రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఆగస్టు 2014, శనివారం

సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
డిజిటలీకరణలో మనమింకా తాబేళ్లమే..
కె. బసిరెడ్డి, 'డిజిక్వెస్ట్' చైర్మన్-ఎండీ 
బోలెడు సెంటిమెంట్స్ ని- మూసపద్ధతుల్నీ తరతరాలుగా జీర్ణించుకున్న తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిస్థాయిలో డిజిటల్ టెక్నాలజీకి స్వాగతం పలకడమంటే మామూలు విషయం కాదు. ఒక పైరసీరహిత, వాతావరణ కాలుష్యరహిత వ్యవస్థా సృష్టికి డిజిటలీకరణే తక్షణావసరమని గుర్తించాలంటే కూడా మాటలు కాదు. ముక్తకంఠంతో పాలిథిన్ కవర్లకి ‘నో’ చెబుతున్నట్టు, ముడి ఫిలిం మీద కూడా పారంపర్యంగా వస్తున్న మమకారాన్ని వదులుకుంటే తప్ప ఇతర రాష్ట్రాలలాగా డిజిటల్ శకంలోకి సమున్నతంగా ముందడుగేయడం సాధ్యమయ్యేలా లేదు.

అయితే బసిరెడ్డి లాంటి 'ఉద్యమకారుడి'ని చూస్తే ఆశ చిగురిస్తుంది. ఈ మార్పు సంభవమే నన్పిస్తుంది. దేశంలో డిజిటల్ టెక్నాలజీని ఒక ఉద్యమంలా తీసుకుని ముందుకు పోతున్న ఏకవ్యక్తి సైన్యం కె. బసిరెడ్డి. ఇవ్వాళ దేశంలో ‘డిజిక్వెస్ట్’ పేరు తెలియని సినీ నిర్మాత ఉండరంటే అతిశయోక్తి కాదు. స్కానింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, డిజిటల్ ఇంటర్మీడియరీ, గ్రాఫిక్స్, ఫిలిమ్ రికార్డింగ్ వంటి తెలుగు నిర్మాతలకి పరిచయమున్న సేవలతో పాటు ఉన్నత నాణ్యతాప్రమాణాలతో అత్యాధునిక డిజిటల్ కెమెరాలూ ఇతర షూటింగ్ సామాగ్రీ డిజిక్వెస్ట్ గర్వించదగ్గ  సంపద. దీని చైర్మన్-ఎండీ కె.బసిరెడ్డి. తను ప్రమోట్ చేస్తున్న డిజిటల్ టెక్నాలజీతో మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళ నాడు రాష్ట్రాల సినిమా పరిశ్రమల్లోకి విజయవంతంగా చొచ్చుకుపోగల్గారీయన.
స్టూడియో దృశ్యం 
"దేశంలో నిర్మిస్తున్న 72 శాతం డిజిటల్ సినిమాలకి సేవలందిస్తున్నాం మేము. 2003లో దేశంలో మొదటి డిజిటల్ సినిమా తయారైంది. అప్పటినుంచీ చూసుకుంటే ఈ ఫీల్డులో అభివృద్ధి 700 శాతానికి చేరుకుంది'' అని గర్వంగా చెప్పే బసిరెడ్డి, కేరళ సినిమాలు నూటికి నూరు శాతమూ డిజిటలీకరణ చెందాయంటారు. అలాగే కర్ణాటక 80 శాతం, తమిళనాడు 50-60 శాతం డిజిటల్ ఫార్మాట్‌కు మారాయనీ, కానీ మన రాష్ట్రం 20 శాతం దగ్గరే ఆగిందనీ అంటారు.

'మగధీర' క్లయిమాక్స్‌కి గ్రాఫిక్స్ చేసింది డిజిక్వెస్టే. 'మనోరమ'లో 500 రూపాయల నోటుతో 8 నిమిషాల త్రీడీ క్యారెక్టర్ని సృష్టించారు. 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం'లో త్రీడీ కుక్కతో గమ్మత్తులు చేయించారు. ఇంకా చాలా చాలా అద్భుతాలు సృష్టించారు. 'ఇదీ సంగతి', 'మనోరమ', 'టాస్' లాంటి వాటికి పూర్తిస్థాయి డిజిటల్ వర్క్ చేసి, , 'ప్రస్థానం', 'అందరి బంధువయా', 'కాఫీబార్' మొదలైన సినిమాలకి డిజిటల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేశారు. ఈ వర్క్ అంతా టెక్నికల్ డైరెక్టర్ సి.వి. రావు పర్యవేక్షణలో జరుగుతోందని తెలిపారు. త్రీడీలో ఒక అద్భుతమైన తాజ్‌మహల్‌ని కూడా సృష్టించి పెట్టుకున్నారు ఆయన. దీన్ని ఎవరైనా నిర్మాత అడిగితే ఇస్తానన్నారు. లేదంటే తను తీయబోయే సినిమాలో పెట్టుకుంటానన్నారు. అన్నట్టు బసిరెడ్డి సినిమా నిర్మాత కూడా. వై.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో 'సొంత ఊరు' నిర్మించాక మళ్లీ అదే దర్శకుడితో 'గంగ పుత్రులు' నిర్మిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఆయన టీమొకటి స్టూడియోలో ‘డిజిటల్ సింహం’ రూపకల్పనలో నిమగ్నమై ఉంది.


సందర్భం వచ్చింది కాబట్టి, గ్రాఫిక్స్ జంతువులు ఆట బొమ్మల్లా కాకుండా, రక్త మాంసాలున్న నిజ జంతువుల్లా కన్పించడంలోని మర్మమేమిటని అడిగితే, జి. మోహన్ అందుకుని బదులిచ్చారు. ఈయన ఆ సంస్థ ‘ 361 డివిజన్‌’ క్రియేటివ్ డైరెక్టర్. అదంతా మోషన్ క్యాప్చర్ సాఫ్ట్‌వేర్‌తో జరుగుతుందన్నారు. ముందుగా నిజ సింహానికి ఆయా అవయవాల్లో సెన్సార్లు అమరుస్తారు. అప్పుడా సింహం నడిస్తే, పరిగెడితే, ఇంకేదైనా చేస్తే దాని కండరాల కదలికల్ని ఆ సెన్సార్ల ద్వారా మోషన్ క్యాప్చర్ సాఫ్ట్ వేర్‌ని లోడ్ చేసిన కంప్యూటర్ క్యాచ్ చేసి, ఆ సింహం గ్రాఫిక్ రూపంలోని అవయవాలకి అతికించుకుంటుంది. దీంతో కండరాలు పొంగడం, బిగుసుకోవడం లాంటి చర్యలతో అది అచ్చం ప్రాణమున్న సింహంలాగే కనిపిస్తుంది.



సాధారణంగా ఒక సినిమాకి ఒకే కంపెనీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయదు. ఇలా ఎందుకని అడిగితే, ముందస్తు ప్రణాళిక లేకపోవడమే కారణమన్నారు బసిరెడ్డి. కొన్ని గ్రాఫిక్స్ ప్రధాన సినిమాల్ని మినహాయిస్తే మిగతా మన సినిమాల నిర్మాణ పద్ధతులు హాలీవుడ్ లాంటి వృత్తితత్వంతో కూడుకుని వుండడం లేదని చెప్పారు. పూర్తి స్క్రిప్టు చేతిలో వుండదు. సినిమా మొత్తం తీసేశాక అప్పుడాలోచిస్తారు. దాంతో టైము చాలక హడావిడిగా నాలుగైదు కంపెనీలకి పనిని విభజించి అప్పగించేస్తారు.

'
సినిమా స్టోరీ బోర్డు దశ నుంచే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌ని భాగస్వామిని చేస్తే గ్రాఫిక్స్ వర్క్స్ ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది' అని మోహన్ కూడా అభిప్రాయపడ్డారు.

డిజిక్వెస్ట్ అసలు స్పెషాలిటీ కళ్లు చెదిరే డిజిటల్ కెమెరాల శ్రేణి. ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీతో ఏ డిజిటల్ కెమెరా తయారైనా అదిక్కడ కొలువుదీరుతుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మక 'వైపర్' డిజిటల్ కెమెరా రారాజు స్థానంలో ఉంది . 2009 ఆస్కార్ అవార్డు చిత్రం 'ది క్యూరియస్ కేసాఫ్ బెంజమిన్ బటన్' ఈ కెమెరాతో తీసిందే. ఇంకా ప్రసిద్ధ ఆరీ అలెక్సా, రెడ్‌వన్ డిజిటల్ కెమెరాలూ స్టూడియోలో ఉన్నాయి. రెడ్‌వన్ విఫలమైందని మన సాంకేతికులు కొందరు అనుకోవడాన్ని ప్రస్తావిస్తే- అది నిర్వహణ తెలియక ఏర్పరుచుకున్న అభిప్రాయమని కొట్టివేశారు బసిరెడ్డి. దేశంలో డిజిటల్ సినిమాటోగ్రఫీలో శిక్షణనిచ్చే సంస్థలు లేవనీ, మొదటిసారిగా అలాంటి శిక్షణా సంస్థని ఓ ప్రముఖ మల్టీమీడియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ తో కలిసి ప్రారంభించబోతున్నామని తెలిపారు. డిజిటల్ పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా ఇక్కడ కోర్సు వుంటుందన్నారు.

డిజిటల్ ఫిలిం మేకింగ్‌కి లభిస్తున్న ఆదరణకి ఒక్క ఉదాహరణ చాలన్నారాయన. 2009 ఆస్కార్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు ఎనలాగ్ (ఫిలిమ్)తో బాటు, డిజిటల్‌లో షూట్ చేసిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్' కీ దక్కడం కంటే ఇంకేం కావాలన్నారు. హేమాహేమీలైన ఫ్రాన్సిస్‌ఫోర్డ్ కపోలా, జేమ్స్ కామెరూన్, జార్జిలూకాస్, డానీ బాయిల్, మెల్ గిబ్సన్, కమల్ హాసన్, దిల్ రాజు ప్రభృతులు తమ సినిమాల్లో డిజిటల్ ఫార్మాట్‌కి కూడా చోటు కల్పిస్తున్నారని వివరించారు. అయితే ప్రముఖ ఎనలాగ్ కెమెరాల ఉత్పత్తిదారు 'ఆరీ' సైతం మార్పుని అంగీకరిస్తూ వివిధ డిజిటల్ కెమెరాలు తయారు చేస్తూంటే, కొన్ని పేరున్న ముడి ఫిలిం కంపెనీలు మాత్రం వాటి స్వప్రయోజనాల కోసం  డిజిటల్ యానాన్ని అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బసిరెడ్డి.

ముడిఫిలిమే కాలుష్య కారకమని తేల్చారాయన. ఎలాగంటే ముడిఫిలిం తయారీ దగ్గర్నుంచి, ల్యాబ్‌లో ప్రాసెసింగ్ వరకూ అనేక రసాయన వ్యర్థాలు వెలువడుతాయి. శిథిలమైన ప్రింట్లని భస్మీపటలం చేసినా కూడా ప్రమాదకర క్యాన్సర్ కారక వాయువులు వెలువడుతాయి. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఒక్కో పంపిణీదారుడు తక్కువ ఖర్చుతో, పర్యావరణ ఫ్రెండ్లీ డిజిటల్ వి.శాట్/హార్డ్ డిస్కు రూపంలో సినిమాల్ని ప్రొజెక్షన్ వేసుకుంటే పోయేదానికి ప్రింట్ల మీద భారీ మొత్తాలు వెచ్చించి మరీ కాలుష్యాన్ని ఉత్పత్తి చేయడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు. ధరలు దిగి వస్తే, ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రొజెక్షన్‌లో మరింత నాణ్యత తీసుకురావచ్చన్నారు.

సినిమాలు డిజిటల్‌కి మారితే పైరసీని కూడా అరికట్టవచ్చన్నారు. డిజిటల్ డిస్క్ లో వాటర్ కోడ్ నిక్షిప్తమై వుంటుందని, అది తెర మీద కన్పించదని, ఒకవేళ పైరసీదారుడు తెరమీద ఆ సినిమాని షూట్ చేసి సీడీలు తీస్తే ఆ సీడీల్లో వాటర్ కోడ్ ద్వారా పైరసీ ఏ థియేటర్లో జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చనీ  అన్నారు.

రాష్ట్రంలో డిజిటల్ ఫిలిం మేకింగ్‌ని పూర్తిస్థాయిలో ముందుకు తీసుకుపోయేందుకు వీలుగా పెట్టుబడులు, సబ్సిడీలు, వినోద పన్నులో రాయితీల కోసం తాను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంటే స్పందన రావడం లేదన్నారు. ప్రభుత్వం కూడా వాతావరణ కాలుష్యానికే ఓటేస్తున్నట్టే ఉందన్నారు. డిజిటల్ సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్లు నిరాకరించడాన్ని మాత్రం తను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానన్నారు. ఫలితంగా ఇప్పుడు అన్ని ప్రాంతీయ సెన్సార్‌బోర్డులూ డిజిటల్ సినిమాలకి 'థియేటరికల్ రిలీజ్ షాట్ ఆన్ డిజిటల్' పేరిట సర్టిఫికేట్లు ఇస్తున్నాయని చెప్పారు మహెబూబ్ నగర్ జిల్లాకి చెందిన కె. బసిరెడ్డి.

-సికిందర్
(నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’కోసం)