కాలదోషం పట్టనివే. భావోద్వేగాలు ఎప్పుడైనా ఒకలాగే వుంటాయి. వుండనివేమిటంటే ఆయాకాలాల అభిరుచులే (టెస్ట్స్). అభిరుచులు మారిపోతూంటాయి. ముందు ట్రెండ్ లో వున్న ప్రేక్షకాభిరుచుల్ని ఎష్టాబ్లిష్ చేసుకుంటే- వాటిని అడ్డంపెట్టుకుని ఏ ఎమోషన్స్ నైనా ప్రదర్శించుకోవచ్చు. అదే పాత సినిమాల్లోని ఎమోషన్స్ ని ఆనాటి అభిరుచులతో సహా ఎత్తేసి పెట్టుకుంటే మొత్తం సినిమా కాలంచెల్లిన లుక్ తో ‘రభస’లాగే వుంటుంది. ఇటీవలి తాజా హిట్ ’రన్ రాజా రన్’ లో, ముందు ట్రెండ్ లో వున్న అభిరుచుల్ని హైలైట్ చేస్తూ, విలన్లూ -పోలీసుల మూస తరహా భావోద్వేగాలతోనే నింపేసి అలరించారు.

సినిమాలో ఒక చోట షాయాజీ షిండే ఎన్టీఆర్ మీద రెచ్చిపోతూ- ‘చంపండ్రా!’అని గ్యాంగ్ ని ఎగదోస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ కూడా- ‘ఇది కదరా నాకావాల్సిన ఎమోషనూ!!’-అని వాళ్ళ మీద విరుచుకుపడతాడు.

కాస్త ప్రేక్షకాభిరుచులతో ట్రెండ్ లో కూడా ఉంటూ ఎమోషనలై పోవాలని ఇంకెప్పుడు గుర్తిస్తారో!

-సికిందర్
25, ఆగస్టు 2014, సోమవారం


సాంకేతికం
ఆనాటి ఇంటర్వ్యూ..
డీటీఎస్ కి పూర్వం మేమెవరో తెలీదు!
ఇ.రాధాకృష్ణ, సౌండ్ ఇంజనీర్

   బ్దం 360 డిగ్రీల అనుభవం. దాన్నో పెట్టెలో బందీ చేసి ప్రేక్షకులకి/శ్రోతలకి అభిముఖంగా పెట్టి విన్పించడమంత అన్యాయం లేదు. ఈ అన్యాయాన్ని అరికట్టేందుకే కాబోలు, అపూర్వంగా డిటిఎస్ అనే ఆడియో వైభవాన్ని కనిపెట్టి, శబ్దానికి నివాళిగా అర్పించాడు సైంటిస్టు టెర్రీబెర్డ్.

     ప్పుడు డిటిఎస్ (డిజిటల్ థియేటర్ సిస్టమ్స్) అంటే తెలీని సగటు ప్రేక్షకుల్లేరు. కాని "డిటిఎస్‌కి పూర్వం సౌండ్ ఇంజనీర్లు ఉండేవారని జన సామాన్యానికి తెలీదు. పాటలూ, నేపథ్య సంగీతం సహా సినిమాల్లో విన్పించే అన్నిరకాల శబ్దాల సృష్టికర్త, సమ్మేళనకర్తా సంగీత దర్శకుడనే నమ్మేవారు'' అంటారు ఇ. రాధాకృష్ణ. గత 19 ఏళ్ళుగా ప్రసాద్ ల్యాబ్స్ లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఈయనకి డిటిఎస్‌తో పదేళ్ల అనుభవముంది. థియేటర్లలో శబ్ద ఫలితాలు ఎలా విన్పించాలన్నది ఆయన చేతుల్లోనే ఉంది. అదే సమయంలో వాళ్లు పడ్డ కష్టమంతా సంపూర్ణంగా ప్రేక్షకులకి బదలాయింపు జరగాలంటే థియేటర్లలో సౌండ్ స్థితిగతులు బాగుండాలి. "డిటిఎస్ అనేది 5.1 ఛానెల్ వ్యవస్థ. ఇందులో వెండితెర వెనుక కుడి, ఎడమ, మధ్యన మూడు, హాలులో కుడివైపు, ఎడమవైపు చెరొక ఛానెల్‌తో మొత్తం ఐదు స్పీకర్లుంటాయి. మిగిలిన (.1) ఛానెల్‌తో ఆరవ స్పీకర్ వెండితెర వెనుకే కింది భాగంలో ఉంటుంది. దీన్ని సబ్ వూఫర్ అంటారు. ఇందులో ముష్టిఘాతాలు, తుపాకీ, బాంబు పేలుళ్ళు లాంటి లో ఫ్రీక్వెన్సీ శబ్దాలు వెలువడతాయి. మిగతా ఐదు స్పీకర్లలోంచి సంభాషణలు, నేపథ్య సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్ తాలూకు శబ్దాలు, పాటల్లో వాద్య పరికరాలూ వగైరా విభజన జరిగి వీనుల విందు చేస్తాయి'' అని వివరించారు రాధాకృష్ణ. 

     హాల్లో కుడి ఎడమవైపుల్లో అదనంగా ఎన్నైనా స్పీకర్లు అమర్చుకోవచ్చు. ఈ రెండు వరసలూ ప్రేక్షకుల సీటింగ్ వెనుకవైపు వరకూ కొనసాగుతాయి. మొట్టమొదట సౌండ్ నెగెటివ్‌తో కలిపి పిక్చర్ నెగెటివ్ వేశాక, ఆ సౌండ్ నెగెటివ్ (మోనో ఆడియో ఫార్మాట్)ని అలాగే ఉంచుతారు. ఎందుకంటే పల్లెటూరి థియేటర్లలో డిటిఎస్ సౌకర్యం ఉండదు గనుక. ఇక డబ్బింగ్, రీరికార్డింగ్స్, ఎఫెక్ట్స్, సాంగ్స్ మొదలైన వాటిని ముందేసుకుని మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్‌గా ఉన్న ‘ప్రోటూల్స్ డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్’ మీద డిటిఎస్ మిక్సింగ్‌కి పూనుకుంటారు. ఈ మిక్సింగ్‌ని డిటిఎస్ కంపెనీ తీసుకుని సీడీ రామ్స్ లో ముద్రించి ఇస్తుంది. దీనికి 75 వేలు రాయల్టీ రుసుముతో బాటు, ఒక్కో డిస్కుకి మరికొంత వసూలు చేస్తుంది. దీనివల్ల డిస్కులు తారుమారు కాకుండా ఉంటాయి. అప్పుడు థియేటర్లలో ప్రొజెక్టర్లోంచి సినిమా, సీడీ ప్లేయర్లోంచి డిస్కూ విడివిడిగా రన్ చేస్తే రెండు కలిసి హాల్లో ప్రేక్షకుల్ని అలరింపచేస్తాయన్న మాట!

     అయితే ఒక సినిమాకి 300 ప్రింట్లు వేసి 500 థియేటర్లలో ప్రదర్శించాలంటే, అదనంగా 200 డిస్కుల ఖర్చు పెరుగుతుందని, అదే ప్రింట్ల మీద ముద్రితమయ్యే డోల్బీ డిజిటల్ సిస్టమ్‌తో ఈ అదనపు భారం పడదనీ అన్నారు రాధాకృష్ణ. కానీ డోల్బీకి హిందీ సినిమాలకే తప్ప, దక్షిణాదిలో ఆదరణ లేదన్నారు.


   రాధాకృష్ణ మొదట డోల్బీకేపనిచేశారు. ఆ సినిమా 1998లో విడుదలైన 'ఆవిడా మా ఆవిడే'. చెన్నైలో పుట్టి పెరిగిన రాధాకృష్ణ, అడయార్ ఫిలింఇన్‌స్టిట్యూట్‌లో సౌండ్ ఇంజనీరింగ్ చదివి, 1991లో మీడియా ఆర్టిస్ట్ అనే సంస్థలో పనిచేశారు. అదే సంవత్సరం ప్రసాద్ ల్యాబ్స్ లో డబ్బింగ్ శాఖలో చేరి, అంచెలంచెలుగా రీరికార్డింగ్, మోనో మిక్సింగ్, ఆ తర్వాత డోల్బీకి, డీటీఎస్‌కీ ఎదిగారు. 

     సరే, అయితే డిటిఎస్‌తో అంతా నల్లేరు మీద నడకేనా, బాగా కష్టపెట్టిన సీన్లు లేవా అంటే, ఇష్టపడి చేసిన సీన్లే ఉన్నాయన్నారు. 'మగధీర'లో సామూహిక వధ సీనులో రామచరణ్ గుండెల్లో బాణం గుచ్చుకున్నప్పుడు, సౌండ్స్ అన్నిటినీ మైనస్ చేసి, నెమ్మది నెమ్మదిగా రీరికార్డింగ్ ఇస్తూ, ఫిమేల్ వాయిస్‌తో కాయిర్ వేస్తూంటే ఆ సీను ఉద్విగ్నతే వేరన్నారు. అలాగే 'సింహా' ఫ్లాష్ బ్యాక్‌లో బాలకృష్ణ హతమయ్యే సీన్లో భార్య కష్టం, పిల్లాడి ఏడ్పుకిచ్చిన శబ్ద ఫలితాలు మంచి తృప్తినిచ్చాయన్నారు. మిక్సింగ్ పరంగా ఈ రెండూ ఎంత సంకీర్ణ సన్నివేశాలో మనకు తెలిసిందే. 

     ఇప్పటివరకు 250 సినిమాలకి డిటిఎస్ మిక్సింగ్ చేశారు రాధాకృష్ణ. పూర్వం మోనో మిక్సింగ్‌తో కలుపుకుంటే ఈ సంఖ్య 800 వరకూ ఉంటుంది. వరుసగా మూడుసార్లు పోకిరి, మంత్ర, అరుంధతి సినిమాలకి నంది అవార్డులందుకున్నారు. ప్రస్తుతం బృందావనం, భైరవ, మరో కళ్యాణ్‌రామ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈయన తాజా సినిమా 'సరదాగా కాసేపు' ఈనెల 17న విడుదల అయింది.


   మరి తనకెవరు స్ఫూర్తి? - అనడిగితే, ఏడెనిమిది సార్లు ఆస్కార్అవార్డులందుకున్నఆడియో బ్రహ్మ గేరీ రెడ్‌స్టార్మ్ (జురాసిక్ పార్క్, టర్మినేటర్, టైటానిక్ ఫేమ్) తనకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారని అన్నారు. ఈ రంగంలో తను ఎంత అనుభవం గడించినా నిత్య అధ్యయనం, పరిశీలన తప్పవన్నారు. హైదరాబాద్‌కి మారినప్పటి నుంచి సంగీత దర్శకుడు కోటితో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. అలాగే కీరవాణితో 50 సినిమాలు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. పోతే, మొదట్నుంచీ  నుంచి తన వెన్నుతట్టి ఎంతో ప్రోత్సహిస్తున్న ప్రసాద్ ల్యాబ్స్ ఎండీ రమేష్ ప్రసాద్‌కి ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు రాధాకృష్ణ. 
 
- సికిందర్

(ఏప్రెల్ 2011 ‘ఆంధ్రజ్యోతి’ సినిమా టెక్ ) 


24, ఆగస్టు 2014, ఆదివారం


సాంకేతికం 
ఆనాటి ఇంటర్వ్యూ..

రసాత్మక అనుభూతి కోసమే..
ఆదిల్ అదీలీ- కమలాకణ్ణన్- పీటర్ డ్రేపర్
హీరో సునీల్ పరుగుదీస్తున్నాడు... ప్రాణాలరజేత బట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చి, నిండుగా ప్రవహిస్తున్న నదిపైన కళ్లు తిరిగే ఎత్తులో ఉన్న భారీ చెక్క వంతెన మీదికొచ్చేశాడు. మధ్యలో ఆ వంతెన ప్రమాదకరంగా రెండుగా చీలిపోయి ఉంది. దాటేందుకు బల్లకట్టు మాత్రమే ఉంది. భయపడలేదు సునీల్. ఆ బల్లకట్టు మీదుగా అటు దాటేశాడు. తనని వెంటాడి వస్తున్న ముఠా సమీపించే లోగా, ఆ బల్లకట్టుని లాగేశాడు. అక్కడి కొచ్చేసిన ముఠా ఠక్కున ఆగిపోయింది... అంతే ఇక హై ఓల్టేజీ డ్రామా మొదలైంది. ముఠా ఆ గ్యాపుని దాటేసి సునీల్‌ని పట్టేసుకుంటుందా? ఎలా దాటుతుంది? దాటి సునీల్ మీద ఎలా వేటు వేస్తుంది?... తీవ్ర ఉత్కంఠ!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాద రామన్న'లో ప్రేక్షకులకి విపరీతంగా థ్రిల్ కలిగిస్తున్న సన్నివేశమిది. గగుర్పాటు కల్గించే దృశ్యం. అయితే ఒక సందేహం. రాయలసీమలో ఏ నదిమీద ఇంత ఎత్తులో చెక్క వంతెన ఉందబ్బా? దీనికి సమాధానం మనకు ‘మకుటా వీఎఫ్ఎక్స్’ అధినేతల దగ్గర దొరుకుతుంది. కమలా కణ్ణన్- ఆదిల్ అదీలీ -పీటర్ డ్రేపర్ త్రయం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఆ పేరుతో ఒక సంస్థ నేర్పాటు చేసుకుని కూల్‌గా పనిచేసుకుపోతున్నారు.

వాళ్ల టెక్నికల్ బ్రిలియెన్సే ఈ అద్భుతాల్ని సృష్టించింది. 'మర్యాద రామన్న'లో మెగా వంతెనేమిటి, పాట సన్నివేశంలో కార్లు గాల్లో కెగరడమేమిటి, 'మగధీర'లో కోట, స్టేడియం నిర్మాణాలేమిటి- అన్నిచోట్లా లేనిది ఉన్నట్టు సృష్టించడమే వీళ్ల గ్రాఫిక్స్ మాయాజాలం. వీళ్ల కలయిక మాత్రం గ్రాఫిక్స్ కాదు, దైవ సంకల్పం. 'అంజి'తో కమలా కణ్ణన్‌కి ఆదిల్ పరిచయమయ్యారు. హిందీ 'గజిని' తో పీటర్ సన్నిహితుడయ్యారు. 'మగధీర' కి ఈ ఇద్దరి సహాయమూ తీసుకున్నారు కమల్. 'మగధీర' తర్వాత వాళ్లిద్దరినీ కలుపుకుని ‘మకుటా వీఎఫ్ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ స్థాపించి 'మర్యాద రామన్న' గ్రాఫిక్స్ వర్క్స్ ని చేపట్టారు.


చెన్నైకి చెందిన కమల్, బ్రిటన్ దేశస్థుడైన పీటర్ ఇద్దరూ డివిజన్ హెడ్ అండ్ చీఫ్ టెక్నీషియన్స్ గా ఉంటే, ఇరాన్ నుంచి వచ్చిన ఆదిల్ వీఎఫ్ఎక్స్ క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయన త్రీడీ ఆర్టిస్టుగా ప్రసిద్ధుడు. ముగ్గురికీ ఈ రంగంలో దశాబ్దాల విశేష అనుభవముంది. పీటర్ తన అనుభవాన్నంతా రంగరించి గ్రాఫిక్స్ మీద మూడు గ్రంథాలు రచించారు కూడా. అవి బ్రిటన్ యూనివర్సిటీల్లో బోధిస్తున్న వీఎఫ్ఎక్స్ కోర్సుల తీరు తెన్నులనే మార్చివేశాయట.

'మా పని సినిమా దర్శకులు కోరుకున్నది అందించడమనేది నిజమే, అయితే అంతిమంగా చూసుకుంటే ఆ ఫలితం ప్రేక్షకులతో పాటు మేమూ రసాత్మకంగా అనుభూతించేలా ఉండాలి కదా' అంటారు పీటర్.

'స్థానిక మార్కెట్‌ని గుణాత్మకంగా (అంటే సృజనాత్మకంగా) అభివృద్ధి పర్చాలన్నది కూడా మా ధ్యేయమే' అంటారు ఆదిల్. ఇక- 'మగధీర' కి మేం చేసి పెట్టిన వర్క్ ప్రేక్షకుల నుంచే కాదు, తలపండిన టెక్నీషియన్స్ నుంచి కూడా ప్రశంసల్ని పొందింది' అని ఆనందం వ్యక్తం చేశారు కమల్.


ఎక్కడి పౌరులు వీళ్లు... ఎక్కడి కొచ్చి పరిశ్రమిస్తున్నారు! తెలుగు సినిమాలు వస్తుపరంగా గ్లోబలీకరణ చెందడం కలలో మాట. అయినా గ్లోబల్ కళాకారులైన వీళ్ళు తెలుగు సినిమాల కోసం తెలుగు నేల మీద స్థిరపడి, వాటికి టెక్నికల్‌గా జవసత్వాలు కల్పించడం- అదీ పబ్లిసిటీ కోరుకోకుండా కూల్‌గా పనిచేసుకుపోవడం- తెలుగు సినిమాల అదృష్టమే. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'బద్రీనాథ్'కి ఈ టీమ్ పనిచేస్తోంది. ఇటీవల రజనీకాంత్ 'రోబో' వర్క్ కూడా పూర్తి చేశారు. ఏడాదికి రెండు మూడు సినిమాలకి చేస్తామని చెప్పారు కమల్. సినిమాలే గాక అంతర్జాతీయంగా వివిధ ప్రాజెక్టులు కూడా చేపట్టామన్నారు.

కమల్ అందించిన వివరాల ప్రకారం- 'మగధీర'లో కోట, స్టేడియం నిర్మాణాల్లో పదిహేను శాతం మాత్రమే కళాదర్శకుడు రవి నిర్మించినది, మిగిలినదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీ)తో తాము సృష్టించిందే. ఈ సెట్స్ రామోజీ ఫిలిం సిటీలో వేశారు. స్టేడియం డ్రాయింగ్ ఇటలీకి చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్ మార్కో రోనాల్డీ చేత వేయించుకుని, ఆదిల్ చేత త్రీడీ ఎఫెక్ట్ చేయించుకున్నారు. 


సినిమాలో కనిపించే ఉదయ్‌గఢ్ పట్టణమంతా కూడా ఆదిల్ సృష్టే. ఆదిల్‌తో 'అంజి', 'యమదొంగ', 'అరుంధతి' చిత్రాలకి కూడా కలిసి పనిచేశామని కమల్ అన్నారు. ఏ సినిమాకీ ఒక్క కంపెనీయే పూర్తి గ్రాఫిక్స్ వర్క్ చేయదనీ, రెండు మూడు సంస్థలు కలిసి పనిచేస్తాయనీ చెప్పారు. చెన్నైలో ఫ్రీలాన్స్ టెక్నీషియన్‌గా ఉన్నప్పుడు పురోగతి లేకపోయిందని, అలాంటి పరిస్థితుల్లో ఎస్.ఎస్. రాజమౌళి తనను నమ్మడమే కాకుండా తన మీద తనకు ఎంతో ఆత్మవిశ్వాసం కల్గించారని, ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు కమల్.-సికిందర్
(ఏప్రెల్ 2011 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)
23, ఆగస్టు 2014, శనివారం

సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
డిజిటలీకరణలో మనమింకా తాబేళ్లమే..
కె. బసిరెడ్డి, 'డిజిక్వెస్ట్' చైర్మన్-ఎండీ 
బోలెడు సెంటిమెంట్స్ ని- మూసపద్ధతుల్నీ తరతరాలుగా జీర్ణించుకున్న తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిస్థాయిలో డిజిటల్ టెక్నాలజీకి స్వాగతం పలకడమంటే మామూలు విషయం కాదు. ఒక పైరసీరహిత, వాతావరణ కాలుష్యరహిత వ్యవస్థా సృష్టికి డిజిటలీకరణే తక్షణావసరమని గుర్తించాలంటే కూడా మాటలు కాదు. ముక్తకంఠంతో పాలిథిన్ కవర్లకి ‘నో’ చెబుతున్నట్టు, ముడి ఫిలిం మీద కూడా పారంపర్యంగా వస్తున్న మమకారాన్ని వదులుకుంటే తప్ప ఇతర రాష్ట్రాలలాగా డిజిటల్ శకంలోకి సమున్నతంగా ముందడుగేయడం సాధ్యమయ్యేలా లేదు.

అయితే బసిరెడ్డి లాంటి 'ఉద్యమకారుడి'ని చూస్తే ఆశ చిగురిస్తుంది. ఈ మార్పు సంభవమే నన్పిస్తుంది. దేశంలో డిజిటల్ టెక్నాలజీని ఒక ఉద్యమంలా తీసుకుని ముందుకు పోతున్న ఏకవ్యక్తి సైన్యం కె. బసిరెడ్డి. ఇవ్వాళ దేశంలో ‘డిజిక్వెస్ట్’ పేరు తెలియని సినీ నిర్మాత ఉండరంటే అతిశయోక్తి కాదు. స్కానింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, డిజిటల్ ఇంటర్మీడియరీ, గ్రాఫిక్స్, ఫిలిమ్ రికార్డింగ్ వంటి తెలుగు నిర్మాతలకి పరిచయమున్న సేవలతో పాటు ఉన్నత నాణ్యతాప్రమాణాలతో అత్యాధునిక డిజిటల్ కెమెరాలూ ఇతర షూటింగ్ సామాగ్రీ డిజిక్వెస్ట్ గర్వించదగ్గ  సంపద. దీని చైర్మన్-ఎండీ కె.బసిరెడ్డి. తను ప్రమోట్ చేస్తున్న డిజిటల్ టెక్నాలజీతో మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళ నాడు రాష్ట్రాల సినిమా పరిశ్రమల్లోకి విజయవంతంగా చొచ్చుకుపోగల్గారీయన.
స్టూడియో దృశ్యం 
"దేశంలో నిర్మిస్తున్న 72 శాతం డిజిటల్ సినిమాలకి సేవలందిస్తున్నాం మేము. 2003లో దేశంలో మొదటి డిజిటల్ సినిమా తయారైంది. అప్పటినుంచీ చూసుకుంటే ఈ ఫీల్డులో అభివృద్ధి 700 శాతానికి చేరుకుంది'' అని గర్వంగా చెప్పే బసిరెడ్డి, కేరళ సినిమాలు నూటికి నూరు శాతమూ డిజిటలీకరణ చెందాయంటారు. అలాగే కర్ణాటక 80 శాతం, తమిళనాడు 50-60 శాతం డిజిటల్ ఫార్మాట్‌కు మారాయనీ, కానీ మన రాష్ట్రం 20 శాతం దగ్గరే ఆగిందనీ అంటారు.

'మగధీర' క్లయిమాక్స్‌కి గ్రాఫిక్స్ చేసింది డిజిక్వెస్టే. 'మనోరమ'లో 500 రూపాయల నోటుతో 8 నిమిషాల త్రీడీ క్యారెక్టర్ని సృష్టించారు. 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం'లో త్రీడీ కుక్కతో గమ్మత్తులు చేయించారు. ఇంకా చాలా చాలా అద్భుతాలు సృష్టించారు. 'ఇదీ సంగతి', 'మనోరమ', 'టాస్' లాంటి వాటికి పూర్తిస్థాయి డిజిటల్ వర్క్ చేసి, , 'ప్రస్థానం', 'అందరి బంధువయా', 'కాఫీబార్' మొదలైన సినిమాలకి డిజిటల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేశారు. ఈ వర్క్ అంతా టెక్నికల్ డైరెక్టర్ సి.వి. రావు పర్యవేక్షణలో జరుగుతోందని తెలిపారు. త్రీడీలో ఒక అద్భుతమైన తాజ్‌మహల్‌ని కూడా సృష్టించి పెట్టుకున్నారు ఆయన. దీన్ని ఎవరైనా నిర్మాత అడిగితే ఇస్తానన్నారు. లేదంటే తను తీయబోయే సినిమాలో పెట్టుకుంటానన్నారు. అన్నట్టు బసిరెడ్డి సినిమా నిర్మాత కూడా. వై.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో 'సొంత ఊరు' నిర్మించాక మళ్లీ అదే దర్శకుడితో 'గంగ పుత్రులు' నిర్మిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఆయన టీమొకటి స్టూడియోలో ‘డిజిటల్ సింహం’ రూపకల్పనలో నిమగ్నమై ఉంది.


సందర్భం వచ్చింది కాబట్టి, గ్రాఫిక్స్ జంతువులు ఆట బొమ్మల్లా కాకుండా, రక్త మాంసాలున్న నిజ జంతువుల్లా కన్పించడంలోని మర్మమేమిటని అడిగితే, జి. మోహన్ అందుకుని బదులిచ్చారు. ఈయన ఆ సంస్థ ‘ 361 డివిజన్‌’ క్రియేటివ్ డైరెక్టర్. అదంతా మోషన్ క్యాప్చర్ సాఫ్ట్‌వేర్‌తో జరుగుతుందన్నారు. ముందుగా నిజ సింహానికి ఆయా అవయవాల్లో సెన్సార్లు అమరుస్తారు. అప్పుడా సింహం నడిస్తే, పరిగెడితే, ఇంకేదైనా చేస్తే దాని కండరాల కదలికల్ని ఆ సెన్సార్ల ద్వారా మోషన్ క్యాప్చర్ సాఫ్ట్ వేర్‌ని లోడ్ చేసిన కంప్యూటర్ క్యాచ్ చేసి, ఆ సింహం గ్రాఫిక్ రూపంలోని అవయవాలకి అతికించుకుంటుంది. దీంతో కండరాలు పొంగడం, బిగుసుకోవడం లాంటి చర్యలతో అది అచ్చం ప్రాణమున్న సింహంలాగే కనిపిస్తుంది.సాధారణంగా ఒక సినిమాకి ఒకే కంపెనీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయదు. ఇలా ఎందుకని అడిగితే, ముందస్తు ప్రణాళిక లేకపోవడమే కారణమన్నారు బసిరెడ్డి. కొన్ని గ్రాఫిక్స్ ప్రధాన సినిమాల్ని మినహాయిస్తే మిగతా మన సినిమాల నిర్మాణ పద్ధతులు హాలీవుడ్ లాంటి వృత్తితత్వంతో కూడుకుని వుండడం లేదని చెప్పారు. పూర్తి స్క్రిప్టు చేతిలో వుండదు. సినిమా మొత్తం తీసేశాక అప్పుడాలోచిస్తారు. దాంతో టైము చాలక హడావిడిగా నాలుగైదు కంపెనీలకి పనిని విభజించి అప్పగించేస్తారు.

'
సినిమా స్టోరీ బోర్డు దశ నుంచే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌ని భాగస్వామిని చేస్తే గ్రాఫిక్స్ వర్క్స్ ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది' అని మోహన్ కూడా అభిప్రాయపడ్డారు.

డిజిక్వెస్ట్ అసలు స్పెషాలిటీ కళ్లు చెదిరే డిజిటల్ కెమెరాల శ్రేణి. ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీతో ఏ డిజిటల్ కెమెరా తయారైనా అదిక్కడ కొలువుదీరుతుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మక 'వైపర్' డిజిటల్ కెమెరా రారాజు స్థానంలో ఉంది . 2009 ఆస్కార్ అవార్డు చిత్రం 'ది క్యూరియస్ కేసాఫ్ బెంజమిన్ బటన్' ఈ కెమెరాతో తీసిందే. ఇంకా ప్రసిద్ధ ఆరీ అలెక్సా, రెడ్‌వన్ డిజిటల్ కెమెరాలూ స్టూడియోలో ఉన్నాయి. రెడ్‌వన్ విఫలమైందని మన సాంకేతికులు కొందరు అనుకోవడాన్ని ప్రస్తావిస్తే- అది నిర్వహణ తెలియక ఏర్పరుచుకున్న అభిప్రాయమని కొట్టివేశారు బసిరెడ్డి. దేశంలో డిజిటల్ సినిమాటోగ్రఫీలో శిక్షణనిచ్చే సంస్థలు లేవనీ, మొదటిసారిగా అలాంటి శిక్షణా సంస్థని ఓ ప్రముఖ మల్టీమీడియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ తో కలిసి ప్రారంభించబోతున్నామని తెలిపారు. డిజిటల్ పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా ఇక్కడ కోర్సు వుంటుందన్నారు.

డిజిటల్ ఫిలిం మేకింగ్‌కి లభిస్తున్న ఆదరణకి ఒక్క ఉదాహరణ చాలన్నారాయన. 2009 ఆస్కార్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు ఎనలాగ్ (ఫిలిమ్)తో బాటు, డిజిటల్‌లో షూట్ చేసిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్' కీ దక్కడం కంటే ఇంకేం కావాలన్నారు. హేమాహేమీలైన ఫ్రాన్సిస్‌ఫోర్డ్ కపోలా, జేమ్స్ కామెరూన్, జార్జిలూకాస్, డానీ బాయిల్, మెల్ గిబ్సన్, కమల్ హాసన్, దిల్ రాజు ప్రభృతులు తమ సినిమాల్లో డిజిటల్ ఫార్మాట్‌కి కూడా చోటు కల్పిస్తున్నారని వివరించారు. అయితే ప్రముఖ ఎనలాగ్ కెమెరాల ఉత్పత్తిదారు 'ఆరీ' సైతం మార్పుని అంగీకరిస్తూ వివిధ డిజిటల్ కెమెరాలు తయారు చేస్తూంటే, కొన్ని పేరున్న ముడి ఫిలిం కంపెనీలు మాత్రం వాటి స్వప్రయోజనాల కోసం  డిజిటల్ యానాన్ని అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బసిరెడ్డి.

ముడిఫిలిమే కాలుష్య కారకమని తేల్చారాయన. ఎలాగంటే ముడిఫిలిం తయారీ దగ్గర్నుంచి, ల్యాబ్‌లో ప్రాసెసింగ్ వరకూ అనేక రసాయన వ్యర్థాలు వెలువడుతాయి. శిథిలమైన ప్రింట్లని భస్మీపటలం చేసినా కూడా ప్రమాదకర క్యాన్సర్ కారక వాయువులు వెలువడుతాయి. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఒక్కో పంపిణీదారుడు తక్కువ ఖర్చుతో, పర్యావరణ ఫ్రెండ్లీ డిజిటల్ వి.శాట్/హార్డ్ డిస్కు రూపంలో సినిమాల్ని ప్రొజెక్షన్ వేసుకుంటే పోయేదానికి ప్రింట్ల మీద భారీ మొత్తాలు వెచ్చించి మరీ కాలుష్యాన్ని ఉత్పత్తి చేయడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు. ధరలు దిగి వస్తే, ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రొజెక్షన్‌లో మరింత నాణ్యత తీసుకురావచ్చన్నారు.

సినిమాలు డిజిటల్‌కి మారితే పైరసీని కూడా అరికట్టవచ్చన్నారు. డిజిటల్ డిస్క్ లో వాటర్ కోడ్ నిక్షిప్తమై వుంటుందని, అది తెర మీద కన్పించదని, ఒకవేళ పైరసీదారుడు తెరమీద ఆ సినిమాని షూట్ చేసి సీడీలు తీస్తే ఆ సీడీల్లో వాటర్ కోడ్ ద్వారా పైరసీ ఏ థియేటర్లో జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చనీ  అన్నారు.

రాష్ట్రంలో డిజిటల్ ఫిలిం మేకింగ్‌ని పూర్తిస్థాయిలో ముందుకు తీసుకుపోయేందుకు వీలుగా పెట్టుబడులు, సబ్సిడీలు, వినోద పన్నులో రాయితీల కోసం తాను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంటే స్పందన రావడం లేదన్నారు. ప్రభుత్వం కూడా వాతావరణ కాలుష్యానికే ఓటేస్తున్నట్టే ఉందన్నారు. డిజిటల్ సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్లు నిరాకరించడాన్ని మాత్రం తను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానన్నారు. ఫలితంగా ఇప్పుడు అన్ని ప్రాంతీయ సెన్సార్‌బోర్డులూ డిజిటల్ సినిమాలకి 'థియేటరికల్ రిలీజ్ షాట్ ఆన్ డిజిటల్' పేరిట సర్టిఫికేట్లు ఇస్తున్నాయని చెప్పారు మహెబూబ్ నగర్ జిల్లాకి చెందిన కె. బసిరెడ్డి.

-సికిందర్
(నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’కోసం)