రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, జనవరి 2017, సోమవారం
      కలం కోతి  చూసీ చూసీ ఇక ఇలా ఓపెన్ అయిపోవాలనుకుంటోంది - ఈ బ్లాగులో వెలువడే సినిమా రివ్యూలు నెగెటివ్ గా వుంటాయని చెబుతున్న వాళ్ళు ఒక విషయం గ్రహించాలి – ఈ రివ్యూలు నెగెటివే  అయితే,  ఏళ్లతరబడి ప్రతీ ఏటా తొంభైకి 90 శాతమూ పక్కా అట్టర్ ఫ్లాపులు తీసి నిర్మాతల్ని నిండా ముంచేస్తున్న తాము పాజిటివా? ఎందుకుంటున్నారు ఫీల్డులో? ఆ  ముంచడంలో కూడా రకరకాల వెరైటీలు వున్నాయి- మిడి మిడి జ్ఞానంతో బడ్జెట్లు కూడా పెంచేసి సినిమాలు తీయడం (ఎంజాయ్ చేయడం),  నిర్మాతకి తెలీకుండా నొక్కేస్తూ సినిమా ఏమైపోయినా  ఫర్వా లేదు -ముందు  ఆర్ధికంగా తాము సెటిలై పోతే చాలనుకోవడం లాంటివెన్నో. ఇవి పాజిటివ్ లక్షణాలా? ఈ సినిమాలు చూసి నాల్గు డబ్బులు జేబులో వేసుకుని ‘పాజిటివ్’ గా రివ్యూలు రాస్తే ఓకేనా? ఈ బ్లాగులో రివ్యూలు నెగెటివ్ గానూ వుండవు, పాజిటివ్ గానూ వుండవు- తటస్థి వైఖరితో ‘నిర్మాణాత్మకంగా’ మాత్రమే వుంటాయి. ‘నిర్మాణాత్మక విమర్శ’ అని ఒకటుంటుందని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. నిర్మాణాత్మక విమర్శ బెటర్ మెంట్ కోసమే వుంటుంది. బెటర్ మెంట్ కోసమే శాస్త్రమో, ఇతర సినిమాలో ఇంకేవో, ఎక్కడ్నించో సమాచారాన్ని వెతికి పట్టుకొచ్చి  రివ్యూలు రాస్తే,  అది నెగెటివ్ అనుకోవడం అజ్ఞానాల్లో కెల్లా అజ్ఞానం.  విజ్ఞానాన్ని ఖండించే వాళ్ళు ఇక నేర్చుకునేదేమీ వుండదు, 90 శాతం మంది నిర్మాతల డబ్బుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. ఈ బ్లాగు సినిమాలకి వ్యతిరేకమే అయితే, గత పదిహేనేళ్ళుగా తమ కథలతో ఈ బ్లాగు రచయితని ఎందుకు సంప్రదిస్తున్నారన్న ప్రశ్న వొకటి వస్తోంది. ఎందుకు ఇంతమంది అసోషియేట్లు, కుర్ర అసిస్టెంట్లూ ఈ బ్లాగు పాఠకులుగా పెరుగుతున్నారన్న మరో ప్రశ్న వస్తోంది.  ప్రతీ రోజూ బ్లాగులో వ్యాసం రాయకపోతే ఎందుకు పదే పదే  క్లిక్ చేసి చూసుకుంటున్నారన్న ఇంకో  ప్రశ్నా వస్తోంది. ఇంకా పది  పన్నెండు దేశ విదేశాల నుంచి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నసందేహమూ వస్తోంది....
-సికిందర్