రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఆగస్టు 2014, శనివారం

సాంకేతికం...

ఆనాటి ఇంటర్వ్యూ
 దృశ్యంలో నేను శబ్దాన్ని చూస్తాను..

మూకీల నుంచీ టాకీలకి చలనచిత్రాలు రూపాంతరం చెందడంలో ధ్వని ముద్రణ ఒక వారధిగా ఉంటే, ఆ ధ్వని తరంగాల సముదాయాన్ని విడదీసి విపులంగా శ్రవణానందం కలగజేయడంలో స్పీకర్ నిర్ణాయకపాత్ర పోషిస్తూ వస్తోంది. మొదట మోనో సౌండ్ విన్పించిన సోలో స్పీకర్, కాలక్రమంలో మరిన్ని స్పీకర్ల వ్యవస్థకి దారితీసి, నాలుగు లేదా ఆరు ట్రాకుల శబ్ద ఫలితాల ఆవిర్భావానికి స్ఫూర్తినిచ్చింది. దీంతో అటు హాలీవుడ్‌లో మెకన్నాస్ గోల్డ్, ఇటు బాలీవుడ్, టాలీవుడ్‌లలో షోలే, సింహాసనం వచ్చి ఆబాలగోపాలాన్నీ ఉర్రూతలూగించాయి.

ఈ వ్యవస్థ లేని థియేటర్లలో అప్పట్లో సైడ్ బాక్సులు అమర్చి పాటలప్పుడు కేబిన్‌లో ఆపరేటర్ల చేత మేనేజ్ చేయించి ప్రేక్షకుల్ని తరింపజేసేవాళ్లు. ఒక్కోసారి ఈ ప్రయోగాలు వికటించి మనకి గుండె దడ, గాభరా, విరక్తి, విలాపమూ కూడా కల్గించి వదిలేవాళ్లు. 1991లో 'బ్యాట్‌మన్ రిటర్న్స్' డిజిటల్ డోల్బీ సిస్టమ్‌లో వచ్చి మనల్ని రక్షించింది. అయితే ఇది ఎనలాగ్ సౌండ్ ఫార్మాట్ (అంటే ఫిలిం మీద ధ్వని ముద్రణ) లాగే మన్నికకి, కాలపరీక్షకీ తట్టుకోలేనిది కావడంతో 1994లో డిజిటల్ థియేటర్ సౌండ్ ఇన్‌కార్పొరేషన్ సంస్థ ప్రత్యేకంగా జురాసిక్ పార్క్ కోసం డిటిఎస్ ఫార్మాట్‌ని డిజైన్ చేసి శబ్ద ఫలితాల సరికొత్త శకానికి నాంది పలికింది. ఈ విధానంలో ధ్వనిని ఫిలిం మీద ముద్రించరు. ఫిలిం రీళ్లమీద ఎలాగూ సంప్రదాయ ఎనలాగ్ బ్యాకప్ ఉంటుంది. డిటిఎస్‌కి విడిగా సీడీ రామ్‌లో ముద్రించి ఇస్తారు. దీంతో సినిమా ప్రింటు బాగోగులతో నిమిత్తం లేకుండా ఆడియోగ్రఫీకి శాశ్వతత్వం చేకూర్చినట్లయింది.
ఇప్పుడు డిటిఎస్ అంటే తెలియని ప్రేక్షకుల్లేరు. 1997లో తమిళ సినిమాతో మన దేశంలోకి ఈ టెక్నాలజీ ప్రవేశించింది. అదే సంవత్సరం తెలుగులో వచ్చిన 'మాస్టర్' మొదటి డిటిఎస్ సినిమా అయింది. 1998లో ఈ టెక్నాలజీని మన రాష్ట్రంలో రామానాయుడు స్టూడియో ప్రవేశపెడుతూ 'చూడాలని వుంది'కి డిటిఎస్ హంగులు కూర్చింది. ఆ కూర్పరే ప్రముఖ సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదన్‌రెడ్డి.

'డిటిఎస్‌తో ఆడియోగ్రఫీలో మనం కూడా సరికొత్త ప్రయోగాలు చేసే స్కోపున్నా, మన సినిమాలు డ్రామా ప్రధానమైనవి కావడంతో ఆ వీలు కుదరడం లేదు' అంటారు మధుసూదన్‌రెడ్డి. ఈ రంగంలో 14 ఏళ్ల సుదీర్ఘానుభవం ఉంది ఆయనకు. నిజమే, భారతీయ సినిమాలింకా వీధి భాగోతాల స్థాయిని దాటి రాలేకపోతున్నాయని ఏనాడో సత్యజిత్‌రే జీవిత కథ రాసిన మేరీశాటన్ ఎత్తి పొడిచింది కూడా. సినిమా అంటే డైలాగుల మోత అనే నాటు పద్ధతికీ, మధుసూదన్‌రెడ్డి లాంటి శబ్దగ్రాహకుడి సృజనాత్మకత ఎక్కడ అతుకుతుంది?

'
దృశ్యంలో నేను శబ్దాన్నీ చూస్తాను' ఇదీ ఆయన కవితాత్మక స్టేట్‌మెంట్. సినిమాని వీడియో ఫార్మాట్‌లో... సైలెం ట్ మూవీగా రన్ చేసి, ఎక్కడెక్కడ ఏయే శబ్దాలు అవసరమో ఆలోచించి తన అమ్ములపొది లాంటి 256 ట్రాకుల 8.1 ప్రోటూల్స్ సిస్టమ్ లోంచి ధ్వనుల్ని తీసి తాపడం చేస్తూపోతారు ఆయన. నిర్మాతలు ఒక్కో సినిమాకి 100 గంటల సమయమే ఇస్తారు. కాని మంచి క్వాలిటీని తీసుకు రావాలంటే 150 నుంచి 200 గంటలు అవసరమంటారు మధుసూదన్‌రెడ్డి. ఏకకాలంలో రెండు సినిమాలకి మించి చెయ్యనంటారు.

డబ్బింగ్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ శాఖల నుంచి తనకి అందే రికార్డింగుల్ని టెక్నాలజీ వుంది కదా అని ఫక్తు టెక్నోక్రాట్‌లా ధ్వని ముద్రణ చేయకుండా, ప్రేక్షకుడిలా ఫీలై రసాత్మక దృష్టితో డిటిఎస్‌ని కళాత్మకంగా ప్రెజెంట్ చేస్తారు. బొమ్మరిల్లు, సమరసింహారెడ్డి, హేపీడేస్... ఇలా ఏ సినిమాకా సౌండ్ మూడ్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా సృష్టిస్తారు. ఇందుకేనేమో నంది అవార్డుతో ఈయనకి మంచి దోస్తీ కుదిరింది. రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఈ అవార్డు అందుకున్నారు.
కడప జిల్లా పులివెందులకి చెందిన ఈయన తాతగారు అంకిరెడ్డి అప్పట్లో మద్రాసులో విజయావాహినీ స్టూడియోలో ఎడిటర్‌గా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో మద్రాసు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి సౌండ్ ఇంజనీర్ డిప్లొమా పొందారు. 1988లో కోదండపాణి రికార్డింగ్ థియేటర్‌లో డబ్బింగ్ శాఖలో చేరారు. తర్వాత ప్రసిద్ధ సౌండ్ ఇంజనీరు స్వామినాధన్ దగ్గర అసిస్టెంట్‌గా చేశారు. 1995లో రామానాయుడు స్టూడియోలో మ్యూజిక్ రికార్డిస్టుగా చేరి 'తాజ్‌మహల్'కి పనిచేశారు. పూర్తిస్థాయి ఆడియోగ్రాఫర్‌గా 'గులాబీ' మొదటి సినిమా కాగా, 1998లో 'చూడాలని వుంది'తో డిటిఎస్ టెక్నీషియన్‌గా అవతరించారు. గత రెండేళ్లుగా శబ్దాలయా రికార్డింగ్ థియేటర్లో పనిచేస్తున్నారు. మొత్తం 250 సినిమాలకి పనిచేశారు. ప్రస్తుతం 'ఖలేజా', 'రంగా ది దొంగ'లకి పనిచేస్తున్నారు.

ప్రేక్షకులు వాస్తవికతని  ఫీలవ్వాలంటే సహజసిద్ధమైన ధ్వనుల్ని మిక్సింగ్ చేయాలి. ఉదాహరణకి ఒక సీన్‌లో బెంజి కారు వస్తూంటే ఆ కారు శబ్దమే వేయాలి. కొందరు ఏదో వేరే కారు శబ్దం వేసేస్తుంటారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పోకుట్టికీ, మనకూ ఇదే తేడా. అలాగే దృశ్యాల ఫాస్ట్ ఎడిటింగ్ వల్ల శబ్దాల్ని ఆస్వాదించేందుకు చాలినంత కాల వ్యవధి చిక్కడం లేదు. కాంతి కంటే శబ్ద వేగం తక్కువ. సంబంధిత శాఖల సమన్వయంతో దర్శక నిర్మాతలు ఓపిక పడితే ఉన్నంతలో తాను ఉత్తమ ఫలితాల్ని అందించడానికే కృషి చేస్తానన్నారు మధుసూదన్‌రెడ్డి.

దీపన్ చటర్జీ ('శివ' ఫేమ్), వాల్టర్ ముర్చ్ (అపోకాలిప్స్ నౌ, గాడ్ ఫాదర్), రాండీ థామస్ (గ్లాడియేటర్, ఇండిపెండెన్స్‌డే) తన అభిమాన శబ్దగ్రాహకులని చెప్పారాయన.

-సికిందర్
(అక్టోబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)