రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Saturday, August 23, 2014

ఆర్టికల్..


వర్మతో ఈ విజయ యాత్ర ముగిసినట్టేనా?

ఒకప్పుడు ప్రఖ్యాత తెలుగు దర్శకులు హిందీలో విజయవంతమైన సినిమాలు తీసి అక్కడి జనబాహుళ్యం హృదయాల్ని దోచుకునేవారు. హిందీలోకి వెళ్ళిన నాటి ప్రఖ్యాత దర్శకులు కనీసం దశాబ్ద కాలానికి తగ్గకుండా హిందీ కెరీర్ ని కూడా కొనసాగిస్తూ, ఒకొక్కరూ హీనపక్షం డజను సినిమాలు తీసి సంచలనం  సృష్టించారు. 1950ల నుంచీ 1990 ల వరకూ అప్రతిహతంగా సాగి  ఈ విజయ యాత్ర ముగుస్తున్న దశలో, తిరిగి ఒకే ఒక్క తెలుగు దర్శకుడి వల్ల ఊపందుకుని, ఆ ఒక్కడితోనే ఇప్పటిదాకా రెండు దశాబ్దాల పాటూ ముప్ఫై సినిమాల రికార్డుతో రికార్డుల్నిసృష్టిస్తోంది. ఈ ఒకే ఒక్కడు రాంగోపాల్ వర్మ అయితే, ముందు చెప్పుకున్న ప్రఖ్యాతుల్లో ఎల్వీ ప్రసాద్ దగ్గర్నుంచీ కె. రాఘవేంద్ర రావు వరకూ డజను మంది పైనే వున్నారు.

ఇప్పుడు హిందీలో వర్మ ప్రాభవం కూడా తగ్గిన నేపధ్యంలో ఏర్పడుతున్న శూన్యాన్ని  భర్తీ చేసేందుకా అన్నట్టు కొత్త బృందం బయల్దేరుతోంది. ఈ బృందంలో శేఖర్ కమ్ముల దగ్గర్నుంచీ నందినీ రెడ్డి వరకూ వున్నారు. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఈ కొత్త బృందం బాలీవుడ్ లో తమ పూర్వీకులు ఎగరేసిన విజయ పతాకాన్ని ఇంకా  రెపరెప లాడిస్తారా లేక, ఉన్నజెండాని దింపేసుకుని తిరుగుముఖం పడతారా అన్నది!

తెలుగులో ఒక  సినిమా తీసి విడుదలకోసం ఎదురు చూస్తున్న ఒక కొత్త  దర్శకుడికి బాలీవుడ్ లో తనకున్న కనెక్షన్స్ ద్వారా ఓ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీని గురించి బాధపడుతూ అంటారాయన- ‘అనేక కార్పోరేట్ సంస్థలు అక్కడ సినిమా నిర్మాణంలోకి దిగడంతో, దేశవ్యాప్తంగా దర్శకులు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో విపరీతమైన పోటీ పెరిగి దిక్కు తోచని స్థితిలో పడిపోతున్నారు...సౌత్ నుంచి ప్రయత్నించాలంటే అది కలలోని మాటగా మిగిలిపోతోంది...’

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే- రాం గోపాల్ వర్మ కూడా ఫ్రెష్ గా వెళ్లి బాలీవుడ్ లో ప్రయత్నించలేదు. తెలుగులో కొన్ని సినిమాలు తీశాకే, ‘శివ’ ని హిందీలో విడుదల చేశాకే, హిందీ వాళ్ళ దృష్టిలో పడి ‘రంగీలా’ తో విజయాత్ర ప్రారంభించ గలిగారు. తాజాగా హిందీలో ప్రవేశించిన  తెలుగు దర్శకుడు అజయ్ భుయాన్ అయితే- తన బాలీవుడ్ ప్రవేశం సునాయాసంగా జరిగి పోయిందంటారు. అక్కినేని నాగ చైతన్యతో ‘దడ’ అనే ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ముంబాయి నుంచి ఒక కాల్ వచ్చింది- నువ్వు హిందీ సినిమా తీస్తున్నావ్- అని. అంతే, దాంతో ఏ రీమేకూ కాకుండా ‘అమిత్ సహానీ కీ లిస్ట్’ అనే ఫ్రెష్ రోమాంటిక్ కామెడీ హిందీలో ప్రారంభమై పోయింది. అయితే విడుదలకి రెండేళ్ళు పట్టింది.

తెలుగులో హిట్టయిన సినిమాల మీద కన్నేసి హిందీలో రీమేక్ చేసుకోవడం సాంప్రదాయంగా పాటిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు, తెలుగు దర్శకుల మీద అంతగా కన్నేయడంలేదు. ఇప్పుడు తాజాగా కొందరు తెలుగు దర్శకులకి హిందీ అవకాశా లొస్తున్నాయంటే అది తెలుగులో వాళ్ళు తీసిన హిట్స్ ని వాళ్ళతోనే రీమేక్ చేయించుకుందా మన్న ఆలోచనకి రావడం వల్లే. అలా శేఖర్ కమ్ముల “హేపీడేస్’ తో, నందినీ రెడ్డి ’అలామోదలైంది’ తో, క్రిష్ ‘వేదం’ తో, నీలకంఠ ‘మాయ’ తో, హిందీలోకి అడుగు పెడుతున్నారు. ఒక్క అజయ్ భుయాన్ మాత్రమే  ఇటీవల డైరెక్టుగా హిందీలో ‘అమృత్ సహానీ కీ లిస్టు’ తీయగలిగారు. ఇక సుకుమార్ అయితే ‘ఆర్య-2’ హిందీ రీమేక్ ఆఫర్ వచ్చినా అంగీకరించలేదు.

శేఖర్ కమ్ముల ‘హేపీడేస్’ రీమేక్ గురించీ, క్రిష్ ‘వేదం’ రీమేక్ గురించి కూడా ప్రతిపాదనలు చాలా కాలంగా నానుతూ వున్నాయి. ఎప్పుడో తెలుగులో హిట్టయిన వెంటనే బోనీకపూర్ ‘హేపీడేస్’ ని హిందీలో తీయాల్సింది. అది అలా అలా మరుగున పడిపోయింది. శేఖర్ కమ్ముల తెలుగులో వేరే సినిమాలు తీసుకుంటూ వుండి పోయారు. తాజాగా ‘అనామిక’ (హిందీ ‘కహానీ’కి రీమేక్) తీసి అది విజయం సాధించకపోవడంతో, తను ఇప్పుడేం చేస్తారోనని  ఎదురు చూస్తున్న సందర్భంలో హఠాత్తుగా మళ్ళీ  ‘హేపీడేస్’ హిందీ రీమేక్ వార్త వచ్చింది. ఈసారి సల్మాన్ ఖాన్ నిర్మాత! దీనికోసం హిందీలో కొత్త నటీనటులకి ఆడిషన్స్ జరుగుతున్నాయి.

ఇక క్రిష్ ‘వేదం’ హిందీ సంగతి అటకెక్కి, అనూహ్యంగా చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ రీమేక్ తెరపైకొచ్చింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇందులో చిరంజీవి పాత్ర పోషిస్తున్నారు. దీనికి టైటిల్ కూడా ‘గబ్బర్’ అని పెట్టారు. శృతీ హసన్ హీరోయిన్ గా ఇది నిర్మాణం కూడా పూర్తి చేసుకుని వచ్చే జనవరి లో విడుదల కానుంది. దీనికి పేరున్న పెద్ద దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాత. ఇది హిందీలోకి అడుగు పెట్టిన కొత్త తరం దర్శకుల్లో క్రిష్ ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడుతోంది. అగ్ర నిర్మాతతో, అగ్ర హీరో- హీరోయిన్లతో 78 కోట్ల మెగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణ మౌతోంది...ఇంత  భారీ బడ్జెట్ తో హిందీలో సినిమాలు తీసిన తెలుగు దర్శకులు ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.

‘అలా మొదలైంది’ తో తెలుగులో మొదలైన నందినీ రెడ్డి, దీని హిందీ రీమేక్ ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించ నున్నారు. ఇంకా తారాగణం ఎంపిక పూర్తి కావాల్సి వుంది.

 ‘ఆర్య-2’ హిందీ రీమేక్ ప్రయత్నాలని నిర్మాత కుమార్ తౌరానీ ఉధృతం చేశారు. తన కుమారుడు గిరీష్ కుమార్ తౌరానీ హీరోగా ఈ సినిమా నిర్మించాలని ఉత్సాహపడుతున్నారు. గిరీష్ ఇటీవలే ప్రభుదేవా దర్శకత్వంలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ హిందీ రిమేక్ తో అరంగేట్రం చేశాడు. దీని పేరు ‘రామయ్యా వస్తావయ్యా’. రెందోది కూడా తెలుగు రీమేకే కావడం యాదృచ్చికమే నంటున్నారు తౌరానీ. ‘ఆర్య-2’ రీమేక్ కి  సుకుమారే  దర్శకత్వం వహించాలని తౌరానీ ఎంత బలవంత పెడుతున్నా లొంగడంలేదు సుకుమార్. తనకి ఎన్టీఆర్ తో సినిమా  వుందని చెబుతున్నారు. ఇదెలా తేలుతుందో ఇప్పట్లో తెలీదు.

‘మాయ’ తీసిన నీలకంఠ ఇటీవల హిందీ రీమేక్ కోసం వెళ్లి మహేష్ భట్ ని కలిశారు. ఆ సంప్రదింపులు జరుగుతున్నాయి.

ఇకపోతే, వర్మ తర్వాత హిందీలోకి వెళ్ళిన తెలుగు దర్శకుల్లో పూరీజగన్నాథ్ అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ అనే డైరెక్టు సినిమా తీసి విజయం సాధించినా ఎందుకో అక్కడి నిర్మాతల దృష్టిలో పడలేదు. ఆతర్వాత మరో హిందే తీయలేదు పూరీ. దీనికి ముందు ప్రారంభించిన ‘బద్రీ’ రీమేక్ ‘షర్త్-ది ఛాలెంజ్’ మధ్యలోనే ఆగిపోయింది.

కృష్ణ వంశీ కూడా ‘అంతః పురం’ ని హిందీలోకి ‘శక్తి’ గా రీమేక్ చేశాక మళ్ళీ హిందీ జోలి కెళ్ళలేదు. తేజ సైతం ‘యే దిల్’ తర్వాత హిందీ లో మళ్ళీ తెయలేదు.

పైన చెప్పుకున్న హిందీకి వెళ్తున్న తెలుగు దర్శకులూ  పూరీలాగే ఒక్క హిందీ సినిమాతో సరిపెట్టుకున్నా
ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ మాయాబజార్ ఇప్పుడు వర్మ కాలంలో లాగా లేదు. అక్కడ సెటిలై పోయే పరిస్థితీ లేదు. చిన్న చిన్న ఎన్నో మల్టీప్లెక్స్ సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. హిందీ ప్రాంతాల నుంచి వస్తున్న కొత్త  దర్శకులకే ఠికానా లేదు. ఒక సినిమాతో చాలించుకున్న వాళ్ళే ఎక్కువ. వర్మ తర్వాత సౌత్ నుంచి ప్రభు దేవా హిందీ కి వెళ్లి ప్రభావం చూపించినంత గా మరెవరూ చూపించలేకపోయారు. ఇప్పటికీ ప్రభుదేవాకి హిందీ ఆఫర్లు వస్తున్నాయి.

హిందీ కెళ్ళి ఒకటీ అరా సినిమాలతో సాధించే దేమీ వుండదు. పైగా ఆ ఒక్క సినిమాకోసం ఏళ్ల తరబడి   బుక్కై పోవాలి. ఈలోగా తెలుగులో మర్చిపోతారు ప్రేక్షకులు. ఎంతో ప్రామిజింగ్ దర్శకుడిగా తెలుగులో మెరిసిన క్రిష్ కన్పించడం లేదు. రేపు శేఖర్ కమ్ముల, నందినీ రెడ్డి, నీలకంఠలు కూడా ఓ రెండేళ్ళపాటు  తెలుగులో కన్పించకుండా పోవచ్చు. ఈ లోగా కొత్త దర్శకులు వచ్చి తెలుగులో నిండిపోతారు.

వర్మకి పూర్వం చూసుకుంటే అప్పటి దర్శకుల హిందీ జైత్రయాత్రే వేరు. ఒకొక్కరూ ఒకో దశాబ్దం హిందీ వాళ్లకి తెలుగు దర్శకుల ఉనికి చాటుతూ ఒక్కో డజను హిందీ సినిమాలిస్తూ పోయారు. ఇవన్నీ చాలావరకూ తెలుగు రీమేకులే. మొట్టమొదట ఎల్ వి ప్రసాద్ 1957 లో ‘మల్లీశ్వరి’ ని హిందీలో ‘మిస్ మేరీ’ గా రీమేక్ చేసి దర్శకుడిగా హిందీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 1977 వరకూ మరో ఎనిమిది హిందీ సినిమాలు తీశారు. వీటిలో జీతేంద్ర తో తీసిన ‘జీనేకీ రాహ్’ అతి పెద్ద మ్యూజికల్ హిట్.


ఎల్.వి.ప్రసాద్ 
ఆదుర్తి సుబ్బారావు 
 ఆదుర్తి సుబ్బారావు 1967- 75 మధ్యకాలంలో 9 హిందీ సినిమాలు తీశారు. వీటిలో సునీల్ డాట్-నూతన్-జమున లతో తీసిన ’మూగమనసులు’ రీమేక్ ‘మిలన్’ అతిపెద్ద మ్యూజికల్ హిట్. దీనికి ఎల్ వి ప్రసాద్ నిర్మాత.

కె. ప్రత్యగాత్మ హిందీలో కె. పి ఆత్మగా సుప్రసిద్ధుడు. ఆయన 1966-76 మధ్యకాలంలో హిందీలో కూడా బిజీగా వున్నారు. 7 హిందీ సినిమాలు తీశారు.  వీటిలో జీతేంద్ర –ముంతాజ్ లతో తీసిన ‘ఏక్  నారీ- ఏక్ బ్రహ్మచారీ’ అతిపెద్ద మ్యూజికల్ హిట్.

ఈ దర్శకుల తర్వాత కె. రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు, బాపు, కె.విశ్వనాథ్, కె. మురళీమోహన రావు, కె. బాపయ్యల, రవిరాజ పినిశెట్టి ల  తరం వచ్చింది. వీళ్ళందరూ హిందీలో కమర్షియల్ సినిమాని కొత్త పుంతలు తొక్కించారు. కె రాఘవేంద్రరావు (1982-93) పది తెలుగు హిట్స్ ని హిందీలో తీసి బప్పీ లహరీ క్రేజీ పాటలతో సంచలనం సృష్టించారు.


కె. విశ్వనాథ్ 
దాసరి నారాయణ రావు 
దాసరి నారాయణ రావు (1980-93)లమధ్య 12 హిందీ సినిమాలు, కె. విశ్వనాథ్ (1979-85) ఎనిమిది, బాపు ( 1981-87) ఏడు, కె. మురళీ మోహన రావు (1983-98) ఏడు, కె. బాపయ్య (1977-95) అత్యధికకాలం హిందీలో మార్కెట్ నిలబెట్టుకుంటూ అత్యధికంగా 25 సినిమాలు తీసిన దర్శకుడుగా నిలిచారు. ఈయన తర్వాత 30 హిందీ సినిమాలతో రామ్ గోపాల్ వర్మ నిలుస్తారు.


ఇక రవిరాజా పినిశెట్టి ఏకంగా మెగా స్టార్ చిరంజీవినే పెట్టి 1990-92 లమధ్య ఆజ్ కా గూండా రాజ్ (గ్యాంగ్ లీడర్), ప్రతిబంధ్ (అంకుశం ) అనే రెండు సినిమాలు తీశారు.

కె. ప్రత్యగాత్మ 
కె. రాఘవెంద్రరావు 
ఇలా తెలుగు దర్శకులంటే హిందీలో ఒక గౌరవం నమ్మకం సంపాదించు కున్న రోజులవి. అందరూ అప్పుడున్న ప్రసిద్ధ స్టార్స్ తో నే తీసిన సినిమాలవి. అసలు తెలుగు నిర్మాణ సంస్థలే అత్యధికంగా వీటిని నిర్మించిన కాలమది. ఇప్పుడు హిందీ సంస్థలు వచ్చి అరకోరా తెలుగు సినిమాలు తీస్తున్నాయి గానీ, తెలుగు సంస్థలో ఎప్పుడో 
హిందీలో ఈపని దిగ్విజయంగా పూర్తిచేశాయి.

ఆరోజులు మళ్ళీ వస్తాయా? కచ్చితంగా రావు. హిందీలో అలాటి గుర్తుండి  పోయే సినిమాలు తీసిన మన దర్శకులు ఎప్పుడో బాలీవుడ్ ని పదేపదే జయించేశారు. ఆ తర్వాత వర్మ ఒంటి చేత్తో ఈ క్రతువు నిర్వహించు కొచ్చాడు. ఈయన తర్వాత ఈ దివీటీని చేబూని బాలీవుడ్ లో తెలుగు జైత్రయాత్ర కొనసాగించే దర్శకుల జాడ ఇప్పటికైతే కానరావడం లేదు...

-సికిందర్
(సెప్టెంబర్ 2014 ‘ఈవారం’కోసం)

No comments: